10-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు సతోప్రధానముగా అయి ఇక ఇంటికి వెళ్ళాలి, అందుకే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నిరంతరం తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయండి, ఉన్నతి గురించి సదా శ్రద్ధ పెట్టండి’’

ప్రశ్న:-
చదువులో రోజురోజుకు ముందుకు వెళ్తున్నామా లేక వెనక్కి వెళ్తున్నామా అన్నదానికి గుర్తు ఏమిటి?

జవాబు:-
చదువులో ఒకవేళ ముందుకు వెళ్తున్నట్లయితే తేలికదనం అనుభవమవుతుంది. వారి బుద్ధిలో - ఈ శరీరము అశుద్ధమైనది, దీనిని వదలాలి, మేమైతే ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అని ఉంటుంది. వారు దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉంటారు. ఒకవేళ వెనక్కి వెళ్తూ ఉన్నట్లయితే నడవడిక ద్వారా అసురీ గుణాలు కనిపిస్తాయి. నడుస్తూ-తిరుగుతూ తండ్రి స్మృతి ఉండదు. వారు పుష్పాలుగా అయి అందరికీ సుఖాన్ని ఇవ్వలేరు. ఇటువంటి పిల్లలకు మున్ముందు సాక్షాత్కారాలు జరుగుతాయి, అప్పుడిక ఎన్నో శిక్షలను అనుభవించవలసి వస్తుంది.

ఓంశాంతి
మేము సతోప్రధానముగా వచ్చాము అన్న ఆలోచన బుద్ధిలో ఉండాలి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇక్కడ అందరూ కూర్చుని ఉన్నారు, కొందరు దేహాభిమానులుగా ఉన్నారు మరియు కొందరు దేహీ-అభిమానులుగా ఉంటారు. కొందరు క్షణములో దేహాభిమానులుగా మరియు క్షణములో దేహీ-అభిమానులుగా అవుతూ ఉంటారు. మేము మొత్తం సమయమంతా దేహీ-అభిమానులుగానే కూర్చున్నాము అని ఎవ్వరూ అనలేరు. అలా జరగదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, కొంత సమయం దేహీ-అభిమానములో, కొంత సమయం దేహాభిమానములో ఉంటారు. ఆత్మయైన మనం ఈ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము అని ఇప్పుడు పిల్లలకు తెలుసు. ఎంతో సంతోషముగా వెళ్ళాలి. రోజంతా ఇదే ఆలోచిస్తూ ఉంటారు - మేము శాంతిధామానికి వెళ్ళాలి ఎందుకంటే తండ్రి మార్గాన్ని అయితే తెలియజేశారు. మిగిలినవారు ఎప్పుడూ ఈ ఆలోచనతో కూర్చుంటూ ఉండకపోవచ్చు. ఈ శిక్షణ ఎవ్వరికీ లభించనే లభించదు. వారికి ఆలోచన కూడా కలగదు. ఇది దుఃఖధామమని మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి సుఖధామములోకి వెళ్ళే మార్గాన్ని తెలియజేశారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా సంపూర్ణులుగా అయి యోగ్యత అనుసారంగా శాంతిధామములోకి వెళ్తారు, దానినే ముక్తి అని అంటారు, దాని కోసమే మనుష్యులు గురువులను ఆశ్రయిస్తారు. కానీ ముక్తి-జీవన్ముక్తి అంటే ఏమిటి అనేది మనుష్యులకు ఏ మాత్రమూ తెలియదు ఎందుకంటే ఇది కొత్త విషయము. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీరే భావిస్తారు. తండ్రి అంటారు, స్మృతి యాత్ర ద్వారా పవిత్రముగా అవ్వండి. మీరు మొట్టమొదట శ్రేష్ఠాచారీ ప్రపంచములోకి వచ్చినప్పుడు సతోప్రధానముగా ఉండేవారు, ఆత్మ సతోప్రధానముగా ఉండేది. ఎవరితోనైనా సంబంధము కూడా తర్వాతే ఏర్పడుతుంది. గర్భములోకి వెళ్ళినప్పుడు సంబంధములోకి వస్తారు. ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ అని మీకు తెలుసు. మనం ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి. పవిత్రముగా అవ్వకుండా మనం అక్కడకు వెళ్ళలేము. ఈ విధంగా లోలోపల మాట్లాడుకుంటూ ఉండాలి ఎందుకంటే తండ్రి ఆజ్ఞ ఏముందంటే - లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ బుద్ధిలో ఇదే ఆలోచన ఉండాలి - మేము సతోప్రధానముగా వచ్చాము, ఇప్పుడు సతోప్రధానముగా అయి ఇంటికి వెళ్ళాలి. తండ్రి స్మృతి ద్వారానే సతోప్రధానముగా అవ్వాలి ఎందుకంటే తండ్రే పతిత-పావనుడు. మీరు ఈ విధంగా పావనులుగా అవ్వగలరు అని వారు మనకు యుక్తిని తెలియజేస్తున్నారు. మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలను గురించి అయితే తండ్రికే తెలుసు, అవి తెలిసిన అథారిటీ ఇంకెవ్వరూ లేరు. తండ్రే మనుష్య సృష్టికి బీజరూపుడు. భక్తి ఎంతవరకూ కొనసాగుతుంది అనేది కూడా తండ్రే అర్థం చేయించారు. ఇంత సమయం జ్ఞాన మార్గము, ఇంత సమయం భక్తి. ఈ జ్ఞానమంతా లోలోపల మెదులుతూ ఉండాలి. ఏ విధముగా తండ్రి ఆత్మలో జ్ఞానముందో, అలాగే మీ ఆత్మలో కూడా జ్ఞానముంది. శరీరము ద్వారా వింటారు మరియు వినిపిస్తారు, శరీరము లేకుండానైతే ఆత్మ మాట్లాడలేదు. ఇందులో ప్రేరణ లేక ఆకాశవాణి యొక్క విషయమేదీ ఉండదు. భగవానువాచ ఉంది, కావున తప్పకుండా నోరు కావాలి, రథము కావాలి. గాడిద, గుర్రము యొక్క రథములు అవసరం లేదు. కలియుగము ఇప్పుడింకా 40,000 సంవత్సరాలు కొనసాగనున్నది అని మీరు కూడా ఇంతకుముందు భావించేవారు. అజ్ఞాన నిద్రలో నిదురిస్తూ ఉండేవారు, ఇప్పుడు బాబా మేల్కొలిపారు. మీరు కూడా అజ్ఞానములో ఉండేవారు. ఇప్పుడు జ్ఞానం లభించింది, భక్తిని అజ్ఞానం అని అంటారు.

ఇప్పుడు పిల్లలైన మీరు ఇలా ఆలోచించాలి - మేము మా ఉన్నతిని ఎలా చేసుకోవాలి, ఉన్నత పదవిని ఎలా పొందాలి? మన ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త రాజధానిలోకి వచ్చి ఉన్నత పదవిని పొందాలి. దాని కోసమే స్మృతియాత్ర ఉంది. స్వయాన్ని ఆత్మగా తప్పకుండా భావించాలి. ఆత్మలైన మనందరి తండ్రి పరమాత్మ. ఇది చాలా సహజమైన విషయము. కానీ మనుష్యులు ఈ మాత్రము విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. ఇది రావణరాజ్యమని, కావుననే తమ బుద్ధి భ్రష్టాచారిగా అయిపోయిందని మీరు అర్థం చేయించగలరు. ఎవరైతే వికారాలలోకి వెళ్ళరో వారు పావనులు అని మనుష్యులు భావిస్తారు. ఉదాహరణకు సన్యాసులు ఉన్నారు కదా. తండ్రి అంటారు, వారైతే అల్పకాలికముగానే పావనులుగా అవుతారు. కానీ ప్రపంచమైతే పతితముగానే ఉంది కదా. సత్యయుగమే పావన ప్రపంచము. పతిత ప్రపంచములో సత్యయుగములో ఉన్నట్లు పావనమైనవారు ఎవ్వరూ ఉండరు. అక్కడైతే రావణరాజ్యమే ఉండదు, వికారాల విషయమే ఉండదు, కావున అటూ, ఇటూ తిరుగుతూ బుద్ధిలో ఈ చింతన ఉండాలి. బాబాలో ఈ జ్ఞానం ఉంది కదా. వారు జ్ఞానసాగరుడు కావున తప్పకుండా జ్ఞానం మెదులుతూ ఉంటుంది. మీరు కూడా జ్ఞానసాగరుడి నుండి వెలువడిన నదులే. వారు సదా సాగరుడిగానే ఉంటారు, మీరు అలా సదా సాగరునిలా ఉండరు. మేమందరమూ పరస్పరం సోదరులము అని పిల్లలైన మీరు భావిస్తారు. పిల్లలైన మీరు చదువుకుంటారు. వాస్తవానికి నదులు మొదలైనవాటి విషయమేదీ లేదు. నది అని అనడంతో గంగ, యమున మొదలైనవి అని అనుకుంటారు. మీరు ఇప్పుడు అనంతములో ఉన్నారు. ఆత్మలమైన మనమందరమూ ఒక్క తండ్రి పిల్లలము, సోదరులము. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఎక్కడి నుండైతే వచ్చి ఈ శరీరము రూపీ ఆసనముపై విరాజమానమవుతామో, అక్కడకు వెళ్ళాలి. ఆత్మ చాలా చిన్నది. సాక్షాత్కారమైనా అర్థం చేసుకోలేరు. ఆత్మ శరీరము నుండి బయటకు వచ్చినప్పుడు, ఒక్కోసారి నుదుటి నుండి వెళ్ళిపోయిందని లేక కళ్ళ నుండి వెళ్ళిపోయిందని లేక నోటి నుండి వెళ్ళిపోయిందని... అంటూ ఉంటారు. నోరు తెరుచుకుంటుంది కదా. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు శరీరము జడమైపోతుంది. ఇది జ్ఞానము. విద్యార్థుల బుద్ధిలో రోజంతా చదువే ఉంటుంది. మీలో కూడా రోజంతా చదువు యొక్క ఆలోచనలే నడవాలి. మంచి-మంచి విద్యార్థుల చేతిలో ఎల్లప్పుడూ ఏదో ఒక పుస్తకము ఉంటుంది, చదువుతూ ఉంటారు.

తండ్రి అంటారు, ఇది మీ అంతిమ జన్మ. మొత్తం చక్రమంతా చుట్టి వచ్చి అంతిమములోకి వచ్చారు, కావున బుద్ధిలో ఇదే స్మరణ ఉండాలి. ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. కొందరికైతే ధారణయే జరగదు. స్కూల్లో కూడా విద్యార్థులు నంబరువారుగా ఉంటారు. సబ్జెక్టులు కూడా ఎన్నో ఉంటాయి. ఇక్కడైతే ఒకటే సబ్జెక్ట్ ఉంది. దేవతగా అవ్వాలి, చదువు యొక్క ఈ చింతనయే కొనసాగుతూ ఉండాలి. చదువును మర్చిపోయి వేరే-వేరే ఆలోచనలు నడుస్తూ ఉండడం కాదు. వ్యాపారస్థులెవరైనా ఉంటే, వారు తమ వ్యాపార ఆలోచనలలోనే నిమగ్నమై ఉంటారు. విద్యార్థి తన చదువులోనే నిమగ్నమై ఉంటాడు. అలాగే పిల్లలైన మీరు కూడా మీ చదువులోనే ఉండాలి.

అంతర్జాతీయ యోగ సదస్సు పేరుతో నిన్న ఒక ఆహ్వానము వచ్చింది. మీరు వారికి ఇలా వ్రాయవచ్చు - మీరు చేసేది హఠయోగము, దాని లక్ష్యము, ఉద్దేశ్యము ఏమిటి? దాని వల్ల కలిగే లాభమేమిటి? మేమైతే రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. జ్ఞానసాగరుడు, రచయిత అయిన పరమపిత పరమాత్మ మాకు తన మరియు రచన యొక్క జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇప్పుడు మేము ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి. మన్మనాభవ - ఇది మా మంత్రము. మేము తండ్రిని మరియు తండ్రి ద్వారా ఏ వారసత్వమైతే లభిస్తుందో దానిని స్మృతి చేస్తూ ఉంటాము. మీరు ఈ హఠయోగాలు మొదలైనవి చేస్తూ వచ్చారు, వాటి లక్ష్యము, ఉద్దేశ్యము ఏమిటి? మేము ఇది నేర్చుకుంటున్నాము అని మా విషయమైతే మేము చెప్పాము, మరి, మీ ఈ హఠయోగము ద్వారా ఏమి లభిస్తుంది? వారు పంపించిన ఆహ్వానానికి ఈ విధంగా క్లుప్తంగా జవాబు వ్రాయాలి. ఇటువంటి ఆహ్వానాలు మీ వద్దకు ఎన్నో వస్తాయి. అఖిల భారత ధార్మిక సదస్సు వారి నుండి మీకు ఆహ్వానము వచ్చింది. మీ లక్ష్యము, ఉద్దేశ్యము ఏమిటి అని వారు మిమ్మల్ని అడిగారు. మేము ఇది నేర్చుకుంటున్నాము అని మీరు వారికి చెప్పండి. తమ గురించి తప్పకుండా చెప్పాలి, ఎందుకు? ఈ రాజయోగాన్ని మీరు నేర్చుకుంటున్నారు. మేము ఇది చదువుకుంటున్నాము, మమ్మల్ని చదివించేవారు భగవంతుడు, మేమందరమూ సోదరులము, మేము స్వయాన్ని ఆత్మగా భావిస్తాము అని చెప్పండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి అని అనంతమైన తండ్రి చెప్తున్నారు. ఈ విధంగా చాలా బాగా వ్రాసి ముద్రించి పెట్టుకోండి. మళ్ళీ ఎక్కడెక్కడైతే కాన్ఫరెన్సులు మొదలైనవి జరుగుతాయో అక్కడికి అవి పంపించండి. అప్పుడు వారు అంటారు, వీరు చాలా మంచి నియమబద్ధమైన విషయాలను నేర్చుకుంటున్నారు అని. ఈ రాజయోగము ద్వారా రాజులకే రాజులుగా, విశ్వాధిపతులుగా అవుతారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనం దేవతలుగా అవుతాము, మళ్ళీ మనుష్యులుగా అవుతాము. ఇలా, ఇలా విచార సాగర మంథనము చేసి ఫస్ట్ క్లాస్ అయిన వివరణను వ్రాతపూర్వకముగా తయారుచేయాలి. వారు మిమ్మల్ని మీ ఉద్దేశ్యము అడుగవచ్చు, కావున ఇది మా లక్ష్యము, ఉద్దేశ్యము అని మీరు ముందే ముద్రించి ఉంచుకోండి. ఈ విధంగా వ్రాయడం ద్వారా ఆకర్షణ కలుగుతుంది. ఇందులో హఠయోగము లేక శాస్త్రవాదము చేయవలసిన విషయమేమీ లేదు. వారికి శాస్త్రవాదపు అహంకారము కూడా ఎంతగా ఉంటుంది. వారు స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారు. వాస్తవానికి వారు పూజారులు, ఎవరైతే పూజ్యులో వారినే అథారిటీ అని అంటారు. పూజారులను ఏమంటారు? కావున మనం ఏమి నేర్చుకుంటున్నాము - అన్నది స్పష్టంగా వ్రాయాలి. బి.కే.ల పేరు అయితే ప్రసిద్ధమైపోయింది.

యోగము రెండు రకాలుగా ఉంటుంది - ఒకటి హఠయోగము, ఇంకొకటి సహజయోగము. ఆ సహజయోగాన్ని మానవమాత్రులెవ్వరూ నేర్పించలేరు. రాజయోగాన్ని ఒక్క పరమాత్మయే నేర్పిస్తారు. మిగిలిన ఈ అనేక రకాల యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనుష్య మతముపై ఉన్నాయి. అక్కడ దేవతలకైతే ఎవరి మతము అవసరం లేదు ఎందుకంటే వారికి వారసత్వము లభించి ఉంది. వారు దేవతలు అనగా దైవీ గుణాలు కలవారు. ఎవరిలోనైతే ఇటువంటి గుణాలు ఉండవో వారిని అసురులు అని అంటారు. దేవతల రాజ్యం ఉండేది, మళ్ళీ అది ఏమైంది? 84 జన్మలను ఎలా తీసుకున్నారు? మెట్ల చిత్రముపై అర్థం చేయించాలి. ఈ మెట్లు చాలా బాగున్నాయి. మీ హృదయంలో ఏదైతే ఉందో అది ఈ మెట్ల చిత్రములో ఉంది. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. చదువు సంపాదనకు ఆధారము. ఇది అన్నింటికన్నా ఉన్నతమైన చదువు, ది బెస్ట్ (సర్వోత్తమమైన) చదువు. ఏ చదువు ది బెస్ట్ అనేది ప్రపంచానికి తెలియదు. ఈ చదువు ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా, ద్వికిరీటధారులుగా అవుతారు. ఇప్పుడు మీరు ద్వికిరీటధారులుగా అయ్యే పురుషార్థాన్ని చేస్తున్నారు. చదువు అయితే ఒక్కటే కానీ ఒక్కొక్కరూ ఒక్కోలా తయారవుతారు! ఆశ్చర్యము! ఒకే చదువు ద్వారా రాజధాని స్థాపన అవుతుంది. రాజులుగానూ అవుతారు, ప్రజలుగానూ అవుతారు, అంతేకానీ అక్కడ దుఃఖం విషయమేదీ ఉండదు. పదవులైతే ఉంటాయి కదా. ఇక్కడ అనేక రకాల దుఃఖాలు ఉన్నాయి. కరువు, రోగాలు వస్తాయి, ధాన్యము మొదలైనవి లభించవు, వరదలు మొదలైనవి వస్తూ ఉంటాయి. లక్షాధికారులైనా, కోటీశ్వరులైనా, జన్మ అయితే వికారాల ద్వారానే జరుగుతుంది కదా. దెబ్బ తగలడం, దోమ కుట్టడం ఇవన్నీ దుఃఖాలే కదా. దీని పేరే రౌరవ నరకము. అయినా కానీ, ఫలానావారు స్వర్గస్థులయ్యారు అని అంటూ ఉంటారు. అరే, స్వర్గము అయితే రానున్నది, మరి ఎవరైనా స్వర్గములోకి ఎలా వెళ్ళారు? ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. ఇప్పుడు బాబా ఇటువంటి వ్యాసాన్ని ఇచ్చారు, అది వ్రాయడం పిల్లల పని. ధారణ ఉన్నట్లయితే వ్రాస్తారు కూడా. ముఖ్యమైన విషయము పిల్లలకు ఏం అర్థం చేయిస్తున్నారంటే - స్వయాన్ని ఆత్మగా భావించండి, ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. మనం సతోప్రధానముగా ఉన్నప్పుడు సంతోషానికి అవధులుండేవి కాదు. ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు. ఇది ఎంత సహజము. పాయింట్లు అయితే బాబా ఎన్నో వినిపిస్తూ ఉంటారు కావున కూర్చొని బాగా అర్థం చేయించాలి. ఒకవేళ అంగీకరించకపోతే, వీరు మన కులానికి చెందినవారు కాదు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. చదువులో రోజురోజుకు ముందుకు వెళ్ళాలి, వెనుకకు వెళ్ళకూడదు. దైవీ గుణాలకు బదులుగా ఆసురీ గుణాలను ధారణ చేయడమంటే అది వెనుకకు వెళ్ళడమే కదా. తండ్రి అంటారు, వికారాలను వదులుతూ ఉండండి, దైవీ గుణాలను ధారణ చేయండి. చాలా తేలికగా ఉండాలి. ఈ శరీరము అశుద్ధమైనది, దీనిని వదలాలి. మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. తండ్రిని స్మృతి చేయకపోతే పుష్పాలుగా అవ్వరు. ఎన్నో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. మున్ముందు మీకు సాక్షాత్కారమవుతాయి. మీరు ఏం సేవ చేసారు? అని మిమ్మల్ని అడుగుతారు. మీరు ఎప్పుడూ కోర్టుకు వెళ్ళలేదు. బాబా అయితే అన్నీ చూసారు. వారు దొంగలను ఎలా పట్టుకుంటారో, ఆ తర్వాత కేసులు ఎలా నడుస్తాయో అన్నీ చూసారు, అలాగే అక్కడ కూడా మీకు అన్నీ సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. శిక్షలు అనుభవించి మళ్ళీ పైసకు విలువ చేసే పదవిని పొందుతారు. టీచరుకైతే - వీరు ఫెయిల్ అయిపోతారు అని దయ కలుగుతుంది కదా. తండ్రిని స్మృతి చేసే ఈ సబ్జెక్ట్ అన్నింటికన్నా మంచిది, దీని ద్వారా పాపాలు అంతమవుతూ ఉంటాయి. బాబా మనల్ని చదివిస్తున్నారు. ఇదే స్మరిస్తూ తిరుగుతూ ఉండాలి. విద్యార్థులు టీచరును తలచుకుంటూ ఉంటారు కూడా మరియు బుద్ధిలో చదువు కూడా ఉంటుంది. టీచరుతో యోగమైతే తప్పకుండా ఉంటుంది కదా. సోదరులమైన మనందరికీ టీచర్ ఒక్కరేనని, వారే సుప్రీమ్ టీచర్ అని బుద్ధిలో ఉండాలి. మున్ముందు అనేకులకు తెలుస్తుంది - ఓహో ప్రభూ! నీ లీల... అని మహిమ చేస్తూ మరణిస్తారు, కానీ ఏమీ పొందలేకపోతారు. దేహాభిమానములోకి రావడం వలనే తప్పుడు కర్మలు చేస్తారు. దేహీ-అభిమానులుగా ఉన్నట్లయితే మంచి కర్మలు చేస్తారు. తండ్రి అంటారు, ఇప్పుడు ఇది మీ వానప్రస్థావస్థ, ఇక తిరిగి వెళ్ళవలసిందే. లెక్కాచారాలన్నింటినీ తీర్చుకొని అందరూ తిరిగి వెళ్ళవలసిందే. ఇష్టమున్నా, లేకపోయినా తప్పకుండా వెళ్ళవలసిందే. ప్రపంచము ఎంతో ఖాళీ అయిపోయే రోజు కూడా ఒకటి వస్తుంది. ఆ సమయములో కేవలం భారత్ యే ఉంటుంది. అర్ధకల్పం కేవలం భారత్ యే ఉంటుంది, మరి ప్రపంచం ఎంత ఖాళీగా ఉంటుంది. ఇటువంటి ఆలోచన మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. అప్పుడిక మీ శత్రువు కూడా ఎవ్వరూ ఉండరు. శత్రువులు ఎందుకు వస్తారు? ధనం వెనుకే శత్రువులు ఉంటారు. భారత్ లోకి ఇంతమంది ముసల్మానులు, ఆంగ్లేయులు ఎందుకు వచ్చారు? ధనాన్ని చూసారు. ధనమెంతగానో ఉండేది, ఇప్పుడది లేదు. కావున ఇప్పుడు ఇంకెవ్వరూ లేరు. ధనం తీసుకొని ఖాళీ చేసి వెళ్ళారు. మనుష్యులకు ఇది తెలియదు. బాబా అంటారు, ధనాన్ని అయితే మీరు డ్రామానుసారంగా మీకు మీరే సమాప్తం చేసేసారు. మేము అనంతమైన తండ్రి వద్దకు వచ్చాము అని మీకు నిశ్చయం ఉంది. ఇది ఈశ్వరీయ పరివారము అన్న ఆలోచన కూడా ఎప్పుడూ ఎవ్వరికీ ఉండదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నడుస్తూ-తిరుగుతూ బుద్ధిలో చదువు గురించి చింతన చేయాలి. ఏ కార్యం చేస్తున్నా సరే బుద్ధిలో సదా జ్ఞానం మెదులుతూ ఉండాలి. ఇది ది బెస్ట్ (సర్వోత్తమమైన) చదువు, దీనిని చదువుకొని డబుల్ కిరీటధారులుగా అవ్వాలి.

2. ఆత్మలమైన మనము సోదరులము అన్న అభ్యాసము చేయాలి. దేహాభిమానములోకి రావడం వలన తప్పుడు కర్మలు జరుగుతాయి, అందుకే ఎంత వీలైతే అంత దేహీ-అభిమానులుగా ఉండాలి.

వరదానము:-

సత్యతా శక్తి ద్వారా సదా సంతోషములో నాట్యం చేసే శక్తిశాలి మహాన్ ఆత్మా భవ

‘‘సత్యమున్నచోట మనసు ఆనందముతో నాట్యము చేస్తుంది’’ అని అంటారు. సత్యమైనవారు అనగా సత్యతా శక్తి కలవారు సదా నాట్యము చేస్తూ ఉంటారు, ఎప్పుడూ ముడుచుకుపోరు, చిక్కులలోకి రారు, భయపడరు, బలహీనులుగా అవ్వరు. వారు సంతోషములో సదా నాట్యం చేస్తూ ఉంటారు. శక్తిశాలిగా ఉంటారు. వారిలో ఎదుర్కొనే శక్తి ఉంటుంది, సత్యత ఎప్పుడూ చలించదు, స్థిరంగా ఉంటుంది. సత్యత యొక్క నావ ఊగిసలాడుతుంది కానీ మునగదు. కనుక సత్యతా శక్తిని ధారణ చేసే ఆత్మలే మహానులు.

స్లోగన్:-

బిజీగా ఉన్న మనసు-బుద్ధిని క్షణములో స్టాప్ చెయ్యటమే సర్వ శ్రేష్ఠమైన అభ్యాసము.