06-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 15.12.2004


‘‘బాప్ దాదా యొక్క విశేష ఆశ - పిల్లలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి’’

ఈ రోజు బాప్ దాదా తమ నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తుల సభను చూస్తున్నారు. ఈ రాజ సభ మొత్తము కల్పములో ఈ సమయములోనే ఉంది. ఆత్మిక శుద్ధ గర్వము, నషాలో ఉంటారు, అందుకే నిశ్చింత చక్రవర్తులు. ఉదయము మేల్కోవటం నిశ్చింతగా మేల్కొంటారు, నడుస్తూ-తిరుగుతూ, కర్మలు చేస్తూ కూడా నిశ్చింతగా ఉంటారు మరియు నిద్రపోయినా కూడా నిశ్చింతగా నిద్రపోతారు. ఇలా అనుభవము చేస్తారు కదా! నిశ్చింతగా ఉన్నారా? అలా అయ్యారా లేక అవుతూ ఉన్నారా? నిశ్చింతులుగా అయిపోయారు కదా! నిశ్చింతులు మరియు చక్రవర్తులు, స్వరాజ్య అధికారులు, ఈ కర్మేంద్రియాలపై రాజ్యము చేసే నిశ్చింత చక్రవర్తులు అనగా స్వరాజ్య అధికారులు. పిల్లలైన మీ సభయే ఈ విధంగా ఉంటుంది. ఏదైనా చింత ఉందా? ఉందా ఏదైనా చింత? ఎందుకంటే మీ చింతలన్నిటినీ బాబాకు ఇచ్చేసారు. కనుక భారము దిగిపోయింది కదా! చింతలు సమాప్తమైపోయాయి మరియు నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి అమూల్య జీవితాన్ని అనుభవము చేస్తున్నారు. అందరి తలపై పవిత్రత అనే ప్రకాశ కిరీటము స్వతహాగానే మెరుస్తుంది. నిశ్చింతగా ఉన్నవారిపై ప్రకాశ కిరీటము ఉంది. ఒకవేళ ఏదైనా చింత చేస్తే, ఏదైనా భారాన్ని మీ తలపైకి ఎత్తుకుంటే అప్పుడు మీ తల పైకి ఏమి వస్తుందో తెలుసా? బరువైన గంపలు వస్తాయి. మరి ఆలోచించండి, కిరీటము మరియు గంప, ఈ రెండింటినీ ఎదురుగా తీసుకురండి, ఏది బాగా అనిపిస్తుంది? గంపలు బాగా అనిపిస్తాయా లేక ప్రకాశ కిరీటము బాగా అనిపిస్తుందా? టీచర్లు చెప్పండి, ఏది బాగా అనిపిస్తుంది? కిరీటము బాగా అనిపిస్తుంది కదా! అన్ని కర్మేంద్రియాలపై రాజ్యము చేసే చక్రవర్తులు. పవిత్రత అనేది ప్రకాశ కిరీటధారులుగా తయారుచేస్తుంది, అందుకే మీ స్మృతిచిహ్నాలైన జడ చిత్రాలలో రెండు కిరీటాలను చూపించారు. ద్వాపరము నుండి చక్రవర్తులుగానూ ఎంతోమంది అయ్యారు, రాజులుగానూ ఎంతోమంది అయ్యారు కానీ డబల్ కిరీటధారులుగా ఎవ్వరూ అవ్వలేదు. నిశ్చింత చక్రవర్తులైన స్వరాజ్య అధికారులుగా కూడా ఎవ్వరూ అవ్వలేదు ఎందుకంటే పవిత్రతా శక్తి మాయాజీతులుగా, కర్మేంద్రియజీతులుగా విజయులుగా చేస్తుంది. నిశ్చింత చక్రవర్తుల లక్షణము ఏమిటంటే - వారు సదా స్వయము కూడా సంతుష్టముగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టము చేస్తారు. వారు అసంతుష్టులుగా అయ్యేందుకు వారికి అసలు ఎటువంటి అప్రాప్తి అనేదే ఉండదు. ఎక్కడైతే అప్రాప్తి ఉంటుందో అక్కడ అసంతుష్టత ఉంటుంది. ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది. మరి అలా తయారయ్యారా? చెక్ చేసుకోండి - సదా సర్వ ప్రాప్తి స్వరూపులుగా, సంతుష్టులుగా ఉన్నారా? బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు అన్న గాయనము ఉందే కానీ దేవతల ఖజానాలో అని అనరు. సంతుష్టత జీవితానికి శ్రేష్ఠ అలంకారము, శ్రేష్ఠమైన విలువ. మరి సంతుష్ట ఆత్మలే కదా!

బాప్ దాదా ఇటువంటి నిశ్చింత చక్రవర్తులైన పిల్లలను చూసి సంతోషిస్తారు. వాహ్ నా నిశ్చింత చక్రవర్తులూ వాహ్!... వాహ్, వాహ్ వంటివారే కదా! ఎవరైతే నిశ్చింతులో వారు చేతులెత్తండి. నిశ్చింతులేనా? చింత కలగదా? ఎప్పుడైనా వస్తుందా? రాదా? మంచిది. నిశ్చింతులుగా అయ్యేందుకు విధి చాలా సహజమైనది, అది కష్టమేమీ కాదు. కేవలము ఒక్క అక్షరములో కొద్దిపాటి తేడా ఉంటుంది. ఆ పదము ఏమిటంటే - నాది అన్నదానిని నీదిలోకి పరివర్తన చెయ్యండి. నాది కాదు, నీది. హిందీ భాషలో మేరా (నాది) అని కూడా వ్రాయండి మరియు తేరా (నీది) అని కూడా వ్రాయండి, తేడా ఏమి వస్తుంది. మే (నా) మరియు తే (నీ). ఇంతే. కానీ ఇదే చాలా తేడాను తీసుకువస్తుంది. మరి మీరందరూ నా, నా అని అనేవారా లేక నీ, నీ అని అనేవారా? నాదిని నీదిలోకి పరివర్తన చేసారా? చెయ్యకపోతే చెయ్యండి. నాది-నాది అని అనటము అనగా దాసులుగా అయ్యేవారు, ఉదాసీనులుగా అయ్యేవారు. మాయకు దాసులుగా అయిపోతారు కావున ఉదాసీనులుగా అవుతారు కదా. ఉదాసీనులు అనగా మాయకు దాసులుగా అయ్యేవారు. కానీ మీరు మాయాజీతులు, మాయకు దాసులు కారు. మరి ఉదాసీనత వస్తుందా? అప్పుడప్పుడు అది రుచి చూస్తారు ఎందుకంటే 63 జన్మలు ఉదాసీనులుగా ఉండే అభ్యాసము ఉంది కదా! అందుకే అప్పుడప్పుడు అది ప్రత్యక్షమవుతుంటుంది, అందుకే బాప్ దాదా ఏమి చెప్పారు? పిల్లలు ప్రతి ఒక్కరు నిశ్చింత చక్రవర్తులు. ఒకవేళ ఇప్పుడు కూడా ఎక్కడైనా, ఏ మూలలోనైనా ఏదైనా చింతను పెట్టుకుని ఉన్నట్లయితే దానిని ఇచ్చెయ్యండి. భారాన్ని మీ వద్ద ఎందుకు పెట్టుకుంటారు? భారాన్ని పెట్టుకోవటం అలవాటు అయిపోయిందా? భారాన్ని నాకు ఇచ్చెయ్యండి, మీరు లైట్ గా అవ్వండి, డబుల్ లైట్ గా అవ్వండి అని బాబా అంటున్నారు. డబుల్ లైట్ గా ఉండటం మంచిదా లేక భారము ఉండటం మంచిదా? కనుక బాగా చెక్ చేసుకోండి. అమృతవేళ నిద్ర లేచినప్పుడు చెక్ చేసుకోండి - విశేషముగా వర్తమాన సమయములో సబ్ కాన్షస్ లో అయినా కూడా ఎటువంటి భారమూ లేదు కదా? సబ్ కాన్షస్ లో కాదు కదా, స్వప్నమాత్రముగా కూడా భారము అనుభవమవ్వకూడదు. డబుల్ లైట్ గా ఉండటమే ఇష్టము కదా! కనుక విశేషముగా ఈ హోమ్ వర్కు ఇస్తున్నాము, అమృతవేళ చెక్ చేసుకోండి, చెక్ చేసుకోవటమైతే వస్తుంది కదా, కానీ చెక్ చేసుకోవటముతోపాటు, కేవలము చెక్ చేసుకోవటము మాత్రమే కాకుండా ఛేంజ్ కూడా చేసుకోవాలి. నాది అన్నదానిని నీదిలోకి మార్చేయండి. నాది, నీది. కనుక చెక్ చేసుకోండి మరియు ఛేంజ్ చేసుకోండి ఎందుకంటే బాప్ దాదా పదే-పదే వినిపిస్తున్నారు - సమయము మరియు స్వయము, ఈ రెండింటినీ చూడండి. సమయము యొక్క వేగాన్ని కూడా చూడండి మరియు స్వయము యొక్క వేగాన్ని కూడా చూడండి. మళ్ళీ తర్వాత - సమయము ఇంత వేగముగా వెళ్ళిపోయిందని మాకు తెలియనే తెలియలేదు అని అనకండి. కొంతమంది పిల్లలు ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ ఇప్పుడు కాస్త ఢీలా పురుషార్థము ఉన్నా సరే అంతిమములో దానిని వేగవంతము చేసేద్దాములే అని. కానీ బహుకాలపు అభ్యాసమే అంతిమములో సహయోగిగా అవుతుంది. చక్రవర్తులుగా అయ్యి చూడండి. అయ్యారు కానీ కొంతమంది అయ్యారు, కొంతమంది అవ్వలేదు. నడుస్తున్నాము, చేస్తున్నాము, సంపన్నముగా అయిపోతాము... అని అనడం కాదు. ఇప్పుడు నడవటము కాదు, చెయ్యటము కాదు, ఎగరాలి. ఇప్పుడే ఎగిరే వేగము కావాలి. రెక్కలైతే లభించాయి కదా! ఉల్లాస-ఉత్సాహాలు మరియు ధైర్యము అనే రెక్కలు అందరికీ లభించాయి మరియు బాబా వరదానము కూడా ఉంది, వరదానము గుర్తుందా? ధైర్యమనే ఒక్క అడుగు మీది మరియు వెయ్యి అడుగుల సహాయము బాబాది, ఎందుకంటే బాబాకు పిల్లలపై హృదయపూర్వకమైన ప్రేమ ఉంది. కనుక ప్రియమైన పిల్లలు శ్రమ పడుతుంటే బాబా చూడలేరు. ప్రేమలో ఉన్నట్లయితే శ్రమ సమాప్తమైపోతుంది. శ్రమ మంచిగా అనిపిస్తుందా ఏమిటి? అలసిపోయి ఉన్నారు. 63 జన్మలు భ్రమిస్తూ, భ్రమిస్తూ, శ్రమపడుతూ అలసిపోయారు. ఇప్పుడు బాబా తన ప్రేమతో పిల్లలను భ్రమించేందుకు బదులుగా మూడు సింహాసనాలకు అధికారులుగా తయారుచేసారు. మూడు సింహాసనాలు ఏమిటో తెలుసా? తెలియడమేమిటి, ఆ సింహాసన నివాసులుగా అయిపోయారు. భృకుటి సింహాసన నివాసులు కూడా, బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారులు కూడా మరియు భవిష్య విశ్వ రాజ్య సింహాసనాధికారులు కూడా. బాప్ దాదా పిల్లలందరినీ సింహాసనాధికారులుగా చూస్తున్నారు. ఇటువంటి పరమాత్మ హృదయ సింహాసనాన్ని మొత్తము కల్పములో మరెప్పుడూ అనుభవము చేయలేరు. పాండవులు ఏమనుకుంటున్నారు? చక్రవర్తులేనా? చేతులెత్తుతున్నారు. సింహాసనాన్ని వదలకండి. దేహ భానములోకి వచ్చారు అనగా మట్టిలోకి వచ్చినట్లు. ఈ దేహము మట్టితో సమానమైనది. సింహాసనాధికారులుగా అయ్యారు అంటే చక్రవర్తులుగా అయినట్లు.

బాప్ దాదా పిల్లలందరి పురుషార్థపు చార్టును చెక్ చేస్తున్నారు, నాలుగు సబ్జెక్టులలో ఎవరెవరు ఎంతవరకు చేరుకున్నారు అని? బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి చార్టును ఏ విషయములో చెక్ చేసారంటే - బాప్ దాదా ఏయే ఖజానాలనైతే ఇచ్చారో ఆ అన్ని ఖజానాలను ఎంతవరకు జమ చేసుకున్నారు? జమ ఖాతాను చెక్ చేసారు. ఎందుకంటే ఖజానాలనైతే బాబా అందరికీ ఒకే విధంగా, ఒకే పరిమాణములో ఇచ్చారు, కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వలేదు. ఖజానాలు జమ అయ్యాయి అన్నదానికి గుర్తు ఏమిటి? ఖజానాల గురించైతే తెలుసు కదా. అన్నింటికంటే పెద్ద ఖజానా - శ్రేష్ఠ సంకల్పాల ఖజానా. సంకల్పము కూడా ఖజానాయే. అలాగే వర్తమానములోని సమయము కూడా చాలా పెద్ద ఖజానా ఎందుకంటే వర్తమాన సమయములో ఏది ప్రాప్తి చేసుకోవాలనుకున్నా, ఏ వరదానాన్ని తీసుకోవాలనుకున్నా, ఎంతగా స్వయాన్ని శ్రేష్ఠముగా తయారుచేసుకోవాలనుకున్నా, అంతగా ఇప్పుడు తయారుచేసుకోగలరు. ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ అవ్వదు. సంకల్పాల ఖజానాను వ్యర్థముగా పోగొట్టటము అనగా తమ ప్రాప్తులను పోగొట్టుకోవటము. అలాగే సమయములో ఒక్క క్షణమునైనా వ్యర్థముగా పోగొట్టుకుంటే, సఫలము చేసుకోకపోతే చాలా పోగొట్టుకున్నట్లు. అలాగే దానితో పాటు జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శక్తుల ఖజానా మరియు ప్రతి ఆత్మ ద్వారా మరియు పరమాత్మ ద్వారా లభించే ఆశీర్వాదాల ఖజానా. పురుషార్థములో అన్నింటికంటే సహజము ఏమిటంటే - ‘‘ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి.’’ సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి, దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి. దుఃఖాన్ని ఇవ్వలేదు కదా అని కాదు, కానీ దుఃఖాన్ని తీసుకున్నా కూడా దుఃఖితులుగా అవుతారు కదా! కనుక ఆశీర్వాదాలను ఇవ్వండి, సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి. ఆశీర్వాదాలను ఇవ్వటము వస్తుందా? వస్తుందా? తీసుకోవటము కూడా వస్తుందా? ఎవరికైతే ఆశీర్వాదాలను ఇవ్వటము మరియు తీసుకోవటము వస్తుందో వారు చేతులెత్తండి. అచ్ఛా - అందరికీ వస్తుందా? అచ్ఛా - డబల్ విదేశీయులకు కూడా వస్తుందా? అభినందనలు. ఇవ్వటము కూడా వస్తుంది మరియు తీసుకోవటము కూడా వస్తుంది అంటే అభినందనలు. అందరికీ అభినందనలు. ఒకవేళ తీసుకోవటము కూడా వస్తే మరియు ఇవ్వటము కూడా వస్తే, మరి ఇంకేమి కావాలి. ఆశీర్వాదాలను తీసుకుంటూ వెళ్ళండి, ఆశీర్వాదాలను ఇస్తూ వెళ్ళండి, సంపన్నము అయిపోతారు. ఒకవేళ ఎవరైనా శాపనార్థాలు ఇస్తే ఏం చేస్తారు? తీసుకుంటారా? ఎవరైనా మీకు శాపనార్థాలు ఇస్తే ఏం చేస్తారు? తీసుకుంటారా? ఒకవేళ ఆ శాపనార్థాలను తీసుకున్నారు అంటే మరి మీలో స్వచ్ఛత ఉన్నట్లా? శాపనార్థాలైతే చెడు కదా! మీరు వాటిని తీసుకున్నారంటే, మీ లోపలికి వాటిని స్వీకరించినట్లయితే మీలో స్వచ్ఛత లేనట్లు కదా! ఒకవేళ ఏ కాస్త అయినా డిఫెక్ట్ ఉంటే పర్ఫెక్ట్ అవ్వలేరు. ఒకవేళ ఎవరైనా పాడైపోయిన వస్తువును ఇస్తే మీరు తీసుకుంటారా? చాలా సుందరమైన ఫలమైనా, ఒకవేళ పాడైపోయినది మీకు ఇస్తే, ఆ ఫలము అందముగా ఉన్నా మీరు దానిని తీసుకుంటారా? తీసుకోరు కదా! లేదా బాగుంది కదా, సరేలే, ఇచ్చారు కదా, తీసుకుందాము అని అంటారా? ఎప్పుడైనా ఎవరైనా శాపానార్థాలు ఇస్తే మీరు మనసులో లోపల ధారణ చెయ్యకండి. ఇవి శాపనార్థాలు అని అర్థమవుతుంది కానీ వాటిని లోపల ధారణ చెయ్యకండి లేదంటే డిఫెక్ట్ ఏర్పడుతుంది. కనుక ఇప్పుడు ఈ సంవత్సరములో, ఇప్పుడు పాత సంవత్సరములో ఇంకా కొద్ది రోజులు మిగిలి ఉన్నాయి. మీ మనసులో దృఢ సంకల్పము చెయ్యండి, ఇప్పుడు కూడా ఎవరి శాపనార్థాలైనా మనసులో ఉన్నట్లయితే వాటిని తొలగించివేయండి మరియు రేపటి నుండి ఆశీర్వాదాలను ఇస్తారు, ఆశీర్వాదాలను తీసుకుంటారు. అంగీకారమేనా? ఇష్టమేనా? కేవలం ఇష్టమేనా లేక చెయ్యాల్సిందేనా? ఇష్టమైతే ఉంది, కానీ ఎవరైతే - చెయ్యాల్సిందే, ఏం జరిగినా కానీ చెయ్యాల్సిందే అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చెయ్యాల్సిందే.

స్నేహీ సహయోగులు ఎవరైతే ఈ రోజు వచ్చారో వారు చేతులెత్తండి. స్నేహీ సహయోగులు ఎవరైతే వచ్చారో, బాప్ దాదా వారికి అభినందనలు ఇస్తున్నారు ఎందుకంటే సహయోగులు కూడా, స్నేహీలు కూడా కానీ ఈ రోజు మరొక అడుగును వేసి బాబా ఇంటికి అనగా మీ ఇంటికి వచ్చారు, కనుక మీ ఇంటికి వచ్చినందుకు అభినందనలు. అచ్ఛా, స్నేహీ సహయోగులెవరైతే వచ్చారో వారు కూడా ఆశీర్వాదాలను ఇస్తాము మరియు తీసుకుంటాము అని భావిస్తున్నారా? అలా అనుకుంటున్నారా? ధైర్యము పెడుతున్నారా? స్నేహీ సహయోగులెవరైతే ధైర్యాన్ని పెడతారో వారికి సహాయము లభిస్తుంది. చేతిని బాగా పైకి ఎత్తండి. అచ్ఛా. అప్పుడిక మీరు కూడా సంపన్నులైపోతారు, అభినందనలు. అచ్ఛా, ఎవరైతే రెగ్యులర్ ఈశ్వరీయ విద్యార్థులో, బ్రాహ్మణ జీవితములో బాప్ దాదాను కలుసుకునేందుకు మొదటిసారి వచ్చినా కానీ స్వయాన్ని ఎవరైతే బ్రాహ్మణులుగా భావిస్తున్నారో, రెగ్యులర్ విద్యార్థులుగా భావిస్తున్నారో, వారు ఒకవేళ ‘చెయ్యాల్సిందే’ అని భావిస్తున్నట్లయితే చేతులెత్తండి. ఆశీర్వాదాలను ఇస్తారా, ఆశీర్వాదాలను తీసుకుంటారా? చేస్తారా? టీచర్లు చేతులెత్తుతున్నారా? క్యాబిన్ లో ఉండేవారు ఎత్తటం లేదు. మేమైతే ఇస్తూనే ఉన్నాము అని వీళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు చెయ్యాల్సిందే. ఏం జరిగినా సరే, ధైర్యము పెట్టండి, దృఢ సంకల్పము పెట్టండి. ఒకవేళ ఎప్పుడైనా ఆ శాపనార్థాల ప్రభావము పడింది అనుకోండి, అప్పుడు దానికి 10 రెట్లు ఎక్కువ ఆశీర్వాదాలను ఇచ్చి దానిని సమాప్తము చెయ్యాలి. ఒక్క శాపనార్థము యొక్క ప్రభావాన్ని 10 రెట్లు ఆశీర్వాదాలను ఇచ్చి తేలిక చేసేయండి, అప్పుడు ధైర్యము వచ్చేస్తుంది. నష్టమైతే మీకే జరుగుతుంది కదా, ఇతరులైతే శాపనార్థాలు ఇచ్చి వెళ్ళిపోతారు, కానీ ఎవరు ఆ శాపనార్థాలను లోపల పెట్టుకున్నారు? దుఃఖితులుగా ఎవరు అవుతారు? తీసుకునేవారా లేక ఇచ్చేవారా? ఇచ్చేవారు కూడా దుఃఖితులుగా అవుతారు కానీ తీసుకునేవారు ఎక్కువ దుఃఖితులుగా అవుతారు. ఇచ్చేవారైతే నిర్లక్ష్యులుగా ఉంటారు.

ఈ రోజు బాప్ దాదా తమ హృదయములోని విశేషమైన ఆశను వినిపిస్తున్నారు. బాప్ దాదాకు పిల్లలందరి పట్ల, ప్రతి ఒక్క బిడ్డ పట్ల, వారు దేశములో ఉన్నా లేక విదేశాలలో ఉన్నా, వారు సహయోగులైనా సరే ఎందుకంటే సహయోగులకు కూడా పరిచయమైతే లభించింది కదా, మరి పరిచయము లభించినప్పుడు పరిచయము ద్వారా ప్రాప్తినైతే అందుకోవాలి కదా. కనుక బాప్ దాదా ఆశ ఇదే - పిల్లలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలను ఇస్తూ ఉండాలి. ఆశీర్వాదాల ఖాజానాను ఎంతగా జమ చేసుకోగలరో అంతగా చేసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే ఈ సమయములో ఎన్ని ఆశీర్వాదాలను పోగు చేసుకుంటారో, జమ చేసుకుంటారో, అంతగానే మీరు పూజ్యులుగా అయినప్పుడు ఆత్మలకు ఆశీర్వాదాలను ఇవ్వగలరు. ఇప్పుడు ఆశీర్వాదాలను కేవలము మీకు మీరు ఇచ్చుకోవటము కాదు, ద్వాపరము నుండి భక్తులకు కూడా ఆశీర్వాదాలను ఇవ్వాలి. కనుక అంతగా అశీర్వాదాల స్టాక్ ను జమ చేసుకోవాలి. రాజా పిల్లలు కదా! బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ రాజా పిల్లలుగా చూస్తారు. తక్కువగా చూడరు. అచ్ఛా.

బాప్ దాదా యొక్క ఆశను అండర్ లైన్ చేసుకున్నారా? ఎవరైతే చేసుకున్నారో వారు చేతులెత్తండి. చేసుకున్నారా. అచ్ఛా. బాప్ దాదా 6 నెలల హోమ్ వర్కును కూడా ఇచ్చారు, గుర్తుందా? టీచర్లకు గుర్తుందా? కానీ ఈ దృఢ సంకల్పము యొక్క రిజల్టును ఒక్క నెల కోసం చూస్తాము ఎందుకంటే కొత్త సంవత్సరమైతే త్వరలోనే ప్రారంభమవ్వబోతుంది. మీది 6 నెలల హోమ్ వర్క్, కానీ ఈ ఒక్క నెల కోసము దృఢ సంకల్పము యొక్క రిజల్టును చూస్తాము. సరేనా? టీచర్లు, ఒక నెల సరేనా? పాండవులూ, సరేనా? అచ్ఛా - ఎవరైతే మొదటిసారి మధుబన్ కు వచ్చారో వారు చేతులెత్తండి. చాలా మంచిది. చూడండి, బాప్ దాదాకు సదా కొత్త పిల్లలు చాలా ఇష్టమనిపిస్తారు. కానీ కొత్త పిల్లలు ఎలాంటి వారంటే, వృక్షములో చిన్న-చిన్న ఆకులు రావటం మొదలవుతుంది కదా, అవి పక్షులకు చాలా ఇష్టమనిపిస్తాయి, అలాగే కొత్త-కొత్తగా వచ్చే పిల్లలెవరైతే ఉంటారో వారు మాయకు కూడా చాలా ఇష్టమనిపిస్తారు. అందుకే కొత్త పిల్లలెవరైతే ఉన్నారో వారిలోని ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ మీ నవీనతను చెక్ చేసుకోండి - ఈ రోజు మాలో ఏ నవీనతను తీసుకువచ్చాము? ఏ విశేష గుణాన్ని, ఏ శక్తిని స్వయములో విశేషముగా ధారణ చేసాము? కనుక చెక్ చేసుకుంటూ ఉంటే, స్వయాన్ని పరిపక్వముగా చేసుకుంటూ ఉంటే సురక్షితముగా ఉంటారు, అమరులుగా ఉంటారు. కనుక అమరులుగా ఉండండి, అమర పదవిని పొందాల్సిందే. అచ్ఛా!

నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తులకు, సదా ఆత్మిక శుద్ధ గర్వములో, నషాలో ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, ప్రాప్తించిన ఖజానాలను సదా జమ ఖాతాలో పెంచుకునే తీవ్ర పురుషార్థీ ఆత్మలకు, సదా ఒకే సమయములో మూడు రకాల సేవలను చేసే శ్రేష్ఠ సేవాధారీ పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు, పదమాల, పదమాల, పదమాల రెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-
సర్వ శక్తులను ఆర్డర్ అనుసారముగా తమ సహయోగిగా చేసుకునే ప్రకృతిజీత్ భవ

అన్నింటికంటే అతి పెద్ద దాసి ప్రకృతి. ఏ పిల్లలైతే ప్రకృతిజీతులుగా అయ్యే వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటారో, వారి ఆజ్ఞానుసారముగా సర్వ శక్తులు మరియు ప్రకృతి రూపీ దాసీ కార్యము చేస్తాయి అనగా సమయానికి సహయోగాన్ని అందిస్తాయి. కానీ ఒకవేళ ప్రకృతిజీతులుగా అయ్యేందుకు బదులుగా నిర్లక్ష్యపు నిద్రలో లేక అల్పకాలికమైన ప్రాప్తి యొక్క నషాలో లేక వ్యర్థ సంకల్పాల నాట్యములో నిమగ్నమై తమ సమయాన్ని పోగొట్టుకున్నట్లయితే ఆ శక్తులు ఆజ్ఞానుసారముగా కార్యము చేయలేవు, అందుకే చెక్ చేసుకోండి - మొదట ముఖ్యమైన సంకల్ప శక్తి, నిర్ణయ శక్తి మరియు సంస్కార శక్తి, మూడూ ఆర్డర్ లో ఉన్నాయా?

స్లోగన్:-
బాప్ దాదా యొక్క గుణగానము చేస్తూ ఉన్నట్లయితే స్వయం కూడా గుణమూర్తులుగా అయిపోతారు.

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

కంబైండ్ సేవ లేకుండా సఫలత అసంభవము. వెళ్ళేది సేవ చెయ్యటానికి, కానీ తిరిగి వచ్చిన తర్వాత మాయ వచ్చింది, మూడ్ ఆఫ్ అయ్యింది, డిస్టర్బ్ అయ్యాము అని అనటము కాదు. అందుకే అండర్ లైన్ చేసుకోండి - సేవలో సఫలతకు మరియు సేవలో వృద్ధికి సాధనము స్వసేవ మరియు సర్వుల కంబైండ్ సేవ.