11-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు ఈ నాటకము పూర్తవుతుంది, మీరు
తిరిగి ఇంటికి వెళ్ళాలి, కావున ఈ ప్రపంచము పట్ల మమకారాన్ని తొలగించండి, ఇంటిని మరియు
కొత్త రాజ్యాన్ని స్మృతి చేయండి’’
ప్రశ్న:-
దానానికి
మహత్వము ఎప్పుడు ఉంటుంది, దాని ప్రతిఫలము ఏ పిల్లలకు లభిస్తుంది?
జవాబు:-
ఎప్పుడైతే
దానము చేసిన వస్తువు పట్ల మమకారము ఉండదో, అప్పుడు దానానికి మహత్వము ఉంటుంది. ఒకవేళ
దానము చేసిన తర్వాత మళ్ళీ అది గుర్తుకు వస్తే, దానికి ప్రతిఫలము లభించదు. దానము
చేసేదే మరుసటి జన్మలో ప్రతిఫలము కోసము, అందుకే ఈ జన్మలో మీ వద్ద ఏదైతే ఉందో, దాని
పట్ల మమకారాన్ని తొలగించండి. ట్రస్టీగా అయి సంభాళించండి. ఇక్కడ మీరు ఏదైతే ఈశ్వరీయ
సేవలో పెడతారో, హాస్పిటల్ లేక కాలేజీని తెరుస్తారో, దాని ద్వారా అనేకుల కళ్యాణము
జరుగుతుంది, దానికి ప్రతిఫలము 21 జన్మల కొరకు లభిస్తుంది.
ఓంశాంతి
పిల్లలకు మీ ఇల్లు మరియు మీ రాజధాని గుర్తుందా? ఇక్కడ కూర్చున్నప్పుడు, బయట
ఇళ్ళు-వాకిళ్ళను గురించి, వ్యాపార-వ్యవహారాలు మొదలైనవాటి గురించి ఆలోచనలు రాకూడదు.
కేవలం మీ ఇల్లు మాత్రమే గుర్తుకు రావాలి. ఇప్పుడు ఈ పాత ప్రపంచము నుండి కొత్త
ప్రపంచములోకి తిరిగి వెళ్ళబోతున్నాము, ఈ పాత ప్రపంచము ఇక సమాప్తమవ్వనున్నది. అన్నీ
అగ్నిలో స్వాహా అయిపోనున్నాయి. ఈ కళ్ళ ద్వారా మీరు ఏదైతే చూస్తారో, మీ
మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరూ అంతమైపోనున్నారు. ఈ జ్ఞానాన్ని తండ్రే ఆత్మలకు అర్థం
చేయిస్తారు. పిల్లలూ, ఇప్పుడు తిరిగి మన ఇంటికి వెళ్ళాలి. నాటకము ఇక పూర్తవుతుంది.
ఇది ఉన్నదే 5000 సంవత్సరాల చక్రము. ప్రపంచము అయితే ఉండనే ఉంది, కానీ ఈ చక్రములో
తిరిగేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ ఉన్న ఆత్మలన్నీ తిరిగి వెళ్ళిపోతాయి.
ఈ పాత ప్రపంచమే అంతమైపోతుంది. బాబా చాలా బాగా ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు.
కొందరు పిసినారులుగా ఉంటే అనవసరముగా తమ ఆస్తిని వృధా చేసుకుంటారు. భక్తి మార్గములో
దాన-పుణ్యాలైతే చేస్తారు కదా. కొందరు ధర్మశాలలను కట్టిస్తారు, కొందరు ఆసుపత్రులు
కట్టిస్తారు, దాని ఫలము మరుసటి జన్మలో లభిస్తుంది అని వారు బుద్ధిలో భావిస్తారు. ఏ
ఆశా లేకుండా అనాసక్తులుగా ఉంటూ ఎవ్వరూ చేయరు. చాలామంది - మేము ఫలముపై కోరిక
పెట్టుకోము అని అంటారు. కానీ అలా జరగదు. ఫలము తప్పకుండా లభిస్తుంది. ఎవరి వద్దనైనా
ధనముంటే, వారి వద్ద ఉన్నదాని నుండి కొంత ధర్మార్థము దానమిస్తే, మాకు దీని ప్రతిఫలము
వచ్చే జన్మలో లభిస్తుంది అని వారి బుద్ధిలో ఉంటుంది. ఒకవేళ దానమిచ్చిన దాని పట్ల
మమకారము కలిగినట్లయితే, అది నా వస్తువు అని భావించినట్లయితే దాని ప్రతిఫలము అక్కడ
లభించదు. దానము అనేది మరుసటి జన్మలో ప్రతిఫలము పొందడము కొరకే చేయడము జరుగుతుంది.
మరుసటి జన్మలో దాని ప్రతిఫలము లభిస్తుంది అన్నప్పుడు ఇక ఈ జన్మలో దానిపై మమకారము
ఎందుకు పెట్టుకుంటారు, అందుకే తమ ఆ మమకారము తొలగిపోవాలి అన్న ఉద్దేశ్యముతో
ట్రస్టీలుగా నిమిత్తము చేస్తారు. ఎవరైనా మంచి షావుకారుల వద్ద జన్మ తీసుకుంటే, అతను
మంచి కర్మలు చేసి ఉంటారు అని అంటారు. కొందరు రాజు-రాణుల వద్ద జన్మ తీసుకుంటారు
ఎందుకంటే వారు గత జన్మలో దాన-పుణ్యాలు చేసారు, కానీ అదంతా అల్పకాలికముగా ఒక్క జన్మకు
సంబంధించిన విషయము. ఇప్పుడు మీరు ఈ చదువును చదువుతున్నారు. ఈ చదువు ద్వారా మనము ఈ
విధంగా తయారవ్వాలని మీకు తెలుసు, కావున దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇక్కడ మీరు ఏదైతే
దానము చేస్తారో, దానితో ఈ ఆత్మిక యూనివర్సిటీని, హాస్పిటల్ ను తెరుస్తారు. దానము
చేసిన తర్వాత ఇక దానిపై మమకారాన్ని తొలగించాలి ఎందుకంటే మనము భవిష్య 21 జన్మల కొరకు
తండ్రి నుండి తీసుకుంటాము అని మీకు తెలుసు. ఈ తండ్రి ఇళ్ళు మొదలైనవి నిర్మిస్తారు,
అవన్నీ తాత్కాలికమైనవి. లేదంటే ఇంతమంది పిల్లలంతా ఎక్కడ ఉంటారు. అంతా శివబాబాకే
ఇస్తారు. నాథుడు వారే. వారు వీరి ద్వారా ఇవన్నీ చేయిస్తారు. శివబాబా అయితే రాజ్యము
చేయరు. వారు స్వయం దాత. వారికి దేనిపై మమకారము ఉంటుంది. ఇప్పుడు తండ్రి శ్రీమతాన్ని
ఇస్తున్నారు - మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇంతకుముందు మీరు ఎవరికైనా
దానమిచ్చేటప్పుడు మృత్యువు మాట ఉండేది కాదు. ఇప్పుడు బాబా వచ్చారు కావున ఈ పాత
ప్రపంచమే అంతమవ్వనున్నది. తండ్రి అంటారు, నేను ఈ పతిత ప్రపంచాన్ని అంతము చేసేందుకే
వచ్చాను. ఈ రుద్ర యజ్ఞములో మొత్తము పాత ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. మీ
భవిష్యత్తు కొరకు ఏదైతే తయారుచేసుకుంటారో, అది కొత్త ప్రపంచములో లభిస్తుంది. లేదంటే
అంతా ఇక్కడే సమాప్తమైపోతుంది. ఎవరో ఒకరు అది తినేస్తారు. ఈ రోజుల్లో మనుష్యులు తమ
వద్ద ఉన్నది అప్పుగా కూడా ఇస్తూ ఉంటారు. వినాశనము అయ్యిందంటే అంతా అంతమైపోతుంది. ఇక
ఎవరూ ఎవరికీ ఏమీ ఇవ్వరు. అంతా అలా ఉండిపోతుంది. ఈ రోజు బాగుంటారు, రేపు దివాళా
తీస్తారు. ఎవరికీ ఏ ధనము లభించేది లేదు. ఎవరికైనా ఇచ్చారనుకోండి, వారు మరణిస్తే ఇక
దానిని ఎవరు తిరిగి ఇస్తారు. కావున మరి ఇప్పుడు ఏం చేయాలి? భారత్ యొక్క 21 జన్మల
కళ్యాణము కొరకు మరియు మీ యొక్క 21 జన్మల కళ్యాణము కొరకు మీ వద్ద ఉన్నదానిని
ఉపయోగించాలి. మీరు మీ కోసమే చేసుకుంటారు. శ్రీమతముపై మనము ఉన్నత పదవిని పొందుతాము
అని మీకు తెలుసు, దాని ద్వారా 21 జన్మల కొరకు సుఖ-శాంతులు లభిస్తాయి. దీనిని అవినాశీ
బాబా యొక్క ఆత్మిక హాస్పిటల్ మరియు యూనివర్సిటీ అని అంటారు, దీని ద్వారా ఆరోగ్యము,
ఐశ్వర్యము మరియు సుఖము లభిస్తాయి. కొందరికి ఆరోగ్యము ఉండి ఐశ్వర్యము లేకపోతే మరి
సుఖము ఉండదు. రెండూ ఉంటే సుఖముగా కూడా ఉంటారు. తండ్రి మీకు 21 జన్మల కొరకు ఈ
రెండింటినీ ఇస్తారు. 21 జన్మల కొరకు జమ చేసుకోవాలి. పిల్లల పని యుక్తిని రచించడము.
తండ్రి రావడముతో పేద పిల్లల భాగ్యము తెరుచుకుంటుంది. తండ్రి పేదల పాలిటి పెన్నిధి.
షావుకారుల భాగ్యములో ఈ విషయాలే లేవు. ఈ సమయములో భారత్ అన్నింటికన్నా పేదదిగా ఉంది.
ఒకప్పుడు షావుకారుగా ఉన్నవారే ఇప్పుడు నిరుపేదలుగా అయ్యారు. ఈ సమయములో అందరూ
పాపాత్ములుగా ఉన్నారు. ఎక్కడైతే పుణ్యాత్ములు ఉంటారో, అక్కడ పాపాత్ములు ఒక్కరు కూడా
ఉండరు. అది సత్యయుగము, సతోప్రధానమైనది. ఇది కలియుగము, తమోప్రధానమైనది. మీరు ఇప్పుడు
సతోప్రధానముగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. తండ్రి పిల్లలైన మీకు స్మృతిని
కలిగిస్తారు కావున - తప్పకుండా మేమే స్వర్గవాసులుగా ఉండేవారము అని మీరు భావిస్తారు.
తర్వాత మనము 84 జన్మలు తీసుకున్నాము. అంతేకానీ 84 లక్షల యోనులు అన్న విషయము
ప్రగల్భమే. ఇన్ని జన్మలు జంతువులు యోనిలో ఉన్నారా! మరి ఇది చివరిలోని మానవ జన్మనా?
మరి ఇప్పుడు తిరిగి వెళ్ళాలా?
ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇంకా
40-50 వేల సంవత్సరాలు లేవు. మనుష్యులైతే పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు, అందుకే
వారిని రాతిబుద్ధి కలవారు అని అంటారు. ఇప్పుడు మీరు రాతిబుద్ధి కలవారి నుండి
పారసబుద్ధి కలవారిగా అవుతారు. ఈ విషయాలను సన్యాసులు మొదలైనవారెవ్వరూ తెలియజేయలేరు.
మనము తిరిగి వెళ్ళాలి అని ఇప్పుడు తండ్రి మీకు స్మృతిని కలిగిస్తున్నారు. ఎంత వీలైతే
అంత మీ సామానును ట్రాన్స్ఫర్ చేసుకోండి. బాబా, ఇవన్నీ తీసుకోండి, మేము సత్యయుగములో
21 జన్మల కొరకు పొందుతాము. ఈ బాబా కూడా దాన-పుణ్యాలు చేసేవారు. వారికి అందులో ఎంతో
అభిరుచి ఉండేది. వ్యాపారస్థులు ధర్మార్థము రెండు పైసలను తీసేవారు, బాబా ఒక అణా
తీసేవారు. ఎవరు వచ్చినా వారి ద్వారము నుండి వట్టి చేతులతో వెళ్ళకూడదు అని
భావించేవారు. ఇప్పుడు భగవంతుడు సమ్ముఖములోకి వచ్చారు, ఇది ఎవరికీ తెలియదు. మనుష్యులు
దాన-పుణ్యాలు చేస్తూ-చేస్తూ చనిపోతారు, మరి దానికి ప్రతిఫలము ఎక్కడ లభిస్తుంది? వారు
పవిత్రముగా అవ్వరు, తండ్రిపై ప్రీతి పెట్టుకోరు. తండ్రి అర్థం చేయించారు, యాదవులు
మరియు కౌరవులది వినాశన కాలములో విపరీత బుద్ధి ఉంటుంది, పాండవులది వినాశన కాలములో
ప్రీతి బుద్ధి ఉంటుంది. యూరోప్ వాసులందరూ యాదవులు, వారు మిసైల్స్ మొదలైనవి
తయారుచేస్తూ ఉంటారు. శాస్త్రాలలోనైతే ఎలాంటి విషయాలను రాసేసారు. డ్రామా ప్లాన్
అనుసారముగా ఎన్నో శాస్త్రాలు తయారయ్యాయి. ఇందులో ప్రేరణ మొదలైనవాటి విషయమేమీ లేదు.
ప్రేరణ అనగా సంకల్పము. తండ్రి ఏమీ ప్రేరణ ద్వారా చదివించరు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు, ఇతను కూడా ఒక వ్యాపారిగా ఉండేవారు. వీరికి మంచి పేరు ఉండేది. అందరూ
వీరికి గౌరవమిచ్చేవారు. తండ్రి వీరిలోకి ప్రవేశించిన తర్వాత ఇక వీరిని నిందించడం
మొదలుపెట్టారు. శివబాబా గురించి ఎవరికీ తెలియదు, అలాగే వారిని నిందించలేరు కూడా.
నిందలు వీరు పొందుతారు. వెన్నను నేను తినలేదు అని శ్రీకృష్ణుడు అన్నారు కదా. అలాగే
వీరు కూడా అంటారు, ఈ పనులన్నీ చేసేది బాబాయే, నేను ఏమీ చేయను. ఇంద్రజాలికుడు వారే,
నేను కాదు. అనవసరముగా వీరిని నిందిస్తూ ఉంటారు. నేను ఎవరినైనా ఎత్తుకుపోయానా? మీరు
పారిపోయి రండి అని ఎవరికీ చెప్పలేదు. మేము అక్కడ ఉండేవారము, అందరూ తమంతట తామే
పారిపోయి వచ్చారు. అనవసరముగా దూషించారు. ఎన్ని నిందలు పడవలసి వచ్చింది. శాస్త్రాలలో
ఎలాంటి విషయాలను వ్రాసేసారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇవన్నీ మళ్ళీ జరుగుతాయి.
ఇవన్నీ జ్ఞాన విషయాలు. ఇది మనుష్యులెవ్వరూ చేయలేరు. బ్రిటీష్ ప్రభుత్వము వారి
రాజ్యములో ఇంతమంది కన్యలు, మాతలు ఎవరి వద్దనైనా కూర్చుండిపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు.
వారి సంబంధీకులు ఎవరైనా వస్తే వారిని తిరిగి తీసుకువెళ్ళే ప్రయత్నము చేసేవారు. బాబా
అనేవారు, కావాలంటే వీరికి అర్థం చేయించి తీసుకువెళ్ళండి. నేను ఏమీ వద్దు అని అనను.
కానీ ఎవ్వరికీ అంత ధైర్యము ఉండేది కాదు. బాబా యొక్క శక్తి ఉండేది కదా. ఇందులో
కొత్తేమీ లేదు. ఇవన్నీ మళ్ళీ తప్పకుండా జరుగుతాయి. నిందలు కూడా మళ్ళీ అనుభవించవలసి
ఉంటుంది. ద్రౌపది విషయము కూడా ఉంది. వీరందరూ ద్రౌపదులు మరియు దుశ్శాసనులు. అది
కేవలము ఒక్కరి విషయమే కాదు. శాస్త్రాలలో ఈ ప్రగల్భాలను ఎవరు వ్రాసారు? తండ్రి అంటారు,
ఇది కూడా డ్రామాలోని పాత్ర. ఆత్మ జ్ఞానమే ఎవరిలోనూ లేదు. పూర్తిగా దేహాభిమానులుగా
అయిపోయారు. దేహీ-అభిమానులుగా అవ్వడములో శ్రమ ఉంది. రావణుడు పూర్తిగా తలకిందులుగా
చేసేసాడు. ఇప్పుడు తండ్రి సరి చేస్తున్నారు.
దేహీ-అభిమానులుగా అయినట్లయితే స్వతహాగా స్మృతి ఉంటుంది - నేను ఒక ఆత్మను, ఈ దేహము
వాయించేందుకు ఒక వాయిద్యము వంటిది. ఈ స్మృతి ఉన్నా సరే దైవీ గుణాలు కూడా వస్తూ
ఉంటాయి. మీరు ఎవరికీ దుఃఖము ఇవ్వడానికి వీలులేదు. భారత్ లోనే ఈ లక్ష్మీ-నారాయణుల
రాజ్యము ఉండేది. ఇది 5000 సంవత్సరాల నాటి విషయము. ఒకవేళ ఎవరైనా లక్షల సంవత్సరాలు
ఉంది అని అంటే వారు ఘోర అంధకారములో ఉన్నట్లే. డ్రామానుసారముగా ఎప్పుడైతే సమయము
పూర్తయ్యిందో, అప్పుడు తండ్రి మళ్ళీ వచ్చారు. ఇప్పుడు తండ్రి అంటారు, నా శ్రీమతముపై
నడవండి. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. లేకపోతే మీ లోపల ఏవైతే ఆశలు ఉన్నాయో, అవి
మిగిలి పోతాయి. తప్పకుండా అందరూ మరణించవలసిందే. ఇది అదే మహాభారత యుద్ధము. ఎంతగా తమ
కళ్యాణము చేసుకోగలిగితే అంత మంచిది. లేకపోతే మీరు ఖాళీ చేతులతో వెళ్తారు. మొత్తము
ప్రపంచమంతా ఖాళీ చేతులతో వెళ్ళనున్నది. కేవలం పిల్లలైన మీరు మాత్రమే నిండు చేతులతో
వెళ్తారు అనగా ధనవంతులుగా అయిపోతారు. ఇందులో అర్థం చేసుకునేందుకు చాలా విశాలబుద్ధి
కావాలి. ఎన్ని ధర్మాల మనుష్యులు ఉన్నారు. ప్రతి ఒక్కరిది తమ-తమ పాత్ర నడుస్తుంది.
ఒకరి పాత్ర మరొకరితో కలవదు. అందరికీ తమ-తమ ముఖకవళికలు ఉన్నాయి, ఎన్ని రకాల
ముఖకవళికలు ఉన్నాయి, ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇవి అద్భుతమైన విషయాలు కదా.
ఇప్పుడు తండ్రి అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అయిన మనము 84 జన్మల
చక్రమును చుట్టి వస్తాము, ఆత్మ అయిన మనము ఈ డ్రామాలో పాత్రధారులము. దీని నుండి మనము
బయటకు రాలేము, మోక్షము పొందలేము. కావున దాని కొరకు ప్రయత్నించడము కూడా వృధానే.
తండ్రి అంటారు, డ్రామా నుండి ఎవరైనా బయటకు వెళ్ళిపోయి, మరొకరు ఎవరైనా డ్రామాలోకి
యాడ్ అవ్వడమనేది జరగదు. ఇంతటి జ్ఞానమంతా అందరి బుద్ధిలోనూ ఉండదు. రోజంతా ఇటువంటి
జ్ఞానములో రమిస్తూ ఉండాలి. ఒక ఘడియ, అర్ధ ఘడియ... స్మృతి చేయండి, ఇక తర్వాత అది
పెంచుకుంటూ వెళ్ళండి. 8 గంటలు స్థూల సేవ చేయండి, విశ్రాంతి కూడా తీసుకోండి, అలాగే ఈ
ఆత్మిక గవర్నమెంట్ యొక్క సేవకు కూడా సమయాన్ని కేటాయించండి. మీరు మీ సేవనే
చేసుకుంటారు, ఇదే ముఖ్యమైన విషయము. స్మృతి యాత్రలో ఉండండి, ఇకపోతే జ్ఞానము ద్వారా
ఉన్నత పదవిని పొందాలి. మీ స్మృతి చార్టును పూర్తిగా పెట్టుకోండి. జ్ఞానమైతే సహజమే.
నేను మనుష్య సృష్టికి బీజరూపుడను, నాకు దీని ఆదిమధ్యాంతాల గురించి తెలుసు అని ఏ
విధంగా తండ్రి బుద్ధిలో ఉందో, అలా మనము కూడా బాబా పిల్లలము. ఈ చక్రము ఏ విధంగా
తిరుగుతుంది అనేది బాబా అర్థం చేయించారు. ఆ సంపాదన కొరకు కూడా మీరు 8-10 గంటలు
ఇస్తారు కదా. మంచి కస్టమర్లు దొరికితే రాత్రివేళలో ఎప్పుడూ ఆవలింతలు రావు. ఆవలింతలు
వచ్చినట్లయితే వీరు అలసిపోయారు అని లేక వీరి బుద్ధి ఎక్కడో బయట భ్రమిస్తూ
ఉండవచ్చునని అర్థం చేసుకోవడం జరుగుతుంది. సెంటర్లలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ
పిల్లలైతే ఇతరుల చింతన చేయరో, తమ చదువులోనే ఆనందముగా నిమగ్నమై ఉంటారో, వారి ఉన్నతి
సదా జరుగుతూనే ఉంటుంది. మీరు ఇతరుల చింతన చేసి మీ పదవిని భ్రష్టము చేసుకోకూడదు. చెడు
వినవద్దు, చెడు చూడవద్దు... ఎవరైనా మంచిగా మాట్లాడకపోతే ఒక చెవి నుండి విని ఇంకొక
చెవి నుండి వదిలేయండి. ఎల్లప్పుడూ స్వయాన్ని చూసుకోవాలి, అంతేకానీ ఇతరులను కాదు. మీ
చదువును వదలకూడదు. చాలామంది ఈ విధంగా అలుగుతారు. రావడము మానేస్తారు, మళ్ళీ వస్తారు.
ఇక్కడకు రాకపోతే ఇంకెక్కడికి వెళ్తారు? స్కూల్ అయితే ఒక్కటే. తమ కాళ్ళపై తామే
గొడ్డలితో కొట్టుకోకూడదు. మీరు మీ చదువులో ఆనందముగా నిమగ్నమై ఉండండి. చాలా సంతోషముగా
ఉండండి. భగవంతుడు చదివిస్తున్నారు, ఇంకేమి కావాలి. భగవంతుడే మన తండ్రి, టీచరు,
సద్గురువు, వారితోనే బుద్ధియోగము జోడించబడుతుంది. వారు మొత్తము ప్రపంచమంతటికీ నంబర్
వన్ ప్రియుడు, వారు మిమ్మల్ని నంబరు వన్ విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు.
తండ్రి అంటారు, మీ ఆత్మ చాలా పతితముగా ఉంది, ఎగరలేదు. రెక్కలు విరిగిపోయి ఉన్నాయి.
రావణుడు ఆత్మలందరి రెక్కలను తెంచేసాడు. శివబాబా అంటారు, నేను తప్ప ఇంకెవరూ పావనముగా
చేయలేరు. పాత్రధారులందరూ ఇక్కడే ఉన్నారు, వృద్ధిని పొందుతూ ఉంటారు, ఎవరూ తిరిగి
వెళ్ళరు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వ చింతనలో మరియు చదువులో ఆనందముగా నిమగ్నమై ఉండాలి. ఇతరులను చూడకూడదు.
ఒకవేళ ఎవరైనా మంచిగా మాట్లాడకపోతే ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేయాలి. అలిగి
చదువును విడిచిపెట్టకూడదు.
2. జీవిస్తూ సర్వస్వాన్ని దానము చేసి తమ మమకారాన్ని తొలగించివేయాలి. పూర్తిగా
వీలునామా చేసి ట్రస్టీగా అయి తేలికగా ఉండాలి. దేహీ-అభిమానులుగా అయి సర్వ దైవీ
గుణాలను ధారణ చేయాలి.
వరదానము:-
భిన్నత్వాన్ని తొలగించి ఏకతను తీసుకువచ్చే సత్యమైన సేవాధారి
భవ
బ్రాహ్మణ పరివారము యొక్క విశేషత ఏమిటంటే - అనేకమంది ఉంటూ
కూడా ఏకత. మీ ఏకత ద్వారానే మొత్తము విశ్వములో ఏక ధర్మము, ఏక రాజ్యము యొక్క స్థాపన
జరుగుతుంది, అందుకే విశేషమైన అటెన్షన్ ఉంచి భిన్నత్వాన్ని తొలగించండి మరియు ఏకతను
తీసుకురండి, అప్పుడు సత్యమైన సేవాధారులు అని అంటారు. సేవాధారులు స్వయము కోసము ఉండరు,
సేవ కోసము ఉంటారు. స్వయానిదంతా సేవ కోసము స్వాహా చేస్తారు, ఏ విధంగా సాకార బాబా
సేవలో ఎముకలను సైతం స్వాహా చేసారో, అలా మీ ప్రతి కర్మేంద్రియము ద్వారా సేవ జరుగుతూ
ఉండాలి.
స్లోగన్:-
పరమాత్మ ప్రేమలో మైమరచిపోయినట్లయితే దుఃఖాల ప్రపంచాన్ని మర్చిపోతారు.
అవ్యక్త సూచనలు -
‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’
సదా గుర్తు పెట్టుకోండి - కంబైండుగా ఉండేవారము, ఇప్పుడూ కంబైండుగా ఉన్నాము మరియు
తర్వాత కూడా కంబైండుగానే ఉంటాము. అనేక సార్లుగా కంబైండుగా ఉన్న స్వరూపాన్ని వేరు
చెసే శక్తి ఎవ్వరికీ లేదు. ప్రేమకు గుర్తు కంబైండుగా ఉండటము. ఇది ఆత్మ మరియు
పరమాత్మల తోడు. పరమాత్మ అయితే ఎక్కడైనా తోడును నిర్వర్తిస్తారు మరియు ప్రతి ఒక్కరితో
కంబైండు రూపము ద్వారా ప్రీతి యొక్క రీతిని నిర్వర్తిస్తారు.
| | |