ఓంశాంతి
భక్తులు ఎవరినైతే మహిమ చేస్తారో, మీరు వారి సమ్ముఖములో కూర్చున్నారు కావున ఎంత
సంతోషము ఉండాలి. వారిని శివాయ నమః అని అంటారు. మీరైతే నమస్కరించవలసిన అవసరము లేదు.
తండ్రిని పిల్లలు స్మృతి చేస్తారే కానీ ఎప్పుడూ నమస్కరించరు. వీరు కూడా తండ్రియే,
వీరి నుండి మీకు వారసత్వము లభిస్తుంది. మీరు నమస్కరించరు, స్మృతి చేస్తారు. జీవాత్మ
స్మృతి చేస్తుంది. తండ్రి ఈ తనువును అప్పుగా తీసుకున్నారు. తండ్రి నుండి అనంతమైన
వారసత్వాన్ని ఎలా తీసుకోవాలి అనే దారిని వారు మనకు చెప్తున్నారు. మీకు కూడా బాగా
తెలుసు. సత్యయుగము సుఖధామము మరియు ఎక్కడైతే ఆత్మలు ఉంటారో, ఆ ప్రపంచాన్ని శాంతిధామము
అని అంటారు. మనము శాంతిధామ నివాసులము అని మీ బుద్ధిలో ఉంది. ఈ కలియుగాన్ని దుఃఖధామము
అనే అంటారు. ఆత్మలమైన మనము ఇప్పుడు స్వర్గములోకి వెళ్ళేందుకు, మనుష్యుల నుండి
దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నాము అని మీకు తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణులు దేవతలు
కదా. కొత్త ప్రపంచము కొరకు, మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వాలి. తండ్రి ద్వారా మీరు
చదువుకుంటున్నారు. ఎంత చదువుకుంటే అంత. చదువులో కొందరి పురుషార్థము తీవ్రముగా
ఉంటుంది, కొందరిది ఢీలాగా ఉంటుంది. సతోప్రధాన పురుషార్థులు ఎవరైతే ఉంటారో, వారు తమ
సమానముగా తయారుచేసే పురుషార్థాన్ని ఇతరుల చేత కూడా నంబరువారుగా చేయిస్తారు, వారు
అనేకుల కళ్యాణము చేస్తారు. ఎంతగా జోలిని ధనముతో నింపుకుని ఇతరులకు దానము చేస్తారో
అంత లాభము ఉంటుంది. మనుష్యులు దానము చేస్తారు, దానికి ప్రతిఫలము వచ్చే జన్మలో
అల్పకాలము కొరకు లభిస్తుంది. అందులో కాస్త సుఖము ఉంటుంది, మిగిలినదంతా దుఃఖమే దుఃఖము.
మీకైతే 21 జన్మల కొరకు స్వర్గ సుఖాలు లభిస్తాయి. ఆ స్వర్గ సుఖాలు ఎక్కడ, ఈ దుఃఖము
ఎక్కడ! అనంతమైన తండ్రి ద్వారా మీకు స్వర్గములో అనంతమైన సుఖము లభిస్తుంది.
ఈశ్వరార్థము దానపుణ్యాలు చేస్తారు కదా, అది ఇన్ డైరెక్ట్. ఇప్పుడు మీరైతే సమ్ముఖముగా
ఉన్నారు కదా. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థము చేయిస్తున్నారు - భక్తి మార్గములో
ఈశ్వరార్థము దానపుణ్యాలు చేస్తే దానికి ప్రతిఫలము వచ్చే జన్మలో లభిస్తుంది. ఎవరైనా
మంచి చేస్తే వారికి మంచి లభిస్తుంది, చెడు లేక పాపాలు మొదలైనవి చేస్తే వారికి
అటువంటి ప్రతిఫలమే లభిస్తుంది. ఇక్కడ కలియుగములోనైతే పాపాలే జరుగుతూ ఉంటాయి,
పుణ్యమనేదే ఉండదు. మహా అయితే అల్పకాలిక సుఖము లభిస్తుంది. ఇప్పుడైతే మీరు భవిష్య
సత్యయుగములో 21 జన్మల కొరకు సదా సుఖవంతులుగా అవుతారు. దాని పేరే సుఖధామము.
ప్రదర్శనీలో కూడా మీరు ఎలా వ్రాయవచ్చు అంటే - ఇది శాంతిధామానికి మరియు సుఖధామానికి
వెళ్ళే మార్గము, శాంతిధామానికి మరియు సుఖధామానికి వెళ్ళేందుకు సహజ మార్గము. ఇప్పుడు
ఉన్నది కలియుగము కదా. కలియుగము నుండి సత్యయుగానికి, పతిత ప్రపంచము నుండి పావన
ప్రపంచానికి పైసా ఖర్చు లేకుండా వెళ్ళేందుకు ఇది సహజమైన మార్గము అని వ్రాయండి.
అప్పుడు మనుషులు అర్థము చేసుకోగలుగుతారు. ఎందుకంటే వారు రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు.
తండ్రి చాలా సహజముగా అర్థం చేయిస్తారు. దీని పేరే సహజ రాజయోగము, సహజ జ్ఞానము.
తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా తయారుచేస్తారు. ఈ లక్ష్మీ-నారాయణులు
వివేకవంతులు కదా. శ్రీకృష్ణుడి గురించి ఏమేమో వ్రాసేశారు, అవన్నీ అసత్యమైన కళంకాలు.
అమ్మా, నేను వెన్న తినలేదు అని శ్రీకృష్ణుడు అంటారు... ఇప్పుడు దీని అర్థాన్ని కూడా
వారు అర్థం చేసుకోరు. వెన్న నేను తినలేదు అని అంటారు, మరి ఎవరు తిన్నారు? పిల్లలకు
పాలు త్రాగించటము జరుగుతుంది కదా, పిల్లలు వెన్న తింటారా లేక పాలు త్రాగుతారా!
కుండలు పగలకొట్టాడు అంటూ ఏవేవో చూపించారు, వాస్తవానికి అటువంటి విషయాలు ఏవీ జరగలేదు.
వారు స్వర్గానికి మొదటి యువరాజు. మహిమ అయితే ఒక్క శివబాబాకే చేయడము జరుగుతుంది.
ప్రపంచములో మరెవరికీ మహిమ లేదు. ఈ సమయములోనైతే అందరూ పతితులుగా ఉన్నారు కానీ భక్తి
మార్గానికి కూడా మహిమ ఉంది. భక్తుల మాల కూడా గాయనము చేయబడుతుంది కదా. స్త్రీలలో మీరా
పేరు ఉంది, పురుషులలో నారదుడు భక్తులలో ముఖ్యునిగా గాయనము చేయబడ్డారు. మీకు తెలుసు,
ఒకటి భక్తుల మాల, రెండవది జ్ఞాన మాల. భక్తుల మాల నుండి రుద్ర మాలకు చెందినవారిగా
అయ్యారు, తర్వాత రుద్ర మాల నుండి విష్ణు మాల తయారవుతుంది. రుద్ర మాల సంగమయుగానికి
చెందినది, ఈ రహస్యము పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ విషయాలను మీకు తండ్రి సమ్ముఖముగా
కూర్చుని అర్థము చేయిస్తున్నారు. సమ్ముఖముగా కూర్చున్నప్పుడు మీ రోమాలు
నిక్కబొడుచుకోవాలి. 100 శాతము దుర్భాగ్యశాలుల నుండి మనము సౌభాగ్యశాలులుగా అవుతాము,
ఇది మహా సౌభాగ్యము. కుమారీలైతే కామ ఖడ్గము కిందకు వెళ్ళలేదు. తండ్రి అంటారు, అది
కామము అనే ఖడ్గము. జ్ఞానాన్ని కూడా ఖడ్గము అని అంటారు. తండ్రి జ్ఞానపు
అస్త్ర-శస్త్రాలు అని చెప్తే, దానికి వారు దేవతలకు స్థూలమైన అస్త్ర-శస్త్రాలను
ఇచ్చారు. అవన్నీ హింసాయుతమైన వస్తువులు. స్వదర్శన చక్రము అంటే ఏమిటి అనేది
మనుష్యులకు తెలియదు. శాస్త్రాలలో శ్రీకృష్ణుడికి కూడా స్వదర్శన చక్రాన్ని చూపించి
హింసయే హింసను చూపించారు. వాస్తవానికి అది జ్ఞానానికి సంబంధించిన విషయము. మీరు
ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు, కానీ వారు దానిని హింసాయుతమైన విషయముగా
చూపించారు. పిల్లలైన మీకు ఇప్పుడు స్వ అనగా చక్రము యొక్క జ్ఞానము లభించింది. బాబా
మిమ్మల్ని - బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణ స్వదర్శన చక్రధారులు అని
పిలుస్తారు. దీని అర్థము కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మీలో మొత్తము 84
జన్మలు మరియు సృష్టి చక్రము యొక్క జ్ఞానము ఉంది. మొదట సత్యయుగములో ఒక్క సూర్యవంశీ
ధర్మమే ఉండేది, ఆ తర్వాత చంద్రవంశీ ధర్మము ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి స్వర్గము అని
అంటారు. ఈ విషయాలు పిల్లలైన మీలో కూడా నంబరువారుగా అందరి బుద్ధిలో ఉన్నాయి. ఏ విధంగా
మిమ్మల్ని బాబా చదివించారు మరియు మీరు చదువుకుని తెలివైనవారిగా అయ్యారు, అలా ఇప్పుడు
మీరు ఇతరుల కళ్యాణము చేయాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఎప్పటివరకైతే
బ్రహ్మాముఖవంశావళిగా అవ్వరో అప్పటివరకు శివబాబా నుండి వారసత్వాన్ని ఎలా తీసుకోగలరు.
ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. వారసత్వము శివబాబా నుండి తీసుకుంటున్నారు. ఈ
విషయాన్ని మర్చిపోకూడదు. పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇది 84 జన్మల మెట్ల వరుస. మెట్లు
దిగడము సహజముగానే అనిపిస్తుంది. మెట్లు ఎక్కేటప్పుడు నడుముకు చెయ్యి ఆన్చుకొని ఎలా
ఎక్కుతారు. కానీ లిఫ్ట్ కూడా ఉంది. ఇప్పుడు బాబా మీకు లిఫ్ట్ ఇవ్వడానికే వస్తారు.
క్షణములో ఎక్కే కళ ఏర్పడుతుంది. మేము ఎక్కే కళలో ఉన్నాము అని ఇప్పుడు పిల్లలైన మీకు
సంతోషము కలగాలి. అత్యంత ప్రియమైన బాబా లభించారు. వారి వంటి ప్రియమైన వస్తువు ఇంకేదీ
ఉండదు. సాధు-సన్యాసులు మొదలైనవారెవరైతే ఉన్నారో, వారంతా ఆ ఒక్క ప్రియుడినే స్మృతి
చేస్తారు, అందరూ వారికి ప్రేయసులే. కానీ వారు ఎవరు, ఇది ఏమీ అర్థం చేసుకోరు. కేవలం
సర్వవ్యాపి అని అనేస్తారు.
శివబాబా మమ్మల్ని వీరి ద్వారా చదివిస్తున్నారని మీకు ఇప్పుడు తెలుసు. శివబాబాకు
తమ శరీరమైతే లేదు. వారు పరమ ఆత్మ. పరమ ఆత్మ అనగా పరమాత్మ. వారి పేరు శివ. మిగిలిన
ఆత్మలందరికీ శరీరాలకు వేరు వేరు పేర్లు ఉంటాయి. పరమ ఆత్మ ఒక్కరే, వారి పేరు శివ.
మళ్ళీ మనుష్యులు వారికి అనేక పేర్లు పెట్టేశారు. భిన్న-భిన్న మందిరాలను నిర్మించారు.
ఇప్పుడు మీకు అర్థము తెలిసింది. బొంబాయిలో బాబూరినాథుని మందిరము ఉంది, ఈ సమయములో
వారు మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేస్తారు, తద్వారా మీరు విశ్వానికి
యజమానులుగా అవుతారు. కావున మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఏమిటంటే - ఆత్మలైన మన తండ్రి
ఒక్కరే, వారి నుండే భారతవాసులకు వారసత్వము లభిస్తుంది. భారత్ కు ఈ లక్ష్మీ-నారాయణులు
యజమానులు కదా. వీరు చైనాకు చెందినవారు కారు కదా. వీరు చైనాకు చెందినవారు అయి ఉంటే
వీరి ముఖకవళికలే వేరుగా ఉండేవి. వీరు భారత్ కు చెందినవారే. మొట్టమొదట తెల్లగా ఉంటారు,
ఆ తర్వాత నల్లగా అవుతారు. ఆత్మలోనే మలినాలు చేరుతాయి, అప్పుడు నల్లగా అవుతుంది.
ఉదాహరణలన్నీ వీరికి సంబంధించనవే. భ్రమరము పురుగులను పరివర్తన చేసి తన సమానముగా
తయారుచేస్తుంది. సన్యాసులు ఏం పరివర్తన చేస్తారు! శ్వేత వస్త్రధారులకు కాషాయ
వస్త్రాలను వేయించి గుండు గీయిస్తారు. మీరైతే ఈ జ్ఞానాన్ని తీసుకుంటారు, ఈ
లక్ష్మీ-నారాయణుల వలె శోభనీయులుగా అవుతారు. ఇప్పుడైతే ప్రకృతి కూడా తమోప్రధానముగా
ఉంది, అలాగే ఈ భూమి కూడా తమోప్రధానముగా ఉంది. నష్టము కలిగించేవిగా ఉన్నాయి. ఆకాశములో
తుఫానులు ఏర్పడినప్పుడు ఎంత నష్టము కలిగిస్తాయి, ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు
ఈ ప్రపంచములో ఉన్నది పరమ దుఃఖము. అక్కడ మళ్ళీ పరమ సుఖము ఉంటుంది. తండ్రి పరమ దుఃఖము
నుండి పరమ సుఖములోకి తీసుకువెళ్తారు. ఈ ప్రపంచము వినాశనమవుతుంది, ఇక తర్వాత అంతా
సతోప్రధానముగా తయారైపోతుంది. ఇప్పుడు మీరు పురుషార్థము చేసి తండ్రి నుండి ఎంత
వారసత్వము తీసుకోవాలనుకుంటే అంత తీసుకోండి. లేకపోతే - బాబా వచ్చారు కానీ నేను ఏమీ
తీసుకోలేదే అని చివరిలో పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. ప్రపంచానికి మంటలు
అంటుకున్నప్పుడు కుంభకర్ణుని నిద్ర నుండి మేలుకుంటారు అని వ్రాయబడి ఉంది. తర్వాత
ఆర్తనాదాలు చేస్తూ చనిపోతారు. ఆర్తనాదాల తర్వాత మళ్ళీ జయజయకారాలు జరుగుతాయి.
కలియుగములో ఆర్తనాదాలే ఉన్నాయి కదా. ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు. ఎంతోమంది
చనిపోతారు. కలియుగము తర్వాత మళ్ళీ సత్యయుగము తప్పకుండా వస్తుంది. మధ్యలో ఇది
సంగమయుగము. దీనిని పురుషోత్తమ యుగము అని అంటారు. తండ్రి తమోప్రధానము నుండి
సతోప్రధానముగా తయారయ్యేందుకు యుక్తిని మంచి రీతిలో తెలియజేస్తారు. వారు కేవలము ఇదే
చెప్తారు - నన్ను స్మృతి చేయండి అంతే, ఇంకేమీ చేయవలసిన అవసరము లేదు. ఇప్పుడు
పిల్లలైన మీరు తల వంచి నమస్కరించడము మొదలైనవి కూడా చేయనవసరము లేదు. బాబాకు ఎవరైనా
చేతులు జోడించి నమస్కరిస్తే బాబా అంటారు - ఆత్మ అయిన మీకూ చేతులు లేవు, తండ్రికి
కూడా చేతులు లేవు, మరి ఎవరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. కలియుగీ భక్తి
మార్గపు చిహ్నము ఒక్కటి కూడా ఉండకూడదు. ఓ ఆత్మా, నీవు చేతులు ఎందుకు జోడిస్తున్నావు?
కేవలము తండ్రినైన నన్ను స్మృతి చేయి. స్మృతి చేయడమంటే చేతులు జోడించడము కాదు.
మనుష్యులైతే సూర్యునికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తారు. అలాగే మహాత్ములకు కూడా
చేతులు జోడించి నమస్కరిస్తారు. మీరు చేతులు జోడించి నమస్కరించవలసిన అవసరము లేదు. ఇది
నేను అప్పుగా తీసుకున్న శరీరము. కానీ ఎవరైనా చేతులు జోడించి నమస్కరిస్తే దానికి
రిటర్నులో నమస్కరించవలసి ఉంటుంది. నేను ఆత్మను అని, నేను ఈ బంధనము నుండి విముక్తిని
పొంది ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని మీరు అర్థము చేసుకోవాలి. దీని పట్ల మీకు
అయిష్టము కలుగుతుంది. ఈ పాత శరీరాన్ని వదిలేయాలి. సర్పము ఉదాహరణ ఉంది కదా. భ్రమరములో
కూడా ఎంత తెలివి ఉంది, అది పురుగును భ్రమరముగా తయారుచేస్తుంది. అలాగే పిల్లలైన మీరు
కూడా విషయ సాగరములో ఎవరైతే మునకలు వేస్తున్నారో, వారిని దాని నుండి బయటకు తీసి
క్షీరసాగరములోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - ఇక శాంతిధామానికి పదండి.
మనుష్యులు శాంతి కొరకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. సన్యాసులకు స్వర్గము యొక్క
జీవన్ముక్తి లభించదు. అయితే, వారికి ముక్తి లభిస్తుంది, దుఃఖము నుండి విముక్తులై
శాంతిధామములో కూర్చుంటారు. కానీ ఎంతైనా ఆత్మ మొట్టమొదట జీవన్ముక్తిలోకే వస్తుంది. ఆ
తర్వాత మళ్ళీ జీవన బంధనములోకి వస్తుంది. ఆత్మ సతోప్రధానముగా ఉంటుంది, తర్వాత మెట్లు
దిగుతుంది. మొదట సుఖాన్ని అనుభవించి, ఆ తర్వాత దిగుతూ-దిగుతూ తమోప్రధానముగా
అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. తండ్రి
అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అయిపోతారు.
తండ్రి అర్థం చేయించారు - ఏ సమయములోనైతే మనుష్యులు శరీరము వదులుతారో, ఆ సమయములో
చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు ఎందుకంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. కాశీలోని
కత్తుల బావిలోకి దూకుతారు ఎందుకంటే శివునిపై బలి అవ్వడము ద్వారా ముక్తి లభిస్తుంది
అని విన్నారు. మీరు ఇప్పుడు బలి అవుతారు కదా, అందుకే భక్తి మార్గములో కూడా ఆ విషయాలు
కొనసాగుతాయి. కావున వారు వెళ్ళి శివునిపై బలి అవుతారు. ఇప్పుడు తండ్రి అర్థం
చేయిస్తున్నారు, వాస్తవానికి ఎవరూ తిరిగి వెళ్ళలేరు. అయితే, అంతగా బలి అయిన కారణముగా
పాపాలు అంతమవుతాయి, మళ్ళీ లెక్కాచారాలన్నీ కొత్తగా ప్రారంభమవుతాయి. మీరు ఈ సృష్టి
చక్రాన్ని తెలుసుకున్నారు. ఈ సమయములో అందరిదీ దిగే కళ. తండ్రి అంటారు, నేను వచ్చి
సర్వుల సద్గతిని చేస్తాను. అందరినీ ఇంటికి తీసుకువెళ్తాను. పతితులనైతే నాతోపాటు
తీసుకువెళ్ళను కదా, అందుకే ఇప్పుడు పవిత్రముగా అవ్వండి, తద్వారా మీ జ్యోతి
వెలుగుతుంది. వివాహము సమయములో స్త్రీ తలపైన ప్రమిదలో జ్యోతిని వెలిగిస్తారు. ఈ
సాంప్రదాయము కూడా ఇక్కడ భారత్ లోనే ఉంటుంది. స్త్రీ తలపైనే ప్రమిద పెట్టి జ్యోతిని
వెలిగిస్తారు, పతి తలపైన వెలిగించరు ఎందుకంటే వారు పతిని ఈశ్వరుడిగా భావిస్తారు.
ఈశ్వరుడి పైన జ్యోతిని ఎలా వెలిగిస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు, నా జ్యోతి అయితే
సదా వెలుగుతూనే ఉంటుంది, నేను మీ జ్యోతిని వెలిగిస్తాను. తండ్రిని దీపము అని కూడా
అంటారు. బ్రహ్మసమాజము వారు జ్యోతిని నమ్ముతారు, జ్యోతిని సదా వెలిగించి ఉంచుతారు,
దానినే స్మృతి చేస్తూ ఉంటారు, దానినే భగవంతునిగా భావిస్తారు. కొందరు ఏమనుకుంటారంటే
- చిన్న జ్యోతి అయిన ఆత్మ పెద్ద జ్యోతి అయిన పరమాత్మలో కలిసిపోతుంది అని. అనేక
అభిప్రాయాలు ఉన్నాయి. తండ్రి అంటారు, మీ ధర్మమైతే అపారమైన సుఖాన్ని ఇచ్చే ధర్మము.
మీరు స్వర్గములో ఎంతో సుఖాన్ని చూస్తారు. కొత్త ప్రపంచములో మీరు దేవతలుగా అవుతారు.
మీరు చదివే ఈ చదువు భవిష్యత్తులోని కొత్త ప్రపంచము కోసము, ఇతర చదువులన్నీ ఈ ప్రపంచము
కోసమే ఉంటాయి. ఇక్కడ మీరు చదువుకుని భవిష్యత్తులో పదవిని పొందాలి. గీతలో కూడా
తప్పకుండా రాజయోగాన్ని నేర్పించారు. ఆ తర్వాత చివరిలో యుద్ధము జరిగింది, ఇంకేమీ
మిగల్లేదు. పాండవులతో పాటు ఒక కుక్కను చూపిస్తారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నేను
మిమ్మల్ని దేవీ-దేవతలుగా తయారుచేస్తాను. ఇక్కడైతే అనేక రకాలుగా దుఃఖాన్ని ఇచ్చే
మనుష్యులు ఉన్నారు. కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఎంత దుఃఖితులుగా చేస్తారు. కావున
ఇప్పుడు పిల్లలైన మీకు - అనంతమైన తండ్రి, జ్ఞానసాగరుడు మమ్మల్ని చదివిస్తున్నారు
అన్న ఈ సంతోషము ఉండాలి. వారు అత్యంత ప్రియమైన ప్రియుడు. ప్రేయసులమైన మనము వారిని
అర్ధకల్పము స్మృతి చేస్తాము. మీరు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు, ఇప్పుడు తండ్రి
అంటారు - నేను వచ్చాను, మీరు నా డైరెక్షన్లపై నడవండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇతరులనెవ్వరినీ కాదు. కేవలము నా స్మృతి ద్వారా తప్ప
ఇంకే విధంగానూ మీ పాపాలు భస్మమవ్వవు. ప్రతి విషయములోనూ సర్జన్ నుండి సలహాను అడుగుతూ
ఉండండి. ఈ, ఈ విధంగా వారితో వ్యవహరించండి అని బాబా సలహా ఇస్తారు. ఒకవేళ మీరు సలహాపై
నడిచినట్లయితే అడుగు అడుగులోనూ పదమాలు లభిస్తాయి. సలహా తీసుకున్నట్లయితే ఇక మీరు ఆ
బాధ్యత నుండి విముక్తులైపోతారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.