08-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి, అంతేకానీ ట్రాన్స్ ద్వారా కాదు. ట్రాన్స్ అనేది పైసకు కొరగాని ఆట వంటిది, అందుకే ట్రాన్స్ లోకి వెళ్ళాలనే ఆశను పెట్టుకోకండి’’

ప్రశ్న:-
మాయ యొక్క రకరకాల రూపాల నుండి రక్షించుకోవడం కోసం తండ్రి పిల్లలందరినీ ఏ ఒక్క విషయములో అప్రమత్తం చేస్తారు?

జవాబు:-
మధురమైన పిల్లలూ, ట్రాన్స్ యొక్క ఆశను పెట్టుకోకండి. జ్ఞాన-యోగాలకు ట్రాన్స్ తో ఎటువంటి సంబంధమూ లేదు. ముఖ్యమైనది చదువు. కొందరు ట్రాన్స్ లోకి వెళ్ళి - మాలోకి మమ్మా వచ్చారు, బాబా వచ్చారు అని అంటారు. ఇవన్నీ సూక్ష్మమైన మాయ యొక్క సంకల్పాలు, వీటి నుండి చాలా అప్రమత్తంగా ఉండాలి. మాయ చాలామంది పిల్లలలోకి ప్రవేశించి తప్పుడు పనులు చేయిస్తుంది, అందుకే ట్రాన్స్ యొక్క ఆశను పెట్టుకోకూడదు.

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు - ఒకవైపు భక్తి ఉందని, ఇంకొకవైపు జ్ఞానం ఉందని అర్థం చేసుకున్నారు. భక్తి అయితే అపారంగా ఉంది మరియు దానిని నేర్పించేవారు కూడా అనేకులు ఉన్నారు. శాస్త్రాలు కూడా నేర్పిస్తాయి, మనుష్యులు కూడా నేర్పిస్తారు. ఇక్కడ నేర్పించేటువంటి శాస్త్రాలూ లేవు, మనుష్యులూ లేరు. ఇక్కడ నేర్పించేవారు ఒక్క ఆత్మిక తండ్రియే, వారు ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మయే ధారణ చేస్తుంది. పరమపిత పరమాత్మలో ఈ మొత్తం జ్ఞానమంతా ఉంది, 84 జన్మల చక్రానికి సంబంధించిన జ్ఞానం వారిలో ఉంది, అందుకే వారిని కూడా స్వదర్శన చక్రధారి అని అనవచ్చు. పిల్లలైన మనల్ని కూడా వారు స్వదర్శన చక్రధారులుగా తయారుచేస్తున్నారు. బాబా కూడా బ్రహ్మా తనువులో ఉన్నారు, అందుకే వారిని బ్రాహ్మణ్ అని కూడా అనవచ్చు. వారి పిల్లలమైన మనం కూడా బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. ఇప్పుడు తండ్రి కూర్చొని స్మృతియాత్రను నేర్పిస్తారు, ఇందులో హఠయోగము మొదలైనవాటి విషయమేదీ లేదు. వారు హఠయోగము ద్వారా ట్రాన్స్ మొదలైనవాటిలోకి వెళ్తారు. అది గొప్ప విషయమేమీ కాదు. ట్రాన్స్ యొక్క గొప్పతనమేమీ లేదు. ట్రాన్స్ అనేది పైసకు కొరగాని ఆట. మేము ట్రాన్స్ లోకి వెళ్తాము అని మీరు ఎప్పుడూ ఎవరితోనూ అనకూడదు, ఎందుకంటే ఈ రోజుల్లో విదేశాలు మొదలైన చోట్ల ఎక్కడంటే అక్కడ లెక్కలేనంతమంది ట్రాన్స్ లోకి వెళ్తారు. ట్రాన్స్ లోకి వెళ్ళడం వలన వారికీ ఎటువంటి లాభం ఉండదు, అలాగే మీకూ ఎటువంటి లాభం ఉండదు. బాబా వివేకాన్ని ఇచ్చారు. ట్రాన్స్ లోనైతే స్మృతియాత్ర ఉండదు, జ్ఞానము ఉండదు. ధ్యానములోకి వెళ్ళేవారు లేక ట్రాన్స్ లోకి వెళ్ళేవారు ఎప్పుడూ ఏ జ్ఞానాన్ని వినరు, అలాగే వారి పాపాలు కూడా ఏమీ భస్మమవ్వవు. ట్రాన్స్ కు ఎటువంటి మహత్వము లేదు. పిల్లలు యోగాన్ని జోడిస్తారు, దానిని ట్రాన్స్ అని అనరు. స్మృతితో వికర్మలు వినాశనమవుతాయి, ట్రాన్స్ లో వికర్మలు వినాశనమవ్వవు. పిల్లలూ, ట్రాన్స్ యొక్క అభిరుచిని పెట్టుకోకండి అని బాబా సావధానపరుస్తారు.

ఈ సన్యాసులు మొదలైనవారికి, ఎప్పుడైతే వినాశన సమయం వస్తుందో, అప్పుడు జ్ఞానం లభిస్తుందని మీకు తెలుసు. మీరు వారికి ఇటువంటి ఆహ్వానాన్ని ఇస్తూ ఉండండి కానీ ఈ జ్ఞానం వారి కలశములోకి అంత త్వరగా రాదు. ఎప్పుడైతే వినాశనాన్ని ఎదురుగా చూస్తారో అప్పుడు వస్తారు. ఇప్పుడిక మృత్యువు వచ్చేసింది అని అప్పుడు భావిస్తారు. ఎప్పుడైతే సమీపముగా చూస్తారో అప్పుడు అంగీకరిస్తారు. వారి పాత్రయే అంతిమములో ఉంటుంది. ఇప్పుడు వినాశనం ఇక వచ్చేసింది, మృత్యువు రానున్నది అని మీరు అంటారు. ఇవన్నీ వీరి ప్రగల్భాలే అని వారు భావిస్తారు.

మీ వృక్షము మెల్ల-మెల్లగా పెరుగుతుంది. సన్యాసులకు కేవలం తండ్రిని స్మృతి చేయమని చెప్పాలి. మీరు కళ్ళు మూసుకోకూడదు అని కూడా తండ్రి అర్థం చేయించారు. కళ్ళు మూసుకుంటే తండ్రిని ఎలా చూస్తారు. మనం ఆత్మలము, పరమపిత పరమాత్ముని ఎదురుగా కూర్చున్నాము. వారు కనులకు కనిపించరు, కానీ ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది. పరమపిత పరమాత్మ ఈ శరీరము యొక్క ఆధారముతో మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీరు భావిస్తారు. ఇందులో ధ్యానము మొదలైనవాటి విషయమేదీ లేదు. ధ్యానములోకి వెళ్ళడమనేది పెద్ద విషయమేమీ కాదు. ఈ భోగ్ మొదలైనవన్నీ డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. సేవకులుగా అయి భోగ్ ను నివేదించి వస్తారు. ఎలాగైతే సేవకులు గొప్ప వ్యక్తులకు తినిపిస్తారో, అలాగే మీరు కూడా సేవకులే, దేవతలకు భోగ్ నివేదించడానికి వెళ్తారు. వారు ఫరిశ్తాలు. అక్కడ మమ్మా-బాబాను చూస్తారు. ఆ సంపూర్ణ మూర్తి కూడా మన లక్ష్యము-ఉద్దేశ్యము. వారిని ఆ విధంగా ఫరిశ్తాలుగా ఎవరు తయారుచేసారు? ఇకపోతే ధ్యానములోకి వెళ్ళడమైతే ఏమంత పెద్ద విషయము కాదు. ఏ విధంగా ఇక్కడ శివబాబా మిమ్మల్ని చదివిస్తున్నారో, అలాగే అక్కడ కూడా శివబాబా వీరి ద్వారా ఏదో అర్థం చేయిస్తారు. సూక్ష్మవతనములో ఏమి జరుగుతుంది అనేది కేవలం తెలుసుకోవలసి ఉంటుంది. ఇక ట్రాన్స్ మొదలైనవాటికి ఎటువంటి మహత్వాన్ని ఇవ్వకూడదు. ఎవరికైనా ట్రాన్స్ ను చూపించడం - ఇది కూడా చిన్నతనమే. ట్రాన్స్ లోకి వెళ్ళకండి, ఇందులో కూడా చాలా సార్లు మాయ ప్రవేశిస్తుంది అని బాబా అందరినీ సావధానపరుస్తారు.

ఇది చదువు, కల్ప-కల్పమూ తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తారు. ఇప్పుడు ఇది సంగమయుగము, మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలి. డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు పాత్రను అభినయిస్తున్నారు, పాత్రకే మహిమ ఉంది. తండ్రి వచ్చి డ్రామానుసారంగా చదివిస్తారు. మీరు తండ్రి నుండి ఒక్కసారి చదువుకొని మనుష్యుల నుండి దేవతలుగా తప్పకుండా అవ్వాలి. ఇందులో పిల్లలకైతే సంతోషము కలుగుతుంది. మనం తండ్రి గురించి మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాలను గురించి కూడా తెలుసుకున్నాము. తండ్రి యొక్క శిక్షణను పొంది ఎంతో హర్షితంగా అవ్వాలి. మీరు కొత్త ప్రపంచం కొరకే చదువుకుంటారు. అక్కడ ఉన్నదే దేవతల రాజ్యము, కావున తప్పకుండా పురుషోత్తమ సంగమయుగములో చదువుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ దుఃఖాల నుండి విముక్తులై సుఖములోకి వెళ్తారు. ఇక్కడ తమోప్రధానముగా ఉన్న కారణంగా మీరు వ్యాధిగ్రస్థులుగా అవుతారు. ఈ రోగాలన్నీ తొలగిపోనున్నాయి. ముఖ్యమైనది చదువే, దీనికి సాక్షాత్కారాలు మొదలైనవాటితో సంబంధమేమీ లేదు. ఇది పెద్ద విషయమేమీ కాదు. చాలా చోట్ల ఈ విధంగా ధ్యానములోకి వెళ్తారు, అప్పుడు మమ్మా వచ్చారు, బాబా వచ్చారు అని అంటారు. తండ్రి అంటారు - వాస్తవానికి ఇవేవీ కాదు. తండ్రి అయితే ఒకటే విషయాన్ని అర్థం చేయిస్తారు - మీరెవరైతే అర్ధకల్పం దేహాభిమానులుగా అయ్యారో, ఇప్పుడిక దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, దీనినే స్మృతియాత్ర అని అనడం జరుగుతుంది. యోగము అని అనడం వలన యాత్ర అన్నది నిరూపించబడదు. ఆత్మలైన మీరు ఇక్కడి నుండి వెళ్ళాలి, తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. మీరు ఇప్పుడు యాత్ర చేస్తున్నారు. వారి యోగము ఏదైతే ఉందో, అందులో యాత్ర యొక్క విషయం లేదు. హఠయోగులైతే ఎందరో ఉన్నారు. అది హఠయోగము, ఇది తండ్రిని స్మృతి చేయడము. తండ్రి అంటారు - మధురాతి-మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ విధంగా ఇంకెవ్వరూ ఎప్పుడూ అర్థం చేయించరు. ఇది చదువు. తండ్రికి పిల్లలుగా అయ్యాక, ఇక తండ్రి నుండి చదువుకోవాలి మరియు చదివించాలి. బాబా అంటారు - మీరు మ్యూజియం తెరవండి, అప్పుడిక వారంతట వారే మీ వద్దకు వస్తారు, పిలవడానికి కష్టపడవలసిన అవసరం ఉండదు. ఈ జ్ఞానం చాలా బాగుంది, దీనిని ఎప్పుడూ వినలేదు అని అంటారు. దీని వలనైతే క్యారెక్టర్ బాగవుతుంది. ముఖ్యమైనది పవిత్రత, దాని విషయములోనే గొడవలు మొదలైనవి జరుగుతాయి, చాలా మంది ఫెయిల్ కూడా అవుతారు. మీ అవస్థ ఎలా తయారవుతుందంటే, ఈ ప్రపంచంలో ఉంటూ కూడా దీనిని చూడనే చూడరు. తింటూ-త్రాగుతూ కూడా మీ బుద్ధి అటువైపు ఉండాలి. ఏ విధంగానైతే తండ్రి కొత్త ఇంటిని తయారుచేస్తుంటే అందరి బుద్ధి ఆ కొత్త ఇంటి వైపుకే వెళ్ళిపోతుంది కదా. అలాగే ఇప్పుడు కొత్త ప్రపంచం తయారవుతుంది. అనంతమైన తండ్రి అనంతమైన ఇంటిని నిర్మిస్తున్నారు. మనం స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నామని మీకు తెలుసు. ఇప్పుడు చక్రం పూర్తయ్యింది. ఇప్పుడు మనం ఇంటికి మరియు స్వర్గములోకి వెళ్ళాలి, దాని కొరకు పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి. స్మృతియాత్ర ద్వారానే పావనంగా అవ్వాలి. స్మృతిలోనే విఘ్నాలు కలుగుతాయి, ఇందులోనే మీ యుద్ధము ఉంది. చదువులో యుద్ధం యొక్క విషయము ఉండదు. చదువు అయితే చాలా సాధారణమైనది. 84 జన్మల చక్రము యొక్క జ్ఞానము చాలా సహజమైనది. ఇకపోతే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, ఇందులో శ్రమ ఉంది. తండ్రి అంటారు, స్మృతియాత్రను మర్చిపోకండి. తక్కువలో తక్కువ 8 గంటలైతే తప్పకుండా స్మృతి చేయండి. శరీర నిర్వహణ కోసం కర్మలు కూడా చేయాలి. నిద్రపోవాలి కూడా. ఇది సహజమైన మార్గం కదా. ఒకవేళ నిద్రపోకూడదు అని అన్నట్లయితే, అది హఠయోగమవుతుంది. హఠయోగులైతే ఎందరో ఉన్నారు. తండ్రి అంటారు - అటువైపు ఏమీ చూడకండి, దాని వల్ల లాభమేమీ లేదు. ఎంతమంది హఠయోగాలు మొదలైనవాటిని నేర్పిస్తారు. ఇవన్నీ మనుష్య మతాలు. మీరు ఆత్మలు, ఆత్మయే శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయిస్తుంది, డాక్టర్ మొదలైనవారిగా అవుతుంది. కానీ మనుష్యులు, నేను ఫలానాను అని అంటూ దేహాభిమానులుగా అయిపోయారు.

నేను ఆత్మను అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. తండ్రి కూడా ఆత్మయే. ఈ సమయంలో ఆత్మలైన మిమ్మల్ని పరమపిత చదివిస్తారు, అందుకే - ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం దూరంగా ఉన్నారు... కల్ప-కల్పమూ కలుస్తారు అన్న గాయనము ఉంది. ఇక మిగిలిన ప్రపంచమంతా ఏదైతే ఉందో, వారంతా దేహాభిమానములోకి వచ్చి దేహముగా భావిస్తూనే చదువుకుంటూ, చదివిస్తూ ఉంటారు. తండ్రి అంటారు - నేను ఆత్మలను చదివిస్తాను. జడ్జి, బ్యారిస్టర్ మొదలైనవారిగా కూడా ఆత్మయే అవుతుంది. ఆత్మలైన మీరు సతోప్రధానంగా, పవిత్రంగా ఉండేవారు, మళ్ళీ మీరు పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ అందరూ పతితంగా అయిపోయారు, అప్పుడు - బాబా, వచ్చి మమ్మల్ని పావన ఆత్మలుగా తయారుచేయండి అని పిలుస్తారు. తండ్రి అయితే పావనముగానే ఉంటారు. ఈ విషయాన్ని ఎప్పుడైతే వింటారో అప్పుడు ధారణ అవుతుంది. పిల్లలైన మీకు ధారణ అయినప్పుడే మీరు దేవతలుగా అవుతారు. ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఇది కూర్చొనే కూర్చోదు, ఎందుకంటే ఇది కొత్త విషయము. ఇది జ్ఞానము. అది భక్తి, మీరు కూడా భక్తి చేస్తూ-చేస్తూ దేహాభిమానులుగా అయిపోతారు. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, ఆత్మాభిమానులుగా అవ్వండి. ఆత్మలైన మనల్ని తండ్రి ఈ శరీరము ద్వారా చదివిస్తారు. ఆత్మల తండ్రియైన పరమపిత చదివించే సమయం ఇదొక్కటేనని ఘడియ-ఘడియ గుర్తుంచుకోండి. ఇకపోతే మిగిలిన డ్రామా అంతటిలోనూ ఈ సంగమయుగములో తప్ప ఇంకెప్పుడూ ఈ పాత్రయే లేదు, అందుకే తండ్రి మళ్ళీ చెప్తున్నారు - మధురాతి-మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి, తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా ఉన్నతమైన యాత్ర - ఉన్నతిలోకి వెళ్తుంటే వైకుంఠ రసాన్ని ఆస్వాదిస్తారు, వికారాలలో పడిపోవడంతో పూర్తిగా ముక్కలు-ముక్కలుగా అయిపోతారు. కానీ స్వర్గములోకైతే వస్తారు, కానీ పదవి చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ రాజ్యము స్థాపన అవుతోంది, ఇందులో తక్కువ పదవి కలవారు కూడా కావాలి, అందరూ జ్ఞానంలో ఏమైనా నడుస్తారా. అలాగైతే బాబాకు ఎంతోమంది పిల్లలు లభించాలి. ఒకవేళ అలా లభించినా కూడా కొద్ది సమయం కొరకే లభిస్తారు. మాతలైన మీకు ఎంతో మహిమ ఉంది, వందేమాతరం అని కూడా గాయనం చేస్తారు. జగదాంబకు ఎంత భారీ మేళా జరుగుతుంది, ఎందుకంటే వారు ఎంతో సేవ చేసారు. ఎవరైతే ఎంతో సేవను చేస్తారో, వారు పెద్ద రాజులుగా అవుతారు. దిల్వాడా మందిరంలో మీ స్మృతిచిహ్నమే ఉంది. పిల్లలైన మీరైతే ఎంతో సమయాన్ని కేటాయించాలి. మీరు భోజనం మొదలైనవి తయారుచేసేటప్పుడు చాలా శుద్ధమైన భోజనాన్ని స్మృతిలో కూర్చుని తయారుచేయాలి, దానిని ఎవరికైనా తినిపించినప్పుడు వారి హృదయం కూడా శుద్ధమైపోవాలి. ఇలాంటి భోజనము చాలా కొద్దిమందికే లభిస్తుంది. భోజనాన్ని స్వీకరించడంతోనే స్వీకరించినవారి హృదయం కరిగిపోయే విధంగా నేను శివబాబా స్మృతిలో ఉంటూ భోజనాన్ని తయారుచేస్తున్నానా - అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఘడియ-ఘడియ స్మృతిని మర్చిపోతారు. బాబా అంటారు - ఇలా మర్చిపోవడం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది ఎందుకంటే మీరు 16 కళలు కలవారిగానైతే ఇప్పుడు ఇంకా అవ్వలేదు. సంపూర్ణులుగా తప్పకుండా అవ్వాలి. పౌర్ణమి నాటి చంద్రునిలో ఎంతటి ప్రకాశము ఉంటుంది, తర్వాత ఆ ప్రకాశము తగ్గిపోతూ-తగ్గిపోతూ ఇక నెలవంక మిగులుతుంది. ఘోర అంధకారము ఏర్పడుతుంది, ఆ తర్వాత అత్యంత ప్రకాశము వస్తుంది. ఈ వికారాలు మొదలైనవాటిని వదిలి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ ఆత్మ సంపూర్ణం అయిపోతుంది. మీరు మహారాజులుగా అవ్వాలి అని కోరుకుంటారు, కానీ అందరూ అలా అవ్వలేరు. పురుషార్థము అందరూ చేయాలి. కొందరైతే ఏ పురుషార్థమూ చేయరు, అందుకే మహారథులు, గుర్రపుస్వారీ చేసేవారు, పాదచారులు అని అంటారు. మహారథులు కొద్దిమందే ఉంటారు. ప్రజలు లేక సైన్యం ఎంతమందైతే ఉంటారో, అంతమంది కమాండర్లు లేక మేజర్లు ఉండరు. మీలో కూడా కమాండర్లు, మేజర్లు, కెప్టెన్లు ఉన్నారు, అలాగే పాదచారులు కూడా ఉన్నారు. మీది కూడా ఆత్మిక సైన్యమే కదా. మొత్తం ఆధారమంతా స్మృతియాత్రపై ఉంది, దానితోనే బలం లభిస్తుంది. మీరు గుప్తమైన యోధులు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా వికర్మల చెత్త ఏదైతే ఉందో, అది భస్మమైపోతుంది. తండ్రి అంటారు - వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేయండి, కానీ తండ్రిని స్మృతి చేయండి. మీరు ఆ ఒక్క ప్రియునికి జన్మ-జన్మాంతరాల ప్రేయసులు. ఇప్పుడు ఆ ప్రియుడు లభించారు కావున వారిని స్మృతి చేయాలి. ఇంతకుముందు స్మృతి చేసేవారు కానీ వికర్మలు ఏమైనా వినాశనమయ్యేవా. మీరు ఇక్కడ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి అని తండ్రి తెలియజేస్తారు. ఆత్మయే అలా తయారవ్వాలి. ఆత్మయే కష్టపడుతూ ఉంది. ఈ జన్మలోనే మీరు జన్మ-జన్మాంతరాల మలినాలను తొలగించుకోవాలి. ఇది మృత్యులోకము యొక్క అంతిమ జన్మ, ఇక తర్వాత అమరలోకానికి వెళ్ళాలి. ఆత్మ పావనంగా అవ్వకుండానైతే వెళ్ళలేదు. అందరూ తమ-తమ లెక్కాచారాలను తీర్చుకొని వెళ్ళాలి. ఒకవేళ శిక్షలు అనుభవించి వెళ్ళినట్లయితే పదవి తగ్గిపోతుంది. ఎవరైతే శిక్షలు అనుభవించరో, వారే మాలలోని 8 రత్నాలుగా పిలువబడతారు. 9 రత్నాల ఉంగరము మొదలైనవి తయారవుతాయి. ఆ విధంగా తయారవ్వాలంటే తండ్రిని స్మృతి చేసే కృషి ఎంతగానో చేయాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సంగమయుగములో స్వయాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చదువు మరియు పవిత్రత యొక్క ధారణతో మీ క్యారెక్టర్ ను తీర్చిదిద్దుకోవాలి, ట్రాన్స్ మొదలైనవాటి పట్ల అభిరుచిని పెట్టుకోకూడదు.

2. శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయాలి, నిద్రపోవాలి కూడా, ఇది హఠయోగము కాదు, కానీ స్మృతియాత్రను ఎప్పుడూ మర్చిపోకూడదు. యోగయుక్తంగా అయి ఎటువంటి శుద్ధమైన భోజనాన్ని తయారుచేయండి మరియు తినిపించండి అంటే, తద్వారా దానిని తినేవారి హృదయం శుద్ధమైపోవాలి.

వరదానము:-

తమ సూక్ష్మ శక్తులపై విజయులుగా అయ్యే రాజఋషి, స్వరాజ్యాధికారి ఆత్మ భవ

కర్మేంద్రియజీతులుగా అవ్వడమైతే సహజమే కానీ సూక్ష్మ శక్తులైన మనస్సు-బుద్ధి-సంస్కారాలపై విజయులుగా అవ్వడము - ఇది సూక్ష్మ అభ్యాసము. ఏ సమయములో ఏ సంకల్పాన్ని, ఏ సంస్కారాన్ని ఇమర్జ్ చేసుకోవాలనుకుంటే అదే సంకల్పాన్ని, అదే సంస్కారాన్ని సహజంగా అలవరచుకోవటము - దీనినే సూక్ష్మ శక్తులపై విజయులుగా అవ్వడము అనగా రాజఋషి స్థితి అని అంటారు. ఒకవేళ సంకల్ప శక్తికి - ఇప్పటికిప్పుడే ఏకాగ్రచిత్తముగా అవ్వమని ఆర్డర్ చేసినట్లయితే, రాజు ఆర్డర్ ను అదే ఘడియలో అదే విధంగా పాటించడము - ఇదే రాజ్యాధికారికి గుర్తు. ఈ అభ్యాసము ద్వారానే అంతిమ పరీక్షలో పాస్ అవుతారు.

స్లోగన్:-

సేవల ద్వారా ఏవైతే ఆశీర్వాదాలు లభిస్తాయో, అవే అన్నింటికన్నా అతి పెద్ద కానుకలు.