05-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు సైలెన్స్ లో ఉంటూ ఒక్క తండ్రిని స్మృతి చేయాలి, ఇందులో గంటలు మొదలైనవి మ్రోగించే అవసరము లేదు’’

ప్రశ్న:-
ఏ విషయములో తండ్రి సమానముగా అయినట్లయితే అన్ని పనులు సిద్ధిస్తాయి?

జవాబు:-
ఎలాగైతే తండ్రి ప్రేమ సాగరుడో, అలా చాలా-చాలా ప్రియమైనవారిగా అవ్వండి. క్రోధము వలన పనులు పాడవుతాయి, అంతేకానీ బాగవ్వవు, అందుకే కన్నెర్ర చేయడము, గట్టిగా మాట్లాడడము, వేడెక్కడము - వీటి అవసరము లేదు. శాంతిగా ఉండడము చాలా-చాలా మంచిది. ప్రేమతో చాలా పనులు సిద్ధిస్తాయి.

పాట:-
నీవే తల్లివి తండ్రివి...

ఓంశాంతి
ఈ మహిమ ఒక్కరిదే, కానీ భక్తి మార్గములో కేవలం ఒక్కరి మహిమను చేసినట్లయితే భక్తి యొక్క షో జరగదు, అందుకే భక్తిలో అనేకుల మహిమ చేస్తారు. అక్కడ శబ్దము కూడా చాలా ఉంటుంది. గంటలు మ్రోగించడము, పాటలు-భజనలు, ఏడ్వడము, పెడబొబ్బలు పెట్టడము మొదలైనవి భక్తి మార్గములో ఎన్నో జరుగుతాయి. రకరకాల శబ్దాలు, మంత్ర-తంత్రాలు, కీర్తనలు మొదలైనవి ఉంటాయి మరియు జ్ఞాన మార్గములో సైలెన్స్ ఉంటుంది. కేవలం సూచన ఇవ్వడము జరుగుతుంది, శబ్దమేమీ ఉండదు. భక్తిలో ఎంత ఆర్భాటము ఉంటుంది. అందరికంటే ఎక్కువగా శివుని మందిరాలలో గంటలు మ్రోగుతాయి. ఎక్కడ చూస్తే అక్కడ గంటలే గంటలు ఉంటాయి. ఎవరినైనా నిద్ర నుండి మేల్కొల్పేందుకు గంటలను మ్రోగించడము జరగదు. శివబాబా వచ్చి మనుష్యులను కుంభకర్ణుని అజ్ఞాన నిద్ర నుండి మేలుకొలిపారు, కానీ గంటలు మ్రోగించలేదు. పూర్తిగా శాంతితో రెండు పదాలలోనే అర్థం చేయిస్తారు. బుద్ధిశాలులు ఎవరైతే ఉంటారో, వారు రెండు పదాలతోనే అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు - పిల్లలూ, నన్ను స్మృతి చేయండి. ఓ పతిత-పావనా రండి అని మీరే నన్ను పిలిచారు. ఇప్పుడు నేను వచ్చాను, మీకు మార్గము తెలియజేస్తాను. ఇప్పటికీ మీరు పతితులుగా ఉంటూ ఈ ప్రపంచములోనే ఉంటారా ఏమిటి! మీరైతే పావన ప్రపంచములో ఉండాలనుకుంటున్నారు కదా. పావన ప్రపంచమని స్వర్గాన్ని అంటారు. తండ్రిని పతిత-పావనుడని అంటారు, పతిత-పావనుడు వచ్చి ఏం చేస్తారు అనేది అర్థం చేసుకోవాలి. తప్పకుండా నరకము నుండి స్వర్గములోకి తీసుకువెళ్తారు. అర్థం తెలియకుండా అలాగే పిలుస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు. కానీ తండ్రి వచ్చి ఏం చేస్తారు అనేది వారికి తెలియదు. వాస్తవానికి ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే యూనివర్శిటీ కూడా. అందుకే మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి భగవంతునికి ఎంతో సమయము పట్టదు... అని పాడుతారు. ఇందులో శాస్త్రాలు మొదలైనవేవీ చదవాల్సిన పని లేదు. భక్తి మార్గములో చాలా శాస్త్రాలు మొదలైనవి చదువుతారు, ఎన్నో ప్రవచనాలు మొదలైనవి జరుగుతాయి. ప్రతి నెల మండపాన్ని తయారుచేసి కూర్చుని శబ్దము చేస్తారు. ఇక్కడ తండ్రి ఎంత శాంతిగా కూర్చుని అర్థం చేయిస్తారు. చూడండి, మిమ్మల్ని బాబా వచ్చి పావనముగా తయారుచేసి పావన ప్రపంచానికి యజమానులుగా తయారుచేస్తారు. చదువు కూడా ఎంత సహజమైనది. మీరు మొట్టమొదట పావనముగా ఉండేవారు, బంగారుయుగములో ఉండేవారు. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇనుపయుగములో తమోప్రధానముగా అయిపోయారు. ఇప్పుడు మీరు సతోప్రధానముగా అవ్వాలి, అందుకే నన్ను స్మృతి చేయండి. స్మృతి కూడా నిరంతరము చేయాలి. కన్యకు వివాహము జరిగేటప్పుడు ఆమె ఏమని జపము చేస్తారు? స్మృతిలో ఉంటారు. మీరందరూ కూడా పత్నులే, ఈ శివబాబా పతులకే పతి. మీకు పరమాత్మునితో నిశ్చితార్థము జరిగింది. నిశ్చితార్థము జరిగిన తర్వాత, ఇక బుద్ధిలో స్మృతి కూర్చుండిపోతుంది. మేము నిశ్చితార్థము చేసుకున్నామని భరోసా ఉంటుంది. తర్వాత ఒకరినొకరు స్మృతి చేసుకుంటూ ఉంటారు. మీతో కూడా తండ్రి చెప్తున్నారు - మేమంతా ఒక్క తండ్రి పిల్లలము, పరస్పరములో సోదరులము అని మీరు నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యారు. సోదరులకు ఒక్క తండ్రి నుండే వారసత్వము లభిస్తుంది, అందుకే తండ్రిని పిలుస్తారు. మనుష్య తనువులోకి వచ్చి సోదరీ-సోదరులుగా అవుతారు. కానీ పిలిచేది ఆత్మయే కదా. ఓ పతిత-పావన బాబా రండి - అని సోదరులే పిలుస్తారు. బాబా అంటారు - నన్ను స్మృతి చేస్తే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. పావనముగా ఉన్నవారిని సతోప్రధానులని, పతితముగా ఉన్నవారిని తమోప్రధానులని అంటారు. ఈ విషయాలను బాబా సంగమములోనే అర్థం చేయిస్తారు. ఇది గీతా పాఠశాల. ఈ పాఠశాలలో తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు, నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారు. అక్కడైతే టీచరు ఎదురుగా కూర్చుని చదివిస్తారు, అది కనిపిస్తుంది. ఇది గుప్తమైనది. ఈ టీచరును కూడా బుద్ధియోగము ద్వారా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వారు నిరాకారుడు, పతిత-పావనుడైన తండ్రి. కల్పక్రితం కూడా నేను మీకు రాజయోగాన్ని నేర్పించానని వారే స్మృతిని ఇప్పిస్తారు. అందుకే మన్మనాభవ అని అంటూ ఉంటారు. పవిత్రముగా అయినట్లయితే ఈ విధముగా లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఇక్కడ గంటలు మొదలైనవి మ్రోగించాల్సిన అవసరము లేదు. తండ్రి స్వయముగా వచ్చి మేలుకొలుపుతారు. మన్మనాభవ అంటే అర్థం - సైలెన్స్. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి, అంతే! ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్ళాలి. మమ్మల్ని దుఃఖము నుండి విడిపించి విముక్తులుగా చేయండి అని అందరూ తండ్రితోనే అంటారు. సన్యాసులు కేవలం బ్రహ్మ తత్వాన్ని స్మృతి చేస్తారు. బ్రహ్మ తత్వమంటే ఇల్లు. వారు ఇంటిని స్మృతి చేస్తారు, ఇక్కడ తండ్రిని స్మృతి చేయాలి. కేవలం ఇంటిని స్మృతి చేశారంటే సన్యాసుల వలె అయినట్లు. బ్రహ్మ తత్వము అంటే భగవంతుడు కాదు.

తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నిర్వాణధామములోకి వెళ్ళిపోతారు, మళ్ళీ అక్కడ నుండి స్వర్గములోకి వస్తారు. ఇక్కడ నుండి నేను పిల్లలైన మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను. మిడతల గుంపు ఎంత పెద్దగా ఉంటుందో మీకు తెలుసు. అన్నీ ఐకమత్యముతో ఉంటాయి. మొదట ఉన్న మిడత ముందుగా కూర్చుందంటే, మిగిలినవన్నీ కూర్చుండిపోతాయి. తేనెటీగలు కూడా ఇలాగే ఉంటాయి. రాణి ఈగ ఇంటి నుండి బయటకు వచ్చిందంటే, మిగిలినవన్నీ దాని వెనుక పరుగెడతాయి. అది వాటికి ప్రియుని వంటిది. వాటిలో ప్రేయసియే తమ తోటివారిపై రాజ్యము చేస్తుంది. ఆత్మలన్నీ దోమల వలె పరుగెడతాయని శాస్త్రాలలో కూడా ఉంది. లెక్కలేనన్ని ఆత్మలు ఉన్నాయి. ఆ తేనెటీగలు ప్రతి సీజన్ లో తమ రాణి వెనుక పరుగెడతాయి. మీరైతే ఒక్కసారి మాత్రమే పరుగెత్తాలి. ఇప్పుడు ఆత్మలందరూ మూలవతనానికి వెళ్ళాలి. మీరు ఏ శబ్దము చేయరు, అందుకే ఆవగింజల వలె నలిగిపోతారని బాబా ఉదాహరణ ఇస్తారు. బాబా కూడా బిందువు, వారు ఆవగింజ వలె ఉంటారు. గసగసాల గింజ కూడా చిన్నదిగా ఉంటుంది. పరమాత్మ కూడా బిందువే. వారిని దివ్యదృష్టి లేకుండా చూడలేరు. పూర్తిగా చిన్నని నక్షత్రము వలె ఉంటారు. అఖండ జ్యోతి యొక్క సాక్షాత్కారము జరిగిందని గీతలో చూపించారు. కనుక ఇక్కడ కూడా అఖండ జ్యోతి సాక్షాత్కారము జరిగినప్పుడు, సాక్షాత్కారము జరిగిందని భావిస్తారు. ఒకవేళ బిందువు యొక్క సాక్షాత్కారము జరిగిందంటే, వీరు పరమాత్మ కాదు కదా అని అనుకుంటారు. అర్జునుడికి చాలా తేజోమయమైన సాక్షాత్కారము జరిగిందని గీతలో వ్రాసి ఉంది. భక్తి విషయాలు బుద్ధిలో కూర్చుని ఉన్నాయి. భక్తి మార్గానికి మరియు జ్ఞాన మార్గానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. 63 జన్మలు మనము శరీరముతో ఎంతగా నాట్యము చేస్తాము అనేది మీకు తెలుసు. 63 జన్మలు భక్తి మార్గములో ఎన్ని హంగామాలు చూస్తారు. అందులో కూడా మొదట సతోప్రధాన భక్తి ఉన్నప్పుడు, ఒక్క శివబాబాకు భక్తి చేసేవారు. ఈ గంగా స్నానాలు మొదలైనవి తర్వాత ప్రారంభమవుతాయి. ముందుగా అవ్యభిచారి భక్తి ఉంటుంది, తర్వాత అది వృద్ధి చెందుతుంది. ఇక్కడైతే పూర్తిగా సైలెన్స్ ఉంటుంది. పైసా ఖర్చు లేకుండా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మమ్మా పైసా లేకుండా వచ్చారు మరియు విశ్వ మహారాణిగా అయ్యారు. వారు చాలా సాధారణముగా ఉండేవారు. పూర్తిగా పేద ఇంటికి చెందినవారు, పైసా ఖర్చు లేకుండా ఎలా తయారవుతారో చూడండి. మమ్మా చాలా సేవ చేసేవారు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు సతోప్రధానముగా అవుతారు అని బాబా చెప్తున్నారని మమ్మా వెళ్ళి ఇతరులకు అర్థం చేయించేవారు. ఇందులో ఖర్చుకు సంబంధించిన విషయమేమీ లేదు. ఒకవేళ ఏ మాత్రము ఖర్చు చేసినా, అది మీ కోసమే చేసుకుంటారు. ఎలాగైతే పొలంలో రెండు పిడికెళ్ళ ధాన్యము వేసినట్లయితే ఎంత ధాన్యము వస్తుంది, పంట వృద్ధి చెందుతుంది, అలాగే ఇక్కడ కూడా 21 జన్మల కోసం మీకు ఎంత సంపాదన జరుగుతుంది. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడము ఎంత సహజము. ఇది ఒక్క సెకెండు యొక్క విషయము. కూర్చోవడము కూడా ఎంత సాధారణముగా కూర్చుని ఉన్నారు. ఒకవేళ ఎవరైనా కూర్చోలేకపోతే, పడుకుని అయినా (చారబడి అయినా) మురళిని వినండి అని బాబా అంటారు. ఇది ధారణకు సంబంధించిన విషయము. లోలోపల బాబాను మరియు చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి చేస్తూ-చేస్తూనే శరీరాన్ని విడిచిపెట్టాలి. అంతేకానీ నోటిలో గంగా జలం పోసే విషయమేమీ లేదు. మీరు ఈ నియమము తప్పినా, భక్తి చేయకపోయినా ఇలా జరుగుతుందని గురువులు, సత్పురుషులు చాలా భయపెడతారు. ఎవరిదైనా కాలు విరిగినా లేక ఏదైనా నష్టము కలిగినా, మీరు భక్తిని వదిలేశారు, దానికి ప్రతిఫలం ఇది అని అంటారు, అప్పుడు వారు చాలా భయపడతారు. ఇక్కడైతే ఏమీ చేయాల్సిన అవసరము లేదు. బాబా స్మృతిని ఇప్పించాలి, సృష్టి చక్రము యొక్క రహస్యాన్ని అర్థం చేయించాలి. ఇప్పుడు కలియుగము తర్వాత సత్యయుగము రానున్నది. వినాశనము తప్పకుండా జరగనున్నది, అందుకే ఈ మహాభారీ యుద్ధము ఉంది. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించి నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారు. ఇది రాజయోగము, అంతేకానీ ప్రజాయోగము కాదు. శుభమే మాట్లాడాలి. పిల్లలు చాలా మధురముగా తయారవ్వాలి. బాబా మధురమైనవారు కదా. క్రోధము మొదలైనవన్నీ దానముగా తీసుకుంటారు. తండ్రి అంటారు - నేను ప్రేమ సాగరుడను, మీరు కూడా అలా అవ్వండి. తండ్రి చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. లేదంటే పిల్లలు చాలా హంగామా చేస్తారు. ఎందుకంటే మాయ బుద్ధిని పాడు చేస్తుంది. అందుకే, ఎప్పుడూ ఎవ్వరినీ ఏమీ అనకూడదు, ప్రేమగా అర్థం చేయించాలి అనే ఆలోచన కలుగుతుంది. కన్నెర్ర చేయడము, వేడెక్కడము, గట్టిగా మాట్లాడడము - వీటి అవసరము లేదు, ఇలా చేస్తే పని పాడైపోతుంది. శాంతిగా ఉండడము మంచిది. వికారాలను దానమిచ్చి మళ్ళీ తీసుకున్నారంటే, తమ పదవిని కోల్పోతారు. బాబాకు చెందినవారిగా అయ్యారంటే 5 వికారాలను దానమిచ్చేసినట్లు. దానమిస్తే గ్రహణము తొలగిపోతుందని అంటారు. ఎంతైనా తండ్రి పండా కదా. పండాలలో కొందరు బ్రాహ్మణులు ఉంటారు. శివబాబా కూడా ఆత్మిక పండా. మీరు కూడా పండాలు. బాబా బ్రహ్మా తనువులోకి వస్తారు కనుక వీరు కూడా బ్రాహ్మణుడు అయినట్లు. బాబా వీరిలో కూర్చుని ఉన్నారు. నీవే తల్లివి తండ్రివి... అని వారి మహిమను చేస్తారు. ఇంకెవ్వరికీ ఈ మహిమ ఉండదు. వారి కర్తవ్యము కూడా అలాంటిదే. ఇది పాఠశాల. తండ్రి చదివిస్తున్నారు. ఇది పిల్లలకు గుర్తుండాలి. విశ్వ రాజ్యాధికారాన్ని పొందడమే లక్ష్యము-ఉద్దేశ్యము. ఇలా చదివించేవారిని పూర్తిగా స్మృతి చేయాలి. స్కూలులో విద్యార్థులు బాగా పాస్ అయ్యారంటే, ప్రతి సంవత్సరము టీచరుకు కానుకలు పంపిస్తూ ఉంటారు. ఈ పండుగలు మొదలైనవన్నీ ఈ సమయానికి చెందినవే, కానీ వీటి మహత్వము గురించి ఎవ్వరికీ తెలియదు.

బాబా నాలెడ్జ్ ఫుల్. వారు రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇచ్చేందుకే వస్తారు. రాయి-రప్పలలో ఎలా వస్తారు? ప్రతి వస్తువులోనూ ఆత్మ ఉందని ఒక డాక్టరు ఋజువు చేసారు. అతను పరమాత్మ ఉన్నారని అనలేదు. మరి పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు. ఆ డాక్టరు అందరిలోనూ ఆత్మ ఉందని చెప్పారు, సన్యాసులేమో అందరిలోనూ పరమాత్మ ఉన్నారని చెప్పారు. ఎంతగా రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారైతే అనంతమైన తండ్రి. అందరి నుండి బుద్ధియోగాన్ని తెంచి తమతో జోడించుకుంటారు. ఆత్మ బుడగ వంటిదని, సాగరము నుండి వెలువడింది, సాగరములోనే లీనమవుతుందని వారంటారు. బ్రహ్మ జ్ఞానులు - చిన్న జ్యోతి, పెద్ద జ్యోతిలో లీనమవుతుందని, మళ్ళీ కొత్తగా ఉత్పత్తి జరుగుతుందని భావిస్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు - ఈ భక్తి కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. నేను కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నదాని అనుసారముగా వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. 84 జన్మల చక్రములో తిరగడము కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఏదైతే జరుగుతుందో, అంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. కొందరు మహిమ కూడా చేస్తారు, కొందరు విఘ్నాలను కూడా కలిగిస్తారు.

పిల్లలైన మీరు శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. వారు ఆత్మలందరినీ తీసుకువెళ్ళేందుకే వస్తారు. శరీరము యొక్క పేరు కూడా తీసుకోరు. నేను శరీర సహితముగా తీసుకువెళ్ళేందుకేమీ రాలేదు. నన్ను - ఓ ముక్తిదాత రండి, మమ్మల్ని దుఃఖము నుండి విముక్తులుగా చేసి ప్రశాంతత, సుఖ-శాంతులను పొందే చోటుకు తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. అందరి శరీరాలను ఇక్కడే విడిపించి ఆత్మలను తీసుకువెళ్తాను. కనుక కాలుడికే కాలుడు అయినట్లు కదా. నేను అందరినీ ఒకేసారి తీసుకువెళ్తాను. ఎంత అద్భుతమైన విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎక్కడైనా, ఏదైనా విషయము అర్థం కాకపోతే, ఆ విషయాన్ని బాబా మాకు ఇంకా అర్థం చేయించలేదని చెప్పండి. వారు అర్థం చేయించినప్పుడు మీకు వినిపిస్తామని చెప్పి, ఈ విధముగా మిమ్మల్ని మీరు విడిపించుకోవాలి. బాబా జ్ఞానసాగరుడని, కొత్త-కొత్త విషయాలను వినిపిస్తూ ఉంటారని పిల్లలకు తెలుసు. ఈ ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాలను వినిపించేవారు రచయిత అయిన తండ్రి, వారు ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. మీరు లైట్ హౌస్ లు కూడా, స్వదర్శన చక్రధారులు కూడా. కానీ మాయ మరపింపజేస్తుంది, గుటకలు మింగుతారు. ఏదో ఒక ప్రభావము పడుతుంది. కర్మల లెక్కాచారముంది కదా. ఎప్పటివరకైతే కర్మాతీత అవస్థ తయారవ్వదో, అప్పటివరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. లెక్కాచారము పూర్తవ్వగానే శరీరాన్ని వదిలేస్తారు, యుద్ధము ప్రారంభమవుతుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వికారాలను దానమిచ్చి తిరిగి తీసుకోకూడదు. నోటి ద్వారా శుభమే మాట్లాడాలి, చాలా మధురముగా అవ్వాలి. తండ్రి సమానముగా ప్రేమసాగరులుగా అయి ఉండాలి.

2. సైలెన్స్ లో ఉంటూ పైసా ఖర్చు లేకుండా విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. తండ్రి స్మృతిలో ఉంటూ, కొద్దిగా ఖర్చు చేసి 21 జన్మలకు సంపాదన చేసుకోవాలి.

వరదానము:-
త్రికాలదర్శి స్థితి ద్వారా మాయ దాడి నుండి సురక్షితముగా ఉండే అతీంద్రియ సుఖము యొక్క అధికారీ భవ

సంగమయుగము యొక్క విశేష వరదానము మరియు బ్రాహ్మణ జీవితము యొక్క విశేషత - అతీంద్రియ సుఖము. ఈ అనుభవము ఇంకే యుగములోనూ కలగదు. కానీ ఈ సుఖాన్ని అనుభవం చేయడానికి త్రికాలదర్శి స్థితి ద్వారా మాయ దాడి నుండి సురక్షితముగా ఉండండి. ఒకవేళ పదే-పదే మాయ దాడి జరుగుతూ ఉన్నట్లయితే, కావాలనుకున్నా కానీ అతీంద్రియ సుఖాన్ని అనుభవము చేయలేరు. ఎవరైతే అతీంద్రియ సుఖాన్ని అనుభవము చేస్తారో, వారిని ఇంద్రియ సుఖాలు ఆకర్షించలేవు, నాలెడ్జ్ ఫుల్ గా ఉన్న కారణముగా దాని ఎదురుగా ఇంద్రియ సుఖాలు తుచ్ఛమైనవిగా కనిపిస్తాయి.

స్లోగన్:-
కర్మణా సేవ మరియు మనసా సేవ, ఈ రెండు సేవల బ్యాలెన్స్ ఉన్నట్లయితే శక్తిశాలి వాయుమండలాన్ని తయారుచేయగలరు.

అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి

ఎలా ఉన్నా, ఎదురుగా ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఆ పరిస్థితులలో ఉంటూనే ఈ శరీరములో ఉంటూ ఉండగానే నేను సంపూర్ణముగా అవ్వాలి - ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి. మీ సంగమయుగీ సంపూర్ణ రూపము శక్తులు మరియు పాండవుల రూపములో గాయనము చేయబడింది. ఎప్పుడైతే ఈ స్వరూపములో స్థితులవుతారో అప్పుడు మన భక్తులు ఎవరు మరియు ప్రజలు ఎవరు అన్నది తెలుస్తుంది. ఎవరైతే ప్రజలు ఉంటారో, వారు సమీపముగా వస్తారు మరియు ఎవరైతే భక్తులు ఉంటారో, వారు చివరిలో చరణాలపై పడతారు.