07-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 11.11.20


‘‘సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత యొక్క శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి’’

ఈ రోజు బాప్ దాదా తమ హోలియెస్ట్, హైయ్యెస్ట్, లక్కియెస్ట్, స్వీటెస్ట్ (అతి పవిత్రమైన, అతి ఉన్నతమైన, అతి అదృష్టవంతులు, అతి మధురమైన) పిల్లలను చూస్తున్నారు. మొత్తము విశ్వములో ఎప్పటికప్పుడు హోలియెస్ట్ ఆత్మలు వస్తున్నారు. మీరు కూడా హోలియెస్ట్ ఆత్మలు కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు ప్రకృతీజీతులుగా అయ్యి, ప్రకృతిని కూడా సతోప్రధానముగా తయారుచేస్తారు. మీ పవిత్రతా శక్తి ప్రకృతిని కూడా సతోప్రధానముగా, పవిత్రముగా తయారుచేస్తుంది, అందుకే ఆత్మలైన మీ అందరూ ప్రకృతితో తయారైన ఈ శరీరాన్ని కూడా పవిత్రమైనదానినే ప్రాప్తి చేసుకుంటారు. మీ పవిత్రతా శక్తి విశ్వములోని జడము, చైతన్యము అన్నింటినీ పవిత్రముగా చేస్తుంది, అందుకే మీకు శరీరము కూడా పవిత్రమైనది ప్రాప్తిస్తుంది. ఆత్మ కూడా పవిత్రము, శరీరము కూడా పవిత్రము మరియు ప్రకృతి యొక్క సాధనాలు కూడా సతోప్రధానముగా, పావనముగా ఉంటాయి, అందుకే మీరు విశ్వములోని అతి పవిత్రమైన ఆత్మలు. అతి పవిత్రమైన వారేనా? మేము విశ్వములోని హోలియెస్ట్ ఆత్మలము అని స్వయాన్ని భావిస్తున్నారా? మీరు హైయ్యెస్ట్ (అతి ఉన్నతమైనవారు) కూడా, ఎందుకు ఉన్నతమైనవారు? ఎందుకంటే ఉన్నతోన్నతమైన భగవంతుడిని గుర్తించారు. ఉన్నతోన్నతమైన తండ్రి ద్వారా ఉన్నతోన్నతమైన ఆత్మలుగా అయ్యారు. సాధారణమైన స్మృతి, వృత్తి, దృష్టి, కృతి అన్నీ మారిపోయి శ్రేష్ఠ స్మృతి స్వరూపము, శ్రేష్ఠ వృత్తి, శ్రేష్ఠ దృష్టి తయారయ్యాయి. ఎవరినైనా కలిసినప్పుడు ఏ వృత్తితో కలుస్తారు? సోదరత్వపు వృత్తితో, ఆత్మిక దృష్టితో, కళ్యాణ భావనతో, ప్రభు పరివారము అన్న భావముతో కలుస్తారు. కనుక అతి ఉన్నతమైనవారయ్యారు కదా? మారిపోయారు కదా! మరియు ఎంత అదృష్టవంతులు మీరు? జ్యోతిష్కులు ఎవరూ మీ భాగ్యరేఖను గియ్యలేదు, స్వయం భాగ్యవిధాత మీ భాగ్యరేఖను గీసారు. మరియు ఎంత పెద్ద గ్యారంటీని ఇచ్చారు? 21 జన్మల అదృష్టరేఖకు అవినాశీ గ్యారంటీని తీసుకున్నారు. ఒక్క జన్మ కాదు, 21 జన్మలు ఎప్పుడూ దుఃఖము మరియు అశాంతి యొక్క అనుభూతి కలగదు. సదా సుఖంగా ఉంటారు. జీవితములో మూడు విషయాలు కావాలి - ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు సంతోషము. ఈ మూడూ మీకు తండ్రి ద్వారా వారసత్వముగా ప్రాప్తించాయి. 21 జన్మలకు గ్యారంటీ కదా? అందరూ గ్యారంటీని తీసుకున్నారా? వెనక ఉన్నవారికి గ్యారంటీ లభించిందా? అందరూ చేతులు ఎత్తుతున్నారు, చాలా మంచిది. బిడ్డగా అవ్వటము అనగా బాబా ద్వారా వారసత్వము లభించటము. బిడ్డ అవ్వలేదా, అవుతున్నారా ఏమిటి? బిడ్డగా అవుతున్నారా లేక అయిపోయారా? బిడ్డగా అవ్వటము అనేది ఉండదు. జన్మ తీసుకోగానే బిడ్డగా అయిపోతారు. జన్మిస్తూనే తండ్రి వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. మరి తండ్రి ద్వారా ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని ఇప్పుడు ప్రాప్తి చేసుకున్నారు. అంతేకాక అతి రిచెస్ట్ కూడా (అతి ధనవంతులు). మీరు బ్రాహ్మణ ఆత్మలు, క్షత్రియులు కారు, బ్రాహ్మణులు. నేను శ్రేష్ఠ ఆత్మను, నేను ఫలానాను కాదు, నేను ప్రపంచములోకెల్లా అతి సంపన్నమైన ఆత్మను అని బ్రాహ్మణ ఆత్మ నిశ్చయముతో అనుభవము చేసుకుంటుంది. బ్రాహ్మణులు అంటే ప్రపంచములోకెల్లా అతి ధనవంతులు ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మకు పరమాత్మ స్మృతి ద్వారా ప్రతి అడుగులోనూ పదమాలు ఉంటాయి. మరి రోజంతటిలో ఎన్ని అడుగులు వేస్తుంటారు? ఆలోచించండి. ప్రతి అడుగులో పదమాలు అంటే రోజంతటిలో ఎన్ని పదమాలు అవుతాయి? తండ్రి ద్వారా ఇటువంటి ఆత్మలుగా అయ్యారు. బ్రాహ్మణ ఆత్మనైన నేను ఎవరిని, ఇది గుర్తు ఉండటమే భాగ్యము. కనుక ఈ రోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి మస్తకముపై మెరుస్తున్న భాగ్య సితారను చూస్తున్నారు. మీరు కూడా మీ భాగ్య సితారను చూస్తున్నారా?

బాప్ దాదా పిల్లలను చూసి సంతోషిస్తారా లేక పిల్లలు బాబాను చూసి సంతోషిస్తారా? ఎవరు సంతోషిస్తారు? బాబానా లేక పిల్లలా? ఎవరు? (పిల్లలు) బాబా సంతోషించరా? బాబా పిల్లలను చూసి సంతోషిస్తారు మరియు పిల్లలు బాబాను చూసి సంతోషిస్తారు. ఇరువురూ సంతోషిస్తారు ఎందుకంటే పిల్లలకు తెలుసు - ఈ ప్రభు మిలనము, ఈ పరమాత్మ ప్రేమ, ఈ పరమాత్మ వారసత్వము, ఈ పరమాత్మ ప్రాప్తులు, ఇవన్నీ ఇప్పుడే ప్రాప్తిస్తాయి, ‘‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ ఉండవు’’. అంతేనా?

బాప్ దాదా ఇప్పుడు కేవలం ఒక్క విషయాన్ని పిల్లలకు రివైజ్ చేయిస్తున్నారు - అది ఏ విషయమై ఉండవచ్చు? అర్థం చేసేసుకున్నారు. బాప్ దాదా ఇప్పుడు ఏం రివైజ్ చేయిస్తున్నారంటే - ఇప్పుడు శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఇది విశ్వాత్మల పిలుపు. కానీ సమీపంగా తీసుకువచ్చేది ఎవరు? మీరేనా లేక మరెవరైనానా? ఇటువంటి మనోహరమైన శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేది మీరందరేనా? ఒకవేళ అవును అని అన్నట్లయితే చేతులెత్తండి. అచ్ఛా, మరొక విషయము కూడా ఉంది, దానిని కూడా అర్థం చేసేసుకున్నారు, అందుకేనా నవ్వుతున్నారు? అచ్ఛా, మరి దాని తారీఖు ఏమిటి? తారీఖునైతే ఫిక్స్ చెయ్యండి కదా. ఇప్పుడు విదేశీయుల టర్న్ జరగాలి అని తారీఖును ఫిక్స్ చేసారు కదా. ఈ తారీఖునైతే ఫిక్స్ చేసారు. మరి సమయాన్ని సమీపంగా తీసుకువచ్చే ఆత్మలారా, చెప్పండి, దీని తారీఖు ఏమిటి? ఆ తారీఖు కనిపిస్తుందా? ముందు మీ దృష్టిలోకి వస్తేనే ఆ తరువాత విశ్వములోకి వస్తుంది. బాప్ దాదా అమృతవేళ విశ్వములో తిరుగుతున్నప్పుడు అన్నింటినీ చూసి-చూసి, విని-విని దయ కలుగుతుంది. ఆనందములో కూడా ఉన్నారు కానీ ఆనందముతోపాటు అయోమయంలో కూడా ఉన్నారు. కనుక బాప్ దాదా అడుగుతున్నారు - దాత పిల్లలైన ఓ మాస్టర్ దాతలారా, మీ మాస్టర్ దాతాతనపు పాత్రను ఎప్పుడు తీవ్రగతితో విశ్వము ముందు ప్రత్యక్షము చేస్తారు? లేక ఇప్పుడు పరదా లోపల తయారవుతూ ఉన్నారా? ఏర్పాట్లను చేస్తూ ఉన్నారా? విశ్వ పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలారా, ఇప్పుడు విశ్వములోని ఆత్మలపై దయ చూపించండి. ఇది జరగవలసిందే, ఇదైతే నిశ్చితమే మరియు జరగవలసింది కూడా నిమిత్త ఆత్మలైన మీ ద్వారానే. కానీ ఏ విషయములో ఆలస్యమవుతుంది? బాప్ దాదా ఈ ఒక్క మహోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు - బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరి హృదయములో సంపన్నత మరియు సంపూర్ణత యొక్క జెండా ఎగరవేయబడినట్లు కనిపించాలి. ఎప్పుడైతే ప్రతి బ్రాహ్మణ ఆత్మ లోపల సంపూర్ణత యొక్క జెండా ఎగురుతుందో, అప్పుడే విశ్వములో తండ్రి యొక్క ప్రత్యక్షతా జెండా ఎగురుతుంది. ఈ జెండా పండుగను బాప్ దాదా చూడాలనుకుంటున్నారు. ఎలా అయితే శివరాత్రి రోజున శివ అవతరణ జెండాను ఎగరవేస్తారో, అలా ఇప్పుడు శివ శక్తి పాండవ అవతరణ యొక్క నినాదము మ్రోగాలి. శివ శక్తులు వెలసెను అని ఒక పాటను వేస్తారు కదా. ఇప్పుడు విశ్వము ఈ పాటను పాడుకోవాలి - శివునితోపాటు శక్తులు, పాండవులు ప్రత్యక్షమయ్యారు అని. పరదా లోపల ఎంతవరకు ఉంటారు! పరదా లోపల ఉండటము మంచిగా అనిపిస్తుందా? కొంచెం-కొంచెం మంచిగా అనిపిస్తుందా! మంచిగా అనిపించటం లేదు అంటే మరి పరదాను తొలగించేవారు ఎవరు? బాబా తొలగిస్తారా? ఎవరు తొలగిస్తారు? డ్రామా తొలగిస్తుందా లేక మీరు తొలగిస్తారా? మీరే తొలగించే పనైతే ఇక ఆలస్యం ఎందుకు? మరి పరదాలో ఉండటం మంచిగా అనిపిస్తుంది అని అనుకోవాలా? బాప్ దాదాకు ఇప్పుడు కేవలము ఈ ఒక్క శ్రేష్ఠ ఆశే ఉంది - ఓహో, వచ్చేసారు, వచ్చేసారు, వచ్చేసారు అని అందరూ ఈ పాటను పాడాలి. ఇది వీలవుతుందా? చూడండి, దాదీలు అందరూ వీలవుతుంది అని అంటారు, మరి ఎందుకని జరగటం లేదు? కారణమేమిటి? అందరూ వీలవుతుంది అని అంటున్నప్పుడు మరి ఎందుకని అవ్వటం లేదు, కారణమేమిటి? (అందరూ సంపన్నంగా అవ్వలేదు) ఎందుకు అవ్వలేదు? తారీఖును చెప్పండి కదా! (తారీఖునైతే మీరు చెప్తారు కదా బాబా). బాప్ దాదా యొక్క మహామంత్రము గుర్తుందా? బాప్ దాదా ఏమంటారు? ‘‘ఎప్పుడో కాదు, ఇప్పుడే’’. (బాబా, ఫైనల్ తారీఖును మీరే చెప్పండి అని దాదీజీ అంటున్నారు) అచ్ఛా, బాప్ దాదా ఏ తారీఖునైతే చెప్తారో, అప్పటికల్లా మిమ్మల్ని మీరు మలుచుకుని నిలబెట్టుకుంటారా? పాండవులు నిలబెట్టుకుంటారా? పక్కా! ఒకవేళ కింద-మీద చేస్తే ఏం చెయ్యాల్సి ఉంటుంది? (మీరు తారీఖును ఇచ్చినట్లయితే ఎవ్వరూ కింద-మీద చెయ్యరు) అభినందనలు. అచ్ఛా. ఇప్పుడు తారీఖు చెప్తాము, చూసుకోండి. చూడండి, బాప్ దాదా ఎంతైనా దయార్ద్ర హృదయులు, కనుక బాప్ దాదా తారీఖును చెప్తారు, శ్రద్ధగా వినండి.

బాప్ దాదా పిల్లలందరి పట్ల ఈ శ్రేష్ఠ భావనను పెట్టుకుంటారు, ఆశను పెట్టుకుంటారు - తక్కువలో తక్కువ 6 నెలలలో, 6 నెలలు ఎప్పటికి పూర్తవుతాయి? (మే లో). మే లో ‘‘మై మై (నేను, నేను)’’ అన్నది సమాప్తమైపోవాలి. బాప్ దాదా మార్జిన్ ఇస్తున్నారు - తక్కువలో తక్కువ ఈ 6 నెలలలో, బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు మరియు ముందు సీజన్ లో కూడా మీకు పని ఇచ్చారు, అదేమిటంటే - మిమ్మల్ని మీరు జీవన్ముక్త స్థితి యొక్క అనుభవములోకి తీసుకురండి. సత్యయుగ సృష్టి యొక్క జీవన్ముక్తి కాదు, సంగమయుగము యొక్క జీవన్ముక్త స్థితి. ఏ రకమైన విఘ్నము, పరిస్థితులు, సాధనాలు, నేను మరియు నాది, దేహాభిమానపు నేను, సేవలో దేహాభిమానపు నాది, వీటన్నింటి ప్రభావము నుండి ముక్తులుగా ఉండండి. నేనైతే ముక్తునిగానే ఉండాలనుకునేవాడిని, కానీ ఈ విఘ్నము వచ్చింది కదా, ఈ విషయమే చాలా పెద్దదైపోయింది కదా, చిన్న విషయమైతే వెళ్ళిపోతుంది కానీ ఇది చాలా పెద్ద విషయము, ఇది చాలా పెద్ద పరీక్ష, పెద్ద విఘ్నము, పెద్ద పరిస్థితి అని ఇలా అనకండి. ఎంత పెద్ద పరిస్థితి, విఘ్నము, సాధనాల ఆకర్షణ ఎదిరించినా, అవి ఎదిరిస్తాయి, ఈ మాట ముందుగానే చెప్తున్నాము, కానీ తక్కువలో తక్కువ 6 నెలలలో 75 శాతం ముక్తులవ్వగలరా? బాప్ దాదా 100 శాతము అని అనటం లేదు, 75 శాతము, అంటే మూడు వంతుల వరకు చేరుకుంటే చివరి వరకు చేరుకుంటారు కదా! కనుక 6 నెలలలో ముక్తులవ్వాలి, ఒక నెల కూడా కాదు, 6 నెలలు ఇస్తున్నాము, సంవత్సరంలో సగభాగము. మరి ఈ తారీఖును ఫిక్స్ చెయ్యగలరా? చూడండి, ఫిక్స్ చెయ్యండి బాబా అని దాదీలు అన్నారు, దాదీల ఆజ్ఞను పాటించాలి కదా! ఫలితం చూసి బాప్ దాదా స్వతహాగానే ఆకర్షణలోకి వస్తారు, చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. కనుక 6 నెలల్లో 75 శాతము తయారవ్వాలి, 100 శాతము అని చెప్పటం లేదు. దాని కొరకు తర్వాత సమయం ఇస్తాము. మరి దీనికి ఎవర్రెడీనా? ఎవర్రెడీ కాదు, 6 నెలలలో రెడీ అవ్వాలి. ఇష్టమేనా లేక ధైర్యము కాస్త తక్కువగా ఉందా, ఏమవుతుందో తెలియదు అని అంటారా? సింహం కూడా వస్తుంది, పిల్లి కూడా వస్తుంది, అన్నీ వస్తాయి. విఘ్నాలు కూడా వస్తాయి, పరిస్థితులు కూడా వస్తాయి, సాధనాలు కూడా ఎక్కువవుతాయి కానీ సాధనాల ప్రభావము నుండి ముక్తులుగా ఉండండి. ఇది ఇష్టమైతే చేతులెత్తండి. టి.వి. ని తిప్పండి. చేతులు బాగా ఎత్తండి, కిందకు దించవద్దు. దృశ్యము మంచిగా అనిపిస్తుంది. అచ్ఛా, ముందుగానే శుభాకాంక్షలను తెలుపుతున్నాము.

మేమైతే చాలా మరణించాల్సి వస్తుంది అని అనకండి, మరణించండి లేక బ్రతకండి, కానీ తయారవ్వాల్సిందే. ఇలా మరణించటమనేది మధురమైన మరణము, ఈ మరణములో దుఃఖము కలగదు. ఈ మరణించటమనేది అనేకుల కళ్యాణము కొరకు మరణించటము, అందుకే ఈ మరణించటములో ఆనందము ఉంది. ఇందులో దుఃఖము ఉండదు, సుఖము ఉంటుంది. అలా జరిగింది కదా, అందుకే ఇలా అయిపోయింది అని ఇలా ఏ సాకులూ చెప్పకండి. ఏ సాకులూ సాగవు. సాకులు చెప్తారా? చెప్పరు కదా! ఎగిరే కళ యొక్క ఆట ఆడండి, మరే ఆటనూ ఆడకండి, పడిపోయే కళలోకి వెళ్ళే ఆట, సాకులు చెప్పే ఆట, బలహీనతల ఆట, ఇవన్నీ సమాప్తం అయిపోవాలి. ఎగిరే కళ యొక్క ఆట ఉండాలి. సరేనా! అందరి ముఖాలు వికసించిపోయాయి. మరలా 6 నెలల తర్వాత కలుసుకోవడానికి వచ్చినప్పుడు ముఖాలు ఏ విధంగా ఉంటాయి! అప్పుడు కూడా ఫోటో తీస్తారు.

డబుల్ విదేశీయులు వచ్చారు కదా, కనుక డబుల్ ప్రతిజ్ఞను చేసే రోజు వచ్చింది. ఇతరులెవ్వరినీ చూడకండి, సీ ఫాదర్, సీ బ్రహ్మా మదర్ (తండ్రిని చూడండి, బ్రహ్మా తల్లిని చూడండి). ఇతరులు చేసినా, చెయ్యకపోయినా, అందరూ అయితే చేస్తారు, అయినా కూడా వారి పట్ల కూడా దయా భావనను ఉంచండి. బలహీనులకు శుభ భావనా బలమును ఇవ్వండి, బలహీనతను చూడకండి. అటువంటి ఆత్మలను మీ ధైర్యమనే చేతితో లేపండి, పైకి ఎత్తండి. ధైర్యమనే చేతిని సదా స్వయానికి మరియు ఇతరులకు అందిస్తూ ఉండండి. ధైర్యమనే చెయ్యి చాలా శక్తిశాలి అయినది. అంతేకాక బాప్ దాదా యొక్క వరదానము కూడా ఉంది, అదేమిటంటే - ధైర్యమనే ఒక్క అడుగు పిల్లలదైతే బాబాది వేయ అడుగుల సహాయము. నిస్వార్థ పురుషార్థములో ముందు నేను. నిస్వార్థ పురుషార్థము, స్వార్థ పురుషార్థము కాదు, నిస్వార్థ పురుషార్థము, ఇందులో ఎవరైతే ముందుగా బాధ్యతను తీసుకుంటారో వారే బ్రహ్మాబాబా సమానము.

బ్రహ్మాబాబా పట్లనైతే ప్రేమ ఉంది కదా! కనుకనే బ్రహ్మాకుమారీలు మరియు బ్రహ్మాకుమారులుగా పిలవబడతారు కదా! క్షణములో జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోండి అని ఛాలెంజ్ చేస్తారు కదా, మరి ఇప్పుడు క్షణములో స్వయాన్ని ముక్తులుగా చేసుకునేదానిపై అటెన్షన్ పెట్టాలి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురండి. మీ సంపూర్ణత యొక్క సమీపతయే శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకువస్తుంది. యజమానులు కదా, రాజులు కదా! స్వరాజ్య అధికారులేనా? అయితే ఆజ్ఞాపించండి. ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి అని రాజు ఆజ్ఞాపిస్తారు కదా! ఆజ్ఞాపించండి, అంతే. ఇప్పుడిప్పుడే మనసును చూడండి, ఎందుకంటే మనసు ముఖ్యమంత్రి. కనుక ఓ రాజా, నీ మనసనే మంత్రిని క్షణములో ఆజ్ఞాపించి అశరీరీ, విదేహీ స్థితిలో స్థితి చెయ్యగలవా? ఒక్క క్షణంలో ఆజ్ఞాపించండి. (5 నిమిషాల డ్రిల్). అచ్ఛా.

సదా లవలీన మరియు లక్కీ ఆత్మలకు, బాప్ దాదా ద్వారా ప్రాప్తించిన సర్వ ప్రాప్తుల అనుభవీ ఆత్మలకు, స్వరాజ్య అధికారులుగా అయ్యి అధికారము ద్వారా స్వరాజ్యము చేసే శక్తిశాలీ ఆత్మలకు, సదా జీవన్ముక్త స్థితి యొక్క అనుభవీ, హైయ్యెస్ట్ ఆత్మలకు, భాగ్య విధాత ద్వారా శ్రేష్ఠ భాగ్యరేఖ ద్వారా లక్కీయెస్ట్ ఆత్మలకు, సదా పవిత్రతా దృష్టి, వృత్తి ద్వారా స్వ పరివర్తనను, విశ్వ పరివర్తనను చేసే హోలియెస్ట్ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

డబుల్ విదేశీ అతిథులతో (కాల్ ఆఫ్ టైమ్ (సమయము యొక్క పిలుపు) అన్న ప్రోగ్రాముకు వచ్చిన అతిథులతో):-

అందరూ మీ మధురమైన ఇంటికి, మధురమైన పరివారములోకి వచ్చి చేరుకున్నారు కదా! ఇంత చిన్నని మధురమైన పరివారము ప్రియమైనదిగా అనిపిస్తుంది కదా! మరియు మీరు కూడా ఎంతటి ప్రియమైనవారిగా అయ్యారు! అన్నింటికంటే ముందు పరమాత్మకు ప్రియమైనవారిగా అయ్యారు. అయ్యారు కదా! అయిపోయారా లేక అవుతారా? చూడండి, మిమ్మల్నందరినీ చూసి అందరూ ఎంతగా సంతోషపడుతున్నారు! ఎందుకు సంతోషపడుతున్నారు? అందరి ముఖాలను చూడండి, చాలా సంతోషపడుతున్నారు. ఎందుకు సంతోషపడుతున్నారు? ఎందుకంటే వీరందరూ ఈశ్వరీయ సందేశకులుగా అయ్యి ఆత్మలకు సందేశాన్ని ఇచ్చేందుకు నిమిత్తమైన ఆత్మలు అన్నది వారికి తెలుసు. (5 ఖండాలకు చెందినవారు ఉన్నారు) మరి 5 ఖండాలలో సందేశము చేరుతుంది, సహజమే కదా. ప్లాన్ చాలా బాగా తయారుచేసారు. ఇందులో పరమాత్మ శక్తిని నింపి, పరివారము యొక్క సహయోగాన్ని తీసుకుని ముందుకు వెళ్తూ ఉండండి. అందరి సంకల్పాలు బాప్ దాదా వద్దకు చేరుకుంటున్నాయి. చాలా మంచి-మంచి సంకల్పాలను నడుస్తున్నాయి కదా! ప్లాన్లు తయారవుతున్నాయి. మరి ప్లాన్లను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చే ధైర్యము మీది మరియు సహాయము బాబాది, బ్రాహ్మణ పరివారముది. కేవలము నిమిత్తులుగా అవ్వాలి, అంతే, మరే ఇతర శ్రమ చెయ్యాల్సిన అవసరము లేదు. నేను పరమాత్మ కార్యానికి నిమిత్తుడిని. ఏ కార్యములోకి వచ్చినా సరే, బాబా - ఇనస్ట్రుమెంటునైన నేను సేవ కొరకు తయారుగా ఉన్నాను, నేను ఇనస్ట్రుమెంటును, నడిపించేవారు వారంతట వారే నడిపిస్తారు - ఈ నిమిత్త భావము మీ ముఖముపై నిర్మాణము మరియు నిర్మానత యొక్క భావాన్ని ప్రత్యక్షము చేస్తుంది. చేయించేవారు నిమిత్తునిగా చేసి కార్యాన్ని చేయిస్తారు. మీరు మైక్, బాబా మైట్ (శక్తి). కనుక సహజమైపోతుంది కదా! కనుక నిమిత్తులుగా అయ్యి స్మృతిలో హాజరైపోండి, అంతే. అప్పుడు మీ ముఖము, మీ ముఖకవళికలు స్వతహాగానే సేవకు నిమిత్తంగా అవుతాయి. కేవలము మాటల ద్వారానే సేవ చెయ్యరు, కానీ ఫీచర్స్ ద్వారా కూడా మీ ఆంతరిక సంతోషము ముఖము ద్వారా కనిపిస్తుంది. దీనినే అలౌకికత అని అంటారు. ఇప్పుడు అలౌకికమైనవారిగా అయిపోయారు కదా. లౌకికతనమైతే సమాప్తమైపోయింది కదా. నేను ఆత్మను - ఇది అలౌకికము. నేను ఫలానాను - ఇది లౌకికము. మరి మీరు ఎవరు? అలౌకికులా లేక లౌకికులా? అలౌకికులు కదా! మంచిది. బాప్ దాదా మరియు పరివారము ముందుకు చేరుకున్నారు, ఇందులో చాలా మంచి ధైర్యము పెట్టారు. చూడండి, మీరు కూడా కోట్లాది మందిలో కొద్దిమందిగా వెలువడ్డారు కదా. గ్రూప్ ఎంతమందిది, వారిలో నుండి ఎంతమంది వచ్చారు, కనుక కోట్లలో కొద్దిమందే వెలువడ్డారు కదా. మంచిది - బాప్ దాదాకు గ్రూప్ నచ్చింది. వీళ్ళను చూడండి, ఎంత సంతోషిస్తున్నారు! మీకంటే ఎక్కువ వీరు సంతోషిస్తున్నారు ఎందుకంటే సేవ రిటర్ను ఎదురుగా చూసి సంతోషిస్తున్నారు. సంతోషపడుతున్నారు కదా - కష్టానికి తగిన ఫలితము లభించింది అని. అచ్ఛా, ఇప్పుడైతే బాలకుల నుండి యజమానులుగా అయ్యారు. బాలకుడు మాస్టరు. పిల్లలను సదా మాస్టర్లు అని అంటారు. అచ్ఛా.

వరదానము:-

సఫలము చేసే విధి ద్వారా సఫలత యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకునే వరదానీ మూర్త భవ

సంగమయుగములో పిల్లలైన మీకు వారసత్వము కూడా ఉంది, వరదానము కూడా ఉంది - ‘‘సఫలం చెయ్యండి మరియు సఫలతను పొందండి’’. సఫలం చెయ్యటము అనేది బీజము మరియు సఫలత అనేది ఫలము. ఒకవేళ బీజము మంచిగా ఉంటే ఫలం లభించకుండా ఉండటము అనేది జరగదు. కనుక ఏ విధంగానైతే సమయము, సంకల్పాలు, సంపద అన్నింటినీ సఫలం చెయ్యండి అని ఇతరులకు చెప్తారో, అదే విధంగా మీ సర్వ ఖజానాల లిస్ట్ ను చెక్ చేసుకోండి - ఏ ఖజానా సఫలమైంది మరియు ఏ ఖజానా వ్యర్థమైంది. సఫలము చేస్తూ ఉన్నట్లయితే సర్వ ఖజానాలతో సంపన్నమైన వరదానీ మూర్తులుగా అవుతారు.

స్లోగన్:-

పరమాత్మ అవార్డును అందుకునేందుకు వ్యర్థాన్ని మరియు నెగెటివ్ ను అవాయిడ్ చెయ్యండి(దూరముంచండి).