08-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఈశ్వరీయ సేవాధారులు, సత్యమైన ముక్తి దళము, మీరు అందరికీ శాంతి యొక్క పరిష్కారాన్ని ఇవ్వాలి’’

ప్రశ్న:-
పిల్లలైన మిమ్మల్ని ఎవరైనా శాంతి యొక్క పరిష్కారము అడిగితే వారికి ఏమి అర్థం చేయించాలి?

జవాబు:-
వారికి చెప్పండి - తండ్రి అంటారు, ఇప్పుడు ఇక్కడే మీకు శాంతి కావాలా. ఇది శాంతిధామమేమీ కాదు. శాంతి అయితే శాంతిధామములోనే ఉండగలదు, దానిని మూలవతనము అని అంటారు. ఆత్మకు ఎప్పుడైతే శరీరము ఉండదో అప్పుడు శాంతి ఉంటుంది. సత్యయుగములో పవిత్రత-సుఖము-శాంతి అన్నీ ఉన్నాయి. తండ్రియే వచ్చి ఈ వారసత్వాన్ని ఇస్తారు. మీరు తండ్రిని స్మృతి చేయండి.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. నా లోపల ఆత్మ ఉంది అని మనుష్యమాత్రులందరికీ తెలుసు. జీవాత్మ అని అంటారు కదా. మొదట మనము ఆత్మ, ఆ తర్వాత శరీరము లభిస్తుంది. ఎవ్వరూ తమ యొక్క ఆత్మను చూడలేదు. కేవలం నేను ఆత్మను అన్నంత వరకు అర్థం చేసుకుంటారు. ఏ విధంగా ఆత్మను తెలుసుకున్నారు కానీ చూడలేదో, అలాగే పరమపిత పరమాత్మను గురించి కూడా, పరమ ఆత్మ అనగా పరమాత్మ అని చెప్తారు కానీ వారిని చూడలేదు. స్వయాన్ని గాని, తండ్రిని గాని చూడలేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది అని అంటారు. కానీ యథార్థ రీతిలో తెలియదు. 84 లక్షల యోనులు అని కూడా అనేస్తారు, వాస్తవానికి 84 జన్మలు ఉన్నాయి. కానీ ఏ ఆత్మలు ఎన్ని జన్మలు తీసుకుంటారు అన్నది కూడా తెలియదు. ఆత్మ తండ్రిని పిలుస్తుంది కానీ వారిని ఎప్పుడూ చూడలేదు, అలాగే వారి గురించి యథార్థ రీతిలో తెలియదు. మొదట ఆత్మ గురించి యథార్థ రీతిలో తెలుసుకుంటే అప్పుడు తండ్రి గురించి తెలుసుకోగలుగుతారు. స్వయం గురించే తెలియకపోతే మరి ఇక అర్థం చేయించేది ఎవరు? దీనినే - సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవడం అని అంటారు. అది కూడా తండ్రి తప్ప ఇంకెవ్వరూ చేయించలేరు. ఆత్మ ఏమిటి, ఎలా ఉంటుంది, ఎక్కడి నుండి ఆత్మ వస్తుంది, ఎలా జన్మ తీసుకుంటుంది, ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉంది, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. స్వయం గురించే తెలియకపోతే తండ్రి గురించి కూడా తెలియదు. ఈ లక్ష్మీ-నారాయణులది కూడా మనుష్య పదవే కదా. వీరు ఆ పదవిని ఎలా పొందారు? ఇది ఎవ్వరికీ తెలియదు. తెలుసుకోవలసినదైతే మనుష్యులే కదా. వీరు వైకుంఠానికి అధిపతులు అని అంటారు కానీ వారు ఆ ఆధిపత్యాన్ని ఎలా తీసుకున్నారు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఇవేమీ తెలియదు. ఇప్పుడు మీకైతే అన్నీ తెలుసు. ఇంతకుముందు ఏమీ తెలియదు. ఏ విధంగానైతే చిన్న పిల్లవాడికి బ్యారిస్టర్ అంటే ఏమిటి అనేది ముందు తెలుస్తుందా? చదువుతూ-చదువుతూ బ్యారిస్టర్ గా అయిపోతాడు. అలా ఈ లక్ష్మీ-నారాయణులు కూడా చదువు ద్వారానే తయారయ్యారు. బ్యారిస్టరీ, డాక్టరీ మొదలైనవాటన్నింటివీ పుస్తకాలు ఉంటాయి కదా. అలాగే వీరి పుస్తకము గీత. అది కూడా ఎవరు వినిపించారు? రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? ఇది ఎవ్వరికీ తెలియదు. అందులో పేరు మార్చేసారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు, వారే వచ్చి మిమ్మల్ని కృష్ణపురికి యజమానులుగా తయారుచేస్తారు. శ్రీకృష్ణుడు స్వర్గానికి యజమాని కదా, కానీ స్వర్గము గురించి కూడా తెలియదు. లేకుంటే శ్రీకృష్ణుడు ద్వాపరములో గీతను వినిపించారు అని ఎందుకు అంటారు. శ్రీకృష్ణుడిని ద్వాపరములోకి తీసుకువెళ్ళారు, లక్ష్మీ-నారాయణులను సత్యయుగములోకి, రాముడిని త్రేతాలోకి తీసుకువెళ్ళారు. ఉపద్రవాలను లక్ష్మీ-నారాయణుల రాజ్యములో చూపించరు. శ్రీకృష్ణుని రాజ్యములో కంసుడిని, రాముని రాజ్యములో రావణుడు మొదలైనవారిని చూపించారు. రాధ-కృష్ణులే లక్ష్మీ-నారాయణులుగా అవుతారని ఎవ్వరికీ తెలియదు. పూర్తిగా అజ్ఞాన అంధకారములో ఉన్నారు. అజ్ఞానాన్ని అంధకారము అని అంటారు. జ్ఞానాన్ని ప్రకాశము అని అంటారు. ఇప్పుడు ఆ ప్రకాశాన్ని తీసుకువచ్చేవారు ఎవరు? తండ్రి. జ్ఞానాన్ని పగలు అని, భక్తిని రాత్రి అని అంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు - ఈ భక్తి మార్గము కూడా జన్మజన్మాంతరాలుగా కొనసాగుతూ వచ్చింది. మెట్లు దిగుతూ వచ్చారు. కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఇల్లు కొత్తగా తయారైన తర్వాత ఇక రోజురోజుకు ఆయువు తగ్గిపోతూ ఉంటుంది. మూడు వంతులు పాతబడ్డాక ఇక దానిని పాతది అనే అంటారు. పిల్లలకు మొట్టమొదట ఏ నిశ్చయము ఉండాలంటే - వీరు సర్వులకు తండ్రి, వీరే సర్వులకు సద్గతిని కలిగిస్తారు, సర్వుల కొరకు చదువును కూడా చదివిస్తారు. సర్వులను ముక్తిధామానికి తీసుకువెళ్తారు. మీ వద్ద లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది. మీరు ఈ చదువును చదువుకుని వెళ్ళి మీ సింహాసనముపై కూర్చుంటారు. మిగిలిన వారందరినీ ముక్తిధామానికి తీసుకువెళ్తాను. చక్రముపై అర్థం చేయించేటప్పుడు అందులో చూపిస్తారు - సత్యయుగములో ఈ అనేక ధర్మాలు లేవు అని. ఆ సమయములో ఆ ఆత్మలు నిరాకారీ ప్రపంచములో ఉంటాయి. ఈ ఆకాశము పోలార్ అనైతే మీకు తెలుసు. వాయువును వాయువు అని అంటారు, ఆకాశమును ఆకాశము అని అంటారు. అందరూ పరమాత్మయే అని కాదు. వాయువులో కూడా భగవంతుడు ఉన్నారు, ఆకాశములో కూడా భగవంతుడు ఉన్నారు అని మనుష్యులు భావిస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చుని అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. తండ్రి వద్ద జన్మనైతే తీసుకున్నారు, మరి చదివించేది ఎవరు? తండ్రియే ఆత్మిక టీచరుగా అయి చదివిస్తారు. అచ్ఛా, ఒకవేళ చదువుకుని పూర్తి చేస్తే వారితోపాటు తీసుకువెళ్తారు, ఆ తర్వాత మీరు పాత్రను అభినయించడానికి వస్తారు. సత్యయుగములోకి మొట్టమొదట మీరే వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అన్ని జన్మల అంతిమములోకి వచ్చి చేరుకున్నారు, మళ్ళీ మొదటిలోకి వస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, ఇక పరుగు పెట్టండి. మంచి రీతిలో తండ్రిని స్మృతి చేయండి, ఇతరులను కూడా చదివించాలి. లేకపోతే ఇంతమందిని ఎవరు చదివించాలి? తండ్రికి తప్పకుండా సహాయకులుగా అవుతారు కదా. ఈశ్వరీయ సేవాధారులు అన్న పేరు కూడా ఉంది కదా. ఇంగ్లీషులో సాల్వేషన్ ఆర్మీ (ముక్తి దళము) అని అంటారు. ఏ సాల్వేషన్ (పరిష్కారము) కావాలి? అందరూ శాంతి యొక్క పరిష్కారము కావాలి అని అంటారు. కానీ వారెవ్వరూ శాంతి యొక్క పరిష్కారాన్ని ఇవ్వలేరు. ఎవరైతే శాంతి యొక్క పరిష్కారాన్ని కోరుకుంటారో, వారికి చెప్పండి - తండ్రి అడుగుతున్నారు, ఇప్పుడు ఇక్కడే మీకు శాంతి కావాలా? ఇది శాంతిధామమేమీ కాదు. శాంతి అయితే శాంతిధామములోనే ఉండగలదు, దానిని మూలవతనము అని అంటారు. ఆత్మకు శరీరము లేకపోతే శాంతిలో ఉంటుంది. తండ్రియే వచ్చి ఈ వారసత్వాన్ని ఇస్తారు. మీలో కూడా అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి. ప్రదర్శనీలో ఒకవేళ మనం నిలబడి అందరూ చెప్పేది వింటే ఎంతోమందివి పొరపాట్లు బయట పడతాయి ఎందుకంటే అర్థం చేయించేవారు నంబరువారుగా ఉన్నారు కదా. అందరూ ఒకే విధంగా ఉంటే మరి - ఫలానావారు వచ్చి భాషణ ఇస్తే బాగుంటుంది అని బ్రాహ్మణి ఎందుకు వ్రాస్తుంది. అరే, మీరు కూడా బ్రాహ్మణులే కదా. బాబా, ఫలానావారు మా కన్నా తెలివైనవారు. తెలివితేటల ద్వారానే మనుష్యులు పదవులు పొందుతారు కదా. నంబరువారుగా అయితే ఉన్నారు కదా. పరీక్షల ఫలితాలు వెలువడినప్పుడు మీ అంతట మీకే సాక్షాత్కారమవుతుంది, అప్పుడిక - నేను శ్రీమతముపై నడవలేదే అని అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు, ఏ వికర్మలూ చేయకండి. దేహధారులపై మోహము పెట్టుకోకండి. ఇది పంచ తత్వాలతో తయారైన శరీరము కదా. పంచ తత్వాలను పూజించవలసిన లేక స్మృతి చేయవలసిన అవసరము లేదు. ఈ కళ్ళ ద్వారా చూసినా కానీ తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఆత్మకు ఇప్పుడు జ్ఞానము లభించింది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ వైకుంఠములోకి వస్తాము. ఆత్మను అర్థం చేసుకోగలరే కానీ చూడలేరు, అలాగే ఇది కూడా అర్థం చేసుకోగలరు. దివ్యదృష్టి ద్వారా తమ ఇంటిని మరియు స్వర్గాన్ని చూడగలరు. తండ్రి అంటారు - పిల్లలూ, మన్మనాభవ మరియు మధ్యాజీభవ అనగా తండ్రిని మరియు విష్ణుపురిని స్మృతి చేయండి. ఇదే మీ లక్ష్యము-ఉద్దేశ్యము. మనము ఇప్పుడు స్వర్గములోకి వెళ్ళాలి, అలాగే మిగిలినవారందరూ ముక్తిధామములోకి వెళ్ళాలి అని పిల్లలకు తెలుసు. అందరూ అయితే సత్యయుగములోకి రాలేరు. మీది దేవతా ధర్మము. ఇది మనుష్యుల ధర్మము. మూలవతనములోనైతే మనుష్యులు ఉండరు కదా. ఇక్కడ ఉన్నది మనుష్య సృష్టి. మనుష్యులే తమోప్రధానులుగా, మళ్ళీ సతోప్రధానులుగా అవుతారు. మీరు ఇంతకుముందు శూద్ర వర్ణములో ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణ వర్ణములో ఉన్నారు. ఈ వర్ణాలు కేవలం భారతవాసులవే. ఏ ఇతర ధర్మాన్ని బ్రాహ్మణ వంశము, సూర్యవంశము అని అనరు. ఈ సమయములో అందరూ శూద్ర వర్ణానికి సంబంధించినవారు. అందరూ శిథిలావస్థకు చేరుకున్నారు. మీరు పురాతనముగా అయిన కారణముగా మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుని, తమోప్రధానముగా అయ్యింది, మళ్ళీ మొత్తం వృక్షమంతా అయితే సతోప్రధానముగా అవ్వదు కదా. సతోప్రధానమైన కొత్త వృక్షములో కేవలం దేవీ-దేవతా ధర్మము వారు మాత్రమే ఉంటారు, మళ్ళీ మీరు సూర్యవంశీయుల నుండి చంద్రవంశీయులుగా అవుతారు. పునర్జన్మలైతే తీసుకుంటారు కదా. ఆ తర్వాత వైశ్య వంశీయులుగా, శూద్ర వంశీయులుగా అవుతారు. ఈ విషయాలన్నీ కొత్తవి.

మనల్ని చదివించేది జ్ఞానసాగరుడు, వారే పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత. తండ్రి అంటారు, మీకు జ్ఞానాన్ని నేను ఇస్తాను. మీరు దేవీ-దేవతలుగా అయిపోతారు, ఇక ఆ తర్వాత ఈ జ్ఞానము ఉండదు. జ్ఞానమనేది అజ్ఞానులకు ఇవ్వడం జరుగుతుంది. మనుష్యులందరూ అజ్ఞానాంధకారములో ఉన్నారు, మీరు ప్రకాశములో ఉన్నారు. ఇతని 84 జన్మల కథ మీకు తెలుసు. పిల్లలైన మీకు జ్ఞానమంతా ఉంది. అసలు భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు రచించారు, దీని నుండి మోక్షము లభించదా అని మనుష్యులు అడుగుతారు! అరే, ఇది తయారై, తయారుచేయబడిన ఆట. అనాది డ్రామా కదా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొకటి తీసుకుంటుంది, ఇందులో చింతించవలసిన అవసరమేముంది? ఆత్మ వెళ్ళి ఇంకొక పాత్రను అభినయిస్తుంది. పోయిన వస్తువు దొరికే అవకాశముంటే ఏడవడములో అర్థముంది. తిరిగి రాని ఆత్మ కోసం ఏడవడం వలన ఉపయోగం ఏముంది. ఇప్పుడు మీరందరూ మోహజీతులుగా అవ్వాలి. స్మశానముపై మోహము ఏమి పెట్టుకోవాలి! ఇందులో అంతా దుఃఖమే దుఃఖము. ఈ రోజు బిడ్డ ఉన్నాడు, రేపు ఆ బిడ్డ కూడా ఎలా తయారవుతాడంటే తండ్రి పరువును తీయడానికి కూడా ఆలస్యము చేయడు. తండ్రితో కూడా కొట్లాడతాడు. దీనిని అనాథల ప్రపంచము అని అంటారు. వారికి శిక్షణ ఇవ్వడానికి నాథులెవ్వరూ లేరు. తండ్రి ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితిని చూస్తారో, అప్పుడు నాథుడికి చెందినవారిగా తయారుచేయడానికి వస్తారు. తండ్రియే వచ్చి అందరినీ నాథుడికి చెందినవారిగా తయారుచేస్తారు. నాథుడు వచ్చి అన్ని గొడవలనూ సమాప్తము చేస్తారు. సత్యయుగములో గొడవలు ఏమీ ఉండవు. మొత్తం ప్రపంచములోని గొడవలన్నింటినీ అంతం చేస్తారు, అప్పుడిక జయజయకారాలు జరుగుతాయి. ఇక్కడ మెజారిటీ మాతలది. దాసి అని కూడా మాతలనే భావిస్తారు. ముడి కట్టేటప్పుడు - నీకు పతియే ఈశ్వరుడు, గురువు, సర్వస్వము అని చెప్తారు. మొదట మిస్టర్, ఆ తర్వాత మిసెస్. ఇప్పుడు తండ్రి వచ్చి మాతలను ముందు ఉంచుతారు. మీపై ఎవ్వరూ విజయం పొందలేరు. మీకు తండ్రి అన్ని నియమాలను నేర్పిస్తున్నారు. మోహజీత్ రాజుది ఒక కథ ఉంది. అవన్నీ తయారుచేసిన కథలు. సత్యయుగములోనైతే అకాలమృత్యువు ఉండనే ఉండదు. సమయము వచ్చినప్పుడు ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. సాక్షాత్కారమవుతుంది - ఇప్పుడు ఇక ఈ శరీరము వృద్ధావస్థకు చేరుకుంది, మళ్ళీ కొత్తది తీసుకోవాలి, వెళ్ళి చిన్న పిల్లవాడిగా జన్మించాలి అని. సంతోషముగా శరీరాన్ని వదిలేస్తారు. కానీ ఇక్కడైతే ఎంత వృద్ధులుగా అయినా కానీ, రోగులుగా అయినా కానీ, ఇక శరీరాన్ని వదిలేయడమే మంచిది అని భావిస్తారు కూడా, అయినా కానీ చనిపోయే సమయములో తప్పకుండా ఏడుస్తారు. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు ఎటువంటి చోటుకు వెళ్తారంటే, అక్కడ ఏడవడము అన్న మాటే ఉండదు. అక్కడైతే సంతోషమే సంతోషము ఉంటుంది. మీకు ఎంత అపారమైన, అనంతమైన సంతోషము ఉండాలి. అరే, మనము విశ్వానికి యజమానులుగా అవుతాము. భారత్ మొత్తం విశ్వానికి అధిపతిగా ఉండేది. ఇప్పుడు ముక్కలు, ముక్కలుగా అయిపోయింది. మీరే పూజ్యులైన దేవతలుగా ఉండేవారు, మళ్ళీ పూజారులుగా అవుతారు. భగవంతుడేమీ తానే పూజ్యుడిగా, తానే పూజారిగా అవ్వరు. ఒకవేళ తాను కూడా పూజారిగా అయిపోతే మరి పూజ్యులుగా ఎవరు తయారుచేస్తారు? డ్రామాలో తండ్రి పాత్రయే వేరు. జ్ఞానసాగరుడు ఒక్కరే, ఆ ఒక్కరికే మహిమ ఉంది. వారు జ్ఞానసాగరుడు కావున, సద్గతిని ఇచ్చేందుకు ఎప్పుడో అప్పుడు వచ్చి జ్ఞానాన్ని ఇవ్వాలి కదా. తప్పకుండా ఇక్కడకు రావలసి ఉంటుంది. ముందుగా బుద్ధిలో ఇది కూర్చోబెట్టండి - మమ్మల్ని చదివించేది ఎవరు?

త్రిమూర్తి, సృష్టి చక్రము మరియు కల్పవృక్షము - ఇవి ముఖ్యమైన చిత్రాలు. కల్ప వృక్షాన్ని చూస్తూనే, మేము ఫలానా ధర్మానికి చెందినవారము, మేము సత్యయుగములోకి రాలేము అని వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఈ చక్రము చాలా పెద్దగా ఉండాలి. అందులో వివరణ కూడా పూర్తిగా ఉండాలి. శివబాబా, బ్రహ్మా ద్వారా దేవతా ధర్మాన్ని అనగా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు, శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశనాన్ని, మళ్ళీ విష్ణువు ద్వారా కొత్త ప్రపంచము యొక్క పాలనను చేయిస్తారు, ఇది నిరూపణ అవ్వాలి. బ్రహ్మాయే విష్ణువు, విష్ణువే బ్రహ్మా, ఇద్దరికీ సంబంధము ఉంది కదా. బ్రహ్మా-సరస్వతులే మళ్ళీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఎక్కే కళకు ఒక జన్మలో పడుతుంది, మళ్ళీ దిగే కళకు 84 జన్మలు పడుతుంది. ఇప్పుడు తండ్రి అంటారు, ఆ శాస్త్రాలు మొదలైనవి రైటా లేక నేను రైటా? సత్యమైన సత్యనారాయణుని కథనైతే నేను వినిపిస్తాను. సత్యమైన తండ్రి ద్వారా మేము నరుని నుండి నారాయణునిగా తయారవుతున్నాము అని ఇప్పుడు మీకు నిశ్చయము ఉంది. ముందుగా ఇంకొక ముఖ్యమైన విషయము ఏమిటంటే, మనుష్యులను ఎప్పుడూ తండ్రి, టీచర్ మరియు గురువు అని అనరు. గురువును ఎప్పుడైనా తండ్రి లేక టీచర్ అని అంటారా? ఇక్కడైతే శివబాబా వద్ద జన్మ తీసుకుంటారు, ఆ తర్వాత శివబాబా మిమ్మల్ని చదివిస్తారు, అలాగే మిమ్మల్ని తమతోపాటు తీసుకువెళ్తారు కూడా. తండ్రి, టీచరు మరియు గురువు అని పిలవబడే మనుష్యులు ఎవ్వరూ ఉండరు. వీరు ఒక్కరే తండ్రి, వీరిని సుప్రీమ్ ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడూ సుప్రీమ్ ఫాదర్ అని అనరు. అందరూ మళ్ళీ వారినే స్మృతి చేస్తారు. వారు తప్పకుండా తండ్రే. దుఃఖములో అందరూ వారిని స్మృతి చేస్తారు, సుఖములో ఎవ్వరూ చేయరు. కావున ఆ తండ్రియే వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పంచ తత్వాలతో తయారుచేయబడిన ఈ శరీరాలను చూస్తూ కూడా స్మృతి తండ్రిని చేయాలి. ఏ దేహధారిపైనా మోహము పెట్టుకోకూడదు. ఏ వికర్మలు చేయకూడదు.

2. ఈ తయారై, తయారుచేయబడిన డ్రామాలో ప్రతి ఆత్మకు అనాది పాత్ర ఉంది, ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది, అందుకే శరీరము వదలడము విషయములో చింతించకూడదు, మోహజీతులుగా అవ్వాలి.

వరదానము:-
సంపూర్ణ ఆహుతి ద్వారా పరివర్తనా సమారోహాన్ని జరుపుకునే దృఢ సంకల్పధారీ భవ

ఏ విధంగా ‘‘ధరిత్రిని వదలవలసి వచ్చినా ధర్మాన్ని వదలవద్దు’’ అన్న నానుడి ఉందో, అలా ఎటువంటి పరిస్థితి వచ్చినా, మాయ యొక్క మహావీర రూపము ఎదురుగా వచ్చినా, ధారణలు వదలకూడదు. సంకల్పము ద్వారా త్యాగము చేసిన పనికిరాని వస్తువులను సంకల్పములో కూడా స్వీకరించవద్దు. సదా తమ శ్రేష్ఠ స్వమానము, శ్రేష్ఠ స్మృతి మరియు శ్రేష్ఠ జీవితము యొక్క సమర్థ స్వరూపము ద్వారా శ్రేష్ఠ పాత్రధారిగా అయి శ్రేష్ఠత అనే ఆటను ఆడుతూ ఉండండి. బలహీనతలతో కూడిన అన్ని ఆటలూ సమాప్తమైపోవాలి. ఎప్పుడైతే ఇటువంటి సంపూర్ణ ఆహుతి యొక్క సంకల్పము దృఢముగా ఉంటుందో అప్పుడు పరివర్తనా సమారోహము జరుగుతుంది. ఈ సమారోహపు తారీఖును ఇప్పుడు సంగఠిత రూపములో నిశ్చితము చేయండి.

స్లోగన్:-
రియల్ డైమండ్ గా అయి తమ వైబ్రేషన్ల ప్రకాశాన్ని విశ్వములో వ్యాపింపజేయండి.

అవ్యక్త సూచనలు - ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

సాధారణ సేవలు చేయడము ఏమంత పెద్ద విషయము కాదు, కానీ పాడైనదానిని బాగుచేయడము, అనేకతలో ఏకతను తీసుకురావడము, ఇది పెద్ద విషయము. బాప్ దాదా ఇదే చెప్తారు - మొదటగా ఒకే మతము, ఒకే బలము, ఒకే నమ్మకము మరియు ఏకత అనేవి తోటివారిలో, సేవలో, వాయుమండలంలో ఉండాలి.