06-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - సత్యమైన ముక్తిదళముగా అయి అందరినీ ఈ
పాపపు ప్రపంచము నుండి పుణ్యము యొక్క ప్రపంచములోకి తీసుకువెళ్ళాలి, అందరి మునిగి
ఉన్న నావలను తీరానికి చేర్చాలి’’
ప్రశ్న:-
ఏ
నిశ్చయము పిల్లలు ప్రతి ఒక్కరి బుద్ధిలో నంబరువారుగా కూర్చుంటుంది?
జవాబు:-
పతిత-పావనుడైన
మన అత్యంత ప్రియమైన బాబా, మనకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు, ఈ నిశ్చయము ప్రతి
ఒక్కరి బుద్ధిలో నంబరువారుగా కూర్చుంటుంది. ఒకవేళ ఎవరికైనా పూర్తి నిశ్చయము ఏర్పడినా
కానీ, మాయ ఎదురుగా నిలబడి ఉంది. తండ్రిని మర్చిపోతారు, ఫెయిల్ అయిపోతారు. ఎవరికైతే
నిశ్చయము కూర్చుంటుందో, వారు పావనముగా అయ్యే పురుషార్థములో నిమగ్నమైపోతారు. ఇప్పుడు
ఇక ఇంటికి వెళ్ళాలి అని వారి బుద్ధిలో ఉంటుంది.
ఓంశాంతి
మధురాతి మధురమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలకు గుడ్ మార్నింగ్. పిల్లలకు
ఇదైతే తెలుసు - సత్యయుగములో సదా గుడ్ మార్నింగ్, గుడ్ డే, గుడ్ ఎవ్రీథింగ్, గుడ్
నైట్ అంతా గుడ్ గానే (మంచిగా) ఉంటుంది. ఇక్కడైతే గుడ్ మార్నింగ్ కూడా లేదు, గుడ్
నైట్ కూడా లేదు. అన్నింటికన్నా చెడ్డది రాత్రి. మరి అన్నింటికన్నా మంచిది ఏమిటి?
ఉదయము. దానిని అమృతవేళ అని అంటారు. మీకు ప్రతి సమయము గుడ్ గానే ఉంటుంది. ఈ సమయములో
మనము యోగ-యోగేశ్వరులము మరియు యోగ-యోగేశ్వరీలము అని పిల్లలకు తెలుసు. మీ తండ్రి అయిన
ఈశ్వరుడు వచ్చి యోగాన్ని నేర్పిస్తారు అనగా పిల్లలైన మీకు ఒక్క ఈశ్వరునితో యోగముంది.
పిల్లలైన మీరు యోగేశ్వరులుగా అయిన తర్వాత మీకు జ్ఞాన-జ్ఞానేశ్వరుడైన తండ్రి గురించి
తెలిసింది. యోగము జోడించబడిన తర్వాత తండ్రి మీకు మొత్తం చక్రము యొక్క జ్ఞానాన్ని
అర్థం చేయిస్తారు, దాని ద్వారా మీరు కూడా జ్ఞాన-జ్ఞానేశ్వరులుగా అవుతారు. ఈశ్వరుడైన
తండ్రి వచ్చి, పిల్లలకు జ్ఞానాన్ని మరియు యోగాన్ని నేర్పిస్తారు. ఏ ఈశ్వరుడు?
నిరాకార తండ్రి. ఇప్పుడు బుద్ధిని ఉపయోగించండి. గురువుల డైరెక్షన్ల అయితే
అనేకమున్నాయి. కొంతమంది శ్రీకృష్ణునితో యోగము జోడించండి అని అంటారు, ఆ చిత్రాన్ని
కూడా ఇస్తారు. ఒకరు సాయిబాబా, ఒకరు మహర్షి బాబా, ఒకరు ముస్లిమ్ ల బాబా, ఒకరు
పార్శీల బాబా, అందరినీ బాబా-బాబా అని అంటూ ఉంటారు. అందరూ భగవంతులే భగవంతులు అని
అంటారు. మనుష్యులు భగవంతుడు కాలేరని ఇప్పుడు మీకు తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణులను కూడా
భగవాన్-భగవతి అని అనలేరు. భగవంతుడైతే ఒక్క నిరాకారుడు మాత్రమే. వారు ఆత్మలైన మీ
అందరికీ తండ్రి, వారిని శివబాబా అని అంటారు. మీరే జన్మజన్మలుగా సత్సంగాలకు వెళ్తూ
వచ్చారు. ఎవరో ఒక సన్యాసి, సాధువు, పండితుడు మొదలైనవారు తప్పకుండా ఉంటారు. వీరు మన
గురువు అని, మనకు కథను వినిపిస్తున్నారని మనుష్యులకు తెలుసు. సత్యయుగములో కథలు
మొదలైనవి ఉండవు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, కేవలం భగవంతుడు లేక ఈశ్వరుడు
అని అన్నట్లయితే ఆ మాధుర్యము అనుభవమవ్వదు. వారు తండ్రి కావున బాబా అని పిలవడముతో
సంబంధం స్నేహపూర్వకము అవుతుంది. మనము బాబా, మమ్మాలకు పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు,
వారి ద్వారా మనకు స్వర్గ సుఖాలు లభిస్తాయి. మేము ఈ సత్సంగము ద్వారా మనుష్యుల నుండి
దేవతలుగా మరియు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతామని భావించే సత్సంగాలు ఏవీ ఉండవు.
ఇప్పుడు మీకు సత్యమైన తండ్రితో సాంగత్యము ఉంది, మిగిలినవారందరికీ అసత్యముతో
సాంగత్యము ఉందని అంటారు. సత్యమైన సాంగత్యము తీరానికి చేరుస్తుంది... దైహిక సాంగత్యము
ముంచేస్తుంది అని అంటూ ఉంటారు కూడా. తండ్రి అంటారు, ఆత్మాభిమానులుగా,
దేహీ-అభిమానులుగా అవ్వండి. నేను పిల్లలైన మీకు అనగా ఆత్మలకు నేర్పిస్తున్నాను. ఈ
ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మలకు సుప్రీమ్ ఆత్మ వచ్చి ఇస్తారు. మిగిలినదంతా భక్తి మార్గము.
అదేమీ జ్ఞాన మార్గము కాదు. తండ్రి అంటారు, నేను అన్ని వేదాలు, శాస్త్రాలు, సృష్టి
ఆదిమధ్యాంతాలు తెలిసినవాడిని, అథారిటీని నేనే. వాళ్ళు భక్తి మార్గము యొక్క అథారిటీ.
ఎన్నో శాస్త్రాలు మొదలైనవి చదువుతారు కనుక వారిని శాస్త్రాల అథారిటీ అని అంటారు.
మీకు తండ్రి వచ్చి సత్యాన్ని వినిపిస్తారు. సత్యమైన సాంగత్యము తీరానికి చేరుస్తుందని...
అసత్యపు సాంగత్యము ముంచేస్తుందని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీ
ద్వారా భారత్ కు ముక్తిని ఇస్తున్నారు. మీరు ఆత్మిక ముక్తిదళము, మీరు విముక్తులుగా
చేస్తారు. తండ్రి అంటారు, ఒకప్పుడు స్వర్గముగా ఉన్న భారత్ ఇప్పుడు నరకముగా
తయారయ్యింది, మునిగిపోయింది, అంతేకానీ సాగరము కింద ఉండటము అని కాదు. మీరు
సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయ్యారు. సత్య, త్రేతాయుగాలు సతోప్రధానమైనవి. ఇది
పెద్ద స్టీమరు. మీరు స్టీమరులో కూర్చున్నారు. ఇది పాపపు నగరము ఎందుకంటే అందరూ
పాపాత్ములుగా ఉన్నారు. వాస్తవానికి గురువు ఒక్కరే, వారి గురించి ఎవరికీ తెలియదు.
వారిని సదా - ఓ గాడ్ ఫాదర్ అని అంటారు, అంతేకానీ గాడ్ ఫాదర్ కమ్ ప్రిసెప్టర్ (గురువు)
అని అనరు, అలా అనరు, కేవలం ఫాదర్ అనే అంటారు. వారు పతిత-పావనుడు కావున గురువుగా కూడా
అయ్యారు. సర్వుల పతిత-పావనుడు, సద్గతిదాత ఒక్కరే. ఈ పతిత ప్రపంచములోని
మనుష్యులెవ్వరూ సద్గతిదాతగా లేక పతిత-పావనుడిగా అవ్వలేరు. తండ్రి అంటారు, ఎంత కల్తీ,
అవినీతి ఉన్నది. ఇప్పుడు నేను కన్యలు, మాతల ద్వారా అందరినీ ఉద్ధరించాలి.
బ్రహ్మాకుమార-కుమారీలైన మీరంతా సోదర-సోదరీలు అవుతారు. లేకపోతే తాతగారి వారసత్వము
ఎలా లభిస్తుంది. తాతగారి నుండి వారసత్వము 21 తరాలకు లభిస్తుంది అనగా స్వర్గ రాజ్యము
లభిస్తుంది. ఈ సంపాదన ఎంత గొప్పది. ఇది సత్యమైన తండ్రి ద్వారా కలిగే సత్యమైన సంపాదన.
తండ్రి, తండ్రి కూడా, శిక్షకుడు కూడా, సద్గురువు కూడా. బాబా ప్రాక్టికల్ గా చేసి
చూపించేవారు. అంతేకానీ గురువు మరణించినట్లయితే శిష్యులకు సింహాసనము లభిస్తుందని కాదు.
వారు దైహిక గురువు, వీరు ఆత్మిక గురువు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి, ఇవి
పూర్తిగా కొత్త విషయాలు. మనల్ని మనుష్యులెవ్వరూ చదివించడము లేదని, మనల్ని జ్ఞాన
సాగరుడు, పతిత-పావనుడైన శివబాబా ఈ శరీరము ద్వారా చదివిస్తున్నారని మీకు తెలుసు. మీ
బుద్ధి శివబాబా వైపు ఉంది, ఆ సత్సంగాలలో మనుష్యుల వైపుకు బుద్ధి వెళ్తుంది. అదంతా
భక్తి మార్గము. నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము... అని ఇప్పుడు మీరు
పాడుతారు, వారు ఒక్కరే కదా. కానీ బాబా అంటారు, నేను వచ్చి మిమ్మల్ని నా వారిగా ఎలా
చేసుకోను. నేను మీ తండ్రిని. నేను వీరి తనువును ఆధారముగా తీసుకుంటాను. కనుక వీరు (బ్రహ్మా)
నాకు పత్ని కూడా, బిడ్డ కూడా. వీరి ద్వారా శివబాబా పిల్లలను దత్తత తీసుకుంటారు
కావున వీరు పెద్ద తల్లి అయినట్లు. వీరికి తల్లి ఎవరూ లేరు. సరస్వతిని జగదంబ అని
అంటారు. మిమ్మల్ని సంభాళించేందుకని ఆమెను నియమించారు. సరస్వతి జ్ఞాన-జ్ఞానేశ్వరి,
ఆమె చిన్న తల్లి. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. మీరు ఇప్పుడు ఈ గుహ్యమైన చదువును
చదువుకుంటున్నారు, మీరు గౌరవపూర్వకముగా పాస్ అవ్వాలి. ఈ లక్ష్మీ-నారాయణులు
గౌరవపూర్వకముగా పాస్ అయ్యారు. వారికి అందరికన్నా పెద్ద స్కాలర్షిప్ లభించింది.
వారికి ఏ శిక్షలు అనుభవించవలసిన అవసరము రాలేదు. తండ్రి అంటారు, ఎంత వీలైతే అంత
స్మృతి చేయండి. దీనిని భారత యొక్క ప్రాచీన యోగమని అంటారు. తండ్రి అంటారు, మీకు అన్ని
వేద-శాస్త్రాల సారాన్ని వినిపిస్తాను. నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను, దాని
ద్వారా మీరు ప్రారబ్ధాన్ని పొందారు. ఆ తర్వాత జ్ఞానము సమాప్తమైపోయింది, అటువంటప్పుడు
పరంపరగా ఎలా నడవగలదు. అక్కడ శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. ఇస్లాములు, బౌద్ధులు
మొదలగు ఇతర ధర్మాలవారు ఎవరైతే ఉన్నారో, వారి జ్ఞానము మాయమవ్వదు, వారిది పరంపరగా
కొనసాగుతుంది, అది అందరికీ తెలుసు. కానీ తండ్రి అంటారు, నేను మీకు ఏ జ్ఞానాన్ని
అయితే వినిపిస్తానో, అది ఎవ్వరికీ తెలియదు. భారత్ దుఃఖమయముగా అయిపోతుంది, నేను వచ్చి
దానిని సదా సుఖమయముగా చేస్తాను. తండ్రి అంటారు - నేను సాధారణ తనువులో కూర్చున్నాను.
మీ బుద్ధియోగము తండ్రితో ఉండాలి. ఆత్మల తండ్రి పరమపిత పరమాత్మ. వారు పిల్లలందరికీ
తండ్రి, అందరూ వారి పిల్లలే కదా. ఆత్మలందరూ ఈ సమయములో పతితముగా ఉన్నారు. తండ్రి
అంటారు - నేను ప్రాక్టికల్ గా వచ్చాను. వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. నిప్పు
అంటుకోనున్నదని మీకు తెలుసు. అందరి శరీరాలు సమాప్తమైపోతాయి. ఆత్మలందరూ తిరిగి ఇంటికి
వెళ్ళాలి. అంతేకానీ, బ్రహ్మతత్వములో లీనమైపోతారని కాదు లేక జ్యోతిలో కలిసిపోతారని
కాదు. బ్రహ్మ సమాజము వారు జ్యోతిని వెలిగిస్తారు. దానిని బ్రహ్మా మందిరము అని అంటారు.
వాస్తవానికి అది బ్రహ్మ మహాతత్వము, అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి. మన మొదటి మందిరము అదే.
పవిత్రాత్మలు అక్కడ ఉంటాయి. ఈ విషయాలను మనుష్యులెవ్వరూ అర్థం చేసుకోరు.
జ్ఞానసాగరుడైన తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు మీరు
జ్ఞాన-జ్ఞానేశ్వరులు, ఆ తర్వాత రాజ-రాజేశ్వరులుగా అవుతారు. పతిత-పావనుడైన, అత్యంత
ప్రియమైన బాబా వచ్చి మాకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారని మీ బుద్ధిలో ఉంది.
కొంతమంది బుద్ధిలో ఇది కూడా కూర్చోదు. ఇంతమంది కూర్చున్నారు, ఇందులో ఎవ్వరూ 100 శాతం
నిశ్చయబుద్ధి కలవారిగా లేరు. కొంతమంది 80 శాతం నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారు,
కొంతమంది 50 శాతం, కొంతమంది అలా కూడా లేరు. అటువంటివారు పూర్తిగా ఫెయిల్ అన్నట్లు.
నంబరువారుగా తప్పకుండా ఉన్నారు. నిశ్చయము లేనివారు చాలామంది ఉన్నారు. నిశ్చయము
ఏర్పడాలని ప్రయత్నిస్తారు. అచ్ఛా, నిశ్చయము ఏర్పడినా కానీ మాయ శక్తివంతముగా ఉంది,
బాబాను మర్చిపోతారు. ఈ బ్రహ్మా స్వయముగా అంటారు - నేను పూర్తి భక్తునిగా ఉండేవాడిని,
63 జన్మలు భక్తి చేసాను, తతత్వమ్. మీరు కూడా 63 జన్మలు భక్తి చేసారు. 21 జన్మలు
సుఖము పొందారు, ఆ తర్వాత భక్తులుగా అయ్యారు. భక్తి తర్వాత వైరాగ్యము. జ్ఞానము, భక్తి
మరియు వైరాగ్యము అని సన్యాసులు కూడా ఈ పదాలను ఉపయోగిస్తారు. వారికి ఇళ్ళు-వాకిళ్ళ
పట్ల వైరాగ్యము కలుగుతుంది. దానిని హద్దు వైరాగ్యమని అంటారు మరియు మీది అనంతమైన
వైరాగ్యము. సన్యాసులు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవులకు వెళ్ళిపోయేవారు. ఇప్పుడైతే ఎవరూ
అడవులలో లేనే లేరు. కుటీరాలన్నీ ఖాళీ అయిపోయాయి ఎందుకంటే మొదట వారు సతోప్రధానముగా
ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానముగా అయిపోయారు. ఇప్పుడు వారిలో ఎటువంటి శక్తి లేదు.
లక్ష్మీ-నారాయణుల రాజధానిలో ఏదైతే శక్తి ఉండేదో, వారు పునర్జన్మలను తీసుకుంటూ,
తీసుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చి చేరుకున్నారో చూడండి, ఏ మాత్రము శక్తి లేదు. మేము
ధర్మాన్ని నమ్మము అని ఇక్కడి గవర్నమెంట్ కూడా అంటుంది. ధర్మములోనే చాలా నష్టముంటుంది,
కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు, అన్ని ధర్మాలవారు ఏకమతముగా అవ్వాలని కాన్ఫరెన్సులు
ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఒక్కటిగా ఎలా అవ్వగలరు అని వారిని అడగండి. ఇప్పుడైతే
అందరూ తిరిగి వెళ్ళేటటువంటివారే. బాబా వచ్చారు. ఈ ప్రపంచము ఇప్పుడు శ్మశానవాటికగా
అవ్వనున్నది. ఇకపోతే, ఇది వెరైటీ వృక్షము, అటువంటప్పుడు ఒక్కటిగా ఎలా అవుతారు, ఏమీ
అర్థం చేసుకోరు. భారత్ లో ఒకే ధర్మముండేది, వారిని అద్వైత మతానికి చెందిన దేవతలని
అంటారు. ద్వైతమనగా దైత్యులు. బాబా అంటారు, మీ ఈ ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటటువంటిది.
మనము పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలను అనుభవించాలని మీకు తెలుసు. మనమే 84 జన్మలను
తీసుకున్నామని నిశ్చయముండాలి. మనమే వెళ్ళాలి, మళ్ళీ రావాలి. మీరు 84 జన్మలను పూర్తి
చేసారు, ఇప్పుడిది మీ అనేక జన్మల అంతిమ జన్మ అని భారతవాసులకు మాత్రమే అర్థం
చేయిస్తారు. కేవలం ఒక్కరికే చెప్పరు. మీరు పండాలు (మార్గదర్శకులు) అని పాండవ
సైన్యానికి అర్థం చేయిస్తారు. మీరు ఆత్మిక యాత్రను నేర్పిస్తారు, అందుకే పాండవ
సైన్యము అని అంటారు. రాజ్యము ఇప్పుడు కౌరవులకు లేదు, పాండవులకు లేదు. వారు కూడా
ప్రజలే, మీరు కూడా ప్రజలే. కౌరవులు, పాండవులు పరస్పరములో సోదరులని, పాండవుల వైపు
పరమపిత పరమాత్మ ఉన్నారని అంటారు. తండ్రియే వచ్చి మాయపై విజయము పొందడము నేర్పిస్తారు.
మీరు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు, అహింసకులు. అహింసా పరమో ధర్మము.
ముఖ్యమైన విషయము - కామ ఖడ్గాన్ని ఉపయోగించకుండా ఉండడము. భారతవాసులు గోవులను
హతమార్చకపోవడమే అహింస అని భావిస్తారు. కానీ బాబా అంటారు - కామ ఖడ్గాన్ని
ఉపయోగించకండి, దానినే అన్నింటికన్నా పెద్ద హింస అని అంటారు. సత్యయుగములో కామ ఖడ్గము
ఉండదు, గొడవలు-కొట్లాటలు ఉండవు. ఇక్కడైతే రెండూ ఉన్నాయి. కామ ఖడ్గమే ఆదిమధ్యాంతాలు
దుఃఖమునిస్తుంది. మీరు మెట్లు దిగుతూ వస్తారు. భారతవాసులైన మీరే 84 జన్మలు
తీసుకున్నారు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది, తర్వాత పునర్జన్మలను తీసుకుంటారు.
ఒక్కొక్క జన్మ ఒక్కొక్క మెట్టు వంటిది. ఇక్కడ నుండి మీరు ఒక్కసారిగా పైకి జంప్
చేస్తారు. 84 మెట్లు దిగడానికి మీకు 5 వేల సంవత్సరాలు పడుతుంది మరియు ఇక్కడి నుండి
మీరు ఒక్క క్షణములో ఎక్కేస్తారు. క్షణములో జీవన్ముక్తిని ఎవరు ఇస్తారు? తండ్రి.
ఇప్పుడు అందరూ పూర్తిగా నేలపై పడిపోయారు. ఇప్పుడు తండ్రి అంటారు, కేవలం నన్ను స్మృతి
చేయండి. ఇప్పుడు నాటకము పూర్తయ్యిందని, మనము తిరిగి ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో
గుర్తుంచుకోవాలి. మనము మన తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. మొదట బాబాను స్మృతి
చేయండి, వారే మీకు ఇంటికి మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రి స్మృతితో వికర్మలు
వినాశనమవుతాయి. బ్రహ్మతత్వాన్ని గుర్తు చేయడము వలన ఒక్క పాపము కూడా పోదు.
పతిత-పావనుడు పరమాత్ముడే. వారు ఏ విధముగా పావనముగా తయారుచేస్తారు అనేది ప్రపంచములోని
వారెవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి వచ్చి స్వర్గ స్థాపనను తప్పకుండా చేయవలసి
ఉంటుంది. తండ్రి వచ్చారు కావున పిల్లలైన మీరు వారి జయంతిని జరుపుతారు. వారు ఎప్పుడు
వచ్చారు. ఫలానా ఘడియలో, ఫలానా తిథి-తారీఖులలో వచ్చారని చెప్పలేరు. శివబాబా ఎప్పుడు
వచ్చారు అనేది ఎలా చెప్పగలరు. సాక్షాత్కారాలు చాలా కలుగుతాయి. పూర్వము మనము
సర్వవ్యాపి అని భావించేవారము లేదా ఆత్మయే పరమాత్మ అని అనేవారము. ఇప్పుడు యథార్థము
తెలిసింది. బాబా ప్రతి రోజూ గుహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు. సాధారణ పిల్లలైన
మీరు ఎంత గొప్ప జ్ఞానాన్ని చదువుకుంటున్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. గౌరవపూర్వకముగా పాస్ అయ్యేందుకు శిక్షల నుండి విముక్తులయ్యే పురుషార్థము
చేయాలి. స్మృతిలో ఉంటేనే స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా అవ్వగలరు.
2. సత్యాతి-సత్యమైన పాండవులుగా అయి అందరి చేత ఆత్మిక యాత్రను చేయించాలి. ఏ రకమైన
హింస చేయకూడదు.
వరదానము:-
లైట్ హౌస్ స్థితి ద్వారా పాప కర్మలను సమాప్తము చేసే పుణ్య
ఆత్మా భవ
ఎక్కడైతే లైట్ (వెలుగు) ఉంటుందో అక్కడ ఎటువంటి పాప కర్మ
జరగదు. సదా లైట్ హౌస్ స్థితిలో ఉన్నట్లయితే మాయ ఎటువంటి పాప కర్మనూ చేయించలేదు, సదా
పుణ్య ఆత్మగా అయిపోతారు. పుణ్య ఆత్మ సంకల్పములో కూడా ఎటువంటి పాప కర్మ చేయలేదు.
ఎక్కడైతే పాపము ఉంటుందో అక్కడ తండ్రి స్మృతి ఉండదు. అందుకే దృఢ సంకల్పము చెయ్యండి -
నేను పుణ్య ఆత్మను, పాపము నా ఎదురుగా రాలేదు. స్వప్నములో లేక సంకల్పములో కూడా
పాపమును రానివ్వకండి.
స్లోగన్:-
ఎవరైతే
ప్రతి దృశ్యాన్ని సాక్షీగా అయ్యి చూస్తారో వారే సదా హర్షితముగా ఉంటారు.
అవ్యక్త సూచనలు -
‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’
నిశ్చయబుద్ధి కల
పిల్లలు సదా హర్షితముగా మరియు నిశ్చింతగా ఉంటారు. చింత అనేది సంతోషాన్ని సమాప్తము
చేస్తుంది మరియు నిశ్చింతగా ఉన్నట్లయితే సదా సంతోషము ఉంటుంది. ఎప్పుడైనా ఏ
విషయములోనైనా - ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమవుతుందో... అన్న ప్రశ్నలు వస్తే,
అప్పుడు చింత కలుగుతుంది. ఎందుకు, ఏమిటి, ఎలా - ఇది చింతతో కూడిన అల. కొంతమంది
ఏమంటారంటే - నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఈ బంధనము ఎందుకు ఉంది! నా వెనుకే మాయ
ఎందుకు వస్తుంది! ఎందుకని నా లెక్కాచారమే కఠినముగా ఉంది? ‘‘ఎందుకు’’ అనేది రావటమనగా
చింతతో కూడిన అల వచ్చినట్లు. ఎవరైతే ఈ చింతల నుండి దూరముగా ఉంటారో వారే నిశ్చింతగా
ఉంటారు.
| | | |