11-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - స్తబ్ధ అవస్థ కలవారిగా అనగా అశరీరులుగా అయ్యేందుకు ఇప్పుడిది సమయము, ఈ అవస్థలోనే ఉండే అభ్యాసమును చేయండి’’

ప్రశ్న:-
అన్నింటికన్నా ఉన్నతమైన గమ్యము ఏమిటి, అది ఎలా ప్రాప్తిస్తుంది?

జవాబు:-
సంపూర్ణ నిర్వికారీ దృష్టి కలవారిగా అవ్వాలి, ఇదే ఉన్నతమైన గమ్యము. కర్మేంద్రియాలలో ఏ మాత్రమూ చంచలత్వము రాకూడదు, అప్పుడే సంపూర్ణ నిర్వికారీ దృష్టి కలవారిగా అవుతారు. ఎప్పుడైతే ఇటువంటి అవస్థ ఏర్పడుతుందో, అప్పుడు విశ్వ రాజ్యాధికారము లభించగలదు. ఉన్నతిలోకి వెళ్తూ ఉంటే వైకుంఠ రసాన్ని ఆస్వాదిస్తారు... అని అంటూ ఉంటారు కూడా, అనగా రాజులకే రాజులుగా అవుతారు లేకపోతే ప్రజలుగా అవుతారు. ఇప్పుడు చెక్ చేసుకోండి - నా వృత్తి ఎలా ఉంది? ఎటువంటి పొరపాట్లు జరగడం లేదు కదా?

ఓంశాంతి
ఆత్మాభిమానులుగా అయి కూర్చోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు బాబా ఆల్ రౌండర్ దాదీని అడుగుతున్నారు - సత్యయుగములో ఆత్మాభిమానులుగా ఉంటారా లేక దేహాభిమానులుగా ఉంటారా? అక్కడైతే ఆటోమేటిక్ గా ఆత్మాభిమానులుగా ఉంటారు, ఘడియ-ఘడియ స్మృతి చేయవలసిన అవసరం ఉండదు. అయితే, అక్కడ ఏమని భావిస్తారంటే - ఇప్పుడు ఈ శరీరము పెద్దది అయ్యింది, ఇప్పుడిక దీనిని వదిలి కొత్త శరీరాన్ని తీసుకోవాలి. ఏ విధంగా సర్పం యొక్క ఉదాహరణ ఉందో, అదే విధంగా ఆత్మ కూడా ఈ పాత శరీరాన్ని వదిలి కొత్తదానిని తీసుకుంటుంది. భగవంతుడు ఉదాహరణలు ఇచ్చి అర్థం చేయిస్తారు. మీరు మనుష్యులందరికీ జ్ఞానాన్ని భూ-భూ చేస్తూ తమ సమానముగా జ్ఞానవంతులుగా తయారుచేయాలి, తద్వారా వారు ఫరిశ్తాలుగా, నిర్వికారీ దేవతలుగా అవుతారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడమే ఉన్నతోన్నతమైన చదువు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసారు... అని అంటూ ఉంటారు కూడా. అలా ఎవరు తయారుచేసారు? దేవతలైతే అలా తయారుచేయలేదు. భగవంతుడే మనుష్యులను దేవతలుగా తయారుచేస్తారు. మనుష్యులకు ఈ విషయాల గురించి తెలియదు. మీ లక్ష్యము-ఉద్దేశ్యము ఏమిటి అని మిమ్మల్ని అన్ని చోట్లా అడుగుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు మీ లక్ష్యము-ఉద్దేశ్యమును వివరిస్తూ ఒక చిన్న కరపత్రము ఎందుకు ముద్రించబడి ఉండకూడదు. ఎవరైనా అడిగితే, వారికి ఆ కరపత్రమును ఇచ్చినట్లయితే వారు దాని ద్వారా అర్థం చేసుకుంటారు. బాబా అయితే చాలా బాగా అర్థం చేయించారు - ఈ సమయములో ఇది కలియుగము, పతిత ప్రపంచము, ఇందులో అపారమైన దుఃఖాలు ఉన్నాయి. ఇప్పుడు మనము మనుష్యులను సత్యయుగ పావన మహా సుఖధామములోకి తీసుకువెళ్ళే సేవను చేస్తున్నాము లేక ఆ దారిని తెలియజేస్తున్నాము. మనము అద్వైత జ్ఞానాన్ని ఇస్తున్నామని కాదు. వారైతే శాస్త్రాల జ్ఞానాన్ని అద్వైత జ్ఞానముగా భావిస్తారు. వాస్తవానికి అది అద్వైత జ్ఞానమేమీ కాదు. అద్వైత జ్ఞానము అని వ్రాయడం కూడా తప్పే. మనుష్యులకు దీనిని స్పష్టం చేసి అర్థం చేయించాలి. మన ఉద్దేశ్యము ఏమిటి? అని ఎవరైనా వెంటనే అర్థం చేసుకోగలిగేలా వివరణ వ్రాయబడి ఉండాలి. కలియుగ పతిత భ్రష్టాచారి మనుష్యులను మనము అపారమైన దుఃఖాల నుండి విడిపించి సత్యయుగ పవిత్ర శ్రేష్ఠాచారీ అపార సుఖాల ప్రపంచములోకి తీసుకువెళ్తాము. బాబా ఇటువంటి వ్యాసములను పిల్లలకు ఇస్తారు. దీనిని స్పష్టంగా వ్రాయాలి. అన్నిచోట్లా మీరు వ్రాసినది ఉండాలి, వెంటనే దానిని తీసి ఇవ్వాలి, అప్పుడు, మేము దుఃఖధామములో ఉన్నాము, చెత్తలో పడి ఉన్నాము అని అర్థం చేసుకుంటారు. మేము కలియుగీ పతిత దుఃఖధామ మనుష్యులము, వీళ్ళు మమ్మల్ని అపారమైన సుఖాలలోకి తీసుకువెళ్తారు అని మనుష్యులు అర్థం చేసుకోరు. కావున, ఇటువంటి ఒక మంచి కరపత్రాన్ని తయారుచేయాలి. మీరు సత్యయుగం వారా లేక కలియుగం వారా అని బాబా కూడా ఒకటి ముద్రించారు కదా. కానీ మనుష్యులు అర్థం చేసుకోరు. రత్నాలను కూడా రాళ్ళుగా భావించి పడేస్తారు. ఇవి జ్ఞాన రత్నాలు. వారు శాస్త్రాలలో రత్నాలు ఉన్నాయి అని భావిస్తారు. ఇక్కడ అపారమైన దుఃఖము ఉంది అని వారు అర్థం చేసుకునేలా మీరు స్పష్టం చేసి చెప్పండి. దుఃఖాల లిస్ట్ కూడా ఉండాలి, తక్కువలో తక్కువ 101 తప్పకుండా ఉండాలి. ఈ దుఃఖధామములో అపారమైన దుఃఖాలు ఉన్నాయి, అవన్నీ వ్రాయండి, ఆ లిస్టు అంతా తయారుచేయండి. ఇంకొక వైపేమో అపారమైన సుఖము ఉంటుంది, అక్కడ దుఃఖము అన్న మాటే ఉండదు. ఇప్పుడు మేము ఆ రాజ్యాన్ని లేక సుఖధామాన్ని స్థాపిస్తున్నాము అని అందులో ఉండాలి, అప్పుడు వెంటనే మనుష్యుల నోరు మూసుకుపోతుంది. ఈ సమయములో ఇది దుఃఖధామము అని ఎవ్వరూ భావించరు, వారు దీనినే స్వర్గముగా భావిస్తూ కూర్చున్నారు. పెద్ద-పెద్ద మహళ్ళు, కొత్త-కొత్త మందిరాలు మొదలైనవాటిని నిర్మిస్తూ ఉంటారు, ఇవన్నీ అంతమైపోనున్నాయి అని వారికి తెలియదు. వారికి లంచం డబ్బు అయితే ఎంతో లభిస్తుంది. అవన్నీ మాయకు సంబంధించిన సైన్స్ యొక్క అహంకారము, మోటార్లు, విమానాలు మొదలైనవన్నీ మాయ యొక్క షో అని బాబా అర్థం చేయించారు. తండ్రి ఎప్పుడైతే స్వర్గ స్థాపనను చేస్తారో అప్పుడు మాయ కూడా తన ఆడంబరాన్ని చూపిస్తుంది, ఇది కూడా నియమము, దీనినే మాయ ఆడంబరము అని అంటారు.

ఇప్పుడు పిల్లలైన మీరు మొత్తం విశ్వమంతటిలోనూ శాంతిని స్థాపన చేస్తున్నారు. ఒకవేళ మాయ ఎక్కడైనా ప్రవేశిస్తే, పిల్లలకు మనసులో తింటూ ఉంటుంది. ఎప్పుడైనా, ఎవరైనా ఎవరి నామ-రూపాల్లోనైనా చిక్కుకుంటే, వీరు వికారీ దృష్టి కలవారు అని తండ్రి అర్థం చేయిస్తారు. కలియుగములో క్రిమినలైజేషన్ ఉంది, సత్యయుగములో సివిలైజేషన్ (శుద్ధత) ఉంటుంది. ఈ దేవతల ముందుకు వెళ్ళి అందరూ తల వంచి నమస్కరిస్తారు, మీరు నిర్వికారులు, మేము వికారులము అని అంటారు. అందుకే తండ్రి అంటారు, ప్రతి ఒక్కరూ తమ అవస్థను చూసుకోండి. పెద్ద-పెద్ద మంచి మహారథులు స్వయాన్ని చూసుకోండి, మా బుద్ధి ఎవరి నామ-రూపాలలోకైనా వెళ్ళటం లేదు కదా? ఫలానా ఆమె చాలా బాగుంది, ఇది చేయాలి... అంటూ మనసులో ఏమైనా అనిపిస్తుందా? ఈ సమయములో సంపూర్ణ నిర్వికారీ దృష్టి కలవారు ఎవ్వరూ లేరు అని బాబాకు తెలుసు. కొద్దిగా కూడా చంచలత్వం ఉండకూడదు, ఇది చాలా కష్టము. ఏ ఒక్కరో అలా ఉంటారు. కళ్ళు ఏదో ఒక రకంగా తప్పకుండా మోసగిస్తూ ఉంటాయి. డ్రామా ఎవ్వరినీ అంత త్వరగా నిర్వికారీ దృష్టి కలవారిగా చేయదు. చాలా పురుషార్థం చేసి స్వయాన్ని చెక్ చేసుకోవాలి - నా కళ్ళు నన్ను ఎక్కడా మోసగించడం లేదు కదా? విశ్వాధిపతులుగా ఉండడం చాలా ఉన్నతమైన గమ్యము. పైకి ఎక్కితే వైకుంఠ రసాన్ని పొందుతారు... అనగా రాజులకే రాజులుగా అవుతారు, పడిపోతే ప్రజలలోకి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో ఇది వికారీ కాలము అని అంటారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా, రాణి అయినా, కానీ తనలో కూడా, నన్ను ఎవరైనా చంపేస్తారేమోనన్న భయం ఉంటుంది. మనుష్యులు ప్రతి ఒక్కరిలోనూ అశాంతి ఉంది. కొంతమంది పిల్లలు కూడా ఎంత అశాంతిని వ్యాపింపజేస్తారు. మీరు శాంతిని స్థాపిస్తున్నారు, కావున మొదట మీరు స్వయం శాంతిలో ఉండండి, అప్పుడే ఇతరులలో కూడా ఆ బలం నిండుతుంది. అక్కడైతే ఎంతో శాంతిగల రాజ్యం ఉంటుంది. కళ్ళు శుద్ధముగా అయిపోతాయి. కావున తండ్రి అంటున్నారు - ఈ రోజు ఆత్మనైన నా వృత్తి ఎలా ఉంది? అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఇందులో ఎంతో శ్రమ ఉంది. మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. అనంతమైన తండ్రికి కూడా ఎప్పుడూ నిజం చెప్పరు. అడుగడుగులోనూ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కొద్దిగా ఆ అశుద్ధ దృష్టితో చూసినా, పొరపాటు జరిగినా వెంటనే నోట్ చేసుకోండి. ఎప్పటివరకైతే పూర్తి పొరపాట్లు లేనివారిగా అవ్వరో, అప్పటివరకూ 10-20 పొరపాట్లు అయితే రోజూ చేస్తూనే ఉంటారు. కానీ ఎవ్వరూ సత్యం చెప్పరు. దేహాభిమానం వల్ల తప్పకుండా ఏవో పాపాలు జరుగుతూ ఉంటాయి, అది లోలోపల తింటూ ఉంటుంది. కొందరైతే పొరపాటు అని దేనినంటారో కూడా అర్థం చేసుకోరు. జంతువులు ఏమైనా అర్థం చేసుకుంటాయా! మీరు కూడా ఈ జ్ఞానానికి ముందు కోతిబుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు కొందరు 50 శాతం, కొందరు 10 శాతం, కొందరు మరికొంత మారుతూ ఉంటారు. ఈ కనులైతే ఎంతగానో మోసగిస్తూ ఉంటాయి. అన్నింటికన్నా చురుకైనవి ఈ కళ్ళే.

తండ్రి అంటారు, ఆత్మ అయిన మీరు అశరీరిగా వచ్చారు, అప్పుడు శరీరము లేదు. ఇప్పుడు ఏ శరీరమును తీసుకుంటామో, ఏ సంబంధములోకి వెళ్తామో మీకు ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. గర్భములో అంతా స్తబ్దముగానే ఉంటుంది. ఆత్మ పూర్తిగా స్తబ్ధముగా అయిపోతుంది. ఎప్పుడైతే శరీరము పెద్దదవుతుందో అప్పుడు తెలుస్తుంది. కావున మీరు ఈ విధంగా తయారై వెళ్ళాలి. ఇప్పుడు ఇక ఈ పాత శరీరాన్ని వదిలి మనము వెళ్ళాలి, మళ్ళీ ఎప్పుడైతే శరీరాన్ని తీసుకుంటారో అప్పుడు స్వర్గములో తమ పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు ఇది స్తబ్దముగా అయ్యే సమయము. ఆత్మ సంస్కారాలు తీసుకువెళ్ళినా ఎప్పుడైతే శరీరము పెద్దదవుతుందో అప్పుడు సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి, అందుకే పాత ప్రపంచము యొక్క, ఈ శరీరము యొక్క భానాన్ని తొలగించివేయాలి, ఏమీ గుర్తుండకూడదు, ఎంతో పథ్యము పాటించాలి. లోపల ఏదైతే ఉంటుందో అదే బయటకు వస్తుంది. శివబాబా లోపల కూడా జ్ఞానము ఉంది. నాకు కూడా పాత్ర ఉంది. జ్ఞానసాగరుడు అని నా గురించే అంటారు. మహిమను గానం చేస్తారు, కానీ అర్థమేమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అర్థసహితముగా తెలుసుకున్నారు. ఇకపోతే ఆత్మ బుద్ధి అయితే ఈ సమయంలో పైసకు కొరగానిదిగా అయిపోతుంది. ఇప్పుడు తండ్రి ఎంత వివేకవంతులుగా తయారుచేస్తారు. మనుష్యుల వద్దనైతే కోటానుకోట్లు ఉన్నాయి. ఇదంతా మాయ ఆడంబరమే కదా. సైన్సులో మనకు ఉపయోగపడే వస్తువులు ఏవైతే ఉంటాయో అవి అక్కడ కూడా ఉంటాయి. వాటిని తయారుచేసేవారు అక్కడకు కూడా వెళ్తారు. కానీ వారు రాజులుగా అయితే అవ్వరు. వీరంతా చివరిలో మీ వద్దకు వస్తారు మరియు ఇతరులకు కూడా నేర్పిస్తారు. ఒక్క తండ్రి నుండి మీరు ఎంతమంది నేర్చుకుంటారు. ఒక్క తండ్రే ప్రపంచాన్ని ఎలా ఉన్నదానిని ఎలా తయారుచేస్తారు. ఇన్వెన్షన్ ఎల్లప్పుడూ ఒక్కరే కనుగొంటారు, ఆ తర్వాత దానిని వ్యాపింపచేస్తారు. బాంబులను తయారుచేసేవారు కూడా మొదట ఒక్కరే ఉండేవారు. దీని ద్వారా ప్రపంచం వినాశనమైపోతుంది అని భావించారు. ఆ తర్వాత ఇంకా తయారుచేయడం మొదలుపెట్టారు. అక్కడ కూడా సైన్స్ అయితే కావాలి కదా. ఇంకా సమయం ఉంది, నేర్చుకొని తెలివైనవారిగా అయిపోతారు. తండ్రి పరిచయం లభించాక ఇక స్వర్గములోకి వచ్చి పనివారిగా అవుతారు. అక్కడ అన్నీ సుఖపు విషయాలే ఉంటాయి. సుఖధామములో ఏదైతే ఉండేదో అది మళ్ళీ ఉంటుంది. అక్కడ రోగము, దుఃఖము యొక్క విషయమేదీ లేదు. ఇక్కడైతే అపారమైన దుఃఖము ఉంది. అక్కడ అపారమైన సుఖము ఉంటుంది. ఇప్పుడు మనం అది స్థాపిస్తున్నాము. దుఃఖహర్త, సుఖకర్త ఒక్క తండ్రే. మొదట స్వయానిది కూడా అటువంటి అవస్థ ఉండాలి, కేవలం పాండిత్యం ఉండటం కాదు. ఇలా ఒక పండితుని కథ ఉంది, రామ నామాన్ని జపిస్తే నదిని దాటి వేయవచ్చు అని అన్నారు... అది ఈ సమయములోని విషయమే. మీరు తండ్రి స్మృతిలో విషయ సాగరము నుండి క్షీర సాగరములోకి వెళ్ళిపోతారు. ఇక్కడ పిల్లలైన మీ అవస్థ చాలా బాగుండాలి. యోగబలం లేకపోతే, అశుద్ధ దృష్టి ఉన్నట్లయితే వారి బాణం తగలదు. కళ్ళు శుద్ధముగా ఉండాలి. తండ్రి స్మృతిలో ఉంటూ ఎవరికైనా జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే బాణం తగులుతుంది. జ్ఞానమనే ఖడ్గములో యోగమనే పదును కావాలి. జ్ఞానము ద్వారా ధనము యొక్క సంపాదన జరుగుతుంది. శక్తి అంతా స్మృతిదే. చాలామంది పిల్లలు ఏ మాత్రమూ స్మృతి చేయరు, అసలు వారికి తెలియనే తెలియదు. తండ్రి అంటారు, ఇది దుఃఖధామమని, సత్యయుగము సుఖధామమని మనుష్యులకు అర్థం చేయించాలి. కలియుగములో సుఖము అన్న మాటే లేదు, ఒకవేళ ఉన్నా కానీ అది కాకిరెట్టతో సమానమైనదే. సత్యయుగములో అయితే అపారమైన సుఖము ఉంది. మనుష్యులు దాని అర్థాన్ని తెలుసుకోరు. ముక్తి కొరకే కష్టపడుతూ ఉంటారు. జీవన్ముక్తి గురించి అయితే ఎవ్వరికీ తెలియనే తెలియదు. మరి వారు జ్ఞానాన్ని కూడా ఎలా ఇవ్వగలరు? వారు రావడమే రజోప్రధాన సమయములో వస్తారు, కావున వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? ఇక్కడి సుఖము కాకిరెట్టతో సమానమైనది. రాజయోగము ద్వారా ఏమి జరిగింది అన్నది కూడా వారికి తెలియదు. ఇదంతా ఇప్పుడు డ్రామాగా నడుస్తోందని పిల్లలైన మీకు తెలుసు. వార్తాపత్రికల్లో కూడా మీ నిందను వ్రాస్తారు, అది జరగవలసిందే. అబలలపై రకరకాల అత్యాచారాలు జరుగుతాయి. ప్రపంచములో అనేక దుఃఖాలు ఉన్నాయి, ఇప్పుడు ఎటువంటి సుఖమూ లేదు. ఎంత పెద్ద షావుకార్లు అయినా, వారు రోగగ్రస్థులైతే, అంధులుగా అయితే దుఃఖమైతే ఉంటుంది కదా. దుఃఖాల లిస్టులో ఇవన్నీ వ్రాయండి. రావణరాజ్యములో, కలియుగ అంతములో ఈ విషయాలన్నీ ఉన్నాయి. సత్యయుగములో దుఃఖము యొక్క విషయం ఒక్కటి కూడా ఉండదు. సత్యయుగము ఒకప్పుడు ఉండి వెళ్ళింది కదా. ఇప్పుడిది సంగమయుగము. తండ్రి కూడా సంగమములోనే వస్తారు. 5000 సంవత్సరాలలో మనం ఏ ఏ జన్మలు తీసుకుంటాము అనేది ఇప్పుడు మీకు తెలుసు. అలాగే ఏ విధముగా సుఖము నుండి దుఃఖములోకి వస్తామో కూడా మీకు తెలుసు. ఎవరికైతే మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉంటుందో, ధారణ ఉంటుందో వారు అర్థం చేసుకోగలుగుతారు. తండ్రి పిల్లలైన మీ జోలెను నింపుతారు. ధనం ఇచ్చినా ఆ ధనం తరగదు అన్న గాయనం కూడా ఉంది. ధనాన్ని దానం చేయకపోతే వారి వద్ద అది లేనట్లే. కావున అది మళ్ళీ లభించదు కూడా. లెక్క ఉంటుంది కదా. ఇవ్వనే ఇవ్వకపోతే మరి అది ఎక్కడి నుండి లభిస్తుంది? వృద్ధి ఎక్కడి నుండి జరుగుతుంది? ఇవన్నీ అవినాశీ జ్ఞాన రత్నాలు. నంబరువారుగానైతే ప్రతి విషయములోనూ ఉంటారు కదా. మీది ఆత్మిక సైన్యము. కల్పపూర్వము పొందినట్లుగా ఒక ఆత్మ వెళ్ళి ఉన్నత పదవిని పొందుతుంది, ఇంకొక ఆత్మ వెళ్ళి ప్రజా పదవిని పొందుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే ఆత్మిక పిల్లలకు నంబరువారు పురుషార్థానుసారముగా బాప్ దాదా మరియు మాత-పితల హృదయపూర్వకమైన, ప్రాణప్రదమైన, ప్రేమతో నిండిన ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మిమ్మల్ని మీరు సంభాళించుకునేందుకు అడుగడుగులోనూ చెక్ చేసుకోవాలి - 1. ఈ రోజు ఆత్మనైన నా వృత్తి ఎలా ఉంది? 2. కనులు శుద్ధముగా ఉన్నాయా? 3. దేహాభిమానానికి వశమై ఏయే పాపాలు జరిగాయి?

2. బుద్ధిలో అవినాశీ జ్ఞాన ధనాన్ని ధారణ చేసి ఆపై దానం చేయాలి. జ్ఞానమనే ఖడ్గములో స్మృతి పదునును తప్పకుండా నింపుకోవాలి.

వరదానము:-

సత్యతా అథారిటీని ధారణ చేసి సర్వులను ఆకర్షితము చేసే నిర్భయ మరియు విజయీ భవ

పిల్లలైన మీరు సత్యతకు చెందిన శక్తిశాలీ శ్రేష్ఠ ఆత్మలు. సత్య జ్ఞానము, సత్యమైన తండ్రి, సత్య ప్రాప్తి, సత్య స్మృతి, సత్య గుణాలు, సత్య శక్తులు అన్నీ ప్రాప్తించాయి. ఇంత పెద్ద అథారిటీకి చెందిన నషా ఉన్నట్లయితే ఈ సత్యతా అథారిటీ ప్రతి ఆత్మను ఆకర్షిస్తుంటుంది. అసత్యఖండములో కూడా ఇటువంటి సత్యతా శక్తి కలవారే విజయులుగా అవుతారు. సత్యత యొక్క ప్రాప్తి సంతోషము మరియు నిర్భయత. సత్యాన్ని మాట్లాడేవారు నిర్భయులుగా ఉంటారు. వారికి ఎప్పుడూ భయం కలగదు.

స్లోగన్:-

వాయుమండలాన్ని పరివర్తన చేయడానికి సాధనము - పాజిటివ్ సంకల్పాలు మరియు శక్తిశాలీ వృత్తి.