ఓంశాంతి
పిల్లలు ఇక్కడ మధుబన్ కు బాప్ దాదా వద్దకు వస్తారు. హాల్ లోకి వచ్చినప్పుడు, మొదట
సోదరీ-సోదరులు కూర్చోవడాన్ని చూస్తారు, ఆ తరువాత బాప్ దాదా వచ్చారు అన్నది చూస్తారు,
అప్పుడు తండ్రి స్మృతి కలుగుతుంది. మీరు ప్రజాపిత బ్రహ్మా యొక్క పిల్లలు,
బ్రాహ్మణులు మరియు బ్రాహ్మణీలు. ఆ బ్రాహ్మణులకు బ్రహ్మా తండ్రి గురించి తెలియనే
తెలియదు. పిల్లలైన మీకు తెలుసు - తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు
బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా తప్పకుండా కావాలి. త్రిమూర్తి శివ భగవానువాచ అని అంటారు.
ఇప్పుడు ముగ్గురు ద్వారానైతే మాట్లాడరు కదా. ఈ విషయాలను మంచి రీతిలో బుద్ధిలో ధారణ
చేయాలి. అనంతమైన తండ్రి నుండి తప్పకుండా స్వర్గ వారసత్వము లభిస్తుంది, అందుకే
భక్తులందరూ భగవంతుడి నుండి ఏమి కోరుకుంటారు? జీవన్ముక్తి. ఇప్పుడు జీవన బంధనం ఉంది.
మీరు వచ్చి ఈ బంధనాల నుండి ముక్తులుగా చేయండి అని అందరూ తండ్రిని స్మృతి చేస్తారు.
ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు - బాబా వచ్చి ఉన్నారు, కల్ప-కల్పమూ తండ్రి
వస్తారు. నీవే తల్లివి తండ్రివి... అని పిలుస్తారు కూడా కానీ దీని అర్థమైతే ఎవ్వరూ
అర్థం చేసుకోరు. నిరాకారుడైన తండ్రిని గురించి ఈ విధంగా అనుకుంటారు, గాయనం చేస్తారు
కానీ ఏమీ లభించదు. ఇప్పుడు పిల్లలైన మీకు వారి నుండి వారసత్వము లభిస్తుంది, మళ్ళీ
కల్పం తరువాత లభిస్తుంది. పిల్లలకు తెలుసు - తండ్రి వచ్చి అర్ధకల్పము కొరకు
వారసత్వాన్ని ఇస్తారు మరియు రావణుడు శ్రాపాన్ని ఇస్తాడు. మనమంతా శ్రాపితులుగా
ఉన్నాము అన్నది కూడా ప్రపంచంలోని వారికి తెలియదు. రావణుడి శ్రాపము తగిలింది, అందుకే
అందరూ దుఃఖితులుగా ఉన్నారు. భారతవాసులు సుఖంగా ఉండేవారు. నిన్న ఈ లక్ష్మీ-నారాయణుల
రాజ్యము భారత్ లో ఉండేది. దేవతల ఎదురుగా తల వంచి నమస్కరిస్తారు, పూజ చేస్తారు కానీ
సత్యయుగము ఎప్పుడు ఉండేది అన్నది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు చూడండి లక్షల సంవత్సరాల
ఆయువును కేవలం సత్యయుగానికే చూపించారు, ఆ తరువాత త్రేతా యుగము, ద్వాపర-కలియుగాలు, ఆ
లెక్కన చూస్తే మనుష్యులు ఎంత లెక్కలేనంతమంది అయిపోతారు. కేవలం సత్యయుగంలోనే
లెక్కలేనంతమంది మనుష్యులు అయిపోతారు. మనుష్యులెవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. తండ్రి
కూర్చుని అర్థం చేయిస్తారు - చూడండి, 33 కోట్ల మంది దేవతలు ఉంటారని గాయనం కూడా
చేస్తారు. అంత తక్కువ మందేమీ లక్షల సంవత్సరాలలో ఉండరు. కావున ఇది కూడా మనుష్యులకు
అర్థం చేయించాల్సి ఉంటుంది.
ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు - బాబా మనల్ని స్వచ్ఛ బుద్ధి కలవారిగా
తయారుచేస్తారు అని. రావణుడు మలినమైన బుద్ధి కలవారిగా చేస్తాడు. ముఖ్యమైన విషయము ఇదే.
సత్యయుగములో పవిత్రమైనవారు ఉంటారు, ఇక్కడ అపవిత్రమైనవారు ఉంటారు. ఇది కూడా ఎవ్వరికీ
తెలియదు - రామరాజ్యము ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది? రావణరాజ్యము ఎప్పటి నుండి
ఎప్పటి వరకు ఉంటుంది? ఇక్కడే రామరాజ్యమూ ఉంది, ఇక్కడే రావణరాజ్యమూ ఉంది అని
భావిస్తారు. అనేక మత-మతాంతరాలు ఉన్నాయి కదా. ఎంతమంది మనుష్యులు ఉన్నారో, అన్ని మతాలు
ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పిల్లలైన మీకు ఒక అద్వైత మతము లభిస్తుంది, ఆ మతాన్ని
తండ్రియే ఇస్తారు. మీరు ఇప్పుడు బ్రహ్మా ద్వారా దేవతలుగా తయారవుతున్నారు. దేవతల
మహిమను ఈ విధంగా గాయనం చేస్తారు - సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అని... ఆ
మాటకొస్తే వారు కూడా మనుష్యులే, మనుష్యుల మహిమను ఎందుకు గాయనం చేస్తారు? తప్పకుండా
తేడా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా నంబరువారు పురుషార్థం అనుసారంగా
మనుష్యులను దేవతలుగా తయారుచేసే కర్తవ్యాన్ని నేర్చుకుంటారు. కలియుగీ మనుష్యులను మీరు
సత్యయుగీ దేవతలుగా తయారుచేస్తారు అనగా శాంతిధామానికి, బ్రహ్మాండానికి మరియు
విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు, ఇదైతే శాంతిధామము కాదు కదా. ఇక్కడైతే కర్మలు
తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అది స్వీట్ సైలెన్స్ హోమ్. ఇప్పుడు మీరు అర్థం
చేసుకుంటారు - ఆత్మలమైన మనము స్వీట్ హోమ్, బ్రహ్మాండానికి యజమానులము అని. అక్కడ
సుఖ-దుఃఖాలకు అతీతంగా ఉంటారు. ఆ తరువాత సత్యయుగములో విశ్వానికి యజమానులుగా అవుతారు.
ఇప్పుడు పిల్లలైన మీరు యోగ్యులుగా అవుతున్నారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఏక్యురేట్ గా
ఎదురుగా నిలబడి ఉంది. పిల్లలైన మీరు యోగబలం కలవారు. వారు బాహుబలం కలవారు. మీరు కూడా
యుద్ధ మైదానంలోనే ఉన్నారు, కానీ మీరు డబల్ అహింసకులు. వారు హింసకులు. హింస అని కామ
ఖడ్గాన్ని అంటారు. సన్యాసులు కూడా - ఇది హింస అని భావిస్తారు, అందుకే పవిత్రంగా
అవుతారు. కానీ మీకు తప్ప తండ్రి పట్ల ప్రీతి ఇంకెవ్వరికీ లేదు. ప్రేయసీ-ప్రియులకు
పరస్పరం ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేయసీ ప్రియులు కేవలం ఒక్క జన్మ కొరకు ఉంటారు.
మీరందరూ ప్రియుడినైన నా యొక్క ప్రియురాళ్ళు. భక్తి మార్గములో ప్రియుడినైన
నన్నొక్కడినే స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్నాను - ఈ అంతిమ జన్మలో
కేవలం పవిత్రంగా అవ్వండి మరియు యథార్థ రీతిలో స్మృతి చేయండి, ఆ తరువాత ఇక స్మృతి
చేయడం నుండి మీరు విముక్తులవుతారు. సత్యయుగములో స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు.
దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు. ఇది నరకము. దీనిని స్వర్గము అనైతే అనరు కదా. గొప్ప
వ్యక్తులు ఎవరైతే ధనవంతులుగా ఉంటారో, వారు ఏమని భావిస్తారంటే - మాకైతే ఇదే స్వర్గము,
విమానాలు మొదలైన వైభవాలన్నీ ఉన్నాయి అని, ఎంతటి అంధ విశ్వాసంలో ఉంటారు. నీవే తల్లివి,
తండ్రివి... అని గాయనము చేస్తారు కూడా, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఏ సుఖపు ఖజానా
లభించింది - ఇది ఎవ్వరికీ కూడా తెలియదు. మాట్లాడేదైతే అత్మ కదా. మాకు సుఖపు ఖజానా
లభించనున్నది అని ఆత్మలైన మీరు భావిస్తారు. దాని పేరే - స్వర్గము, సుఖధామము.
స్వర్గము అందరికీ చాలా మధురంగా కూడా అనిపిస్తుంది. మీకు ఇప్పుడు తెలుసు - స్వర్గములో
వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఎన్ని ఉండేవి. భక్తి మార్గములో కూడా ఎంత లెక్కలేనంత ధనము
ఉండేది, దానితో సోమనాథ మందిరాన్ని నిర్మించారు. ఒక్కొక్క చిత్రము లక్షల విలువ చేసేవి.
అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఎంతగా దోచుకుని తీసుకువెళ్ళారు! ముసల్మానులు వెళ్ళి
మసీదులు మొదలైనవాటిలో ఉపయోగించారు, అంతటి అపారమైన ధనము ఉండేది. ఇప్పుడు పిల్లలైన మీ
బుద్ధిలో ఉంది - మేము తండ్రి ద్వారా మళ్ళీ స్వర్గానికి యజమానులుగా అవుతాము. మా
మహళ్ళు బంగారముతో తయారుచేయబడి ఉంటాయి. ద్వారాలపై కూడా పొదగబడి ఉంటాయి. జైనుల
మందిరాలు కూడా ఈ విధంగా తయారుచేయబడి ఉంటాయి. ఇప్పుడు వజ్రాలు మొదలైనవి లేవు కదా, అవి
ఇంతకుముందు ఉండేవి. ఇప్పుడు మీకు తెలుసు, మనము తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని
తీసుకుంటున్నాము. శివబాబా రావడం కూడా భారత్ లోనే వస్తారు.
భారత్ కే శివ భగవానుడి నుండి స్వర్గం వారసత్వము లభిస్తుంది. క్రైస్టుకు 3 వేల
సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేది అని క్రిస్టియన్లు కూడా అంటారు. రాజ్యం
ఎవరు చేసేవారు? ఇది ఎవ్వరికీ తెలియదు. భారత్ చాలా పురాతనమైనది అనైతే భావిస్తారు.
అంటే ఇదే స్వర్గముగా ఉండేది కదా. తండ్రిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు అనగా
స్వర్గాన్ని స్థాపన చేసే తండ్రి. తప్పకుండా తండ్రి వచ్చి ఉంటారు, అప్పుడే మీరు
స్వర్గానికి యజమానులుగా అయి ఉంటారు. ప్రతి 5 వేల సంవత్సరాల తరువాత మీరు స్వర్గానికి
యజమానులుగా అవుతారు మళ్ళీ అర్ధకల్పము తరువాత రావణ రాజ్యము ప్రారంభమవుతుంది.
చిత్రాలలో ఎంత స్పష్టంగా చూపించండి అంటే, దానితో లక్షల సంవత్సరాల విషయము బుద్ధిలో
నుండి తొలగిపోవాలి. లక్ష్మీనారాయణులు ఒక్కరే ఉండరు, వారికి వంశం ఉంటుంది కదా, ఆ
తరువాత వారి పిల్లలు రాజులుగా అవుతూ ఉండవచ్చు. రాజులుగానైతే ఎంతో మంది అవుతారు కదా.
మొత్తం మాల అంతా తయారై ఉంది. మాలనే స్మరిస్తారు కదా. ఎవరైతే తండ్రికి సహాయకులుగా అయి
తండ్రి సేవ చేస్తారో, వారిదే మాల తయారవుతుంది. ఎవరైతే పూర్తి చక్రములోకి వస్తారో,
పూజ్యులుగా, పూజారులుగా అవుతారో వారిదే ఈ స్మృతి చిహ్నము. మీరు పూజ్యుల నుండి
పూజారులుగా అయినట్లయితే మళ్ళీ మీ మాలను కూర్చొని పూజిస్తారు. ముందుగా మాలపై చేతులు
పెట్టి, ఆ తర్వాత తల వంచి నమస్కరిస్తారు. ఆ తరువాత మాలను తిప్పడం మొదలుపెడతారు. మీరు
కూడా పూర్తి చక్రమంతా తిరుగుతారు, ఆ తరువాత శివబాబా నుండి వారసత్వాన్ని పొందుతారు.
ఈ రహస్యం మీకు మాత్రమే తెలుసు. మనుష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్కరి పేరున మాలను
తిప్పుతారు. కానీ అసలేమీ తెలియదు. ఇప్పుడు మీకు మాల గురించిన పూర్తి జ్ఞానము ఉంది,
ఇంకెవ్వరికీ ఈ జ్ఞానము లేదు. వీరు ఎవరి మాలను తిప్పుతున్నారు అన్నది క్రిస్టియన్లు
ఏమైనా అర్థం చేసుకుంటారా. ఎవరైతే తండ్రికి సహాయకులుగా అయి సేవ చేస్తారో, వారిదే ఈ
మాల. ఈ సమయములో అందరూ పతితులుగా ఉన్నారు, ఎవరైతే పావనంగా ఉండేవారో వారందరూ ఇక్కడికి
వస్తూ-వస్తూ ఇప్పుడు పతితులుగా అయిపోయారు, మళ్ళీ నంబరువారుగా అందరూ వెళ్తారు.
నంబరువారుగా వస్తారు, నంబరువారుగా వెళ్తారు. ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు.
ఇది వృక్షము. ఎన్ని కొమ్మలు-రెమ్మలు, మఠాలు, ఆశ్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పూర్తి
వృక్షమంతా సమాప్తమవ్వనున్నది, మళ్ళీ మీ పునాది వేయడం జరుగుతుంది. మీరు ఈ వృక్షానికి
పునాది. అందులో సూర్యవంశీయులు చంద్రవంశీయులు ఇరువురూ ఉన్నారు. సత్య-త్రేతాయుగాలలో
ఎవరైతే రాజ్యం చేసేవారు ఉన్నారో, వారి ధర్మము ఇప్పుడు లేనే లేదు, కేవలం చిత్రాలు
ఉన్నాయి. ఎవరి చిత్రాలు ఉన్నాయో, వారి జీవిత చరిత్రను కూడా తెలుసుకోవాలి కదా. ఫలానా
వస్తువు లక్షల సంవత్సరాల పురాతనమైనది అని అంటారు. ఇప్పుడు వాస్తవానికి అత్యంత
పురాతనమైనది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. దాని కన్నా పాతది ఇంకేదీ ఉండదు.
మిగిలినవన్నీ 2500 సంవత్సరాల నాటి పురాతనమైన వస్తువులు, కింద నుండి తవ్వి వెలికి
తీస్తారు కదా. భక్తి మార్గములో ఎవరైతే పూజలు చేస్తారో, వారు పురాతనమైన చిత్రాలను
తీస్తారు ఎందుకంటే భూకంపాలలో మందిరాలన్నీ కూలిపోతాయి మళ్ళీ కొత్తవి తయారవుతాయి.
వజ్రాలు, బంగారము మొదలైన గనులు ఇప్పుడు ఏవైతే ఖాళీ అయిపోయాయో, అవి మళ్ళీ అక్కడ
నిండుతాయి. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి కదా. తండ్రి ప్రపంచం యొక్క
చరిత్ర-భౌగోళికము గురించి అర్థం చేయించారు. సత్యయుగములో ఎంత తక్కువ మంది మనుష్యులు
ఉంటారు, ఆ తర్వాత వృద్ధి చెందుతారు. ఆత్మలన్నీ పరంధామం నుండి వస్తూ ఉంటాయి.
వస్తూ-వస్తూ వృక్షము వృద్ధి చెందుతుంది. తర్వాత వృక్షము ఎప్పుడైతే శిథిలావస్థకు
చేరుకుంటుందో, అప్పుడు - రాముడూ వెళ్ళిపోయాడు, రావణుడూ వెళ్ళిపోయాడు, వారి
పరివారంలోని అందరూ కూడా వెళ్ళిపోయారు అని అంటారు. అనేక ధర్మాలు ఉన్నాయి కదా. మన
పరివారము ఎంత చిన్నది. ఇది కేవలం బ్రాహ్మణుల పరివారము. అక్కడ ఎన్ని అనేక ధర్మాలు
ఉన్నాయి, జనాభా లెక్కను తెలియజేస్తారు కదా. వారంతా రావణ సాంప్రదాయము కలవారు. వారంతా
వెళ్ళిపోతారు. ఇక కొద్దిమంది మాత్రమే మిగులుతారు. రావణ సాంప్రదాయము వారు మళ్ళీ
స్వర్గములోకి రారు, అందరూ ముక్తిధామంలోనే ఉంటారు. ఇకపోతే మీలో ఎవరైతే చదువుకుంటారో,
వారు నంబరువారుగా స్వర్గములోకి వస్తారు.
ఏ విధంగా అది నిరాకారీ వృక్షము మరియు ఏ విధంగా ఇది మనుష్య సృష్టి వృక్షము అని
ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది మీ బుద్ధిలో ఉంది. చదువు పట్ల
శ్రద్ధ పెట్టకపోతే పరీక్షలో ఫెయిల్ అవుతారు. చదువుకుంటూ మరియు చదివిస్తూ ఉన్నట్లయితే
సంతోషము కూడా ఉంటుంది. ఒకవేళ వికారాలలో పడిపోతే, ఇక మిగిలినవన్నీ మర్చిపోతారు. ఆత్మ
పవిత్రమైన బంగారముగా ఉన్నప్పుడు అందులో ధారణ బాగా జరుగుతుంది. బంగారు పాత్ర
పవిత్రంగా, బంగారముగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పతితులుగా అయినట్లయితే వారు జ్ఞానాన్ని
వినిపించలేరు. ఇప్పుడు మీరు ఎదురుగా కూర్చున్నారు, గాడ్ ఫాదర్ అయిన శివబాబా ఆత్మలైన
మనల్ని చదివిస్తున్నారు అన్నది తెలుసు. ఆత్మలైన మనము ఈ ఇంద్రియాల ద్వారా వింటున్నాము.
చదివించేవారు తండ్రి, ఇటువంటి పాఠశాల మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా. వారు గాడ్
ఫాదర్, టీచర్ కూడా, సద్గురువు కూడా, అందరినీ తిరిగి తీసుకువెళ్తారు. ఇప్పుడు మీరు
తండ్రి సమ్ముఖంలో కూర్చొన్నారు. సమ్ముఖంగా మురళి వినడంలో ఎంత తేడా ఉంది. ఏ విధంగా ఈ
టేప్ మిషన్ వెలువడింది, అందరి వద్దకు ఒక రోజు చేరుకుంటుంది. పిల్లల సుఖం కోసం తండ్రి
ఇటువంటి వస్తువులను తయారు చేయిస్తారు. ఇదేమంత పెద్ద విషయం కాదు కదా. వీరు ధారాళంగా
ఇచ్చేవారు (సావల్ షా) కదా. మొదట తెల్లగా ఉండేవారు, ఇప్పుడు నల్లగా అయ్యారు, అందుకే
శ్యామసుందరుడు అని అంటారు. మీకు తెలుసు - మనము సుందరముగా ఉండేవారము, ఇప్పుడు
శ్యామముగా అయ్యాము, మళ్ళీ సుందరముగా అవుతాము అని. కేవలం ఒక్కరే ఎందుకు అవుతారు?
ఒక్కరినే పాము కాటేసిందా ఏమిటి? సర్పము అని మాయను అంటారు కదా. వికారాలలోకి వెళ్ళడంతో
నల్లగా అవుతారు. అవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు. అనంతమైన తండ్రి అంటారు -
గృహస్థ వ్యవహారములో ఉంటూ, ఈ అంతిమ జన్మలో ‘ఫర్ మై సేక్’ (నా కోసము) పవిత్రంగా
అవ్వండి. పిల్లలను ఈ భిక్ష అడుగుతున్నారు. కమల పుష్ప సమానముగా పవిత్రంగా అవ్వండి
మరియు నన్ను స్మృతి చేయండి, అప్పుడు ఈ జన్మలో కూడా పవిత్రంగా అవుతారు మరియు స్మృతిలో
ఉన్నట్లయితే గతంలో చేసిన వికర్మలు కూడా వినాశనమవుతాయి. ఇది యోగ అగ్ని, దీని ద్వారా
జన్మ-జన్మాంతరాల పాపాలు దగ్ధమవుతాయి. సతోప్రధానము నుండి సతో, రజో, తమోలోకి వస్తారు,
కావున కళలు తగ్గిపోతాయి. మాలిన్యం చేరుతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి అంటారు - కేవలం
నన్నొక్కరినే స్మృతి చేయండి. అంతేకానీ నీటి నదులలో స్నానం చేయడం వలన పావనంగా ఏమీ
అవ్వరు. నీరు కూడా తత్వమే కదా. పంచ తత్వాలు అని అంటారు. ఈ నదులు పతిత-పావనిగా ఎలా
అవ్వగలవు. నదులైతే సాగరం నుండి వెలువడతాయి. మొదటైతే సాగరము పతిత-పావనిగా అవ్వాలి కదా.
అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.