07-09-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - జ్ఞానము యొక్క మూడవ నేత్రము సదా తెరుచుకుని ఉన్నట్లయితే సంతోషములో రోమాలు నిక్కబొడుచుకుంటాయి, సంతోషపు పాదరసం సదా ఎక్కి ఉంటుంది’’

ప్రశ్న:-
ఈ సమయములో మనుష్యుల దృష్టి చాలా బలహీనంగా ఉంది కావున వారికి అర్థం చేయించేందుకు యుక్తి ఏమిటి?

జవాబు:-
బాబా అంటారు, వారి కోసం మీరు ఎటువంటి పెద్ద-పెద్ద చిత్రాలను తయారుచేయండి అంటే వారు దూరం నుండే చూసి అర్థం చూసుకోగలగాలి. ఈ సృష్టి చక్రము యొక్క చిత్రమైతే చాలా పెద్దగా ఉండాలి. ఇది అంధుల ముందు అద్దం వంటిది.

ప్రశ్న:-
మొత్తం ప్రపంచమంతటినీ స్వచ్ఛంగా తయారుచేయడములో మీకు సహాయకులుగా ఎవరు అవుతారు?

జవాబు:-
ఈ ప్రకృతి వైపరీత్యాలు మీకు సహాయకులుగా అవుతాయి. ఈ అనంతమైన ప్రపంచాన్ని శుభ్రము చేయడం కోసం తప్పకుండా ఎవరో ఒకరు సహాయకులు కావాలి.

ఓంశాంతి
తండ్రి నుండి ఒక్క క్షణంలో వారసత్వము అనగా జీవన్ముక్తి లభిస్తుంది అన్న గాయనము కూడా ఉంది. ఇతరులందరూ జీవన బంధనములో ఉన్నారు. ఈ త్రిమూర్తి మరియు సృష్టిచక్రము యొక్క చిత్రమేదైతే ఉందో, కేవలం అదే ముఖ్యమైనది. ఇది చాలా పెద్ద-పెద్దగా ఉండాలి. అంధుల కొరకైతే పెద్ద అద్దం కావాలి, తద్వారా వారు బాగా చూడగలుగుతారు, ఎందుకంటే ఇప్పుడు అందరి దృష్టి బలహీనంగా ఉంది, బుద్ధి తక్కువగా ఉంది. బుద్ధి అని మూడవ నేత్రాన్ని అంటారు. మీ బుద్ధిలో ఇప్పుడు3 సంతోషం ఉంది. ఎవరికైతే సంతోషములో రోమాలు నిక్కబొడుచుకోవో, వారు శివబాబాను స్మృతి చేయడం లేదన్నట్లే, కావున వారి జ్ఞానము యొక్క మూడవ నేత్రము కొద్దిగానే తెరుచుకుంది, మసకగా ఉంది అని అంటారు. ఎవరికైనా క్లుప్తంగా అర్థం చేయించాలి అని తండ్రి అర్థం చేయిస్తారు. పెద్ద-పెద్ద మేళాలు మొదలైనవి జరుగుతాయి, సేవ చేయడానికి వాస్తవానికి ఒక్క చిత్రమే చాలని పిల్లలకు తెలుసు. సృష్టిచక్రం చిత్రము ఉన్నా ఏమీ పర్వాలేదు. తండ్రి, డ్రామా మరియు కల్పవృక్షము మరియు 84 జన్మల చక్రము యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. బ్రహ్మా ద్వారా తండ్రి ఇచ్చే ఈ వారసత్వము లభిస్తుంది. ఇది కూడా చాలా స్పష్టంగా ఉంది. ఈ చిత్రములో మొత్తం అంతా వచ్చేస్తుంది, ఇన్ని చిత్రాల అవసరమే లేదు. ఈ రెండు చిత్రాలే చాలా పెద్ద-పెద్ద అక్షరాలతో ఉండాలి, అందులో మ్యాటర్ (వివరణ) కూడా ఉండాలి. రాబోయే వినాశనానికి ముందు జీవన్ముక్తి అనేది గాడ్ ఫాదర్ ఇచ్చిన బర్త్ రైట్ (జన్మ సిద్ధ అధికారము). వినాశనం కూడా తప్పకుండా జరగవలసిందే. డ్రామా ప్లాన్ అనుసారంగా తమకు తామే అంతా అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేయించవలసిన అవసరం కూడా ఉండదు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన ఈ వారసత్వము లభిస్తుంది. ఇది పూర్తిగా, పక్కాగా గుర్తుండాలి. కానీ మాయ మీ చేత మరపింపజేస్తుంది. సమయం గడిచిపోతూ ఉంటుంది. ఎంతో గడిచిపోయింది... అన్న గాయనం కూడా ఉంది కదా. దీని అర్థము ఈ సమయానిదే. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. స్థాపన అయితే జరుగుతూనే ఉంది, వినాశనానికి ఇంకా కొద్ది సమయమే ఉంది. ఆ కొద్దిలో కూడా కొద్దిగా మాత్రమే మిగులుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించడం జరుగుతుంది. ఇప్పుడు మేల్కోరు, చివరిలో మేల్కొంటూ ఉంటారు, కళ్ళు పెద్దగా అవుతూ ఉంటాయి. కళ్ళు అంటే ఈ నేత్రాలు కాదు, బుద్ధి నేత్రము. చిన్న-చిన్న చిత్రాలతో అంతటి ఆనందం కలగదు. పెద్ద-పెద్దవి తయారవుతాయి. సైన్స్ కూడా ఎంత సహాయం చేస్తుంది. వినాశనములో తత్వాలు కూడా సహాయం చేస్తాయి. ఒక్క పైసా ఖర్చు లేకుండా మీకు అవి ఎంత సహాయం చేస్తాయి. మీ కోసం అవి పూర్తిగా శుభ్రం చేసేస్తాయి. ఇది పూర్తిగా ఛీ-ఛీ ప్రపంచము. అజ్మీర్ లో స్వర్గము యొక్క స్మృతిచిహ్నం ఉంది. ఇక్కడ దిల్వాడా మందిరములో స్థాపన యొక్క స్మృతిచిహ్నము ఉంది. కానీ ఏమైనా అర్థం చేసుకోగలరా. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. వినాశనమైపోతుందని మాకు తెలియదు, అది అర్థం కావడం లేదు అని మనుష్యులు అంటారు. పులి వచ్చింది అని ఒక కథ ఉంది కదా - పులి వచ్చింది, పులి వచ్చింది అని అనేవాడు... ఇక వారు నమ్మేవారు కాదు, ఒక రోజు అది వచ్చి ఆవులను తినేసింది. మీరు కూడా అంటూ ఉంటారు - ఈ పాత ప్రపంచము ఇక పోనున్నది, ఎంతో గడిచిపోయింది, కొద్దిగానే మిగిలి ఉంది... అని.

ఈ జ్ఞానమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఆత్మయే ధారణ చేస్తుంది. తండ్రి ఆత్మలో కూడా జ్ఞానం ఉంది. వారు ఎప్పుడైతే శరీరాన్ని ధారణ చేస్తారో అప్పుడు జ్ఞానాన్ని ఇస్తారు. తప్పకుండా వారిలో జ్ఞానముంది కావుననే వారిని నాలెడ్జ్ ఫుల్ గాడ్ ఫాదర్ అని అంటారు. వారికి మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. స్వయము గురించైతే తెలుసు కదా. అంతేకాక సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానము కూడా ఉంది, అందుకే ఇంగ్లీషులో నాలెడ్జ్ ఫుల్ అన్న పదము చాలా బాగుంది. వారు మనుష్య సృష్టి రూపీ వృక్షము యొక్క బీజరూపుడు కావున వారికి మొత్తం జ్ఞానము ఉంది. మీకు ఇది నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. శివబాబా ఉన్నదే నాలెడ్జ్ ఫుల్ గా. ఇది బుద్ధిలో బాగా ఉండాలి. అందరి బుద్ధిలోనూ ఏకరసముగా ధారణ జరుగుతుందని కాదు. పాయింట్లు వ్రాస్తూ ఉంటారు కానీ ధారణ ఏమీ లేదు. నామమాత్రంగా వ్రాస్తారు, కానీ ఎవ్వరికీ చెప్పలేరు, కేవలం కాగితానికే చెప్తూ ఉంటారు. ఆ కాగితం ఏం చేస్తుంది! కాగితం ద్వారానైతే ఎవరూ అర్థం చేసుకోరు. ఈ చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా గొప్ప జ్ఞానము కావున అక్షరాలు కూడా చాలా పెద్ద-పెద్దగా ఉండాలి. పెద్ద-పెద్ద చిత్రాలను చూసి మనుష్యులు, ఇందులో తప్పకుండా ఏదో సారముంది అని భావిస్తారు. స్థాపన మరియు వినాశనము అని కూడా వ్రాయబడి ఉంది. రాజధాని యొక్క స్థాపన అనేది గాడ్ ఫాదర్లీ బర్త్ రైట్ (భగవంతుడైన తండ్రి ఇచ్చే జన్మసిద్ధ అధికారము). జీవన్ముక్తి అనేది పిల్లలు ప్రతి ఒక్కరి హక్కు. కావున పిల్లలకు బుద్ధి నడవాలి - అందరూ జీవనబంధనములో ఉన్నారు, వీరిని జీవనబంధనము నుండి జీవన్ముక్తిలోకి ఎలా తీసుకువెళ్ళాలి? మొదట శాంతిధామములోకి వెళ్తారు, ఆ తర్వాత సుఖధామములోకి. సుఖధామాన్ని జీవన్ముక్తి అని అంటారు. ఈ చిత్రాలు విశేషంగా పెద్ద-పెద్దవిగా తయారవ్వాలి. ఇవి ముఖ్యమైన చిత్రాలు కదా. చాలా పెద్ద-పెద్ద అక్షరాలు ఉన్నట్లయితే మనుష్యులు అంటారు - బి.కె.లు ఇంత పెద్ద చిత్రాలను తయారుచేశారు, తప్పకుండా ఏదో జ్ఞానము ఉంది. కావున అక్కడక్కడా మీవి కూడా పెద్ద-పెద్ద చిత్రాలు పెట్టి ఉన్నట్లయితే - ఇవి ఏమిటి అని అడుగుతారు. అప్పుడు మీరు ఇలా చెప్పండి - ఇంత పెద్ద చిత్రాలను మీరు అర్థం చేసుకునేందుకే తయారుచేసాము. ఇందులో స్పష్టంగా వ్రాయబడి ఉంది, వారికి అనంతమైన వారసత్వము ఉండేది, అది నిన్నటి విషయమే, ఈ రోజు అది లేదు, ఎందుకంటే 84 పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ కిందకు వచ్చేశారు. సతోప్రధానుల నుండి తమోప్రధానులుగా అవ్వవలసిందే. ఇది జ్ఞానము మరియు భక్తి, పూజ్యులు మరియు పూజారుల ఆట కదా. సగం-సగంగా మొత్తం ఆట అంతా తయారై ఉంది. కావున ఇటువంటి పెద్ద-పెద్ద చిత్రాలను తయారుచేసే ధైర్యము కావాలి. సేవ యొక్క అభిరుచి కూడా కావాలి. ఢిల్లీలోనైతే మూలమూలలలో సేవ చేయాలి. మేళాలు మొదలైనవాటికైతే ఎంతోమంది వెళ్తారు, అక్కడ మీకు ఈ చిత్రాలే ఉపయోగపడతాయి. త్రిమూర్తి, సృష్టిచక్రము, ఇది ముఖ్యమైన చిత్రము. ఇది చాలా మంచి చిత్రము, అంధుల ముందు అద్దం వంటిది. అంధులను చదివించడం జరుగుతుంది, చదివేది అయితే ఆత్మయే కదా. కానీ ఆత్మకు ఇంద్రియాలు చిన్నగా ఉన్నప్పుడు వారికి చదివించేందుకు చిత్రాలు మొదలైనవాటిని చూపించడం జరుగుతుంది. కాస్త ఎదిగాక ప్రపంచ పటాన్ని చూపిస్తారు. ఆ తర్వాత ఆ పటమంతా బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ఈ డ్రామా చక్రమంతా ఉంది. ఇన్ని ధర్మాలు ఉన్నాయి, అవి ఏ విధంగా నంబరువారుగా వస్తాయి, మళ్ళీ ఎలా వెళ్ళిపోతాయి అన్నది బుద్ధిలో ఉంది. అక్కడైతే కేవలం ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే ఉంటుంది, దానినే స్వర్గము, హెవెన్ అని అంటారు. తండ్రితో యోగాన్ని జోడించడం ద్వారా ఆత్మ పతితము నుండి పావనముగా అయిపోతుంది. భారత్ యొక్క ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. యోగము అనగా స్మృతి. తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని తండ్రి కూడా అంటారు. ఇలా చెప్పవలసి ఉంటుంది. లౌకిక తండ్రికి, నన్ను స్మృతి చేయండి అని చెప్పవలసిన అవసరముండదు. పిల్లలు తమంతట తామే అమ్మా, నాన్నా అని అంటూ ఉంటారు. వారు లౌకిక మాతా-పితలు, వీరు పారలౌకికమైనవారు. మీ కృప ద్వారా అపారమైన సుఖాలను పొందుతాము అని వీరి గురించి గాయనముంది. ఎవరికైతే దుఃఖము ఉంటుందో, వారే గానం చేస్తారు. సుఖములోనైతే ఇలా అనవలసిన అవసరమే ఉండదు. ఎప్పుడైతే దుఃఖములో ఉంటారో అప్పుడు పిలుస్తారు. వీరు మాతా-పిత అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. రోజురోజుకు మీకు గుహ్యాతి-గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని తండ్రి అంటారు కదా! మాతా-పిత అని ఎవరిని అంటారో ఇంతకుముందు ఏమైనా తెలుసా? పిత అని వారినే అంటారని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మా ద్వారా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. తల్లి కూడా కావాలి కదా ఎందుకంటే పిల్లలను దత్తత తీసుకోవాలి. ఈ విషయం ఎవరి ధ్యాసలోకి రాదు. బాబా ఘడియ-ఘడియ చెప్తారు - మధురాతి మధురమైన పిల్లలూ, తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. లక్ష్యం లభించిన తర్వాత ఇక ఎక్కడికైనా వెళ్ళండి, విదేశాలకైనా వెళ్ళండి, 7 రోజుల కోర్సు చేస్తే చాలు. తండ్రి నుండైతే వారసత్వాన్ని తీసుకోవలసిందే. స్మృతి ద్వారానే ఆత్మ పావనముగా అవుతుంది, స్వర్గాధిపతులుగా అవుతారు. ఈ లక్ష్యమైతే బుద్ధిలో ఉంది కావున ఇక ఎక్కడికైనా వెళ్ళండి. గీతకు సంబంధించిన మొత్తం జ్ఞానమంతా ఈ బ్యాడ్జిలో ఉంది. ఏం చేయాలి అని... ఎవరినీ అడగవలసిన అవసరం కూడా ఉండదు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలంటే తప్పకుండా తండ్రిని స్మృతి చేయాలి. మీరు ఈ వారసత్వాన్ని తండ్రి నుండి అనేక సార్లు తీసుకున్నారు. డ్రామా చక్రము రిపీట్ అవుతూ ఉంటుంది కదా. అనేక సార్లు మీరు టీచర్ ద్వారా చదువుకొని ఏదో ఒక పదవిని ప్రాప్తి చేసుకుంటారు. చదువులో బుద్ధియోగము టీచరుతో జోడింపబడి ఉంటుంది కదా. పరీక్ష చిన్నదైనా లేక పెద్దదైనా చదివేది అయితే ఆత్మయే కదా. ఇతని ఆత్మ కూడా చదువుతుంది. టీచరును మరియు మీ లక్ష్యము-ఉద్దేశ్యమును స్మృతి చేయాలి. సృష్టి చక్రాన్ని కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎంతగా ధారణ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. బాగా స్మృతి చేస్తూ ఉంటే ఇక ఇక్కడకు రావలసిన అవసరం కూడా ఏముంది? అయినా కానీ వస్తూ ఉంటారు. ఇంతటి ఉన్నతమైన తండ్రి, ఎవరి నుండైతే ఇంతటి అనంతమైన వారసత్వము లభిస్తుందో, వారిని కలుసుకుంటాము అని వస్తారు. మంత్రాన్ని తీసుకొని అందరూ వస్తారు. మీకైతే చాలా భారీ మంత్రము లభిస్తుంది. జ్ఞానం మొత్తము మీ బుద్ధిలో బాగా ఉంది.

వినాశీ సంపాదన వెనుక సమయాన్ని ఎక్కువగా వృధా చేసుకోకూడదు అని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. అదంతా మట్టిలో కలిసిపోతుంది. తండ్రికి ఏమైనా కావాలా, ఏమీ అవసరం లేదు. ఏవైనా ఖర్చులు మొదలైనవి చేసినా అది మీ కోసమే చేసుకుంటారు. ఇందులో పైస ఖర్చు కూడా లేదు. యుద్ధం కొరకు బాంబులు లేక ట్యాంకులు మొదలైనవాటిని కొనేది ఏమీ లేదు, ఇక్కడ అదేమీ లేదు. మీరు యుద్ధం చేస్తూ కూడా మొత్తం ప్రపంచమంతటి నుండి గుప్తముగా ఉన్నారు. మీ యుద్ధం ఎలా ఉందో చూడండి. దీనిని యోగబలము అని అంటారు, ఇదంతా గుప్తమైన విషయము. ఇందులో ఎవరినీ హతమార్చే అవసరమే లేదు. మీరు కేవలం తండ్రిని స్మృతి చేయాలి. వీరందరి మృత్యువు డ్రామాలో రచింపబడి ఉంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీరు యోగబలాన్ని జమ చేసుకునేందుకు ఈ చదువును చదువుతారు. చదువు పూర్తయ్యాక కొత్త ప్రపంచములో ప్రారబ్ధము కావాలి. పాత ప్రపంచము యొక్క వినాశనం కొరకే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. తమ కులము యొక్క వినాశనాన్ని ఎలా చేసుకుంటారో అన్న గాయనం కూడా ఉంది కదా. ఇది ఎంత పెద్ద కులము. అందులో మొత్తం యూరప్ అంతా వచ్చేస్తుంది. ఈ భారత్ అయితే వేరుగా ఒక మూలలో ఉంది. మిగిలినవన్నీ అంతమైపోనున్నాయి. యోగబలం ద్వారా మీరు మొత్తం విశ్వమంతటి పైనా విజయాన్ని పొందుతారు, ఈ లక్ష్మీ-నారాయణుల వలె పవిత్రంగా కూడా అవ్వాలి. అక్కడ అశుద్ధమైన దృష్టియే లేదు. మున్ముందు మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి. తమ దేశానికి సమీపంగా వస్తున్న కొలదీ వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి కదా. అప్పుడు, ఇక మేము మా ఇంటికి సమీపంగా వచ్చేసాము అన్న సంతోషము కలుగుతుంది. మీరు కూడా ఇంటికి వెళ్తున్నారు, ఆ తర్వాత మీ సుఖధామములోకి వస్తారు. ఇంకా కొద్ది సమయమే ఉంది, స్వర్గము నుండి వీడ్కోలు తీసుకొని ఎంత సమయమైంది. ఇప్పుడు మళ్ళీ స్వర్గము సమీపంగా వస్తోంది. మీ బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. అది నిరాకారీ లోకము, దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు. మనము అక్కడి నివాసులము. ఇక్కడ 84 జన్మల పాత్రను అభినయించాము. ఇప్పుడు ఇక మనము వెళ్తాము. పిల్లలైన మీరు ఆల్రౌండర్లు, ప్రారంభం నుండి మొదలుకుని పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఆలస్యంగా వచ్చేవారిని ఆల్రౌండర్ అని అనరు. మ్యాగ్జిమమ్ మరియు మినిమమ్ ఎన్ని జన్మలు తీసుకుంటారు అనేది తండ్రి అర్థం చేయించారు. ఒక్క జన్మ తీసుకునేవారు కూడా ఉంటారు. చివరిలో అందరూ తిరిగి వెళ్ళిపోతారు. నాటకం పూర్తవుతూనే ఆట అంతమైపోతుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - నన్ను స్మృతి చేయండి, తద్వారా అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది. తండ్రి వద్దకు పరంధామములోకి వెళ్ళిపోతారు. దానిని ముక్తిధామము, శాంతిధామము అని అంటారు, ఆ తర్వాత సుఖధామము. ఇది దుఃఖధామము. పై నుండి ప్రతి ఒక్కరూ సతోప్రధానముగా వస్తారు, ఆ తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తారు. ఒక్క జన్మే ఉన్నా అందులో కూడా ఈ నాలుగు స్థితులను పొందుతారు. తండ్రి కూర్చొని పిల్లలకు ఎంత చక్కగా అర్థం చేయిస్తారు, అయినా కానీ స్మృతి చేయరు, తండ్రిని మర్చిపోతారు, నంబరువారుగా అయితే ఉన్నారు కదా. నంబరువారు పురుషార్థానుసారంగా రుద్ర మాల తయారవుతుందని పిల్లలకు తెలుసు. ఈ రుద్ర మాల కోట్లాది మందిది. ఇది అనంతమైన విశ్వము యొక్క మాల. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా అవుతారు, ఇరువురి ఇంటి పేరును చూడండి, ఇది ప్రజాపిత బ్రహ్మా యొక్క పేరు. మళ్ళీ అర్ధకల్పము రావణుడు వస్తాడు. దేవతా ధర్మము, ఆ తర్వాత ఇస్లామ్ ధర్మము... ఆదమ్-బీబీలను కూడా తలచుకుంటారు, అలాగే ప్యారడైజ్ ను కూడా తలచుకుంటారు. భారత్ ప్యారడైజ్ గా, స్వర్గముగా ఉండేది, పిల్లలకు సంతోషమైతే ఎంతో కలగాలి. అనంతమైన తండ్రి, ఉన్నతోన్నతమైన భగవంతుడు, ఉన్నతోన్నతముగా చదివిస్తారు, ఉన్నతోన్నతమైన పదవి లభిస్తుంది. అందరికన్నా ఉన్నతోన్నతమైన టీచర్ తండ్రే. వారు టీచర్ కూడా మరియు తమతోపాటు తీసుకువెళ్తారు కావున సద్గురువు కూడా. ఇటువంటి తండ్రి ఎందుకు గుర్తుండరు. సంతోషము యొక్క పాదరసం పైకెక్కి ఉండాలి. కానీ ఇది యుద్ధ మైదానము, మాయ నిలవనివ్వదు. ఘడియ-ఘడియ పడిపోతూ ఉంటారు. తండ్రి అయితే అంటారు - పిల్లలూ, స్మృతి ద్వారానే మీరు మాయాజీతులుగా అవుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఏదైతే నేర్పిస్తారో, దానిని అమలులోకి తీసుకురావాలి, కేవలం కాగితంపై నోట్ చేసుకోవడం కాదు. వినాశనం కన్నా ముందే జీవనబంధనము నుండి జీవన్ముక్త పదవిని ప్రాప్తి చేసుకోవాలి.

2. మీ సమయాన్ని వినాశీ సంపాదన వెనుక ఎక్కువగా వృధా చేసుకోకూడదు ఎందుకంటే ఇదంతా మట్టిలో కలిసిపోనున్నది, అందుకే అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి మరియు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి.

వరదానము:-

యోగబలము ద్వారా మాయా శక్తిపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే సదా విజయీ భవ

జ్ఞాన బలము మరియు యోగబలము అన్నింటికన్నా శ్రేష్ఠమైన బలాలు. ఏ విధంగా సైన్స్ బలము అంధకారముపై విజయాన్ని పొంది ప్రకాశాన్ని ఇస్తుందో, అదే విధంగా యోగబలము సదా కొరకు మాయపై విజయాన్ని ప్రాప్తింపజేసి విజయులుగా చేస్తుంది. యోగబలము ఎంతటి శ్రేష్ఠ బలమంటే మాయా శక్తి దీని ముందు అసలేమీ కాదు. యోగబలము కల ఆత్మలు స్వప్నములో కూడా మాయతో ఓడిపోలేరు. స్వప్నములో కూడా ఎటువంటి బలహీనత రాదు. ఇటువంటి విజయీ తిలకము మీ మస్తకముపై దిద్దబడి ఉంది.

స్లోగన్:-

నంబర్ వన్ లోకి రావాలంటే వ్యర్థాన్ని సమర్థములోకి పరివర్తన చెయ్యండి.