06-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - తండ్రి స్మృతి ద్వారా బుద్ధి స్వచ్ఛముగా అవుతుంది, దివ్య గుణాలు వస్తాయి, అందుకే ఏకాంతములో కూర్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - నాలో ఎన్ని దైవీ గుణాలు వచ్చాయి

ప్రశ్న:-
అన్నింటికన్నా పెద్ద అసురీ అవగుణము ఏమిటి, అది పిల్లలలో ఉండకూడదు?

జవాబు:-
అన్నింటికన్నా పెద్ద అసురీ అవగుణము - ఎవరితోనైనా రఫ్ టఫ్ గా మట్లాడటము లేక కఠినముగా మాట్లాడటము, దీనినే భూతము అని అంటారు. ఎవరిలోనైనా ఈ భూతము ప్రవేశిస్తే, వారు చాలా నష్టపరుస్తారు, అందుకే వారి నుండి పక్కకు తప్పుకోవాలి. ఎంత వీలైతే అంత - ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త రాజధానిలోకి రావాలి అని అభ్యాసము చేయండి. ఈ ప్రపంచములో అన్నీ చూస్తూ కూడా ఏదీ కనిపించకూడదు.

ఓంశాంతి
తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు, శరీరాన్ని వదిలైతే వెళ్ళాలి, ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోవాలి. ఇది కూడా ఒక అభ్యాసమే. శరీరములో ఏదైనా ఇబ్బంది కలిగితే శరీరాన్ని కూడా మర్చిపోయే ప్రయత్నము చేయవలసి ఉంటుంది, అలాగే ప్రపంచాన్ని కూడా మర్చిపోవలసి ఉంటుంది. ఉదయం వేళ ఈ మర్చిపోయే అభ్యాసము జరుగుతుంది. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. ఈ జ్ఞానము పిల్లలకు లభించింది. మొత్తం ప్రపంచమంతటినీ వదిలి ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఎక్కువ జ్ఞానము యొక్క అవసరం ఉండదు. బాగా ప్రయత్నించి అదే ధుని (ధ్యాస)లో ఉండాలి. శరీరానికి ఎంత కష్టం కలిగినా కానీ ఎలా అభ్యాసం చేయాలో పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. అసలు మీరు లేనే లేనట్లుగా అభ్యాసం చేయాలి. ఇది కూడా మంచి అభ్యాసము. ఇప్పుడు కొద్ది సమయమే ఉంది. ఇక ఇంటికి వెళ్ళాలి, తండ్రి సహాయము లభిస్తుంది లేక వీరి సహాయము లభిస్తుంది. సహాయమైతే తప్పకుండా లభిస్తుంది మరియు పురుషార్థం కూడా చేయవలసి ఉంటుంది. ఇవి ఏవైతే చూడటానికి కనిపిస్తున్నాయో అవేవీ ఉండవు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. అక్కడి నుండి మళ్ళీ మన రాజధానిలోకి రావాలి. చివరిలో ఈ రెండు విషయాలే ఉంటాయి, వెళ్ళాలి మరియు రావాలి. ఈ స్మృతిలో ఉండటం ద్వారా శారీరిక రోగాలేవైతే విసిగిస్తాయో అవి కూడా వాటంతట అవే చల్లబడిపోతాయని గమనించడం జరిగింది. ఆ సంతోషము ఉంటుంది. సంతోషం లాంటి మందు ఇంకేదీ లేదు, అందుకే పిల్లలకు కూడా ఇది అర్థం చేయించవలసి ఉంటుంది. పిల్లలూ, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, మధురమైన ఇంటికి వెళ్ళాలి, ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి, దీనినే స్మృతి యాత్ర అని అంటారు. ఇది ఇప్పుడే పిల్లలకు తెలుస్తుంది. తండ్రి కల్పకల్పమూ వస్తారు, ఇదే వినిపిస్తారు, మళ్ళీ కల్పం తర్వాత కలుస్తారు. తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో దానిని మళ్ళీ కల్పం తర్వాత ఇదే విధంగా వింటారు. ఇది పిల్లలకు తెలుసు. తండ్రి అంటారు - నేను కల్పకల్పమూ వచ్చి పిల్లలకు మార్గాన్ని తెలియజేస్తాను. ఇక ఆ మార్గంపై నడవడం పిల్లల పని. తండ్రి వచ్చి మార్గాన్ని తెలియజేస్తారు, తమతో పాటు తీసుకువెళ్తారు. కేవలం మార్గాన్ని చెప్పడం మాత్రమే కాదు, వారు తమతో పాటు తీసుకువెళ్తారు కూడా. ఈ చిత్రాలు మొదలైనవేవైతే ఉన్నాయో అవి చివరిలో ఎందుకూ ఉపయోగపడవని కూడా అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చేసారు. తండ్రి ఇచ్చే వారసత్వము అనంతమైన రాజ్యాధికారమని పిల్లలు అర్థం చేసుకున్నారు. నిన్న మందిరాలలోకి వెళ్ళేవారు, ఈ పిల్లల (లక్ష్మీ-నారాయణుల) యొక్క మహిమను గానం చేసేవారు. బాబా అయితే వీరిని కూడా పిల్లలు, పిల్లలు అనే అంటారు కదా. ఎవరైతే ఉన్నతోన్నతులుగా అయినందుకు వారిని మహిమ చేసేవారో, వారు ఇప్పుడు స్వయం మళ్ళీ ఉన్నతముగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. ఇది శివబాబాకు కొత్త విషయమేమీ కాదు, పిల్లలైన మీకు ఇది కొత్త విషయము. యుద్ధ మైదానములో పిల్లలు ఉన్నారు. సంకల్ప, వికల్పాలు కూడా వీరిని విసిగిస్తాయి. ఈ దగ్గు కూడా వీరి కర్మల లెక్కాచారమే, దీనిని వీరు అనుభవించాలి. శివబాబా అయితే ఎంతో ఆనందంగా ఉన్నారు, వీరు కర్మాతీతముగా అవ్వాలి. శివబాబా అయితే సదా కర్మాతీత అవస్థలోనే ఉంటారు. నాకు మరియు పిల్లలైన మీకు మాయ తుఫానులు, కర్మభోగాలు మొదలైనవి వస్తాయి. ఇది అర్థం చేయించాలి. తండ్రి అయితే దారిని చూపుతారు, పిల్లలకు అన్నీ అర్థం చేయిస్తారు. ఈ రథానికి ఏమైనా అయితే దాదాకు ఏదో అయ్యింది అని మీకు ఫీలింగ్ వస్తుంది. బాబాకు ఏమీ కాదు, వీరికే అవుతుంది. జ్ఞాన మార్గములో అంధశ్రద్ధతో కూడిన విషయమేదీ ఉండదు. తాను ఏ తనువులోకి వస్తారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు. అనేక జన్మల అంతిమములోని పతిత తనువులోకి నేను ప్రవేశిస్తాను. ఏ విధముగా ఇతర పిల్లలు ఉన్నారో, అలాగే నేనూ ఉన్నాను అని దాదా కూడా అర్థం చేసుకుంటారు. దాదా పురుషార్థీ, వారు సంపూర్ణులు కాదు. ప్రజాపిత బ్రహ్మా పిల్లలైన బ్రాహ్మణులైన మీరందరూ విష్ణు పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తారు. లక్ష్మీ-నారాయణులు అని అనండి, విష్ణువు అనండి, విషయమైతే ఒక్కటే. తండ్రి అర్థం చేయించారు కూడా. ఇంతకుముందు అర్థమయ్యేది కాదు. బ్రహ్మా, విష్ణు, శంకరులనూ అర్థం చేసుకోలేదు, అలాగే తమను తాము కూడా అర్థం చేసుకునేవారు కారు. ఇప్పుడైతే తండ్రిని, బ్రహ్మా, విష్ణు, శంకరులను చూడడంతోనే - ఈ బ్రహ్మా తపస్య చేస్తున్నారు అని బుద్ధిలోకి వస్తుంది. అవే శ్వేత వస్త్రాలు ఉన్నాయి. కర్మాతీత అవస్థ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ బాబా ఫరిశ్తాగా అవుతారు అని ముందుగానే మీకు సాక్షాత్కారమవుతుంది. మేము కర్మాతీత అవస్థను పొంది నంబరువారుగా ఫరిశ్తాగా అవుతామని మీకు కూడా తెలుసు. ఎప్పుడైతే మీరు ఫరిశ్తాలుగా అవుతారో, అప్పుడిక యుద్ధం జరుగుతుంది అని అర్థం చేసుకుంటారు. వేటగానికి వేట, వేటకు మృత్యువు... అన్న ఈ అవస్థ చాలా ఉన్నతమైన అవస్థ. పిల్లలు ధారణ చేయాలి. మేము అంతా చుట్టి వస్తున్నాము అన్న నిశ్చయం కూడా ఉంది. ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. ఇది కొత్త జ్ఞానము మరియు పావనంగా అయ్యేందుకు తండ్రి స్మృతిని నేర్పిస్తారు. తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది అని కూడా అర్థం చేసుకుంటారు. కల్ప-కల్పమూ తండ్రికి పిల్లలుగా అవుతారు, 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చారు. మీరు ఒక ఆత్మ, పరమపిత పరమాత్మ తండ్రి, ఇప్పుడిక ఆ తండ్రిని స్మృతి చేయండి అని మీరు ఎవరికైనా అర్థం చేయించండి, అప్పుడు వారి బుద్ధిలోకి వస్తుంది - దైవీ రాకుమారునిగా అవ్వాలంటే ఇంతటి పురుషార్థము చేయాలి, వికారాలు మొదలైనవన్నీ వదిలివేయాలి అని. తండ్రి అర్థం చేయిస్తున్నారు - సోదరీ, సోదరులుగా కూడా కాదు, పరస్పరం సోదరులుగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి, అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి, ఇంకెటువంటి కష్టమూ లేదు. చివరి సమయములో ఇంకే విషయాల అవసరమూ ఉండదు. కేవలం తండ్రినే స్మృతి చేయాలి, ఆస్తికులుగా అవ్వాలి. ఇలా సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. లక్ష్మీ-నారాయణుల చిత్రము చాలా ఏక్యురేట్ గా ఉంటుంది. కేవలం తండ్రిని మర్చిపోవడం వల్ల దైవీ గుణాలను ధారణ చేయడం కూడా మర్చిపోతారు. పిల్లలూ, ఏకాంతములో కూర్చొని ఆలోచించండి - బాబను స్మృతి చేసి మేము ఈ విధంగా అవ్వాలి, ఈ గుణాలను ధారణ చేయాలి అని. విషయమైతే చాలా చిన్నది. పిల్లలు ఎంతగా కష్టపడవలసి ఉంటుంది. ఎంత దేహాభిమానం వచ్చేస్తుంది. తండ్రి దేహీ-అభిమానీ భవ అని అంటారు. తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే తండ్రిని స్మృతి చేస్తారో అప్పుడు చెత్త తొలగిపోతుంది.

ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారని, బ్రహ్మా ద్వారా వారు కొత్త ప్రపంచ స్థాపనను చేస్తున్నారని పిల్లలకు తెలుసు. స్థాపన జరుగుతోందని పిల్లలైన మీకు తెలుసు. ఇంతటి సహజమైన విషయం కూడా మీ నుండి జారిపోతుంది. భగవంతుడు ఒక్కరే ఉన్నారు, అనంతమైన తండ్రి నుండి రాజ్యాధికారం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా కొత్త ప్రపంచం గుర్తుకు వస్తుంది. అబలలు, గూని ఉన్న స్త్రీలు కూడా చాలా మంచి పదవిని పొందగలుగుతారు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి అయితే దారిని చూపించారు. స్వయాన్ని అత్మగా నిశ్చయం చేసుకోండి అని వారు అంటారు. తండ్రి పరిచయమైతే లభించింది. ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయని, ఇక ఇంటికి వెళ్తామని, మళ్ళీ స్వర్గములోకి వచ్చి పాత్రను అభినయిస్తామని బుద్ధిలో కూర్చుంటుంది. ఎక్కడ స్మృతి చేయాలి, ఎలా స్మృతి చేయాలి? అన్న ప్రశ్నయే ఉత్పన్నమవ్వదు. తండ్రిని స్మృతి చేయాలి అని బుద్ధిలో ఉంది. తండ్రి ఎక్కడకు వెళ్ళినా మీరు వారి పిల్లలే కదా. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. తండ్రిని సమ్ముఖంగా కలుసుకుంటారు. శివబాబా జయంతి ఎలా జరుగుతుంది అని మనుష్యులు తికమకపడతారు! శివరాత్రి అని ఎందుకు అంటారో కూడా అర్థం తెలియదు. రాత్రివేళలో జయంతి జరుగుతుంది అని శ్రీకృష్ణుడిని గురించి భావిస్తారు కానీ, అది ఈ రాత్రి విషయం కాదు. ఆ అర్ధకల్పపు రాత్రి పూర్తవుతుంది, మళ్ళీ తండ్రి కొత్త ప్రపంచ స్థాపనను చేయడానికి రావలసి ఉంటుంది, ఇది చాలా సహజము. ఇది చాలా సహజము అని పిల్లలు స్వయము భావిస్తారు. దైవీ గుణాలను ధారణ చేయాలి, లేకపోతే 100 రెట్ల పాపం పెరుగుతుంది. నన్ను నిందింపజేసేవారు ఉన్నత పదవిని పొందలేరు. తండ్రిని నిందింపజేసినట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. చాలా మధురముగా అవ్వాలి. రఫ్ టఫ్ గా మాట్లాడటము దైవీ గుణము కాదు, ఇది అసురీ అవగుణము అని అర్థం చేసుకోవాలి. ఇది మీ దైవీ గుణము కాదు అని ప్రేమగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఇప్పుడిక కలియుగము పూర్తవుతుందని, ఇది సంగమయుగమని కూడా పిల్లలకు తెలుసు. మనుష్యులకైతే ఏమీ తెలియదు. కుంభకర్ణుని నిద్రలో నిదురిస్తున్నారు. ఇంకా 40 వేల సంవత్సరాలు ఉందని, మేము ఇంకా జీవిస్తాము, సుఖాన్ని అనుభవిస్తాము అని భావిస్తారు. రోజురోజుకు ఇంకా తమోప్రధానముగా అవుతారు అన్నది అర్థం చేసుకోరు. పిల్లలైన మీరు వినాశనము యొక్క సాక్షాత్కారాన్ని కూడా పొందారు. ముందు, ముందు బ్రహ్మా మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారాన్ని కూడా పొందుతూ ఉంటారు. బ్రహ్మా వద్దకు వెళ్ళడం ద్వారా మీరు స్వర్గములో ఇటువంటి యువరాజుగా అవుతారు అని సాక్షాత్కారమవుతుంది, అందుకే ఎక్కువగా బ్రహ్మా మరియు శ్రీకృష్ణుడు, వీరిరువురి సాక్షాత్కారాలు జరుగుతాయి. కొందరికి విష్ణు సాక్షాత్కారం జరుగుతుంది. కానీ దాని ద్వారా అంతగా అర్థం చేసుకోలేరు. నారాయణుని సాక్షాత్కారం జరిగితే అర్థం చేసుకోగలరు. ఇక్కడకు మనం దేవతలుగా అయ్యేందుకు వస్తాము, కావున ఇప్పుడు మీరు సృష్టి ఆదిమధ్యాంతాల పాఠాన్ని చదువుకుంటారు. స్మృతి కోసమే పాఠమును చదివించడం జరుగుతుంది. పాఠాన్ని ఆత్మయే చదువుతుంది. దేహ భానము తొలగిపోతుంది. ఆత్మయే అన్నీ చేస్తుంది. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి.

మధురాతి మధురమైన పిల్లలైన మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు. మీరు ఆ పిల్లలే. ముఖకవళికలు కూడా అలాగే ఉన్నాయి. 5000 సంవత్సరాల క్రితం కూడా మీరే ఉండేవారు. మీరు కూడా అంటారు - బాబా, 5000 సంవత్సరాల తర్వాత మీరే వచ్చి కలుసుకున్నారు, మీరు వారే, మీరే మమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తున్నారు. మనం దేవతలుగా ఉండేవారము, మళ్ళీ అసురులుగా అయ్యాము. దేవతల గుణాలను గానం చేస్తూ స్వయం యొక్క అవగుణాలను వర్ణన చేస్తూ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవ్వాలి ఎందుకంటే ఇప్పుడిక దైవీ ప్రపంచములోకి వెళ్ళాలి. కావున ఇప్పుడు బాగా పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందండి. టీచర్ అయితే అందరికీ చెప్తారు కదా - చదువుకోండి, మంచి మార్కులతో పాస్ అయినట్లయితే నా పేరు కూడా ప్రసిద్ధమవుతుంది, అలాగే మీ పేరు కూడా ప్రసిద్ధమవుతుంది. చాలామంది అంటారు - బాబా, మీ వద్దకు వస్తే ఏదీ బయటకు రాదు, అంతా మర్చిపోతాము, రావడంతోనే మౌనంగా అయిపోతాము. ఈ ప్రపంచం అంతమయినట్లే, మీరు మళ్ళీ కొత్త ప్రపంచములోకి వస్తారు. అది చాలా శోభనీయమైన కొత్త ప్రపంచముగా ఉంటుంది. కొందరు శాంతిధామములో విశ్రాంతిని పొందుతారు. కొందరికి విశ్రాంతియే లభించదు. ఆల్రౌండ్ పాత్ర ఉంటుంది. కానీ వారు తమోప్రధానమైన దుఃఖము నుండి విముక్తులవుతారు. అక్కడ శాంతి, సుఖము, అన్నీ లభిస్తాయి. కావున ఈ విధముగా బాగా పురుషార్థం చేయాలి. భాగ్యములో ఏది ఉంటే అదే లభిస్తుందిలే అని భావించడం కాదు, పురుషార్థం చేయాలి. రాజధాని స్థాపన అవుతోంది అని అర్థం చేసుకోవడం జరుగుతోంది. మనం శ్రీమతముపై మన కొరకు మనం రాజధానిని స్థాపన చేసుకుంటున్నాము. స్వయంగా శ్రీమతాన్ని ఇచ్చే బాబా రాజు మొదలైనవారిగా అవ్వలేదు, వారి శ్రీమతము ద్వారా మనం అవుతాము. ఇది కొత్త విషయం కదా. దీనిని ఎప్పుడూ ఎవ్వరూ వినలేదు, చూడలేదు. శ్రీమతముపై మనం వైకుంఠ రాజ్యాధికారాన్ని స్థాపిస్తున్నాము అని పిల్లలైన మీరు భావిస్తారు. మనం లెక్కలేనన్ని సార్లు రాజ్య స్థాపనను చేసాము, చేస్తాము మరియు పోగొట్టుకుంటాము. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. క్రిస్టియన్ ఫాదర్లు వాకింగ్ చేయటానికి వెళ్ళినప్పుడు వారు ఇంకెవరినీ చూడటానికి కూడా ఇష్టపడరు, కేవలం క్రైస్టు స్మృతిలోనే ఉంటారు. శాంతిగా నడుచుకుంటూ వెళ్తారు. వారికి వివేకం ఉంది కదా. వారు క్రైస్టు స్మృతిలో ఎంతగా ఉంటారు! తప్పకుండా క్రైస్టు సాక్షాత్కారం జరిగి ఉంటుంది. ఫాదర్లు అందరూ అదే విధంగా ఉండరు, కోట్లాదిమందిలో ఏ ఒక్కరో అలా ఉంటారు, మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. కోట్లాదిమందిలో ఏ ఒక్కరో ఇటువంటి స్మృతిలో ఉంటూ ఉండవచ్చు, మీరూ ప్రయత్నించి చూడండి. ఇంకెవ్వరినీ చూడకండి. తండ్రిని స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. మీకు అపారమైన సుఖము ఉంటుంది. శ్రేష్ఠాచారులు అని దేవతలను అంటారు, మనుష్యులను భ్రష్టాచారులు అని అంటారు. ఈ సమయంలో దేవతలు ఎవ్వరూ లేరు. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి - ఇది భారత్ విషయమే. తండ్రి అంటారు - నేను వచ్చి అందరికీ సద్గతిని కలిగిస్తాను, మిగిలిన ఇతర ధర్మాలవారు ఎవరైతే ఉన్నారో వారు తమ-తమ సమయాలలో వచ్చి తమ ధర్మాలను స్థాపన చేస్తారు. అందరూ వచ్చి ఈ మంత్రాన్ని తీసుకువెళ్తారు. తండ్రిని స్మృతి చేయాలి, ఎవరైతే స్మృతి చేస్తారో వారు తమ ధర్మములో ఉన్నత పదవిని పొందుతారు.

పిల్లలైన మీరు పురుషార్థము చేసి ఆత్మిక మ్యూజియంను లేక కాలేజీని తెరవాలి. విశ్వ రాజ్యం లేక స్వర్గ రాజ్యం క్షణములో ఎలా లభించగలదో వచ్చి అర్థం చేసుకోండి అని వ్రాయండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వైకుంఠ రాజ్యాధికారము లభిస్తుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నడుస్తూ-తిరుగుతూ ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి, ఇక వేరే ఏదీ చూస్తున్నా కూడా అది కనిపించకూడదు - ఇటువంటి అభ్యాసము చేయాలి. నాలో దైవీ గుణాలు ఎంతవరకు వచ్చాయి అని ఏకాంతములో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి.

2. తండ్రిని నిందింపజేసే విధమైన కర్మలేవీ చేయకూడదు, దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ మన రాజధానిలోకి రావాలి అన్నది బుద్ధిలో ఉండాలి.

వరదానము:-

సేవలలో శుభభావన యొక్క ఎడిషన్ ద్వారా శక్తిశాలీ ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సఫలతామూర్త భవ

ఏ సేవ చేస్తున్నా, అందులో సర్వ ఆత్మల సహయోగపు భావన ఉండాలి, సంతోషపు భావన మరియు సద్భావన ఉండాలి, అప్పుడు ప్రతి కార్యము సహజంగా సఫలమవుతుంది. ఏ విధంగా పూర్వ కాలంలో ఎవరైనా ఏదైనా కార్యము చెయ్యటానికి వెళ్ళినప్పుడు, వారు మొత్తం పరివారము వారి నుండి ఆశీర్వాదాలను తీసుకుని వెళ్ళేవారు. అలా వర్తమాన సేవలలో దీనిని యాడ్ చేయాలి (కలపాలి). ఏ కార్యమునైనా ప్రారంభించే ముందు అందరి శుభ భావనలను, శుభ కామనలను తీసుకోండి. సర్వుల సంతుష్టత యొక్క బలాన్ని నింపండి, అప్పుడు శక్తిశాలి ఫలం వెలువడుతుంది.

స్లోగన్:-

ఏ విధంగా తండ్రి జీ హాజిర్ అని అంటారో అలా మీరు కూడా సేవలో జీ హాజిర్, జీ హజూర్ (సరే ప్రభూ) అని అన్నట్లయితే పుణ్యం జమ అవుతుంది.