08-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ ఈ జీవితము చాలా చాలా అమూల్యమైనది, ఎందుకంటే మీరు శ్రీమతముపై విశ్వసేవను చేస్తారు, ఈ నరకాన్ని స్వర్గముగా చేస్తారు’’

ప్రశ్న:-
సంతోషము మాయమయ్యేందుకు కారణము మరియు దానికి నివారణ ఏమిటి?

జవాబు:-
1. దేహాభిమానములోకి రావడము కారణముగా సంతోషము మాయమైపోతుంది, 2. అలాగే మనసులో ఎప్పుడైనా ఏదైనా సంశయము ఉత్పన్నమైనా కూడా సంతోషము మాయమైపోతుంది, అందుకే బాబా సలహా ఇస్తున్నారు - ఎప్పుడైనా ఏదైనా సంశయము ఉత్పన్నమైతే వెంటనే బాబాను అడగండి. దేహీ-అభిమానులుగా ఉండే అభ్యాసము చేసినట్లయితే సదా సంతోషముగా ఉంటారు.

ఓంశాంతి
ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు, వారి భగవానువాచ పిల్లల ఎదురుగా జరుగుతుంది. నేను మిమ్మల్ని ఉన్నతోన్నతముగా తయారుచేస్తాను కావున పిల్లలైన మీకు ఎంతటి సంతోషము ఉండాలి. బాబా మమ్మల్ని మొత్తం విశ్వానికి అధిపతులుగా తయారుచేస్తారు అని మీరు భావిస్తారు కూడా. పరమపిత పరమాత్మ ఉన్నతోన్నతమైనవారు అని మనుష్యులు అంటారు. నేను అయితే విశ్వాధిపతిగా అవ్వను అని తండ్రి స్వయంగా అంటారు. భగవానువాచ ఏమిటంటే - మనుష్యులు నన్ను ఉన్నతోన్నతుడైన భగవంతుడు అని అంటారు మరియు నేను నా పిల్లలే ఉన్నతోన్నతులు అని అంటాను. ఇది నిరూపించి చెప్తారు. పురుషార్థము కూడా డ్రామానుసారముగా కల్పపూర్వము వలె చేయిస్తారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. ఏదైనా విషయము అర్థం కాకపోతే అడగండి. మనుష్యులకైతే ఏమీ తెలియదు. ప్రపంచమేమిటి, వైకుంఠమేమిటి ఏమీ తెలియదు. ఎంతమంది నవాబులు, మొగలులు మొదలైనవారు వచ్చి వెళ్ళినా సరే, అమెరికాలో ఎంతమంది ధనవంతులు ఉన్నా కానీ ఎవరూ ఈ లక్ష్మీ-నారాయణుల్లా అయితే ఉండరు. వారైతే వైట్ హౌస్ మొదలైనవి నిర్మిస్తారు, కానీ అక్కడైతే రత్నజడితమైన గోల్డెన్ హౌస్ తయారవుతుంది. దానిని సుఖధామము అని అంటారు. మీకే హీరో హీరోయిన్ల పాత్ర ఉంది. మీరు వజ్రాలుగా అవుతారు. స్వర్ణయుగము ఉండేది. ఇప్పుడు ఇది ఇనుపయుగము. తండ్రి అంటారు, మీరు ఎంత భాగ్యశాలులు. భగవంతుడు స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు కావున మీరు ఎంత సంతోషముగా ఉండాలి. మీ ఈ చదువు కొత్త ప్రపంచము కొరకే. మీ ఈ జీవితము చాలా అమూల్యమైనది ఎందుకంటే మీరు విశ్వసేవ చేస్తారు. తండ్రిని పిలవడమే - మీరు వచ్చి నరకాన్ని స్వర్గముగా తయారుచేయండి అని పిలుస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు కదా. తండ్రి అంటారు - మీరు స్వర్గములో ఉండేవారు కదా, ఇప్పుడు నరకములో ఉన్నారు, మళ్ళీ స్వర్గములో ఉంటారు. నరకము ప్రారంభమైతే ఇక స్వర్గము యొక్క విషయాలన్నింటినీ మర్చిపోతారు. ఇది మళ్ళీ జరుగుతుంది. మళ్ళీ మీరు స్వర్ణయుగము నుండి ఇనుపయుగములోకి తప్పకుండా రావాలి. బాబా పదే-పదే పిల్లలకు చెప్తుంటారు - హృదయములో ఎటువంటి సంశయము ఉన్నా, దాని కారణముగా మీకు సంతోషము ఉండకపోతుంటే, దాని గురించి చెప్పండి. తండ్రి కూర్చుని చదివిస్తున్నారు కావున చదువుకోవాలి కూడా కదా. సంతోషము ఉండదు, ఎందుకంటే మీరు దేహాభిమానములోకి వచ్చేస్తారు. సంతోషమైతే ఉండాలి కదా. తండ్రి అయితే కేవలం బ్రహ్మాండానికే అధిపతి, మీరైతే విశ్వానికి కూడా అధిపతులుగా అవుతారు. తండ్రిని రచయిత అని అన్నా కానీ ప్రళయం జరిగి మళ్ళీ కొత్త ప్రపంచాన్ని రచిస్తారు అని కాదు. అలా కాదు. తండ్రి అంటారు, నేను కేవలం పాతదానిని కొత్తగా తయారుచేస్తాను. పాత ప్రపంచాన్ని వినాశనం చేయిస్తాను. మిమ్మల్ని కొత్త ప్రపంచానికి అధిపతులుగా తయారుచేస్తాను. నేను ఏమీ చేయను. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. పతిత ప్రపంచములోకే నన్ను పిలుస్తారు. నేను పారసనాథులుగా తయారుచేస్తాను. కావున పిల్లలు స్వయం పారసపురిలోకి వస్తారు. అక్కడ నన్ను ఎప్పుడూ పిలవరు. బాబా, పారసపురిలోకి వచ్చి కాస్త చూసి వెళ్ళండి అని ఎప్పుడైనా పిలుస్తారా? పిలవనే పిలవరు. దుఃఖములో అందరూ తలచుకుంటారు అన్న గాయనము కూడా ఉంది, అలా పతిత ప్రపంచములోనే తలచుకుంటారు, సుఖములో ఎవరూ తలచుకోరు. సుఖములో తలచుకోరు కూడా, అలాగే పిలవరు కూడా. కేవలం ద్వాపరములో మందిరాలను నిర్మించి వాటిలో నన్ను ఉంచుతారు. పూజించేందుకు రాయితో కాకపోతే వజ్రముతో లింగాన్ని తయారుచేస్తారు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. బాగా చెవులు తెరుచుకుని వినాలి. చెవులను కూడా శుద్ధము చేసుకోవాలి. పవిత్రతయే ముఖ్యమైనది. పులి పాలు బంగారు పాత్రలోనే నిలవగలవు అని అంటారు. ఇక్కడ కూడా పవిత్రత ఉంటేనే ధారణ జరుగుతుంది. తండ్రి అంటారు, కామము మహాశత్రువు, దానిపై విజయాన్ని పొందాలి. ఇది మీ అంతిమ జన్మ. ఇది కూడా మీకు తెలుసు. ఇది ఆ మహాభారత యుద్ధమే. కల్ప-కల్పమూ ఏ విధంగా వినాశనము జరిగిందో అలాగే ఖచ్చితముగా ఇప్పుడు కూడా జరుగుతుంది, డ్రామా అనుసారముగా జరుగుతుంది.

పిల్లలైన మీరు స్వర్గములో మళ్ళీ మీ మహళ్ళను తయారుచేసుకోవాలి. కల్పపూర్వము తయారుచేసుకున్నట్లుగా చేసుకోవాలి. స్వర్గాన్ని ప్యారడైజ్ అనే అంటారు. పురాణాల నుండి ప్యారడైజ్ అన్న పదము వెలువడింది. ఏమంటారంటే - మానస సరోవరములో దేవకన్యలు ఉండేవారు, అందులో ఎవరైనా మునక వేస్తే వారూ దేవకన్యలుగా అయిపోతారు అని అంటారు. వాస్తవానికి ఇది జ్ఞాన మానస సరోవరము. దీని ద్వారా మీరు ఎలా ఉన్నవారు ఎలా అయిపోతారు. శోభనీయముగా ఉండేవారిని దేవకన్యలు అని అంటారు, అంతేకానీ రెక్కలు ఉండే దేవకన్యలు ఎవరూ ఉండరు. ఉదాహరణకు పాండవులైన మిమ్మల్ని మహావీరులు అని అంటారు, దానికి వారు పాండవులవి చాలా పెద్ద-పెద్ద చిత్రాలను, గుహలు మొదలైనవాటిని చూపించారు. భక్తి మార్గములో ఎంత ధనాన్ని వ్యర్థం చేస్తారు. తండ్రి అంటారు, నేను అయితే పిల్లలను ఎంత షావుకార్లుగా తయారుచేసాను. మీరు అంతటి ధనమంతటినీ ఏం చేసారు. భారత్ ఎంత షావుకారుగా ఉండేది. ఇప్పుడు భారత్ పరిస్థితి ఎలా ఉంది. ఎవరైతే 100 శాతం సుసంపన్నులుగా ఉండేవారో, వారు ఇప్పుడు 100 శాతం దివాలా అయిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతగా ఏర్పాట్లు చేసుకోవాలి. చిన్న పిల్లలు మొదలైనవారికి కూడా ఏమని అర్థం చేయించాలంటే - మీరు శివబాబాను స్మృతి చేసినట్లయితే శ్రీకృష్ణుని వలె అవుతారు అని. పిల్లలైన మీకు ఎంతటి సంతోషము ఉండాలి, కానీ అపారమైన సంతోషము ఎవరికి కలుగుతుందంటే, ఎవరైతే సదా ఇతరుల సేవలో ఉంటారో వారికి. ముఖ్యమైన ధారణ ఏమిటంటే, నడవడిక చాలా చాలా రాయల్ గా ఉండాలి. అన్నపానాదులు చాలా సుందరముగా ఉండాలి. పిల్లలైన మీ వద్దకు ఎవరైనా వచ్చినప్పుడు వారికి అన్ని రకాలుగానూ సేవ చేయాలి. స్థూలముగా కూడా మరియు సూక్ష్మముగా కూడా. దైహికముగా మరియు ఆత్మికముగా, రెండు విధాలుగా చేయడం ద్వారా ఎంతో సంతోషము ఉంటుంది. ఎవరైనా వస్తే వారికి మీరు సత్యమైన సత్యనారాయణుని కథను వినిపించండి. శాస్త్రాలలోనైతే ఏమేమి కథలను వ్రాసేసారు. విష్ణు నాభి నుండి బ్రహ్మా వెలువడినట్లుగా చూపించారు, మళ్ళీ బ్రహ్మా చేతిలో శాస్త్రాలను చూపించారు. ఇప్పుడు విష్ణు నాభి నుండి బ్రహ్మా ఎలా వెలువడుతారు, ఇది ఎంత గొప్ప రహస్యము. ఇంకెవ్వరూ ఈ విషయాలను ఏమీ అర్థం చేసుకోలేరు. నాభి నుండి వెలువడే విషయమే లేదు. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా అవుతారు. బ్రహ్మా విష్ణువుగా అవ్వడములో క్షణము పడుతుంది. క్షణములో జీవన్ముక్తి అని అంటారు. మీరు విష్ణువు రూపముగా అవుతారు అని తండ్రి సాక్షాత్కరింపజేసారు, దానితో క్షణములో నిశ్చయము ఏర్పడింది. వినాశన సాక్షాత్కారము కూడా జరిగింది. లేదంటే వాస్తవానికి కలకత్తాలో రాజరికము వంటి ఆర్భాటముతో ఉండేవారు, ఏ కష్టము ఉండేది కాదు. చాలా రాయల్టీతో ఉండేవారు. ఇప్పుడు తండ్రి మీకు ఈ జ్ఞాన రత్నాల వ్యాపారాన్ని నేర్పిస్తారు. ఆ వ్యాపారమైతే దీని ముందు అసలేమీ కాదు. కానీ వీరి పాత్రకు మరియు మీ పాత్రకు తేడా ఉంది. బాబా వీరిలోకి ప్రవేశించారు మరియు వీరు వెంటనే అన్నీ వదిలేసారు. భట్టీ జరగవలసి ఉంది. మీరు కూడా అన్నీ వదిలేసారు. నదిని దాటి వచ్చి భట్టీలో కూర్చున్నారు. ఏమేమి జరిగింది, కానీ ఎవరినీ లెక్కచేయలేదు. శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయారు అని అంటారు! ఎందుకు ఎత్తుకుపోయారు? వారిని పట్టపురాణిగా చేసుకునేందుకే. ఈ భట్టి కూడా పిల్లలైన మిమ్మల్ని స్వర్గ మహారాణులుగా తయారుచేసేందుకే తయారైంది. శాస్త్రాలలోనైతే ఏమేమో వ్రాసేసారు. కానీ ప్రాక్టికల్ గా ఏమేమి జరుగుతుంది అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఎత్తుకుపోయే విషయమేమీ లేదు. కల్పపూర్వము కూడా ఇలా నిందలు మోపారు, పేరు అప్రతిష్టపాలైంది. ఇదంతా డ్రామా. ఏదైతే జరుగుతుందో అది కల్పపూర్వము వలె జరుగుతుంది.

కల్పపూర్వము ఎవరైతే రాజ్యము తీసుకున్నారో వారు తప్పకుండా వస్తారని ఇప్పుడు మీకు బాగా తెలుసు. తండ్రి అంటారు, నేను కూడా కల్ప-కల్పమూ వచ్చి భారత్ ను స్వర్గముగా తయారుచేస్తాను. పూర్తి 84 జన్మల లెక్కను తెలియజేసారు. సత్యయుగములో మీరు అమరులుగా ఉంటారు. అక్కడ అకాలమృత్యువులు ఉండవు. శివబాబా మృత్యువుపై విజయాన్ని ప్రాప్తింపజేస్తారు. నేను కాలుడికే కాలుడిని అని అంటారు. కథలు కూడా ఉన్నాయి కదా. మీరు కాలుడిపై విజయాన్ని పొందుతారు. మీరు అమరలోకములోకి వెళ్తారు. అమరలోకములో ఉన్నత పదవిని పొందేందుకు ఒకటేమో పవిత్రముగా అవ్వాలి, ఇంకొకటి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. రోజూ మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి. రావణుడి ద్వారా మీకు నష్టము కలిగింది. నా ద్వారా లాభము కలుగుతుంది. వ్యాపారస్తులు ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారు. ఇవి జ్ఞాన రత్నాలు. ఏ ఒక్కరో వీటితో వ్యాపారము చేస్తారు. మీరు వ్యాపారము చేయడానికి వచ్చారు. కొందరైతే బాగా వ్యాపారము చేసి స్వర్గ ప్రాప్తిని పొందుతారు, 21 జన్మల కొరకు పొందుతారు. 21 జన్మలు కూడా కాదు, 50-60 జన్మల వరకు మీరు ఎంతో సుఖముగా ఉంటారు, పదమపతులుగా అవుతారు. దేవతల పాదాలలో పద్మములను చూపిస్తారు కదా. దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. మీరు ఇప్పుడు పదమపతులుగా అవుతున్నారు. కావున మీకు ఎంతటి సంతోషము ఉండాలి. తండ్రి అంటారు, నేను ఎంత సాధారణముగా ఉన్నాను. నేను పిల్లలైన మిమ్మల్ని స్వర్గములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. ఓ పతిత-పావనా రండి, మీరు వచ్చి పావనముగా తయారుచేయండి అని పిలుస్తారు కూడా. పావనమైనవారు ఉండేదే సుఖధామములో. శాంతిధామము యొక్క చరిత్ర-భౌగోళికము ఏదీ ఉండజాలదు. అది ఆత్మల వృక్షము. సూక్ష్మవతనము యొక్క విషయమేదీ లేదు. ఇకపోతే ఈ సృష్టిచక్రము ఎలా తిరుగుతుందో, అది మీరు తెలుసుకున్నారు. సత్యయుగములో లక్ష్మీ-నారాయణుల వంశావళి ఉండేది. అంతేకానీ కేవలం ఒక్క లక్ష్మీ-నారాయణులే రాజ్యము చేస్తారని కాదు. వృద్ధి అయితే జరుగుతుంది కదా. మళ్ళీ ద్వాపరములో ఆ పూజ్యులే మళ్ళీ పూజారులుగా అవుతారు. ఏ విధంగా పరమాత్మను గురించి సర్వవ్యాపి అని అంటారో, అలా మనుష్యులు పరమాత్ముని గురించి - నీవే పూజ్యుడవు, నీవే పూజారివి అని అంటారు. ఈ విషయాలను మీరు అర్థం చేసుకుంటారు. అర్ధకల్పము మీరు - భగవంతుడు ఉన్నతోన్నతమైనవారు అని గానం చేస్తూ వచ్చారు మరియు ఇప్పుడు భగవానువాచ ఏముందంటే - పిల్లలే ఉన్నతోన్నతులు అని. మరి ఇటువంటి తండ్రి సలహాపై కూడా నడవాలి కదా. గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించాలి. అందరూ ఇక్కడైతే ఉండలేరు. అందరూ ఇక్కడే ఉన్నట్లయితే ఎంత పెద్ద ఇల్లును తయారుచేయవలసి ఉంటుంది. దర్శనము చేసుకునేందుకు కింద నుండి పై వరకు ఎంత పెద్ద క్యూ తయారవుతుంది అనేది కూడా ఒకరోజు మీరు చూస్తారు. ఎవరికైనా దర్శనము లభించకపోతే నిందించడం కూడా మొదలుపెడతారు. మహాత్మను దర్శనము చేసుకోవాలి అని భావిస్తారు. ఇప్పుడైతే తండ్రి పిల్లలకు చెందినవారే. వారు పిల్లలనే చదివిస్తారు. మీరు ఎవరికైతే దారిని చెప్తారో, అందులో కొందరు బాగా నడుచుకుంటారు, కొందరు ధారణ చేయలేకపోతారు, ఇంకా ఎంతోమంది వింటూ కూడా ఉంటారు కానీ మళ్ళీ బయటకు వెళ్ళాక ఇక్కడిది ఇక్కడే ఉండిపోతుంది. ఆ సంతోషము ఉండదు, చదువు ఉండదు, యోగము ఉండదు. చార్ట్ పెట్టండి అని బాబా ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. లేకపోతే ఎంతగానో పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. మేము బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాము అని చార్టులో చూసుకోవాలి. భారత్ యొక్క ప్రాచీన యోగానికి ఎంతో మహిమ ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఏదైనా విషయము అర్థం కాకపోతే తండ్రిని అడగండి. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. బాబా అంటారు, ఇది ముళ్ళ అడవి. కామము మహాశత్రువు. ఈ పదాలు డైరెక్టు గీతలోనివే. గీతను చదివేవారు కానీ అర్థం చేసుకునేవారు కాదు. బాబా వారి జీవితమంతా గీతను చదివారు. గీత మహత్వము, దానిలోని సందేశము చాలా గొప్పది అని భావించేవారు. భక్తి మార్గములో గీతకు ఎంత గౌరవము ఉంది. గీత పెద్దది కూడా ఉంటుంది, చిన్నది కూడా ఉంటుంది. శ్రీకృష్ణుడు మొదలైన దేవతల చిత్రాలు తక్కువ ధరకు కూడా లభిస్తూ ఉంటాయి, మళ్ళీ అవే చిత్రాలను పెట్టి ఎంత పెద్ద-పెద్ద మందిరాలను కూడా నిర్మిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరైతే విజయమాలలోని మణులుగా అవ్వాలి. ఇటువంటి మధురాతి మధురమైన బాబాను బాబా, బాబా అని కూడా అంటారు. వారు స్వర్గ రాజ్యాన్ని ఇస్తారు అని భావిస్తారు కూడా, అయినా ఆశ్చర్యము కలిగేలా వింటారు, వినిపిస్తారు, మళ్ళీ అహో మాయ, వదిలి వెళ్ళిపోతారు. బాబా అని అంటున్నారంటే మరి బాబా అంటే బాబానే. భక్తి మార్గములో కూడా - పతులకే పతి, గురువులకే గురువు ఒక్కరేనని గానం చేస్తూ ఉంటారు. వారు మన తండ్రి, జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు. పిల్లలైన మీరు అంటారు - బాబా, మేము కల్ప-కల్పము మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చాము, కల్ప-కల్పము కలుసుకుంటాము, అనంతమైన తండ్రియైన మీ నుండి మాకు తప్పకుండా అనంతమైన వారసత్వము లభిస్తుంది. ముఖ్యమైనవారు భగవంతుడు. వారిలో వారసత్వము కూడా ఇమిడి ఉంది. తండ్రి అంటేనే వారసత్వము. అది హద్దులోనిది, ఇది అనంతమైనది. హద్దులోని తండ్రులైతే లెక్కలేనంతమంది ఉన్నారు, అనంతమైన తండ్రి అయితే ఒక్కరే ఉన్నారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకున్న పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్థూల, సూక్ష్మ సేవలను చేసి అపారమైన సంతోషాన్ని అనుభవం చేసుకోవాలి మరియు చేయించాలి. నడవడిక మరియు అన్నపానాదులలో చాలా రాయల్టీని ఉంచుకోవాలి.

2. అమరలోకములో ఉన్నత పదవిని పొందేందుకు పవిత్రముగా అవ్వడముతోపాటుగా దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. తమ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి - మేము బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాము? అవినాశీ జ్ఞాన రత్నాల సంపాదనను జమ చేసుకుంటున్నామా? ధారణ జరిగేందుకు వీలుగా చెవులు శుద్ధముగా అయ్యాయా?

వరదానము:-
సేవ చేస్తూ స్మృతి యొక్క అనుభవాల రేస్ ను చేసే సదా లవలీన ఆత్మ భవ

స్మృతిలో ఉంటారు కానీ స్మృతి ద్వారా ఏ ప్రాప్తులైతే జరుగుతాయో, ఆ ప్రాప్తుల అనుభూతిని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి, దాని కొరకు ఇప్పుడు విశేషముగా సమయము కేటాయించండి మరియు అటెన్షన్ పెట్టండి, దాని ద్వారా వీరు అనుభవాల సాగరములో మైమరచిపోయి ఉన్న లవలీన ఆత్మ అన్నది తెలియాలి. ఏ విధంగా పవిత్రత మరియు శాంతితో కూడిన వాతావరణము యొక్క అనుభవమవుతుందో, అలా - వీరు శ్రేష్ఠ యోగి మరియు లగనములో నిమగ్నమై ఉన్నవారు అని అనుభవమవ్వాలి. జ్ఞానము యొక్క ప్రభావము ఉంది కానీ యోగము యొక్క సిద్ధి స్వరూపము అనుభవమవ్వాలి. సేవ చేస్తూ కూడా స్మృతి యొక్క అనుభవాలలో మునిగిపోయి ఉండండి, స్మృతి యాత్ర యొక్క అనుభవాల రేస్ ను చేయండి.

స్లోగన్:-
సిద్ధిని స్వీకరించడము అనగా భవిష్య ప్రారబ్ధాన్ని ఇక్కడే సమాప్తము చేయడము.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి

ఎంతెంతగా పిల్లలైన మీరు శ్రేష్ఠ సంకల్పాల శక్తితో సంపన్నముగా అవుతూ ఉంటారో, అంతగానే శ్రేష్ఠ సంకల్పాల శక్తిశాలి సేవ యొక్క స్వరూపము స్పష్టముగా కనిపిస్తుంది. మమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు, దివ్య బుద్ధి ద్వారా, శుభ సంకల్పాల ద్వారా పిలుపు వస్తుంది అని ప్రతి ఒక్కరూ అనుభవము చేస్తారు. కొందరేమో దివ్య దృష్టి ద్వారా బాబాను మరియు స్థానాన్ని చూస్తారు. ఈ రెండు రకాల అనుభవాల ద్వారా చాలా తీవ్రగతితో తమ శ్రేష్ఠమైన ఆశ్రయ స్థానానికి చేరుకుంటారు.