07-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇది అనాది అవినాశీ తయారై, తయారుచేయబడిన డ్రామా, ఇందులో ఏ దృశ్యమైతే గతించిపోయిందో, అది మళ్ళీ కల్పము తర్వాతనే రిపీట్ అవుతుంది, అందుకే సదా నిశ్చింతగా ఉండండి’’

ప్రశ్న:-
ఈ ప్రపంచము తన తమోప్రధాన స్థితికి చేరుకుంది, దానికి గుర్తులు ఏమిటి?

జవాబు:-
రోజురోజుకూ ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి, ఎంతగా గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. దొంగలు ఏ విధంగా మనుష్యులను కొట్టి దోచుకుని వెళ్ళిపోతున్నారు. అకాల వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఎంత నష్టము జరుగుతుంది. ఇవన్నీ తమోప్రధానతకు గుర్తులు. తమోప్రధాన ప్రకృతి దుఃఖమిస్తూ ఉంటుంది. పిల్లలైన మీకు డ్రామా రహస్యము తెలుసు, అందుకే మీరు - నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు) అని అంటారు.

ఓంశాంతి
ఇప్పుడు పిల్లలైన మీపై జ్ఞాన వర్షము కురుస్తూ ఉంది. మీరు సంగమయుగము వారు, మిగిలిన మనుష్యులందరూ కలియుగము వారు. ఈ సమయములో ప్రపంచములో అనేక మత మతాంతరాలు (అభిప్రాయాలు మరియు ఆలోచనలు) ఉన్నాయి. పిల్లలైన మీది ఒకే మతము. ఆ ఒక్క మతము భగవంతునిదే లభిస్తుంది. వారు భక్తి మార్గములో జపతపాదులు, తీర్థయాత్రలు మొదలైనవేవైతే చేస్తూ ఉంటారో, అవన్నీ భగవంతుడిని కలుసుకునేందుకు మార్గాలు అని భావిస్తారు. భక్తి తర్వాతనే భగవంతుడు లభిస్తారు అని అంటారు. కానీ అసలు భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది మరియు అది ఎప్పటివరకు నడుస్తుంది అన్నది వారికి తెలియనే తెలియదు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారు అని కేవలం అంటారు అంతే, అందుకే అనేక రకాల భక్తిని చేస్తూ ఉంటారు. మేము పరంపరగా భక్తి చేస్తూ వచ్చాము కావున ఏదో ఒక రోజు భగవంతుడు తప్పకుండా లభిస్తారు, ఏదో ఒక రూపములో భగవంతుడు లభిస్తారు - అని వారు స్వయం భావిస్తారు. మరి వారు వచ్చి ఏమి చేస్తారు? తప్పకుండా సద్గతిని ఇస్తారు ఎందుకంటే వారు ఉన్నదే సర్వుల సద్గతిదాత. భగవంతుడు ఎవరు, వారు ఎప్పుడు వస్తారు, ఇది కూడా ఎవరికీ తెలియదు. మహిమ రకరకాలుగా చేస్తూ ఉంటారు, భగవంతుడు పతిత-పావనుడు, జ్ఞాన సాగరుడు అని అంటారు. జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది. భగవంతుడు నిరాకారుడని కూడా వారికి తెలుసు. ఆత్మ అయిన మనము కూడా నిరాకారియే, ఆ తర్వాత శరీరము తీసుకుంటాము. ఆత్మలమైన మనము కూడా తండ్రితో పాటుగా పరంధామ నివాసులము. మనము ఇక్కడి వాసులము కాము. వాస్తవానికి వారు ఎక్కడి నివాసులు అనేది కూడా యథార్థముగా తెలియజేయరు. కొందరు - మేము స్వర్గములోకి వెళ్ళిపోతాము అని భావిస్తారు. ఇప్పుడు నేరుగా స్వర్గములోకైతే ఎవరూ వెళ్ళేది లేదు. కొందరేమో జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది అని అంటారు. ఇది కూడా తప్పే. అలా అంటూ ఆత్మను వినాశీగా చేసేసారు. మోక్షము కూడా లభించదు. ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉన్నది, అదే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు... అని అంటారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. చరిత్ర, భూగోళము రిపీట్ అవుతుంది. కానీ చక్రము ఎలా తిరుగుతుంది, ఇది ఎవరికీ తెలియదు. చక్రము గురించీ తెలియదు, ఈశ్వరుని గురించీ తెలియదు. భక్తి మార్గములో ఎంతగా భ్రమిస్తూ ఉంటారు. భగవంతుడు ఎవరు అనేది మీకు తెలుసు. భగవంతుడిని తండ్రి అని కూడా అంటారు కావున బుద్ధిలోకి రావాలి కదా. లౌకిక తండ్రి కూడా ఉన్నారు, అయినా మనము ఆ తండ్రిని (భగవంతుడిని) స్మృతి చేస్తాము కావున ఇద్దరు తండ్రులు అయినట్లు - లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి. ఆ పారలౌకిక తండ్రిని కలుసుకునేందుకు ఎంతో భక్తి చేస్తారు. వారు పరలోకములో ఉంటారు. నిరాకారీ ప్రపంచము కూడా తప్పకుండా ఉంది.

మనుష్యులు ఏదైతే చేస్తారో, అదంతా భక్తి మార్గమని మీకు బాగా తెలుసు. రావణ రాజ్యములో అంతా భక్తియే జరుగుతూ వచ్చింది. జ్ఞానమనేది ఉండదు. భక్తి ద్వారా ఎప్పుడూ సద్గతి లభించదు. సద్గతిని ఇచ్చే తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే, తప్పకుండా వారు ఎప్పుడో అప్పుడు వచ్చి సద్గతిని ఇస్తారు. ఇది పూర్తిగా తమోప్రధాన ప్రపంచమని మీకు తెలుసు. సతోప్రధానముగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానముగా ఉన్నారు, ఎన్ని ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి. చాలా గొడవలు, కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. దొంగలు కూడా దోచుకుంటూ ఉంటారు. దొంగలు ఎంతగా కొట్టి ధనాన్ని దోచుకుని తీసుకువెళ్ళిపోతారు. ఎలాంటి మందులు ఉన్నాయంటే వాటి వాసనను పీల్చుకునేలా చేసి మూర్ఛితులుగా చేసేస్తారు. ఇది రావణ రాజ్యము. ఇది చాలా పెద్ద అనంతమైన ఆట. ఇది తిరగడానికి 5000 సంవత్సరాలు పడుతుంది. ఈ ఆట కూడా డ్రామా వంటిది. దీనిని నాటకము అని అనరు. నాటకములో అనుకోండి, నటులెవరైనా అనారోగ్యముపాలైతే, వారికి బదులుగా ఇంకొకరిని పెడతారు. ఇందులోనైతే అలా జరగదు. ఇది అనాది డ్రామా కదా. ఎవరైనా అనారోగ్యముపాలైతే, ఆ విధంగా అనారోగ్యముపాలవ్వడము కూడా డ్రామాలోని పాత్ర అని అంటారు. ఇది అనాదిగా తయారై, తయారుచేయబడినది. ఇతరులెవరితోనైనా ఇది డ్రామా అని చెప్పినట్లయితే వారు తికమకపడతారు. ఇది అనంతమైన నాటకము అని మీకు తెలుసు. కల్పము తర్వాత మళ్ళీ ఈ నటులే ఉంటారు. ఏ విధంగా ఇప్పుడు వర్షము పడడం మొదలైనవి జరుగుతాయో అలాగే కల్పము తర్వాత మళ్ళీ ఈ విధంగానే జరుగుతుంది. మళ్ళీ ఈ ఉపద్రవాలే జరుగుతాయి. పిల్లలైన మీకు తెలుసు - జ్ఞాన వర్షమైతే అందరిపైనా కురవదు కానీ ఈ శబ్దము అందరి చెవుల వరకు తప్పకుండా చేరుకుంటుంది - జ్ఞాన సాగరుడైన భగవంతుడు వచ్చారు అని. మీకు ముఖ్యమైనది యోగము. జ్ఞానాన్ని కూడా మీరు వింటారు. ఆ స్థూలమైన వర్షమైతే మొత్తము ప్రపంచమంతటిపైనా కురుస్తూ ఉంటుంది. మీ యోగముతో స్థిరమైన శాంతి ఏర్పడుతుంది. స్వర్గ స్థాపన చేయడానికి భగవంతుడు వచ్చారని మీరు అందరికీ వినిపిస్తారు. కానీ తమను తాము భగవంతునిగా భావించేవారు కూడా అనేకమంది ఉన్నారు. కావున మీ మాటను ఎవరు నమ్ముతారు, అందుకే తండ్రి అర్థం చేయిస్తారు - కోట్లలో ఏ ఒక్కరో వెలువడుతారు అని. భగవంతుడైన తండ్రి వచ్చారని మీలో కూడా నంబరువారుగా తెలుసు. తండ్రి నుండైతే వారసత్వాన్ని తీసుకోవాలి కదా. తండ్రిని ఎలా స్మృతి చేయాలి అనేది కూడా అర్థం చేయించారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనుష్యులైతే దేహాభిమానులుగా అయిపోయారు. తండ్రి అంటారు, ఎప్పుడైతే మనుష్యాత్మలందరూ పతితులుగా అయిపోతారో, ఆ సమయములోనే నేను వస్తాను. మీరు ఎంత తమోప్రధానముగా అయిపోయారు. ఇప్పుడు నేను మిమ్మల్ని సతోప్రధానముగా తయారుచేయడానికి వచ్చాను. కల్పపూర్వము కూడా నేను మీకు ఈ విధంగా అర్థం చేయించాను. మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా ఎలా అవుతారు? కేవలం నన్ను ఒక్కడినే స్మృతి చేయండి. నేను మీకు నా పరిచయాన్ని మరియు రచన యొక్క పరిచయాన్ని ఇవ్వడానికి వచ్చాను. రావణ రాజ్యములో ఆ తండ్రిని అందరూ స్మృతి చేస్తూనే ఉంటారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి ఉన్నదే అశరీరి, వారు బిందువు కదా. వారికి పేరు పెట్టడం జరిగింది. మిమ్మల్ని సాలిగ్రామాలు అని అంటారు మరియు తండ్రిని శివుడు అని అంటారు. పిల్లలైన మీకు శారీరానికి పేర్లు పెట్టడం జరుగుతుంది. తండ్రి ఉన్నదే పరమ ఆత్మ. వారు శరీరాన్ని తీసుకునేది లేదు. వారు ఇతనిలోకి ప్రవేశించారు. ఇది బ్రహ్మా తనువు, ఇతడిని శివుడు అని అనరు. ఆత్మ అనే పేరు అయితే మీకు ఎలాగూ ఉంది, ఆ తర్వాత మీరు శరీరములోకి వస్తారు. ఆ పరమ ఆత్మ ఆత్మలందరి పిత. కావున అందరికీ ఇద్దరు తండ్రులు ఉన్నట్లు. ఒకరు నిరాకారీ, ఒకరు సాకారీ. వీరినేమో అలౌకకమైన అద్భుతమైన తండ్రి అని అంటారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మాకుమార, కుమారీలు ఎంతో ఎక్కువమంది ఉన్నారు, ఇదేమిటి, అసలు ఇది ఎలాంటి ధర్మము అనేది మనుష్యులకు అర్థం కాదు. వారు ఇది అర్థం చేసుకోలేరు. ఈ కుమార, కుమారీ అనే పదాలు ప్రవృత్తి మార్గానికి చెందినవని మీకు తెలుసు కదా. తల్లి, తండ్రి, కుమారీ మరియు కుమార్. భక్తి మార్గములో మీరు - నీవే తల్లివి, తండ్రివి అని తలచుకుంటారు. ఇప్పుడు మీకు మాత-పిత లభించారు, వారు మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. సత్యయుగములో దత్తత తీసుకోవడం జరగదు. అక్కడ దత్తత అనే పదమే లేదు. ఇక్కడైతే ఆ పదము ఉంటుంది. వారు హద్దులోని తండ్రి, వీరు అనంతమైన తండ్రి. ఇది అనంతమైన దత్తత. ఈ రహస్యము చాలా గుహ్యమైనది, అర్థం చేసుకోదగినది. మీరు ఈ విషయాలను ఎవరికీ పూర్తిగా అర్థం చేయించడం లేదు. మొట్టమొదటి సారి ఎవరైనా లోపలికి వస్తే, మేము గురువుగారిని దర్శనము చేసుకునేందుకు వచ్చాము అని అంటే, మీరు వారికి చెప్పండి - ఇది మందిరము కాదు, బోర్డు పైన ఏమి వ్రాసి ఉందో చూడండి! బ్రహ్మాకుమార, బ్రహ్మాకుమారీలు ఎంతోమంది ఉన్నారు, వీరంతా ప్రజాపితకు సంతానము, మీరు కూడా ప్రజలే. భగవంతుడు సృష్టిని రచిస్తారు, బ్రహ్మా ముఖకమలము ద్వారా మమ్మల్ని రచించారు. మేము కొత్త ప్రపంచానికి చెందినవారము, మీరు పాత సృష్టికి చెందినవారు. కొత్త సృష్టికి చెందినవారిగా సంగమములోనే తయారవ్వవలసి ఉంటుంది. ఇది పురుషోత్తములుగా తయారయ్యే యుగము. మీరు సంగమయుగములో నిలబడ్డారు, వారు కలియుగములో నిలబడ్డారు, ఇరువురి మధ్యా తెర పడినట్లుగా ఉంది. ఈ రోజుల్లో ఎన్ని పార్టీషన్లు ఉన్నాయో చూడండి. ప్రతి ధర్మమువారు - మేము మా ప్రజలను సంభాళిస్తాము, మా ధర్మాన్ని, మా తోటివారిని సుఖముగా ఉంచుతాము అని భావిస్తారు, అందుకే ప్రతి ఒక్కరూ - మా రాష్ట్రము నుండి ఏదీ బయటకు వెళ్ళకూడదు అని అంటారు. పూర్వము ప్రజలందరిపైనా రాజు ఆజ్ఞ నడుస్తూ ఉండేది. రాజును తల్లి, తండ్రి అని, అన్నదాత అని అనేవారు. ఇప్పుడైతే రాజులు, రాణులు అంటూ ఎవరూ లేరు. అంతా వేర్వేరుగా ముక్కలుగా అయిపోయింది. ఎన్ని ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి. ఉన్నట్లుండి వరదలు వచ్చేస్తాయి, భూకంపాలు వస్తూ ఉంటాయి, ఇవన్నీ దుఃఖముతో కూడిన మృత్యువు వంటివి.

మనమందరము పరస్పరము సోదరులము అని ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు భావిస్తారు. కావున మనము పరస్పరము చాలా, చాలా ప్రేమగా క్షీర ఖండములా (పాలు, చక్కెర వలె కలిసి-మెలిసి) ఉండాలి. మనము ఒకే తండ్రి పిల్లలము కావున పరస్పరము ఎంతో ప్రేమ ఉండాలి. రామ రాజ్యములో, పూర్తి శత్రువుల్లాంటి పులి, మేక కూడా ఒకే చోట కలిసి నీరు త్రాగుతాయి. అదే ఇక్కడ చూడండి, ఇంటింటిలోనూ ఎన్ని గొడవలు ఉన్నాయి. దేశానికి-దేశానికి మధ్యన గొడవలు జరుగుతూ ఉంటాయి, ఒకరితో ఒకరు యుద్ధము చేస్తూ ఉంటారు. ఎన్నో మతాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసు - మనమందరమూ అనేక సార్లు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నాము, మళ్ళీ పోగొట్టుకున్నాము అనగా రావణుడిపై విజయాన్ని పొందుతాము, మళ్ళీ ఓడిపోతాము. ఒక్క తండ్రి శ్రీమతముపై మనము విశ్వానికి యజమానులుగా అయిపోతాము, అందుకే వారిని ఉన్నతోన్నతమైన భగవంతుడు అని అంటారు, సర్వుల దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. ఇప్పుడు మీకు సుఖము యొక్క మార్గాన్ని తెలియజేస్తున్నారు. పిల్లలైన మీరు పరస్పరము క్షీర ఖండము వలె (పాలు, చక్కెర వలె కలిసి-మెలిసి) ఉండాలి. ప్రపంచములో అందరూ పరస్పరము ఉప్పునీరులా (ఘర్షణ కలిగి) ఉన్నారు. ఒకరినొకరు హతమార్చుకోవడానికి ఆలస్యము చేయరు. ఈశ్వరీయ సంతానమైన మీరు పరస్పరము క్షీర ఖండము వలె ఉండాలి. ఈశ్వరీయ సంతానమైన మీరు దేవతల కంటే కూడా ఉన్నతమైనవారు. మీరు తండ్రికి ఎంత సహాయకులుగా అవుతారు. పురుషోత్తములుగా తయారుచేయడానికి సహాయకులుగా ఉన్నారు కావున మీ హృదయములోకి ఈ విషయము రావాలి - మేము పురుషోత్తములము, మరి మాలో ఆ దైవీ గుణాలు ఉన్నాయా? ఆసురీ గుణాలు ఉన్నట్లయితే ఆ ఆత్మ ఈ తండ్రి బిడ్డగా పిలబడలేదు. అందుకే సద్గురువుకు నింద తీసుకువచ్చేవారు ఉన్నత స్థానాన్ని, ఉన్నత పదవిని పొందలేరు అని అంటారు. ఈ విషయాన్ని ఈ కలియుగీ గురువులు తమకు అన్వయించుకుని, మనుష్యులను భయపెడుతూ ఉంటారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఎవరైతే తండ్రి పేరును ప్రసిద్ధి చేస్తారో వారే సుపుత్రులైన పిల్లలు, వారు క్షీర ఖండము వలె ఉంటారు. తండ్రి ఎల్లప్పుడూ అంటారు - క్షీర ఖండము వలె ఉండండి. ఉప్పునీరులా అయి పరస్పరం కొట్లాడుకోకండి, గొడవపడకండి. మీరు ఇక్కడ క్షీర ఖండము వలె అవ్వాలి. పరస్పరము ఎంతో ప్రేమ ఉండాలి ఎందుకంటే మీరు ఈశ్వరీయ సంతానము కదా. ఈశ్వరుడు అత్యంత ప్రియమైనవారు, అందుకే వారిని అందరూ స్మృతి చేస్తూ ఉంటారు. మీకు పరస్పరము చాలా ప్రేమ ఉండాలి. లేదంటే తండ్రి పరువును పోగడతారు. ఈశ్వరుని పిల్లలు పరస్పరము ఉప్పునీరులా ఎలా ఉండగలరు, మరి అలాంటప్పుడు పదవిని ఎలా పొందగలరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పరస్పరము క్షీర ఖండము వలె ఉండండి. ఉప్పునీరులా ఉంటే ఏమాత్రమూ ధారణ జరగదు. ఒకవేళ తండ్రి డైరెక్షన్లపై నడుచుకోకపోతే మరి ఉన్నత పదవిని ఎలా పొందుతారు. దేహాభిమానములోకి రావడము వలనే పరస్పరము కొట్లాడుకుంటారు. దేహీ-అభిమానులుగా ఉన్నట్లయితే ఏ విధమైన గొడవలు ఉండవు. ఈశ్వరుడైన తండ్రి లభించారంటే, మరి దైవీ గుణాలు కూడా తప్పకుండా ధారణ చేయాలి. ఆత్మ తండ్రిలా తయారవ్వాలి. ఏ విధంగా తండ్రిలో పవిత్రత, సుఖము, ప్రేమ మొదలైనవన్నీ ఉన్నాయో, అలాగే మీరు కూడా తయారవ్వాలి. లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు. చదువుకుని తండ్రి నుండి ఉన్నతమైన వారసత్వాన్ని పొందాలి, ఎవరైతే అనేకుల కళ్యాణము చేస్తారో, వారే రాజా-రాణులుగా అవ్వగలరు. మిగిలినవారంతా వెళ్ళి దాస-దాసీలుగా అవుతారు. ఎవరెవరు ఏ విధంగా అవుతారు అనేది అర్థం చేసుకోవచ్చు కదా. చదువుకుంటున్నవారు స్వయమూ అర్థం చేసుకోగలరు - ఈ లెక్కన నేనే బాబాకు ఎంత పేరు తీసుకురాగలను. ఈశ్వరుని పిల్లలైతే అత్యంత ప్రియమైనవారిగా ఉండాలి, వారిని ఎవరు చూసినా సంతోషించాలి. బాబాకు కూడా అటువంటివారే మధురముగా అనిపిస్తారు. ముందుగా మీ ఇంటినైతే తీర్చిదిద్దుకోండి, ముందుగా ఇంటిని, ఆ తర్వాత ఇతరులను తీర్చిదిద్దండి. గృహస్థ వ్యవహారములో కమల పుష్ప సమానముగా పవిత్రముగా మరియు క్షీర ఖండము వలె ఉండండి. మిమ్మల్ని ఎవరు చూసినా ఇలా అనాలి - ఓహో! ఇక్కడైతే స్వర్గములా ఉందే. అజ్ఞాన కాలములో కూడా బాబా స్వయంగా ఇటువంటి ఇళ్ళను చూసారు. ఆరు ఏడు మంది వివాహము చేసుకున్న పిల్లలందరూ కలిసి ఉంటారు. అందరూ ఉదయమే లేచి భక్తి చేస్తారు. ఇంట్లో పూర్తి శాంతి ఉంటుంది. ఇక్కడ మీదైతే ఈశ్వరీయ కుటుంబము. హంస మరియు కొంగ కలిసి ఉండలేవు. మీరైతే హంస వలె అవ్వాలి. ఉప్పనీరులా ఉంటే బాబా సంతోషించరు. అలా ఉంటే బాబా అంటారు, మీరు ఎంతగా పేరును అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఒకవేళ క్షీర ఖండము వలె ఉండకపోతే, స్వర్గములో ఉన్నత పదవిని పొందలేరు, ఎన్నో శిక్షలను పొందుతారు. తండ్రికి చెందినవారిగా అయి కూడా ఒకవేళ ఉప్పునీరులా ఉన్నట్లయితే దానికి 100 రెట్లు శిక్షలు పొందుతారు. అప్పుడు మీరు ఏ పదవిని పొందుతారు అనే సాక్షాత్కారాలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా ధ్యాస ఉండాలి - మేము ఈశ్వరుని పిల్లలము, మేము అత్యంత ప్రియముగా ఉండాలి. పరస్పరము ఎప్పుడూ ఉప్పునీరులా అవ్వకూడదు. మొదట స్వయాన్ని తీర్చిదిద్దుకోవాలి, ఆ తర్వాత ఇతరులను తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇవ్వాలి.

2. ఏ విధంగా తండ్రిలో పవిత్రత, సుఖము, ప్రేమ మొదలైన గుణాలన్నీ ఉన్నాయో, అలా తండ్రి సమానముగా అవ్వాలి. సద్గురువుకు నింద తీసుకువచ్చే కర్మలేవీ చేయకూడదు. తమ నడవడిక ద్వారా తండ్రి పేరును ప్రసిద్ధి చేయాలి.

వరదానము:-
తండ్రి మరియు ప్రాప్తి యొక్క స్మృతి ద్వారా సదా ధైర్యము-ఉల్లాసములో ఉండే ఏకరస, అచల భవ

జన్మించడముతోనే తండ్రి ద్వారా ఏ ప్రాప్తులైతే లభించాయో, వాటి లిస్టును సదా ఎదురుగా పెట్టుకోండి. ప్రాప్తి స్థిరముగా, అచలముగా ఉన్నప్పుడు మరి ధైర్యము మరియు ఉల్లాసము కూడా అచలముగా ఉండాలి. అచలముగా ఉండేందుకు బదులుగా ఒకవేళ మనసు ఎప్పుడైనా చంచలమైతే లేక స్థితి చంచలతలోకి వస్తే, దానికి కారణము ఏమిటంటే - తండ్రిని మరియు ప్రాప్తిని సదా ఎదురుగా పెట్టుకోవటం లేదు. సర్వ ప్రాప్తుల అనుభవము సదా ఎదురుగా ఉన్నట్లయితే మరియు స్మృతిలో ఉన్నట్లయితే అన్ని విఘ్నాలు సమాప్తమైపోతాయి, సదా కొత్త ఉల్లాసము, కొత్త ఉత్సాహము ఉంటుంది. స్థితి ఏకరసముగా మరియు అచలముగా ఉంటుంది.

స్లోగన్:-
ఏ రకమైన సేవలోనైనా సదా సంతుష్టముగా ఉండడమే మంచి మార్కులు తీసుకోవడము.

అవ్యక్త సూచనలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

బ్రాహ్మణ పిల్లలైన మీరు చాలా-చాలా రాయల్ పిల్లలు. మీ ముఖము మరియు నడవడిక, రెండూ సత్యత యొక్క సభ్యతను అనుభవము చేయించాలి. మామూలుగా కూడా రాయల్ ఆత్మలను సభ్యత యొక్క దేవీ అని అంటారు. వారి మాట్లాడటము, చూడటము, నడవటము, తినటము-త్రాగటము, లేవటము-కూర్చోవటము, ప్రతి కర్మలో సభ్యత, సత్యత స్వతహాగానే కనిపిస్తాయి. నేను సత్యతను నిరూపిస్తున్నాను కానీ అందులో సభ్యత లేనే లేదు అన్నట్లు ఉండకూడదు. ఇది రైట్ కాదు.