10-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - లక్ష్యాన్ని సదా ఎదురుగా పెట్టుకున్నట్లయితే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి, అసురీ గుణాలను తొలగించి దైవీ గుణాలను ధారణ చేయాలి’’

ప్రశ్న:-
ఆయుష్మాన్ భవ అన్న వరదానము లభించినా కానీ, దీర్ఘాయువు కొరకు ఏ పురుషార్థం చేయాలి?

జవాబు:-
దీర్ఘాయువు కొరకు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యే కృషి చెయ్యండి. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా సతోప్రధానముగా అవుతారు మరియు ఆయుష్షు కూడా పెరుగుతుంది, ఇక అప్పుడు మృత్యు భయం తొలగిపోతుంది. స్మృతితో దుఃఖాలు దూరమవుతాయి. మీరు పుష్పాల వలె అవుతారు. స్మృతిలోనే గుప్తమైన సంపాదన ఉంది. స్మృతితో పాపాలు అంతమవుతాయి. ఆత్మ తేలికగా అవుతుంది, ఆయుష్షు పెరుగుతుంది.

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు, చదివిస్తున్నారు కూడా. వారు ఏమి అర్థం చేయిస్తున్నారు? మధురమైన పిల్లలూ, మీకు ఒకటేమో ఆయుష్షు ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఇంతకుముందు మీ ఆయుష్షు చాలా ఎక్కువ ఉండేది, 150 సంవత్సరాల ఆయుష్షు ఉండేది, మరి దీర్ఘాయువు ఎలా లభిస్తుంది? తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వడం ద్వారా. మీరు సతోప్రధానముగా ఉన్నప్పుడు మీ ఆయుష్షు చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు మీరు పైకి ఎక్కుతున్నారు. మనం తమోప్రధానముగా అయ్యాము కావున మన ఆయుష్షు తగ్గిపోయింది అని మీకు తెలుసు. ఆరోగ్యము కూడా బాగుండేది కాదు, పూర్తిగా రోగగ్రస్థులుగా అయిపోయారు. ఈ జీవితము పాతది, దీనిని కొత్తదానితో పోల్చడం జరుగుతుంది. తండ్రి మనల్ని దీర్ఘాయుష్షు కలవారిగా చేయడానికి యుక్తిని తెలియజేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మధురాతి-మధురమైన పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే, మీరు ఇంతకుముందు ఏ విధంగానైతే సతోప్రధానముగా, దీర్ఘాయుష్షు కలవారిగా, ఆరోగ్యవంతులుగా ఉండేవారో, మళ్ళీ అలా తయారవుతారు. ఆయుష్షు తక్కువగా ఉన్నట్లయితే మరణిస్తామేమో అనే భయం ఉంటుంది. సత్యయుగములో ఎప్పుడూ ఇలా అకస్మాత్తుగా మరణించరు అని మీకు గ్యారంటీ లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఆయుష్షు కూడా పెరుగుతుంది మరియు అన్ని దుఃఖాలు కూడా దూరమైపోతాయి. ఏ రకమైన దుఃఖమూ ఉండదు. మీకు ఇంకా ఏం కావాలి? ఉన్నత పదవి కూడా కావాలి అని మీరు అంటారు. ఇటువంటి పదవి కూడా లభించగలదు అని మీకు ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు తండ్రి ఈ విధంగా చేయండి అని యుక్తిని తెలియజేస్తున్నారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా ఉంది. మీరు ఇటువంటి పదవిని పొందగలరు. ఇక్కడే దైవీ గుణాలను ధారణ చేయాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి - నాలో ఎటువంటి అవగుణాలైతే లేవు కదా? అవగుణాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. సిగరెట్ త్రాగడం, అశుద్ధమైన పదార్థాలను తినడం, ఇవి అవగుణాలే. అన్నింటి కంటే పెద్ద అవగుణము - వికారాలు. దానినే చెడు క్యారెక్టర్ అని అంటారు. తండ్రి అంటారు - మీరు వికారులుగా అయిపోయారు, ఇప్పుడు నిర్వికారులుగా అవ్వడానికి మీకు యుక్తిని తెలియజేస్తాను, ఇందులో ఈ వికారాలను, అవగుణాలను విడిచిపెట్టాలి. ఎప్పుడూ వికారులుగా అవ్వకూడదు. ఎవరైతే ఈ జన్మలో బాగుపడతారో, అది 21 జన్మల వరకు కొనసాగుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయము నిర్వికారులుగా అవ్వటము. జన్మజన్మాంతరాల భారం ఏదైతే తలపై ఎక్కి ఉందో, అది యోగబలముతోనే దిగుతుంది. జన్మ-జన్మాంతరాలు మేము వికారులుగా అయ్యామని పిల్లలకు తెలుసు. ఇక మళ్ళీ ఎప్పుడూ వికారులుగా అవ్వము అని ఇప్పుడు తండ్రితో మనము ప్రతిజ్ఞ చేస్తాము. తండ్రి చెప్పారు - ఒకవేళ పతితులుగా అయినట్లయితే 100 రెట్ల శిక్షను కూడా అనుభవించవలసి ఉంటుంది, అంతేకాక పదవి కూడా భ్రష్టమైపోతుంది, ఎందుకంటే నిందింపజేసారు కదా, కావున అటు వైపుకు (వికారీ మనుష్యుల వైపుకు) వెళ్ళిపోయినట్లే అవుతుంది. అలా చాలా మంది వెళ్ళిపోతారు, అనగా ఓడిపోతారు. ఈ వికారాల వ్యాపారము చేయకూడదని ఇంతకుముందు మీకు తెలియదు. కొంతమంది మంచి పిల్లలు ఉంటారు, వారు - మేము బ్రహ్మచర్యములో ఉంటాము అని అంటారు. సన్యాసులను చూసి పవిత్రత మంచిది అని భావిస్తారు. పవిత్రమైనవారు మరియు అపవిత్రమైనవారు ఉంటారు, ప్రపంచములో అపవిత్రమైనవారే ఎంతోమంది ఉంటారు. లెట్రిన్ కు వెళ్ళడం కూడా అపవిత్రమవ్వడమే, అందుకే వెంటనే స్నానం చేయాలి. అపవిత్రత అనేక రకాలుగా ఉంటుంది. ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడం, కొట్లాడడం-గొడవపడడం కూడా అపవిత్రమైన కర్తవ్యాలే. తండ్రి అంటారు, జన్మ-జన్మాంతరాలైతే మీరు పాపాలు చేసారు. ఆ అలవాట్లన్నింటినీ ఇప్పుడు తొలగించాలి. ఇప్పుడు మీరు సత్యాతి-సత్యమైన మహానాత్మలుగా అవ్వాలి. సత్యాతి-సత్యమైన మహానాత్మలైతే ఈ లక్ష్మీ-నారాయణులే, ఇంకెవ్వరూ ఇక్కడ అలా అవ్వలేరు, ఎందుకంటే అందరూ తమోప్రధానంగా ఉన్నారు. నింద కూడా ఎంతగానో చేస్తారు కదా. వారు ఏం చేస్తున్నారనేది వారికి అర్థం కాదు కూడా. ఒకటి గుప్తమైన పాపాలు జరుగుతాయి, ఇంకొకటి ప్రత్యక్షమైన పాపాలు కూడా జరుగుతాయి. ఇది ఉన్నదే తమోప్రధాన ప్రపంచము. తండ్రి ఇప్పుడు మనల్ని వివేకవంతులుగా తయారుచేస్తున్నారని పిల్లలకు తెలుసు, అందుకే వారిని అందరూ స్మృతి చేస్తారు. పావనంగా అవ్వాలి, అంతేకాక గుణాలు కూడా కావాలి అని అన్నింటికన్నా మంచి వివేకం మీకు లభిస్తుంది. దేవతల ఎదురుగా మీరు ఏదైతే మహిమను చేస్తూ వచ్చారో, ఇప్పుడు మీరు ఆ విధంగా తయారవ్వాలి. తండ్రి అర్థం చేయిస్తారు - మధురాతి-మధురమైన పిల్లలూ, మీరు ఎంత మధురాతి-మధురమైన సుందరమైన పుష్పాలుగా ఉండేవారు, మళ్ళీ ముళ్ళుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ స్మృతితో మీ ఆయుష్షు పెరుగుతుంది. పాపాలు కూడా భస్మమవుతాయి. తలపై నుండి భారము తేలికవుతుంది. మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. మనలో ఏయే అవగుణాలున్నాయో వాటిని తొలగించుకోవాలి. నారదుని ఉదాహరణ ఉంది కదా, నీవు అర్హుడివేనా? అని అతడిని అడిగినప్పుడు, నేను నిజంగానే అర్హుడిగా లేను అని అతను గమనించుకున్నాడు. తండ్రి మిమ్మల్ని ఉన్నతంగా తయారుచేస్తారు, మీరు ఆ తండ్రి పిల్లలే కదా. ఏ విధంగానైతే ఎవరి తండ్రి అయినా మహారాజు అయినట్లయితే, మా తండ్రి మహారాజు అని చెప్పుకుంటారు కదా. బాబా ఎంతో సుఖాన్ని ఇచ్చేవారు. మంచి స్వభావము గల మహారాజులు ఎవరైతే ఉంటారో, వారికి ఎప్పుడూ కోపము రాదు. ఇప్పుడైతే మెల్ల-మెల్లగా అందరి కళలూ తగ్గిపోతూ వచ్చాయి, అన్ని అవగుణాలు ప్రవేశిస్తూ వచ్చాయి. కళలు తగ్గిపోతూ వచ్చాయి, తమోగా అవుతూ వచ్చారు. తమోప్రధానత కూడా ఇప్పుడిక అంతిమానికి వచ్చి చేరుకుంది. ఎంత దుఃఖితులుగా అయిపోయారు. మీరు ఎంతగా సహించవలసి వస్తుంది. ఇప్పుడు అవినాశీ సర్జన్ ద్వారా మీకు వైద్యం జరుగుతుంది. తండ్రి అంటారు - ఈ పంచ వికారాలైతే ఘడియ-ఘడియ మిమ్మల్ని సతాయిస్తాయి. మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేస్తారో, అంతగా మాయ మిమ్మల్ని కింద పడేయడానికి ప్రయత్నిస్తుంది. మీ అవస్థ ఎంత దృఢంగా ఉండాలంటే, ఎటువంటి మాయ తుఫానులు మిమ్మల్ని కదిలించలేకపోవాలి. రావణుడు అంటే ఒక వస్తువూ కాదు, అలాగే ఒక మనిషీ కాదు. పంచ వికారాల రూపీ రావణుడినే మాయ అని అంటారు. అసురీ రావణ సాంప్రదాయము వారు మిమ్మల్ని గుర్తించనే గుర్తించరు - అసలు వీరు ఎవరు? ఈ బి.కె.లు ఏమి అర్థం చేయిస్తున్నారు? వీరు బి.కె.లుగా ఎందుకు పిలువబడుతున్నారు? బ్రహ్మా ఎవరి సంతానము? వాస్తవానికి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి కూర్చొని పిల్లలైన మీకు ఈ శిక్షణను ఇస్తారు. ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ... మీ మనోకామనలన్నీ పూర్తి చేస్తారు, వరదానాలు ఇస్తారు. కానీ కేవలం వరదానాలతో పనేమీ జరగదు, కష్టపడాలి. ప్రతి విషయము అర్థం చేసుకోవలసిందే. స్వయానికి రాజ్యతిలకాన్ని ఇచ్చుకునేందుకు అధికారులుగా అవ్వాలి. తండ్రి అధికారులుగా చేస్తారు. ఈ-ఈ విధంగా చేయండి అని పిల్లలైన మీకు శిక్షణను ఇస్తారు. మొట్టమొదట ఏ శిక్షణను ఇస్తారంటే - నన్నొక్కడినే స్మృతి చేయండి. మనుష్యులు స్మృతి చేయరు, ఎందుకంటే అసలు వారికి తెలియనే తెలియదు కావున వారు చేసే స్మృతి కూడా తప్పే అవుతుంది. ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అంటారు. మరి అటువంటప్పుడు శివబాబాను ఎలా స్మృతి చేస్తారు! శివుని మందిరములోకి వెళ్ళి పూజలు చేస్తారు. వీరి కర్తవ్యమేమిటో చెప్పండి? అని మీరు అడిగితే, భగవంతుడు సర్వవ్యాపి అని అంటారు. వారికి పూజలు చేస్తారు, దయ చూపించమని అడుగుతారు, ఇలా అడుగుతూ కూడా పరమాత్మ ఎక్కడున్నారు? అని అడిగితే, వారు సర్వవ్యాపి అని అంటారు. చిత్రము ఎదురుగా ఉంటే ఎలా ఉంటారు, ఒకవేళ చిత్రము ఎదురుగా లేకపోతే నడవడిక బాగోదు. భక్తిలో ఎన్ని పొరపాట్లు చేస్తారు. అయినా కానీ భక్తి పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. శ్రీకృష్ణుని కోసమని నిర్జల ఉపవాసం మొదలైనవి ఎన్నో చేస్తారు. ఇక్కడ మీరు చదువుకుంటున్నారు మరియు ఆ భక్తులు ఏమేమో చేస్తూ ఉంటారు. మీకు ఇప్పుడు నవ్వు వస్తుంది. డ్రామానుసారంగా భక్తి చేస్తూ మెట్లు కిందకు దిగుతూ వచ్చారు. పైకి ఎవ్వరూ ఎక్కలేరు.

ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగము, దీని గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవ్వడానికి పురుషార్థం చేస్తారు. టీచర్ విద్యార్థికి సర్వెంట్ గా (సేవకునిగా) ఉంటారు కదా, విద్యార్థికి సేవ చేస్తారు! వారు గవర్నమెంట్ సర్వెంట్స్. తండ్రి కూడా అంటారు - నేను మీకు సేవ చేస్తాను మరియు మిమ్మల్ని చదివిస్తాను కూడా. వారు సర్వాత్మలకూ తండ్రి. వారు టీచర్ కూడా అవుతారు, సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు. ఈ జ్ఞానము ఇంకే ఇతర మనుష్యులలోనూ ఉండదు, దీనిని ఎవ్వరూ నేర్పించలేరు. మేము ఈ విధంగా అవ్వాలి అనే మీరు పురుషార్థము చేస్తారు. ప్రపంచంలోని మనుష్యులు ఎంతటి తమోప్రధాన బుద్ధి కలవారిగా ఉన్నారు. ఇది ఎంతో భయంకరమైన ప్రపంచము. మనుష్యులు ఏవైతే చేయకూడదో వాటన్నింటినీ చేస్తారు. ఎన్ని హత్యలు, దోపిడీలు మొదలైనవి చేస్తూ ఉంటారు. వారు చేయనిదంటూ ఏముంది. 100 శాతం తమోప్రధానముగా ఉన్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ 100 శాతం సతోప్రధానముగా తయారవుతున్నారు. అందుకోసం స్మృతి యాత్ర యొక్క యుక్తిని తెలియజేశారు. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి, తండ్రిని వెళ్ళి కలుసుకుంటారు. భగవంతుడైన తండ్రి ఎలా వస్తారు అన్నది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. వారు ఈ రథములోకి వచ్చారు. వారు బ్రహ్మా ద్వారా వినిపిస్తారు, దానిని మీరు ధారణ చేసి ఇతరులకు వినిపించినప్పుడు, ఆ వినేవారికి డైరెక్టుగా వినాలి, తండ్రి పరివారములోకి వెళ్ళాలి అని మనసుకు అనిపిస్తుంది. ఇక్కడ తండ్రి కూడా ఉన్నారు, తల్లి కూడా ఉన్నారు, అలాగే పిల్లలు కూడా ఉన్నారు. పరివారములోకి వచ్చేస్తారు. అక్కడైతే ప్రపంచమంతా అసురీగా ఉంది. అసురీ పరివారముతో మీరు విసిగిపోతారు, అందుకే వ్యాపారాలు మొదలైనవాటిని వదిలి బాబా వద్దకు రిఫ్రెష్ అవ్వడానికి వస్తారు. ఇక్కడ ఉండేది బ్రాహ్మణులే. కావున ఈ పరివారములోకి వచ్చి కూర్చుంటారు. ఇంటికి వెళ్ళిపోయినట్లయితే అక్కడ ఇటువంటి పరివారము ఉండదు. అక్కడ దేహధారులు వలె అయిపోతారు, ఆ వ్యాపార-వ్యవహారాల చిక్కుల నుండి బయటపడి మీరు ఇక్కడకు వస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - దేహపు సర్వ సంబంధాలను విడిచిపెట్టండి. సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. పుష్పాలలో సుగంధం ఉంటుంది. అందరూ వాటిని తీసుకొని వాసన చూస్తారు. జిల్లేడు పుష్పాలను తీసుకోరు. పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి, అందుకే బాబా కూడా అలా అవ్వాలని పుష్పాలను తీసుకువస్తారు. ఇంట్లో-గృహస్థములో ఉంటూ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఈ దేహ సంబంధీకులు అంతమైపోనున్నారని మీకు తెలుసు. మీరు ఇక్కడ గుప్తమైన సంపాదనను చేసుకుంటున్నారు. మీరు శరీరాన్ని విడిచిపెట్టాలి, సంపాదన చేసుకుని, ఎంతో సంతోషంతో హర్షితముఖులుగా అయి శరీరాన్ని విడిచిపెట్టాలి. నడుస్తూ, తిరుగుతూ కూడా మీరు తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే మీకు ఎప్పుడూ అలసట కలగదు. తండ్రి స్మృతిలో ఉంటూ అశరీరులుగా అయి ఎంతైనా తిరగండి, ఇక్కడి నుండి కిందకు ఆబూ రోడ్ వరకూ కూడా వెళ్ళిపోండి, అయినా కానీ అలసట కలగదు, పాపాలు అంతమైపోతాయి, తేలికగా అవుతారు. పిల్లలైన మీకు ఎంత లాభం ఉంటుంది, ఇంకెవ్వరూ దానిని తెలుసుకోలేరు. మొత్తం ప్రపంచంలోని మనుష్యులంతా, పతిత-పావనా వచ్చి పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. మరి వారిని మహాత్ములు అని ఎలా అంటారు. పతితులకు ఏమైనా తల వంచి నమస్కరించడం జరుగుతుందా. పావనుల ఎదుటే తల వంచడం జరుగుతుంది. కన్య ఉదాహరణ ఉంది - ఎప్పుడైతే వికారీగా అవుతుందో, అప్పుడు అందరి ముందు తల వంచుతుంది మరియు ఓ పతిత-పావనా రండి అని పిలుస్తుంది. అరే, అలా పిలవాల్సి వచ్చేందుకు, అసలు పతితముగా ఎందుకు అయ్యారు? అందరి శరీరాలూ వికారాలతో జన్మించినవే కదా, ఎందుకంటే ఇది రావణరాజ్యము. ఇప్పుడు మీరు రావణుడి నుండి బయటపడ్డారు. దీనిని పురుషోత్తమ సంగమయుగము అని అంటారు. ఇప్పుడు మీరు రామరాజ్యములోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. సత్యయుగము రామరాజ్యము, కేవలం త్రేతాయుగాన్ని రామరాజ్యము అని అన్నట్లయితే మరి సూర్యవంశీయులైన లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఏమైనట్లు? ఈ జ్ఞానమంతా ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది. కొత్త-కొత్తవారు కూడా వస్తారు, వారికి మీరు జ్ఞానాన్ని ఇస్తారు, అర్హులుగా తయారుచేస్తారు. కొందరి సాంగత్యము ఎటువంటిది లభిస్తుందంటే, దానితో అర్హుల నుండి అనర్హులుగా అయిపోతారు. తండ్రి పావనంగా తయారుచేస్తారు. కావున ఇప్పుడు పతితంగా అవ్వనే అవ్వకూడదు. పావనముగా చేయడానికి తండ్రి వచ్చారు, కానీ మాయ ఎంత శక్తివంతముగా ఉందంటే అది పతితముగా చేసేస్తుంది, ఓడించేస్తుంది. బాబా రక్షించండి అని అంటారు. యుద్ధ మైదానములో ఎంతోమంది మరణిస్తారు, మరి అక్కడ ఏమైనా రక్షించడం జరుగుతుందా! విచిత్రము! ఈ మాయ బులెట్లు తుపాకీ బులెట్లు కన్నా కూడా చాలా కఠినమైనవి. కామము దెబ్బ తగిలిందంటే పై నుండి పడిపోయినట్లే. సత్యయుగములో అందరూ పవిత్ర గృహస్థ ధర్మమువారే ఉంటారు, వారిని దేవతలు అని అంటారు. తండ్రి ఎలా వచ్చారు, ఎక్కడ ఉంటారు, వారు ఎలా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు? ఇది ఇప్పుడు మీకు తెలుసు. అర్జునుడి యొక్క రథముపై కూర్చొని జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా చూపిస్తారు, మరి అటువంటప్పుడు వారిని సర్వవ్యాపి అని ఎందుకు అంటారు? ఏ తండ్రి అయితే స్వర్గాన్ని స్థాపన చేస్తారో, వారినే మర్చిపోయారు. ఇప్పుడు వారు స్వయం తమ పరిచయాన్ని ఇస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మహానాత్మలుగా అయ్యేందుకు అపవిత్రత యొక్క అశుద్ధమైన అలవాట్లు ఏవైతే ఉన్నాయో, వాటిని తొలగించాలి. దుఃఖాన్ని ఇవ్వడము, కొట్లాడడం-గొడవపడడం... ఇవన్నీ అపవిత్ర కర్తవ్యాలే, వీటిని మీరు చేయకూడదు. మిమ్మల్ని మీరు రాజ్యతిలకాన్ని ఇచ్చుకునేందుకు అధికారులుగా తయారుచేసుకోవాలి.

2. బుద్ధిని అన్ని వ్యాపార-వ్యవహారాల చిక్కుల నుండి, దేహధారుల నుండి తొలగించి సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. గుప్తమైన సంపాదనను జమ చేసుకోవడానికి నడుస్తూ-తిరుగుతూ అశరీరులుగా ఉండే అభ్యాసాన్ని చేయాలి.

వరదానము:-

తమ శుభ చింతన యొక్క శక్తితో ఆత్మలను చింత నుండి ముక్తులుగా చేసే శుభచింతక మణీ భవ

నేటి విశ్వములో ఆత్మలందరూ చింతామణులుగా ఉన్నారు. ఆ చింతామణులను శుభచింతక మణులైన మీరు మీ శుభచింతన యొక్క శక్తి ద్వారా పరివర్తన చెయ్యగలరు. ఏ విధంగానైతే సూర్యుని కిరణాలు దూర-దూరాల వరకు అంధకారాన్ని తొలగిస్తాయో, అలా శుభచింతక మణులైన మీ శుభ సంకల్పాల రూపీ ప్రకాశము లేక కిరణాలు విశ్వములో నలువైపులా వ్యాపిస్తున్నాయి, అందుకే ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రకాశము (లైట్) గుప్త రూపములో తన కార్యాన్ని చేస్తూ ఉంది అని భావిస్తారు. ఈ టచింగ్ ఇప్పుడు మొదలైంది, చివరికి వెతుక్కుంటూ-వెతుక్కుంటూ అసలైన స్థానానికి చేరుకుంటారు.

స్లోగన్:-

బాప్ దాదా యొక్క డైరెక్షన్లను స్పష్టంగా గ్రహించడానికి మనస్సు-బుద్ధి యొక్క లైన్ ను క్లియర్ గా పెట్టుకోండి.