07-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఈ సమయములో తండ్రితో పాటు సేవలో సహాయకులుగా అయ్యారు, అందుకే మీ స్మరణ జరుగుతుంది, పూజ జరగదు, ఎందుకంటే శరీరము అపవిత్రముగా ఉంది’’

ప్రశ్న:-
ఏ నషా పిల్లలైన మీ బుద్ధిలో నిరంతరము ఉండాలి?

జవాబు:-
మేము శివబాబా పిల్లలము, వారి నుండి రాజయోగాన్ని నేర్చుకుని స్వర్గ రాజ్యము యొక్క వారసత్వాన్ని తీసుకుంటాము, ఈ నషా మీకు నిరంతరము ఉండాలి. విశ్వానికి యజమానులుగా అవ్వాలంటే చాలా జాగ్రత్తగా చదువుకోవాలి మరియు చదివించాలి. ఎప్పుడూ కూడా తండ్రికి నింద తీసుకురాకూడదు. ఎవ్వరితోనూ కొట్లాడకూడదు, గొడవపడకూడదు. మీరు గవ్వ నుండి వజ్రము వలె అవుతారు కావున మంచి రీతిలో ధారణ చేయాలి.

పాట:-
ఎవరైతే ప్రియునితో ఉన్నారో...

ఓంశాంతి
ఎవరైతే తండ్రితో పాటు ఉన్నారో, వారు బాప్ దాదాతో పాటు ఉన్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడైతే వారు డబల్ (ఇద్దరు) కదా. బ్రహ్మా ద్వారా పరమపిత పరమాత్మ శివుడు స్థాపనను ఎలా చేస్తారు అనేది బాగా అర్థం చేయించడము జరుగుతుంది. మనుష్యులకు ఇది తెలియదు. ఇది పిల్లలైన మీకే తెలుసు. శివునికి తనదంటూ శరీరము లేదు. శ్రీకృష్ణుడికైతే తనదంటూ శరీరముంది. పరమాత్ముడు శ్రీకృష్ణుని శరీరము ద్వారా... అని ఈ విధముగా అనలేము. అలా జరగదు. శ్రీకృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేయిస్తారు కావున తప్పకుండా వారు బ్రహ్మాలో ప్రవేశించవలసి ఉంటుంది, ఇంకే ఉపాయము లేదు. ప్రేరణ మొదలైన విషయాలేవీ లేవు. తండ్రి బ్రహ్మా ద్వారా అంతా అర్థం చేయిస్తారు. విజయమాలను రుండ మాల అని అంటారు, దానిని మనుష్యులు పూజిస్తారు, స్మరిస్తారు. రుద్రమాల అనేది కేవలం స్మరింపబడుతుంది అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మా, సరస్వతులను మేరువు (జంటపూసలు) అని అంటారు. మిగిలిన మాల అంతా పిల్లలది. విష్ణుమాల అయితే ఒక్కటే ఉంటుంది, దానిని పూజించవచ్చు. ఈ సమయములో మీరు పురుషార్థులు. మీ స్మరణ అంతిమములో జరుగుతుంది. మాల ఆత్మలదా లేక జీవాత్మలదా? ఈ ప్రశ్న తలెత్తుతుంది కదా. విష్ణుమాలను చైతన్య జీవాత్మల మాల అని అంటారు. లక్ష్మీ-నారాయణులు పూజింపబడతారు కదా, ఎందుకంటే వారి ఆత్మ మరియు శరీరము, రెండూ పవిత్రముగా ఉంటాయి. రుద్రమాల అనేది కేవలం ఆత్మలదే, ఎందుకంటే శరీరాలైతే అపవిత్రముగా ఉన్నాయి. ఆత్మలు పూజింపబడలేరు. ఆత్మ ఎలా పూజింపబడుతుంది. రుద్రమాల పూజింపబడుతుందని మీరంటారు కానీ అది పూజింపబడదు. దాని పేరే సిమరణి అనగా స్మరించడము. మాలలో ఏ పూసలైతే ఉన్నాయో, అవి పిల్లలైన మీరు శరీరములో ఉన్నప్పుడు దానికి గుర్తుగా స్మరించబడతాయి. పూసలైతే బ్రాహ్మణులకు గుర్తు. ఎవరిని స్మరిస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఆ పూసలు భారత్ కు సేవ చేసే బ్రాహ్మణులు, వారిని స్మరిస్తారు. జగదంబ, దేవీలు మొదలైనవారు చాలామంది ఉన్నారు, వారిని స్మృతి చేయాలా? పూజకు యోగ్యులుగా లక్ష్మీ-నారాయణులు అవుతారు, మీరు అవ్వరు, ఎందుకంటే మీ శరీరాలు పతితముగా ఉన్నాయి. ఆత్మ పవిత్రముగా ఉంది కానీ దానిని పూజించలేరు, కానీ స్మరించగలరు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మీకు ముందే తెలిసి ఉండాలి. మీరు బ్రాహ్మణీలు. మీ స్మృతిచిహ్నాలు దేవీల రూపములో ఉన్నాయి. మీరు శ్రీమతమనుసారముగా స్వయము పావనముగా అవుతారు కావున ఈ మాల ఫస్ట్ బ్రాహ్మణులదని, ఆ తర్వాత దేవతలదని అర్థం చేసుకోవడము జరుగుతుంది. విచార సాగర మంథనము చేసినట్లయితే రిజల్ట్ వెలువడుతుంది. ఎప్పుడైతే ఆత్మలు సాలిగ్రామాల రూపములో ఉంటాయో, అప్పుడు పూజింపబడతాయి. శివుని పూజ జరిగినప్పుడు సాలిగ్రామాలకు కూడా జరుగుతుంది ఎందుకంటే ఆత్మలు పవిత్రముగా ఉంటాయి, శరీరాలు ఉండవు. కేవలం మిమ్మల్ని మాత్రమే స్మరణ చేయడము జరుగుతుంది, ఎందుకని? మీరు శరీరముతో పాటు సేవ చేస్తారు. ఇప్పుడు మీ పూజ జరగదు, కానీ తర్వాత మీరు శరీరము వదిలినప్పుడు మీరు కూడా శివునితో పాటు పూజింపబడతారు. ఆలోచించడము జరుగుతుంది కదా. మీరు ఈ సమయములో బ్రాహ్మణులు. శివబాబా కూడా బ్రహ్మాలో వస్తారు అంటే బ్రహ్మా కూడా సాకారములో ఉన్నారు. మీరు కృషి చేస్తారు. ఈ మాల సాకారమైనది. బ్రహ్మా, సరస్వతి మరియు జ్ఞానగంగలైన మీరు ఉన్నారు. మీరు భారత్ ను స్వర్గముగా తయారుచేసారు, ఈ రుద్ర యజ్ఞాన్ని రచించారు. ఏదైతే పూజ చేస్తారో, అందులో కేవలం శివుడు మరియు సాలిగ్రామాలే ఉంటారు. వారిలో బ్రహ్మా, సరస్వతుల పేర్లు గాని, పిల్లలైన మీ పేర్లు గాని ఉండవు. ఇక్కడైతే అందరి పేర్లు ఉన్నాయి. ఎవరెవరు జ్ఞానగంగలుగా ఉండేవారో, మీ అందరినీ స్మరణ చేస్తారు. వారు జ్ఞానసాగరుడు, వీరు బ్రహ్మపుత్ర, పెద్ద నది. ఈ బ్రహ్మా తల్లి కూడా. సాగరుడు ఒక్కరే, ఇకపోతే గంగలైతే రకరకాలుగా, అనేక రకాలుగా ఉంటారు. ఎవరిలోనైతే నంబరువారుగా మంచి జ్ఞానము ఉందో, వారిని సరోవరమని అంటారు. వారికి మహిమ కూడా ఉంది. మానస సరోవరములో స్నానము చేసినట్లయితే దేవకన్యలుగా అవుతారని అంటారు. మీ మాల స్మరింపబడుతుంది. సిమరణి అని అంటారు కదా. స్మరణ చేయండి అని అంటారు, వాళ్ళు అయితే కేవలం రామ-రామ అని అంటారు. కానీ స్మరణ ఎవరికి జరుగుతుంది అనేది మీకు తెలుసు. ఎవరైతే ఎక్కువ సేవ చేస్తారో వారికి జరుగుతుంది. మొదట బాబా పుష్పము, ఆ తర్వాత చాలా కృషి చేసే జంటపూసలు, ఆ తర్వాత రుద్రమాల నుండి విష్ణుమాల తయారవుతుంది. మీ విషయములో కేవలం ఆత్మ మాత్రమే పూజింపబడుతుంది. మీరు ఇప్పుడు స్మరణకు యోగ్యులుగా ఉన్నారు. మీకు స్మరణ జరుగుతుంది కానీ పూజ జరగదు ఎందుకంటే ఆత్మ పవిత్రముగా మరియు శరీరము అపవిత్రముగా ఉంది. అపవిత్రమైన వస్తువు ఎప్పుడూ పూజింపబడదు. ఎప్పుడైతే రుద్రమాలలోకి వచ్చేందుకు యోగ్యులుగా అవుతారో, అప్పుడు అంతిమములో మీరు శుద్ధముగా అయిపోతారు. ఎవరెవరు పాస్ విత్ ఆనర్ గా అవుతారు అనేది మీకు సాక్షాత్కారము అవుతుంది. సేవ చేసినట్లయితే పేరు చాలా ప్రఖ్యాతమవుతుంది. విజయమాలలో నంబరువారుగా ఎవరెవరు వస్తారు అనేది తెలుస్తూ ఉంటుంది! ఈ విషయాలు చాలా గుహ్యమైనవి.

మనుష్యులైతే కేవలం రామ-రామ అని అంటారు. క్రిస్టియన్లు క్రైస్టును తలచుకుంటారు. మరి మాల ఎవరిది? భగవంతుడైతే ఒక్కరే. ఇకపోతే, ఎవరైతే వారికి దగ్గరగా కూర్చున్నారో, వారి మాల తయారవుతూ ఉండవచ్చు. ఈ మాలను ఇప్పుడు మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. తమ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమువారే అర్థం చేసుకోలేకపోతే ఇక ఇతరులు ఎలా అర్థం చేసుకుంటారు. అందరినీ పతితము నుండి పావనముగా చేసేవారైతే ఒక్క తండ్రి మాత్రమే. క్రైస్టు విషయములో, వారు పతితులను పావనముగా చేస్తారు అని అనరు. అతను జనన-మరణాలలోకి వచ్చి కిందకు దిగవలసిందే. వాస్తవానికి అతడిని గురువు అని కూడా అనరు ఎందుకంటే సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. అది కూడా అంతిమ సమయము వచ్చినప్పుడు, వృక్షము శిథిలావస్థకు చేరుకున్నప్పుడు, తండ్రి వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు. ఆత్మలు ధర్మ స్థాపన చేయడానికి పై నుండి వస్తారు. ఆ ఆత్మలైతే జనన-మరణాలలోకి రావలసిందే. సద్గురువు ఒక్కరే. వారే సర్వుల సద్గతిదాత. మనుష్యులెవ్వరూ సత్యమైన సద్గురువుగా కాలేరు. వారంతా కేవలం ధర్మ స్థాపన చేసేందుకే వస్తారు, వారి వెనుక పాత్రను అభినయించేందుకు అందరూ రావడము మొదలుపెడతారు. ఎప్పుడైతే అందరూ తమోప్రధాన అవస్థకు చేరుకుంటారో, అప్పుడు నేను వచ్చి సర్వులకు సద్గతిని ఇస్తాను. అందరూ తిరిగి వెళ్తారు, మళ్ళీ కొత్తగా చక్రము ప్రారంభమవుతుంది. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటారు. వీరే రాజ్యాన్ని పొందుతారు, రాజుగానైనా అవ్వవచ్చు లేదా ప్రజలుగానైనా అవ్వవచ్చు. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు. రాజ్య పదవిని పొందడములోనే శ్రమ ఉంది. విజయమాలలో ఎవరు కూర్చబడతారు అనేది అంతిమములో అంతా తెలుస్తుంది. చదువుకోనివారు చదువుకున్నవారి ముందు సేవ చేస్తారు. సత్యయుగములోకి వస్తారు కానీ నౌకర్లుగా అవ్వవలసి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిపోతుంది. పరీక్షల రోజులలో ఎవరెవరు పాస్ అవుతారు అనేది అందరికీ తెలిసిపోతుంది కదా. చదువు పట్ల అటెన్షన్ ఉండకపోతే ఫెయిల్ అయిపోతారు. ఇది మీ అనంతమైన చదువు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అయితే ఇదొక్కటే, ఇక్కడ మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి, ఇందులో నంబరువారుగా పాస్ అవుతారు. ఈ చదువు ఒక్క రాజయోగానికి చెందినదే, రాజ్య పదవిని పొందడములో శ్రమ ఉంటుంది మరియు సేవ కూడా చేయాలి. ఎవరైతే రాజుగా అవుతారో, వారు తమ ప్రజలను కూడా తయారుచేసుకోవలసి ఉంటుంది. మంచి-మంచి కుమార్తెలు పెద్ద-పెద్ద సెంటర్లను సంభాళిస్తారు, వారు చాలామంది ప్రజలను తయారుచేస్తారు. బాబా కూడా అంటారు, పెద్ద తోటను తయారుచేయండి, అప్పుడు బాబా కూడా వచ్చి చూస్తారు. ఇప్పుడైతే తోట చాలా చిన్నగా ఉంది. బొంబాయిలోనైతే లక్షలాదిమంది తయారవుతారు. మొత్తము రాజ్యము అంతా సూర్యవంశమువారు ఉంటారు కనుక ఎంతోమంది ఉంటారు. ఎవరైతే కష్టపడతారో, వారు రాజుగా అవుతారు, మిగిలినవారు ప్రజలుగా అవుతూ ఉంటారు. ఓ ప్రభూ, నీ సద్గతి యొక్క లీల అని అంటూ ఉంటారు కూడా. మీరంటారు, వాహ్ బాబా, మీరు ఇచ్చే గతి, మీరు చూపే మార్గము అతీతమైనవి... సర్వులకు సద్గతినిచ్చే ఈ శ్రీమతము అన్నింటికన్నా అతీతమైనది. తండ్రి తమతో పాటు తీసుకువెళ్తారు, వదిలి వెళ్ళరు. నిరాకారీ, ఆకారీ, సాకారీ లోకాల గురించి కూడా తెలియదు. కేవలం సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడమంటే, అది కూడా సంపూర్ణ జ్ఞానము కాదు. మొదటైతే మూలవతనము గురించి తెలుసుకోవలసి ఉంటుంది. అక్కడ ఆత్మలమైన మనము ఉంటాము. ఈ మొత్తము సృష్టి చక్రాన్ని తెలుసుకోవడముతో మీరు చక్రవర్తీ రాజులుగా అవుతారు. ఇవన్నీ ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు. వారైతే శివుడు నామ-రూపాలకు అతీతమైనవారని అంటారు. వారికి రూపము ఉంది, అయినా కూడా నామ-రూపాలకు అతీతమైనవారని అంటారు. మళ్ళీ సర్వవ్యాపి అని అంటారు. ఒక ఎమ్.పి. అన్నారు - ఈశ్వరుడు సర్వవ్యాపి అని నేను నమ్మను. మనుష్యులు ఒకరినొకరు హతమార్చుకుంటారు, ఇది ఈశ్వరుడి పనా? మున్ముందు, మీ వృద్ధి జరిగినప్పుడు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. బాబా రాత్రి కూడా అర్థం చేయించారు - ఎవరైతే తమను తాము తెలివైనవారిగా భావిస్తారో, వారు ఇటువంటి ఉత్తరాలను వ్రాయాలి. ఈ పూర్తి జ్ఞానము ఏమిటి అనేది వారికి అర్థం చేయించాలి. మీరు ఈ విధముగా వ్రాయవచ్చు - ‘‘మేము పూర్తి జ్ఞానాన్ని ఇవ్వగలము, మూలవతనము యొక్క జ్ఞానాన్ని ఇవ్వగలము, నిరాకార తండ్రి పరిచయాన్ని కూడా ఇవ్వగలము, అలాగే ప్రజాపిత బ్రహ్మా మరియు వారి బ్రాహ్మణ ధర్మము గురించి కూడా అర్థం చేయించగలము, అలాగే లక్ష్మీ-నారాయణుల రాజ్యము, ఆ తర్వాత సీతా-రాముల రాజ్యము ఎలా నడుస్తాయి, ఆ తర్వాత వారి నుండి రాజ్యాన్ని ఎవరు లాక్కుంటారు, ఆ స్వర్గము ఏమయ్యింది, ఇదంతా మేము తెలపగలము’’. నరకము ఏమయ్యింది అని అడిగితే, సమాప్తమైపోయింది అని అంటారు కదా. స్వర్గము కూడా సమాప్తమైపోతుంది. ఆ సమయములో కూడా భూకంపాలు మొదలైనవి వస్తాయి. ఆ వజ్ర-వైఢూర్యాల మహళ్ళు మొదలైనవి ఎవ్వరూ బయటకు తీయలేని విధముగా లోపలికి వెళ్ళిపోయాయి. బంగారము మరియు వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఎప్పుడూ కింద నుండి బయటకు రాలేదు. సోమనాథ మందిరము మొదలైనవాటిని తర్వాత నిర్మించారు, ఈ మందిరాల కంటే ఆ దేవతల ఇళ్ళు గొప్పగా ఉంటాయి. లక్ష్మీ-నారాయణుల ఇల్లు ఎలా ఉంటుంది? ఆ సంపదంతా ఏమైపోయింది? ఇటువంటి విషయాలను విద్వాంసులు విన్నప్పుడు, వీరి జ్ఞానము శక్తివంతమైనదే అని ఆశ్చర్యపోతారు. మనుష్యులకైతే ఏమీ తెలియదు, కేవలం సర్వవ్యాపి అని అనేస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన మరియు అర్థం చేయించవలసిన విషయాలు.

మీకు ధనము లభిస్తుంది, దానిని మళ్ళీ దానము చేయాలి. బాబా మీకు ఇస్తూ ఉంటారు, మీరు కూడా ఇస్తూ వెళ్ళండి. ఇది తరగని ఖజానా, మొత్తమంతా ధారణపైనే ఆధారపడి ఉంది. ఎంతగా ధారణ చేస్తారో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. గవ్వలు ఎక్కడ, వజ్రాలు ఎక్కడ, ఆలోచించండి. వజ్రాల విలువ అన్నింటికన్నా ఎక్కువగా ఉంటుంది. గవ్వల విలువ అన్నింటికన్నా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు గవ్వ నుండి వజ్రము వలె అవుతారు. ఈ విషయాలు ఎప్పుడూ ఎవరికీ స్వప్నములో కూడా రావు. కానీ తప్పకుండా లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేదని, వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారని కేవలం ఇంతమాత్రం అర్థం చేసుకుంటారు. ఇకపోతే, ఆ రాజ్యాన్ని వారికి ఎప్పుడు ఇచ్చారు ఎవరు ఇచ్చారు అనేది ఏమీ తెలియదు. రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు? ఇక్కడైతే ఏమీ లేదు. రాజయోగముతో స్వర్గ రాజ్యము లభిస్తుంది. ఇది అద్భుతము కదా. పిల్లల బుద్ధిలో మంచిగా నషా ఉండాలి. కానీ మాయ ఆ నషాను స్థిరముగా ఉండనివ్వదు. మనము శివబాబా పిల్లలము. ఈ జ్ఞానాన్ని చదువుకుని మనము విశ్వానికి యజమానులుగా అవుతాము. ఈ విషయము ఎప్పుడైనా ఎవరి బుద్ధిలోకైనా వచ్చి ఉంటుందా! కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలు ఎంత కృషి చేయాలి. గురువుకు నింద తీసుకువచ్చేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు అని అంటారు, అది ఇక్కడి విషయమే. వారికైతే లక్ష్యము-ఉద్దేశ్యమే ఉండదు. మీకైతే లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది. తండ్రి, టీచర్, గురువు, ముగ్గురు వీరే. ఈ చదువు ద్వారా మనము విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఎంత జాగ్రత్తగా చదువుకోవాలి మరియు చదివించాలి. నింద తీసుకువచ్చే విషయమేమీ ఉండకూడదు. ఎవ్వరితోనూ కొట్లాడకూడదు, గొడవపడకూడదు. అందరితోనూ మధురముగా మాట్లాడాలి. తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. బాబా అంటారు, దానము ఇస్తే గ్రహణము తొలగిపోతుంది. నంబరువన్ దానము దేహాభిమానము. ఈ సమయములోనైతే మీరు ఆత్మాభిమానులుగా ఉన్నారు మరియు పరమాత్మాభిమానులుగా అవుతారు. ఇది అమూల్యమైన జీవితము. తండ్రి అంటారు - కల్ప-కల్పము నేను మిమ్మల్ని ఇలాగే చదివించడానికి వస్తాను, మళ్ళీ మీరు మర్చిపోతారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు, జ్ఞాన రత్నాలను ధారణ చేసే మరియు సేవ చేసే పిల్లలకు, మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అందరితోనూ మధురముగా మాట్లాడాలి, తండ్రికి నింద తీసుకువచ్చే పనులేవీ చేయకూడదు. దేహాభిమానాన్ని దానము చేసి ఆత్మాభిమానులుగా మరియు పరమాత్మాభిమానులుగా అవ్వాలి.

2. ఏ జ్ఞాన ధనమైతే లభిస్తుందో, దానిని దానము చేయాలి. చదువు ద్వారా రాజ్యము లభిస్తుంది - ఈ నషాలో స్థిరముగా ఉండాలి. అటెన్షన్ పెట్టి చదువు చదువుకోవాలి.

వరదానము:-
సాక్షీ స్థితి అనే సీట్ ద్వారా ఆందోళన అనే పదాన్ని సమాప్తము చేసే మాస్టర్ త్రికాలదర్శీ భవ

ఈ డ్రామాలో ఏది జరిగినా అందులో కళ్యాణము నిండి ఉంది. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు తెలివైనవారిలో తలెత్తవు. నష్టములో కూడా కళ్యాణము ఇమిడి ఉంది. తండ్రి తోడు మరియు తండ్రి చేయి ఉన్నట్లయితే అకళ్యాణము జరగజాలదు. ఇటువంటి గౌరవపూర్వకమైన సీట్ పై ఉన్నట్లయితే ఎప్పుడూ ఆందోళనకు లోనవ్వరు. సాక్షీతనపు సీట్ ఆందోళన అనే మాటను సమాప్తము చేసేస్తుంది, అందుకే త్రికాలదర్శిగా అయ్యి ప్రతిజ్ఞ చేయండి - ఆందోళన చెందము, ఆందోళన కలిగించము అని.

స్లోగన్:-
తమ సర్వ కర్మేంద్రియాలను ఆర్డర్ అనుసారముగా నడిపించటమే స్వరాజ్య అధికారిగా అవ్వటము.

అవ్యక్త సూచనలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’

నిశ్చయబుద్ధి కలవారు అంటే అర్థము నిశ్చింత చక్రవర్తులు, వారే బాబా సమానమైనవారు. వినాశీ ధనము కలవారు ఎంతగా సంపాదిస్తారో అంతగానే సమయమనుసారముగా చింతలో ఉంటారు. కానీ ఎవరికైతే - మేము ఈశ్వరీయ ఖజానాలకు యజమానులము మరియు పరమాత్మునికి బాలకులము అన్న విశ్వాసము ఉంటుందో, వారు సదా స్వప్నములో కూడా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు, ఎందుకంటే వారికి - ఈ ఈశ్వరీయ ఖజానాలు ఈ జన్మలోనే కాక అనేక జన్మలు తోడుగా ఉన్నాయి, తోడుగా ఉంటాయి అని విశ్వాసము ఉంటుంది. అందుకే వారు నిశ్చయబుద్ధి కలవారిగా నిశ్చింతగా ఉంటారు.