05-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - డ్రామా యొక్క శ్రేష్ఠ జ్ఞానము పిల్లలైన మీ వద్దే ఉంది, ఈ డ్రామా ఖచ్చితముగా ఇదే విధంగా రిపీట్ అవుతుందని మీకు తెలుసు’’

ప్రశ్న:-
ప్రవృత్తిలో ఉండేవారు బాబాను ఏ ప్రశ్న అడుగుతారు, బాబా వారికి ఏ సలహాను ఇస్తారు?

జవాబు:-
చాలా మంది పిల్లలు అడుగుతారు - బాబా, మేము వ్యాపారము చేయవచ్చా? బాబా అంటారు - పిల్లలూ, వ్యాపారము చేయవచ్చు కానీ రాయల్ వ్యాపారము చేయండి. బ్రాహ్మణ పిల్లలు మద్యము, సిగరెట్లు, బీడీ మొదలైనవాటి ఛీ-ఛీ వ్యాపారము చేయకూడదు ఎందుకంటే వీటి వల్ల వికారాల ఆకర్షణ ఇంకా ఎక్కువ కలుగుతుంది.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఒకటేమో, ఆత్మిక తండ్రి యొక్క శ్రీమతము, ఇంకొకటి రావణుని ఆసురీ మతము. ఆసురీ మతాన్ని తండ్రి మతము అని అనరు. రావణుడిని తండ్రి అని అనరు కదా. అది రావణుని ఆసురీ మతము. ఇప్పుడు పిల్లలైన మీకు ఈశ్వరీయ మతము లభిస్తోంది. దానికి, దీనికి ఎంతగా రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఈశ్వరీయ మతము ద్వారా దైవీ గుణాలను ధారణ చేస్తూ వచ్చామని బుద్ధిలోకి వస్తుంది. ఇది కేవలం పిల్లలైన మీరే తండ్రి ద్వారా వింటారు, ఇది ఇంకెవ్వరికీ తెలియదు. సంపదను ఇచ్చేందుకే తండ్రి లభిస్తారు. రావణుడి ద్వారానైతే సంపద ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఈశ్వరీయ మతము ఎక్కడికి తీసుకువెళ్తుంది మరియు ఆసురీ మతము ఎక్కడికి తీసుకువెళ్తుంది, ఇది మీకే తెలుసు. ఆసురీ మతము ఎప్పటినుండైతే లభిస్తుందో, అప్పటినుండి మీరు కిందకు దిగుతూనే వస్తారు. కొత్త ప్రపంచములో కొద్ది, కొద్దిగానే కిందకు దిగుతారు. కిందకు దిగడమనేది ఎలా జరుగుతుంది, మళ్ళీ పైకి ఎక్కడమనేది ఎలా జరుగుతుంది - ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ శ్రేష్ఠముగా అయ్యేందుకు పిల్లలైన మీకు శ్రీమతము లభిస్తుంది. మీరు ఇక్కడకు వచ్చిందే శ్రేష్ఠముగా అయ్యేందుకు. మనం శ్రేష్ఠ మతాన్ని మళ్ళీ ఎలా పొందుతాము అనేది మీకు తెలుసు. అనేక సార్లు మీరు శ్రేష్ఠ మతము ద్వారా ఉన్నత పదవిని పొందారు, మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ కిందకు దిగుతూ వచ్చారు. మళ్ళీ ఒకేసారి పైకి ఎక్కుతారు. నంబరువారు పురుషార్థానుసారముగా అయితే ఉండనే ఉంటారు. దానికి సమయం పడుతుంది అని తండ్రి అర్థం చేయిస్తారు. పురుషోత్తమ సంగమయుగం యొక్క సమయం కూడా ఉంది కదా. పూర్తిగా ఏక్యురేట్ గా ఉంది. డ్రామా చాలా ఏక్యురేట్ గా నడుస్తుంది మరియు ఇది చాలా అద్భుతమైనది. తండ్రిని స్మృతి చేయాలి మరియు వారసత్వాన్ని తీసుకోవాలి, అంతే అన్నది పిల్లలకు చాలా సహజముగా అర్థమవుతుంది కానీ పురుషార్థం చేసేటప్పుడు కొందరికి కష్టమనిపిస్తుంది కూడా. ఇంత ఉన్నతోన్నతమైన పదవిని పొందడము అంత సహజము కాదు కదా. తండ్రి స్మృతి చాలా సహజము మరియు తండ్రి వారసత్వము కూడా సహజమే, ఇది ఒక్క క్షణము యొక్క విషయము. కానీ పురుషార్థము చేయడం మొదలుపెడితే మాయ విఘ్నాలు కూడా వస్తాయి. రావణునిపై విజయాన్ని పొందవలసి ఉంటుంది. మొత్తం సృష్టి అంతటిపైనా ఈ రావణుని రాజ్యము ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు - మనం యోగబలము ద్వారా రావణునిపై ప్రతి కల్పమూ విజయాన్ని పొందుతూ వచ్చాము, ఇప్పుడు కూడా పొందుతున్నాము. అది నేర్పించేవారు అనంతమైన తండ్రి. భక్తి మార్గములో కూడా మీరు బాబా, బాబా అంటూ వచ్చారు కానీ ఇంతకుముందు తండ్రి గురించి తెలియదు, ఆత్మ గురించి తెలుసు. భృకుటి మధ్యలో అద్భుతమైన సితార మెరుస్తూ ఉంటుంది... అని అనేవారు. ఆత్మ గురించి తెలిసి ఉన్నా కూడా ఇంతకుముందు తండ్రి గురించి తెలియదు. డ్రామా ఎంత విచిత్రమైనది. ఓ పరమపిత పరమాత్మా అని పిలిచేవారు, తలచుకునేవారు, కానీ వారి గురించి తెలిసేది కాదు. ఆత్మ కర్తవ్యము గురించి గాని, పరమాత్ముని కర్తవ్యము గురించి గాని పూర్తిగా తెలిసేది కాదు. తండ్రే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రి తప్ప ఇంకెవరూ రియలైజ్ చేయించలేరు. అసలు ఆ పాత్ర ఎవరికీ లేనే లేదు. ఈశ్వరీయ సాంప్రదాయము, ఆసురీ సాంప్రదాయము మరియు దైవీ సాంప్రదాయము అన్న గాయనం కూడా ఉంది. వాస్తవానికి ఇది చాలా సహజము. కానీ ఈ విషయాలు గుర్తుండాలి - ఇందులోనే మాయ విఘ్నాలు వేస్తుంది, మరపింపజేస్తుంది. తండ్రి అంటారు, నంబరువారు పురుషార్థానుసారముగా స్మృతి చేస్తూ, చేస్తూ ఎప్పుడైతే డ్రామా అంతిమము వస్తుందో అనగా పాత ప్రపంచ అంతిమము వస్తుందో, అప్పుడు నంబరువారు పురుషార్థానుసారముగా రాజధాని తప్పకుండా స్థాపన అవుతుంది. శాస్త్రాల ద్వారా ఈ విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. గీత మొదలైనవాటినైతే ఇతను కూడా ఎంతగానో చదివారు కదా. ఇప్పుడు తండ్రి అంటారు, వాటికి ఎటువంటి విలువా లేదు. కానీ భక్తిలో ఎంతో కర్ణరసం లభిస్తుంది కావున వాటిని వదలరు.

మొత్తం ఆధారమంతా పురుషార్థం పైనే ఉందని మీకు తెలుసు. వ్యాపారాలు మొదలైనవి కూడా కొందరివి రాయల్ గా ఉంటాయి, కొందరివి ఛీ-ఛీగా ఉంటాయి. మద్యము, బీడీ, సిగరెట్ మొదలైనవి అమ్ముతారు - ఈ వ్యాపారమైతే చాలా అశుద్ధమైనది. మద్యము అన్ని వికారాలనూ ఆకర్షిస్తుంది. ఎవరినైనా మద్యపానులుగా చేయడము - ఈ వ్యాపారము మంచిది కాదు. తండ్రి సలహా ఇస్తున్నారు, యుక్తిగా ఈ వ్యాపారాన్ని మార్చుకోండి లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, అవినాశీ జ్ఞాన రత్నాల వ్యాపారములో తప్ప మిగిలిన వ్యాపారాలన్నింటిలోనూ నష్టముంది. వీరు వజ్రాల వ్యాపారము చేసేవారు కానీ లాభమేమీ కలగలేదు కదా. మహా అయితే లక్షాధికారిగా అయ్యారు. కానీ ఈ వ్యాపారముతో ఎలా తయారవుతారు? బాబా ఉత్తరాల్లో కూడా ఎప్పుడూ పదమాపదమ భాగ్యశాలులు అని వ్రాస్తారు, అది కూడా 21 జన్మల కొరకు అలా అవుతారు. బాబా చాలా కరక్టుగా చెప్తున్నారని మీరు కూడా భావిస్తారు. మనమే ఈ దేవీ-దేవతలుగా ఉండేవారము, మళ్ళీ చక్రములో తిరుగుతూ, తిరుగుతూ కిందకు వస్తాము. సృష్టి ఆదిమధ్యాంతాలను కూడా మీరు తెలుసుకున్నారు. జ్ఞానమైతే తండ్రి ద్వారా లభించింది కానీ దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. స్వయాన్ని పరిశీలించుకోవాలి - నాలో ఎటువంటి ఆసురీ గుణాలైతే లేవు కదా? నేను నా ఈ శరీరము రూపీ ఇంటిని అద్దెకు ఇచ్చాను అని ఈ బాబాకు కూడా తెలుసు. ఇది ఇల్లు కదా. ఇందులో ఆత్మ ఉంటుంది. భగవంతునికి నేను ఇంటిని అద్దెకు ఇచ్చాను అని నాకు ఎంతో నషా ఉంటుంది! డ్రామా ప్లాన్ అనుసారంగా వారు ఇంకే ఇంటినీ తీసుకునేదే లేదు. కల్ప-కల్పమూ ఈ ఇంటినే తీసుకోవలసి ఉంటుంది. ఇతనికైతే సంతోషముగా ఉంటుంది కదా. కానీ గొడవలు కూడా ఎంతగా జరిగాయి. ఈ బాబా అప్పుడప్పుడూ సరదాగా బాబాతో అంటూ ఉంటారు, బాబా, మీ రథముగా అయినందుకు నేను ఇన్ని నిందలు తినవలసి వస్తుంది. బాబా అంటారు, అందరికన్నా ఎక్కువ నిందలు నాకు వచ్చాయి. ఇప్పుడు ఇక ఇది నీ వంతు. బ్రహ్మాకు ఎప్పుడూ నిందలు లభించలేదు, ఇప్పుడు ఆ వంతు వచ్చింది. రథాన్ని ఇచ్చారు అన్నదైతే అర్థమవుతుంది కదా, కావున తప్పకుండా తండ్రి నుండి సహాయము కూడా లభిస్తుంది. అయినా బాబా అంటారు, బాబాను నిరంతరమూ స్మృతి చేయడములోనైతే పిల్లలైన మీరు ఇతని కన్నా కూడా చురుకుగా ముందుకు వెళ్ళగలరు ఎందుకంటే ఇతనిపైనైతే ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. డ్రామా అని చెప్పి వదిలేస్తారు కానీ ఎంతోకొంత ప్రభావము తప్పకుండా పడుతుంది. పాపం వీరు చాలా మంచి సేవ చేసేవారు, వీరు సాంగత్య దోషములో పాడైపోయారు. ఎంత డిస్సర్వీస్ జరుగుతుంది. ఎటువంటి పనులు చేస్తారంటే వాటి వల్ల ప్రభావము పడుతుంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది కదా అని ఆ సమయములో అర్థం చేసుకోరు, ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది కదా అని ఆ తర్వాత ఆ ఆలోచన వస్తుంది. మాయ అవస్థను పాడు చేస్తుంది, దానితో చాలా డిస్సర్వీస్ జరుగుతుంది. అబలలు మొదలైనవారిపై ఎంతగా అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే స్వయంగా పిల్లలే ఎంత డిస్సర్వీస్ చేస్తారు, తప్పుడు మాటలు మాట్లాడడం మొదలుపెడతారు.

తండ్రి ఏమి వినిపిస్తారు అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారు శాస్త్రాలు మొదలైనవేవీ వినిపించరు. ఇప్పుడు మనం శ్రీమతముపై ఎంత శ్రేష్ఠముగా అవుతాము. ఆసురీ మతము ద్వారా ఎంత భ్రష్టముగా అయ్యాము. సమయమైతే పడుతుంది కదా. మాయతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ విజయమైతే తప్పకుండా లభించనున్నది. శాంతిధామము, సుఖధామముపై మన విజయము తప్పకుండా ఉంది అని మీరు అర్థం చేసుకున్నారు. కల్పకల్పమూ మనం విజయము పొందుతూ వచ్చాము. ఈ పురుషోత్తమ సంగమయుగములోనే స్థాపన మరియు వినాశనం జరుగుతుంది. ఈ వివరాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. తప్పకుండా తండ్రి మన ద్వారా స్థాపన చేయిస్తున్నారు. మళ్ళీ మనమే రాజ్యం చేస్తాము. బాబాకు థాంక్స్ కూడా చెప్పరు! తండ్రి అంటారు, ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది, నేను కూడా ఈ డ్రామాలో పాత్రధారిని, డ్రామాలో అందరి పాత్రా రచింపబడి ఉంది, శివబాబా పాత్ర కూడా ఉంది, మన పాత్ర కూడా ఉంది, ఇందులో థాంక్స్ చెప్పే విషయమేమీ లేదు. శివబాబా అంటారు, నేను మీకు శ్రీమతాన్ని ఇచ్చి దారిని తెలియజేస్తాను, ఇది ఇంకెవరూ తెలియజేయలేరు. మీ వద్దకు ఎవరు వచ్చినా వారికి చెప్పండి, సతోప్రధానమైన కొత్త ప్రపంచము స్వర్గము ఉండేది కదా. ఈ పాత ప్రపంచాన్ని తమోప్రధానము అని అంటారు, మళ్ళీ సతోప్రధానముగా అయ్యేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి, తండ్రిని స్మృతి చేయాలి. మంత్రమే ఇది - మన్మనాభవ, మధ్యాజీభవ, అంతే. నేను సుప్రీమ్ గురువును అని కూడా చెప్తారు.

పిల్లలైన మీరు ఇప్పుడు స్మృతియాత్ర ద్వారా మొత్తం సృష్టినంతటినీ సద్గతిలోకి చేరుస్తారు. జగద్గురువు ఒక్క శివబాబాయే, వారు మీకు కూడా శ్రీమతాన్ని ఇస్తారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనకు ఈ శ్రీమతము లభించిందని మీకు తెలుసు. చక్రము తిరుగుతూ ఉంటుంది. ఈ రోజు పాత ప్రపంచము ఉంది, రేపు కొత్త ప్రపంచము ఉంటుంది. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా సహజము. కానీ ఎవరికైనా అర్థం చేయించగలిగేందుకు ఇది కూడా గుర్తుండాలి. ఇది కూడా మర్చిపోతారు. ఎవరైనా పడిపోతే జ్ఞానము మొదలైనదంతా అంతమైపోతుంది. ఆత్మ మరియు శరీరములోని శక్తిని మరియు విశేషతలను మాయ తీసేసుకుంటుంది, అన్ని కళలనూ తొలగించి కళారహితముగా చేసేస్తుంది. చెప్పడానికి వీల్లేనట్లుగా వికారాలలో చిక్కుకుపోతారు. ఇప్పుడు మీకు మొత్తం చక్రమంతా గుర్తుంది. మీరు జన్మ-జన్మాంతరాలూ వేశ్యాలయములో ఉన్నారు, వేలాది పాపాలు చేస్తూ వచ్చారు. అందరి ముందు అంటారు, మేము జన్మజన్మాంతరాలు పాపాత్ములము, మేమే మొదట పుణ్యాత్ములుగా ఉండేవారము, మళ్ళీ పాపాత్ములుగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ పుణ్యాత్ములుగా అవుతాము. పిల్లలైన మీకు ఈ జ్ఞానము లభిస్తోంది. మళ్ళీ మీరు ఇతరులకు ఇచ్చి మీ సమానముగా తయారుచేస్తారు. గృహస్థ వ్యవహారములో ఉండడం వలన తేడా అయితే ఉంటుంది కదా. వారు మీరు అర్థం చేయించినంతగా అర్థం చేయించలేరు. కానీ అందరూ అంతా వదలలేరు కదా. తండ్రి స్వయం అంటున్నారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా అవ్వాలి. అలా అందరూ వదిలేసి వచ్చేస్తే ఇంతమంది ఎక్కడ కూర్చుంటారు. తండ్రి నాలెడ్జ్ ఫుల్. వారు శాస్త్రాలూ మొదలైనవేవీ చదవరు. ఇతను శాస్త్రాలు మొదలైనవి చదివారు. నా విషయములోనైతే గాడ్ ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ ఫుల్ (భగవంతుడైన తండ్రి అన్నీ తెలిసినవారు) అని అంటారు. తండ్రిలో ఏ జ్ఞానము ఉంది అనేది కూడా మనుష్యులకు తెలియదు. ఇప్పుడు మీకు మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. ఈ భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైనవి కూడా అనాది అని మీకు తెలుసు. భక్తి మార్గములో ఈ శాస్త్రాలు కూడా తప్పకుండా వెలువడతాయి. పర్వతము కూలిపోయింది, మళ్ళీ అది ఎలా తయారవుతుంది అని అడుగుతారు, కానీ ఇదంతా డ్రామా కదా. శాస్త్రాలూ మొదలైనవన్నీ అంతమైపోతాయి, మళ్ళీ తమ సమయమనుసారముగా అవే తయారవుతాయి. మనం మొట్టమొదట శివుని పూజను చేస్తాము - ఇది కూడా శాస్త్రాలలో ఉంటుంది కదా. శివుని భక్తి ఎలా చేయబడుతుంది, ఎన్ని శ్లోకాలు మొదలైనవి గానం చేస్తారు. మీరు కేవలం - శివబాబా జ్ఞానసాగరుడు అని తలచుకుంటారు. వారు ఇప్పుడు మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ సృష్టిచక్రము ఎలా తిరుగుతుంది అనేది తండ్రి మీకు అర్థం చేయించారు. శాస్త్రాలలో ఎంత పొడిగించి చూపించారు, అలాగైతే అది ఎప్పుడూ స్మృతిలోకి కూడా రాలేదు. కావున పిల్లలకు అనంతమైన తండ్రి మాకు చదివిస్తున్నారు అని లోలోపల ఎంతటి సంతోషము ఉండాలి! స్టూడెంట్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ (విద్యార్ధి జీవితమే ఉత్తమ జీవితము) అని గానం చేయబడుతుంది కూడా. భగవానువాచ - నేను మిమ్మల్ని ఇటువంటి రాజులకే రాజులుగా తయారుచేస్తాను. ఇంకే శాస్త్రాలలోనూ ఈ విషయాలు లేవు. ఉన్నతోన్నతమైన ప్రాప్తి ఇదొక్కటే. వాస్తవానికి గురువు ఒక్కరే, వారే సర్వుల సద్గతిని చేస్తారు. స్థాపన చేసేవారిని కూడా గురువు అని అనవచ్చు కానీ వాస్తవానికి ఎవరైతే సద్గతిని ఇస్తారో వారే గురువు. ఆ గురువులైతే తమ వెనుక అందరినీ పాత్రలోకి తీసుకువస్తారు, తిరిగి తీసుకువెళ్ళేందుకు దారినైతే తెలియజేయరు. ఊరేగింపు అయితే శివునిదే గానం చేయబడ్డది, అంతేకానీ ఇంకే గురువుదీ కాదు. మనుష్యులైతే శివుడిని మరియు శంకరుడిని కలిపేసారు. ఆ సూక్ష్మవతనవాసి ఎక్కడ, ఈ మూలవతనవాసి ఎక్కడ. ఇరువురూ ఒక్కరు ఎలా అవ్వగలరు. ఇలా భక్తి మార్గములో వ్రాసేసారు. బ్రహ్మా, విష్ణువు, శంకరుడు, ఈ ముగ్గురూ పిల్లలు అవుతారు కదా. బ్రహ్మాను గురించి కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఇతడిని దత్తత తీసుకున్నారు కావున ఇతను శివబాబాకు సంతానమవుతారు కదా. ఉన్నతోన్నతమైనవారు తండ్రి, మిగిలినదంతా వారి రచన. ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అవినాశీ జ్ఞాన రత్నాల వ్యాపారము చేస్తూ 21 జన్మల కొరకు పదమాపదమ భాగ్యశాలులుగా అవ్వాలి. స్వయాన్ని చెక్ చేసుకోవాలి - మాలో ఎటువంటి ఆసురీ గుణాలైతే లేవు కదా? మేము వికారాలను ఉత్పన్నం చేసే వ్యాపారాలేమీ చేయడం లేదు కదా?

2. స్మృతియాత్రలో ఉంటూ మొత్తం సృష్టినంతటినీ సద్గతిలోకి చేర్చాలి. ఒక్క సద్గురువైన తండ్రి శ్రీమతముపై నడుస్తూ తమ సమానముగా తయారుచేసే సేవను చేయాలి. మాయ ఎప్పుడూ కళారహితముగా చేయకూడదు అన్న శ్రద్ధ ఉండాలి.

వరదానము:-
చెడులో కూడా మంచిని అనుభవం చేసే నిశ్చయబుద్ధి నిశ్చింత చక్రవర్తి భవ

సదా గుర్తుండాలి - ఏదైతే జరిగిందో అది మంచికే జరిగింది, అంతా మంచియే జరుగుతూ ఉంది మరియు మంచియే జరుగనున్నది. చెడును చెడు రూపములో చూడకండి, చెడులో కూడా మంచిని అనుభవం చేయండి, చెడు నుండి కూడా మీ పాఠము నేర్చుకోండి. ఏ విషయము ఎదురుగా వచ్చినా, ‘‘ఏమవుతుంది’’ అన్న సంకల్పము రాకూడదు, వెంటనే - ‘‘మంచే జరుగుతుంది’’ అని రావాలి. ఏదైతే గతించిపోయిందో అది మంచిగానే గతించిపోయింది. ఎక్కడైతే మంచి ఉందో అక్కడ సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. నిశ్చయబుద్ధి అంటే అర్థమే నిశ్చింత చక్రవర్తి.

స్లోగన్:-
ఎవరైతే స్వయానికి మరియు ఇతరులకు గౌరవాన్ని ఇస్తారో, వారి రికార్డు సదా మంచిగా ఉంటుంది.