08-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 18.01.2009


‘‘40 సంవత్సరాల అవ్యక్త పాలనకు రిటర్న్ - 4 విషయాలు - శుభ చింతకులుగా అవ్వండి, శుభ చింతన చేయండి, శుభ వృత్తి ద్వారా శుభ వాయుమండలాన్ని తయారుచేయండి మరియు (0) జీరో మరియు హీరోల స్మృతిలో ఉండండి’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ సేవా సహచరులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఆది సమయములోని సేవా సహచరులు మరియు వారితో పాటు ఇతరులు కూడా సేవా సహచరులుగా అయి చాలా బాగా సేవా వృద్ధిని చేస్తున్నారు, కావున బాప్ దాదా తమ సహచరులను చూసి సంతోషిస్తున్నారు మరియు హృదయములో - వాహ్ నా విశ్వ పరివర్తక సేవా సహచరులారా వాహ్! అన్న పాటను పాడుతున్నారు.

ఈ రోజు అమృతవేళ నుండి నలువైపులా స్నేహ మాలలను బాప్ దాదాకు వేస్తున్నారు. మూడు రకాల మాలలు ఉన్నాయి. ఒకటి, బాబా సమానముగా అవ్వాలనే ఉల్లాస-ఉత్సాహాల మాల, రెండవది, తప్పిపోయిన, చాలా బంధనములో ఉన్న గోపికల మాల, వారి మాలలైతే ఎలాగూ ఉన్నాయి, కానీ వాటితో పాటు మెరుస్తూ ఉన్న అతి అమూల్యమైన అశ్రువులు మాల కూడా ఉంది. ఒక్కొక్క అశ్రువు ముత్యము వలె మెరుస్తూ ఉంది మరియు మూడవ మాల కొంతమంది పిల్లల ఫిర్యాదుల మాల.

ఈ రోజు అమృతవేళ నుండి మొదలుకుని అందరిలోనూ విశేష స్నేహము ఇమిడి ఉండటము కనిపిస్తూ ఉంది. బాప్ దాదా విరాట రూపము వలె బాహువులను చాచి పిల్లలందరినీ తమ బాహువులలో ఇముడ్చుకున్నారు. ఆ మాటకొస్తే ఈ రోజు స్నేహముతో పాటుగా అన్ని శక్తులను వీలునామాగా ఇచ్చిన రోజు కూడా. ఒక బిడ్డకు చేతిలో చెయ్యి వేసి ఇచ్చారు, వారితో పాటు పిల్లలందరికీ (శక్తిసేనకు మరియు పాండవులకు) విల్ పవర్స్ యొక్క వీలునామాను ఇచ్చారు. బాప్ దాదా చూసారు, కొంతమంది పిల్లలు, పాండవులు కూడా మరియు శక్తులు కూడా, గుప్త రూపములో అంతర్ముఖులుగా అయ్యి పురుషార్థములో తీవ్రగతితో వెళ్తూ ఉన్నారు. పైకి కనిపించకపోయినా కానీ మంచి పురుషార్థులుగా ఉన్నారు. బాప్ దాదా ఈ రోజు పిల్లలందరి విశేష రూపాన్ని చూసారు. స్నేహమనే సబ్జెక్టు అందరి ముఖాలను ప్రకాశింపజేస్తూ ఉంది. జ్ఞాన స్వరూప ఆత్మలైన పిల్లలుగానైతే ఉన్నారు కానీ స్నేహమనే సబ్జెక్టు అవసరము ఎందుకంటే స్నేహీ పిల్లలు శ్రమ యొక్క అనుభవములో తక్కువగా ఉంటారు మరియు ప్రేమ యొక్క అనుభవములో సహజముగా ఉంటారు. స్నేహ శక్తి పర్వతములాంటి ఎటువంటి సమస్యనైనా సరే, అది పర్వతాన్ని కూడా దూదిలా చేసేస్తుంది. పర్వతాన్ని కూడా నీరులా తేలికగా చేసేస్తుంది. స్నేహము ఒక ఛత్రఛాయ వంటిది. ఛత్రఛాయ కారణముగా వారు సదా సురక్షితముగా ఉంటారు. సహజమవుతుంది. స్నేహము ద్వారా పరమాత్మను లేక భగవంతుడిని కూడా తమ స్నేహితునిగా చేసుకుంటారు. ఖుదా దోస్త్ అన్న స్మృతిచిహ్నము ఉంది. భగవంతుడిని స్నేహితునిగా చేసుకుని ఎటువంటి సమస్యనైనా ఆ స్నేహ సంబంధము ద్వారా సహజము చేసేస్తారు. తండ్రిని తమ సహచరునిగా చేసుకుంటారు. జ్ఞానము బీజము, కానీ ప్రేమ అనే నీరు బీజానికి ప్రాప్తి అనే ఫలాలను జోడిస్తుంది. కావున తండ్రికి స్నేహీ అయిన అటువంటి పిల్లలు తండ్రిని స్మృతి చెయ్యటాన్ని కష్టముగా భావించరు, కానీ మర్చిపోవటాన్ని కష్టముగా భావిస్తారు. స్నేహీ ఆత్మలు ఎప్పుడూ స్నేహాన్ని మర్చిపోలేరు. హృదయపూర్వక స్నేహముతో ‘నా బాబా’ అని అనగానే మిగిలిన అన్ని ఖజానాల తాళంచెవి లభించేస్తుంది. కావున బాప్ దాదా ఇరువురూ అటువంటి స్నేహీల ముందు హజూర్ హాజరు అయిపోతారు. స్మృతి అయితే అందరూ చేస్తారు, కానీ కొందరు కష్టముగా స్మృతి చేస్తారు మరియు కొందరు సదా స్నేహ సాగరునిలో లవలీనులుగా ఉంటారు. ప్రపంచములోని వారు, ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అని అంటారు, కానీ ఆత్మ పరమాత్ముని ప్రేమలో లీనమైపోతుంది. ఆత్మ లీనమవ్వదు కానీ లవలీనమవుతుంది.

మరి ఈ రోజు ప్రేమలో లవలీనమయ్యే రోజు. కష్టము సమాప్తమై ప్రేమ రూపములోకి మారిపోతుంది. బాప్ దాదా పిల్లలందరి రిజల్టును కూడా చూసారు, మెజారిటీ హోమ్ వర్కును చేసారు. బాబా సమానముగా అయ్యే లక్ష్యాన్ని పదే-పదే రివైజ్ కూడా చేసారు, రియలైజ్ కూడా అయ్యారు. 75 శాతము మంది పిల్లల రిజల్టు మంచిగా ఉంది. మరియు ఎటువంటి తుఫానులు వచ్చినా గాని బాబా సమానముగా అవ్వవలసిందే. ఇది ఉన్నదే కలియుగ సమాప్తి సమయము, కావున తుఫానులైతే వస్తాయి ఎందుకంటే ఇది పరివర్తన సమయము కదా, కానీ పిల్లలైన మీ కొరకు తుఫాను అంటే ఏమిటి! తుఫాను తుఫాను కాదు కానీ తోఫా (కానుక) ఎందుకంటే బాప్ దాదా యొక్క వరదానీ హస్తము పురుషార్థీ పిల్లలందరి శిరస్సుపై ఉంది. ఎవరైతే దృఢ సంకల్పము చేసారో అనగా దృఢత అనే తాళంచెవిని కార్యములో వినియోగించారో వారికి ఇప్పటి రిజల్టు ప్రమాణముగా సఫలత కూడా ప్రాప్తించింది కానీ సదాకాలము కొరకు తుఫానును కానుకగా చేసుకుని, సమస్యకు సమాధాన రూపమునిచ్చి ముందుకు వెళ్తూ ఉండండి. బాప్ దాదా ఇప్పటి రిజల్టుకు సంతోషిస్తున్నారు. ఏదైతే యోగ తపస్యను చేసారో అందులో - ‘తయారవ్వవలసిందే’ అన్న లక్ష్యాన్ని దృఢముగా పెట్టుకున్నారు.

40 సంవత్సరాల అవ్యక్త పాలన పూర్తయ్యింది. మరి 40 సంవత్సరాలు అన్న సంఖ్యలో మొదట ఏమొస్తుంది - బిందువు, జీరో. జీరో ఏమి గుర్తు తెప్పిస్తుందంటే - నేను హీరోను, సత్యమైన హీరోను, మహాన్ హీరోను మరియు హీరో పాత్రధారిగా అయ్యి ప్రతి కార్యాన్ని హీరో సమానముగా చేయాలి. కావున జీరో, హీరో - ఇవి సదా గుర్తు ఉండాలి. అలాగే 40లో 4 అనే సంఖ్య ఉంది కదా, కావున నాలుగు విషయాలను న్యాచురల్ గా జీవితములో చేయాలి, దృఢతాపూర్వకముగా చేయాలి. చేస్తారా? సిద్ధముగా ఉన్నారా? ఎటువంటి పేపరు వచ్చినా కానీ నాలుగు విషయాలను మీ జీవితములో చెయ్యవలసిందే. పక్కానా? పక్కానా? పక్కానా? వెనుక ఉన్నవారు, పక్కానే కదా! కచ్చాగా ఉన్నవారిని మాయ తినేస్తుంది, అందుకే పక్కాగా ఉండండి. మొదటి విషయము - సదా శుభచింతకులు, ఎవరి బలహీనతను చూసినా లేక విన్నా దయార్ద్ర హృదయులై, శుభ చింతకులై వారికి సహయోగాన్ని ఇవ్వవలసిందే. బలహీనతను చూడకూడదు, కానీ సహయోగమునైతే ఇవ్వవలసిందే. అటువంటివారినే శుభ చింతకులు అని అంటారు. పక్కాగా ఉంటుంది కదా! మీరు ఆధారమునిచ్చే దాతలుగా, దయార్ద్ర హృదయులుగా అయి సహయోగాన్ని ఇవ్వండి. ఎవరి నుండి పక్కకు వచ్చేయటము లేక ద్వేషించటము చేయకండి, క్షమించండి. పరవశులై ఉన్నవారిని ఎప్పుడూ ద్వేషించడము జరగదు, వారికి ఆధారము ఇవ్వడము జరుగుతుంది. కావున శుభ చింతకులుగా ఉండాలి మరియు రెండవది శుభ చింతన. ఈ రోజుల్లో బాప్ దాదా చూస్తున్నారు, మెజారిటీ పిల్లలలో అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాలు చాలా నడుస్తూ ఉంటాయి. దాని వలన జమ చేసుకున్న తమ శక్తులు వ్యర్థముగా పోతాయి, అందుకే శుభ చింతన కోసం స్వమానానికి సంబంధించిన ఏదో ఒక టైటిల్ ను మనసుకు హోమ్ వర్క్ గా ఇవ్వండి, మనసు యొక్క టైమ్ టేబుల్ ను తయారుచేయండి. కర్మలకైతే టైమ్ టేబుల్ ను ఎలాగూ తయారుచేసుకుంటారు, కానీ మనసు యొక్క టైమ్ టేబుల్ ను తయారుచేయండి. అమృతవేళ మిలనము జరుపుకున్న తర్వాత మనసుకు ఏదో ఒక స్వమానాన్ని ఇవ్వండి. కానీ ఇంతకుముందు కూడా వినిపించాము కదా, 12-13 సార్లు అయితే అందరికీ టైమ్ లభిస్తుంది, అందులో రియలైజ్ కూడా అవ్వండి, రివైజ్ కూడా చేయండి, అప్పుడు మనసు బిజీగా ఉండటము వలన వ్యర్థ సంకల్పాలలో సమయము పోదు. శ్రమించవలసిన అవసరము ఉండదు. ప్రతి సమయము సంగమయుగపు ఆనందాల యుగము ఏదైతే ఉందో ఆ ఆనందములోనే ఉంటారు. కావున రెండవది వినిపించాము - శుభ చింతన. చెక్ చేసుకోండి మరియు ఛేంజ్ చేసుకోండి. మూడవది, శుభ వృత్తి. అశుభ వృత్తి వాయుమండలములో కూడా అశుద్ధతను వ్యాపింపజేస్తుంది, అందుకే శుభ వృత్తి ఉండాలి. నాలుగవది, ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను తీసుకోవాలి - నేను, ఇది ప్రత్యేకముగా నా పనే, ఇతరులను చూడకూడదు, శుభ వాయుమండలాన్ని తయారుచేయడము నా పని. ఎలాగైతే ఎప్పుడైనా వాయుమండలములో దుర్గంధము ఉంటే ఏం చేస్తారు? సుగంధాన్ని వ్యాపింపజేస్తారు కదా! దుర్గంధాన్ని సహించలేరు, సుగంధాన్ని ఇచ్చే ఏదో ఒక సాధనాన్ని ఉపయోగిస్తారు. అదే విధముగా సాధారణ వాయుమండలము లేక అశుభ వాయుమండలము మారవలసిందే. చిన్నవారైనా లేక కొత్తవారైనా, ఇది అందరి బాధ్యత. నేను శుభ వాయుమండలాన్ని తయారుచేయవలసిందే అని దృఢ సంకల్పము చేయాలి. ఈ ప్రతిజ్ఞ ప్రత్యక్షతను చేస్తుంది. ప్రతిజ్ఞ చేస్తారు, బాప్ దాదా సంతోషిస్తారు కానీ ప్రతిజ్ఞలో అప్పుడప్పుడు దృఢత ఉండదు, అందుకే ఏదైతే సఫలతను కోరుకుంటారో, ఎంతైతే కోరుకుంటారో, అంత లభించదు. మొత్తము విశ్వములో, ప్రకృతిలో, ఆత్మలలో, ఆత్మలలో బ్రాహ్మణ ఆత్మలు కూడా వస్తారు, అందరి కొరకు అటువంటి వాయుమండలాన్ని తయారుచేయండి, ప్రతి ఒక్కరూ తమ సేవాస్థానాలలో దృఢతతో అటువంటి వాయుమండలాన్ని తయారుచేయండి. కొంత త్యాగము చెయ్యవలసి వస్తే చేయండి, వీరు త్యాగము చేస్తే నేను చేస్తాను, అలా కాదు. సిస్టమ్ సరిగ్గా ఉంటే... ఇలా అయితే, అయితే అని అనకండి. నేనైతే చెయ్యవలసిందే. మీరు విశ్వ పరివర్తకలు, ఈ స్వమానము ఉంది కదా! అందరూ విశ్వ పరివర్తకులే కదా! చేతులెత్తండి. అచ్ఛా, విశ్వ పరివర్తకులు! చాలా మంచిది. మరి బాప్ దాదా దీనిని మొదట చూడాలనుకుంటున్నారు, ఉంది కూడా, ఉంటుంది కూడా, కానీ ఈ సంవత్సరములో బాప్ దాదా చిన్న లేక పెద్ద సేవాకేంద్రాలను చుట్టి వస్తే వాయుమండలము ఎలా ఉండాలి? ఏ విధముగా ఈ రోజు స్నేహము మరియు శక్తి కల రోజుగా ఉందో, అదే విధముగా ప్రతి గ్రామములోని సెంటర్లు, పెద్ద సెంటర్లు, అన్ని చోట్ల వాయుమండలము చైతన్య మందిరము వలె ఉండాలి. నెగెటివ్ ను పాజిటివ్ గా చెయ్యటము, ఇందులో ‘ముందు నేను’. ‘ముందు మీరు’ అని అనకండి, ‘ముందు నేను’ ఎందుకంటే బాప్ దాదా మరియు అడ్వాన్స్ పార్టీ ఎదురుచూస్తూ ఉన్నారు మరియు ఈ రోజుల్లోనైతే ప్రకృతి కూడా ఎదురుచూస్తూ ఉంది. ఏర్పాట్లు చేసేవారు మీరు. మీరు ఎదురుచూడకూడదు, మీరు ఏర్పాట్లు చేయాలి.

ఈ రోజుల్లో నలువైపులా భయము వ్యాపించి ఉంది. ప్రపంచములోని మెజారిటీ వారిలో, అందరి మనసులలో ఒకటే ఆలోచన ఉంది - రేపు ఏమవుతుందో! రేపు ఏమవుతుందో మీకు తెలుసు! కావున పరివర్తన చేయడములో ముందు నేను నిమిత్తము అవుతాను అని ఈ సంకల్పాన్ని ఎవరు చేస్తారు? ఇందులో చేతులెత్తండి. చేయవలసి ఉంటుంది. చేయవలసి ఉంటుంది. మారవలసి ఉంటుంది. రక్షకులుగా అవ్వవలసి ఉంటుంది. కొంత వదలవలసి ఉంటుంది మరియు ప్రేమను తీసుకోవలసి ఉంటుంది. మనసు యొక్క చేతిని ఎత్తారా లేక ఈ చేతిని ఎత్తారా? మనసు యొక్క చేతిని ఎత్తినవారు ఎవరు? ఎందుకంటే మనసు మారితే విశ్వము మారుతుంది. మరి ఈ సంవత్సరములో ఏం స్లోగన్ ఉంటుంది? ఏం స్లోగన్ ఉంటుంది? ‘‘నో ప్రాబ్లమ్’’. విజయ పతాకము మనసులో ఎగురుతుంది మరియు అందరూ సంతోషపు డ్యాన్స్ ను సదా మనసులో చేస్తారు. మనసు యొక్క డ్యాన్స్ సంతోషము. కావున అన్నివేళలా సంతోషపు డ్యాన్స్ ను చేస్తారు. మరియు మీరు దాత పిల్లలు కావున ఎవరు వచ్చినా సరే, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక గుణము యొక్క కానుకను ఇవ్వండి. కావున ఒక్క క్షణములో ఆ దృఢ సంకల్పము, దాతను అనే సంకల్పము లిఫ్టుగా అవుతుంది మరియు క్షణములో పరంధామానికి, సూక్ష్మవతనానికి, స్థూల మధుబన్ సాకార వతనానికి, ఎక్కడికి కావాలంటే అక్కడికి కష్టము లేకుండానే క్షణములో చేరుకుంటారు. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ వారిని ఖాళీ చేతులతో పంపించకండి, ఏదో ఒక గుణము యొక్క కానుకను, ముఖము ద్వారానైనా, నడవడిక ద్వారానైనా, నోటి ద్వారానైనా గుణము యొక్క కానుకను ఇవ్వకుండా కలవకండి.

మరి ఈ సంవత్సరములోని ప్రతి నెల యొక్క రిజల్టును మీ వద్ద కూడా ఉంచుకోండి మరియు యజ్ఞానికి టీచర్ ద్వారా ఓ.కే. అన్న కార్డును పంపించండి. పెద్ద లేఖను పంపించకండి, ఓ.కే. అన్న కార్డును పంపించండి. కార్డు కూడా పెద్దది పంపించవద్దు. ప్రపంచములో ఏదైతే కార్డు ఉపయోగిస్తారో అది కాదు, టీచర్ ద్వారా ఏదైతే వరదానము కార్డు లభిస్తుందో అటువంటిది పంపించండి. గుణాల కానుకలు, శక్తుల కానుకలు ఎన్ని ఉన్నాయి? లిస్టును లెక్కపెట్టినట్లయితే ఎంత పెద్ద లిస్టు ఉంటుంది! మరియు ఎంతగా ఇస్తూ ఉంటారో అంతగా తక్కువ అవ్వవు కానీ అవి పెరుగుతూ ఉంటాయి. మ్యాజిక్ మంత్రము అని అంటుంటారు కదా, అలాగే ఇది శివ మంత్రము, దీని ద్వారా ఎప్పుడూ ఏ గుణము మీ నుండి తక్కువ అవ్వదు, ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ‘దానము ఇచ్చినట్లయితే గ్రహణము వదులుతుంది’ అన్న నానుడి ఉంది. అచ్ఛా!

ఈ సారి మొదటిసారిగా ఎవరైతే వచ్చారో వారు లేచి నిలబడండి. మంచిది. (మధ్యప్రదేశ్ గవర్నర్ ఎదురుగా కూర్చుని ఉన్నారు) ఈ సంగఠనలోకి విచ్చేసారు, మంచిది. బాప్ దాదా మీ అందరికీ, వచ్చినవారికి ఈ వరదానమును ఇస్తున్నారు - సదా బాబాకు గుడ్ మార్నింగ్ మరియు గుడ్ నైట్ తప్పకుండా చెప్పాలి, ఎందుకంటే మొట్టమొదటగా కనులు తెరవగానే బాబాను చూసినట్లయితే మొత్తము రోజంతా మంచిగా ఉంటుంది. మొదటిసారి వచ్చే పిల్లలకు బాప్ దాదా యొక్క పదమాల రెట్లు ప్రియస్మృతులు మరియు అభినందనలు. అచ్ఛా!

ఇప్పుడు అందరూ సదా నాలుగు విషయాలనేవైతే వినిపించామో మరియు ఐదవదిగా జీరో మరియు హీరో అన్నది ఏదైతే వినిపించామో, మరి ఈ విషయాలను మననము చేస్తూ మగ్న అవస్థలో ఉండే బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాగా అయ్యే ఆత్మలు, దేవతలుగా అవ్వటము అన్నది మీ జన్మసిద్ధ అధికారము, ఫరిశ్తాల నుండి దేవతలుగా అయితే ఉండనే ఉన్నారు, సదా స్నేహము యొక్క ప్రేమలో లీనమై లవలీనముగా ఉండేవారు, సదా దృఢతతో కూడిన సంకల్పమనే తాళంచెవిని మనసులో, బుద్ధిలో స్మృతిలో ఉంచుకునేవారు, ఎందుకంటే ఈ తాళంచెవి వెనుక మాయ చాలా తిరుగుతూ ఉంటుంది, కావున మనసు మరియు బుద్ధి ద్వారా సదా సమర్థముగా ఉండే నలువైపులా ఉన్న పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో:- (జానకిదాదితో) పర్యటన చేసి వచ్చారు, చాలా మంచిది. ఏదైతే చేస్తున్నారో అది చాలా బాగుంది. జగదంబ మధ్యలో నిలబడి జెండా ఎగురవేస్తూ ఉంటే వెనుక శక్తులందరూ తోడుగా నిలబడి ఉండే ఆ చిత్రము బాబాకు గుర్తు వచ్చింది. మరి ఇప్పుడు ఆ చిత్రాన్ని బాప్ దాదా విశ్వము ముందు చూపించాలని కోరుకుంటున్నారు. మొత్తము బ్రాహ్మణులతో శక్తి సేనను ఎలా తయారుచెయ్యండి అంటే వారు నిమిత్తముగా అవ్వాలి. పరిక్రమణ చేస్తూ వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారుచేయాలి మరియు దృఢ సంకల్పము చెయ్యండి - మేము వాయుమండలాన్ని మార్చి చూపిస్తాము అన్న దృఢ సంకల్పాన్ని ఉంచుతాము. ఈ జెండాను ఎగురవేయాలి. చుట్టూ అన్ని చోట్లకు తిరుగుతూ తమ స్థితి, వాణి మరియు సాంగత్యము ద్వారా వాయుమండలాన్ని మంచిగా తయారుచేసే గ్రూపును తయారుచేయండి. అటువంటి గ్రూపును తయారుచేసి చూపించండి. బాప్ దాదాకు చిత్రము గుర్తు వచ్చిందంటే అది ప్రాక్టికల్ అవ్వాలి. సమయము లభించదు అని అనవద్దు. సమయము లభించదు అని ఎవ్వరూ అనవద్దు. ఒకవేళ శుభ భావన ఉన్నట్లయితే సమయము లభిస్తుంది, అటువంటి గ్రూపును బాప్ దాదాకు తయారుచేసి ఇవ్వండి. అచ్ఛా!

యూథ్ గ్రూప్ తో:- ఈ సంవత్సరములో బ్రాహ్మణ మర్యాదలు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్క మర్యాదను సంపూర్ణ రీతిలో, మనసాలో, వాచాలో, కర్మణాలో మరియు సంబంధ-సంపర్కాలలో, నాలుగు రూపాలలో పాటించే అటువంటి గ్రూపును తయారుచేయండి, ఈ సంవత్సరము ఏ మర్యాద కూడా భంగమవ్వకూడదు. పరస్పరములో అటువంటి గ్రూపును తయారుచేయండి. మీలో మీరు తయారుచేయండి. ఎవరైతే ముందుగా ఈ బాధ్యతను స్వీకరిస్తారో వారే అర్జునులు. ఇష్టమేనా? ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? చేతులెత్తండి. చేస్తారా? యువత అందరూ చేస్తారా? ఎంతమంది ఉన్నారు? (400 మంది). పరస్పరములో ప్రతి గ్రూపును పక్కా చేయండి, అప్పుడు - వీరు మర్యాదా పురుషోత్తములు అని గవర్నమెంటుకు చూపిస్తాము. గవర్నమెంటు కూడా కోరుకుంటుంది కానీ చెయ్యలేకపోతుంది, మీరు చేసి చూపించండి. ఉదాహరణగా అయ్యి చూపించండి. హోమ్ వర్క్ లభించింది కదా. నలువైపులా ఉన్న బ్రాహ్మణ ఆత్మలు ఈ సంవత్సరములో అద్భుతము చేసి చూపించాలి అని బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు. వ్యర్థ సంకల్పాల అలజడి కూడా ఉండకూడదు. శుద్ధ సంకల్పాలను ఎంతగా జమ చేసుకోండి అంటే ఇక వ్యర్థ సంకల్పాలు వచ్చేందుకు సమయమే లభించకూడదు. ఉంది కదా ఖజానా. శుద్ధ సంకల్పాల ఖజానా అంతగా జమ అయ్యి ఉందా? ఉందా? చేతులెత్తండి. శక్తులు కూడా ఉన్నారు, మంచిది, శక్తులు కూడా ఉదాహరణగా అవ్వండి మరియు పాండవులు కూడా ఉదాహరణగా అవ్వండి. అచ్ఛా! బాప్ దాదా సంతోషించారు.

వరదానము:-
సూక్ష్మ సంకల్పాల బంధనము నుండి కూడా ముక్తులుగా అయ్యి ఉన్నత స్థితిని అనుభవము చేసే నిర్బంధన భవ

పిల్లలు ఎంత నిర్బంధనులుగా ఉంటారో వారు అంత ఉన్నత స్థితిలో స్థితులై ఉండగలరు. అందుకే చెక్ చేసుకోండి - మనసా, వాచా మరియు కర్మణాలో సూక్ష్మముగా కూడా ఎటువంటి దారమూ చిక్కుకుని లేదు కదా! ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తుకు రాకూడదు. మీ దేహము గుర్తుకు వచ్చినా సరే, దేహముతో పాటు దేహ సంబంధాలు, పదార్థాలు, ప్రపంచము అన్నీ ఒకదానివెనుక ఒకటి వచ్చేస్తాయి. నేను నిర్బంధనుడిని - ఈ వరదానాన్ని స్మృతిలో ఉంచుకుని మొత్తము ప్రపంచమంతటినీ మాయ వల నుండి విముక్తిగా చేసే సేవ చేయండి.

స్లోగన్:-
దేహీ-అభిమానీ స్థితి ద్వారా తనువు మరియు మనసు యొక్క అలజడిని సమాప్తము చేసేవారే అచలముగా ఉంటారు.

అవ్యక్త ప్రేరణలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా, నిశ్చింతగా ఉండండి’’

సమస్యల పని రావటము, నిశ్చయబుద్ధి ఆత్మల పని సమాధాన స్వరూపముతో సమస్యను పరివర్తన చెయ్యటము. ఎందుకని? బ్రాహ్మణ ఆత్మలైన మీలోని ప్రతి ఒక్కరూ బ్రాహ్మణ జన్మ తీసుకోవటముతోనే - మేము మాయాజీతులుగా అయ్యేవారము అని మాయను ఛాలెంజ్ చేసారు. సమస్య స్వరూపము మాయ స్వరూపము. ఛాలెంజ్ చేసిన తర్వాత మరి మాయ ఎదిరించడమైతే ఎదిరిస్తుంది, కానీ మీరు దానిని నిశ్చయబుద్ధి విజయీ స్వరూపముతో, నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు) అని భావిస్తూ దాటేసినట్లయితే నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు.