08-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ విశ్వమంతా ఈశ్వరీయ ఫ్యామిలీ, అందుకే నీవే తల్లివి-తండ్రివి, మేము నీ పిల్లలము అని పాడుతారు, మీరు ఇప్పుడు ప్రాక్టికల్ గా గాడ్లీ ఫ్యామిలీకి చెందినవారిగా అయ్యారు’’

ప్రశ్న:-
తండ్రి నుండి 21 జన్మల పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు సహజ విధి ఏమిటి?

జవాబు:-
సంగమములో శివబాబాను మీ వారసునిగా చేసుకోండి. తనువు-మనసు-ధనములతో బలిహారమైనట్లయితే, 21 జన్మల కోసం పూర్తి వారసత్వము ప్రాప్తిస్తుంది. బాబా అంటారు - సంగమములో ఏ పిల్లలైతే తమ పాతదంతా ఇన్ష్యూర్ (బీమా) చేసుకుంటారో, వారికి నేను రిటర్నులో 21 జన్మల వరకు ఇస్తాను.

పాట:-
నయనహీనులకు మార్గాన్ని చూపించండి...

ఓంశాంతి
పిల్లలు పాట విన్నారు. ఇలా భక్తులు భగవంతుడిని పిలుస్తారు. భగవంతుడిని పూర్తిగా తెలుసుకోని కారణముగా మనుష్యులు ఎంత దుఃఖితులుగా ఉన్నారు. భక్తి మార్గములో ఎంతగా తల బాదుకుంటూ ఉంటారు. ఇది కేవలం ఈ జీవితము యొక్క విషయమే కాదు. ఎప్పటి నుండైతే భక్తి ప్రారంభమైందో, అప్పటి నుండి ఎదురుదెబ్బలు తింటూ ఉన్నారు. భారత్ లోనే దేవీ-దేవతల రాజ్యము ఉండేది, దానిని స్వర్గము, సత్యఖండమని అనేవారు. భారత్ సత్యఖండము, భారత్ మహిమ చాలా గొప్పది ఎందుకంటే భారత్ పరమపిత పరమాత్ముని జన్మ స్థలము. వారి అసలు పేరు శివ. శివజయంతిని జరుపుకుంటారు. రుద్ర జయంతి లేదా సోమనాథ జయంతి అని అనడము జరగదు. శివజయంతి లేదా శివరాత్రి అని అంటారు. స్వర్గ స్థాపన చేసేవారు ఒక్క హెవెన్లీ గాడ్ ఫాదర్ మాత్రమే. ఇప్పుడు, భక్తులందరికీ భగవంతుడు తప్పకుండా ఒక్కరే అయి ఉండాలి. అందరూ నయనహీనులుగా ఉన్నారు అనగా జ్ఞాన చక్షువు లేదా డివైన్ ఇన్సైట్ (దివ్య దృష్టి) లేదు. భగవానువాచ - నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, శ్రీమద్భగవద్గీత ముఖ్యమైనది. శ్రీమత్ అనగా శ్రేష్ఠ మతము. ఇప్పుడు మిమ్మల్ని వివేకవంతులుగా తయారుచేయడము జరుగుతుంది. దివ్య చక్షువును అనగా జ్ఞానము యొక్క మూడవ నేత్రాన్ని చూపిస్తారు. వాస్తవానికి జ్ఞానము యొక్క మూడవ నేత్రము బ్రాహ్మణులైన మీకు లభిస్తుంది, దాని ద్వారా మీరు తండ్రిని మరియు తండ్రి రచన యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటారు. ఈ సమయములో అందరిలోనూ దేహ అహంకారము మరియు 5 వికారాలు ఉన్నాయి, అందుకే ఘోర అంధకారములో ఉన్నారు. పిల్లలైన మీ వద్ద ప్రకాశము ఉంది. మీ ఆత్మ మొత్తం ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాలను తెలుసుకుంది. ఇంతకుముందు మీరంతా అజ్ఞానములో ఉండేవారు. జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు, అజ్ఞాన అంధకారము వినాశనమైంది. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో, వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. పూజ్యులు ప్రకాశములో ఉన్నారు. పూజారులు అంధకారములో ఉన్నారు. పరమాత్మను - మీరే పూజ్యులు, మీరే పూజారి అని అనలేరు. వారు ఉన్నదే పరమ పూజ్యులు. వారు అందరినీ పూజ్యులుగా తయారుచేసేవారు. వారిని పరమ పూజ్యులని అంటారు. పరమపిత పరమ ఆత్మ అనగా పరమాత్మ. శ్రీకృష్ణుడిని అలా అనరు. వారిని అందరూ గాడ్ ఫాదర్ అని అనరు. నిరాకార భగవంతుడినే అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు. వారు కూడా ఆత్మనే కానీ వారు పరమ (ఉన్నతోన్నతమైనవారు), అందుకే వారిని పరమాత్మ అని అంటారు. ఆ పరమాత్మ సదా పరంధామములో నివసిస్తారు. ఇంగ్లీషులో వారిని సుప్రీమ్ సోల్ అని అంటారు. తండ్రి అంటారు - ఆత్మ-పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు... అని మీరు పాడుతారు కూడా. అంతేకానీ పరమాత్మ, పరమాత్మ నుండి చాలా కాలం వేరుగా ఉన్నారు... అని కాదు. అలా కాదు. ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనడము - ఇది మొదటి నంబరు అజ్ఞానము. ఆత్మ జనన-మరణాలలోకి వస్తుంది. పరమాత్మ పునర్జన్మలలోకి రారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా, పూజ్యులుగా ఉండేవారు. మానవాళికి చెందిన పూజ్యులందరూ దేవీ-దేవతలు. ఇదంతా ఈశ్వరుని ఫ్యామిలీ. ఈశ్వరుడు రచయిత. నీవే తల్లివి-తండ్రివి, మేము నీ పిల్లలము అని పాడుతారు... అంటే ఫ్యామిలీ అయినట్లు కదా. అచ్ఛా, మీరు తల్లి-తండ్రి అని ఎవరిని అంటున్నారో చెప్పండి? ఇలా ఎవరంటున్నారు? ఆత్మ అంటుంది - నీవే తల్లివి-తండ్రివి... నీ కృపతో మాకు స్వర్గము యొక్క అపారమైన సుఖము స్వర్గములో లభించింది, తల్లి-తండ్రి అయిన మీరు వచ్చి స్వర్గ స్థాపనను చేస్తారు, అప్పుడు, మేము మీ పిల్లలుగా అవుతాము. తండ్రి అంటారు - నేను సంగమములోనే వచ్చి కొత్త ప్రపంచము కోసం రాజయోగాన్ని నేర్పిస్తాను. మనుష్యుల బుద్ధి పూర్తిగా భ్రష్టమైపోయింది. స్వర్గాన్ని నరకమని భావిస్తున్నారు. అక్కడ కూడా కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశిపుడు మొదలైనవారు ఉండేవారని అంటారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు - మీరు మర్చిపోయారా ఏమిటి, నా శివజయంతిని కూడా మీరు భారత్ లోనే జరుపుకుంటారు. శివరాత్రి అని కూడా అంటూ ఉంటారు. ఇది ఏ రాత్రి? ఇది బ్రహ్మా యొక్క అనంతమైన రాత్రి. తండ్రి సంగమములో వచ్చి రాత్రి నుండి పగలుగా అనగా నరకము నుండి స్వర్గముగా తయారుచేస్తారు. శివరాత్రి యొక్క అర్థం కూడా ఎవరికీ తెలియదు. భగవంతుడు నిరాకారుడు. మనుష్యులకైతే ప్రతి జన్మలోనూ శరీరాల పేర్లు మారిపోతాయి. పరమాత్మ అంటారు - నాకు శరీరానికి సంబంధించిన పేరు ఏదీ లేదు. నా పేరు శివయే. నేను కేవలం వృద్ధ వానప్రస్థ శరీరాన్ని ఆధారముగా తీసుకుంటాను. ఇతను పూజ్యునిగా ఉండేవారు, ఇప్పుడు పూజారిగా అయ్యారు. శివబాబా వచ్చి స్వర్గాన్ని రచిస్తారు, మనము వారి పిల్లలము కావున తప్పకుండా మనము స్వర్గానికి యజమానులుగా అవ్వాలి కదా. శివబాబా ఉన్నతోన్నతమైనవారు. బ్రహ్మా-విష్ణు-శంకరులకు తమ-తమ పాత్ర ఉంది. ప్రతి ఆత్మలోనూ తన సుఖ-దుఃఖాల పాత్ర నిశ్చితమై ఉంది. మనము శివబాబాకు వారసులుగా అయ్యామని మీకు తెలుసు. శివబాబా స్వర్గవాసులుగా చేసారు, అందుకే వారిని అందరూ స్మృతి చేస్తారు. ఓ గాడ్, దయ చూపించండి అని అంటారు. సాధువులు కూడా సాధన చేస్తారు, ఎందుకంటే ఇక్కడ దుఃఖము ఉంది కావున వారు నిర్వాణధామానికి వెళ్ళాలని కోరుకుంటారు. ఆత్మ పరమాత్మలో లీనమైపోతుందని మరియు ఆత్మనైన నేనే పరమాత్మను అని భావించడము తప్పు. ఇప్పుడు మీరు అంటారు - ఆత్మలమైన మేము పరంధామములో ఉండేవారము, తర్వాత దేవతా కులములోకి వస్తాము, ఆ తర్వాత 84 జన్మలను తీసుకుంటాము. ఆత్మలమైన మనము వర్ణాలలోకి వస్తాము. శివబాబా జనన-మరణాలలోకి రారు. అక్కడ కేవలం నారాయణుని వంశము ఉండేది. ఎలాగైతే క్రిస్టియన్ వంశములో ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకెండ్, థర్డ్ అని కొనసాగుతుందో, అలాగే అక్కడ కూడా లక్ష్మీ-నారాయణ ది ఫస్ట్, లక్ష్మీ-నారాయణ ది సెకెండ్, థర్డ్, అలా 8 వంశాలు కొనసాగుతాయి. ఇప్పుడు బ్రాహ్మణులైన మీ మూడవ నేత్రము తెరుచుకుంది. తండ్రి కూర్చుని ఆత్మలతో మాట్లాడుతారు. మీరు ఈ విధముగా 84 జన్మల చక్రములో తిరిగి ఇన్ని-ఇన్ని జన్మలు తీసుకుంటూ వచ్చారు. వర్ణాల చిత్రాన్ని కూడా ఒకటి తయారుచేస్తారు, అందులో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణులను చూపిస్తారు. బ్రాహ్మణులమైన మనము పిలక వంటి వారము అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ సమయములో మనము ప్రాక్టికల్ గా ఈశ్వరీయ సంతానము. ఈ సహజ రాజయోగము మరియు జ్ఞానము ద్వారా మనకు అపారమైన సుఖము లభిస్తుంది. కొందరు సూర్యవంశ రాజధాని వారసత్వాన్ని తీసుకుంటారు, కొందరు చంద్రవంశ రాజధాని వారసత్వాన్ని తీసుకుంటారు. మొత్తము రాజధాని అంతా స్థాపనవుతుంది. ప్రతి ఒక్కరూ తమ-తమ పురుషార్థము ద్వారా ఆ పదవిని పొందుతారు. ఇప్పుడు ఒకవేళ చదువుతూ-చదువుతూ మేము శరీరాన్ని వదిలితే అప్పుడు మాకు ఏ పదవి లభిస్తుందని ఎవరైనా అడిగితే, బాబా చెప్పగలరు. యోగముతోనే ఆయుష్షు పెరుగుతుంది, వికర్మలు వినాశనమవుతాయి. పతితుల నుండి పావనముగా తయారయ్యేందుకు వేరే ఏ ఉపాయము లేదు. పతిత-పావనా అని అనడముతోనే భగవంతుడు గుర్తుకువస్తారు. కానీ భగవంతుడు ఎవరు? ఇది తెలియదు. తండ్రి అంటారు, నేను భారత్ లోనే వస్తాను, ఇది నా జన్మ స్థలము. సోమనాథ మందిరము ఎంత వైభవోపేతముగా ఉంది అనేది తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. భక్తి మార్గములో స్మృతిచిహ్నాలు తయారవ్వడము ప్రారంభమవుతుంది. పూజారులుగా అయినప్పుడు మొట్టమొదట సోమనాథ మందిరాన్ని తయారుచేస్తారు. భారత్ అయితే సత్య, త్రేతాయుగాలలో చాలా షావుకారుగా ఉండేది. మందిరాలలో కూడా అపారమైన ధనము ఉండేది. భారత్ వజ్ర సమానముగా ఉండేది. ఇప్పుడైతే భారత్ నిరుపేదగా, గవ్వ సమానముగా ఉంది. మళ్ళీ తండ్రి వచ్చి భారత్ నే వజ్ర సమానముగా తయారుచేస్తారు. రచయిత ఎవరు అని ఎవరినైనా అడగండి. పరమాత్మ అని అంటారు. వారు ఎక్కడ ఉన్నారు అని అడిగితే, వారు సర్వవ్యాపి అని అంటారు. తండ్రి అంటారు, ఈ వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది.

మేము బాబా, మమ్మా యొక్క సింహాసనాధికారులుగా అయ్యేందుకు యోగ్యులుగా అయ్యామా అని స్వయాన్ని చూసుకోవడము జరుగుతుంది. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. పవిత్రత ముఖ్యమైనది. ఇప్పుడైతే ఆరోగ్యము లేదు, ఐశ్వర్యము లేదు, సంతోషము లేదు. ఇది ఎండమావులలోని నీటి వంటి రాజ్యము. దీని ఆధారముగా దుర్యోధనుడి కథ శాస్త్రాలలో వ్రాయబడి ఉంది. దుర్యోధనుడు అని వికారులను అంటారు. నా గౌరవాన్ని కాపాడండి అని ద్రౌపది అంటుంది. అందరూ ద్రౌపదులే కదా. ఈ కుమార్తెలు స్వర్గానికి ద్వారాలు. బాబా ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఎవరి బుద్ధి యోగమైతే పూర్తిగా జోడించబడి ఉంటుందో, వారికి ధారణ కూడా జరుగుతుంది. జ్ఞానాన్ని బ్రహ్మచర్యములోనే చదువుకోవడము జరుగుతుంది. తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా ఉండాలి. రెండు వైపులా సంబంధము నిర్వర్తించాలి. తప్పకుండా మరణించాలి కూడా. మరణించే సమయములో మనుష్యులకు మంత్రాన్ని ఇస్తారు. తండ్రి అంటారు, మీరంతా మరణించనున్నారు. నేను కాలుడికే కాలుడిని, అందరినీ తిరిగి తీసుకువెళ్ళేవాడిని. కావున సంతోషముండాలి కదా. ఎవరైతే బాగా చదువుకుంటారో, వారు స్వర్గానికి యజమానులుగా అవుతారు. చదువుకోకపోతే ప్రజా పదవిని పొందుతారు. ఇక్కడికి మీరు రాజ్య పదవిని పొందేందుకు వచ్చారు. ఇది చదువు, ఇందులో అంధ విశ్వాసము అన్న మాటే లేదు. ఈ చదువు రాజ్యాధికారము కోసమే ఉంది. ఒకవేళ చదువులో బ్యారిస్టర్ అవ్వాలనే లక్ష్యము ఉన్నట్లయితే, తప్పకుండా చదువు చెప్పే టీచరుతో యోగము జోడించవలసి ఉంటుంది. ఇక్కడ మీకు భగవంతుడు చదివిస్తారు కావున వారితో యోగము జోడించాలి. తండ్రి అంటారు, నేను పరంధామము నుండి, చాలా దూరము నుండి వస్తాను. పరంధామము ఎంత ఉన్నతమైనది. అది సూక్ష్మవతనము కన్నా ఉన్నతమైనది. అక్కడ నుండి రావడానికి నాకు ఒక్క క్షణము పడుతుంది. వారికన్నా వేగవంతమైనది ఇంకేదీ ఉండదు. క్షణములో జీవన్ముక్తిని ఇస్తాను. జనకుని ఉదాహరణ ఉంది కదా. ఇప్పుడు ఇది నరకము, పాత ప్రపంచము. కొత్త ప్రపంచమని స్వర్గాన్ని అంటారు. తండ్రి నరకాన్ని వినాశనము చేయించి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఆత్మ అవినాశీ. ఆత్మకు పాత్ర కూడా అవినాశీ అయినదే లభించింది. అటువంటప్పుడు, ఆత్మ చిన్నదిగా, పెద్దదిగా ఎలా అవ్వగలదు లేదా కాలిపోయి ఎలా మరణించగలదు? అది ఉన్నదే ఒక నక్షత్రము వలె. చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు. ఇప్పుడు మీరు గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్. గాడ్ ఫాదర్ జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు. వారు మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారా మనమే మళ్ళీ దేవీ-దేవతలుగా అవుతామని మీకు తెలుసు. మీరు భారత్ యొక్క సేవను చేస్తున్నారు. మొట్టమొదటైతే తండ్రికి చెందినవారిగా అవ్వాలి, వేరే చోట్ల అయితే గురువుల వద్దకు వెళ్తారు, వారికి చెందినవారిగా అవుతారు అనగా వారిని తమ గురువులుగా చేసుకుంటారు. ఇక్కడ ఉన్నది తండ్రి, కావున ముందు తండ్రికి బిడ్డగా అవ్వాల్సి ఉంటుంది. తండ్రి పిల్లలకు తన ఆస్తిని ఇస్తారు. తండ్రి అంటారు - పిల్లలూ, మీరు ఎక్స్ చేంజ్ చేసుకోండి. మీకు పనికిరానిదంతా నాకు. నాదంతా మీకు. దేహ సహితముగా మీ వద్ద ఉన్నదంతా నాకు ఇవ్వండి. నేను మీ ఆత్మను, శరీరాన్ని, రెండింటినీ పవిత్రముగా తయారుచేస్తాను మరియు రాజ్య పదవిని కూడా ఇస్తాను. మీ వద్ద ఉన్నదంతా బలి ఇచ్చినట్లయితే, జీవన్ముక్తి లభిస్తుంది. బాబా, ఇదంతా మీది. బాబా అంటారు - మీరు నన్ను వారసునిగా చేసుకోండి, నేను 21 జన్మల కొరకు మిమ్మల్ని వారసులుగా చేసుకుంటాను. కేవలం నా మతముపై నడుచుకోండి. వ్యాపారము మొదలైనవి చేసుకోండి, విదేశాలకు వెళ్ళండి, ఏమైనా చేయండి, కేవలం నా మతముపై నడుచుకోండి. జాగ్రత్తగా ఉండండి, మాయ పదే-పదే కింద పడేస్తుంది. ఎటువంటి వికర్మలు చేయకూడదు. శ్రీమతాన్ని అనుసరించినట్లయితే శ్రేష్ఠముగా అవుతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మను మరియు శరీరాన్ని, రెండింటినీ పావనముగా తయారుచేసుకునేందుకు దేహ సహితముగా మీ వద్ద ఏదైతే ఉందో, దానిని తండ్రికి అర్పణ చేసి వారి శ్రీమతాన్ని అనుసరించాలి.

2. మాత-పితల యొక్క సింహాసనాధికారులుగా అయ్యేందుకు స్వయాన్ని యోగ్యులుగా తయారుచేసుకోవాలి. యోగ్యులుగా తయారయ్యేందుకు ముఖ్యముగా పవిత్రతను ధారణ చేయాలి.

వరదానము:-
సంగమయుగములో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసే డబుల్ ప్రాప్తి యొక్క అధికారీ భవ

ఏ పిల్లలైతే సంగమయుగములో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తారో, వారికి సదా శాంతి మరియు సంతోషపు డబుల్ ప్రాప్తి యొక్క నషా ఉంటుంది, ఎందుకంటే అతీంద్రియ సుఖములో ఈ రెండు ప్రాప్తులు ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా మరియు వారసత్వము యొక్క ప్రాప్తి ఏదైతే లభిస్తుందో, అది మొత్తము కల్పమంతటిలో ఇంకెప్పుడూ లభించదు. ఈ సమయపు ప్రాప్తి అయిన అతీంద్రియ సుఖము మరియు జ్ఞానము ఇంకెప్పుడూ లభించవు. అందుకే ఈ డబుల్ ప్రాప్తి యొక్క అధికారులుగా అవ్వండి.

స్లోగన్:-
ఇతరుల సంస్కారాలను తెలుసుకుంటూ వారితో కలిసి నడుచుకోవడమే ఉన్నతికి సాధనము.

మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు - ‘‘సత్యమైన చక్రవర్తి అయిన పరమాత్మతో సత్యముగా ఉండండి’’

ఈ సమయములో మనకు తండ్రి అయిన పరమాత్మ ద్వారా - నిరంతరము నా స్మృతిలో ఉండండి అన్న ఆజ్ఞ లభించింది. యోగమంటే అర్థం - ఈశ్వరీయ స్మృతిలో ఉండటము, అంతేకానీ యోగమంటే ధ్యానము అనేమీ కాదు. మన ఈ సహజ యోగములో నడుస్తూ-తిరుగుతూ, కార్య-వ్యవహారాలు చేస్తూ వారి స్మృతిలో ఉంటాము, దీనినే ఎడతెగని అఖండ యోగమని అంటారు, కానీ నిరంతరము యోగములో ఉండే అభ్యాసము అవసరము. ఒకవేళ వారి ఆజ్ఞ పట్ల ఆజ్ఞాకారులుగా లేకపోతే, ఏదైనా ఆజ్ఞను ఉల్లంఘిస్తే, తప్పకుండా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. వారి ఆజ్ఞ ఏమిటంటే - నేను ఏ కర్మలనైతే చేస్తానో, నన్ను చూసి మీరు కూడా అడుగు వేయండి, లేదంటే మాయ దెబ్బ తింటారు. సత్యమైన చక్రవర్తితో సత్యముగా ఉండండి, మాయ విఘ్నాలు ఏవైనా సతాయించినా, వాటిని కూడా వీరి ముందు పెట్టాలి, అప్పుడు వీరి సహాయముతో మాయ పక్కకు వెళ్ళిపోతుంది, మార్గము స్పష్టమవుతుంది, అప్పుడు వారు ఎక్కడ కూర్చోబెట్టినా, ఎలా నడిపించినా, ఏది తినిపించినా, ఆ మార్గము స్పష్టమవుతుంది. ఈ విధముగా తోడును నిర్వర్తించేందుకు చాలా ధైర్యము కావాలి. ఇటువంటి మహాన్ సౌభాగ్యశాలురు చాలా కొద్దిమందే వెలువడుతారు, వారు విజయమాలలోకి వెళ్తారు. మిగతావారు ఎవరైతే ఎంతోకొంత తీసుకుని వెళ్ళి ప్రజలుగా అవుతారో, వారు భాగ్యశాలురు. అందుకే కొద్దిగా లభించడముతోనే సంతోషపడిపోకండి. మన కోరికైతే సంపూర్ణమవ్వాలి, ధైర్యము ఉంచండి, ముందుకు వెళ్ళాలి. మాయ విఘ్నాలను కలిగిస్తుంది కానీ దానిపై విజయము పొందాలి. ఇందులో ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినట్లయితే, నిశ్చయము లోపించినట్లు, తమ ధారణలో ఏదో లోపించినట్లు. ఇది మీ పొరపాటు, ఇక్కడ లోక-మర్యాదలను, కుల-మర్యాదలను తెంచాల్సి ఉంటుంది, వీటిని తెంచినప్పుడే సత్యమైన పారలౌకిక దైవీ మర్యాదలను పొందుతారు. ఈ వికారీ ప్రపంచమైతే వెళ్ళిపోనున్నది. చూడండి, మీరా కూడా లోకమర్యాదలను విడిచినప్పుడే గిరిధరుడిని పొందారు. ఒకవేళ ఆ లోకమర్యాదలను పట్టుకున్నట్లయితే, ఈ దైవీ ప్రపంచ సభ్యునిగా అవ్వలేరు. ఇప్పుడు, కళ్యాణార్థము ఈశ్వరీయ సలహా ఇవ్వడము జరుగుతుంది, మరి - ఇప్పుడు ఏమి చేయాలి, ఏది సరైనది అనేది మీ బుద్ధితో నిర్ణయించుకోవాలి.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

ఎవరైతే సరళచిత్తులుగా ఉంటారో, వారే సదా హర్షితముగా ఉంటారు. హర్షితచిత్తులుగా ఉంటే అందరినీ ఆకర్షిస్తారు. హర్షితము అంటేనే అర్థం అతీంద్రియ సుఖములో ఊగటము. జ్ఞానాన్ని స్మరణ చేస్తూ, అవ్యక్త స్థితిని అనుభవము చేస్తూ అతీంద్రియ సుఖములో ఊగటము, దీనినే హర్షితము అని అంటారు. దీని కొరకు సాక్షీతనపు సీట్ పై సెట్ అయ్యి మాయ మరియు ప్రకృతి యొక్క తోలుబొమ్మలాటను మనోరంజనము రూపములో చూడండి.