09-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - సత్యమైన తండ్రితో లోపల, బయట సత్యంగా ఉండండి, అప్పుడే దేవతలుగా అవ్వగలుగుతారు, బ్రాహ్మణులైన మీరే ఫరిశ్తాల నుండి దేవతలుగా అవుతారు

ప్రశ్న:-
ఈ జ్ఞానాన్ని వినేందుకు లేక ధారణ చేసేందుకు అధికారులుగా ఎవరు అవ్వగలుగుతారు?

జవాబు:-
ఎవరైతే ఆల్రౌండ్ పాత్రను అభినయించారో, ఎవరైతే అందరికన్నా ఎక్కువ భక్తిని చేసారో, వారే జ్ఞానాన్ని ధారణ చేయడంలో చాలా వేగంగా ముందుకు వెళ్తారు. ఉన్నత పదవిని కూడా వారే పొందుతారు. పిల్లలైన మిమ్మల్ని - మీరు శాస్త్రాలను నమ్మరా అని కొందరు అడుగుతారు. అప్పుడు వారికి చెప్పండి - మేము ఎంతగానైతే శాస్త్రాలను చదివామో, భక్తిని చేసామో, అంతగా ప్రపంచములో ఇంకెవ్వరూ చేయరు, మాకు ఇప్పుడు భక్తి ఫలం లభించింది, అందుకే ఇప్పుడిక భక్తి చేయాల్సిన అవసరం లేదు.

ఓంశాంతి
అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఆత్మలందరి యొక్క తండ్రి ఆత్మలందరికీ అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే వారు సర్వుల సద్గతిదాత. ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారందరినీ జీవాత్మలు అనే అంటారు. శరీరము లేకపోతే ఆత్మ చూడలేదు. అయితే డ్రామా ప్లాన్ అనుసారంగా స్వర్గ స్థాపనను తండ్రి చేస్తున్నారు కానీ తండ్రి అంటారు - నేను స్వర్గాన్ని చూడను. అది ఎవరి కోసమైతే ఉందో, వారే చూడగలుగుతారు. మిమ్మల్ని చదివించిన తర్వాత నేను ఇక ఏ శరీరాన్నీ ధారణ చేయనే చేయను. మరి శరీరము లేకుండా ఎలా చూడగలను. అలాగని ఎక్కడంటే అక్కడ ఉన్నాను, అన్నీ చూస్తాను అని కాదు. అలా కాదు. నేను కేవలం పిల్లలైన మిమ్మల్నే చూస్తాను, మిమ్మల్నే పుష్పాలుగా తయారుచేసి స్మృతి యాత్రను నేర్పిస్తాను. యోగము అన్న పదము భక్తికి సంబంధించినది. జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్క జ్ఞానసాగరుడే, వారినే సద్గురువు అని అంటారు. మిగిలినవారంతా గురువులు. సత్యాన్ని చెప్పేవారు, సత్యఖండాన్ని స్థాపన చేసేవారు వారే. భారత్ సత్యఖండముగా ఉండేది, అక్కడ దేవీ-దేవతలందరూ నివసించేవారు. మీరు ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. కావున వారు పిల్లలకు అర్థం చేయిస్తారు - సత్యమైన తండ్రితో లోపల-బయట సత్యముగా ఉండాలి. పూర్వము అయితే అడుగడుగులోనూ అసత్యమే ఉండేది. ఒకవేళ స్వర్గములో ఉన్నత పదవిని పొందాలనుకుంటే అదంతా వదలాల్సి ఉంటుంది. స్వర్గములోకైతే ఎంతోమంది వెళ్తారు కానీ తండ్రిని తెలుసుకుని కూడా వికర్మలను వినాశనం చేసుకోకపోతే శిక్షలు అనుభవించి లెక్కాచారాలను తీర్చుకోవలసి ఉంటుంది, అప్పుడిక పదవి కూడా చాలా తక్కువగా లభిస్తుంది. పురుషోత్తమ సంగమయుగములో రాజధాని స్థాపనవుతుంది. రాజధాని సత్యయుగములోనూ స్థాపన అవ్వదు, అలాగే కలియుగములోనూ స్థాపన అవ్వదు ఎందుకంటే తండ్రి సత్యయుగములో లేక కలియుగములో రారు. ఈ యుగాన్ని పురుషోత్తమ కళ్యాణకారీ యుగము అని అంటారు. ఇందులోనే తండ్రి వచ్చి అందరి కళ్యాణాన్ని చేస్తారు. కలియుగము తర్వాత సత్యయుగము రానున్నది, అందుకే సంగమయుగము కూడా తప్పకుండా కావాలి. ఇది పతిత పాత ప్రపంచమని తండ్రి తెలియజేశారు. దూరదేశ నివాసి పరాయి దేశములోకి వచ్చారు... అన్న గాయనము కూడా ఉంది. మరి పరాయి దేశములో తన పిల్లలు ఎక్కడ దొరుకుతారు. పరాయి దేశంలో పరాయి పిల్లలే దొరుకుతారు. నేను ఎవరిలోకి ప్రవేశిస్తాను అన్నది వారికి బాగా అర్థం చేయిస్తాను. నేను నా పరిచయాన్నీ ఇస్తాను మరియు ఎవరిలోకైతే ప్రవేశిస్తానో వారికి కూడా - ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ అని అర్థం చేయిస్తాను. ఇది ఎంత స్పష్టముగా ఉంది.

ఇప్పుడు మీరు ఇక్కడ పురుషార్థులుగా ఉన్నారు, సంపూర్ణ పవిత్రులుగా లేరు. సంపూర్ణ పవిత్రులను ఫరిశ్తా అని అంటారు. ఎవరైతే పవిత్రులుగా లేరో, వారిని పతితులు అనే అంటారు. ఫరిశ్తాలుగా అయిన తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతారు. సూక్ష్మవతనములో మీరు సంపూర్ణ ఫరిశ్తాను చూస్తారు, వారిని ఫరిశ్తా అని అంటారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఒక్క అల్ఫ్ నే స్మృతి చేయాలి. అల్ఫ్ అనగా బాబా. వారిని అల్లా అని కూడా అంటారు. తండ్రి నుండి స్వర్గ వారసత్వము లభిస్తుంది అని పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు స్వర్గాన్ని ఎలా రచిస్తారు? స్మృతియాత్ర మరియు జ్ఞానము ద్వారా. భక్తిలో జ్ఞానము ఉండదు. జ్ఞానాన్ని ఒక్క తండ్రే బ్రాహ్మణులకు ఇస్తారు. బ్రాహ్మణులు పిలక స్థానములో ఉన్నవారు కదా. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు, ఆ తర్వాత పిల్లిమొగ్గల ఆటను ఆడతారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ... దీనినే విరాట రూపము అని అంటారు. విరాట రూపమును బ్రహ్మా, విష్ణు, శంకరులది అని అనరు. అందులో పిలక స్థానములోని బ్రాహ్మణులైతే లేరు. తండ్రి బ్రహ్మా తనువులోకి వస్తారు అన్నదైతే ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణ కులమే సర్వోత్తమ కులము, ఇప్పుడే తండ్రి వచ్చి చదివిస్తారు. తండ్రి శూద్రులనైతే చదివించరు కదా. వారు బ్రాహ్మణులనే చదివిస్తారు. చదివించడములో కూడా సమయం పడుతుంది, రాజధాని స్థాపన అవ్వనున్నది. మీరు ఉన్నతోన్నతులుగా, పురుషోత్తములుగా అవ్వండి. కొత్త ప్రపంచాన్ని ఎవరు రచిస్తారు? తండ్రే రచిస్తారు. ఇది మర్చిపోకండి. మాయ మిమ్మల్ని మరిపింపజేస్తుంది, దాని వృత్తే ఇది. జ్ఞానములో అంతగా అది జోక్యం చేసుకోదు, స్మృతిలోనే జోక్యం చేసుకుంటుంది. ఆత్మలో చాలా చెత్త నిండి ఉంది, అది తండ్రి స్మృతి లేకుండా శుభ్రమవ్వదు. యోగము అన్న పదము విని పిల్లలు చాలా తికమకపడతారు. బాబా, మా యోగము కుదరడం లేదు అని అంటారు. వాస్తవానికి యోగము అన్న పదము ఆ హఠయోగులది. సన్యాసులు బ్రహ్మముతో యోగాన్ని జోడించాలి అని అంటారు. వాస్తవానికి బ్రహ్మతత్వమైతే చాలా పెద్దది. ఏ విధముగా ఆకాశములో నక్షత్రాలు కనిపిస్తాయో అలా అక్కడ కూడా చిన్న-చిన్న నక్షత్రాల వలె ఆత్మలు ఉంటాయి. అది ఆకాశానికంటే పైన ఉంది, అక్కడ సూర్యచంద్రాదుల ప్రకాశం ఉండదు. కావున మీరు ఎంత చిన్న-చిన్నని రాకెట్లో చూడండి. అందుకే బాబా అంటారు - మొట్టమొదట ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. దానిని ఒక్క భగవంతుడే ఇవ్వగలరు. కేవలం భగవంతుడిని గురించే తెలియదని కాదు, వారికి ఆత్మను గురించి కూడా ఏమీ తెలియదు. ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల చక్రము యొక్క అవినాశీ పాత్ర నిండి ఉంది, దీనినే సృష్టి అద్భుతము అని అంటారు, ఇంకేమీ అనలేరు. ఆత్మ 84 జన్మల చక్రమును తిరుగుతూనే ఉంటుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. ప్రపంచము అవినాశీ, ఇది ఎప్పుడూ వినాశనమవ్వదు. చాలా పెద్ద ప్రళయం జరుగుతుందని, ఆ తర్వాత శ్రీకృష్ణుడు బొటనువేలును చప్పరిస్తూ రావి ఆకుపై వస్తారని వారు చూపిస్తారు, కానీ అలాంటిదేమీ జరగదు. అది నియమ విరుద్ధము. మహాప్రళయం ఎప్పుడూ జరుగదు. ఒక్క ధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనము జరుగుతూనే ఉంటుంది. ఈ సమయములో ముఖ్యంగా మూడు ధర్మాలు ఉన్నాయి. ఇది కళ్యాణకారీ సంగమయుగము. పాత ప్రపంచానికి మరియు కొత్త ప్రపంచానికి రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. నిన్న కొత్త ప్రపంచము ఉండేది, ఇప్పుడు పాతగా ఉంది. నిన్నటి ప్రపంచములో ఏముండేదో మీరు అర్థం చేసుకోగలరు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారో వారు ఆ ధర్మ స్థాపననే చేస్తారు. వారైతే కేవలం ఒక్కరే వస్తారు, అనేకులు ఉండరు. ఆ తర్వాత మెల్ల, మెల్లగా వృద్ధి జరుగుతుంది.

తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వను. పిల్లలకు కష్టమును ఎలా ఇవ్వగలను! వీరు అతి ప్రియమైన తండ్రి కదా. నేను మీ సద్గతిదాతను, దుఃఖహర్త, సుఖకర్తను అని అంటారు. స్మృతి కూడా నన్నొక్కరినే చేస్తారు. భక్తి మార్గములో ఏమేమి చేసేసారు, నన్ను ఎంతగా నిందించారు! గాడ్ ఈజ్ వన్ (భగవంతుడు ఒక్కరే) అని అంటారు. సృష్టి చక్రము కూడా ఒక్కటే, ఆకాశములో వేరే ప్రపంచమేమీ లేదు. ఆకాశములో నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రములోనూ సృష్టి ఉందని, కింద కూడా ప్రపంచం ఉందని మనుష్యులు భావిస్తారు. ఇవన్నీ భక్తి మార్గానికి చెందిన విషయాలు. ఉన్నతోన్నతమైన భగవంతుడు ఒక్కరే. మొత్తం సృష్టిలోని ఆత్మలందరూ నీలోనే కూర్చబడి ఉన్నారు, ఇది ఒక మాల వంటిది అని అంటూ ఉంటారు కూడా. దీనిని అనంతమైన రుద్రమాల అని కూడా అనవచ్చు. సూత్రములో బంధింపబడి ఉన్నారు. గానం చేస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, నేను మీకు కొద్దిగా కూడా కష్టాన్ని ఇవ్వను. ఎవరైతే మొట్టమొదట భక్తిని చేసారో, వారే జ్ఞానములో చురుకుగా ముందుకు వెళ్తారు అని కూడా తెలియజేశారు. భక్తి ఎక్కువ చేసి ఉన్నట్లయితే వారికి ఫలము కూడా ఎక్కువ లభించాలి. భక్తి ఫలాన్ని భగవంతుడు ఇస్తారు అని అంటారు, వారు జ్ఞానసాగరుడు, మరి తప్పకుండా జ్ఞానము ద్వారానే ఫలాన్ని ఇస్తారు. భక్తి ఫలము గురించి ఎవ్వరికీ తెలియదు. భక్తి ఫలము జ్ఞానం, దాని ద్వారా స్వర్గ వారసత్వమైన సుఖము లభిస్తుంది. కావున వారు ఫలాన్ని ఇస్తారు అనగా నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారుచేసేది ఒక్క తండ్రే. రావణుడి గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది పాత ప్రపంచము అని కూడా అంటారు. ఇది ఎప్పటినుండి పాతగా అయ్యింది - ఈ లెక్కను వేయలేరు. తండ్రి మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు. వారు సత్యము. వారెప్పుడూ వినాశనమవ్వరు. దీనిని తలక్రిందుల వృక్షము అని అంటారు. తండ్రి పైన ఉంటారు, ఆత్మలు తండ్రిని పైకి చూసి పిలుస్తూ ఉంటారు, శరీరమైతే పిలవలేదు. ఆత్మ అయితే ఒక శరీరము నుండి బయటకు వచ్చి ఇంకొక శరీరములోకి వెళ్ళిపోతుంది. ఆత్మ తరగదు, అలాగే పెరగదు, అలాగే ఎప్పుడూ మృత్యువును పొందదు. ఈ ఆట రచింపబడి ఉంది. మొత్తం ఆట యొక్క ఆదిమధ్యాంత రహస్యాన్ని తండ్రి తెలియజేశారు, ఆస్తికులుగా కూడా తయారుచేసారు. ఈ లక్ష్మీ-నారాయణులలో ఈ జ్ఞానం లేదు అని కూడా తెలియజేశారు. అక్కడైతే ఆస్తికులు, నాస్తికులను గురించి తెలియను కూడా తెలియదు. ఈ సమయములో తండ్రే అర్థాన్ని వివరిస్తున్నారు. ఎవరికైతే తండ్రి గురించి, అలాగే రచన ఆదిమధ్యాంతాల గురించి మరియు దీని కాలపరిమితిని గురించి తెలియదో వారినే నాస్తికులు అని అంటారు. ఈ సమయములో మీరు ఆస్తికులుగా అయ్యారు. అక్కడ ఈ విషయాలేవీ ఉండవు. ఇది ఒక ఆట కదా. ఏ విషయమైతే ఒక క్షణము జరుగుతుందో, అది మళ్ళీ మరుక్షణములో ఉండదు. డ్రామాలో టిక్, టిక్ అని తిరుగుతూ ఉంటుంది. ఏదైతే గతించిందో, ఆ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఏ విధంగా సినిమా ఉంటుంది, రెండు గంటలు లేక మూడు గంటల తర్వాత మళ్ళీ అదే సినిమా అచ్చంగా అలాగే రిపీట్ అవుతుంది. అందులో ఇళ్ళు మొదలైనవి కూల్చేస్తారు, మళ్ళీ చూస్తే అవి నిర్మింపబడి ఉంటాయి. అది అచ్చంగా అదే విధంగా రిపీట్ అవుతుంది. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. ముఖ్యమైన విషయమేమిటంటే - ఆత్మలకు తండ్రి పరమాత్మ. ఆత్మలు, పరమాత్మ ఎంతోకాలం దూరంగా ఉన్నారు... వారు వేరవుతారు, పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తారు. మీరు పూర్తి 5000 సంవత్సరాలు వేరుగా ఉన్నారు. మధురమైన పిల్లలైన మీకు ఆల్రౌండ్ పాత్ర లభించింది, కావున మీకే అర్థం చేయిస్తారు. జ్ఞానానికి కూడా మీరు అధికారులు. అందరికన్నా ఎక్కువ భక్తిని ఎవరైతే చేసారో, జ్ఞానములో కూడా వారే చురుకుగా ముందుకు వెళ్తారు, పదవి కూడా ఉన్నతమైనది పొందుతారు. మొట్టమొదట ఒక్క శివబాబా భక్తి జరుగుతుంది, ఆ తర్వాత దేవతలది. ఆపై పంచ తత్వాలకు కూడా భక్తి చేస్తారు, వ్యభిచారులుగా అయిపోతారు. ఇప్పుడు అనంతమైన తండ్రి మిమ్మల్ని అనంతములోకి తీసుకువెళ్తారు, వాళ్ళేమో అనంతమైన భక్తి యొక్క అజ్ఞానములోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి. మళ్ళీ ఇక్కడి నుండి బయటకు వెళ్ళడంతో మాయ మరిపింపజేస్తుంది. ఏ విధంగా గర్భములో ఉన్నప్పుడు - మేము ఇలా చేయము అని పశ్చాత్తాపపడతారు, కానీ మళ్ళీ బయటకు రావడంతో మర్చిపోతారో, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది, బయటకు వెళ్ళడంతోనే మర్చిపోతారు. ఇది మర్చిపోవడము మరియు మర్చిపోకుండా ఉండడము యొక్క ఆట. ఇప్పుడు మీరు తండ్రికి దత్తత తీసుకోబడ్డ పిల్లలుగా అయ్యారు. శివబాబా ఉన్నారు కదా. వారు సర్వాత్మల అనంతమైన తండ్రి. తండ్రి ఎంత దూరం నుండి వస్తారు. వారి ఇల్లు పరంధామము. పరంధామము నుండి వచ్చారంటే తప్పకుండా పిల్లల కొరకు కానుకను తీసుకువస్తారు. వారు అరచేతిలో వైకుంఠమును కానుకగా తీసుకువస్తారు. తండ్రి అంటారు, క్షణములో స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకోండి. కేవలం తండ్రిని తెలుసుకోండి. సర్వాత్మల తండ్రి అయితే ఉన్నారు కదా. నేను మీ తండ్రిని అని వారు అంటారు. నేను ఎలా వస్తాను అన్నది కూడా మీకు అర్థం చేయిస్తాను. నాకు రథమైతే తప్పకుండా కావాలి, అది ఏ రథము? ఎవరైనా మహాత్ముని రథమునైతే తీసుకోలేరు. మీరు బ్రహ్మాను భగవంతునిగా, బ్రహ్మాను దేవతగా చెప్తున్నారు అని మనుష్యులు అంటారు. అరే, మేము ఎక్కడ చెప్తున్నాము! వృక్షములో పూర్తిగా చివరిలో నిలబడ్డారు, ఆ సమయములో వృక్షము పూర్తిగా తమోప్రధానముగా ఉంది. బ్రహ్మా కూడా అక్కడ నిలబడ్డారంటే, అది అనేక జన్మల అంతిమములోని జన్మ అవుతుంది కదా. బాబా స్వయం చెప్తున్నారు - నా అనేక జన్మల అంతిమ జన్మలో ఎప్పుడైతే వానప్రస్థావస్థ ఉంటుందో, అప్పుడు తండ్రి వచ్చారు. వారు వచ్చి వ్యాపారాలు మొదలైనవన్నీ వదిలేలా చేసారు. 60 సంవత్సరాల తర్వాత మనుష్యులు భగవంతుడిని కలుసుకునేందుకు భక్తిని చేస్తారు.

తండ్రి అంటారు - మీరంతా మనుష్య మతముపై ఉండేవారు, ఇప్పుడు బాబా మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. శాస్త్రాలను వ్రాసేవారు కూడా మనుష్యులే. దేవతలైతే వ్రాయరు, అలాగే వారు చదవరు కూడా. సత్యయుగములో శాస్త్రాలు ఉండవు, అక్కడ భక్తియే ఉండదు. శాస్త్రాలలో అన్ని కర్మకాండలూ వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఆ విషయమేదీ లేదు. బాబా జ్ఞానాన్ని ఇవ్వడాన్ని మీరు చూస్తారు. భక్తి మార్గములోనైతే మనం ఎన్నో శాస్త్రాలను చదివాము. మీరు వేద-శాస్త్రాలు మొదలైనవాటిని నమ్మరా? అని ఎవరైనా అడిగితే మీరు చెప్పండి - మనుష్యమాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరి కంటే ఎక్కువగా మేమే నమ్ముతాము. మొదటి నుండి అవ్యభిచారీ భక్తిని మేమే ప్రారంభించాము, ఇప్పుడు మాకు జ్ఞానము లభించింది, జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది, మరి మేము ఆ భక్తిని ఎందుకు చేస్తాము? అని చెప్పండి. తండ్రి అంటారు - పిల్లలూ, చెడు వినకండి, చెడు చూడకండి... కావున తండ్రి ఎంత సరళరీతిలో అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. నేను ఆత్మను. వారైతే నేనే అల్లాను అని అనేస్తారు. మీకు ఇక్కడ - నేను ఒక ఆత్మను, తండ్రి సంతానాన్ని అన్న శిక్షణ లభిస్తుంది. దీనినే మాయ ఘడియ-ఘడియ మరిపింపజేస్తుంది. దేహాభిమానులుగా అవ్వడం వలనే తప్పుడు కర్మలు జరుగుతాయి. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, తండ్రిని మర్చిపోకండి, సమయాన్ని వృధా చేయకండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. రచయిత మరియు రచనల రహస్యాన్ని యథార్థముగా అర్థం చేసుకొని ఆస్తికులుగా అవ్వాలి. డ్రామా జ్ఞానములో తికమకపడకూడదు. మీ బుద్ధిని హద్దు నుండి తొలగించుకొని అనంతములోకి తీసుకువెళ్ళాలి.

2. సూక్ష్మవతనవాసీ ఫరిశ్తాగా అయ్యేందుకు సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి. ఆత్మలో ఏ చెత్త అయితే నిండి ఉందో, దానిని స్మృతి బలముతో తొలగించుకొని శుభ్రం చేసుకోవాలి.

వరదానము:-

ఈశ్వరీయ రసాన్ని అనుభవము చేసి ఏకరస స్థితిలో స్థితులై ఉండే శ్రేష్ఠ ఆత్మా భవ

ఏ పిల్లలైతే ఈశ్వరీయ రసాన్ని అనుభవం చేస్తారో, వారికి ప్రపంచములోని అన్ని రసాలు చప్పగా అనిపిస్తాయి. ఉన్నది ఒకే మధురమైన రసమైనప్పుడు ఇక ఆ ఒక్కదాని వైపుకే అటెన్షన్ వెళ్తుంది కదా. సహజముగానే మనసు ఒకే వైపుకు వెళ్తుంది, కష్టమనిపించదు. తండ్రి స్నేహము, తండ్రి సహాయము, తండ్రి తోడు, తండ్రి ద్వారా సర్వ ప్రాప్తులు సహజముగానే ఏకరస స్థితిని తయారుచేస్తాయి. ఇటువంటి ఏకరస స్థితిలో స్థితులై ఉండే ఆత్మలే శ్రేష్ఠమైనవారు.

స్లోగన్:-

చెత్తను ఇముడ్చుకుని రత్నాలను ఇవ్వటమే మాస్టర్ సాగరులుగా అవ్వటము.