09-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మీకు జ్ఞాన రత్నాలను ఇవ్వడానికి వచ్చారు, తండ్రి మీకు ఏదైతే వినిపిస్తున్నారో లేక అర్థం చేయిస్తున్నారో అది జ్ఞానము, జ్ఞాన రత్నాలను జ్ఞానసాగరుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు’’

ప్రశ్న:-
ఆత్మ విలువ తక్కువైపోవడానికి ముఖ్య కారణము ఏమిటి?

జవాబు:-
మాలిన్యము చేరడం వల్ల విలువ తగ్గిపోతుంది. ఏ విధంగా బంగారములో లోహాలను కలిపి నగలను తయారుచేయడం ద్వారా దాని విలువ తగ్గిపోతుందో, అదే విధంగా సత్యమైన బంగారముగా ఉండే ఆత్మలో ఎప్పుడైతే అపవిత్రతతో కూడిన మాలిన్యము చేరుతుందో, అప్పుడు దాని విలువ తగ్గిపోతుంది. ఈ సమయములో తమోప్రధాన ఆత్మకు ఎటువంటి విలువా లేదు. శరీరానికి కూడా ఎటువంటి విలువా లేదు. ఇప్పుడు మీ ఆత్మ మరియు శరీరము, రెండూ స్మృతి ద్వారా విలువైనవిగా తయారవుతున్నాయి.

పాట:-
ఈ రోజు ఉదయముదయమే ఎవరు వచ్చారు...

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు మరియు స్మృతికి యుక్తులను కూడా తెలియజేస్తున్నారు. పిల్లలు కూర్చున్నారు, భోళానాథుడైన శివబాబా వచ్చారు అని పిల్లలకు లోపల ఉంది. ఒకవేళ అరగంట శాంతిగా కూర్చుంటే, ఏమీ మాట్లాడకపోతే, మీ లోపల ఆత్మ - శివబాబా ఏదైనా మాట్లాడాలి అని అంటుంది. శివబాబా విరాజమానమై ఉన్నారు, కానీ ఏమీ మాట్లాడడం లేదు అని మీకు తెలుసు. ఇది కూడా మీ స్మృతి యాత్రయే కదా. బుద్ధిలో శివబాబా స్మృతియే ఉంది. బాబా ఏమైనా మాట్లాడాలి, జ్ఞాన రత్నాలను ఇవ్వాలి అని లోపల భావిస్తారు. తండ్రి పిల్లలైన మీకు జ్ఞాన రత్నాలను ఇచ్చేందుకే వస్తారు. వారు జ్ఞానసాగరుడు కదా. వారు అంటారు, పిల్లలూ, దేహీ-అభిమానులుగా ఉండండి, తండ్రిని స్మృతి చేయండి. ఇది జ్ఞానము. తండ్రి అంటారు, ఈ డ్రామా చక్రమును, మెట్ల వరుసను మరియు తండ్రిని స్మృతి చేయండి - ఇది జ్ఞానము. బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దానిని జ్ఞానము అని అంటారు. స్మృతి యాత్రను కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇవన్నీ జ్ఞాన రత్నాలు. స్మృతి విషయమునేదైతే అర్థం చేయిస్తారో, ఆ రత్నాలన్నీ చాలా మంచివి. తండ్రి అంటారు, మీ 84 జన్మలను స్మృతి చేయండి. మీరు పవిత్రముగా వచ్చారు, మళ్ళీ పవిత్రముగా అయ్యే వెళ్ళాలి. కర్మాతీత అవస్థలోకి వెళ్ళాలి మరియు తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే ఆత్మ స్మృతి బలముతో సతోప్రధానముగా అవుతుందో అప్పుడే అది లభిస్తుంది. ఈ పదాలు చాలా విలువైనవి, వీటిని నోట్ చేసుకోవాలి. ఆత్మలోనే ధారణ జరుగుతుంది. ఈ శరీరమైతే ఇంద్రియాలతో కూడుకున్నది, ఇది వినాశనమైపోతుంది. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే నింపబడతాయి. తండ్రిలో కూడా సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞాన సంస్కారాలు నిండి ఉన్నాయి, అందుకే వారిని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. 84 జన్మల చక్రము పూర్తిగా సహజమైనది అని బాబా యథార్థ రీతిగా అర్థం చేయిస్తారు. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తయ్యింది. ఇప్పుడు మనం తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలి. మురికిపట్టిన ఆత్మ అయితే అక్కడికి వెళ్ళలేదు. మీ ఆత్మ పవిత్రముగా అయిపోతే ఇక ఈ శరీరము నుండి విముక్తి అయిపోతుంది. పవిత్ర శరీరమైతే ఇక్కడ లభించదు. ఇది పాత చెప్పు, దీని పట్ల వైరాగ్యము కలుగుతూ ఉంటుంది. ఆత్మ పవిత్రముగా అయి మళ్ళీ భవిష్యత్తులో మనం పవిత్ర శరీరాన్ని తీసుకోవాలి. సత్యయుగములో ఆత్మ అయిన మనం మరియు శరీరము, రెండూ పవిత్రముగా ఉండేవి. ఈ సమయములో మీ ఆత్మ అపవిత్రముగా అయిపోయింది కావున శరీరము కూడా అపవిత్రముగా అయ్యింది. బంగారము ఎలా ఉంటుందో నగలు కూడా అలా ఉంటాయి. సాధారణమైన బంగారు నగలనే ధరించండి, వాటి ధర తక్కువగా ఉంటుంది అని గవర్నమెంట్ కూడా అంటుంది. ఇప్పుడు మీ ఆత్మ విలువ కూడా తక్కువగా ఉంది. అక్కడ మీ ఆత్మకు ఎంత విలువ ఉంటుంది. సతోప్రధానముగా ఉంటుంది కదా. ఇప్పుడు తమోప్రధానముగా ఉంది. మాలిన్యము చేరింది, ఎందుకూ పనికిరానట్లుగా ఉంది. అక్కడ ఆత్మ పవిత్రముగా ఉంటుంది కావున చాలా విలువ ఉంటుంది. ఇప్పుడు తొమ్మిది క్యారెట్లు కలదిగా అయిపోయింది కావున ఎటువంటి విలువా లేదు, అందుకే తండ్రి అంటారు, ఆత్మను పవిత్రముగా చేసుకోండి తద్వారా శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు.

నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రియే అంటారు. శ్రీకృష్ణుడు ఎలా అంటారు. వారు దేహధారి కదా. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి, ఏ దేహధారినీ స్మృతి చేయకండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, కావున మళ్ళీ అర్థం చేయించాలి. శివబాబా నిరాకారుడు, వారి జన్మ అలౌకికమైనది. పిల్లలైన మీరు కూడా అలౌకిక జన్మను ఇస్తారు. అలౌకిక తండ్రి మరియు అలౌకిక పిల్లలు. లౌకిక, పారలౌకిక మరియు అలౌకిక అని అంటారు. పిల్లలైన మీకు అలౌకిక జన్మ లభిస్తుంది. తండ్రి మిమ్మల్ని దత్తత తీసుకుని వారసత్వాన్ని ఇస్తారు. బ్రాహ్మణులైన మనది కూడా అలౌకిక జన్మ అని మీకు తెలుసు. అలౌకిక తండ్రి నుండి అలౌకిక వారసత్వము లభిస్తుంది. బ్రహ్మాకుమార, కుమారీలు తప్ప ఇంకెవ్వరూ స్వర్గాధిపతులుగా అవ్వలేరు. మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు. మీకు తండ్రి ఎంతగా అర్థం చేయిస్తారు. ఆత్మ ఏదైతే అపవిత్రముగా అయ్యిందో అది స్మృతి లేకుండా పవిత్రముగా అవ్వలేదు. స్మృతిలో ఉండకపోతే మాలిన్యము ఉండిపోతుంది, పవిత్రముగా అవ్వలేకపోతారు, అప్పుడిక శిక్షలు అనుభవించవలసి వస్తుంది. మొత్తం ప్రపంచములోని మనుష్యాత్మలంతా పవిత్రముగా అయి తిరిగి వెళ్ళాలి. శరీరమైతే వెళ్ళదు. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించడం ఎంత కష్టముగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో ఆ అవస్థ ఉండదు. తండ్రి అంటారు, అచ్ఛా, స్వయాన్ని ఆత్మగా భావించలేకపోతుంటే మరి శివబాబానైనా స్మృతి చేయండి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ ఇదే శ్రమ చేయండి - ఆత్మనైన నేను ఈ శరీరము ద్వారా పని చేస్తున్నాను, ఆత్మనైన నేనే శివబాబాను స్మృతి చేస్తున్నాను. ఆత్మయే మొట్టమొదట పవిత్రముగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ పవిత్రముగా అవ్వాలి, ఇదే శ్రమతో కూడుకున్నది. ఇందులో చాలా గొప్ప సంపాదన ఉంది. ఇక్కడ ఎంత షావుకార్లుగా ఉన్నా, కోటానుకోట్లు ఉన్నా కానీ ఆ సుఖము లేదు. అందరి తలపైనా దుఃఖము ఉంది. గొప్ప-గొప్ప రాజులు, ప్రెసిడెంట్లు మొదలైనవారు ఈ రోజు ఉంటారు, రేపు వారిని హతమార్చేస్తారు. విదేశాలలో ఏమేమి జరుగుతూ ఉంటుందో చూడండి. షావుకార్లకు, రాజులకు అయితే ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎవరైతే రాజులుగా ఉన్నారో వారు ప్రజలుగా అయిపోయారు. రాజులపై మళ్ళీ ప్రజల రాజ్యము ఏర్పడింది. డ్రామాలో ఇలా నిశ్చితమై ఉంది. చివరి సమయములోనే ఇటువంటి పరిస్థితి ఉంటుంది. పరస్పరం ఎంతగానో కొట్లాడుకుంటూ ఉంటారు. కల్పక్రితము కూడా ఇలా జరిగిందని మీకు తెలుసు. మీరు గుప్త వేషములో హృదయపూర్వకముగా, ప్రేమతో మీరు పోగొట్టుకున్న రాజ్యాన్ని తీసుకుంటున్నారు. మేము అధిపతులుగా ఉండేవారము, సూర్యవంశీ దేవతలుగా ఉండేవారము అని మీకు పరిచయము లభించింది. ఇప్పుడు మళ్ళీ అలా తయారయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు సత్యనారాయణుని కథను వింటున్నారు కదా. తండ్రి ద్వారా మనం నరుని నుండి నారాయణునిగా ఎలా అవుతాము? తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. భక్తి మార్గములో ఇది ఎవ్వరూ నేర్పించలేరు. మనుష్యమాత్రులెవ్వరినీ తండ్రి, టీచర్, గురువు అని అనలేరు. భక్తిలో ఎన్ని పాత కథలను కూర్చుని వినిపిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు 21 జన్మలు విశ్రాంతిని పొందేందుకు పావనముగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది.

తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. అర్ధకల్పమైతే డ్రామానుసారముగా దేహాభిమానులుగా ఉంటారు, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వాలి. డ్రామానుసారముగా ఇప్పుడు పాత ప్రపంచము మారి కొత్తగా అవ్వనున్నది. ప్రపంచమైతే ఒక్కటే. పాత ప్రపంచము నుండి మళ్ళీ కొత్తగా అవుతుంది. కొత్త ప్రపంచములో కొత్త భారత్ ఉండేది కావున అందులో దేవీ-దేవతలు ఉండేవారు, దాని రాజధాని గురించి కూడా తెలుసు, యమునా నదీ తీరములో రాజధాని ఉండేది, దానిని పరిస్తాన్ అని కూడా అనేవారు. అక్కడ ప్రకృతి సిద్ధమైన సౌందర్యము ఉంటుంది. ఆత్మ పవిత్రముగా అయితే ఆ పవిత్ర ఆత్మకు శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. తండ్రి అంటారు, నేను వచ్చి మిమ్మల్ని సుందరమైన దేవీ-దేవతలుగా తయారుచేస్తాను. పిల్లలైన మీరు స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి - మాలో ఎటువంటి అవగుణాలైతే లేవు కదా? మేము స్మృతిలో ఉంటున్నామా? చదువును కూడా చదువుకోవాలి. ఇది చాలా పెద్ద చదువు. ఈ చదువు ఇది ఒక్కటే, ఆ చదువులో అయితే ఎన్ని పుస్తకాలు మొదలైనవి చదువుతూ ఉంటారు. ఇది ఉన్నతోన్నతమైన చదువు, చదివించేవారు కూడా ఉన్నతోన్నతమైన శివబాబాయే. శివబాబా ఈ ప్రపంచానికి అధిపతి అని కాదు. విశ్వానికి అధిపతులుగా అయితే మీరే అవుతారు కదా. ఎన్ని కొత్త-కొత్త గుహ్యమైన విషయాలను మీకు వినిపిస్తూ ఉంటారు. పరమాత్మ సృష్టికి యజమాని అని మనుష్యులు భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, నేను ఈ సృష్టికి అధిపతిని కాను, మీరే అధిపతులుగా అవుతారు, మళ్ళీ తర్వాత రాజ్యాన్ని పోగొట్టుకుంటారు, మళ్ళీ తండ్రి వచ్చి విశ్వాధిపతులుగా తయారుచేస్తారు. విశ్వము అని దీనినే అంటారు. మూలవతనము లేక సూక్ష్మవతనానికి సంబంధించిన విషయము కాదు. మూలవతనము నుండి మీరు ఇక్కడకు వచ్చి 84 జన్మల చక్రములో తిరుగుతారు. మళ్ళీ తండ్రి రావలసి ఉంటుంది. మీరు పోగొట్టుకున్న ఆ ప్రారబ్ధాన్ని పొందేందుకు ఇప్పుడు మళ్ళీ మీ చేత పురుషార్థము చేయిస్తాను. ఇది గెలుపు-ఓటముల ఆట కదా. ఈ రావణ రాజ్యము అంతమవ్వనున్నది. తండ్రి ఎంత సహజ రీతిలో అర్థం చేయిస్తారు. తండ్రి స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తారు. అక్కడైతే మనుష్యులు మనుష్యులను చదివిస్తారు. వాస్తవానికి మీరు కూడా మనుష్యులే కానీ తండ్రి ఆత్మలైన మీకు కూర్చుని చదివిస్తారు. చదువు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఇప్పుడు మీరు చాలా నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారు. అదంతా భక్తి యొక్క జ్ఞానము. సంపాదన కొరకు కూడా జ్ఞానము ఉంది, అలాగే శాస్త్రాల జ్ఞానము కూడా ఉంది. ఇది ఆత్మిక జ్ఞానము. మీ ఆత్మకు ఆత్మిక తండ్రి కూర్చుని జ్ఞానాన్ని వినిపిస్తారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మీరు విన్నారు. మొత్తం మనుష్య సృష్టిలో ఇలా ఎప్పుడూ ఎవ్వరూ చదివించి ఉండరు. ఈశ్వరుడు ఎలా చదివిస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు.

ఇప్పుడు ఈ చదువు ద్వారా రాజ్య స్థాపన జరుగుతోందని పిల్లలైన మీకు తెలుసు. ఎవరైతే బాగా చదువుతారో మరియు శ్రీమతముపై నడుస్తారో, వారు ఉన్నతోన్నతులుగా అవుతారు మరియు ఎవరైతే వెళ్ళి తండ్రిని నిందింపజేస్తారో, చేతిని వదిలేస్తారో, వారు ప్రజలలో చాలా తక్కువ పదవిని పొందుతారు. తండ్రి అయితే ఒకే చదువును చదివిస్తారు. చదువులో ఎంత అవకాశము ఉంది. దైవీ రాజ్యము ఉండేది కదా. ఇక్కడకు వచ్చి రాజ్య స్థాపన చేసే తండ్రి ఒక్కరే, మిగిలినదంతా వినాశనమైపోనున్నది. తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు త్వరగా ఏర్పాట్లు చేసుకోండి. నిర్లక్ష్యము చేసి సమయాన్ని వృధా చేయకండి. స్మృతి చేయకపోతే అతి విలువైన సమయమును నష్టపోతారు. శరీర నిర్వహణార్థము వ్యాపారాలు మొదలైనవి చేసినా కానీ చేతులు పని మీద, హృదయము ప్రియుని వైపు ఉండాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే రాజ్యము మీకు లభిస్తుంది. ఖుదా దోస్త్ కథను కూడా విన్నారు కదా. అల్లా అవల్దీన్ నాటకాన్ని కూడా చూపిస్తారు. దీపాన్ని రుద్దగానే ఖజానా బయటకు వచ్చింది. అలా అల్లా మిమ్మల్ని పట్టుకోగానే ఎలాంటివారిని ఎలా తయారుచేస్తారు అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వెంటనే దివ్యదృష్టి ద్వారా వైకుంఠానికి వెళ్ళిపోతారు. పూర్వము పిల్లలు పరస్పరం కలిసి కూర్చునేవారు, ఆ తర్వాత తమంతట తామే ధ్యానములోకి వెళ్ళిపోయేవారు, దానిని ఇంద్రజాలము అని అనేవారు కావున ఇక దానిని ఆపేసారు. కావున ఆ విషయాలన్నీ ఈ సమయానికి చెందినవే. హాతిమతాయి కథ కూడా ఉంది. నోటిలో నాణెము వేయగానే మాయ మాయమైపోయేది. ఆ నాణెము బయటకు తీయడంతో మాయ వచ్చేసేది. దాని రహస్యాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి అంటారు, పిల్లలూ, మీ నోటిలో నాణెము వేసుకోండి. మీరు శాంతి సాగరులు, ఆత్మ శాంతిలో తన స్వధర్మములో ఉంటుంది. నేను ఒక ఆత్మను అని సత్యయుగములో కూడా మీకు తెలుసు. ఇకపోతే పరమాత్మ అయిన తండ్రిని గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే అక్కడ వికారాలు అనే మాటే ఉండదు అని చెప్పండి. దాని పేరే నిర్వికారీ ప్రపంచము. అక్కడ అసలు పంచ వికారాలే ఉండవు. దేహాభిమానమే ఉండదు. మాయ రాజ్యములో దేహాభిమానులుగా అవుతారు, అక్కడ మోహాజీతులుగా ఉంటారు. ఈ పాత ప్రపంచము నుండి నష్టోమోహులుగా అవ్వాలి. ఎవరైతే ఇళ్ళు-వాకిళ్ళను వదిలివేస్తారో వారికి వైరాగ్యము కలుగుతుంది. మీరైతే అలా ఇళ్ళు-వాకిళ్ళను వదలకూడదు. తండ్రి స్మృతిలో ఉంటూ ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళాలి. అందరి లెక్కాచారాలు తీరిపోనున్నాయి. ఆపై ఇక ఇంటికి వెళ్ళిపోతారు. ఇది కల్ప-కల్పమూ జరుగుతుంది. మీ బుద్ధి ఇప్పుడు దూరదూరాల వరకూ పైకి వెళ్తుంది. వాళ్ళు - సాగరము ఎంతవరకు ఉంది, సూర్యచంద్రాదులలో ఏముంది అని చూస్తూ ఉంటారు. ఇంతకుముందు వాటిని దేవతలుగా భావించేవారు. ఇవన్నీ రంగస్థలముపై దీపాలని మీరు అంటారు. ఇక్కడ నాటకము జరుగుతుంది. కావున ఈ దీపాలు కూడా ఇక్కడే ఉన్నాయి. మూలవతనము, సూక్ష్మవతనములో ఇవి ఉండవు. అక్కడ నాటకమే లేదు. ఈ అనాది నాటకము కొనసాగుతూ వస్తుంది, చక్రము తిరుగుతూ ఉంటుంది, ప్రళయమనేది జరగదు. భారత్ అవినాశీ ఖండము, ఇందులో మనుష్యులే ఉంటారు, ఇది జలమయమవ్వదు. పశుపక్ష్యాదులు మొదలైనవేవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. మిగిలిన ఖండాలేవైతే ఉన్నాయో అవి సత్య, త్రేతాయుగాలలో ఉండవు. మీరు దివ్యదృష్టి ద్వారా ఏదైతే చూసారో దానిని మళ్ళీ ప్రాక్టికల్ గా చూస్తారు. ప్రాక్టికల్ గా మీరు వైకుంఠములోకి వెళ్ళి రాజ్యము చేస్తారు. దాని కోసమే పురుషార్థము చేస్తూ ఉంటారు. అయినా తండ్రి అంటారు, స్మృతిలోనే ఎంతో శ్రమ ఉంది. మాయ స్మృతి చేయనివ్వదు. ఎంతో ప్రేమతో బాబాను స్మృతి చేయాలి. అజ్ఞాన కాలములో కూడా తమ తండ్రులను ప్రేమతో మహిమ చేస్తుంటారు. మా ఫలానావారు ఇలా ఉండేవారు, ఫలానా పదవిలో ఉండేవారు అని తలచుకుంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం సృష్టిచక్రమంతా కూర్చుని ఉంది. అన్ని ధర్మాల జ్ఞానము ఉంది. ఏ విధంగా అక్కడ ఆత్మల వృక్షము ఉందో, అలా ఇక్కడ మనుష్య సృష్టి యొక్క వృక్షము ఉంది. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మాయే. ఆ తర్వాత మీ వంశావళి. సృష్టి అయితే నడుస్తూనే ఉంటుంది కదా.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, నరుని నుండి నారాయణునిగా అవ్వాలంటే మీరు ఏదైతే చెప్తారో అదే చేయాలి. ముందుగా మీ అవస్థను చూసుకోవాలి. బాబా, మేమైతే మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే తీరుతాము అని అంటారు కావున ఆ నడవడిక కూడా కావాలి. ఇది ఒక్కటే నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు చదువుకునే చదువు. ఈ చదువును మీకు తండ్రియే చదివిస్తారు. రాజులకే రాజులుగా మీరే అవుతారు, ఇలా ఇంకే ఖండములోనూ ఉండరు. మీరు పవిత్ర రాజులుగా అవుతారు, ఆ తర్వాత ప్రకాశము లేని అపవిత్ర రాజులు పవిత్ర రాజులకు మందిరాలను తయారుచేసి పూజిస్తారు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. విద్యార్థులు టీచర్ ను ఎందుకు మర్చిపోతారు! బాబా, మాయ మరపింపజేస్తోంది అని అంటారు. దోషాన్ని మాయపై మోపుతారు. అరే, స్మృతి అయితే మీరే చేయాలి. ముఖ్యమైన టీచర్ ఒక్కరే, మిగిలినవారంతా సహాయక టీచర్లే. తండ్రిని మర్చిపోతుంటే, పోనీ టీచర్ ను స్మృతి చేయండి. మీకు మూడు అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకరిని మర్చిపోతే ఇంకొకరిని స్మృతి చేయండి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు ఏదైతే చెప్తారో అదే చేయండి, ఈ పురుషార్థము చేయాలి, మోహజీతులుగా అవ్వాలి.

2. సదా స్మృతిలో ఉండాలి - మేము శాంతిసాగరుని పిల్లలము, మేము శాంతిలో ఉండాలి. నోటిలో నాణెము వేసుకోవాలి. నిర్లక్ష్యములో మీ సమయాన్ని వృధా చేసుకోకండి.

వరదానము:-
సంగఠన రూపీ కోటను దృఢముగా చేసే సర్వుల స్నేహీ, సంతుష్ట ఆత్మ భవ

సంగఠన శక్తి విశేషమైన శక్తి. ఐక్యతతో ఉన్న సంగఠన రూపీ కోటను ఎవ్వరూ కదిలించలేరు. కానీ దీనికి ఆధారమేమిటంటే - ఒకరికొకరు స్నేహీలుగా అయి సర్వులకు గౌరవాన్ని ఇవ్వడము మరియు స్వయం సంతుష్టులుగా ఉంటూ సర్వులను సంతుష్టము చేయడము, ఎవరూ డిస్టర్బ్ అవ్వకూడదు మరియు ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు. అందరూ ఒకరికొకరు శుభ భావన మరియు శుభ కామన యొక్క సహయోగాన్ని ఇచ్చుకుంటూ ఉండాలి. అప్పుడు కోట దృఢముగా అయిపోతుంది. సంగఠన శక్తియే విజయానికి విశేష ఆధార స్వరూపము.

స్లోగన్:-
ఎప్పుడైతే ప్రతి కర్మ యథార్థముగా మరియు యుక్తియుక్తముగా ఉంటుందో, అప్పుడు పవిత్ర ఆత్మ అని అంటారు.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి

ఇప్పటి నుండి ఇది చేస్తాము, ఇలా చేస్తాము, తప్పకుండా చేస్తాము, చేసి చూపిస్తాము... అని పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయము కొరకు మరియు సేవ కొరకు ఉత్సాహముతో మంచి-మంచి సంకల్పాలను ఏవైతే చేస్తారో, ఇలాంటి శ్రేష్ఠ సంకల్పాల బీజాలను ఏవైతే నాటుతారో, ఆ సంకల్పాలను అనగా బీజాలను ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చే పాలనను చేస్తూ ఉండండి, అప్పుడు ఆ బీజాలు ఫల స్వరూపముగా అవుతాయి.