06-12-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు, మీరు ఇక్కడ ఉంటూ కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి మరియు ఆత్మను పావనముగా తయారుచేసుకోవాలి’’

ప్రశ్న:-
తండ్రి మీకు ఇచ్చిన ఏ జ్ఞానము ద్వారా బుద్ధి తాళము తెరుచుకుంది?

జవాబు:-
తండ్రి ఈ అనంతమైన అనాది డ్రామాను గురించి ఎటువంటి జ్ఞానాన్ని ఇచ్చారంటే, దాని ద్వారా బుద్ధిపై ఏదైతే గోద్రెజ్ తాళము వేయబడి ఉందో అది తెరుచుకుంది. రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా అయిపోయారు. తండ్రి జ్ఞానము ఇచ్చారు - ఈ డ్రామాలో ప్రతి ఒక్క పాత్రధారికి తమ-తమ అనాది పాత్ర ఉంది, కల్పపూర్వము ఎవరు ఎంత చదువుకున్నారో వారు ఇప్పుడు కూడా అంతే చదువుకుంటారు, పురుషార్థము చేసి తమ వారసత్వాన్ని తీసుకుంటారు.

ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని నేర్పిస్తారు. ఎప్పటినుండైతే తండ్రిగా అయ్యారో అప్పటినుండే వారు టీచర్ కూడా, అప్పటినుండే సద్గురువు రూపములో శిక్షణను ఇస్తున్నారు. వారు తండ్రి, టీచర్, గురువు కావున వారు చిన్నపిల్లవాడైతే కాదు కదా అని పిల్లలు అర్థం చేసుకున్నారు. వీరు ఉన్నతోన్నతమైనవారు, అందరికన్నా పెద్దవారు. వీరంతా నా పిల్లలు అని తండ్రికి తెలుసు. మీరు వచ్చి మమ్మల్ని పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళండి అని డ్రామా ప్లాన్ అనుసారముగా పిలిచారు కూడా, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు - పావన ప్రపంచము అని సత్యయుగాన్ని, పతిత ప్రపంచము అని కలియుగాన్ని అంటారు. మీరు వచ్చి మమ్మల్ని రావణుని జైలు నుండి విముక్తులుగా చేసి, దుఃఖాల నుండి విడిపించి మా శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళండి అని అంటారు కూడా. ఈ రెండు పేర్లూ బాగున్నాయి. ముక్తి-జీవన్ముక్తి లేక శాంతిధామము-సుఖధామము. శాంతిధామము ఎక్కడ ఉంది, సుఖధామము ఎక్కడ ఉంటుంది అనేది పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ లేదు. పూర్తిగా అవివేకులుగా ఉన్నారు. మీ లక్ష్యము-ఉద్దేశ్యమే వివేకవంతులుగా అవ్వడము. అవివేకులకు ఇటువంటి వివేకులుగా అవ్వాలి అన్న లక్ష్యము ఉంటుంది. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడము అనేది లక్ష్యము-ఉద్దేశ్యము అని అందరికీ నేర్పించాలి. ఇది మనుష్యుల సృష్టి, అది దేవతల సృష్టి. సత్యయుగములో దేవతల సృష్టి ఉంది కావున తప్పకుండా మనుష్యుల సృష్టి కలియుగములోనే ఉంటుంది. ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి కావున తప్పకుండా పురుషోత్తమ సంగమయుగము కూడా ఉంటుంది. వారు దేవతలు, వీరు మనుష్యులు. దేవతలు వివేకులు. తండ్రే ఇలా వివేకవంతులుగా తయారుచేసారు. తండ్రి అయితే విశ్వాధిపతి, వారు అలా అధిపతిగా అవ్వరు కానీ మహిమ అయితే అలా చేస్తారు కదా. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. అనంతమైన సుఖము కొత్త ప్రపంచములోనే ఉంటుంది మరియు అనంతమైన దుఃఖము పాత ప్రపంచములో ఉంటుంది. దేవతల చిత్రాలు కూడా మీ ఎదురుగా ఉన్నాయి. వారి గాయనము కూడా ఉంది. ఈ రోజుల్లోనైతే 5 భూతాలను కూడా పూజిస్తూ ఉంటారు.

ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు, మీరు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు - మన కాలు ఒకటి స్వర్గములో ఉంది, ఇంకొక కాలు నరకములో ఉంది. ఉండేది ఇక్కడే, కానీ బుద్ధి కొత్త ప్రపంచములో ఉంది మరియు ఎవరైతే కొత్త ప్రపంచములోకి తీసుకువెళ్తారో వారిని స్మృతి చేయాలి. తండ్రి స్మృతి ద్వారానే మీరు పవిత్రముగా అవుతారు. ఈ విషయాలను శివబాబా కూర్చుని అర్థం చేయిస్తారు. శివ జయంతినైతే తప్పకుండా జరుపుకుంటారు కానీ శివబాబా ఎప్పుడు వచ్చారు, వారు వచ్చి ఏమి చేసారు, ఇదేమీ తెలియదు. శివరాత్రిని జరుపుతారు మరియు శ్రీకృష్ణ జయంతిని జరుపుతారు, శ్రీకృష్ణుని కోసము ఏ పదాలనైతే ఉపయోగిస్తారో, వాటిని శివబాబా కోసము ఉపయోగించరు కదా, అందుకే వారిది శివరాత్రి అని అంటారు. అర్థమేమీ తెలియదు. పిల్లలైన మీకైతే అర్థము వివరించడం జరుగుతుంది. అపారమైన దుఃఖము కలియుగాంతములో ఉంది, ఆ తర్వాత అపారమైన సుఖాలు సత్యయుగములో ఉంటాయి. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడు లభించింది. మీకు ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. ఎవరైతే కల్పపూర్వము చదువుకున్నారో వారే ఇప్పుడు చదువుకుంటారు, ఎవరు ఎంత పురుషార్థము చేసి ఉంటారో అంతే చేయడం మొదలుపెడతారు మరియు అటువంటి పదవినే పొందుతారు కూడా. మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉంది. మీరే ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు, మళ్ళీ మీరే అలా దిగిపోతారు. తండ్రి అర్థం చేయించారు - ఈ మనుష్య ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారందరి మాల ఉంది కదా, వారంతా నంబరువారుగా వస్తారు. ఏ సమయములో ఎవరు ఏ పాత్రను అభినయించాలి అని ప్రతి పాత్రధారికి తమ-తమ పాత్ర లభించి ఉంది. ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామా, దీనిని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీకు తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, దానిని మీ సోదరులకు అర్థం చేయించాలి. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి మనకు అర్థం చేయిస్తారని, మనం మళ్ళీ సోదరులకు అర్థం చేయిస్తామని మీ బుద్ధిలో ఉంది. ఆత్మ సంబంధములో పరస్పరం సోదరులే. తండ్రి అంటారు, ఈ సమయములో మీరు స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. పావనముగా అయ్యేందుకు ఆత్మయే తన తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మ పవిత్రముగా అయితే శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మ అపవిత్రముగా ఉంటే నగ కూడా అపవిత్రముగా ఉంటుంది. నంబరువారుగా అయితే ఉండనే ఉంటారు. ముఖకవళికలు, నడవడిక ఒకరితో ఒకరిది కలవదు. నంబరువారుగా అందరూ తమ-తమ పాత్రను అభినయిస్తారు. అందులో తేడా రాదు. నాటకములో ఏ సీన్ ను అయితే నిన్న చూసి ఉంటారో, అదే సీన్ ను మళ్ళీ చూస్తారు. అదే రిపీట్ అవుతుంది కదా. ఇదేమో అనంతమైన డ్రామా మరియు ఇది నిన్నటి డ్రామా. నిన్న మీకు అర్థం చేయించాను. మీరు రాజ్యము తీసుకున్నారు, మళ్ళీ దానిని పోగొట్టుకున్నారు. ఈ రోజు మళ్ళీ రాజ్యాన్ని పొందేందుకు అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు భారత్ పాత నరకముగా ఉంది, రేపు కొత్త స్వర్గముగా ఉంటుంది. ఇప్పుడు మనం కొత్త ప్రపంచములోకి వెళ్తున్నామని, శ్రీమతముపై శ్రేష్ఠముగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. శ్రేష్ఠమైనవారు తప్పకుండా శ్రేష్ఠమైన సృష్టిపైనే ఉంటారు. ఈ లక్ష్మీ-నారాయణులు శ్రేష్ఠమైనవారు కావున వారు శ్రేష్ఠమైన స్వర్గములో ఉంటారు. ఎవరైతే భ్రష్టులుగా ఉంటారో వారు నరకములో ఉంటారు. ఈ రహస్యాన్ని మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. ఈ అనంతమైన డ్రామాను ఎవరైనా బాగా అర్థం చేసుకుంటేనే అది బుద్ధిలో కూర్చుంటుంది. శివరాత్రిని కూడా జరుపుకుంటారు కానీ ఏమీ తెలియదు. కావున ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని రిఫ్రెష్ చేయవలసి ఉంటుంది. మీరు మళ్ళీ ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తోంది, ఇక తర్వాత సద్గతిని పొందుతారు. తండ్రి అంటారు, నేను స్వర్గములోకి రాను, నా పాత్రయే పతిత ప్రపంచాన్ని మార్చి పావన ప్రపంచముగా తయారుచేయడము. అక్కడైతే మీ వద్ద అపారమైన ఖజానా ఉంటుంది. ఇక్కడైతే నిరుపేదలుగా ఉన్నారు, అందుకే - మీరు వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వండి అని తండ్రిని పిలుస్తారు. కల్ప-కల్పమూ అనంతమైన వారసత్వము లభిస్తుంది, ఆ తర్వాత నిరుపేదలుగా కూడా అయిపోతారు. చిత్రాలను చూపించి అర్థం చేయించండి, అప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. మొదటి నంబరులో లక్ష్మీ-నారాయణులుగా ఉంటారు, ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ మనుష్యులుగా అయిపోయారు. ఈ జ్ఞానము ఇప్పుడు పిల్లలైన మీకు లభించింది. మీకు తెలుసు - నేటికి 5000 సంవత్సరాల క్రితం ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేది, దానిని వైకుంఠము, ప్యారడైజ్, దైవీ ప్రపంచము అని కూడా అంటారు. ఇప్పుడైతే అలా అనరు. ఇప్పుడైతే ఆసురీ ప్రపంచము ఉంది. ఇప్పుడు ఇది ఆసురీ ప్రపంచపు అంతిమము, దైవీ ప్రపంచపు ఆది యొక్క సంగమము. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, వీటిని ఇంకెవరి నోటి ద్వారా వినలేరు. తండ్రే వచ్చి వీరి నోటిని తీసుకుంటారు. ఎవరి నోటిని తీసుకుంటారు అనేది అర్థం చేసుకోరు. తండ్రి స్వారీ ఎవరిపై ఉంటుంది? ఏ విధంగా మీ ఆత్మ ఈ శరీరముపై స్వారీ చేస్తుందో, అలా శివబాబాకైతే తమ అయితే లేదు, కావున వారికి నోరు తప్పకుండా కావాలి. లేకపోతే రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? ప్రేరణ ద్వారా అయితే నేర్చుకోలేరు. కావున ఈ విషయాలన్నింటినీ హృదయములో నోట్ చేసుకోవాలి. పరమాత్ముని బుద్ధిలో కూడా మొత్తం జ్ఞానమంతా ఉంది కదా. మీ బుద్ధిలో కూడా ఇది కూర్చోవాలి. ఈ జ్ఞానాన్ని బుద్ధి ద్వారా ధారణ చేయాలి. మీ బుద్ధి సరిగ్గానే ఉంది కదా అని అడుగుతారు. బుద్ధి ఆత్మలో ఉంటుంది. ఆత్మయే బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటోంది. మీ బుద్ధిని రాతిబుద్ధిగా ఎవరు తయారుచేసారు? రావణుడు మన బుద్ధిని ఎలా తయారుచేసేసాడు అనేది ఇప్పుడు అర్థం చేసుకుంటారు! నిన్న మీకు డ్రామా గురించి తెలియదు, బుద్ధికి పూర్తిగా గోద్రెజ్ తాళం పడి ఉంది. అందులో ‘గాడ్’ అన్న పదమైతే వస్తుంది కదా. తండ్రి ఏ బుద్ధినైతే ఇస్తారో అది మారి రాతిబుద్ధిగా అయిపోతుంది. మళ్ళీ తండ్రి వచ్చి తాళాన్ని తెరుస్తారు. సత్యయుగములో ఉండేదే పారసబుద్ధి. తండ్రి వచ్చి అందరి కళ్యాణాన్ని చేస్తారు. నంబరువారుగా అందరి బుద్ధి తెరుచుకుంటుంది. ఇక ఒకరి వెనుక ఒకరు వస్తూ ఉంటారు. పైన అయితే ఎవరూ ఉండలేరు. పతితులు అక్కడ ఉండలేరు. తండ్రి పావనముగా తయారుచేసి పావన ప్రపంచములోకి తీసుకువెళ్తారు. అక్కడ అందరూ పావన ఆత్మలే ఉంటారు. అది నిరాకారీ సృష్టి.

పిల్లలైన మీకు ఇప్పుడు అంతా తెలిసింది, అందుకే మన ఇల్లు కూడా చాలా సమీపముగా కనిపిస్తోంది. మీకు ఇంటిపై ఎంతో ప్రేమ ఉంది. మీకు ఉన్న ప్రేమ అయితే ఇంకెవరికీ లేదు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఎవరికైతే తండ్రిపై ప్రేమ ఉంటుందో, వారికి ఇంటిపై కూడా ప్రేమ ఉంటుంది. అతి ప్రియమైన పిల్లలు ఉంటారు కదా. ఇక్కడ ఎవరైతే బాగా పురుషార్థము చేసి అతి ప్రియమైన పిల్లలుగా అవుతారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారు అని మీరు భావిస్తారు. చిన్న లేక పెద్ద అనేది శరీరముపై ఆధారపడి ఉండదు. జ్ఞానము మరియు యోగములో ఎవరైతే నిమగ్నమై ఉంటారో వారు పెద్దవారు. కొందరు చిన్న-చిన్న పిల్లలు కూడా జ్ఞాన-యోగాలలో చురుకుగా ఉన్నారు కావున వారు పెద్దవారిని కూడా చదివిస్తారు. లేకపోతే నియమానుసారముగా పెద్దవారు చిన్నవారిని చదివిస్తారు. ఈ రోజుల్లోనైతే చిన్నవారిగా కూడా తయారైపోతారు. వాస్తవానికి ఆత్మలన్నీ చిన్నవే. ఆత్మ బిందువు, దాని బరువును ఏం తూకం వేస్తాము. అది ఒక సితార. మనుష్యులు సితార అన్న మాట విని ఆకాశములోకి చూస్తారు. మీరు సితార అన్న మాటను విని మిమ్మల్ని మీరు చూసుకుంటారు. ధరిత్రి సితారలు మీరే. అవి ఆకాశములోని జడమైన సితారలు, మీరు చైతన్యమైనవారు. వాటిలో మార్పు ఏమీ ఉండదు, మీరైతే 84 జన్మలు తీసుకుంటారు, ఎంత పెద్ద పాత్రను అభినయిస్తారు. పాత్రను అభినయిస్తూ, అభినయిస్తూ ప్రకాశము తగ్గిపోతుంది, బ్యాటరీ డిస్చార్జ్ అయిపోతుంది. మళ్ళీ తండ్రి వచ్చి భిన్న-భిన్న రకాలుగా అర్థం చేయిస్తారు ఎందుకంటే మీ ఆత్మ ఆరిపోయి ఉంది. ఏ శక్తి అయితే నిండి ఉండేదో, అది అంతమైపోయింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా శక్తిని నింపుకుంటారు. మీరు మీ బ్యాటరీని చార్జ్ చేసుకుంటున్నారు. ఇందులో మాయ కూడా ఎన్నో విఘ్నాలను కలిగిస్తుంది, బ్యాటరీని చార్జ్ చేసుకోనివ్వదు. మీరు చైతన్యమైన బ్యాటరీలు. తండ్రితో యోగాన్ని జోడించడము ద్వారా మనం సతోప్రధానముగా అవుతాము అని మీకు తెలుసు. ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు. ఆ హద్దులోని చదువు మరియు ఈ అనంతమైన చదువులో ఎంతో తేడా ఉంది. ఏ విధముగా నంబరువారుగా ఆత్మలన్నీ పైకి వెళ్తాయి, మళ్ళీ తమ సమయమనుసారముగా పాత్రను అభినయించేందుకు రావాలి. అందరికీ తమ-తమ అవినాశీ పాత్ర లభించి ఉంది. మీరు ఈ 84 జన్మల పాత్రను ఎన్ని సార్లు అభినయించి ఉంటారు! మీ బ్యాటరీ ఎన్ని సార్లు చార్జ్ మరియు డిస్చార్జ్ అయ్యింది! మా బ్యాటరీ డిస్చార్జ్ అయ్యింది అని తెలిసినప్పుడు, మరి చార్జ్ చేసుకోవడానికి ఆలస్యము ఎందుకు చేయాలి? కానీ మాయ బ్యాటరీని చార్జ్ చేసుకోనివ్వదు. మాయ బ్యాటరీని చార్జ్ చేసుకోవాలి అన్నది మీరు మర్చిపోయేలా చేస్తుంది. ఘడియ-ఘడియ బ్యాటరీని డిస్చార్జ్ చేయించేస్తుంది. తండ్రిని స్మృతి చేయాలని ప్రయత్నిస్తారు కానీ చేయలేకపోతారు. మీలో ఎవరైతే బ్యాటరీని చార్జ్ చేసుకుని సతోప్రధానతకు సమీపముగా వస్తారో వారి చేత కూడా మాయ పొరపాట్లు చేయించి డిస్చార్జ్ చేసేస్తుంది. ఇది చివరి వరకూ జరుగుతూనే ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే యుద్ధము అంతమవుతుందో, అప్పుడు అందరూ అంతమైపోతారు, ఇక ఎవరి బ్యాటరీ ఎంతగా చార్జ్ అయి ఉంటుందో దాని అనుసారంగా పదవిని పొందుతారు. ఆత్మలందరూ తండ్రి పిల్లలే, తండ్రే వచ్చి అందరి బ్యాటరీని చార్జ్ చేయిస్తారు. ఈ ఆట ఎంత అద్భుతముగా తయారై ఉంది. తండ్రితో యోగాన్ని జోడించడము నుండి ఘడియ, ఘడియా పక్కకు తప్పుకుంటూ ఉంటే, దాని వలన ఎంత నష్టం వాటిల్లుతుంది. బుద్ధి పక్కకు తప్పుకోకుండా ఉండేందుకు పురుషార్థము చేయించడం జరుగుతుంది. పురుషార్థము చేస్తూ-చేస్తూ ఎప్పుడైతే సమాప్తి అవుతుందో అప్పుడు మళ్ళీ నంబరువారు పురుషార్థానుసారముగా మన పాత్ర పూర్తి అవుతుంది. ఇదే విధముగా కల్ప-కల్పమూ జరుగుతుంది. ఆత్మల మాల తయారవుతూ ఉంటుంది.

రుద్రాక్ష మాల ఉందని, విష్ణువు మాల కూడా ఉందని పిల్లలైన మీకు తెలుసు. మొదటి నంబరులోనైతే వారి మాలను ఉంచుతారు కదా. తండ్రి దైవీ ప్రపంచాన్ని రచిస్తారు. ఏ విధముగా రుద్రమాల ఉందో అలాగే విష్ణు మాల కూడా ఉంది. బ్రాహ్మణుల మాల ఇప్పుడు తయారవ్వజాలదు, మార్పు-చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే రుద్ర మాల తయారవుతుందో అప్పుడు ఫైనల్ అవుతారు. బ్రాహ్మణుల మాల కూడా ఉంది కానీ అది ఈ సమయములో తయారవ్వదు. వాస్తవానికి అందరూ ప్రజాపిత బ్రహ్మా సంతానమే. శివబాబా సంతానము యొక్క మాల కూడా ఉంది, అలాగే విష్ణు మాల అని కూడా అంటారు. మీరు బ్రాహ్మణులుగా అవుతారు, కావున బ్రహ్మా మరియు శివుని మాల కూడా కావాలి. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో నంబరువారుగా ఉంది. వినడమైతే అందరూ వింటారు కానీ కొందరికైతే ఆ సమయములోనే చెవుల నుండి బయటకు వెళ్ళిపోతుంది, వారు విననే వినరు. కొందరైతే చదవనే చదవరు, భగవంతుడు చదివించేందుకు వచ్చారు అన్నది వారికి తెలియనే తెలియదు. వారు చదవనే చదవరు, ఈ చదువునైతే ఎంత సంతోషముగా చదువుకోవాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్మృతియాత్రతో ఆత్మ రూపీ బ్యాటరీని చార్జ్ చేసుకుని సతోప్రధానత వరకూ చేరుకోవాలి. బ్యాటరీ డిస్చార్జ్ అయిపోయే విధముగా ఎటువంటి పొరపాటునూ చేయకూడదు.

2. అతి ప్రియమైన బిడ్డగా అయ్యేందుకు తండ్రితోపాటుగా ఇంటిపై కూడా ప్రేమను ఉంచాలి. జ్ఞాన-యోగాలలో నిమగ్నులవ్వాలి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, దానిని తమ సోదరులకు కూడా అర్థం చేయించాలి.

వరదానము:-

ఒక్క తండ్రినే తమ ప్రపంచముగా చేసుకుని సదా ఒక్కరి ఆకర్షణలోనే ఉండే కర్మ బంధనముక్త భవ

సదా ఇదే అనుభవములో ఉండండి - ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. కేవలం ఒక్క బాబాయే ప్రపంచము, ఇతర ఏ ఆకర్షణా లేదు, ఏ కర్మ బంధనమూ లేదు. తమలో ఉన్న ఎటువంటి బలహీన సంస్కారము యొక్క బంధనము కూడా ఉండకూడదు. ఎవరైనా ఎవరిపైనైనా నా వారు అన్న అధికారాన్ని ఉంచినట్లయితే వారికి క్రోధము లేక అభిమానము వస్తుంది - ఇది కూడా కర్మ బంధనమే. కానీ ఎప్పుడైతే బాబాయే నా ప్రపంచము అన్న స్మృతి ఉంటుందో అప్పుడు నావి, నావి అన్నవన్నీ ఒక్క నా బాబాలో ఇమిడిపోతాయి మరియు కర్మ బంధనాల నుండి సహజముగానే ముక్తులైపోతారు.

స్లోగన్:-

మహాన్ ఆత్మ ఎవరంటే, ఎవరి దృష్టి మరియు వృత్తి అనంతములో ఉంటాయో వారు.