05-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - స్మృతి ద్వారానే బ్యాటరీ చార్జ్ అవుతుంది, శక్తి లభిస్తుంది, ఆత్మ సతోప్రధానముగా అవుతుంది, అందుకే స్మృతి యాత్ర పట్ల విశేషమైన అటెన్షన్ పెట్టండి

ప్రశ్న:-
ఏ పిల్లల ప్రేమ అయితే ఒక్క తండ్రిపై ఉంటుందో, వారి గుర్తులు ఏమిటి?

జవాబు:-
1. ఒకవేళ ఒక్క తండ్రిపై ప్రేమ ఉన్నట్లయితే తండ్రి దృష్టి వారిని అతీతంగా చేస్తుంది, 2. వారు పూర్తి నష్టోమోహులుగా ఉంటారు, 3. ఎవరికైతే అనంతమైన తండ్రి ప్రేమ ఇష్టమనిపించిందో, వారు ఇంకెవ్వరి ప్రేమలోనూ చిక్కుకోలేరు, 4. వారి బుద్ధి అసత్యఖండపు అసత్య మనుష్యుల నుండి తెగిపోతుంది. బాబా ఇప్పుడు మీకు ఎటువంటి ప్రేమను ఇస్తారంటే, అది అవినాశీగా అయిపోతుంది. సత్యయుగములో కూడా మీరు పరస్పరం ఎంతో ప్రేమగా ఉంటారు.

ఓంశాంతి
అనంతమైన తండ్రి ప్రేమ ఇప్పుడు పిల్లలైన మీకు ఒకేసారి లభిస్తుంది. ఆ ప్రేమను భక్తి మార్గంలో కూడా ఎంతగానో తలుచుకుంటారు. బాబా, కేవలం మీ ప్రేమ మాత్రమే కావాలి, నీవే తల్లివి, తండ్రివి... నీవే సర్వస్వము అని అంటూ తలచుకుంటారు. ఒక్కరి ద్వారానే అర్ధకల్పం కొరకు ప్రేమ లభిస్తుంది. మీ ఈ ఆత్మిక ప్రేమ మహిమ అపారమైనది. తండ్రే పిల్లలైన మిమ్మల్ని శాంతిధామానికి యజమానులుగా తయారుచేస్తారు. ఇప్పుడు మీరు దుఃఖధామములో ఉన్నారు. అశాంతి మరియు దుఃఖములో అందరూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఎవ్వరికీ నాథులు లేరు, కావుననే భక్తి మార్గములో స్మృతి చేస్తారు. కానీ నియమానుసారంగా భక్తి సమయం కూడా అర్ధకల్పం ఉంటుంది.

ఇది పిల్లలకు అర్థం చేయించబడింది. తండ్రి అంతర్యామి అని కాదు. తండ్రికి అందరి లోపల ఏముందో తెలుసుకోవలసిన అవసరమే లేదు, అలా థాట్ రీడర్స్ చేస్తారు, దానిని కూడా ఒక విద్యగా నేర్చుకుంటారు. ఇక్కడ అటువంటి విషయమే లేదు. తండ్రి వస్తారు, తండ్రి మరియు పిల్లలే ఈ పాత్రనంతా అభినయిస్తారు. సృష్టిచక్రం ఎలా తిరుగుతుంది, అందులో పిల్లలు ఏ విధంగా పాత్రను అభినయిస్తారు అనేది తండ్రికి తెలుసు. వారు ప్రతి ఒక్కరి లోపలా ఏముందో తెలుసుకుంటారని కాదు. ప్రతి ఒక్కరిలోనైతే వికారాలే ఉన్నాయని నిన్న రాత్రి కూడా తండ్రి అర్థం చేయించారు. మనుష్యులు చాలా అశుద్ధంగా ఉన్నారు. తండ్రి వచ్చి పుష్పాలలా తయారుచేస్తారు. తండ్రి యొక్క ఈ ప్రేమ పిల్లలైన మీకు ఒకేసారి లభిస్తుంది, అది మళ్ళీ అవినాశీగా అయిపోతుంది. అక్కడ మీకు ఒకరి పట్ల ఒకరికి ఎంతో ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మీరు మోహజీతులుగా అవుతున్నారు. సత్యయుగ రాజ్యాన్ని మోహజీత రాజు, రాణి మరియు ప్రజల రాజ్యం అని అంటారు. అక్కడ ఎప్పుడూ, ఎవ్వరూ ఏడవరు, దుఃఖము అన్న మాటే ఉండదు. తప్పకుండా భారత్ లో ఆరోగ్యము, సంపద మరియు సంతోషము ఉండేవని మీకు తెలుసు, ఇప్పుడవి లేవు ఎందుకంటే ఇప్పుడు ఇది రావణ రాజ్యము. ఇందులో అందరూ దుఃఖాన్ని అనుభవిస్తారు, మళ్ళీ మీరు వచ్చి సుఖ-శాంతులను ఇవ్వండి అని, దయ చూపించండి అని తండ్రిని పిలుస్తారు. అనంతమైన తండ్రి దయార్ద్ర హృదయుడు, రావణుడు నిర్దయుడు, దుఃఖపు మార్గాన్ని తెలియజేసేవాడు. మనుష్యులందరూ దుఃఖపు మార్గములో నడుస్తారు. అన్నింటికన్నా ఎక్కువ దుఃఖాన్ని ఇచ్చేది కామ వికారము, అందుకే తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, కామ వికారముపై విజయం పొందినట్లయితే జగత్ జీతులుగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులను జగత్ జీతులు అని అంటారు కదా. మీ ముందు లక్ష్యము, ఉద్దేశ్యము ఉంది. మందిరాలకు వెళ్తారు కానీ వారి చరిత్రను గురించి ఏమీ తెలియదు, బొమ్మల పూజను చేస్తున్నట్లుగా ఉంటారు, దేవీలను పూజిస్తారు, వారిని రచించి ఎంతగానో అలంకరించి నైవేద్యాలు మొదలైనవి పెడతారు. కానీ ఆ దేవీలైతే ఏమీ తినరు, అది బ్రాహ్మణులే తింటారు. విగ్రహాలను తయారుచేసి, వాటికి పాలన చేసి, ఆపై వినాశనం చేసేస్తారు, దీనినే అంధశ్రద్ధ అని అంటారు. సత్యయుగములో ఈ విషయాలు ఉండవు. ఈ ఆచార-వ్యవహారాలన్నీ కలియుగములోనే వెలువడతాయి. మీరు మొట్టమొదట ఒక్క శివబాబాను పూజిస్తారు, దానినే అవ్యభిచారీ, ధర్మయుక్తమైన పూజ అని అంటారు. ఆ తర్వాత వ్యభిచారీ పూజ జరుగుతుంది. బాబా అని అనడంతోనే పరివారపు సుగంధము అనుభవమవుతుంది. నీవే తల్లివి, తండ్రివి... నీవు ఈ జ్ఞానమునిచ్చే కృపను చూపించడం ద్వారా మాకు అపారమైన సుఖాలు లభిస్తాయి అని మీరు కూడా అంటారు కదా. మనం మొట్టమొదట మూలవతనములో ఉండేవారమని బుద్ధిలో గుర్తుంది. శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయించేందుకు అక్కడి నుండి ఇక్కడకు వస్తాము. మొట్టమొదట మనము దైవీ శరీరాన్ని ధరిస్తాము అనగా దేవతలుగా పిలవబడతాము. ఆ తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలలోకి వస్తూ భిన్న-భిన్న పాత్రలను అభినయిస్తాము. ఈ విషయాల గురించి మీకు ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు బాబా వచ్చి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని పిల్లలైన మీకు ఇచ్చారు. నేను ఈ తనువులోకి ప్రవేశిస్తాను అని తమ పరిచయాన్ని కూడా ఇచ్చారు. వీరికి తమ 84 జన్మలను గురించి తెలియదు, ఇంతకుముందు మీకు కూడా తెలియదు. శ్యామసుందరుని రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఈ శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచపు మొట్టమొదటి యువరాజు మరియు రాధ రెండవ నెంబరులో ఉన్నారు. కొద్ది సంవత్సరాల తేడా ఏర్పడుతుంది. సృష్టి ఆదిలో వీరిని మొదటి నెంబరులో ఉన్నారని అనడం జరుగుతుంది. అందుకే శ్రీకృష్ణుడిని అందరూ ప్రేమిస్తారు, అతడినే శ్యామసుందరుడు అని అంటారు. స్వర్గములోనైతే అందరూ సుందరముగానే ఉండేవారు. ఇప్పుడు ఆ స్వర్గము ఎక్కడ ఉంది! చక్రము తిరుగుతూ ఉంటుంది. సముద్రము కిందకి వెళ్ళిపోతుందని కాదు. లంక, ద్వారక కిందికి వెళ్ళిపోయాయి అని అంటారు కదా, కానీ అలా జరగదు, ఈ చక్రము తిరుగుతుంది. ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తీ మహారాజా మహారాణులుగా, విశ్వాధిపతులుగా అవుతారు. ప్రజలు కూడా తమను తాము యజమానులుగానే భావిస్తారు కదా. వారు ఇది మా రాజ్యం అని అంటారు. భారతవాసులు కూడా ఇది మా రాజ్యం అని అంటారు కదా. భారత్ అన్న పేరు ఉంది. హిందుస్థాన్ అన్న పేరు తప్పు. వాస్తవానికి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే ఉంది. కానీ ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిన కారణంగా తమను తాము దేవతలుగా పిలుచుకోలేరు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది, లేకపోతే తండ్రి వచ్చి మళ్ళీ దేవీ-దేవతా ధర్మ స్థాపనను ఎలా చేయగలరు. ఇంతకుముందు మీకు కూడా ఈ విషయాలన్నింటి గురించి తెలియదు, ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు.

బాబా ఎంతో మధురమైనవారు, అటువంటివారిని కూడా మీరు మర్చిపోతారు! అందరికన్నా మధురమైనవారు బాబా కదా. ఇకపోతే రావణ రాజ్యములోనైతే అందరూ మీకు దుఃఖాన్నే ఇస్తారు కదా, అందుకే అనంతమైన తండ్రిని తలచుకుంటారు. ఓ ప్రియతమా, నీవు ఎప్పుడు వచ్చి ప్రేయసులమైన మమ్మల్ని కలుసుకుంటావు అని తలచుకుంటూ వారి స్మృతిలో ప్రేమలో కన్నీరు కారుస్తూ ఉంటారు ఎందుకంటే మీరందరూ భక్తురాళ్ళు, భక్తులకు పతి భగవంతుడు. భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తారు, దారిని చూపిస్తారు మరియు ఇదంతా 5000 సంవత్సరాల ఆట అని అర్థం చేయిస్తారు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను గురించి మనుష్యులెవ్వరికీ తెలియదు, ఆత్మిక తండ్రికి మరియు ఆత్మిక పిల్లలకే తెలుసు, ఇది ఇంకే మనుష్యులకు తెలియదు, దేవతలకు కూడా తెలియదు. దీని గురించి ఆత్మిక తండ్రికే తెలుసు, వారు కూర్చొని తమ పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇంకే దేహధారుల వద్ద ఈ రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉండదు. ఈ జ్ఞానము ఆత్మిక తండ్రి వద్దే ఉంటుంది. వారినే జ్ఞాన-జ్ఞానేశ్వరుడు అని అంటారు. జ్ఞాన-జ్ఞానేశ్వరుడు మిమ్మల్ని రాజ-రాజేశ్వరులుగా తయారుచేయడానికి మీకు జ్ఞానాన్ని ఇస్తారు, అందుకే దీనిని రాజయోగము అని అంటారు, మిగిలినవన్నీ హఠయోగాలు. హఠయోగుల చిత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. సన్యాసులు ఎప్పుడైతే వస్తారో, వారు వచ్చాక హఠయోగాన్ని నేర్పిస్తారు. ఎప్పుడైతే బాగా వృద్ధి జరుగుతుందో, అప్పుడు హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తారు. తండ్రి అర్థం చేయించారు - నేను సంగమయుగములోనే వస్తాను, వచ్చి రాజధానిని స్థాపన చేస్తాను. స్థాపనను ఇక్కడే చేస్తారు, అంతేకానీ సత్యయుగములో కాదు. సత్యయుగ ఆదిలో రాజ్యము ఉంటుంది కావున తప్పకుండా సంగమయుగములోనే స్థాపన జరుగుతుంది. ఇక్కడ కలియుగములో అందరూ పూజారులుగా ఉన్నారు, సత్యయుగములో పూజ్యులు ఉంటారు. కావున తండ్రి పూజ్యులుగా తయారుచేయడానికి వస్తారు. పూజారులుగా తయారుచేసేది రావణుడు. ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇది ఉన్నతోన్నతమైన చదువు. ఈ టీచరు గురించి ఎవ్వరికీ తెలియదు. వారు సుప్రీమ్ తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా, ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రే వచ్చి తమ పూర్తి పరిచయాన్ని ఇస్తారు. వారు స్వయంగా పిల్లలను చదివించి ఆ తర్వాత తనతోపాటు తీసుకువెళ్తారు. అనంతమైన తండ్రి ప్రేమ లభించిన తర్వాత ఇంకే ప్రేమా నచ్చదు. ఈ సమయములో ఇదంతా అసత్యమైన ఖండము. అసత్యమైన మాయ, అసత్యమైన శరీరము... భారత్ ఇప్పుడు అసత్యఖండముగా ఉంది, ఆ తర్వాత సత్యయుగములో సత్యఖండముగా ఉంటుంది. భారత్ ఎప్పుడూ వినాశనమవ్వదు. ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానము. ఇక్కడ అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు మరియు సర్వులకు సద్గతిని ఇస్తారు. ఇది చాలా పెద్ద తీర్థ స్థానము. భారత్ మహిమ అపారమైనది. కానీ ఇది కూడా మీరే అర్థం చేసుకోగలరు - భారత్ ప్రపంచములోని అద్భుతము. అవి మాయ యొక్క 7 అద్భుతాలు. ఈశ్వరుని అద్భుతము ఒక్కటే. తండ్రి ఒక్కరే, వారి అద్భుతమైన స్వర్గము కూడా ఒక్కటే, దానినే హెవెన్, ప్యారడైజ్ అని అంటారు. సత్యాతి-సత్యమైన పేరు ఒక్కటే, అదే స్వర్గము, ఇది నరకము. బ్రాహ్మణులైన మీరే చక్రమంతా చుట్టి వస్తారు. మనమే బ్రాహ్మణులుగా ఉన్నాము, మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము... ఎక్కే కళ మరియు దిగే కళ. మీరు ఎక్కే కళలో ఉంటే మీ కారణంగా సర్వులకు మేలు జరుగుతుంది. విశ్వములో శాంతి కూడా ఉండాలి, సుఖము కూడా ఉండాలి అని భారతవాసులే కోరుకుంటారు. స్వర్గములో సుఖమే ఉంటుంది, దుఃఖము అన్న మాటే ఉండదు. దానిని ఈశ్వరీయ రాజ్యం అని అంటారు. సత్యయుగములో సూర్యవంశీయులు ఉంటారు, ఆ తర్వాత సెకండ్ గ్రేడ్ లో చంద్రవంశీయులు ఉంటారు. మీరు ఆస్తికులు, వారు నాస్తికులు. మీరు నాథునికి చెందినవారిగా అయి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థాన్ని చేస్తారు. మీకు మాయతో గుప్తమైన యుద్ధము జరుగుతుంది. తండ్రి రాత్రివేళలో వస్తారు, శివరాత్రి కదా. కానీ శివుని రాత్రి యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. బ్రహ్మా రాత్రి పూర్తవుతుంది మరియు పగలు ప్రారంభమవుతుంది. వారు శ్రీకృష్ణ భగవానువాచ అని అంటారు, కానీ ఇది శివ భగవానువాచ. మరి రైట్ ఎవరు? శ్రీకృష్ణుడైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. తండ్రి అంటారు, నేను సాధారణ వృద్ధ తనువులోకి వస్తాను. వీరికి కూడా తన జన్మల గురించి తెలియదు. అనేక జన్మల అంతిమములో ఎప్పుడైతే పతితులుగా అవుతారో, అప్పుడు పతిత సృష్టిలోకి, పతిత రాజ్యములోకి వస్తాను. పతిత ప్రపంచములో అనేక రాజ్యాలు ఉన్నాయి, పావన ప్రపంచములో ఒకే రాజ్యము ఉంటుంది, లెక్క ఉంది కదా. భక్తి మార్గములో ఎప్పుడైతే ఎంతో నవ విధ భక్తిని చేస్తారో, శిరస్సును ఖండించుకునేందుకు ఇక సిద్ధమైపోతారో, అప్పుడు వారి మనోకామన పూర్తవుతుంది. అంతేకానీ అందులో ఉన్నదేమీ లేదు, దానిని నవ విధ భక్తి అని అంటారు. ఎప్పటి నుండైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో, అప్పటి నుండి భక్తి కర్మకాండల విషయాలను మనుష్యులు చదువుతూ-చదువుతూ కిందకు వచ్చేస్తారు. వ్యాస భగవానుడు శాస్త్రాలను రచించారు అని అంటారు, వారు కూర్చొని ఏమేమో వ్రాసేసారు. భక్తి మరియు జ్ఞాన రహస్యాన్ని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మెట్లు మరియు వృక్షము యొక్క చిత్రాలలో ఈ వివరణ అంతా ఇవ్వబడింది, అందులో 84 జన్మలను కూడా చూపించారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. ఎవరైతే ప్రారంభములో వచ్చి ఉంటారో, వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఈ జ్ఞానము మీకు ఇప్పుడే లభిస్తుంది, మళ్ళీ ఇది సంపాదనకు ఆధారమవుతుంది. 21 జన్మల వరకు, ప్రాప్తి కొరకు పురుషార్థం చేయాల్సి వచ్చేందుకు అసలు అక్కడ అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు. దానిని తండ్రి యొక్క ఏకైక ప్రపంచ అద్భుతమైన స్వర్గము అని అంటారు, దాని పేరే ప్యారడైజ్. దానికి తండ్రి యజమానులుగా తయారుచేస్తారు. ఆ ప్రపంచములోనివారైతే కేవలం ఆ అద్భుతాలను చూపిస్తారు, కానీ మిమ్మల్ని అయితే తండ్రి దానికి యజమానులుగా తయారుచేస్తారు. అందుకే ఇప్పుడు తండ్రి అంటారు, నిరంతరమూ నన్ను స్మృతి చేయండి. స్మరిస్తూ, స్మరిస్తూ సుఖాన్ని పొందండి. తనువు యొక్క అన్ని కలహ-క్లేశాలు సమాప్తమైపోతాయి, జీవన్ముక్తి పదవిని పొందుతారు. పవిత్రంగా అయ్యేందుకు స్మృతియాత్ర కూడా ఎంతో అవసరము. మన్మనాభవ, తద్వారా అంతిమ స్మృతిని బట్టి గతి ఏర్పడుతుంది. గతి అని శాంతిధామమును అంటారు. సద్గతి ఇక్కడే ఉంటుంది. సద్గతికి వ్యతిరేకంగా దుర్గతి ఉంటుంది.

ఇప్పుడు మీరు తండ్రిని మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. మీకు తండ్రి ప్రేమ లభిస్తుంది. తండ్రి తమ దృష్టి ద్వారా అతీతముగా చేస్తారు. వారు సమ్ముఖముగా వచ్చే జ్ఞానాన్ని వినిపిస్తారు కదా. ఇందులో ప్రేరణ యొక్క విషయమేదీ లేదు. ఈ విధంగా స్మృతి చేయడం ద్వారా శక్తి లభిస్తుంది అని తండ్రి డైరెక్షన్ ఇస్తారు. ఏ విధంగా బ్యాటరీ చార్జ్ అవుతుంది కదా, అలా ఇది మోటారు, దీని బ్యాటరీ డల్ అయిపోయింది. ఇప్పుడు సర్వశక్తివంతుడైన తండ్రితో బుద్ధియోగాన్ని జోడించడం ద్వారా మళ్ళీ మీరు తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవుతారు, మీ బ్యాటరీ చార్జ్ అయిపోతుంది. తండ్రే వచ్చి అందరి బ్యాటరీని చార్జ్ చేస్తారు. సర్వశక్తివంతుడు ఒక్క తండ్రే. ఈ మధురాతి-మధురమైన విషయాలను తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు. ఆ భక్తి యొక్క శాస్త్రాలనైతే జన్మ-జన్మాంతరాలుగా చదువుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి సర్వ ధర్మాల వారి కోసము ఒకే విషయాన్ని వినిపిస్తారు. వారేమంటున్నారంటే - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ అంతమైపోతాయి. ఇప్పుడు స్మృతి చేయడం పిల్లలైన మీ పని, ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. పతిత-పావనుడు ఒక్క తండ్రే. ఇక పావనంగా అయి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానము అందరి కొరకు ఉంది. ఇది సహజ రాజయోగము మరియు సహజ జ్ఞానము.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సర్వశక్తివంతుడైన తండ్రితో మీ బుద్ధియోగాన్ని జోడించి బ్యాటరీని చార్జ్ చేసుకోవాలి. ఆత్మను సతోప్రధానముగా తయారుచేసుకోవాలి. స్మృతి యాత్రలో ఎప్పుడూ తికమకపడకూడదు.

2. చదువును చదువుకొని మీపై మీరే కృప చూపించుకోవాలి. తండ్రి సమానముగా ప్రేమసాగరులుగా అవ్వాలి. ఏ విధంగా తండ్రి ప్రేమ అవినాశీగా ఉంటుందో, అలాగే అందరితో సత్యమైన అవినాశీ ప్రేమను ఉంచుకోవాలి, మోహజీతులుగా అవ్వాలి.

వరదానము:-

రియలైజేషన్ శక్తి ద్వారా మధురమైన అనుభవాలను పొందే సదా శక్తిశాలీ ఆత్మా భవ

ఈ రియలైజేషన్ శక్తి చాలా మధురమైన అనుభవాలను కలిగిస్తుంది - ఒక్కోసారి స్వయాన్ని తండ్రి యొక్క కంటి రత్నమైన ఆత్మగా అనగా నయనాలలో ఇమిడి ఉన్న శ్రేష్ఠ బిందువుగా అనుభవం చెయ్యండి, ఒక్కోసారి మస్తకముపై మెరుస్తున్న మస్తకమణిగా, ఒక్కోసారి స్వయాన్ని బ్రహ్మాబాబాకు సహయోగీ కుడి భుజంగా, బ్రహ్మాబాబా యొక్క భుజాలుగా అనుభవం చెయ్యండి, ఒక్కోసారి అవ్యక్త ఫరిశ్తా స్వరూపంగా అనుభవం చెయ్యండి... ఈ రియలైజేషన్ శక్తిని పెంచుకోండి, అప్పుడు శక్తిశాలిగా అవుతారు. అప్పుడిక చిన్న మచ్చ కూడా స్పష్టంగా కనిపిస్తుంది మరియు దానిని పరివర్తన చేసుకుంటారు.

స్లోగన్:-

సర్వుల యొక్క హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను తీసుకుంటూ వెళ్ళండి, అప్పుడు మీ పురుషార్థం సహజమైపోతుంది.