08-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు దేహీ-అభిమానులుగా అయినట్లయితే అన్ని రోగాలు సమాప్తమైపోతాయి మరియు మీరు డబల్ కిరీటధారులుగా, విశ్వానికి యజమానులుగా అవుతారు’’

ప్రశ్న:-
తండ్రి సమ్ముఖములో ఏ పిల్లలు కూర్చోవాలి?

జవాబు:-
ఎవరికైతే జ్ఞాన డాన్స్ చేయడము వస్తుందో వారు. జ్ఞాన డాన్స్ చేసే పిల్లలు ఎప్పుడైతే తండ్రి సమ్ముఖములో ఉంటారో, అప్పుడు బాబా మురళి కూడా అదే విధముగా నడుస్తుంది. ఒకవేళ ఎవరైనా ఎదురుగా కూర్చొని అటూ-ఇటూ చూస్తున్నట్లయితే ఈ బిడ్డ ఏమీ అర్థం చేసుకోవడము లేదని బాబా భావిస్తారు. బాబా బ్రాహ్మణీలను కూడా అడుగుతారు - మీరు ఎవరిని తీసుకువచ్చారు, వీరు బాబా ఎదురుగా కూడా ఆవలిస్తున్నారు. పిల్లలకైతే ఎటువంటి తండ్రి లభించారంటే, ఇక సంతోషముతో డాన్స్ చేయాలి.

పాట:-
దూరదేశ నివాసి...

ఓంశాంతి
మధురాతి-మధురమైన పిల్లలు పాట విన్నారు. దుఃఖహర్త, సుఖకర్త అని మరియు మీరే తల్లి-తండ్రి... మీరు మళ్ళీ వచ్చి మాకు అపారమైన సుఖాన్ని ఇవ్వండి, మేము దుఃఖితులుగా ఉన్నాము అని మనము ఆత్మిక తండ్రిని స్మృతి చేస్తూ వచ్చాము అని ఆత్మిక పిల్లలు భావిస్తారు. ఈ ప్రపంచమంతా దుఃఖమయముగా ఉంది ఎందుకంటే ఇది కలియుగీ పాత ప్రపంచము. పాత ప్రపంచము లేక పాత ఇంటిలో, కొత్త ప్రపంచము, కొత్త ఇంటిలో ఉన్నంత సుఖము ఉండదు. మనము విశ్వానికి యజమానులుగా, ఆది సనాతన దేవీ-దేవతలుగా ఉండేవారమని, మనమే 84 జన్మలు తీసుకున్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు - పిల్లలూ, మీరు ఎన్ని జన్మలు పాత్రను అభినయించారు అని మీకు మీ జన్మల గురించి తెలియదు. 84 లక్షల పునర్జన్మలు ఉంటాయని మనుష్యులు భావిస్తారు. ఒక్కొక్క పునర్జన్మ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది. 84 లక్షల జన్మల లెక్క ప్రకారమైతే సృష్టి చక్రము చాలా పెద్దది అయిపోతుంది. ఆత్మలైన మన తండ్రి మనల్ని చదివించడానికి వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. మనము కూడా దూరదేశ నివాసులము. మనమేమీ ఇక్కడి నివాసులము కాము. ఇక్కడకు మనము పాత్రను అభినయించడానికి వచ్చాము. తండ్రిని కూడా మనము పరంధామములో స్మృతి చేస్తాము. ఇప్పుడు ఈ పరాయి దేశములోకి వచ్చాము. శివుడిని బాబా (తండ్రి) అని అంటారు. రావణుడిని తండ్రి అని అనరు. భగవంతుడిని తండ్రి అని అంటారు. తండ్రి మహిమ వేరు, పంచ వికారాలకు ఎవరైనా మహిమ చేస్తారా ఏమిటి! దేహాభిమానము చాలా పెద్ద రోగము. మనము దేహీ-అభిమానులుగా అయినట్లయితే ఏ రోగము ఉండదు మరియు మనము విశ్వానికి యజమానులుగా అవుతాము. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. శివబాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. మనకు బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారని, రాజ్యము కోసం చదివిస్తారని ఇతర సత్సంగాలు మొదలైనవాటిలో ఎక్కడా ఈ విధముగా భావించరు. రాజుగా తయారుచేసేవారు రాజుగానే ఉంటారు కదా. సర్జన్ చదివించి తమ సమానముగా సర్జన్ గా తయారుచేస్తారు. అచ్ఛా, మనల్ని ద్వికిరీటధారులుగా తయారుచేసేందుకు, అలా తయారుచేసేవారు ఎక్కడ నుండి వస్తారు, అందుకే మనుష్యులు ద్వికిరీటాన్ని శ్రీకృష్ణుడికి చూపించారు. కానీ శ్రీకృష్ణుడు ఎలా చదివిస్తారు! తప్పకుండా తండ్రి సంగమములో వచ్చి ఉంటారు, వచ్చి రాజ్యాన్ని స్థాపన చేసి ఉంటారు. తండ్రి ఎలా వస్తారు, ఇది మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. దూరదేశము నుండి తండ్రి వచ్చి మనల్ని చదివిస్తున్నారు, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తండ్రి అంటారు, నాకు ఏ విధమైన లైట్ కిరీటము లేక రత్నజడిత కిరీటము లేదు. వారు రాజ్యాన్ని ఎప్పుడూ పొందరు. వారు ద్వికిరీటధారిగా అవ్వరు, వారు ఇతరులను తయారుచేస్తారు. తండ్రి అంటారు, ఒకవేళ నేను రాజుగా అయినట్లయితే మళ్ళీ నిరుపేదగా కూడా అవ్వవలసి ఉంటుంది. భారతవాసులు రాజులుగా ఉండేవారు, ఇప్పుడు నిరుపేదలుగా ఉన్నారు. మీరు కూడా ద్వికిరీటధారులుగా అవుతారు కనుక మిమ్మల్ని తయారుచేసేవారు కూడా ద్వికిరీటధారి అయి ఉండాలి, వారితో మీ యోగము కూడా జోడించబడాలి. ఎవరు ఎలా ఉంటే, అలా తమ సమానముగా తయారుచేస్తారు. సన్యాసులు ప్రయత్నము చేసి సన్యాసులను తయారుచేస్తారు. మీరు గృహస్థులు, వారు సన్యాసులు, కావున మీరు వారికి ఫాలోవర్స్ కారు. ఫలానా వ్యక్తి శివానందుని ఫాలోవర్ అని అంటారు. కానీ ఆ సన్యాసులు తలకు గుండు చేయించుకుంటారు, మీరైతే ఫాలో చేయడం లేదు! మరి మీరు స్వయాన్ని ఫాలోవర్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు! ఎవరైతే వెంటనే తమ వస్త్రాలను విడిచిపెట్టి కాషాయ వస్త్రాలను ధరిస్తారో, వారు ఫాలోవర్. మీరు గృహస్థములో వికారాలు మొదలైనవాటిలో ఉంటారు, అటువంటప్పుడు శివానందుని ఫాలోవర్స్ అని ఎలా చెప్పుకుంటారు. గురువు పని సద్గతి చేయడము. గురువు ఫలానావారిని స్మృతి చేయండి అనైతే చెప్పరు. అలా చెప్తే వారు స్వయం గురువు కానట్లు. ముక్తిధామానికి వెళ్ళడానికి కూడా యుక్తి కావాలి.

మీ ఇల్లు ముక్తిధామము లేక నిరాకారీ ప్రపంచము అని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఆత్మను నిరాకారీ సోల్ అని అంటారు. శరీరము పంచ తత్వాలతో తయారైనది. ఆత్మలు ఎక్కడ నుండి వస్తాయి? నిరాకారీ ప్రపంచమైన పరంధామము నుండి వస్తాయి. అక్కడ ఎన్నో ఆత్మలు ఉంటాయి. దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు. అక్కడ ఆత్మలు సుఖ-దుఃఖాలకు అతీతముగా ఉంటారు. దీనిని మంచి రీతిలో పక్కా చేసుకోవాలి. మనము స్వీట్ సైలెన్స్ హోమ్ లో నివసించేవారము. ఇక్కడ ఇది నాటకశాల, ఇక్కడకు మనము పాత్రను అభినయించడానికి వస్తాము. ఈ నాటకశాలలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైనవి లైట్లు. ఈ నాటకశాల ఎన్ని మైళ్ళ వరకు ఉంది అనేది ఎవ్వరూ లెక్క వేయలేరు. విమానములో పైకి వెళ్తారు కానీ ఎంతో దూరము వెళ్ళి తిరిగి వచ్చేందుకు కావలసినంత పెట్రోల్ మొదలైనవి వారు నింపలేరు. అంత దూరము వెళ్ళలేరు. ఇన్ని మైళ్ళ దూరము ఉందని, తిరిగి వెళ్ళకపోతే పడిపోతారని వారికి తెలుసు. సముద్రము మరియు ఆకాశ తత్వము యొక్క అంతాన్ని తెలుసుకోలేరు. ఇప్పుడు తండ్రి మీకు తన గురించి సంపూర్ణముగా తెలియజేస్తున్నారు. ఆత్మ ఈ ఆకాశ తత్వాన్ని దాటి వెళ్ళిపోతుంది. రాకెట్ ఎంత పెద్దగా ఉంటుంది. ఆత్మలైన మీరు పవిత్రముగా అయినప్పుడు రాకెట్ వలె ఎగరడం మొదలుపెడతారు. ఆత్మ ఎంత చిన్నని రాకెట్. సూర్య-చంద్రులను కూడా దాటి ఆ మూలవతనానికి వెళ్ళిపోతారు. సూర్య-చంద్రుల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు చాలా ప్రయత్నము చేస్తారు. దూరముగా ఉండే నక్షత్రాలు మొదలైనవి ఎంత చిన్నవిగా కనిపిస్తాయి. వాస్తవానికి అవి చాలా పెద్దవి. మీరు గాలిపటాలను ఎగరవేసినప్పుడు అవి పైకి వెళ్ళాక ఎంత చిన్నవిగా కనిపిస్తాయి. తండ్రి అంటారు, మీ ఆత్మ అయితే అన్నింటికన్నా వేగవంతమైనది. ఒక్క సెకెండ్ లో ఒక శరీరము నుండి బయటకు వచ్చి మరొక గర్భములోకి వెళ్ళి ప్రవేశిస్తుంది. ఎవరికైనా కర్మల లెక్కాచారాలు లండన్ లో ఉన్నట్లయితే సెకెండ్ లో లండన్ కు వెళ్ళి జన్మ తీసుకుంటారు. సెకెండ్ లో జీవన్ముక్తి అని కూడా అంటూ ఉంటారు కదా. బిడ్డ గర్భము నుండి బయటకు రాగానే యజమానిగా అవుతాడు, వారసుడిగా అయినట్లే. పిల్లలైన మీరు కూడా తండ్రిని తెలుసుకున్నారు అనగా విశ్వానికి యజమానులుగా అయ్యారు. అనంతమైన తండ్రియే వచ్చి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. స్కూల్లో బ్యారిస్టరీ చదివితే బ్యారిస్టర్ గా అవుతారు. ఇక్కడ మీరు ద్వికిరీటధారులుగా అయ్యేందుకు చదువుకుంటారు. ఒకవేళ పాస్ అయితే ద్వికిరీటధారులుగా తప్పకుండా అవుతారు. అయినా కూడా స్వర్గములోకైతే తప్పకుండా వస్తారు. తండ్రి అయితే సదా అక్కడే ఉంటారని మీకు తెలుసు. ఓ గాడ్ ఫాదర్ అని అన్నప్పుడు కూడా దృష్టి తప్పకుండా పైకి వెళ్తుంది. గాడ్ ఫాదర్ అని అన్నప్పుడు తప్పకుండా ఎంతోకొంత వారి పాత్ర ఉంటుంది కదా. ఇప్పుడు పాత్రను అభినయిస్తున్నారు. వారిని తోట యజమాని అని కూడా అంటారు. వారు వచ్చి ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేస్తారు. కనుక పిల్లలైన మీకు సంతోషము ఉండాలి. బాబా ఈ పరాయి దేశములోకి వచ్చారు. దూరదేశములో నివసించేవారు పరాయి దేశములోకి వచ్చారు. దూరదేశములో నివసించేది అయితే తండ్రియే. అలాగే ఆత్మలు కూడా అక్కడే నివసిస్తాయి. ఇక్కడకు మళ్ళీ పాత్రను అభినయించడానికి వస్తాయి. పరాయి దేశము యొక్క అర్థము ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు భక్తి మార్గములో ఏది వింటే, అదంతా సత్యము-సత్యము అని అంటూ ఉంటారు. పిల్లలైన మీకు తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఆత్మ అపవిత్రముగా అయినట్లయితే ఎగరలేదు. పవిత్రముగా అవ్వకుండా తిరిగి వెళ్ళలేదు. పతిత-పావనుడు అని ఒక్క తండ్రినే అంటారు. వారు రావడము కూడా సంగమములో రావాలి. మీకు ఎంత సంతోషము ఉండాలి. బాబా మనల్ని ద్వికిరీటధారులుగా తయారుచేస్తున్నారు, ఇంతకన్నా ఉన్నతమైన హోదా ఇంకెవ్వరికీ ఉండదు. తండ్రి అంటారు, నేను ద్వికిరీటధారిగా అవ్వను. నేను రావడము ఒక్కసారి మాత్రమే వస్తాను. పరాయి దేశములోకి, పరాయి శరీరములోకి వస్తాను. ఈ దాదా కూడా నేను శివుడిని కాను అని అంటారు. నన్ను లఖీరాజ్ అని అనేవారు, తర్వాత సరెండర్ అయ్యాక బాబా బ్రహ్మా అని పేరు పెట్టారు. వీరిలోకి ప్రవేశించి - నీకు నీ జన్మల గురించి తెలియదు అని వీరికి చెప్పాను. 84 జన్మల లెక్క కూడా ఉండాలి కదా. వారు 84 లక్షలని అంటారు, అది పూర్తిగా అసంభవము. 84 లక్షల జన్మల రహస్యాన్ని అర్థం చేయించాలంటే దానికే వందల సంవత్సరాలు పడుతుంది. అంతేకాక గుర్తు కూడా ఉండదు. 84 లక్షల యోనులలోనైతే పశు-పక్ష్యాదులు మొదలైనవన్నీ వస్తాయి. మనుష్య జన్మే అత్యంత అమూల్యమైనదని అంటూ ఉంటారు. జంతువులు జ్ఞానాన్ని అర్థం చేసుకోలేవు. మీకు తండ్రి వచ్చి జ్ఞానాన్ని చదివిస్తారు. వారు స్వయం అంటారు, నేను రావణ రాజ్యములో వస్తాను. మాయ మిమ్మల్ని ఎంతగా రాతి బుద్ధి కలవారిగా తయారుచేసింది. ఇప్పుడు తండ్రి మళ్ళీ మిమ్మల్ని పారసబుద్ధి కలవారిగా తయారుచేస్తారు. దిగేకళలో మీరు రాతిబుద్ధి కలవారిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి ఎక్కేకళలోకి తీసుకువెళ్తారు. నంబరువారుగా అయితే ఉంటారు కదా. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థము ద్వారా అర్థం చేసుకోవాలి. ముఖ్యమైన విషయము స్మృతి. రాత్రి నిద్రించేటప్పుడు కూడా ఇదే ఆలోచన చేయండి. బాబా, మేము మీ స్మృతిలో నిద్రిస్తాము, అనగా మేము ఈ శరీరాన్ని వదిలేస్తాము, మీ వద్దకు వచ్చేస్తాము. ఈ విధముగా బాబాను స్మృతి చేస్తూ-చేస్తూ నిద్రపోండి, అప్పుడు ఎంత ఆనందము కలుగుతుందో చూడండి. సాక్షాత్కారము కూడా కలగవచ్చు. కానీ ఈ సాక్షాత్కారాలు మొదలైనవాటిలో సంతోషపడకూడదు. బాబా, మేమైతే మిమ్మల్నే స్మృతి చేస్తాము, మీ వద్దకు రావాలని కోరుకుంటున్నాము. తండ్రిని మీరు స్మృతి చేస్తూ-చేస్తూ చాలా ప్రశాంతముగా వెళ్ళిపోతారు. సూక్ష్మవతనములోకి వెళ్ళే అవకాశము కూడా ఉంది. మూలవతనానికైతే వెళ్ళలేరు. ఇప్పుడింకా తిరిగి వెళ్ళే సమయము ఎక్కడ వచ్చింది. అయితే, బిందువు సాక్షాత్కారము జరిగి, ఆ తర్వాత చిన్న-చిన్న ఆత్మల వృక్షము కనిపిస్తుంది. ఉదాహరణకు, మీకు వైకుంఠము యొక్క సాక్షాత్కారము జరుగుతుంది కదా. అలాగని సాక్షాత్కారము జరిగితే మీరు వైకుంఠములోకి వెళ్ళిపోతారని కాదు. అలా కాదు. దాని కోసమైతే మరి కృషి చేయవలసి ఉంటుంది. మీరు మొట్టమొదట స్వీట్ హోమ్ కు వెళ్తారని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. అప్పుడు ఆత్మలన్నీ పాత్రను అభినయించడం నుండి ముక్తులైపోతాయి. ఎప్పటివరకైతే ఆత్మ పవిత్రముగా అవ్వదో, అప్పటివరకు పైకి వెళ్ళలేదు. ఇకపోతే సాక్షాత్కారాల ద్వారా ఏమీ లభించదు. మీరాకు సాక్షాత్కారము జరిగింది, కానీ వైకుంఠములోకైతే వెళ్ళలేదు. వైకుంఠము అనేది సత్యయుగములోనే ఉంటుంది. ఇప్పుడు మీరు వైకుంఠానికి యజమానులుగా అవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బాబా ధ్యానము మొదలైనవాటిలోకి అంతగా వెళ్ళనివ్వరు ఎందుకంటే మీరు చదువుకోవాలి కదా. తండ్రి వచ్చి చదివిస్తారు, వారు సర్వులకు సద్గతినిస్తారు. వినాశనము కూడా ఎదురుగా నిలబడి ఉంది. ఇకపోతే అసురులు మరియు దేవతల యుద్ధమనేది లేదు. మీ కోసం వారు పరస్పరము కొట్లాడుకుంటారు ఎందుకంటే మీ కోసం కొత్త ప్రపంచము కావాలి. ఇకపోతే మీ యుద్ధము మాయతో. మీరు చాలా పేరుగాంచిన యోధులు. కానీ దేవీలు ఇంతగా ఎందుకు మహిమ చేయబడుతున్నారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు భారత్ ను యోగబలముతో స్వర్గముగా తయారుచేస్తారు. మీకు ఇప్పుడు తండ్రి లభించారు. జ్ఞానము ద్వారా కొత్త ప్రపంచము జిందాబాద్ అవుతుందని మీకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ లక్ష్మీ-నారాయణులు కొత్త ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు కదా. ఇప్పుడు ఇది పాత ప్రపంచము. పాత ప్రపంచ వినాశనము ఇంతకుముందు కూడా మిసైల్స్ ద్వారా జరిగింది. మహాభారత యుద్ధము జరిగింది. ఆ సమయములో తండ్రి రాజయోగాన్ని నేర్పించారు. ఇప్పుడూ తండ్రి ప్రాక్టికల్ గా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు కదా. తండ్రియే మీకు సత్యము వినిపిస్తారు. సత్యమైన తండ్రి వచ్చినట్లయితే మీరు సదా సంతోషములో నాట్యము చేస్తారు. ఇది జ్ఞాన డాన్స్. ఎవరికైతే జ్ఞాన డాన్స్ పట్ల అభిరుచి ఉంటుందో, వారే ఎదురుగా కూర్చోవాలి. ఎవరైతే అర్థం చేసుకోలేనివారు ఉంటారో, వారికి ఆవలింతలు వస్తాయి. వీరేమీ అర్థం చేసుకోవడం లేదని అర్థమైపోతుంది. జ్ఞానాన్ని ఏమీ అర్థం చేసుకోకపోతే అటూ-ఇటూ చూస్తూ ఉంటారు. నీవు ఎలాంటి వారిని తీసుకొచ్చావని బాబా కూడా బ్రాహ్మణిని అడుగుతారు. ఎవరైతే నేర్చుకుంటారో మరియు నేర్పిస్తారో, వారు ఎదురుగా కూర్చోవాలి. వారికి సంతోషము కలుగుతూ ఉంటుంది. మనము కూడా డాన్స్ చేయాలి. ఇది జ్ఞాన డాన్స్. శ్రీకృష్ణుడైతే జ్ఞానమూ వినిపించలేదు, అలాగే నాట్యమూ చేయలేదు. మురళీ అంటే ఈ జ్ఞానానికి సంబంధించినది కదా. తండ్రి అర్థం చేయించారు - రాత్రి నిద్రించే సమయములో బాబాను స్మృతి చేస్తూ, చక్రాన్ని బుద్ధిలో తలచుకుంటూ ఉండండి. బాబా, మేము ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి మీ వద్దకు వస్తాము. ఈ విధముగా స్మృతి చేస్తూ-చేస్తూ నిద్రపోండి, అప్పుడు ఏమవుతుందో చూడండి. పూర్వము శ్మశానవాటికలా చేసేవారు, అప్పుడు కొందరు శాంతిలోకి వెళ్ళిపోయేవారు, కొందరు రాస్ చేయడం మొదలుపెట్టేవారు. ఎవరికైతే తండ్రి గురించి తెలియనే తెలియదో, వారు స్మృతి ఎలా చేయగలరు. మనుష్యమాత్రులకు తండ్రి గురించే తెలియకపోతే ఇక వారు తండ్రిని ఎలా స్మృతి చేస్తారు, అందుకే తండ్రి అంటారు - నేను ఎవరినో, ఎలా ఉన్నానో, అలా నా గురించి ఎవ్వరికీ తెలియదు.

ఇప్పుడు మీకు ఎంత వివేకము లభించింది. మీరు గుప్తమైన యోధులు. యోధులు అన్న పేరు విని దేవీలకు ఆయుధాలు, బాణాలు మొదలైనవి చూపించారు. మీరు యోగబలము గల యోధులు. యోగబలము ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. బాహుబలముతో ఎవరు ఎంతగా ప్రయత్నించినా కానీ విజయము పొందలేరు. భారత్ యొక్క యోగము ప్రసిద్ధమైనది. దీనిని తండ్రియే వచ్చి నేర్పిస్తారు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. లేస్తూ-కూర్చుంటూ తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి. యోగము కుదరడం లేదని అంటారు. యోగమనే పదాన్ని వదిలేయండి. పిల్లలు తండ్రిని తలచుకుంటారు కదా. శివబాబా అంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. నేనే సర్వశక్తివంతుడిని, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానముగా అవుతారు. సతోప్రధానముగా అయినప్పుడు ఆత్మల ఊరేగింపు బయలుదేరుతుంది. తేనెటీగల ఊరేగింపు ఉంటుంది కదా. ఇది శివబాబా ఊరేగింపు. శివబాబా వెనుక ఆత్మలందరూ దోమల గుంపు వలె పరుగెడతారు. ఇకపోతే శరీరాలన్నీ సమాప్తమైపోతాయి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. రాత్రివేళ నిద్రపోయే ముందు బాబాతో మధురాతి మధురమైన మాటలను మాట్లాడాలి. బాబా, మేము ఈ శరీరాన్ని వదిలి మీ వద్దకు వస్తాము, ఈ విధముగా స్మృతి చేసి నిద్రపోవాలి. స్మృతియే ముఖ్యమైనది, స్మృతి ద్వారానే పారసబుద్ధి కలవారిగా అవుతారు.

2. పంచ వికారాల రోగము నుండి రక్షించుకునేందుకు దేహీ-అభిమానులుగా ఉండే పురుషార్థము చేయాలి. అపారమైన సంతోషములో ఉండాలి, జ్ఞాన డాన్స్ చేయాలి. క్లాస్ లో సోమరితనాన్ని వ్యాపింపజేయకూడదు.

వరదానము:-
సేవ ద్వారా అనేక ఆత్మల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకుని సదా ముందుకు వెళ్ళే మహాదాని భవ

మహాదానిగా అవ్వడము అనగా ఇతరుల సేవ చేయడము. ఇతరుల సేవ చేయడము ద్వారా స్వయము యొక్క సేవ స్వతహాగా జరుగుతుంది. మహాదానిగా అవ్వడము అనగా స్వయాన్ని సుసంపన్నులుగా చేసుకోవడము. ఎంతగా ఆత్మలకు సుఖము, శాంతి మరియు జ్ఞానము యొక్క దానమునిస్తారో, అంతగా ఆత్మల నుండి ప్రాప్తి యొక్క శబ్దము మరియు కృతజ్ఞతలు వెలువడుతాయి, అవి మీ కొరకు ఆశీర్వాదములా పనిచేస్తాయి. ఈ ఆశీర్వాదాలే ముందుకు వెళ్ళేందుకు సాధనము. ఎవరికైతే ఆశీర్వాదాలు లభిస్తాయో, వారు సదా సంతోషముగా ఉంటారు. కావున రోజూ అమృతవేళ మహాదానులుగా అయ్యే ప్రోగ్రామ్ ను తయారుచేయండి. దానము జరగని సమయము గాని, రోజు గాని ఉండకూడదు.

స్లోగన్:-
ఇప్పటి ప్రత్యక్ష ఫలమే ఆత్మకు ఎగిరే కళ కోసం బలాన్ని ఇస్తుంది.

అవ్యక్త సూచనలు - అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి

బాబాకు సమీపముగా మరియు సమానముగా అయ్యేందుకు దేహములో ఉంటూనే విదేహీగా అయ్యే అభ్యాసము చెయ్యండి. ఏ విధముగా కర్మాతీతులుగా అయినందుకు ఉదాహరణగా సాకారములో బ్రహ్మాబాబాను చూసారో, అదే విధముగా ఫాలో ఫాదర్చెయ్యండి. ఎప్పటివరకైతే ఈ దేహము ఉంటుందో, కర్మేంద్రియాలతో ఈ కర్మక్షేత్రములో పాత్రను అభినయిస్తారో, అప్పటివరకు కర్మలు చేస్తూ కర్మేంద్రియాల ఆధారాన్ని తీసుకోండి మరియు ఆ తర్వాత అతీతముగా అయిపోండి. ఈ అభ్యాసమే విదేహీగా చేస్తుంది.