10-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అన్నింటికన్నా పెద్ద వ్యాధి దేహాభిమానము, దీని ద్వారానే పతనము జరిగింది, అందుకే ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి’’

ప్రశ్న:-
పిల్లలైన మీ యొక్క కర్మాతీత అవస్థ ఎప్పుడు ఏర్పడుతుంది?

జవాబు:-
యోగబలముతో కర్మభోగముపై విజయము ప్రాప్తి చేసుకున్నప్పుడు, పూర్తి దేహీ-అభిమానులుగా అయినప్పుడు కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. ఈ దేహాభిమానమన్న వ్యాధియే అన్నింటికన్నా పెద్దది, దీనితో ప్రపంచము పతితముగా అయ్యింది. దేహీ-అభిమానులుగా అయినట్లయితే ఆ సంతోషము, ఆ నషా ఉంటుంది, నడవడిక కూడా బాగవుతుంది.

పాట:-
రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు...

ఓంశాంతి
ప్రయాణీకుడు అనే మాట యొక్క అర్థాన్ని అయితే పిల్లలు విన్నారు. బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మీరు దేవీ-దేవతలుగా ఉన్నప్పుడు, మీరు మనుష్యులుగానే ఉండేవారు కానీ మీ గుణము, స్వభావము చాలా బాగుండేది. మీరు సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. వజ్రతుల్యము నుండి గవ్వతుల్యముగా ఎలా అయ్యారు అనేది మనుష్యులెవ్వరికీ తెలియదు. మీరు కూడా నంబరువారు పురుషార్థానుసారంగా మార్పు చెందారు (పరివర్తనయ్యారు). ఇప్పుడు మీరు ఇంకా దేవతలుగా అవ్వలేదు. శక్తిని తిరిగి నింపుకుంటున్నారు. కొంతమంది కొద్దిగా మారారు, కొంతమంది 5 శాతము, కొంతమంది 10 శాతము... గుణము, స్వభావము మారుతూ ఉంటుంది. భారత్ యే స్వర్గముగా ఉండేదని ప్రపంచానికి తెలియదు. క్రైస్టుకు 3 వేల సంవత్సరాల క్రితం భారత్ లో దేవీ-దేవతలు ఉండేవారని అంటారు కూడా, వారిలో ఎటువంటి గుణాలు ఉండేవంటే వారిని భగవాన్-భగవతి అని అనేవారు. ఇప్పుడు ఆ గుణాలు లేవు. అంత షావుకారు ఉన్న భారత్ యొక్క పతనము ఎలా జరిగింది అనేది మనుష్యులకు అర్థం కాదు. అది కూడా తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. మీలో ఎవరి గుణము, స్వభావము అయితే తీర్చిదిద్దబడ్డాయో, వారు కూడా అర్థం చేయించగలరు. తండ్రి అంటారు, పిల్లలూ, మీరు దేవీ-దేవతలుగా ఉన్నప్పుడు ఆత్మాభిమానులుగా ఉండేవారు, ఆ తర్వాత రావణ రాజ్యము ప్రారంభమైనప్పుడు దేహాభిమానులుగా అయిపోయారు. ఈ దేహాభిమానమనే అన్నింటికన్నా పెద్ద వ్యాధి మీకు అంటుకుంది. సత్యయుగములో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు, చాలా సుఖముగా ఉండేవారు, మిమ్మల్ని ఆ విధముగా ఎవరు తయారుచేసారు? ఇది ఎవ్వరికీ తెలియదు. మీ పతనము ఎందుకు జరిగింది అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీ ధర్మాన్ని మర్చిపోయారు. భారత్ పైసకు కొరగానిదిగా అయిపోయింది. దానికి మూల కారణమేమిటి? దేహాభిమానము. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. అంత షావుకారుగా ఉన్న భారత్ మళ్ళీ నిరుపేదగా ఎలా అయింది, మనము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారము, మళ్ళీ మనము ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా ఎలా అయ్యాము అనేది మనుష్యులకు తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, రావణ రాజ్యము ఏర్పడటముతో మీరు దేహాభిమానులుగా అయ్యారు, దాని వలన మీ పరిస్థితి ఇలా అవ్వడము మొదలైంది. పతనము ఎలా జరిగింది అన్నది మెట్ల వరుస చిత్రములో కూడా చూపించారు. పైసకు కొరగానివారిగా అవ్వడానికి ముఖ్య కారణము దేహాభిమానము. ఇది కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. శాస్త్రాలలో కల్పము ఆయుష్షును లక్షల సంవత్సరాలుగా చూపించారు. ఈ రోజుల్లో తెలివైనవారు క్రిస్టియన్లు. వారు కూడా క్రైస్టుకు 3 వేల సంవత్సరాల క్రితం స్వర్గముండేదని అంటారు. ప్రాచీన భారత్ నే స్వర్గము, హెవెన్ అని అంటున్నారని భారతవాసులు అర్థం చేసుకోలేరు. ఈ రోజుల్లోనైతే భారత్ యొక్క పూర్తి చరిత్ర-భౌగోళికాల గురించి తెలియనే తెలియదు. కొంతమంది పిల్లలకు కొంత జ్ఞానమున్నా సరే దేహాభిమానము వచ్చేస్తుంది. నాలాంటివారు ఇంకెవ్వరూ లేరని భావిస్తారు. భారత్ కు ఇటువంటి దుర్దశ ఎందుకు ఏర్పడింది అనేది తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాపూ గాంధీ గారు కూడా పతిత-పావనా రండి, వచ్చి రామ రాజ్యాన్ని స్థాపన చేయండి అని అనేవారు. ఆత్మకు తండ్రి నుండి తప్పకుండా ఎప్పుడో సుఖము లభించింది, అందుకే పతిత-పావనుడిని తలచుకుంటారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు, నా పిల్లలెవరైతే శూద్రుల నుండి మారి బ్రాహ్మణులుగా అవుతారో, వారు కూడా పూర్తిగా దేహీ-అభిమానులుగా అవ్వటము లేదు. పదే-పదే దేహాభిమానములోకి వచ్చేస్తూ ఉంటారు. ఇది అన్నింటికన్నా పురాతన వ్యాధి, దీని వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. దేహీ-అభిమానులుగా అవ్వడములో చాలా శ్రమ ఉంది. ఎంతగా దేహీ-అభిమానులుగా అవుతారో, అంతగా తండ్రిని స్మృతి చేస్తారు. కావున అపారమైన సంతోషముండాలి. పరబ్రహ్మములో నివసించే పరమేశ్వరుని గురించి చింత ఉండేది, వారు లభించారు, వారి నుండి 21 జన్మల వారసత్వము లభిస్తోంది, ఇంకేమి కావాలి అని అంటూ ఉంటారు. మీరు కేవలం దేహీ-అభిమానులుగా అవ్వండి, నన్నొక్కరినే స్మృతి చేయండి. గృహస్థ వ్యవహారములో ఉండండి. మొత్తము ప్రపంచమంతా దేహాభిమానములో ఉంది. ఎంతో ఉన్నతముగా ఉన్న భారత్ యొక్క పతనము జరిగింది. దాని చరిత్ర-భౌగోళికాలు ఏమిటి అన్నది ఎవరూ చెప్పలేరు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. దేవతలు ఆత్మాభిమానులుగా ఉండేవారు. ఒక దేహము వదిలి, మరొకటి తీసుకోవాలని వారికి తెలుసు. వారు పరమాత్మ-అభిమానులుగా ఉండేవారు కాదు. మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, దేహీ-అభిమానులుగా ఉంటారో, అంతగా చాలా మధురముగా అవుతారు. దేహాభిమానములోకి రావడముతోనే కొట్లాడటము, గొడవపడటము, కోతి చేష్టలు మొదలవుతాయి, ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ బాబా కూడా అర్థం చేసుకుంటున్నారు. పిల్లలు దేహాభిమానములోకి వచ్చి శివబాబాను మర్చిపోతారు. మంచి-మంచి పిల్లలు దేహాభిమానములో ఉంటారు. దేహీ-అభిమానులుగా అవ్వనే అవ్వరు. మీరు ఎవరికైనా సరే ఈ అనంతమైన చరిత్ర-భౌగోళికాన్ని అర్థం చేయించగలరు. తప్పకుండా సూర్యవంశీయుల, చంద్రవంశీయుల రాజధాని ఉండేది. డ్రామా గురించి ఎవ్వరికీ తెలియదు. భారత్ ఇంతగా దిగజారిపోయింది, ఈ పతనానికి మూలము దేహాభిమానము. పిల్లలకు కూడా దేహాభిమానము వచ్చేస్తుంది. మాకు డైరెక్షన్ ఇస్తుంది ఎవరు అన్నది అర్థం చేసుకోరు. ఎల్లప్పుడూ శివబాబా చెప్తున్నారని భావించండి. శివబాబాను స్మృతి చేయకపోవడము వలనే దేహాభిమానములోకి వచ్చేస్తారు. మొత్తము ప్రపంచమంతా దేహాభిమానిగా అయిపోయింది, అందుకే తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ ఈ దేహము ద్వారా వింటుంది, పాత్రను అభినయిస్తుంది. తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తున్నారు. భాషణ అయితే చాలా బాగా చేస్తారు కానీ నడవడిక కూడా బాగుండాలి కదా. దేహాభిమానులుగా ఉన్న కారణముగా ఫెయిల్ అయిపోతారు. ఆ సంతోషము మరియు నషా ఉండదు. ఇంకా, పెద్ద వికర్మలు కూడా వారి ద్వారా జరుగుతాయి, ఆ కారణము చేత పెద్ద శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. దేహాభిమానులుగా అవ్వడము వలన చాలా నష్టపోతారు. చాలా శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. తండ్రి అంటారు, ఇది గాడ్లీ వరల్డ్ గవర్నమెంట్ కదా. గాడ్ అయిన నా గవర్నమెంట్ కు రైట్ హ్యాండ్ ధర్మరాజు. మీరు మంచి కర్మలు చేసినట్లయితే వాటికి మంచి ఫలము లభిస్తుంది. చెడు కర్మలు చేసినట్లయితే వాటికి శిక్షలను అనుభవిస్తారు. అందరూ గర్భ జైలులో కూడా శిక్షలను అనుభవిస్తారు. దీనిపై కూడా ఒక కథ ఉంది. ఈ విషయాలన్నీ ఈ సమయానికి చెందినవే. మహిమ ఒక్క తండ్రిదే. ఇంకెవ్వరికీ మహిమ లేదు, అందుకే - త్రిమూర్తి శివజయంతి వజ్ర సమానమైనది అని వ్రాయడము జరుగుతుంది. మిగిలినవన్నీ గవ్వ సమానమైనవి. శివబాబా తప్ప ఇంకెవ్వరూ పావనముగా తయారుచేయలేరు. పావనముగా అవుతారు, మళ్ళీ రావణుడు పతితముగా చేస్తాడు. ఈ కారణము చేత అందరూ దేహాభిమానులుగా అయిపోయారు. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవుతారు. ఈ దేహీ-అభిమానీ అవస్థ 21 జన్మలు కొనసాగుతుంది. కనుక గొప్పతనము వారొక్కరిదే అని అంటూ ఉంటారు. భారత్ ను స్వర్గముగా తయారుచేసేవారు శివబాబా. శివబాబా ఎప్పుడు వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. వారి చరిత్రను ముందుగా తెలుసుకోవాలి. శివ అని పరమపిత పరమాత్మనే అనడము జరుగుతుంది.

దేహాభిమానము కారణముగా పతనము జరుగుతుందని మీకు తెలుసు. అలా జరిగినప్పుడే ఉన్నతిలోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి వస్తారు. ఉన్నతి మరియు పతనము, పగలు మరియు రాత్రి, జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞానమనే అంధకారము తొలగిపోయింది. అన్నింటికన్నా పెద్ద అజ్ఞానము ఈ దేహాభిమానము. ఆత్మ గురించైతే ఎవ్వరికీ తెలియదు. ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు, ఎంతటి పాపాత్ములుగా అయిపోయారు, అందుకే పతనము జరిగింది. 84 జన్మలను తీసుకున్నారు, మెట్లు కిందకు దిగుతూ వచ్చారు. ఈ ఆట తయారై ఉంది. ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాల గురించి పిల్లలైన మీకు తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. విశ్వము యొక్క పతనము ఎలా జరిగింది అనేది ఎవ్వరికీ తెలియదు. సైన్స్ ద్వారా చాలా అభివృద్ధి జరిగిందని వారు భావిస్తారు. ప్రపంచము మరింత పతితముగా, నరకముగా అయిపోయిందని వారు అర్థం చేసుకోరు. దేహాభిమానము చాలా ఉంది. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. మంచి-మంచి మహారథులు అనేకమంది ఉన్నారు. జ్ఞానాన్ని చాలా బాగా వినిపిస్తారు, కానీ దేహాభిమానము పూర్తిగా తొలగిపోలేదు. దేహాభిమానము కారణముగా కొంతమందిలో క్రోధము యొక్క అంశము, కొంతమందిలో మోహము యొక్క అంశము, ఏదో ఒకటి ఉంది. గుణము, స్వభావము బాగవ్వాలి కదా. చాలా-చాలా మధురముగా అవ్వాలి. అప్పుడు, పులి మేక కలిసి నీరు తాగుతాయి అన్న ఉదాహరణను చెప్తారు. అక్కడ ఈ విధముగా దుఃఖాన్ని కలిగించే జంతువులు కూడా ఉండవు. ఈ విషయాలను కూడా కష్టము మీద కొంతమంది అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునేవారు నంబరువారుగా ఉన్నారు. కర్మభోగము తొలగిపోయి, కర్మాతీత అవస్థ ఏర్పడడమనేది కష్టము మీద జరుగుతుంది. చాలామంది దేహాభిమానములోకి వస్తారు. మాకు ఈ డైరెక్షన్లను ఎవరు ఇస్తున్నారు అనేది వారికి తెలియటము లేదు. శ్రీమతము శ్రీకృష్ణుని ద్వారా ఎలా లభిస్తుంది. శివబాబా అంటారు - వీరు (బ్రహ్మా) లేకుండా శ్రీమతాన్ని ఎలా ఇవ్వగలను. నా నిశ్చితమైన రథము వీరు. దేహాభిమానములోకి వచ్చి తప్పుడు కర్మలను చేసి, అనవసరముగా మిమ్మల్ని మీరు నాశనము చేసుకోకండి. లేదంటే పరిణామము ఎలా ఉంటుంది! చాలా తక్కువ పదవిని పొందుతారు. చదువుకున్నవారి ముందు చదువుకోనివారు సేవ చేస్తారు. భారత్ యొక్క చరిత్ర-భౌగోళికాలు ఫుల్ గా ఉండాలి కానీ అలా లేవు అని చాలామంది అంటారు, కావున వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. కానీ దేహీ-అభిమానీ స్థితి కావాలి, అటువంటివారే ఉన్నత పదవిని పొందగలరు.

ఇప్పుడింకా కర్మాతీత అవస్థ ఎవ్వరికీ ఏర్పడలేదు. వీరిపైనైతే (బాబాపై) చాలా జంజాటాలు ఉన్నాయి. ఎంత చింత ఉంటుంది. అంతా డ్రామానుసారముగానే జరుగుతుందని భావిస్తారు, అయినా కానీ అర్థం చేయించేందుకని యుక్తులనైతే రచించవలసి ఉంటుంది కదా, అందుకే బాబా అంటారు, మీరే ఎక్కువ దేహీ-అభిమానులుగా అవ్వగలరు. మీపై ఎటువంటి భారము లేదు, తండ్రిపైనైతే భారముంది. ఈ ప్రజాపిత బ్రహ్మా అయితే హెడ్ కదా! కానీ వీరిలో శివబాబా కూర్చున్నారని ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా కష్టము మీద ఏ ఒక్కరో ఈ నిశ్చయములో ఉంటారు. కావున ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాలను తెలుసుకోవాలి కదా. భారత్ లో స్వర్గము ఎప్పుడు ఉండేది, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది, పతనము ఎలా జరిగింది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఎప్పటివరకైతే మీరు అర్థం చేయించరో, అప్పటివరకు ఎవరూ అర్థం చేసుకోలేరు, అందుకే బాబా డైరెక్షన్లు ఇస్తారు. స్కూళ్ళలో ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాలను గురించి తెలియజేయాలి అని వారికి ఉత్తరాలు వ్రాయండి. పతనము గురించి భాషణ ఇవ్వాలి. భారత్ వజ్ర సమానముగా ఉండేది, అది మళ్ళీ గవ్వ సమానముగా ఎలా అయ్యింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది అనేది మేము అర్థం చేయిస్తాము అని చెప్పండి. ఇటువంటి కరపత్రాలను విమానాల ద్వారా కిందకు వేయవచ్చు. అర్థం చేయించేవారు చాలా తెలివైనవారిగా ఉండాలి. గవర్నమెంట్ కావాలనుకుంటే, ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ వారి విజ్ఞాన భవన్ హాలుకు అందరినీ పిలవాలి. వార్తాపత్రికలలో కూడా వేయించాలి. కార్డులు కూడా అందరికీ పంపించాలి. మేము మీకు మొత్తము ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాలను గురించి ఆది నుండి అంతిమము వరకు అర్థం చేయిస్తాము. వారంతట వారే వస్తారు, వెళ్తారు. ధనము యొక్క విషయమేమీ లేదు. ఎవరైనా మనల్ని కలిసి కానుకను ఇచ్చారనుకోండి, మనము అది తీసుకోకూడదు. సేవ చేయడానికి ఉపయోగించవచ్చు, అంతేకానీ మన కోసం తీసుకోకూడదు. తండ్రి అంటారు, నేను మీ నుండి దానము తీసుకుని ఏం చేస్తాను, తీసుకుంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వవలసి ఉంటుంది. నేను పక్కా వ్యాపారిని. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహాభిమానములోకి వచ్చి ఎటువంటి తప్పుడు పనులను చేయకూడదు. దేహీ-అభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థము చేయాలి. తమ గుణాన్ని, స్వభావాన్ని (నడవడికను) సరిదిద్దుకుంటూ ఉండాలి.

2. చాలా-చాలా మధురముగా, శీతలముగా అవ్వాలి. లోలోపల క్రోధము, మోహమనే భూతాలేవైతే ఉన్నాయో, వాటిని తొలగించివేయాలి.

వరదానము:-
గౌరవము ఇచ్చే రికార్డును మంచిగా ఉంచుకుంటూ, సంతోషమనే మహాదానాన్ని ఇచ్చే పుణ్య ఆత్మా భవ

వర్తమాన సమయములో నలువైపులా గౌరవాన్ని ఇచ్చే రికార్డును మంచిగా ఉంచుకోవాల్సిన అవసరముంది. ఈ రికార్డే తర్వాత నలువైపులా మోగుతుంది. గౌరవము ఇవ్వండి మరియు గౌరవము తీసుకోండి, చిన్నవారికి కూడా గౌరవము ఇవ్వండి, పెద్దవారికి కూడా గౌరవము ఇవ్వండి. గౌరవము ఇచ్చే రికార్డ్ ఇప్పుడు వెలువడాలి, అప్పుడు సంతోషమనే దానాన్ని ఇచ్చే మహాదానీ పుణ్య ఆత్మగా అవుతారు. ఎవరికైనా గౌరవాన్ని ఇచ్చి వారిని సంతోషపరచటము - ఇది అన్నింటికన్నా పెద్ద పుణ్య కార్యము, సేవ.

స్లోగన్:-
ప్రతి ఘడియను అంతిమ ఘడియగా భావిస్తూ నడుచుకున్నట్లయితే ఎవర్రెడీగా ఉంటారు.

మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు

1. ‘‘తమోగుణీ మాయ యొక్క విస్తారము’’

సతోగుణీ, రజోగుణీ, తమోగుణీ, ఈ మూడు పదాలను ఉపయోగిస్తారు, వీటిని యథార్థముగా అర్థం చేసుకోవడము తప్పనిసరి. ఈ మూడు గుణాలు కలిసి ఉంటాయని మనుష్యులు భావిస్తారు, కానీ వివేకము ఏమి చెప్తుంది - ఈ మూడు గుణాలు కలిసి ఉంటాయా లేక మూడు గుణాల పాత్ర వేర్వేరు యుగాలలో ఉంటుందా? వివేకము ఏమి చెప్తుందంటే - ఈ మూడు గుణాలు కలిసి ఉండవు. ఎప్పుడైతే సత్యయుగము ఉంటుందో అప్పుడు సతోగుణము ఉంటుంది, ద్వాపరము ఉన్నప్పుడు రజోగుణము ఉంటుంది మరియు కలియుగము ఉన్నప్పుడు తమోగుణము ఉంటుంది. సతో ఉన్నప్పుడు తమో, రజోలు ఉండవు, రజో ఉన్నప్పుడు సతోగుణము ఉండదు. కానీ మనుష్యులు ఈ మూడు గుణాలు కలిసే ఉంటాయని భావిస్తున్నారు. ఇలా అనటము పూర్తిగా తప్పు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎప్పుడైతే మనుష్యులు సత్యము మాట్లాడుతారో, పాప కర్మలు చేయరో, వారు సతోగుణము కలవారిగా ఉంటారు అని. కానీ వివేకము ఏమి చెప్తుందంటే - మనము సతోగుణము అని అన్నప్పుడు ఆ సతోగుణము అన్నదానికి అర్థము ఏమిటంటే సంపూర్ణ సుఖము అనగా మొత్తము సృష్టి సతోగుణీ ఉంటుంది. అంతేకానీ - ఎవరైతే సత్యము మాట్లాడుతారో వారు సతోగుణీ మరియు ఎవరైతే అసత్యము మాట్లాడుతారో వారు కలియుగీ తమోగుణీ అని అనరు, ప్రపంచము ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము సత్యయుగము అని అన్నప్పుడు దాని అర్థము మొత్తము సృష్టిలో సతోగుణము, సతోప్రధానత ఉండాలి. అవును, ఒకానొక సమయములో అటువంటి సత్యయుగము ఉండేది, అక్కడ మొత్తము ప్రపంచము సతోగుణీగా ఉండేది. ఇప్పుడు ఆ సత్యయుగము లేదు, ఇప్పుడిది కలియుగీ ప్రపంచము అనగా మొత్తము సృష్టిపై తమోప్రధానత యొక్క రాజ్యము ఉంది. ఈ తమోగుణీ సమయములో సతోగుణము ఎక్కడి నుండి వచ్చింది! ఇప్పుడిది ఘోర అంధకారము, దీనిని బ్రహ్మా యొక్క రాత్రి అని అంటారు. బ్రహ్మా యొక్క పగలు సత్యయుగము మరియు బ్రహ్మా యొక్క రాత్రి కలియుగము, కావున మనము రెండింటినీ కలపలేము.

2. ‘‘కలియుగ నిస్సార ప్రపంచము నుండి సత్యయుగ సార ప్రపంచములోకి తీసుకువెళ్ళటము, ఒక్క పరమాత్ముని కర్తవ్యమే’’

ఈ కలియుగీ ప్రపంచాన్ని నిస్సార ప్రపంచము అని ఎందుకంటారు? ఎందుకంటే ఈ ప్రపంచములో ఎటువంటి సారము లేదు అంటే ఏ వస్తువులోనూ ఆ శక్తి లేదు అనగా సుఖము-శాంతి-పవిత్రతలు లేవు. ఒకానొక సమయములో ఈ సృష్టిపై సుఖము-శాంతి-పవిత్రతలు ఉండేవి. ఇప్పుడు ఆ శక్తి లేదు ఎందుకంటే ఈ సృష్టిలో 5 భూతాలు ప్రవేశించాయి, అందుకే ఈ సృష్టిని భయముతో కూడిన సాగరమని, కర్మబంధనాల సాగరమని అంటారు, అందుకే మనుష్యులు దుఃఖితులై పరమాత్మను పిలుస్తున్నారు - పరమాత్మా, మమ్మల్ని భవ సాగరము నుండి దాటించండి అని. దీని ద్వారా ఏమి నిరూపణ అవుతుందంటే - తప్పకుండా ఏదో ఒక అభయ ప్రపంచము అనగా నిర్భయతతో కూడిన ప్రపంచము కూడా ఉంది, అందులోకి వెళ్ళాలని కోరుకుంటున్నారు, అందుకే ఈ ప్రపంచాన్ని పాప సాగరము అని అంటారు, దీనిని దాటి పుణ్యాత్ముల ప్రపంచములోకి వెళ్ళాలని కోరుకుంటారు. కావున ప్రపంచాలు రెండు ఉన్నాయి, ఒకటి సత్యయుగీ సార ప్రపంచము, మరొకటి కలియుగీ నిస్సార ప్రపంచము. రెండు ప్రపంచాలు ఈ సృష్టిలోనే ఉంటాయి. ఇప్పుడు పరమాత్మ ఆ సారము కల ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. అచ్ఛా - ఓం శాంతి.

అవ్యక్త ప్రేరణలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా, నిశ్చింతగా ఉండండి’’

ఏ విధముగా జ్ఞానమనే సబ్జెక్ట్ ఉందో, అదే విధముగా సేవ అనే సబ్జెక్ట్ కూడా ఉంది, ఎవరైతే ఇందులో విశ్వాసపాత్రులుగా, నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారో వారే ముందు నంబరులోకి వెళ్ళగలరు. ఉదయము నుండి రాత్రి వరకు మీ ప్రోగ్రామ్ ను ఫిక్స్ చేసుకుని, రోజు డైరీని తయారుచేసుకోండి ఎందుకంటే మీరు బాధ్యత కల ఆత్మలు, సాధారణమైనవారు కారు, మీరు విశ్వ కళ్యాణకారీ ఆత్మలు. ఎవరెంత పెద్ద వ్యక్తులైతే వారి దినచర్య అంతగానే సెట్ అయి ఉంటుంది.