07-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు నడుస్తూ-తిరుగుతూ స్మృతిలో ఉండే అభ్యాసము చేయాలి. జ్ఞానము మరియు యోగము, ఈ రెండే ముఖ్యమైన విషయాలు, యోగము అనగా స్మృతి’’

ప్రశ్న:-
తెలివైన పిల్లలు ఏ మాటను నోటితో మాట్లాడరు?

జవాబు:-
మాకు యోగము నేర్పించండి - ఈ మాటను తెలివైన పిల్లలు మాట్లాడరు. తండ్రిని స్మృతి చేయడము అనేది నేర్చుకోవాల్సి ఉంటుందా ఏమిటి! ఇది చదువుకునేందుకు, చదివించేందుకు పాఠశాల. స్మృతి చేయడం కోసం ప్రత్యేకముగా కూర్చోవాలి అని కాదు. మీరు కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయాలి.

ఓంశాంతి
ఇప్పుడు ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రి ఈ రథము ద్వారా మనకు అర్థం చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మీరు పిల్లలు కావున - నాకు బాబాను స్మృతి చేయడం నేర్పించండి అని తండ్రినైనా లేక సోదరీ, సోదరులనెవరినైనా అడగడమంటే, అది తప్పు అవుతుంది. మీరేమీ చిన్న పిల్లలైతే కాదు కదా. ముఖ్యమైనది ఆత్మ అన్నదైతే తెలుసు. ఆత్మ అవినాశీ. శరీరము వినాశీ. గొప్పది అయితే ఆత్మయే కదా. అజ్ఞాన కాలములో - మనము ఆత్మ అని, శరీరము ద్వారా మాట్లాడుతాము అని ఈ జ్ఞానము ఎవ్వరికీ ఉండదు. దేహాభిమానములోకి వచ్చి - నేను ఇది చేస్తాను అని అంటారు. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అయ్యారు. నేను ఈ శరీరము ద్వారా మాట్లాడుతాను, కర్మలు చేస్తాను అని ఆత్మయే అంటుంది అని మీకు తెలుసు. ఆత్మ పురుష్. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మమ్మల్ని యోగములో కూర్చొబెట్టండి అన్న మాట అనడం చాలా వరకు వినిపిస్తుంది. నేను కూడా బాబా స్మృతిలో కూర్చుంటాను, వీరు కూడా కూర్చుంటారు అన్న ఆలోచనతో ఎదురుగా ఒకరు కూర్చుంటారు. ఇప్పుడు ఈ పాఠశాల ఏమీ దీని కోసము లేదు. పాఠశాల అయితే చదువు కోసముంది. అంతేకానీ మీరు ఇక్కడ కూర్చునే స్మృతి చేయాలని కాదు. తండ్రి అయితే అర్థం చేయించారు - నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ తండ్రిని స్మృతి చేయండి, దీని కోసం ప్రత్యేకముగా కూర్చోవలసిన అవసరం కూడా లేదు. ఏ విధంగానైతే ఎవరైనా రామ-రామ అని అనమని చెప్తే, మరి రామ-రామ అని అనకుండా స్మృతి చేయలేరా? స్మృతి అయితే నడుస్తూ-తిరుగుతూ చేయవచ్చు. మీరైతే కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ప్రేయసి-ప్రియుడు ఏమీ ప్రత్యేకముగా కూర్చుని ఒకరినొకరు స్మృతి చేయరు. కార్యవ్యవహారాలు, వ్యాపారము మొదలైనవన్నీ చేయాలి, అన్నీ చేస్తూ తమ ప్రియుడిని స్మృతి చేస్తూ ఉండండి. అంతేకానీ వారిని స్మృతి చేయడం కోసం విశేషముగా ఎక్కడికైనా వెళ్ళి కూర్చోవాలని ఏమీ కాదు.

పిల్లలైన మీరు పాటలు మరియు కవితలు మొదలైనవి వినిపిస్తే బాబా ఇది భక్తి మార్గము అని అంటారు. శాంతిదేవా అని అంటారు కూడా అంటే పరమాత్మనే స్మృతి చేస్తారు, అంతేకానీ శ్రీకృష్ణుడిని కాదు. డ్రామానుసారముగా ఆత్మ అశాంతిగా అయిపోయింది, అందుకే తండ్రిని పిలుస్తుంది ఎందుకంటే శాంతి, సుఖము, జ్ఞానము యొక్క సాగరుడు వారే. జ్ఞానము మరియు యోగము, ఈ రెండూ ముఖ్యమైన విషయాలు, యోగము అనగా స్మృతి. వారి హఠయోగము పూర్తిగా వేరు. మీది రాజయోగము. తండ్రిని కేవలం స్మృతి చేయాలి. తండ్రి ద్వారా మీరు తండ్రిని తెలుసుకోవడముతో సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. మీకు అన్నింటికంటే పెద్ద సంతోషమైతే ఇదే - మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. భగవంతునిది కూడా మొట్టమొదట పూర్తి పరిచయము కావాలి. ఏ విధంగా ఆత్మ ఒక నక్షత్రమో, అలాగే భగవంతుడు కూడా నక్షత్రమేనని ఇలా ఎప్పుడూ తెలియలేదు. వారు కూడా ఆత్మయే. కానీ వారిని పరమ ఆత్మ, సుప్రీమ్ సోల్ అని అంటారు. వారు ఎప్పుడూ పునర్జన్మలనైతే తీసుకోరు. వారు జనన-మరణాలలోకి వస్తారని కాదు. అలా కాదు, వారు పునర్జన్మలు తీసుకోరు. వారు ఎలా వస్తారు అనేది వారు స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. త్రిమూర్తి యొక్క గాయనము కూడా భారత్ లో ఉంది. త్రిమూర్తి బ్రహ్మా-విష్ణు-శంకరుల చిత్రాన్ని కూడా చూపిస్తారు. శివ పరమాత్మాయ నమః అని అంటారు కదా. ఆ ఉన్నతోన్నతుడైన తండ్రిని మర్చిపోయారు, కేవలం త్రిమూర్తి చిత్రాన్ని చూపించారు. పైన శివుడైతే తప్పకుండా ఉండాలి, తద్వారా వీరి రచయిత శివుడు అని అర్థం చేసుకుంటారు. రచన నుండి ఎప్పుడూ వారసత్వము లభించదు. బ్రహ్మా నుండి వారసత్వమేమీ లభించదు అని మీకు తెలుసు. విష్ణువుకైతే వజ్ర-వైఢూర్యాలతో పొదగబడిన కిరీటము ఉంది కదా. శివబాబా ద్వారా పైసకు కొరగానివారి నుండి ఎంతో విలువైనవారిగా అయ్యారు. శివుని చిత్రము లేకపోవడం వలన మొత్తం ఖండితమైపోతుంది. ఉన్నతోన్నతమైనవారు పరమపిత పరమాత్మ, వీరు వారి రచన. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి నుండి 21 జన్మల కొరకు స్వర్గ వారసత్వము లభిస్తుంది. అక్కడైతే ఎంతైనా లౌకిక తండ్రి నుండి వారసత్వము లభించింది అని అర్థం చేసుకుంటారు కానీ ఇది అనంతమైన తండ్రి నుండి పొందిన ప్రారబ్ధమని అక్కడ తెలియదు. ఇది మీకు ఇప్పుడు తెలుసు. ఇప్పటి సంపాదన అక్కడ 21 జన్మలు నడుస్తుంది. అక్కడ ఈ విషయాలు తెలియవు, ఈ జ్ఞానము గురించి అస్సలు తెలియదు. ఈ జ్ఞానము దేవతలలోనూ లేదు, శూద్రులలోనూ ఉండదు. ఈ జ్ఞానము కేవలం బ్రాహ్మణులైన మీలో మాత్రమే ఉంది. ఇది ఆత్మిక జ్ఞానము, ఆధ్యాత్మికత యొక్క అర్థము కూడా తెలియదు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని అంటారు. డాక్టర్ ఆఫ్ స్పిరిచ్యుయల్ నాలెడ్జ్ ఒక్క తండ్రి మాత్రమే. తండ్రిని సర్జన్ అని కూడా అంటారు కదా. సాధు-సన్యాసులు మొదలైనవారెవ్వరూ సర్జన్ ఏమీ కారు. వేద-శాస్త్రాలు మొదలైనవి చదివేవారిని డాక్టర్ అని అనరు కదా. టైటిల్ కూడా ఇచ్చేస్తారు కానీ వాస్తవానికి ఆత్మిక సర్జన్ ఒక్క తండ్రియే, వారు ఆత్మకు ఇంజెక్షన్ చేస్తారు. అది భక్తి. వారిని డాక్టర్ ఆఫ్ భక్తి అని అనాలి అనగా శాస్త్రాల జ్ఞానాన్ని ఇస్తారు. దాని వలన లాభమేమీ ఉండదు, కిందకు పడిపోతూనే ఉంటారు. మరి వారిని డాక్టర్ అని ఎలా అంటారు? డాక్టర్ అయితే లాభాన్ని చేకూరుస్తారు కదా. ఈ తండ్రి అయితే అవినాశీ జ్ఞాన సర్జన్. యోగబలముతో మీరు సదా ఆరోగ్యవంతముగా అవుతారు. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బయటివారికి ఏమి తెలుసు. వారిని అవినాశీ సర్జన్ అని అంటారు. ఆత్మలలో ఏవైతే వికారాల మాలిన్యము చేరిందో, దానిని తొలగించడము, పతితులను పావనముగా తయారుచేసి సద్గతిని ఇవ్వడము - ఈ శక్తి తండ్రిలో ఉంది. ఆల్మైటీ (సర్వశక్తివంతుడు), పతిత-పావనుడు తండ్రి ఒక్కరే. ఆల్మైటీ అని మనుష్యమాత్రులను అనలేరు. మరి తండ్రి ఏ శక్తిని చూపిస్తారు? సర్వులకు తన శక్తితో సద్గతిని ఇస్తారు. వారిని డాక్టర్ ఆఫ్ స్పిరిచ్యుయల్ నాలెడ్జ్ అని అంటారు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పొందినవారు ఎంతోమంది ఉన్నారు. స్పిరిచ్యుయల్ డాక్టర్ మాత్రము ఒక్కరే. కావున ఇప్పుడు తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రముగా అవ్వండి. నేను వచ్చిందే పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేయడానికి, మరి మీరు పతితముగా ఎందుకు అవుతారు? పావనముగా అవ్వండి, పతితముగా అవ్వకండి. ఆత్మలందరికీ తండ్రి ఇస్తున్న డైరెక్షన్ ఏమిటంటే - గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా ఉండండి. బాల బ్రహ్మచారులుగా అయినట్లయితే ఇక పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇన్ని జన్మలు ఏయే పాపాలైతే చేసారో, ఇప్పుడు నన్ను స్మృతి చేయడం ద్వారా పాపాలు భస్మమైపోతాయి. మూలవతనములో పవిత్ర ఆత్మలే ఉంటాయి. పతితులెవ్వరూ వెళ్ళలేరు. బాబా మమ్మల్ని చదివిస్తున్నారని బుద్ధిలో ఇది గుర్తు పెట్టుకోవాల్సిందే. మాకు టీచరును స్మృతి చేయడం నేర్పించండి అని విద్యార్థి ఏమైనా అంటారా? స్మృతి చేయడం నేర్పించవలసిన అవసరమేముంది. ఇక్కడ గద్దెపై ఎవరూ కూర్చోకపోయినా సరే ఏం పర్వాలేదు. తమ తండ్రిని స్మృతి చేయాలి. మీరు రోజంతా వ్యాపార, వ్యవహారాలు మొదలైనవాటిలో ఉంటే మర్చిపోతారు, అందుకే కనీసం ఈ 10-15 నిముషాలైనా స్మృతి చేస్తారని ఇక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది. పిల్లలైన మీరైతే కార్య వ్యవహారాలు చేసుకుంటూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. అర్ధకల్పము తర్వాత ప్రియుడు కలుస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ నుండి మాలిన్యము తొలగిపోతుంది మరియు మీరు విశ్వానికి యజమానులుగా అయిపోతారు అని ఇప్పుడు చెప్తారు. మరి వారిని ఎందుకు స్మృతి చేయకూడదు. స్త్రీకి ముడి వేసేటప్పుడు, పతియే నీకు గురువు, ఈశ్వరుడు, సర్వస్వమూ అని చెప్తారు. కానీ ఆమె మిత్ర-సంబంధీకులు, గురువులు మొదలైన ఎంతోమందిని స్మృతి చేస్తుంది. అది దేహధారులు స్మృతి. ఇక్కడ వీరైతే పతులకే పతి, వీరిని స్మృతి చేయాలి. కొందరు, మమ్మల్ని యొగములో కూర్చోబెట్టండి అని అంటారు. కానీ దాని వలన ఏం జరుగుతుంది. ఇక్కడ పది నిముషాలు కూర్చున్నా ఏకరస స్థితిలో కూర్చుంటారనేమీ భావించకండి. భక్తి మార్గములో ఎవరినైనా పూజించేందుకు కూర్చున్నపుడు బుద్ధి చాలా భ్రమిస్తూ ఉంటుంది. నవవిధ భక్తి చేసేవారికి, మాకు సాక్షాత్కారము కలగాలి అన్న ఈ తపనే వెంటాడుతూ ఉంటుంది. ఆ ఆశతో పెట్టుకుని కూర్చుని ఉంటారు. ఒక్కరి ప్రేమతో కూడిన లగనములో లవలీనమైపోతారు, అప్పుడు సాక్షాత్కారమవుతుంది. వారిని నవవిధ భక్తులు అని అంటారు. ఆ భక్తి ఎలా ఉంటుందంటే, ప్రేయసీ ప్రియుల మధ్యన సంబంధములా ఉంటుంది. తింటూ, తాగుతూ బుద్ధిలో వారి స్మృతి ఉంటుంది. వారిలో వికారాల విషయమేమీ ఉండదు. శరీరము పట్ల ప్రేమ కలుగుతుంది. ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేకపోతారు.

ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు - నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు 84 జన్మలను ఎలా తీసుకున్నారు. బీజాన్ని స్మృతి చేయడం ద్వారా మొత్తం వృక్షమంతా స్మృతిలోకి వస్తుంది. ఇది వెరైటీ ధర్మాల వృక్షము కదా. భారత్ ఒకప్పుడు గోల్డెన్ ఏజ్ లో ఉండేదని, ఇప్పుడు ఐరన్ ఏజ్ లో ఉందని కేవలం మీ బుద్ధిలో మాత్రమే ఉంది. ఈ ఇంగ్లీష్ పదాలు బాగున్నాయి, ఈ పదాలతో అర్థము బాగా తెలియజేయబడుతుంది. ఆత్మ సత్యమైన బంగారములా ఉంటుంది, తర్వాత అందులో మాలిన్యము కలుస్తుంది. ఇప్పుడు పూర్తిగా అసత్యముగా అయిపోయింది, దానిని ఇనుపయుగపు ఆత్మ అని అంటారు. ఆత్మలు ఇనుపయుగ ఆత్మలుగా అయ్యేటప్పటికి ఆభరణాలు కూడా అలాగే అయిపోయాయి. ఇప్పుడు తండ్రి అంటారు, నేను పతిత-పావనుడిని, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఓ పతిత-పావనా రండి అని నన్ను పిలుస్తారు. నేను కల్ప-కల్పము వచ్చి మీకు ఈ యుక్తిని తెలియజేస్తాను. మన్మనాభవ, మధ్యాజీభవ అనగా స్వర్గానికి యజమానులుగా అవ్వండి అని అర్థము. కొందరు అంటారు, మాకు యోగములో చాలా ఆనందము కలుగుతుంది కానీ జ్ఞానములో అంత ఆనందము కలుగదు. ఇక వారు కేవలం యోగం చేసి వెళ్ళిపోతారు. యోగమే బాగా అనిపిస్తుంది, మాకైతే శాంతి కావాలి అని అంటారు. అచ్ఛా, తండ్రినైతే ఎక్కడైనా కూర్చుని స్మృతి చేయండి. స్మృతి చేస్తూ-చేస్తూ మీరు శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇందులో యోగము నేర్పించే విషయమే లేదు. తండ్రిని స్మృతి చేయాలి. చాలా మంది ఎటువంటివారు ఉన్నారంటే - వారు సెంటర్లకు వెళ్లి అరగంట, పావుగంట కూర్చుంటారు, మాకు యోగము చేయించండి అని అంటారు లేదా బాబా యోగము చేయమని ప్రోగ్రామ్ ఇచ్చారు అని అంటారు. ఇక్కడ బాబా అంటారు, నడుస్తూ, తిరుగుతూ స్మృతిలో ఉండండి. అసలు స్మృతి చేయకుండా ఉండడం కన్నా కూర్చుని స్మృతి చేయడం మంచిదే. బాబా వద్దు అని చెప్పడం లేదు, కావాలంటే రాత్రంతా కూర్చోండి, కానీ రాత్రి మాత్రమే స్మృతి చేయాలి అనే అలవాటు చేసుకోకూడదు. కార్య వ్యవహారాలు చేసుకుంటూ స్మృతి చేయాలి అన్న అలవాటు చేసుకోవాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. బుద్ధి ఘడియ, ఘడియ వేరే వైపులకు పరిగెడుతూ ఉంటుంది. భక్తి మార్గములో కూడా బుద్ధి పరిగెడుతూ ఉంటుంది, అప్పుడు భక్తులు తమని తాము గిల్లుకుంటారు. సత్యమైన భక్తులు ఎవరైతే ఉన్నారో, వారి గురించి చెప్తున్నారు. కావున ఇక్కడ కూడా మీతో మీరు ఇలాంటి, ఇలాంటి మాటలు మాట్లాడుకోవాలి. బాబాను ఎందుకు స్మృతి చేయలేదు? స్మృతి చేయకపోతే విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారు? ప్రేయసీ, ప్రియులైతే నామ-రూపాలలో చిక్కుకుని ఉంటారు. ఇక్కడైతే మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తారు. ఆత్మ అయిన మనము ఈ శరీరము నుండి వేరుగా ఉన్నాము. శరీరములోకి రావడము వలన కర్మలు చేయవలసి ఉంటుంది. మాకు సాక్షాత్కారము కలగాలి అని అనేవారు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు సాక్షాత్కారములో ఏం చూస్తారు. వారు ఒక బిందువు కదా. అచ్ఛా, కొందరు శ్రీకృష్ణుడి సాక్షాత్కారము కావాలి అని అంటారు. శ్రీకృష్ణుడైతే చిత్రము కూడా ఉంది కదా. జడ రూపములో ఉన్న వారిని మళ్ళీ చైతన్యములో చూస్తారు, దాని వల్ల లాభమేమి కలిగింది? సాక్షాత్కారాల వల్ల లాభమేమీ ఉండదు. మీరు తండ్రిని స్మృతి చేస్తే ఆత్మ పవిత్రముగా అవుతుంది. నారాయణుడి సాక్షాత్కారము కలిగినంత మాత్రాన నారాయణుడిగా అయిపోరు కదా.

లక్ష్మీ-నారాయణులుగా తయారవ్వడమే మన లక్ష్యము-ఉద్దేశ్యము అని మీకు తెలుసు కానీ చదవకుండా అలా అవ్వలేరు కదా. చదువుకుని తెలివైనవారిగా అవ్వండి, ప్రజలను కూడా తయారుచేసుకోండి, అప్పుడు లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఇందులో కష్టపడాలి. ధర్మరాజు శిక్షలు లభించకుండా ఉండేందుకు పాస్ విత్ ఆనర్ గా అవ్వాలి. ఈ అత్యంత ప్రియమైన బిడ్డ కూడా మీతోపాటు ఉన్నారు. మీరు చురుకుగా ముందుకు వెళ్ళవచ్చని వీరు కూడా అంటారు. బాబాపైనైతే ఎంత భారము ఉంది. మొత్తం రోజంతా ఎంతగా ఆలోచించవలసి ఉంటుంది. నేను అంతగా స్మృతి చేయలేకపోతాను. భోజనము చేసేటప్పుడు కాసేపు స్మృతి ఉంటుంది, మళ్ళీ మర్చిపోతాను. బాబా మరియు నేను, ఇద్దరమూ షికారుకు వెళ్తున్నాము అని అనుకుంటాను, షికారు చేస్తూ, చేస్తూ బాబాను మర్చిపోతాను. ఇది జారిపోయే వస్తువు కదా. ఘడియ, ఘడియ స్మృతి జారిపోతుంది. ఇందులో చాలా శ్రమ ఉంది. స్మృతితోనే ఆత్మ పవిత్రముగా అవ్వనున్నది. అనేకులను చదివిస్తే ఉన్నత పదవిని పొందుతారు. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారు మంచి పదవిని పొందుతారు. ప్రదర్శనీలో ఎంతమంది ప్రజలు తయారవుతారు. మీరు ఒక్కొక్కరూ లక్షలాది మంది సేవ చేస్తారు, అలాగే మీ అవస్థ కూడా అలా ఉండాలి. కర్మాతీత అవస్థ ఏర్పడితే ఇక శరీరము ఉండదు. ఇప్పుడిక యుద్ధము తీవ్రత పెరుగుతుంది, ఇక ఎంతోమంది మీ వద్దకు వస్తూ ఉంటారు అని మున్ముందు మీకు అర్థమవుతుంది. మహిమ పెరుగుతూ ఉంటుంది. అంతిమములో సన్యాసులు కూడా వస్తారు, తండ్రిని స్మృతి చేయడం మొదలుపెడతారు. ముక్తిధామానికి వెళ్ళడమే వారి పాత్ర. జ్ఞానమైతే తీసుకోరు. మీ సందేశము ఆత్మలందరి వద్దకు చేరుకోవాలి, వార్తాపత్రికల ద్వారా ఎంతోమంది వింటారు. ఎన్ని ఊర్లు ఉన్నాయి, అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. సందేశాన్ని ఇచ్చే మెసెంజర్, పైగంబర్ మీరే. పతితము నుండి పావనముగా తయారుచేసేవారు తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. ధర్మ స్థాపకులు ఎవరినీ పావనముగా చేస్తారని కాదు. వారి ధర్మము వృద్ధి చెందవలసి ఉంటుంది, మరి వారు తిరిగి వెళ్ళే మార్గాన్ని ఎలా చెప్తారు? సర్వుల సద్గతిదాత ఒక్కరే. పిల్లలైన మీరు ఇప్పుడు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. పవిత్రముగా ఉండనివారు ఎంతోమంది ఉన్నారు. కామము మహాశత్రువు కదా. మంచి-మంచి పిల్లలు పడిపోతారు, చెడు దృష్టి కూడా కామము యొక్క అంశమే. ఇది పెద్ద సైతాను. తండ్రి అంటారు, దీనిపై విజయము పొందడం ద్వారా జగత్ జీతులుగా అవుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కార్య-వ్యవహారాలు చేసుకుంటూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. తండ్రితోపాటు వెళ్ళేందుకు మరియు కొత్త పావన ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి.

2. ఉన్నత పదవిని పొందేందుకు అనేకుల సేవ చేయాలి. అనేకులను చదివించాలి. సందేశకులుగా అయి ఈ సందేశాన్ని అందరి వద్దకూ చేర్చాలి.

వరదానము:-
స్నేహమనే ఒడిలో ఆంతరిక సుఖాన్ని మరియు సర్వ శక్తులను అనుభవం చేసే యథార్థ పురుషార్థీ భవ

ఎవరైతే యథార్థ పురుషార్థులో, వారు ఎప్పుడూ శ్రమను లేక అలసటను అనుభవం చేయరు, సదా ప్రేమలో ఆనందముగా లీనమై ఉంటారు. వారు సంకల్పము ద్వారా కూడా సమర్పితమైన కారణముగా ఎలా అనుభవం చేస్తారంటే - మమ్మల్ని బాప్ దాదా నడిపిస్తున్నారు, శ్రమ అనే కాళ్ళతో కాకుండా స్నేహమనే ఒడిలో వెళ్తున్నాము. స్నేహమనే ఒడిలో సర్వ ప్రాప్తుల అనుభూతి కలిగిన కారణముగా వారు నడవడం కాదు, సదా సంతోషములో, ఆంతరిక సుఖములో, సర్వ శక్తుల అనుభవములో ఎగురుతూ ఉంటారు.

స్లోగన్:-
నిశ్చయము రూపీ పునాది పక్కాగా ఉన్నట్లయితే శ్రేష్ఠ జీవితము యొక్క అనుభవము స్వతహాగా అవుతుంది.

అవ్యక్త సూచనలు - ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

‘అనేకతలో ఏకత’ - ప్రాక్టికల్ గా అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రూపాలు, రంగులు కానీ అనేకత ఉన్నప్పటికీ అందరి హృదయాలలో ఏకత ఉంది కదా! ఎందుకంటే హృదయములో ఒక్క తండ్రి ఉన్నారు, ఒకే శ్రీమతముపై నడిచేవారు. అనేక భాషలవారై ఉన్నప్పటికీ మనసు పాడే పాట, మనసు యొక్క భాష ఒక్కటే.