08-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఆత్మిక సేవ చేసి స్వయం మరియు ఇతరుల కళ్యాణము చేయండి, తండ్రి పట్ల సత్యమైన హృదయము కలిగి ఉండండి, అప్పుడు తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు’’

ప్రశ్న:-
దేహీ-అభిమానులుగా అయ్యే కృషిని ఎవరు చేయగలరు? దేహీ-అభిమానుల గుర్తులను వినిపించండి?

జవాబు:-
ఎవరికైతే చదువు పట్ల మరియు తండ్రి పట్ల ఎడతెగని ప్రేమ ఉంటుందో, వారే దేహీ-అభిమానులుగా అయ్యే కృషిని చేయగలరు. వారు శీతలముగా ఉంటారు, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు, వారికి తండ్రి పట్ల ప్రేమ ఉంటుంది, వారి నడవడిక చాలా రాయల్ గా ఉంటుంది. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు, మేము వారి సంతానము అని వారికి నషా ఉంటుంది. వారు సుఖమిచ్చేవారిగా ఉంటారు. ప్రతి అడుగు శ్రీమతము అనుసారముగానే వేస్తారు.

ఓంశాంతి
పిల్లలు సేవా సమాచారాన్ని కూడా వినాలి మరియు ముఖ్యమైన మహారథీ సేవాధారులు ఎవరైతే ఉన్నారో, వారు మంచి సలహాలను తీయాలి. మేళాలు లేక ప్రదర్శనీల ప్రారంభోత్సవము ఎవరితో చేయించాలి, ఏయే పాయింట్లు వినిపించాలి అని సేవాధారి పిల్లలకే విచార సాగర మంథనము నడుస్తుందని బాబాకు తెలుసు. శంకరాచార్యుడు మొదలైనవారు ఒకవేళ మీ ఈ విషయాలను అర్థం చేసుకున్నట్లయితే వారు అంటారు - ఇక్కడి జ్ఞానము చాలా ఉన్నతమైనది, వీరిని చదివించేవారు తప్పకుండా ఎవరో తెలివైనవారు అన్నట్లు అనిపిస్తుంది. భగవంతుడు చదివిస్తున్నారు అన్నదానిని వారు అంగీకరించరు. కావున ప్రదర్శినీ మొదలైనవాటి ప్రారంభోత్సవము చేయటానికి ఎవరెవరైతే వస్తారో, వారికి ఏమేమి అర్థం చేయిస్తారు అన్న సమాచారాన్ని అందరూ వినిపించాలి, లేదా టేప్ లో క్లుప్తముగా నింపాలి. ఉదాహరణకు గంగే శంకరాచార్యుడికి అర్థం చేయించారు, ఇటువంటి సేవాధారి పిల్లలైతే తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. ఆ మాటకొస్తే స్థూల సేవ కూడా ఉంది కానీ బాబా యొక్క అటెన్షన్ ఆత్మిక సేవ వైపుకు వెళ్తుంది, అది అనేకుల కళ్యాణము చేస్తుంది. కళ్యాణమైతే ప్రతీ విషయములోనూ ఉంది. బ్రహ్మా భోజనము తయారుచేయడములో కూడా కళ్యాణము ఉంది, కానీ ఒకవేళ యోగయుక్తముగా ఉంటూ తయారుచేసినట్లయితే. ఈ విధంగా యోగయుక్తముగా భోజనము తయారుచేసేవారు ఉన్నట్లయితే భండారాలో ఎంతో శాంతి ఉంటుంది. స్మృతి యాత్రలో ఉండాలి. ఎవరైనా వస్తే వారికి వెంటనే అర్థం చేయించాలి. సేవాధారీ పిల్లలు ఎవరు అనేది బాబా అర్థం చేసుకోగలరు. ఎవరైతే ఇతరులకు కూడా అర్థం చేయించగలరో వారినే ఎక్కువగా సేవ కోసం పిలవడం జరుగుతుంది. కావున సేవ చేసేవారే తండ్రి హృదయముపైకి ఎక్కి ఉంటారు. బాబా అటెన్షన్ అంతా సేవాధారీ పిల్లల వైపుకే వెళ్తుంది. కొందరైతే సమ్ముఖముగా మురళి వింటున్నా కూడా ఏమీ అర్థం చేసుకోలేరు, ధారణ జరగదు ఎందుకంటే అర్ధకల్పపు దేహాభిమానపు రోగము చాలా కఠినముగా ఉంది. దానిని తొలగించుకునేందుకు మంచి రీతిలో పురుషార్థము చేసేవారు చాలా తక్కువగా ఉన్నారు. చాలామంది దేహీ-అభిమానులుగా అయ్యే పురుషార్థాన్ని చేయలేకపోతారు. బాబా అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, దేహీ-అభిమానిగా అవ్వడము చాలా శ్రమతో కూడుకున్నది. కొందరు తమ చార్టును కూడా పంపిస్తారు కానీ అది పూర్తిగా ఉండదు. కానీ ఎంతైనా చార్టు వ్రాయడం వలన ఎంతో కొంత అటెన్షన్ ఉంటుంది. చాలామందికి దేహీ-అభిమానిగా అవ్వడము పట్ల తక్కువ అటెన్షన్ ఉంటుంది. దేహీ-అభిమానులు చాలా శీతలముగా ఉంటారు. వారు అంత ఎక్కువగా మాట్లాడరు. వారికి తండ్రిపై ప్రేమ ఎలా ఉంటుందంటే ఇక అడగకండి. ఎప్పుడూ ఏ మనిషికీ లేనంత సంతోషము ఆత్మకు ఉండాలి. ఈ లక్ష్మీ-నారాయణులకైతే జ్ఞానము లేదు. భగవంతుడు చదివిస్తున్న పిల్లలైన మీకే జ్ఞానము ఉంది. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నషా కూడా మీలో ఏ ఒకరిద్దరికో ఉంటుంది. ఆ నషా ఉన్నట్లయితే తండ్రి స్మృతిలో ఉంటారు, వారినే దేహీ-అభిమానులు అని అంటారు. కానీ ఆ నషా ఉండడము లేదు. స్మృతిలో ఉండేవారి నడవడిక చాలా చక్కగా, రాయల్ గా ఉంటుంది. మనము భగవంతుని సంతానము, అందుకే అతీంద్రియ సుఖము గురించి గోప-గోపికలను అడగండి అన్న గాయనము ఉంది, వారు దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి చేయని కారణముగానే శివబాబా హృదయాన్ని అధిరోహించరు. శివబాబా హృదయాన్ని అధిరోహించకపోతే, ఈ దాదా హృదయాన్ని కూడా అధిరోహించలేరు. వారి హృదయములో ఉన్నట్లయితే తప్పకుండా వీరి హృదయములో కూడా ఉంటారు. తండ్రికి ప్రతి ఒక్కరి గురించి తెలుసు. తాము ఎలాంటి సేవను చేస్తున్నారు అనేది పిల్లలు స్వయం కూడా అర్థం చేసుకోగలరు. సేవా అభిరుచి పిల్లల్లో చాలా ఉండాలి. కొందరికి సెంటర్ స్థాపన చేయాలనే అభిరుచి కూడా ఉంటుంది. కొందరికి చిత్రాలను తయారుచేసే అభిరుచి ఉంటుంది. నాకు జ్ఞాన స్వరూప ఆత్మలు ప్రియమనిపిస్తారు అని తండ్రి కూడా అంటారు, వారు తండ్రి స్మృతిలో కూడా ఉంటారు మరియు సేవ చేయడానికి కూడా ఉత్సాహము కలిగి ఉంటారు. కొందరైతే ఏమాత్రము సేవ చేయరు, తండ్రి చెప్పేది కూడా వినరు. ఎవరు ఎక్కడ సేవ చేయాలి అనేది తండ్రికి తెలుసు కదా! కానీ దేహాభిమానము కారణముగా తమ మన్మతముపై నడుస్తారు, కావున వారు హృదయాన్ని అధిరోహించలేరు. అజ్ఞాన కాలములో కూడా చెడు ప్రవర్తన కలిగిన పిల్లలు తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు. వారిని కుపుత్రులుగా భావిస్తారు. సాంగత్య దోషముతో పాడైపోతారు. ఇక్కడ కూడా సేవ చేసేవారు ఎవరైతే ఉంటారో, వారే తండ్రికి ప్రియమనిపిస్తారు. ఎవరైతే సేవ చేయరో వారిని తండ్రి ప్రేమించరు. పిల్లలు వారి భాగ్యానుసారముగానే చదువుతారని తండ్రికి తెలుసు, అయినా కానీ ప్రేమ ఎవరిపై ఉంటుంది? ఇది నియమము కదా. మంచి పిల్లలను చాలా ప్రేమగా పిలుస్తారు. నీవు చాలా సుఖాన్ని ఇచ్చేవాడివి, నీవు పితా స్నేహీవి అని అంటారు. ఎవరైతే తండ్రిని స్మృతే చేయరో వారిని పితా స్నేహీ అని అనరు కదా. దాదా స్నేహీగా అవ్వకూడదు, తండ్రికి స్నేహీగా అవ్వాలి. ఎవరైతే తండ్రికి స్నేహీగా ఉంటారో, వారి మాట మరియు నడవడిక చాలా మధురముగా, సుందరముగా ఉంటాయి. ఇంకా సమయము ఉంది కదా అని వివేకము చెప్తుంది కానీ శరీరముపై నమ్మకమేముంది? కూర్చుని, కూర్చుని ఉండగానే ప్రమాదాలు జరిగిపోతాయి. కొందరు హార్ట్ ఫెయిల్ అవుతారు, కొందరు అనారోగ్యముపాలు అవుతారు, అకస్మాత్తుగా మరణిస్తారు కదా, అందుకే శ్వాసపై ఏమాత్రము నమ్మకము లేదు. ప్రకృతి వైపరీత్యాలది కూడా ఇప్పుడు ప్రాక్టీస్ జరుగుతుంది. సమయము కానీ సమయములో వర్షాలు పడినా అవి నష్టమే కలిగిస్తాయి. ఈ ప్రపంచమే దుఃఖాన్ని ఇచ్చే ప్రపంచము. ఎప్పుడైతే మహా దుఃఖము ఉంటుందో తండ్రి కూడా ఆ సమయములోనే వస్తారు. రక్తపు నదులు కూడా ప్రవహించనున్నాయి. ఈ లోపు మనము మన పురుషార్థము చేసి 21 జన్మల కొరకు కళ్యాణము చేసుకోవాలి అనే ప్రయత్నము చేయాలి. చాలామందిలో తమ కళ్యాణము చేసుకోవాలన్న చింత కూడా కనిపించదు.

బాబా ఇక్కడ కూర్చుని మురళి వినిపించినా కానీ తమ బుద్ధి సేవాధారీ పిల్లల వైపే ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్యుడిని ప్రదర్శనీకి పిలవడం జరిగింది, లేదంటే మామూలుగా వీరు ఇలా ఎక్కడికీ వెళ్ళరు. చాలా అహంకారముతో ఉంటారు, కావున వారికి గౌరవము కూడా ఇవ్వవలసి ఉంటుంది. పైన సింహాసనముపై కూర్చోబెట్టవలసి ఉంటుంది. వారు అందరితో కలిసి కూర్చోలేరు. వారికి గౌరవము ఎంతో కావాలి. వారు నిర్మానులైనట్లయితే (అహంకారము లేనివారైతే), వారి వెండి సింహాసనము మొదలైనవాటిని కూడా మరి వదలేయాలి. బాబా చూడండి, ఎంత సాధారణముగా ఉంటారు. వీరి గురించి ఎవరికీ తెలియదు. పిల్లలైన మీలో కూడా ఏ ఒక్కరికో మాత్రమే తెలుసు. తండ్రి ఎంత నిరహంకారి. ఇది తండ్రి మరియు పిల్లల సంబంధము కదా. లౌకిక తండ్రి ఏ విధముగా పిల్లలతో పాటు ఉంటారో, తింటూ-తినిపిస్తూ ఉంటారో, అలా వీరు అనంతమైన తండ్రి. సన్యాసులు మొదలైనవారికి తండ్రి ప్రేమ లభించదు. కల్ప-కల్పము మనకు అనంతమైన తండ్రి ప్రేమ లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి పుష్పాలుగా తయారుచేయడానికి చాలా శ్రమిస్తారు. కానీ డ్రామానుసారముగా అందరూ పుష్పాలుగా తయారవ్వరు. ఈ రోజు చాలా బాగా ఉంటారు, రేపు వికారులుగా అయిపోతారు. తండ్రి అంటారు, వారి భాగ్యములో లేకపోతే మరి ఏం చేస్తారు. చాలామంది నడవడిక చాలా అశుద్ధముగా ఉంటుంది. ఆజ్ఞను ఉల్లంఘిస్తారు. ఈశ్వరుని డైరెక్షన్లపై కూడా నడవకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుంది! ఉన్నతోన్నతమైనవారు తండ్రి, వారికన్నా ఉన్నతమైనవారు ఇంకెవరూ లేరు. దేవతల చిత్రాలలో చూసినట్లయితే, ఈ లక్ష్మీ-నారాయణులే ఉన్నతోన్నతమైనవారు. కానీ వీరిని ఈ విధంగా ఎవరు తయారుచేసారు అనేది కూడా మనుష్యులకు తెలియదు. తండ్రి కూర్చుని పిల్లలైన మీకు రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని బాగా అర్థం చేయిస్తారు. మీకైతే మీ శాంతిధామము మరియు సుఖధామమే గుర్తుకొస్తూ ఉంటాయి. సేవ చేసేవారి పేర్లు గుర్తుకొస్తూ ఉంటాయి. తప్పకుండా ఎవరైతే తండ్రికి ఆజ్ఞాకారీ పిల్లలో వారి వైపుకే మనసు వెళ్తూ ఉంటుంది. అనంతమైన తండ్రి ఒకేసారి వస్తారు. ఆ లౌకిక తండ్రి అయితే జన్మ-జన్మాంతరాలూ లభిస్తారు. వారు సత్యయుగములో కూడా లభిస్తారు. కానీ అక్కడ ఈ తండ్రి లభించరు. ఇప్పటి చదువు ద్వారానే మీరు పదవిని పొందుతారు. తండ్రి ద్వారా మనము కొత్త ప్రపంచము కొరకు చదువుకుంటున్నామని కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇది బుద్ధిలో గుర్తుండాలి. వాస్తవానికి ఇది చాలా సహజమైనది. ఉదాహరణకు బాబా పిల్లలతో ఆడుతున్నప్పుడు ఉన్నట్లుండి అక్కడకు ఎవరైనా వస్తే, బాబా అక్కడికక్కడే వెంటనే వారికి జ్ఞానము ఇవ్వడం మొదలుపెడతారు. అనంతమైన తండ్రి ఎవరో మీకు తెలుసా? పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారుచేయడానికి తండ్రి వచ్చారు. వారు రాజయోగాన్ని నేర్పిస్తారు. భారతవాసులకే నేర్పించవలసి ఉంటుంది. భారత్ యే ఒకప్పుడు స్వర్గముగా ఉండేది. అక్కడ ఈ దేవీ-దేవతల రాజ్యము ఉండేది. ఇప్పుడు ఉన్నది నరకము. నరకము నుండి మళ్ళీ స్వర్గముగా తండ్రియే తయారుచేస్తారు. ఈ విధమైన ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకొని, ఎవరైనా వస్తే వారికి కూర్చుని అర్థం చేయించండి. అప్పుడు వారు ఎంత సంతోషిస్తారు. కేవలం - తండ్రి వచ్చారు అన్నది వారికి చెప్పండి. గీతలో వర్ణన చేయబడ్డ ఆ మహాభారత యుద్ధము ఇదే. గీతా భగవానుడు వచ్చారు, గీతను వినిపించారు. ఎందుకు? మనుష్యులను దేవతలుగా తయారుచేయడానికి. తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని తండ్రి కేవలం ఇదే చెప్తున్నారు. ఇది దుఃఖధామము. ఈ మాత్రము బుద్ధిలో గుర్తున్నా సరే సంతోషము ఉంటుంది. ఆత్మ అయిన మనము తండ్రితో శాంతిధామానికి వెళ్ళనున్నాము. మళ్ళీ అక్కడి నుండి పాత్రను అభినయించడానికి మొట్టమొదట సుఖధామములోకి వస్తాము. ఉదాహరణకు కాలేజీలో చదివేటప్పుడు, మేము ఇది చదువుతాము, తద్వారా ఈ విధంగా తయారవుతాము అని వారు భావిస్తారు. బ్యారిస్టరుగా అవుతాము లేక పోలీసు సూపరింటెండెంటుగా అవుతాము, ఇంత ధనాన్ని సంపాదిస్తాము అని భావిస్తారు. సంతోషము యొక్క పాదరసము ఎక్కి ఉంటుంది. పిల్లలైన మీకు కూడా ఈ సంతోషము ఉండాలి. మనము అనంతమైన తండ్రి నుండి ఈ వారసత్వాన్ని పొందుతాము, తర్వాత మనము స్వర్గములో మన మహళ్ళను తయారుచేసుకుంటాము. మొత్తము రోజంతా బుద్ధిలో ఈ చింతన ఉన్నట్లయితే సంతోషము కూడా ఉంటుంది. తమ కళ్యాణము మరియు ఇతరుల కల్యాణము కూడా చేయాలి. ఏ పిల్లల వద్దనైతే జ్ఞాన ధనము ఉంటుందో, వారి బాధ్యత దానము చేయడము. ఒకవేళ ధనముండి కూడా దానం చేయకపోతే వారిని పిసినారులు అని అంటారు. వారి వద్ద ధనము ఉన్నా కూడా లేనట్లే. ధనము ఉన్నట్లయితే దానము తప్పకుండా చేయాలి. మంచి-మంచి మహారథులైన పిల్లలెవరైతే ఉన్నారో వారు సదా బాబా హృదయాన్ని అధిరోహించి ఉంటారు. కొందరి విషయములో - వీరు బహుశా ఇక దూరమైపోతారేమో అనే ఆలోచన కలుగుతుంది. పరిస్థితులు అలా ఉంటాయి. దేహ అహంకారము చాలా ఎక్కి ఉంది. ఏదో ఒక సమయములో చేయి వదిలేసి, వెళ్ళి తమ ఇంట్లో కూర్చుంటారు. మురళిని చాలా బాగా వినిపిస్తారు కానీ దేహాభిమానము చాలా ఎక్కువ ఉంది, వారిని బాబా కొద్దిగా అప్రమత్తము చేసినా, వెంటనే వదిలి వెళ్ళిపోతారు. నిజానికి గాయనమేముంది అంటే - నీవు ప్రేమించినా లేక తిరస్కరించినా నేను మాత్రము నిన్ను వదలను... కానీ ఇక్కడ బాబా సరైనా విషయాన్ని వినిపించినా కోపం వచ్చేస్తుంది. లోలోపల ధన్యవాదాలు చెప్పుకునే పిల్లలు కూడా కొందరు ఉన్నారు, అలాగే కొందరు లోలోపల మండిపోతూ ఉంటారు. మాయ యొక్క దేహాభిమానము చాలా ఉంది. అసలు మురళిని ఏమాత్రమూ వినని పిల్లలు కూడా కొందరు ఉన్నారు, మరి కొందరైతే మురళి వినకుండా ఉండలేరు. మురళి చదవటం లేదు అంటే, నాలో చాలా జ్ఞానము ఉంది అని వారు మొండిగా భావిస్తున్నట్లు కానీ వాస్తవానికి వారిలో జ్ఞానమేమీ లేదు.

కావున శంకరాచార్యులు మొదలైనవారు ప్రదర్శనీకి వస్తే, సేవ బాగా జరిగితే, ఆ సమాచారము అందరికీ పంపించాలి, తద్వారా సేవ ఎలా జరిగింది అనేది అందరికీ తెలుస్తుంది, అప్పుడు వారు కూడా నేర్చుకుంటారు. ఈ విధంగా సేవ చేయాలని ఎవరికైతే ఆలోచన కలుగుతుందో వారినే బాబా సేవాధారీ పిల్లలుగా భావిస్తారు. సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు. ఇక్కడైతే అనేకుల కళ్యాణము చేయాలి కదా. అందరికీ ఈ జ్ఞానము లభించాలి, పిల్లల ఉన్నతి కూడా జరగాలి అని బాబాకైతే ఇదే చింత ఉంటుంది. ఈ ఆత్మిక సేవ ముఖ్యమైనది అని రోజూ మురళిలో అర్థం చేయిస్తూ ఉంటారు. వినాలి మరియు వినిపించాలి. అభిరుచి ఉండాలి. బ్యాడ్జీ తీసుకుని రోజూ మందిరాలకు వెళ్ళి అర్థం చేయించండి - ఈ లక్ష్మీ-నారాయణులు ఈ విధంగా ఎలా తయారయ్యారు, తర్వాత ఎక్కడికి వెళ్ళారు, మళ్ళీ రాజ్య భాగ్యాన్ని ఎలా పొందారు. మందిరాల ద్వారము వద్దకు వెళ్ళి కూర్చోండి. ఎవరైనా వస్తే - ఈ లక్ష్మీ-నారాయణులు ఎవరు, వీరి రాజ్యము భారత్ లో ఎప్పుడు ఉండేది అనేది వాళ్ళకు చెప్పండి. హనుమంతుడు కూడా చెప్పుల వద్దకు వెళ్ళి కూర్చునేవారు కదా. దాని వెనుక కూడా రహస్యము ఉంది కదా. దయ కలుగుతుంది. సేవా యుక్తులను బాబా ఎన్నో తెలియజేస్తూ ఉంటారు, కానీ ఏ ఒక్కరో చాలా కష్టము మీద వాటిని అమలులోకి తీసుకొస్తారు. సేవ చాలా ఉంది. అంధులకు చేతికర్రగా అవ్వాలి. ఎవరైతే సేవ చేయరో, ఎవరికైతే బుద్ధి స్వచ్ఛముగా లేదో, వారికి ధారణ కూడా జరగదు. లేదంటే వాస్తవానికి సేవ చాలా సహజము. మీరు ఈ జ్ఞాన రత్నాలను దానం చేస్తారు. ఎవరైనా షావుకారులు వచ్చినట్లయితే వారికి ఇలా చెప్పండి - మీకు మేము ఈ కానుకను ఇస్తున్నాము. దీని అర్థాన్ని కూడా మీకు అర్థం చేయిస్తాము. ఈ బ్యాడ్జీల పట్ల బాబాకు ఎంతో గౌరవము ఉంది. ఇంకెవరికీ వీటిపై అంత గౌరవము లేదు. ఇందులో చాలా బాగా జ్ఞానము నిండి ఉంది. కానీ ఎవరి భాగ్యములోనైనా లేకపోతే బాబా కూడా ఏమి చేయగలరు. తండ్రిని మరియు చదువును వదిలివేయడము, ఇది చాలా పెద్ద ఆత్మహత్య. తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ తండ్రిని వదిలి వెళ్ళిపోవడమంటే అంతటి మహాపాపము ఇంకేదీ ఉండదు. అటువంటి దురదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. పిల్లలు శ్రీమతముపై నడవాలి కదా. మేము విశ్వానికి యజమానులుగా తయారవ్వనున్నామని మీకు బుద్ధిలో ఉంది, ఇదేమైనా తక్కువ విషయమా. స్మృతి చేస్తుంటే సంతోషము కూడా ఉంటుంది. స్మృతిలో ఉండని కారణముగా పాపాలు భస్మమవ్వవు. దత్తత అయినట్లయితే సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కాలి. కానీ మాయ చాలా విఘ్నాలను వేస్తూ ఉంటుంది. కచ్చాగా (అపరిపక్వముగా) ఉన్నవారిని పడేస్తూ ఉంటుంది. ఎవరైతే తండ్రి శ్రీమతాన్ని పాటించనే పాటించరో, వారు ఏ పదవిని పొందుతారు. తండ్రి మతాన్ని కొద్దిగా మాత్రమే పాటిస్తే పదవి కూడా తేలికపాటిది పొందుతారు. తండ్రి మతాన్ని బాగా పాటించినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. ఈ అనంతమైన రాజధాని స్థాపన అవుతోంది. ఇందులో ఖర్చు మొదలైనవాటి విషయము కూడా ఏమీ లేదు. కుమారీలు వస్తారు, వారు నేర్చుకుని అనేకమందిని తమ సమానముగా తయారుచేస్తారు, ఇందులో ఫీజులు మొదలైనవాటి విషయమేమీ లేదు. తండ్రి అంటారు, మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తాను. నేను స్వర్గములోకి కూడా రాను. శివబాబా అయితే దాత కదా. మరి వారికి ఫీజు ఏమిస్తారు. ఇతను తన సర్వస్వాన్ని వారికి ఇచ్చారు, వారిని తన వారసునిగా చేసుకున్నారు. దానికి బదులుగా రాజ్యము లభిస్తుంది కదా. వీరు మొట్టమొదటి ఉదాహరణ. మొత్తము విశ్వముపై స్వర్గ స్థాపన జరుగుతుంది. కానీ పైసా ఖర్చు కూడా లేదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పితా స్నేహీలుగా అయ్యేందుకు చాలా-చాలా సుఖాన్ని ఇచ్చేవారిగా అవ్వాలి. తమ మాట, నడవడికను చాలా మధురముగా, రాయల్ గా ఉంచుకోవాలి. సేవాధారులుగా అవ్వాలి. నిరహంకారిగా అయి సేవ చేయాలి.

2. చదువును మరియు తండ్రిని వదిలి ఆత్మహత్య చేసుకునే మహాపాపులుగా ఎప్పుడూ అవ్వకూడదు. ముఖ్యమైనది ఆత్మిక సేవ, ఈ సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు. జ్ఞాన రత్నాలను దానము చేయాలి, పిసినారులుగా అవ్వకూడదు.

వరదానము:-
సదా నిజ ధామము మరియు నిజ స్వరూపము యొక్క స్మృతి ద్వారా ఉపరామముగా, అతీతముగా, ప్రియముగా కండి

నిరాకారీ ప్రపంచము మరియు నిరాకారీ రూపము యొక్క స్మృతియే సదా అతీతముగా మరియు ప్రియముగా చేస్తుంది. మనము నిరాకారీ ప్రపంచ నివాసులము, ఇక్కడ సేవార్థము అవతరించాము. మనము ఈ మృత్యులోకానికి చెందినవారము కాదు, మనము అవతారులము - కేవలం ఈ చిన్న విషయము గుర్తున్నా సరే ఉపరామముగా అవుతారు. ఎవరైతే స్వయాన్ని అవతారముగా భావించకుండా గృహస్థీగా భావిస్తారో, మరి గృహస్థుల వాహనము బురదలో చిక్కుకుని ఉంటుంది, గృహస్థీ అంటేనే భారము కల స్థితి మరియు అవతారము అంటే పూర్తిగా తేలికగా ఉంటారు. అవతారముగా భావించడము ద్వారా తమ నిజ ధామము, నిజ స్వరూపము గుర్తుంటుంది మరియు ఉపరామముగా అవుతారు.

స్లోగన్:-
బ్రాహ్మణులు ఎవరంటే, ఎవరైతే శుద్ధితో మరియు విధిపూర్వకముగా ప్రతి కార్యాన్ని చేస్తారో వారు.

అవ్యక్త సూచనలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

ఎవరైతే నిర్మానులుగా ఉంటారో వారే నవ-నిర్మాణమును చెయ్యగలుగుతారు. శుభ భావన మరియు శుభ కామనలకు బీజమే నిమిత్త భావము మరియు నిర్మాన భావము. హద్దుకు చెందిన గౌరవము కాదు, కానీ నిర్మానముగా ఉండాలి. ఇప్పుడు మీ జీవితములో సత్యత మరియు సభ్యత యొక్క సంస్కారాలను ధారణ చెయ్యండి. ఒకవేళ వద్దనుకుంటున్నా సరే కోపము లేక చికాకు వచ్చినట్లయితే మనస్ఫూర్తిగా ‘‘మీఠా బాబా (మధురమైన బాబా)’’ అని అనండి, అప్పుడు ఎక్స్ ట్రా సహాయము లభిస్తుంది.