ఓంశాంతి
ఇది తండ్రి మరియు పిల్లల మేళా. ఇది గురువు మరియు శిష్యులు లేక అనుచరుల మేళా కాదు. ఆ
గురువుల దృష్టి ఎలా ఉంటుందంటే, వీరు నా శిష్యులు లేక అనుచరులు లేక జిజ్ఞాసువులు. అది
చిన్న చూపు కదా. వారు ఆ దృష్టితోనే చూస్తారు. వారు ఆత్మను చూడరు. వారు శరీరాలనే
చూస్తారు మరియు ఆ శిష్యులు కూడా దేహాభిమానులుగానే కూర్చుంటారు. వారిని తమ గురువుగా
భావిస్తారు, వీరు మా గురువు అన్న దృష్టియే ఉంటుంది. గురువు పట్ల గౌరవాన్ని ఉంచుతారు.
ఇక్కడైతే చాలా తేడా ఉంది, ఇక్కడ తండ్రే పిల్లల పట్ల గౌరవాన్ని ఉంచుతారు. నేను ఈ
పిల్లలను చదివించాలి అని వారికి తెలుసు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో, ఆ
అనంతమైన చరిత్ర-భౌగోళాలను గురించి పిల్లలకు అర్థం చేయించాలి. ఆ గురువుల హృదయములో
పిల్లల పట్ల ఉండే ప్రేమ ఉండదు. బాబా వద్దనైతే పిల్లల పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది మరియు
పిల్లలకు కూడా బాబా పట్ల ప్రేమ ఉంటుంది. బాబా మనకు సృష్టి చక్ర జ్ఞానాన్ని
వినిపిస్తారని మీకు తెలుసు. వారేమి నేర్పిస్తారు? అర్ధకల్పం శాస్త్రాలు మొదలైనవి
వినిపిస్తారు, భక్తి యొక్క కర్మకాండలు చేస్తూ, గాయత్రి మంత్రం, సంధ్యావందనం మొదలైనవి
నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడైతే తండ్రి వచ్చి ఉన్నారు, వారు తమ పరిచయాన్ని ఇస్తూ
ఉన్నారు. మనకు తండ్రి గురించి ఇంతకుముందు ఏమాత్రమూ తెలియదు. సర్వవ్యాపి అనే అనేవారము.
పరమాత్మ ఎక్కడ ఉన్నారు అని ఎప్పుడు అడిగినా వెంటనే సర్వవ్యాపి అని అనేస్తారు. మీ
వద్దకు వచ్చినప్పుడు, ఇక్కడ ఏమి నేర్పిస్తారు? అని మనుష్యులు అడుగుతారు. మీరు ఇలా
చెప్పండి - మేము రాజయోగాన్ని నేర్పిస్తాము, దీని ద్వారా మీరు మనుష్యుల నుండి
దేవతలుగా అనగా రాజులుగా అవ్వగలరు. మేము మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు
శిక్షణనిస్తాము అని చెప్పే సత్సంగము ఇంకెక్కడా ఉండదు. దేవతలు సత్యయుగములో ఉంటారు.
కలియుగములో మనుష్యులు ఉంటారు. ఇప్పుడు మేము మీకు మొత్తం సృష్టి చక్రపు రహస్యాన్ని
అర్థం చేయిస్తాము, తద్వారా మీరు చక్రవర్తీ రాజులుగా అవుతారు, అంతేకాక మీకు పావనంగా
అయ్యేందుకు చాలా మంచి యుక్తిని తెలియజేస్తాము. ఇటువంటి యుక్తిని ఎప్పుడూ, ఎవరూ అర్థం
చేయించలేరు. ఇది సహజ రాజయోగము. తండ్రి పతిత-పావనుడు. వారు సర్వశక్తివంతుడు కూడా,
కావున వారిని స్మృతి చేయడం ద్వారానే పాపాలు భస్మమవుతాయి ఎందుకంటే ఇది యోగాగ్ని కదా.
కావున ఇక్కడ కొత్త విషయాన్ని నేర్పిస్తారు.
ఇది జ్ఞాన మార్గము. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రే. జ్ఞానం మరియు భక్తి వేర్వేరు.
జ్ఞానాన్ని నేర్పించేందుకు తండ్రికి రావలసి ఉంటుంది ఎందుకంటే వారే జ్ఞానసాగరుడు.
వారు స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు - నేను అందరి తండ్రిని, నేను బ్రహ్మా
ద్వారా మొత్తం సృష్టినంతటినీ పావనంగా తయారుచేస్తాను. పావన ప్రపంచము సత్యయుగము, పతిత
ప్రపంచము కలియుగము. కావున ఇది సత్యయుగ ఆది, కలియుగ అంతముల సంగమయుగము. దీనిని లీప్
యుగము అని అంటారు. ఈ యుగములో మనం జంప్ చేస్తాము. ఎక్కడికి? పాత ప్రపంచము నుండి
కొత్త ప్రపంచములోకి జంప్ చేస్తాము. అక్కడైతే మెట్ల ద్వారా మెల్లమెల్లగా కిందకు
దిగుతూ వచ్చాము. ఇక్కడైతే మనం ఛీ-ఛీ ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి ఒక్కసారిగా
జంప్ చేస్తాము. నేరుగా పైకి వెళ్ళిపోతాము. పాత ప్రపంచాన్ని వదిలి మనం కొత్త
ప్రపంచములోకి వెళ్తాము. ఇది అనంతమైన విషయము. అనంతమైన పాత ప్రపంచములో ఎంతోమంది
మనుష్యులు ఉన్నారు. కొత్త ప్రపంచములోనైతే చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారు, దానిని
స్వర్గము అని అంటారు. అక్కడ అందరూ పవిత్రముగా ఉంటారు. కలియుగములో అందరూ అపవిత్రముగా
ఉన్నారు. అపవిత్రముగా రావణుడు తయారుచేస్తాడు. మీరు ఇప్పుడు రావణ రాజ్యములో లేక పాత
ప్రపంచములో ఉన్నారని అందరికీ అర్థం చేయిస్తారు. వాస్తవానికి రామరాజ్యములో ఉండేవారు,
దానిని స్వర్గము అని పిలిచేవారు. ఆ తర్వాత ఏ విధంగా 84 జన్మల చక్రాన్ని చుట్టి కింద
పడిపోయారు అనేది మనం చెప్పగలము. మంచి తెలివైనవారు ఎవరైతే ఉంటారో వారు వెంటనే అర్థం
చేసుకుంటారు. ఎవరికైతే బుద్ధిలోకి రాదో వారు వెర్రివారిలా ఇటూ-అటూ చూస్తూ ఉంటారు.
అటెన్షన్ తో వినరు. నీవు వెర్రివాడిలా ఉన్నావు అని అంటారు కదా. సన్యాసులు కూడా,
ఎప్పుడైతే కూర్చొని కథను వినిపిస్తారో అప్పుడు ఎవరైనా కునికిపాట్లు పడుతూ ఉంటే లేక
వారి అటెన్షన్ వేరే వైపు ఉంటే వారిని - నేనేమి వినిపించాను? అని ఉన్నట్లుండి
అడుగుతారు. తండ్రి కూడా అందరినీ చూస్తూ ఉంటారు. వెర్రివారు ఎవరూ కూర్చోలేదు కదా అని
చూస్తారు. మంచి చురుకైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు చదువుకునేటప్పుడు ఎప్పుడూ
ఆవలించరు. స్కూల్లో ఎప్పుడూ ఎవరూ కళ్ళు మూసుకొని కూర్చోవడమనేది నియమము కాదు.
జ్ఞానాన్నేమీ అర్థం చేసుకోరు. తండ్రిని స్మృతి చేయడం వారికి చాలా కష్టము, మరి
అలాంటప్పుడు పాపాలు ఎలా తొలుగుతాయి. చురుకైన బుద్ధికలవారైతే బాగా ధారణ చేసి ఇతరులకు
వినిపించే అభిరుచిని ఉంచుతారు. జ్ఞానము లేకపోతే బుద్ధి మిత్ర-సంబంధీకుల వైపుకు
భ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడైతే తండ్రి అంటారు, మిగిలినవాటన్నింటినీ మర్చిపోవాలి. చివరి
సమయములో ఇంకేమీ గుర్తుకురాకూడదు. బాబా సన్యాసులు మొదలైనవారినందరినీ చూసారు. పక్కా
బ్రహ్మజ్ఞానులెవరైతే ఉంటారో వారు ఉదయం వేళ అలా కూర్చుని-కూర్చునే బ్రహ్మతత్వాన్ని
తలచుకుంటూ, తలచుకుంటూ శరీరాన్ని వదిలేస్తారు. వారి శాంతి ప్రవాహము ఎంతగానో ఉంటుంది.
వాస్తవానికి వారు బ్రహ్మములో లీనమైతే అవ్వలేరు. మళ్ళీ తల్లి గర్భము నుండే జన్మ
తీసుకోవలసి ఉంటుంది.
తండ్రి అర్థం చేయించారు, వాస్తవానికి మహాత్మ అని శ్రీకృష్ణుడినే అంటారు.
మనుష్యులైతే అర్థము తెలుసుకోకుండా ఏదో అలా అనేస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు,
శ్రీకృష్ణుడు సంపూర్ణ నిర్వికారి, కానీ అతడిని సన్యాసి అని అనరు, అతడిని దేవత అని
అంటారు. సన్యాసి అని అనడం లేక దేవత అని అనడంలో కూడా అర్థముంది. అతను దేవతగా ఎలా
అయ్యారు? సన్యాసి నుండి దేవతగా అయ్యారు. అనంతమైన సన్యాసము చేసారు, ఆ తర్వాత కొత్త
ప్రపంచములోకి వెళ్ళిపోయారు. వారు అయితే హద్దు సన్యాసము చేస్తారు. వారు అనంతములోకి
వెళ్ళలేరు. హద్దులోనే వికారాల ద్వారా పునర్జన్మలను తీసుకోవలసి వస్తుంది. వారు
అనంతమైన యజమానులుగా అవ్వలేరు. వారు రాజా, రాణులుగా ఎప్పుడూ అవ్వలేరు ఎందుకంటే
సన్యాసుల ధర్మమే వేరు. సన్యాస ధర్మము దేవీ-దేవతా ధర్మము కాదు. తండ్రి అంటారు, నేను
అధర్మాన్ని వినాశనం చేసి దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. వికారాలు కూడా
అధర్మమే కదా. అందుకే తండ్రి అంటారు, వీటన్నింటి వినాశనాన్ని మరియు ఒక్క ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపనను చేయడానికి నేను రావలసి ఉంటుంది. భారత్ లో
సత్యయుగము ఉన్నప్పుడు ఒకే ధర్మముండేది, అదే ధర్మము మళ్ళీ అధర్మముగా అవుతుంది.
ఇప్పుడు మీరు మళ్ళీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఎవరు ఎంతగా
పురుషార్థం చేస్తారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం
చేసుకోవాలి. గృహస్థ వ్యవహారములో ఉండండి, అందులో కూడా ఎంత వీలైతే అంత
లేస్తూ-కూర్చుంటూ ఇది పక్కా చేసుకోండి. ఏ విధంగా భక్తులు ఉదయాన్నే లేచి ఏకాంతములో
కూర్చొని మాలను జపిస్తూ ఉంటారు. మీరైతే మొత్తం రోజంతటి లెక్కనూ చూస్తారు. ఫలానా
సమయంలో ఇంత స్మృతి ఉంది, రోజంతటిలో ఇంత సమయం స్మృతి ఉంది అని టోటల్ లెక్కను చూస్తారు.
వారైతే ఉదయం లేచి మాలను తిప్పుతారు, అయితే కొందరు సత్యమైన భక్తులుగా ఉండరు. కొందరి
బుద్ధి అయితే బయటకు అటూ-ఇటూ భ్రమిస్తూ ఉంటుంది. భక్తి ద్వారా ఏ లాభమూ కలగదని ఇప్పుడు
మీరు అర్థం చేసుకున్నారు. ఇది జ్ఞానము, దీని ద్వారా ఎంతో లాభం కలుగుతుంది. ఇప్పుడు
మీది పైకి ఎక్కే కళ. తండ్రి ఘడియ-ఘడియ మన్మనాభవ అని అంటారు. గీతలో కూడా ఈ
పదాలున్నాయి కానీ వీటి అర్థాన్ని ఎవరూ వినిపించలేరు. వారు జవాబు ఇవ్వలేకపోతారు.
వాస్తవానికి దాని అర్థము వ్రాయబడి కూడా ఉంది - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహపు
సర్వ ధర్మాలనూ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి అని. భగవానువాచ అని ఉంది కదా. కానీ
వారి బుద్ధిలో శ్రీకృష్ణ భగవానుడు అని ఉంది. అతనైతే దేహధారి, పునర్జన్మలలోకి వస్తారు
కదా. అతడిని భగవంతుడు అని ఎలా అనగలరు. సన్యాసులు మొదలైనవారెవరి దృష్టి తండ్రి మరియు
పిల్లల సంబంధములో ఉండదు. గాంధీజీని బాపూజీ అని అనేవారు కానీ తండ్రి-పిల్లల సంబంధము
అని అనరు. అతను ఎంతైనా సాకారుడే కదా. మీకైతే - స్వయాన్ని ఆత్మగా భావించండి అని అర్థం
చేయించడం జరిగింది. వీరిలో ఏ తండ్రి అయితే కూర్చొని ఉన్నారో, వారు అనంతమైన బాపూజీ.
లౌకిక మరియు పారలౌకిక, ఇద్దరు తండ్రుల నుండి వారసత్వము లభిస్తుంది. బాపూజీ నుండైతే
ఏమీ లభించదు. అచ్ఛా, భారత్ యొక్క రాజధాని తిరిగి లభించింది కానీ దానిని వారసత్వము
అని అయితే అనరు. సుఖము లభించాలి కదా!
వారసత్వాలు రెండే ఉంటాయి - ఒకటి హద్దులోని తండ్రిది, ఇంకొకటి అనంతమైన తండ్రిది.
బ్రహ్మా నుండి కూడా వారసత్వమేమీ లభించదు. వారు ప్రజలందరికీ తండ్రి, వారిని
గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. వారు స్వయం అంటారు, నా నుండి మీకు ఏ
వారసత్వమూ లభించదు. నా నుండి వారసత్వమేమీ లభించదు అని వీరు స్వయమే అంటున్నప్పుడు మరి
ఆ బాపూజీ నుండి ఏ వారసత్వము లభించగలదు? ఏమీ లభించదు. ఆంగ్లేయులు అయితే వెళ్ళిపోయారు.
ఇప్పుడేముంది? నిరాహార దీక్షలు, ధర్నాలు, స్ట్రైక్ లు మొదలైనవి జరుగుతూ ఉంటాయి, ఎంత
మారణహోమం జరుగుతూ ఉంటుంది. ఎవరి భయమూ లేదు. పెద్ద-పెద్ద ఆఫీసర్లను కూడా
హతమార్చేస్తారు. సుఖానికి బదులుగా ఇంకా దుఃఖము ఉంది. కావున అనంతమైన విషయము ఇక్కడే
ఉంది. తండ్రి అంటారు, మొట్టమొదట ఇది పక్కా నిశ్చయం చేసుకోండి - మేము ఆత్మ, శరీరము
కాదు. తండ్రి మనల్ని దత్తత తీసుకున్నారు, మనం దత్తత తీసుకోబడ్డ పిల్లలము.
జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చారని మరియు సృష్టి చక్రపు రహస్యాన్ని అర్థం
చేయిస్తున్నారని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇంకెవరూ అర్థం చేయించలేరు. తండ్రి
అంటారు, దేహ సహితంగా దేహపు ధర్మాలన్నింటినీ మరచి నన్నొక్కరినే స్మృతి చేయండి.
సతోప్రధానముగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. పాత ప్రపంచ వినాశనమైతే జరుగవలసిందేనని
కూడా మీకు తెలుసు. కొత్త ప్రపంచములో చాలా కొద్దిమందే ఉంటారు. ఇన్ని కోట్లాదిమంది
ఆత్మలు ఎక్కడ, ఆ 9 లక్షల మంది ఎక్కడ. ఇంతమందీ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు మీ
బుద్ధిలో ఉంది - ఆత్మలమైన మనందరమూ పైన ఉండేవారము, మళ్ళీ ఇక్కడకు పాత్రను
అభినయించేందుకు వచ్చాము. ఆత్మనే పాత్రధారి అని అంటారు. ఆత్మ ఈ శరీరముతోపాటు పాత్రను
అభినయిస్తుంది. ఆత్మకు ఇంద్రియాలు అయితే కావాలి కదా. ఆత్మ ఎంత చిన్ననిది. 84 లక్షల
జన్మలు లేవు. ప్రతి ఒక్కరూ ఒకవేళ 84 లక్షల జన్మలు తీసుకున్నట్లయితే మరి పాత్రను
రిపీట్ ఎలా చేస్తారు. అది గుర్తుండదు. స్మృతి నుండి బయటకు వెళ్ళిపోతుంది. 84 జన్మలు
కూడా మీకు గుర్తు ఉండవు, మర్చిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేసి
పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. ఈ యోగాగ్నితో వికర్మలు వినాశనమవుతాయి. అనంతమైన తండ్రి
నుండి అనంతమైన వారసత్వాన్ని మనం కల్పకల్పమూ తీసుకుంటాము అన్న నిశ్చయము కూడా ఉంది.
ఇప్పుడు మళ్ళీ స్వర్గవాసులుగా అయ్యేందుకు తండ్రి చెప్పారు - నన్నొక్కరినే స్మృతి
చేయండి ఎందుకంటే నేనే పతిత-పావనుడను. మీరు తండ్రిని పిలిచారు కదా, కావున ఇప్పుడు
తండ్రి పావనంగా తయారుచేయడానికి వచ్చారు. దేవతలు పావనంగా ఉంటారు, మనుష్యులు పతితులుగా
ఉంటారు. పావనంగా అయి మళ్ళీ శాంతిధామానికి వెళ్ళాలి. మీరు శాంతిధామానికి
వెళ్ళాలనుకుంటున్నారా లేక సుఖధామములోకి రావాలనుకుంటున్నారా? సన్యాసులైతే సుఖము
కాకిరెట్టతో సమానమైనది, మాకు శాంతియే కావాలి అని అంటారు, కావున వారు సత్యయుగములోకి
ఎప్పుడూ రాలేరు. సత్యయుగములో ప్రవృత్తి మార్గపు ధర్మము ఉండేది. దేవతలు
నిర్వికారులుగా ఉండేవారు, వారే పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ పతితులుగా అవుతారు.
ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నిర్వికారులుగా అవ్వాలి. స్వర్గములోకి వెళ్ళాలంటే
నన్ను స్మృతి చేయండి, తద్వారా మీ పాపాలు అంతమవుతాయి, పుణ్యాత్ములుగా అవుతారు, మళ్ళీ
శాంతిధామము, సుఖధామములోకి వెళ్తారు. అక్కడ శాంతి కూడా ఉండేది, సుఖము కూడా ఉండేది.
ఇప్పుడు ఇది దుఃఖధామము. మళ్ళీ తండ్రి వచ్చి సుఖధామము యొక్క స్థాపనను, దుఃఖధామము
యొక్క వినాశనాన్ని చేస్తారు. చిత్రము కూడా ఎదురుగా ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడ
నిలబడ్డారో చెప్పండి? ఇప్పుడు ఇది కలియుగ అంతిమము, వినాశనం ఎదురుగా నిలబడి ఉంది.
ఇకపోతే చిన్న భాగము మిగిలి ఉంటుంది. ఇన్ని ఖండాలైతే అక్కడ ఉండవు. ఈ ప్రపంచమంతటి
చరిత్ర-భౌగోళములను తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది పాఠశాల. భగవానువాచ,
మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు ఇది కలియుగము, మళ్ళీ
సత్యయుగములోకి వెళ్ళాలి. అక్కడైతే సుఖమే సుఖము ఉంటుంది. ఒక్కరినే స్మృతి చేయడము -
అది అవ్యభిచారీ స్మృతి. శరీరాన్ని కూడా మర్చిపోవాలి. శాంతిధామము నుండి వచ్చాము,
మళ్ళీ శాంతిధామములోకి వెళ్ళాలి. అక్కడకు పతితులు ఎవ్వరూ వెళ్ళలేరు. తండ్రిని స్మృతి
చేస్తూ-చేస్తూ పావనంగా అయి మీరు ముక్తిధామములోకి వెళ్ళిపోతారు. ఇది బాగా అర్థం
చేయించవలసి ఉంటుంది. ఇంతకుముందు ఇన్ని చిత్రాలు ఏమైనా ఉండేవా. చిత్రాలు లేకుండా కూడా
సారములో అర్థం చేయించడం జరిగేది. ఈ పాఠశాలలో మనుష్యుల నుండి దేవతలుగా అయిపోవాలి. ఇది
కొత్త ప్రపంచము కొరకు జ్ఞానము. దీనిని తండ్రే ఇస్తారు కదా. కావున తండ్రి దృష్టి
పిల్లలపై ఉంటుంది. వారు ఆత్మలైన మనల్ని చదివిస్తారు. అనంతమైన తండ్రి మాకు అర్థం
చేయిస్తారు, వారి పేరు శివబాబా అని మీరు కూడా అర్థం చేయిస్తారు. కేవలం అనంతమైన బాబా
(తండ్రి) అని అనడం ద్వారా కూడా తికమకపడతారు, ఎందుకంటే బాబాలు కూడా ఎంతోమంది
అయిపోయారు. మునిసిపాలిటీ మేయర్ ను కూడా బాబా (ఫాదర్) అనే అంటారు. తండ్రి అంటారు,
నేను ఇతనిలోకి వచ్చినా కానీ నా పేరు శివయే. నేను ఈ రథము ద్వారా మీకు జ్ఞానాన్ని
ఇస్తాను, ఇతడిని దత్తత తీసుకున్నాను. ఇతనికి ప్రజాపిత బ్రహ్మా అన్న పేరును పెట్టాను.
ఇతనికి కూడా నా నుండే వారసత్వము లభిస్తుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.