09-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఏ విధముగా సర్వుల కళ్యాణము చేయడమనేది బాబా పాత్రనో, అలా బాబా సమానముగా కళ్యాణకారులుగా అవ్వండి, తమ కళ్యాణాన్ని మరియు సర్వుల కళ్యాణాన్ని చేయండి’’

ప్రశ్న:-
పిల్లల్లోని ఏ ఒక్క విశేషతను చూసి బాప్ దాదా చాలా సంతోషిస్తారు?

జవాబు:-
పేద పిల్లలు బాబా యజ్ఞానికి 8 అణాలను, ఒక రూపాయిని పంపిస్తారు. బాబా, దీనికి బదులుగా మాకు మహళ్ళు ఇవ్వండి అని అంటారు. బాబా అంటారు, పిల్లలూ, ఈ ఒక్క రూపాయి కూడా శివబాబా ఖజానాలో జమ అయిపోయింది, మీకు 21 జన్మల కోసం మహళ్ళు లభిస్తాయి. సుదాముని ఉదాహరణ ఉంది కదా. పైసా ఖర్చు లేకుండా పిల్లలైన మీకు విశ్వ రాజ్యాధికారము లభిస్తుంది. బాబా పేద పిల్లల్లోని ఈ విశేషతను చూసి చాలా సంతోషిస్తారు.

పాట:-
మిమ్మల్ని పొంది మేము...

ఓంశాంతి
బాబా నుండి ఇప్పుడు అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మధురాతి మధురమైన పిల్లలు భావిస్తారు. పిల్లలు అంటారు - బాబా, మీ శ్రీమతమనుసారముగా మేము మీ నుండి మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని పొందుతున్నాము. ఇది కొత్త విషయమేమీ కాదు. పిల్లలకు జ్ఞానము లభించింది. సుఖధామము యొక్క వారసత్వాన్ని మేము కల్ప-కల్పము పొందుతూ ఉంటామని తెలుసు. కల్ప-కల్పము 84 జన్మలనైతే తీసుకోవలసి ఉంటుంది. తప్పకుండా మనము అనంతమైన తండ్రి నుండి 21 జన్మల వారసత్వాన్ని పొందుతాము, మళ్ళీ నెమ్మది-నెమ్మదిగా పోగొట్టుకుంటాము. ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన ఆట అని తండ్రి అర్థం చేయించారు. పిల్లలైన మీకు పాలన లభిస్తూ ఉంటుంది. డ్రామాలో సుఖము చాలా ఉందని కూడా మీకు తెలుసు. చివరిలోకి చేరుకున్న తర్వాత రావణుడి ద్వారా దుఃఖము పొందుతారు. ప్రస్తుతము మీరు చాలా కొద్దిమందే ఉన్నారు, మున్ముందు చాలా వృద్ధి జరుగుతూ ఉంటుంది. మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. మేము కల్ప-కల్పము తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతామని తప్పకుండా మనసులో అనుకుంటారు. ఎవరెవరైతే వచ్చి జ్ఞానాన్ని తీసుకుంటారో, వారు - ఇప్పుడు జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారా సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని పొందాము అని భావిస్తారు. తండ్రియే జ్ఞానసాగరుడు, పతితులను పావనముగా చేసేవారు అనగా ముక్తి-జీవన్ముక్తులలోకి తీసుకువెళ్ళేవారు. ఇది కూడా మీకు ఇప్పుడు తెలుసు. గురువులనైతే ఎంతోమంది ఆశ్రయించారు కదా. ఆఖరికి గురువులను కూడా వదిలేసి ఇక్కడకు వచ్చి జ్ఞానము తీసుకుంటారు. మీకు కూడా ఇప్పుడు ఈ జ్ఞానము లభించింది. ఇంతకుముందు అజ్ఞానులుగా ఉండేవారని మీకు తెలుసు. సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, శివబాబా, బ్రహ్మా, విష్ణువు, శంకరులు ఎవరు అనేది ఇంతకుముందు ఏమీ తెలియదు. మేము విశ్వానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు తెలిసింది కావున మీ బుద్ధిలో చాలా మంచి నషా ఎక్కి ఉండాలి. తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండాలి, అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (రాజ్యాధికార వారసత్వము). తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు కదా. తండ్రి గురించి గాని, వారి రచన గురించి గాని తెలియదు. మొత్తం సృష్టిలోని మనుష్యమాత్రులకు తండ్రి గురించి గాని, రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి గాని తెలియదు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. తండ్రి పిల్లలందరితో మాట్లాడుతున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఎన్ని సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా సెంటర్లు తెరవబడతాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు, ఇప్పుడు నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసుకున్నారు. ఇప్పుడు మనము తండ్రి ద్వారా పతితుల నుండి పావనులుగా అవుతున్నామని కూడా మీకు తెలుసు. మిగిలినవారైతే పిలుస్తూ ఉంటారు, మీరు గుప్తముగా ఉన్నారు. బ్రహ్మాకుమార, కుమారీలని అంటారు కానీ వారిని చదివించేవారు ఎవరు అన్నది అర్థం కాదు. శాస్త్రాలలో ఎక్కడా వ్రాయబడి లేదు. ఆ గీతా భగవానుడైన శివుడే వచ్చి పిల్లలకు రాజయోగాన్ని నేర్పించారు. ఇది మీ బుద్ధిలోకి వస్తుంది కదా. గీతను కూడా మీరు చదివి ఉంటారు. జ్ఞాన మార్గము పూర్తిగా వేరని ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. విద్వాంసుల మండలి నుండి ఏవైతే శాస్త్రాలు మొదలైనవి చదివి టైటిల్స్ తీసుకుంటారో, అవన్నీ భక్తి మార్గానికి చెందిన శాస్త్రాలు. ఈ జ్ఞానము వారిలో లేదు. తండ్రియే వచ్చి రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రియే వచ్చి మీ బుద్ధి తాళాన్ని తెరిచారు.

ఇంతకుముందు మనము ఎలా ఉండేవారము, ఇప్పుడెలా అయ్యాము అనేది మీకు తెలుసు. బుద్ధిలోకి మొత్తం చక్రమంతా వచ్చేసింది. మొదటిలో ఏమీ అర్థం చేసుకునేవారు కాదు. రోజురోజుకూ జ్ఞానము యొక్క మూడవ నేత్రము మంచి రీతిలో తెరుచుకుంటూ ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు వచ్చారు, ఇక్కడకు వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపించింది ఎవరు అన్నది కూడా ఎవరికీ తెలియదు. పిల్లలైన మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. బుద్ధిలో మొత్తం చక్రమంతటి జ్ఞానముంది. ఎప్పటినుండి మనము ఓడిపోతాము మరియు ఏ విధముగా వామ మార్గములోకి వెళ్తాము, ఏ విధముగా మెట్లు దిగుతాము అన్నది చిత్రాలలో ఎంత సహజముగా అర్థం చేయించబడి ఉంది. ఇవి 84 జన్మల మెట్లు. ఎలా దిగుతాము, మళ్ళీ ఎలా ఎక్కుతాము, పతిత-పావనుడు ఎవరు, పతితముగా ఎవరు తయారుచేసారు - ఇది మీకు ఇప్పుడు తెలుసు, వారైతే కేవలం పతిత-పావనా అని పాడుతూ ఉంటారు. రావణ రాజ్యము ఎప్పటినుండి మొదలవుతుంది, పతితులుగా ఎప్పటినుండి అయ్యారు అనేది అర్థం చేసుకోరు. ఈ జ్ఞానము ఉన్నది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము వారి కోసమే. తండ్రి అంటారు, నేనే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసాను. ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాలను తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మీ కొరకు ఇది ఒక కథ వంటిది. రాజ్యాన్ని ఎలా పొందుతాము, ఎలా పోగొట్టుకుంటాము అన్నదానికి సంబంధించిన చరిత్ర-భౌగోళికాలను మనము చదువుతాము. ఇది అనంతమైన విషయము. మనము 84 జన్మల చక్రములో ఎలా తిరుగుతాము, మనము విశ్వానికి యజమానులుగా ఉండేవారము, ఆ తర్వాత రావణుడు రాజ్యాన్ని లాక్కున్నాడు - ఈ జ్ఞానాన్ని తండ్రి ఇచ్చారు. మనుష్యులు దసరా మొదలైన పండుగలను జరుపుకుంటారు కానీ జ్ఞానమేమీ లేదు. మీకు కూడా ఈ జ్ఞానము ఉండేది కాదు, ఇప్పుడు జ్ఞానము లభిస్తోంది కావున మీరు సంతోషములో ఉంటారు. జ్ఞానము సంతోషాన్ని ఇస్తుంది. అనంతమైన జ్ఞానము బుద్ధిలో ఉంది. తండ్రి మీ ఒడిని నింపుతున్నారు. ఒడిని నింపండి అని అడుగుతారు కదా. ఎవరిని అడుగుతారు? సాధు-సన్యాసులు మొదలైనవారిని అడగరు. భోళానాథుడైన శివుడిని అడుగుతారు, వారి నుండే భిక్షము కోరుకుంటారు. ఇప్పుడు మీ సంతోషానికి అవధులు లేవు. మీకు చాలా సంతోషము ఉండాలి. బుద్ధిలోకి ఎంత జ్ఞానము వచ్చేసింది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది. కావున, ఇప్పుడు మీ కళ్యాణాన్ని మరియు ఇతరుల కళ్యాణాన్ని కూడా చేయాలి. అందరి కళ్యాణము చేయాలి. ఇంతకుముందైతే ఒకరికొకరు అకళ్యాణమే చేసుకునేవారు, ఎందుకంటే ఆసురీ మతము ఉండేది. ఇప్పుడు మీరు శ్రీమతముపై ఉన్నారు కావున మీ కళ్యాణాన్ని కూడా చేసుకోవాలి.

ఈ అనంతమైన చదువును అందరూ చదువుకోవాలని, సెంటర్లు తెరుచుకుంటూ ఉండాలని మీ మనసు కోరుకుంటుంది. ఏమంటారంటే - బాబా, ప్రదర్శనీ ఇవ్వండి, ప్రొజెక్టర్ ఇవ్వండి, మేము సెంటర్ తెరుస్తాము, మాకు ఏదైతే జ్ఞానము లభించిందో, దేని ద్వారానైతే అనంతమైన సంతోషపు పాదరసము ఎక్కిందో, దానిని ఇతరులకు కూడా అనుభవము చేయిస్తాము అని అంటారు. డ్రామానుసారముగా ఈ పురుషార్థము కూడా నడుస్తూ ఉంటుంది. భారత్ ను మళ్ళీ స్వర్గముగా తయారుచేయడానికి తండ్రి వచ్చారు. ఇంతకుముందు మీరు నరకవాసులుగా ఉండేవారని, ఇప్పుడు స్వర్గవాసులుగా అవుతున్నారని మీకు తెలుసు. ఈ చక్రము మీ బుద్ధిలో సదా తిరుగుతూ ఉండాలి, దీని ద్వారా సదా మీరు సంతోషముగా ఉంటారు. ఇతరులకు అర్థం చేయించాలనే నషా కూడా ఉండాలి. మనము తండ్రి నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. మీ సోదరీ-సోదరులు ఎవరికైతే జ్ఞానము తెలియదో, వారికి కూడా మార్గాన్ని తెలియజేయడము మీ ధర్మము. ఏ విధముగా బాబాకు అందరి కళ్యాణము చేసే పాత్ర ఉందో, అలాగే మనకు కూడా అందరి కళ్యాణకారులుగా అయ్యే పాత్ర ఉంది. బాబా మనల్ని కళ్యాణకారులుగా చేసారు కావున మన కళ్యాణాన్ని కూడా చేసుకోవాలి, ఇతరుల కళ్యాణాన్ని కూడా చేయాలి. తండ్రి అంటారు, మీరు ఫలానా సెంటరుకు వెళ్ళండి, వెళ్ళి సేవ చేయండి, ఒకేచోట కూర్చుని సేవ చేయకూడదు. ఎవరెంత చురుకుగా ఉంటారో, వారికి అంతగా సేవ చేయాలనే అభిరుచి ఉంటుంది. ఫలానా కొత్త సెంటర్ తెరవబడింది, ఎవరెవరు సేవాధారులు, ఎవరెవరు ఆజ్ఞాకారులు, విశ్వాసపాత్రులు అనేది తెలుస్తుంది. అజ్ఞానకాలములో కూడా కుపుత్రులైన పిల్లలపై తండ్రి కోపగించుకుంటారు. ఇక్కడైతే అనంతమైన తండ్రి అంటారు, నేను పూర్తిగా సాధారణ రీతిలో అర్థం చేయిస్తాను, ఇందులో భయపడే విషయమేమీ లేదు. ఇక్కడ, ఎవరైతే చేస్తారో, వారు పొందుతారు. శాపము లేదా కోపము యొక్క విషయమేమీ లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, బాగా సేవ చేసి మీ కళ్యాణాన్ని మరియు ఇతరుల కళ్యాణాన్ని ఎందుకు చేయకూడదు. ఎవరెంతగా అనేకుల కళ్యాణము చేస్తారో, అంతగా బాబా కూడా సంతోషిస్తారు. ఈ పుష్పము ఎంత బాగుంది అని తోటలో బాబా చూస్తారు. ఇదంతా పుష్పాలతోట. తోటలను చూడటము కోసమని - బాబా, మేము సెంటర్లు తిరిగి వస్తాము అని అంటారు. ఎలాంటి-ఎలాంటి పుష్పాలు ఉన్నాయి, ఎలా సేవ చేస్తున్నారు, సంతోషములో ఎలా నాట్యము చేస్తూ ఉంటారు అనేది వెళ్తే తెలుస్తుంది. బాబా, మేము ఫలానావారికి ఈ విధముగా అర్థం చేయించామని బాబాకు కూడా వచ్చి చెప్తుంటారు. ఈ రోజు నా పతిని, సోదరుడిని తీసుకువచ్చాను, బాబా వచ్చి ఉన్నారని, వారు వజ్ర సమానమైన జీవితాన్ని ఎలా తయారుచేస్తున్నారని అర్థం చేయించాను అని చెప్తుంటారు. విన్నారంటే, మేము కూడా చూడాలి అని కోరుకుంటారు. కావున పిల్లలకు ఉత్సాహము కలుగుతుంది, ఇతరులను తీసుకువస్తారు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలను తెలుసుకోవాలి. భారత్ మొత్తం విశ్వానికి యజమానిగా ఉండేదని మీరు జడ్జ్ చేయగలరు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది. సత్య, త్రేతాయుగాలలో ఎంత సుఖముండేది. ఇప్పుడు మళ్ళీ బాబా విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారు. ప్రపంచములో చివరిలో చాలా అలజడులు జరగనున్నాయని కూడా మీకు తెలుసు. యుద్ధమేమీ ఆగదు. ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ చూస్తే అక్కడ గొడవలే ఉన్నాయి. ఎంత గందరగోళముగా అయిపోయింది. విదేశాలలో ఏమేమి జరుగుతున్నాయి. వారు ఏమి చేస్తున్నారు అనేది వారికి అర్థం కావటము లేదు. ఎన్ని తుఫానులు వస్తూ ఉంటాయి. మనుష్యులు కూడా మరణిస్తూ ఉంటారు. ఇది ఎంత దుఃఖమయమైన ప్రపంచము. ఈ దుఃఖమయమైన ప్రపంచము నుండి ఇప్పుడిక వెళ్ళిపోనున్నామని పిల్లలైన మీకు తెలుసు. బాబా అయితే ఓదార్పును ఇస్తున్నారు. ఇది ఛీ-ఛీ ప్రపంచము. కొన్ని రోజుల్లో మనము విశ్వముపై శాంతిగా రాజ్యము చేస్తాము. ఈ విషయములోనైతే సంతోషము ఉండాలి కదా. సెంటర్లు తెరుచుకుంటూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, సెంటర్లు తెరుచుకుంటాయి, అప్పుడు బాబా - ఇప్పుడు మంచి-మంచి పిల్లలు వెళ్ళండి అని వ్రాస్తారు. ఎవరైతే హృదయాన్ని అధిరోహించి ఉంటారో, వారి పేర్లు వ్రాస్తాను. అనేకుల కళ్యాణము జరుగుతుంది. బాబా, మేమైతే బంధనములో ఉన్నామని చాలామంది వ్రాస్తూ ఉంటారు. అచ్ఛా, సెంటర్ తెరుచుకున్నట్లయితే చాలామంది వచ్చి వారసత్వాన్ని పొందుతారు. ఇదంతా వినాశనమవ్వనున్నది అని కూడా తెలుసు, కావున అనేకుల కళ్యాణార్థము కార్యములో ఎందుకు ఉపయోగించకూడదు. డ్రామాలో వారి పాత్ర అలా ఉంది. ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను అభినయిస్తున్నారు. దయ కలుగుతుంది. ఇతరులను కూడా బంధనముక్తులుగా చేయడానికి ఎంతోకొంత సహాయము చేయాలి. వారు కూడా వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రికి ఎంత చింత ఉంటుంది. అందరూ కామచితిపై కాలిపోయి మరణించారు. అంతా శ్మశానవాటికగా అయిపోయింది. అల్లాహ్ వచ్చి శ్మశానము నుండి మేలుకొలిపి అందరినీ తీసుకువెళ్తారని అంటారు కూడా.

రావణుడు ఎలా ఓడించాడు అనేది మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు తెలియదు. నేను రత్నాల వ్యాపారిని, లక్షాధికారిని, ఇంతమంది పిల్లలున్నారు, నషా అయితే ఉంటుంది కదా. నేను పూర్తిగా పతితముగా ఉండేవాడినని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. పాత ప్రపంచములో ఎంతమంది లక్షాధికారులున్నా, కోటీశ్వరులున్నా, అదంతా గవ్వ సమానమైనది. ఇప్పుడిక అంతా పోయినట్లే. మాయ కూడా ఎంత ప్రబలమైనది. తండ్రి అంటారు - పిల్లలూ, సెంటర్లు తెరవండి, అనేకుల కళ్యాణము జరుగుతుంది. పేదవారు త్వరగా మేలుకుంటారు, ధనవంతులు కాస్త కష్టముగా మేలుకుంటారు. వారు తమ సంతోషములోనే నిమగ్నమై ఉంటారు. మాయ పూర్తిగా తన వశము చేసేసుకుంది. అర్థం చేయిస్తే అర్థం చేసుకుంటారు కూడా, కానీ ఎలా వదిలిపెట్టాలి అని అనుకుంటారు. వీరిలా అంతా వదిలేయవలసి వస్తుందేమోనని భయపడతారు. వారి భాగ్యములో లేకపోతే నడవలేకపోతారు. ఇక విడుదల అవ్వడము చాలా కష్టము అన్నట్లుగా అనిపిస్తుంది. ఆ సమయములో తప్పకుండా ఇది ఛీ-ఛీ ప్రపంచమని వైరాగ్యము కలుగుతుంది, అయినా, ఎక్కడున్నవారు అక్కడే ఉంటారు. కోట్లలో ఏ ఒక్కరో వెలువడుతారు. బొంబాయిలో వందలాది మంది వస్తారు, కొంతమందికి రంగు అంటుకుంటుంది. భవిష్యత్తు కోసం ఎంతోకొంత తయారుచేసుకోవాలని, గవ్వలకు బదులుగా మాకు వజ్రాలు లభిస్తాయని భావిస్తారు. బ్యాగ్-బ్యాగేజ్ అంతటినీ స్వర్గములోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అని తండ్రి అర్థం చేయిస్తారు కదా. అక్కడ 21 జన్మల కోసం మీకు రాజ్యభాగ్యము లభిస్తుంది. కొందరు ఒక్క రూపాయిని, 8 అణాలను కూడా పంపిస్తారు. తండ్రి అంటారు, మీ ఒక్క రూపాయి కూడా శివబాబా ఖజానాలో జమ అయ్యింది. మీకు 21 జన్మల కోసం మహళ్ళు లభిస్తాయి. సుదాముని ఉదాహరణ ఉంది కదా. అటువంటివారిని చూసి బాబాకు చాలా సంతోషము కలుగుతుంది. ఖర్చేమీ లేకుండా పిల్లలైన మీకు విశ్వ రాజ్యాధికారము లభిస్తుంది. యుద్ధాలు మొదలైనవేవీ ఉండవు. వారైతే చిన్న భాగము కోసం కూడా ఎంతగా గొడవపడతారు. మీకు కేవలం మన్మనాభవ అని చెప్పడము జరుగుతుంది, అంతే. ఇక్కడే కూర్చుండిపోవలసిన అవసరము లేదు, నడుస్తూ-తిరుగుతూ తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. సంతోషములో ఉండండి. ఆహార-పానీయాలను కూడా శుద్ధముగా ఉంచుకోవాలి. మీ ఆత్మ ఎంతవరకు పవిత్రముగా అయ్యింది అనేది మీకు తెలుసు, మీరు వెళ్ళి మళ్ళీ రాకుమారునిగా జన్మ తీసుకుంటారు. మున్ముందు ప్రపంచ పరిస్థితి పూర్తిగా పాడవ్వనున్నది. తినడానికి ధాన్యము లభించకపోతే గడ్డి తినడము మొదలుపెడతారు. అప్పుడిక - వెన్న లేకుండా మేము ఉండలేము అని ఎవ్వరూ అనలేరు. ఏమీ దొరకదు. ఇప్పుడు కూడా ఎన్నో చోట్ల మనుష్యులు గడ్డి తింటూ రోజులు గడుపుతున్నారు. మీరైతే చాలా సంతోషముగా బాబా ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఇంట్లో తండ్రి మొదట పిల్లలకు తినిపిస్తారు కదా. కాలం చాలా పాడైపోయింది. ఇక్కడ మీరు చాలా సుఖముగా కూర్చుని ఉన్నారు. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. మీ కళ్యాణాన్ని మరియు ఇతరుల కళ్యాణాన్ని కూడా చేయాలి. మున్ముందు వారంతట వారే వస్తారు, అదృష్టము మేలుకుంటుంది. మేలుకోవలసిందే కదా. అనంతమైన రాజధాని స్థాపన అవ్వనున్నది. ప్రతి ఒక్కరూ కల్పక్రితం వలె పురుషార్థము చేస్తారు. పిల్లలైతే చాలా సంతోషములో ఉండాలి. బాప్ దాదా యొక్క చిత్రాన్ని చూస్తూనే సంతోషములో రోమాలు నిక్కబొడుచుకోవాలి. ఆ సంతోషపు పాదరసము స్థిరంగా నిలిచి ఉండాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా అపారమైన సంతోషములో ఉండేందుకు అనంతమైన జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. జ్ఞాన రత్నాలతో మీ ఒడిని నింపుకుని మీ కళ్యాణాన్ని మరియు సర్వుల కళ్యాణాన్ని చేయాలి. జ్ఞానములో చాలా-చాలా చురుకుగా అవ్వాలి.

2. భవిష్య 21 జన్మల రాజ్యభాగ్యము యొక్క అధికారాన్ని తీసుకునేందుకు తమ బ్యాగ్-బ్యాగేజ్ అంతటినీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి విముక్తులయ్యేందుకు యుక్తులను రచించాలి.

వరదానము:-
ఒక్క తండ్రి ప్రేమలో లవలీనమై ఉంటూ సదా ఎక్కే కళను అనుభవము చేసే సఫలతామూర్త భవ

సేవలో మరియు స్వయము యొక్క ఎక్కే కళలో సఫలతకు ముఖ్య ఆధారము - ఒక్క తండ్రి పట్ల ఎడతెగని ప్రేమ. తండ్రి తప్ప ఇంకేమీ కనిపించకూడదు. సంకల్పాలలో కూడా బాబా, మాటలలో కూడా బాబా, కర్మలలో కూడా బాబా తోడు. ఇటువంటి లవలీన ఆత్మ ఒక్క మాట మాట్లాడినా కూడా వారి స్నేహపూర్వకమైన మాట ఇతర ఆత్మలను కూడా స్నేహములో బంధించివేస్తుంది. ఇటువంటి లవలీన ఆత్మ నుండి వచ్చే ‘ఒక్క బాబా’ అన్న మాటయే ఇంద్రజాలములా పని చేస్తుంది. వారు ఆత్మిక ఇంద్రజాలికులుగా అయిపోతారు.

స్లోగన్:-
ఎవరైతే అంతర్ముఖులుగా అయ్యి లైట్-మైట్ రూపములో స్థితులై ఉంటారో వారే యోగీ ఆత్మలు.

అవ్యక్త సూచనలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా, నిశ్చింతగా ఉండండి’’

మీకు ఏ డ్యూటీ లభించినా కానీ అందులో సదా ఏక్యురేట్ గా ఉండండి. ఎవరైతే డ్యూటీలో ఏక్యురేట్ గా ఉంటారో, వారిని అందరూ నిజాయితీపరులు, విశ్వాసపాత్రులు అన్న దృష్టితో చూస్తారు. ఇక్కడ కూడా ఎవరైతే ఏక్యురేట్ గా సేవలో ఉంటారో, వారే బాబాకు విశ్వాసపాత్రులు. ఒకటేమో బాబాపై పూర్తి విశ్వాసము ఉండటము, మరొకటి బాబాపై విశ్వాసము ఉండటముతోపాటు సేవలో కూడా విశ్వాసపాత్రులుగా ఉండటము. ఇటువంటి విశ్వాసపాత్రులైన నిశ్చయబుద్ధి కల పిల్లలు సదా విజయులుగా మరియు నిశ్చింతగా ఉంటారు.