06-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ ఒక్కొక్క మాట చాలా మధురముగా, ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. తండ్రి ఏ విధముగా దుఃఖహర్త, సుఖకర్తగా ఉన్నారో, అలా తండ్రి సమానముగా అందరికీ సుఖాన్ని ఇవ్వండి’’

ప్రశ్న:-
లౌకిక మిత్ర-సంబంధీకులకు జ్ఞానాన్ని ఇచ్చేందుకు యుక్తి ఏమిటి?

జవాబు:-
ఎవరైనా మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఉంటే వారితో చాలా నమ్రతతో, ప్రేమ భావముతో, చిరునవ్వుతో మాట్లాడాలి. వారికి ఇలా అర్థం చేయించాలి - ఇది ఆ మహాభారత యుద్ధమే, తండ్రి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు, నేను మీకు నిజం చెప్తున్నాను, భక్తి మొదలైనవైతే జన్మ-జన్మాంతరాలూ చేసాము, ఇప్పుడు జ్ఞానము ప్రారంభమవుతుంది. అవకాశము దొరికినప్పుడు చాలా యుక్తిగా మాట్లాడండి. కుటుంబ, పరివారముతో చాలా ప్రేమగా నడుచుకోండి. ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి.

పాట:-
ఆఖరికి ఆ రోజు నేడు రానే వచ్చింది...

ఓంశాంతి
ఎప్పుడైనా ఏదైనా పాట మ్రోగితే పిల్లలు లోలోపల దాని అర్థాన్ని వెలికి తీయాలి. క్షణములో ఆ అర్థము తెలుసుకోవచ్చు. ఇది అనంతమైన డ్రామా యొక్క చాలా పెద్ద గడియారము కదా. భక్తి మార్గములో మనుష్యులు పిలుస్తారు కూడా. ఏ విధముగానైతే కోర్టులో కేసు వేసినప్పుడు, న్యాయ విచారణ ఎప్పుడు జరుగుతుంది, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు, మా కేసు ఎప్పుడు పూర్తి అవుతుంది అని అంటారు కదా, అలా పిల్లలది కూడా కేసు, ఎటువంటి కేసు? రావణుడు మిమ్మల్ని చాలా దుఃఖితులుగా చేసాడు. మీ కేసు పెద్ద కోర్టులో నమోదు చేయబడుతుంది. మనుష్యులు పిలుస్తూ ఉంటారు - బాబా రండి, మీరు వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి విడిపించండి అని. ఒకానొక రోజు తప్పకుండా ఈ కేసు విచారణ జరుగుతుంది. తండ్రి కేసు వింటారు కూడా, డ్రామా అనుసారముగా వస్తారు కూడా, ఖచ్చితమైన సమయానికి వస్తారు. ఇందులో ఒక్క క్షణము కూడా తేడా రాదు. అనంతమైన గడియారము ఎంత ఏక్యురేట్ గా నడుస్తుంది. ఇక్కడ మీ వద్ద ఉన్న ఈ చిన్న గడియారాలు కూడా ఏక్యురేట్ గా నడవవు. యజ్ఞములోని ప్రతి కార్యమూ ఏక్యురేట్ గా జరగాలి. గడియారము కూడా ఏక్యురేట్ గా ఉండాలి. తండ్రి అయితే చాలా ఏక్యురేట్ గా ఉంటారు. తండ్రి ద్వారా కేసు విచారణ చాలా ఏక్యురేట్ గా జరుగుతుంది. కల్ప-కల్పమూ కల్పము యొక్క సంగమములో ఏక్యురేట్ సమయములో వస్తారు. కావున పిల్లల కేసు ఇప్పుడు విచారణ జరిగింది, బాబా వచ్చి ఉన్నారు. ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయిస్తారు. దుఃఖాన్ని ఎవరు ఇస్తారు అనేది ఇంతకుముందు మీకు కూడా అర్థమయ్యేది కాదు. రావణ రాజ్యము ద్వాపరము నుండి ప్రారంభమవుతుంది అని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. బాబా కల్ప-కల్పమూ సంగమయుగములో వస్తారని పిల్లలైన మీకు తెలిసిపోయింది. ఇది అనంతమైన రాత్రి. శివబాబా అనంతమైన రాత్రిలో వస్తారు, ఇది శ్రీకృష్ణుడి విషయము కాదు. ఎప్పుడైతే ఘోర అంధకారములో అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉంటారో అప్పుడు జ్ఞాన సాగరుడైన తండ్రి పిల్లలను పగలులోకి తీసుకెళ్ళడానికి వస్తారు. నన్ను స్మృతి చేయండి ఎందుకంటే పతితము నుండి పావనముగా తయారుకావాలి అని అంటారు. తండ్రియే పతిత-పావనుడు. వారు ఎప్పుడైతే వస్తారో, అప్పుడే కేసు విచారణ జరుగుతుంది. ఇప్పుడు మీ కేసు విచారణ జరిగింది. తండ్రి అంటారు, నేను పతితులను పావనముగా తయారుచేయడానికి వచ్చాను. పావనముగా అయ్యేందుకు మీకు ఎంత సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తాను. ఈ రోజుల్లో సైన్సు ప్రభావము ఎంత ఉందో చూడండి. అణుబాంబులు మొదలైనవాటి శబ్దము ఎంత ఎక్కువ ఉంటుంది. పిల్లలైన మీరు సైలెన్సు బలముతో ఈ సైన్సుపై విజయం పొందుతారు. సైలెన్సును యోగము అని కూడా అంటారు. బాబా, మీరు వచ్చినట్లయితే మేము శాంతిధామములోకి వెళ్ళి నివసిస్తాము అని ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. కావున పిల్లలైన మీరు ఈ యోగబలము ద్వారా, సైలెన్సు బలము ద్వారా సైన్సుపై విజయము పొందుతారు, శాంతి బలాన్ని ప్రాప్తి చేసుకుంటారు. సైన్సు ద్వారానే ఇదంతా వినాశనము అయ్యేది ఉంది. సైలెన్సు ద్వారా పిల్లలైన మీరు విజయాన్ని పొందుతారు. బాహుబలమువారు ఎన్నటికి విశ్వముపై విజయము పొందలేరు. ఈ పాయింట్లు కూడా మీరు ప్రదర్శనీలో వ్రాయాలి.

ఢిల్లీలో చాలా సేవ జరగగలదు ఎందుకంటే ఢిల్లీ అన్నింటికీ రాజధాని. మీకు కూడా ఢిల్లీయే రాజధాని అవుతుంది. ఢిల్లీనే పరిస్తాన్ అని అంటారు. పాండవులకు కోట అయితే ఉండదు. శత్రువులు దాడి చేసినప్పుడు కోట నిర్మించడం జరుగుతుంది. మీకైతే కోటలు మొదలైనవాటి అవసరముండదు. మనము సైలెన్సు బలముతో మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని మీకు తెలుసు. వారిది ఆర్టిఫిషియల్ సైలెన్సు. మీది రియల్ సైలెన్సు. జ్ఞాన బలము, శాంతి బలము అని అంటారు. జ్ఞానము చదువు. చదువు ద్వారానే బలము లభిస్తుంది. పోలీసు సూపరింటెండెంట్ గా అవుతారు, ఎంత బలము ఉంటుంది. అవన్నీ దుఃఖాన్నిచ్చే భౌతిక విషయాలు. మీ ప్రతి విషయము ఆత్మికమైనది. మీ నోటి నుండి ఏయే మాటలైతే వెలువడుతాయో, ఆ ఒక్కొక్క మాట ఎంత ఫస్ట్ క్లాస్ గా, మధురముగా ఉండాలంటే, వాటిని వినేవారు సంతోషించాలి. ఏ విధముగా తండ్రి దుఃఖహర్త, సుఖకర్తనో, అలా పిల్లలైన మీరు కూడా అందరికీ సుఖాన్నివ్వాలి. కుటుంబ, పరివారానికి కూడా దుఃఖము ఇవ్వకూడదు. నియమానుసారముగా అందరితో వ్యవహరించాలి. పెద్దవారితో ప్రేమగా వ్యవహరించాలి. నోటి నుండి ఎటువంటి ఫస్ట్ క్లాస్, మధురమైన మాటలు వెలుడాలంటే, ఇక అందరూ సంతోషించాలి. శివబాబా చెప్తున్నారని ఇలా చెప్పండి - మన్మనాభవ, ఉన్నతోన్నతమైనవాడిని నేను, నన్ను స్మృతి చేయడము ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి. చాలా ప్రేమతో మాట్లాడాలి. ఎవరైనా పెద్ద అన్నయ్య ఉన్నట్లయితే వారికి చెప్పండి - దాదాజీ, శివబాబా చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. శివబాబాను రుద్రుడు అని కూడా అంటారు, వారే జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. శ్రీకృష్ణ జ్ఞాన యజ్ఞము అన్న మాట ఎక్కడా అనరు. రుద్ర జ్ఞాన యజ్ఞము అని అంటారు అనగా రుద్రుడైన శివబాబా ఈ జ్ఞానాన్ని రచించారు. రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞాన-యోగాలను నేర్పిస్తున్నారు. తండ్రి అంటారు, భగవానువాచ, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇది అందరి అంతిమ ఘడియ, వానప్రస్థ అవస్థ. అందరూ తిరిగి వెళ్ళేది ఉంది. చనిపోయే సమయములో మనుష్యులకు - ఈశ్వరుడిని స్మృతి చేయండి అని చెప్తారు కదా. మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని, దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరని ఇక్కడ ఈశ్వరుడు స్వయం చెప్తున్నారు. అంతిమములోనే తండ్రి వచ్చి చెప్తున్నారు - పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి, దీనిని స్మృతి అగ్ని అని అంటారు. తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు - దీని ద్వారా మీ పాపాలు దగ్ధమైపోతాయి. వికర్మలు వినాశనమయ్యేందుకు, పావనముగా అయ్యేందుకు వేరే ఏ ఉపాయమూ లేదు. పాపాల భారము శిరస్సుపై పెరుగుతూ, పెరుగుతూ, మాలిన్యము కలుస్తూ, కలుస్తూ, బంగారము 9 క్యారెట్లదిగా అయిపోయింది. 9 క్యారెట్ల తర్వాత ఇక దానిని గిల్టు బంగారము అని అంటారు. ఇపుడు మళ్ళీ 24 క్యారెట్లుగా ఎలా తయారవ్వాలి, ఆత్మ పవిత్రముగా ఎలా తయారవ్వాలి? పవిత్ర ఆత్మకు శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది.

మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఎవరైనా ఉంటే, వారితో చాలా నమ్రతతో, ప్రేమ భావముతో, చిరునవ్వుతో మాట్లాడాలి. వారికి ఇలా అర్థం చేయించాలి - ఇది అదే మహాభారత యుద్ధము, ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము కూడా, తండ్రి ద్వారా మాకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము లభిస్తూ ఉంది, ఇంకెక్కడా ఈ జ్ఞానము లభించదు, నేను మీకు సత్యము చెప్తున్నాను, ఈ భక్తి మొదలైనవైతే జన్మ-జన్మాంతరాలూ చేసాము, ఇప్పుడు జ్ఞానము మొదలవుతుంది, భక్తి రాత్రి, జ్ఞానము పగలు, సత్యయుగములో భక్తి ఉండదు - ఇలా, ఇలా యుక్తిగా మాట్లాడాలి. ఎప్పుడైనా ఏదైనా అవకాశము లభిస్తే, బాణము వేయవలసి వస్తే, సమయాన్ని మరియు అవకాశాన్ని చూడడం జరుగుతుంది. జ్ఞానాన్ని ఇవ్వడానికి కూడా చాలా యుక్తి కావాలి. తండ్రి యుక్తులనైతే అందరి కొరకు తెలియజేస్తూ ఉంటారు. పవిత్రత అయితే చాలా మంచిది. ఈ లక్ష్మీ-నారాయణులు మనకు ఎంతో పూజ్యులు కదా. పూజ్యులుగా, పావనులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా, పతితులుగా అయ్యారు. పావనమైనవారిని పతితులు కూర్చుని పూజ చేయడమనేది శోభించదు. కొందరైతే పతితుల నుండి దూరముగా పారిపోతారు. వల్లభాచార్యులు ఎప్పుడూ పాదాలను కూడా ముట్టుకోనివ్వరు. వీరు ఛీ-ఛీ మనుష్యులు అని భావిస్తారు. మందిరాలలో కూడా ఎప్పుడూ బ్రాహ్మణులనే విగ్రహము ముట్టుకునేందుకు అనుమతిస్తారు. శూద్రులైన మనుష్యులు లోపలికి వెళ్ళి ముట్టుకోలేరు. అక్కడ బ్రాహ్మణులే విగ్రహానికి స్నానము మొదలైనవి చేయిస్తుంటారు, ఇంకెవ్వరినీ వెళ్ళనివ్వరు. తేడా అయితే ఉంది కదా. వారేమో కుఖవంశావళి బ్రాహ్మణులు, మీరు ముఖవంశావళి సత్యమైన బ్రాహ్మణులు. మీరు ఆ బ్రాహ్మణులకు ఈ విషయాన్ని బాగా అర్థం చేయించవచ్చు - బ్రాహ్మణులు రెండు రకాలవారు ఉంటారు, ఒకరు ప్రజాపిత బ్రహ్మా ముఖవంశావళి, రెండవవారు కుఖ వంశావళి. బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులు ఉన్నతోన్నతమైన పిలక వంటివారు. యజ్ఞము రచించేటప్పుడు కూడా బ్రాహ్మణులను నియమించడం జరుగుతుంది. ఇది జ్ఞాన యజ్ఞము. బ్రాహ్మణులకు జ్ఞానము లభిస్తుంది, వారే తర్వాత దేవతలుగా అవుతారు. వర్ణాలు కూడా అర్థం చేయించడం జరిగింది. సేవాధారీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారికి సేవా అభిరుచి సదా ఉంటుంది. ఎక్కడైనా ప్రదర్శని జరిగితే వెంటనే - నేను వెళ్ళి ఇలాంటి, ఇలాంటి పాయింట్లు అర్థం చేయించాలి అని సేవ చేయడం కోసం పరుగు పెడతారు. ప్రదర్శని అనేది ప్రజలను తయారుచేసేందుకు విహంగ మార్గపు సేవ వంటిది, తమంతట తామే ఎంతోమంది వచ్చేస్తారు. కావున అర్థం చేయించేవారు కూడా బాగుండాలి. ఒకవేళ ఎవరైనా పూర్తిగా అర్థం చేయించకపోతే బి.కె.ల వద్ద ఉన్న జ్ఞానము ఇదేనా అని అంటారు! డిస్సర్వీస్ జరుగుతుంది. ప్రదర్శనీలో చురుకుగా ఉండేవారు ఒకరు ఉండాలి, వారు అర్థం చేయించే గైడ్స్ ను చూస్తూ ఉండాలి. ఎవరైనా పెద్ద మనిషి వస్తే అతనికి అర్థం చేయించడానికి కూడా మంచివారినే ఇవ్వాలి. తక్కువగా అర్థం చేయించేవారిని తొలగించివేయాలి. సూపర్వైజ్ చేయడానికి ఒక మంచి వ్యక్తి ఉండాలి. మీరైతే మహాత్ములను కూడా పిలవాలి. మీరు కేవలం, బాబా ఇలా అంటారు అని చెప్తారు. వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు, వారే రచయిత అయిన తండ్రి. మిగిలినదంతా వారి రచన. వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది, సోదరులు సోదరులకు వారసత్వాన్ని ఏమి ఇస్తారు! సుఖధామము యొక్క వారసత్వాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. వారసత్వాన్ని ఇచ్చేది తండ్రే. సర్వులకు సద్గతిని ఇచ్చేది ఒక్క తండ్రియే, వారిని స్మృతి చెయ్యాలి. తండ్రి స్వయంగా వచ్చి స్వర్ణిమ యుగాన్ని తయారుచేస్తారు. బ్రహ్మా తనువు ద్వారా స్వర్గాన్ని స్థాపన చేస్తారు. శివజయంతిని జరుపుకుంటారు కూడా, కానీ వారు ఏం చేస్తారు, ఇదంతా మనుష్యులు మర్చిపోయారు. శివబాబాయే వచ్చి రాజయోగాన్ని నేర్పించి వారసత్వాన్ని ఇస్తారు. 5000 సంవత్సరాల ముందు భారత్ స్వర్గముగా ఉండేది, లక్షల సంవత్సరాల విషయమే లేదు. తిథి, తారీఖు అన్నీ ఉన్నాయి, వీటిని ఎవ్వరూ ఖండించలేరు. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము సగం-సగం ఉండాలి. వారు సత్యయుగ ఆయువును లక్షల సంవత్సరాలు అని అనేస్తే ఇక లెక్క తీయలేము. స్వస్తిక్ లో కూడా నాలుగు భాగాలు పూర్తిగా ఉన్నాయి. 1250 సంవత్సరాలు ప్రతి యుగానికి పంచడం జరిగింది. లెక్క వేయడం జరుగుతుంది కదా. ఆ మనుష్యులకు ఈ లెక్కలేమీ తెలియవు, అందుకే వారిని గవ్వతుల్యమైనవారు అని అనడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి వజ్రతుల్యముగా తయారుచేస్తారు. అందరూ పతితులే, భగవంతుడి స్మృతి చేస్తారు, వారిని భగవంతుడే వచ్చి జ్ఞానము ద్వారా పుష్పాలుగా తయారుచేస్తారు. పిల్లలైన మిమ్మల్ని జ్ఞాన రత్నాలతో అలంకరిస్తూ ఉంటారు. ఆ తర్వాత మీరు ఎలా తయారవుతారో చూడండి. మీ లక్ష్యము-ఉద్దేశ్యము ఏమిటి? భారత్ ఎంత శిరోకిరీటముగా ఉండేది, అంతా మర్చిపోయారు. ముసల్మానులు మొదలైనవారు కూడా సోమనాథ మందిరము నుండి ఎంతగా దోచుకుని వెళ్ళి మసీదులు మొదలైన చోట్ల వజ్రాలు మొదలైనవాటిని అలంకరించుకున్నారు. ఇప్పుడు వాటి విలువను కూడా ఎవ్వరూ వెల కట్టలేరు. అంత పెద్ద-పెద్ద మణులు రాజుల కిరీటాలలో ఉండేవి. కొన్ని కోటి రూపాయలు విలువ కలవి, కొన్ని 5 కోట్ల విలువ కలవి. ఈ రోజుల్లోనైతే అన్నీ ఇమిటేషన్ వే తయారవుతున్నాయి. ఈ ప్రపంచములో అంతా కృత్రిమమైన పైసకు విలువ చేసే సుఖము. మిగిలినదంతా దుఃఖము. అందుకే సన్యాసులు కూడా కాకిరెట్టతో సమానమైన సుఖము అని అంటారు, అందుకే వారు ఇళ్ళు-వాకిళ్ళను వదిలేస్తారు, కానీ ఇప్పుడు వారు కూడా తమోప్రధానముగా అయిపోయారు. నగరాలలోకి వచ్చేసారు. కానీ ఇప్పుడు ఎవరికి వినిపించాలి, రాజు రాణి అయితే ఎవరూ లేరు, ఎవ్వరూ అంగీకరించరు. ప్రతి ఒక్కరికి తమ-తమ మతాలు ఉన్నాయి, ఎలా కావాలంటే అలా చేసుకుంటారు, ఇది సంకల్పము యొక్క సృష్టి అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీ చేత తండ్రి గుప్త రీతిలో పురుషార్థము చేయిస్తున్నారు. మీరు ఎంత సుఖము అనుభవిస్తారు. ఇతర ధర్మాలు కూడా అంతిమములో ఎప్పుడైతే వృద్ధి చెందుతాయో అప్పుడు యుద్ధాలు, గొడవలు మొదలైనవి జరుగుతాయి. మూడు వంతుల సమయమైతే సుఖములో ఉంటారు. అందుకే తండ్రి అంటారు, మీ దేవీ-దేవతా ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటువంటిది. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తాను. ఇతర ధర్మస్థాపకులేమీ రాజ్యాన్ని స్థాపించరు. వారు సద్గతిని ఇవ్వలేరు. కేవలం తమ ధర్మాన్ని స్థాపన చేసుకునేందుకే వస్తారు. వారు కూడా ఎప్పుడైతే అంతిమములో తమోప్రధానముగా అయిపోతారో, అప్పుడు మళ్ళీ సతోప్రధానముగా తయారుచేయడానికి తండ్రి రావలసి ఉంటుంది.

మీ వద్దకు వందలాదిమంది మనుష్యులు వస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఫలానావారు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు, వారు చాలా బాగున్నారు అని బాబాకు వ్రాస్తారు. బాబా అంటారు, ఏమీ అర్థం చేసుకోలేదు. బాబా వచ్చి ఉన్నారని, వారు విశ్వాధిపతులుగా తయారుచేస్తున్నారని ఒకవేళ అర్థం చేసుకున్నట్లయితే ఇక అదే సమయములో నషా ఎక్కిపోతుంది. వెంటనే టికెట్ తీసుకుని ఇక్కడ పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ తండ్రిని కలుసుకునేందుకు బ్రాహ్మణి నుండి ఉత్తరాన్ని తప్పనిసరిగా తీసుకురావలసి ఉంటుంది. తండ్రిని గుర్తించినట్లయితే ఇక కలుసుకోకుండా ఉండలేరు. ఒక్కసారిగా నషా ఎక్కిపోతుంది. ఎవరికైతే నషా ఎక్కి ఉంటుందో వారికి లోలోపల చాలా సంతోషము ఉంటుంది. వారి బుద్ధి మిత్ర-సంబంధీకుల చుట్టూ తిరగదు. కానీ చాలామంది బుద్ధి తిరుగుతూ ఉంటుంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా తయారవ్వాలి మరియు తండ్రి స్మృతిలో ఉండాలి. వాస్తవానికి ఇది చాలా సహజము. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఏ విధముగా ఆఫీసు నుండి సెలవు తీసుకుంటారో, అలా వ్యాపారము నుండి సెలవు తీసుకుని ఒకటి-రెండు రోజులు స్మృతియాత్రలో కూర్చోండి. ఘడియ-ఘడియ స్మృతిలో కూర్చునేందుకు, రోజంతా తండ్రిని స్మృతి చెయ్యాలి అనే వ్రతాన్ని పెట్టుకుంటాను అని అనుకోండి. అప్పుడు ఎంత జమ అయిపోతుంది. వికర్మలు కూడా వినాశనమవుతాయి. తండ్రి స్మృతి ద్వారానే సతోప్రధానముగా అవ్వాలి. ఎవరికీ పూర్తి రోజంతా స్మృతి కుదరదు. మాయ విఘ్నాలను తప్పకుండా వేస్తుంది. అయినా కూడా పురుషార్థము చేస్తూ-చేస్తూ విజయము పొంది తీరుతారు. ఈ రోజంతా తోటలో కూర్చుని తండ్రిని స్మృతి చేస్తాను. భోజనము చేసేటప్పుడు కూడా కేవలం స్మృతిలో కూర్చుండిపోతాను. ఈ విషయములోనే శ్రమించాల్సి ఉంటుంది. మనము పావనముగా తప్పకుండా అవ్వాలి. శ్రమించాలి, ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయాలి. బ్యాడ్జి అయితే చాలా మంచి వస్తువు. ప్రయాణములో కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే చాలామంది వచ్చి వింటారు. నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు అన్న ఈ సందేశము లభించిందంటే ఇక మన బాధ్యత పూర్తి అవుతుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వ్యాపార-వ్యవహారాల నుండి సెలవు దొరికినప్పుడు స్మృతిలో ఉండే వ్రతాన్ని తీసుకోవాలి. మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకునేందుకు స్మృతిలో ఉండే కృషి చెయ్యాలి.

2. చాలా నమ్రతతో మరియు ప్రేమ భావముతో, చిరునవ్వుతో మిత్ర-సంబంధీకుల సేవ చేయాలి. వారిలో బుద్ధిని భ్రమించనివ్వకూడదు. ప్రేమతో తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి.

వరదానము:-
నడుస్తూ-తిరుగుతూ ఫరిశ్తా స్వరూపపు సాక్షాత్కారము చేయించే సాక్షాత్కారమూర్త భవ

ఏ విధంగా ప్రారంభములో నడుస్తూ-తిరుగుతూ బ్రహ్మా మాయమై శ్రీకృష్ణుడు కనిపించేవారు, ఈ సాక్షాత్కారము అన్నింటినీ వదిలేలా చేసింది. అటువంటి సాక్షాత్కారాల ద్వారా ఇప్పుడు కూడా సేవ జరగాలి. ఎప్పుడైతే సాక్షాత్కారాల ద్వారా ప్రాప్తి లభిస్తుందో, అప్పుడు అలా అవ్వకుండా ఉండలేరు, అందుకే నడుస్తూ-తిరుగుతూ ఫరిశ్తా స్వరూపాన్ని సాక్షాత్కారము చేయించండి. భాషణ చేసేవారు చాలామంది ఉన్నారు కానీ మీరు అనుభవాన్ని ఇచ్చేవారిగా అవ్వండి - అప్పుడు వీరు భగవంతునికి చెందినవారు అని భావిస్తారు.

స్లోగన్:-
సదా ఆత్మిక ఆనందాన్ని అనుభవము చేస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ తికమక చెందరు.

మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ ఇచ్చే సేవ చెయ్యండి

ఇప్పుడు మీ హృదయములోని శుభ భావనలు ఇతర ఆత్మల వరకు చేర్చండి. సైలెన్స్ శక్తిని ప్రత్యక్షము చెయ్యండి. బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరిలో ఈ సైలెన్స్ శక్తి ఉంది. కేవలము ఈ శక్తిని మనసు ద్వారా, తనువు ద్వారా ఇమర్జ్ చెయ్యండి. ఒక్క క్షణములో మనసులోని సంకల్పాలను ఏకాగ్రము చేసినట్లయితే వాయుమండలములో సైలెన్స్ శక్తి యొక్క ప్రకంపనాలు స్వతహాగా వ్యాపిస్తూ ఉంటాయి.