12-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 15.11.2003


‘‘మనసును ఏకాగ్రము చేసి, ఏకాగ్రతా శక్తి ద్వారా ఫరిశ్తా స్థితిని అనుభవము చెయ్యండి’’

ఈ రోజు సర్వ ఖజానాల యజమాని తమ నలువైపులా ఉన్న సంపన్నులైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరినీ సర్వ ఖజానాలకు యజమానిగా తయారుచేసారు. ఎటువంటి ఖజానా లభించిందంటే, దానిని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఖజానాలతో సంపన్నముగా ఉన్నట్లు అనుభవం చేస్తున్నారా? అన్నిటికంటే శ్రేష్ట ఖజానాలు - జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా, అలాగే బాబా మరియు సర్వ బ్రాహ్మణ ఆత్మల ద్వారా లభించిన ఆశీర్వాదాల ఖజానా. కావున చెక్ చేసుకోండి - ఈ సర్వ ఖజానాలూ ప్రాప్తించాయా? సర్వ ఖజానాలతో సంపన్నముగా ఉన్న ఆత్మలు ఎవరైతే ఉంటారో, వారి గుర్తు ఏమిటంటే - వారి నయనాల ద్వారా, ముఖము ద్వారా, నడవడిక ద్వారా సంతోషమనేది ఇతరులకు కూడా అనుభవమవుతుంది. ఏ ఆత్మ సంపర్కములోకి వచ్చినా, వారు ఎలా అనుభవం చేస్తారంటే - ఈ ఆత్మ అలౌకిక సంతోషముతో అలౌకికముగా, అతీతముగా కనిపిస్తుంది అని. మీ సంతోషాన్ని చూసి ఇతర ఆత్మలు కూడా కొద్ది సమయానికి సంతోషాన్ని అనుభవం చేస్తారు. ఏ విధంగానైతే బ్రాహ్మణ ఆత్మలైన మీ శ్వేత వస్త్రాలు అందరికీ ఎంతో అతీతమైనవిగా మరియు ప్రియమైనవిగా అనిపిస్తాయో, స్వచ్ఛత, నిరాడంబరత మరియు పవిత్రత అనుభవమవుతుందో, వీరు బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలు అని దూరం నుండే తెలిసిపోతుందో, అలాగే బ్రాహ్మణ ఆత్మలైన మీ నడవడిక మరియు ముఖము ద్వారా సదా సంతోషపు మెరుపు, భాగ్యముతో కూడిన నషా కనిపించాలి. ఈ రోజుల్లో సర్వాత్మలు చాలా దుఃఖముతో ఉన్నారు, అటువంటి ఆత్మలు సంతోషముతో ఉన్న మీ ముఖాన్ని చూసి, నడవడికను చూసి ఒక్క ఘడియనైనా సంతోషాన్ని అనుభవం చెయ్యాలి. ఎలా అయితే దాహముతో ఉన్న ఆత్మకు ఒకవేళ ఒక్క నీటి చుక్క దొరికినా ఎంతగా సంతోషపడతారు, అలా సంతోషమనే అంచలి ఆత్మలకు చాలా అవసరము. ఇలా సర్వ ఖజానాలతో సదా సంపన్నముగా ఉండాలి. ప్రతి బ్రాహ్మణ ఆత్మ స్వయాన్ని సర్వ ఖజానాలతో సదా నిండుగా ఉన్నట్లు అనుభవం చేస్తున్నారా లేక అప్పుడప్పుడునా? ఖజానాలు అవినాశీ అయినవి, వాటిని ఇచ్చే దాత కూడా అవినాశీ, కనుక ఉండటము కూడా అవినాశీగా ఉండాలి ఎందుకంటే మీకు లభించిన ఈ అలౌకిక సంతోషము మొత్తము కల్పములో బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ ప్రాప్తించదు. ఇప్పటి ఈ అలౌకిక సంతోషము అర్ధకల్పము ప్రారబ్ధ రూపములో నడుస్తుంది. మరి అందరూ సంతోషముగా ఉన్నారా! ఇందులోనైతే అందరూ చేతులెత్తారు, అచ్ఛా - సదా సంతోషముగా ఉన్నారా? ఎప్పుడైనా సంతోషము పోవటం లేదు కదా? అప్పుడప్పుడు పోతుంటుందా! సంతోషముగా ఉంటారు కానీ సదా ఏకరసముగా అలా ఉండటములో తేడా వచ్చేస్తుంది. సంతోషముగా ఉంటారు కానీ పర్సెంటేజ్ లో తేడా వచ్చేస్తుంది.

బాప్ దాదా ఆటోమేటిక్ టి.వి. ద్వారా పిల్లలందరి ముఖాలను చూస్తూ ఉంటారు. మరి ఏం కనిపిస్తుంది? ఒక రోజు మీరు కూడా మీ సంతోషము యొక్క చార్టును చెక్ చేసుకోండి - అమృతవేళ నుండి మొదలుకుని రాత్రి వరకు సంతోషము యొక్క పర్సెంటేజ్ ఒకే విధంగా ఉంటుందా? లేక మారుతుందా? చెక్ చేసుకోవటమైతే వస్తుంది కదా, ఈ రోజుల్లో చూడండి, సైన్స్ కూడా చెకింగ్ మెషినరీని చాలా శక్తిశాలిగా తయారుచేసింది. కావున మీరు కూడా చెక్ చేసుకోండి మరియు అవినాశీగా తయారుచేసుకోండి. పిల్లలందరిదీ కూడా బాప్ దాదా వర్తమాన పురుషార్థాన్ని చెక్ చేసారు. పురుషార్థమునైతే అందరూ చేస్తున్నారు - కొందరు యథాశక్తి చేస్తున్నారు, కొందరు శక్తిశాలిగా చేస్తున్నారు. కావున ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి మానసిక స్థితిని చెక్ చేసారు ఎందుకంటే ముఖ్యమైనదే మన్మనాభవ. సేవలో కూడా చూసినట్లయితే మనసా సేవ శ్రేష్ఠమైన సేవ. మనసును జయిస్తే జగత్తును జయించినట్లు అని అంటారు కూడా, కావున మనసు యొక్క గతిని చెక్ చేసారు, అప్పుడు ఏం చూసారు? మనసుకు యజమానిగా అయ్యి మనసును నడిపిస్తారు కానీ అప్పుడప్పుడు మనసు మిమ్మల్ని కూడా నడిపిస్తుంది. మనసు పరవశముగా కూడా చేస్తుంది. బాప్ దాదా చూసారు - మనసులో ప్రేమ, తపన కలిగి ఉంటున్నారు కానీ మనసు యొక్క స్థితి ఏకాగ్రమవ్వటం లేదు.

వర్తమాన సమయములో మనసు యొక్క ఏకాగ్రత ఏకరస స్థితిని అనుభవం చేయిస్తుంది. ఇప్పుడు రిజల్టులో ఏం చూసారంటే - మనసును ఏకాగ్రము చెయ్యాలనుకుంటారు కానీ మధ్యమధ్యలో అది భ్రమిస్తుంటుంది. ఏకాగ్రతా శక్తి అవ్యక్త ఫరిశ్తా స్థితిని సహజముగా అనుభవం చేయిస్తుంది. వ్యర్థ విషయాలలోనైనా, వ్యర్థ సంకల్పాలలోనైనా, వ్యర్థ వ్యవహారములలోనైనా మనసు భ్రమిస్తూ ఉంటుంది. ఉదాహరణకు కొందరికి శరీరాన్ని ఏకాగ్రము చేసి కూర్చునే అలవాటు కూడా ఉండదు, కొందరికి ఉంటుంది. అలా మనసును ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎంత సమయము కావాలంటే అంత సమయము మరియు ఆ విధముగా అది ఏకాగ్రము అవ్వటము, దీనినే మనసు వశములో ఉండటము అని అంటారు. ఏకాగ్రతా శక్తి, యజమానత్వపు శక్తి సహజముగా నిర్విఘ్నముగా చేస్తుంది. యుద్ధము చేయవలసిన అవసరముండదు. ఏకాగ్రతా శక్తి ద్వారా స్వతహాగానే ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు అన్న అనుభూతి కలుగుతుంది. అది స్వతహాగా కలుగుతుంది, శ్రమ చేయవలసిన అవసరముండదు. ఏకాగ్రతా శక్తి ద్వారా స్వతహాగానే ఏకరస ఫరిశ్తా స్వరూపపు అనుభూతి కలుగుతుంది. బ్రహ్మాబాబాపై ప్రేమ ఉంది కదా - మరి బ్రహ్మాబాబా సమానముగా అవ్వటము అనగా ఫరిశ్తాగా అవ్వటము. ఏకాగ్రతా శక్తి ద్వారా స్వతహాగానే సర్వుల పట్ల స్నేహము, కళ్యాణము, గౌరవము యొక్క వృత్తి ఉండనే ఉంటుంది ఎందుకంటే ఏకాగ్రత అనగా స్వమానపు స్థితి. ఫరిశ్తా స్థితి స్వమానము. బ్రహ్మాబాబాను చూసారు కదా, వర్ణన కూడా చేస్తారు. సంపన్నతా సమయము సమీపముగా వచ్చే కొలది ఏం చూసారు? నడుస్తూ-తిరుగుతూ ఉన్న ఫరిశ్తా రూపము, దేహభాన రహితము. దేహము యొక్క ఫీలింగ్ వచ్చేదా? ఎదురుగా వెళ్తున్నప్పుడు కూడా దేహము కనిపించేదా లేక ఫరిశ్తా రూపము అనుభవం అయ్యేదా? కర్మలు చేస్తూ కూడా, మాట్లాడుతూ కూడా, డైరెక్షన్లు ఇస్తూ కూడా, ఉల్లాస-ఉత్సాహాలను పెంచుతూ కూడా, దేహము నుండి అతీతముగా, సూక్ష్మ ప్రకాశ రూపాన్ని అనుభూతి చేసారు. బ్రహ్మాబాబా మాట్లాడుతూ, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా అనిపించేదంటే, వీరు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ లేరు, వీరు చూస్తున్నారు కానీ దృష్టి అలౌకికముగా ఉంది, ఇది స్థూలమైన దృష్టి కాదు అని అనేవారు కదా. దేహభానము నుండి అతీతముగా ఉండాలి, ఇతరులకు కూడా దేహ భానము రాకూడదు, అతీతమైన రూపము కనిపించాలి, దీనినే దేహములో ఉంటూ ఫరిశ్తా స్వరూపము అని అంటారు. ప్రతి మాటలో, వృత్తిలో, దృష్టిలో, కర్మలో అతీతత్వము అనుభవమవ్వాలి. వీరు మాట్లాడుతున్నారు కానీ చాలా అతీతముగా, చాలా ప్రియముగా అనిపిస్తున్నారు. ఆత్మికముగా ప్రియముగా అనిపించాలి. ఇటువంటి ఫరిశ్తాతనపు అనుభూతిని స్వయము కూడా చెయ్యాలి మరియు ఇతరులకు కూడా చేయించాలి ఎందుకంటే ఫరిశ్తాగా అవ్వకుండా దేవతగా అవ్వలేరు. ఫరిశ్తా సో దేవత. మరి నంబర్ వన్ బ్రహ్మా ఆత్మ ప్రత్యక్షముగా సాకార రూపములో కూడా ఫరిశ్తా జీవితాన్ని అనుభవం చేయించారు మరియు ఫరిశ్తా స్వరూపముగా అయ్యారు. ఆ ఫరిశ్తా రూపముతోపాటే మీరందరూ కూడా ఫరిశ్తాలుగా అయ్యి పరంధామానికి వెళ్ళాలి. దీని కొరకు మనసు యొక్క ఏకాగ్రతపై అటెన్షన్ పెట్టండి. మనసును ఆజ్ఞానుసారముగా నడిపించండి. చెయ్యాలి అంటే మనసు ద్వారా కర్మ జరగాలి, చెయ్యకూడదు కానీ మనసు చెయ్యమని చెప్తే అది యజమాని స్థితి కాదు. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏమంటారంటే - అలా కోరుకోలేదు కానీ జరిగిపోయింది, అలా ఆలోచించలేదు కానీ జరిగిపోయింది, అలా చెయ్యకూడదు కానీ జరిగిపోతుంది - ఇది మనసు యొక్క వశీభూత అవస్థ. మరి అటువంటి అవస్థ మంచిగా అయితే అనిపించదు కదా! బ్రహ్మాబాబాను ఫాలో చేయండి. బ్రహ్మాబాబాను చూసారు కదా, ఎదురుగా నిలబడి ఉన్నా కానీ ఏం అనుభవమయ్యేది? ఫరిశ్తా నిలబడి ఉన్నారు, ఫరిశ్తా దృష్టి ఇస్తున్నారు. కనుక మనసు యొక్క ఏకాగ్రతా శక్తి సహజముగా ఫరిశ్తాగా చేస్తుంది. బ్రహ్మాబాబా కూడా పిల్లలకు ఇదే చెప్తున్నారు - సమానముగా అవ్వండి. శివబాబా నిరాకారీగా అవ్వండి అని చెప్తున్నారు, బ్రహ్మాబాబా ఫరిశ్తాగా అవ్వండి అని చెప్తున్నారు. మరి ఏం అర్థమైంది? రిజల్టులో ఏం చూసారు? మనసు యొక్క ఏకాగ్రత తక్కువగా ఉంది. మధ్యమధ్యలో మనసు చాలా తిరుగుతూ ఉంటుంది, భ్రమిస్తూ ఉంటుంది. ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికి వెళ్తుంది, దీనిని ఏమంటారు? భ్రమించడమనే అంటారు కదా! కనుక ఏకాగ్రతా శక్తిని పెంచుకోండి. యజమానితనపు స్థితి అనే సీట్ పై సెట్ అయ్యి ఉండండి. సెట్ అయినప్పుడు అప్సెట్ అవ్వరు (డిస్టర్బ్ అవ్వరు). సెట్ అయి లేకపోతే అప్సెట్ అవుతారు. కనుక భిన్న-భిన్న శ్రేష్ఠ స్థితులనే సీట్ పై సెట్ అయ్యి ఉండండి, దీనినే ఏకాగ్రతా శక్తి అని అంటారు. సరేనా? బ్రహ్మా బాబాపై ప్రేమ ఉంది కదా! ఎంత ప్రేమ ఉంది? ఎంత ఉంది? చాలా ప్రేమ ఉందా! మరి ప్రేమకు రిటర్నులో బాబాకు ఏమిచ్చారు? బాబాకు కూడా మీపై ప్రేమ ఉంది, అందుకే మీకు కూడా బాబాపై ప్రేమ ఉంది కదా! మరి రిటర్నులో ఏమిచ్చారు? సమానముగా అవ్వటము - ఇదే రిటర్ను ఇవ్వటము. అచ్ఛా.

డబుల్ విదేశీయులు కూడా వచ్చారు. మంచిది, డబుల్ విదేశీయుల ద్వారా కూడా మధుబన్ యొక్క అలంకరణ జరుగుతుంది. అంతర్జాతీయమవుతుంది కదా! చూడండి, మధుబన్ లో వర్గీకరణ సేవ జరుగుతుంది, దాని ద్వారా శబ్దము నలువైపులా వ్యాపిస్తుంది. ఎప్పుటినుండైతే ఈ వర్గీకరణ సేవ ప్రారంభమైందో, అప్పటినుండీ ఐ.పి. క్వాలిటీలో శబ్దము ఎక్కువగా వ్యాపించింది అన్నది మీరు చూస్తున్నారు. వి.వి.ఐ.పి.ల విషయము వదిలేయండి, వారికి తీరిక ఎక్కడుంటుంది! అంతేకాక పెద్ద-పెద్ద ప్రోగ్రాములు చేసారు, వాటి ద్వారా కూడా శబ్దము వ్యాపిస్తుంది. ఇప్పుడు ఢిల్లీ మరియు కలకత్తా వారు చేస్తున్నారు కదా! మంచి ప్లాన్లు తయారుచేస్తున్నారు. శ్రమ కూడా బాగా చేస్తున్నారు. బాప్ దాదా వద్దకు సమాచారము అందుతూ ఉంటుంది. ఢిల్లీలో చేసే శబ్దము విదేశాల వరకు చేరాలి. మీడియా వారు ఏం చేస్తారు? కేవలము భారత్ వరకు చేస్తారు. ఢిల్లీలో ఈ ప్రోగ్రామ్ జరిగింది, కలకత్తాలో ఈ ప్రోగ్రామ్ జరిగింది అని విదేశాల నుండి శబ్దము రావాలి. అక్కడి నుండి శబ్దము ఇండియాకు రావాలి. ఇండియాలోని కుంభకర్ణులైతే విదేశాల ద్వారా మేల్కోవాలి కదా! అందుకే విదేశాల నుండి వచ్చే వార్తకు మహత్వము ఉంటుంది. ప్రోగ్రామ్ భారత్ లో జరిగి, సమాచారము విదేశాల వార్తాపత్రికల ద్వారా అందాలి, అప్పుడు శబ్దము వ్యాపిస్తుంది. భారత్ లోని శబ్దము విదేశాలకు చేరుకోవాలి మరియు విదేశాల శబ్దము భారత్ కు చేరుకోవాలి, అప్పుడు దాని ప్రభావము ఉంటుంది. మంచిది. ప్రోగ్రామునేదైతే తయారుచేస్తున్నారో, దానిని మంచిగా తయారుచేస్తున్నారు. బాప్ దాదా ఢిల్లీ వారికి కూడా ప్రేమతో చేసే శ్రమకు అభినందనలు ఇస్తున్నారు. కలకత్తా వారికి కూడా ముందుగానే అభినందనలు, ఎందుకంటే సహయోగము, స్నేహము మరియు ధైర్యము, ఈ మూడు విషయాలు ఎప్పుడైతే కలుస్తాయో, అప్పుడు శబ్దము గట్టిగా వినిపిస్తుంది, శబ్దము వ్యాపిస్తుంది, ఎందుకు వ్యాపించదు! ఇప్పుడు మీడియావారు ఈ అద్భుతము చెయ్యండి. అందరూ టి.వి.లో చూసారు, ఇది టి.వి.లో వచ్చింది అని ఇంతవరకే ఉండటము కాదు. అది భారత్ లో వస్తుంది. ఇప్పుడు ఇంకా విదేశాల వరకు చేరుకోండి. ఈ సంవత్సరము శబ్దాన్ని వ్యాపింపజేయటానికి ఎంత ధైర్యముతో, ఎంత ఘనముగా జరుపుకుంటారో ఇప్పుడు చూస్తాము. డబుల్ విదేశీయులకు చాలా ఉల్లాసము ఉంది అని బాప్ దాదాకు సమాచారము అందింది. ఉంది కదా? మంచిది. ఒకరినొకరు చూసుకుంటుంటే ఇంకా ఎక్కువ ఉల్లాసము వస్తుంది. ఎవరైతే ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో వారు బ్రహ్మా సమానము. మంచిది. దాదీకి కూడా సంకల్పము వస్తుంది, దాదీకి బిజీగా ఉంచే పద్ధతి చాలా బాగా వస్తుంది. మంచిది. నిమిత్తులు కదా!

అచ్ఛా - అందరూ ఎగిరే కళ కలవారేనా? ఎగిరే కళ వేగవంతమైన కళ. నడిచే కళ, ఎక్కే కళ - ఇవి వేగము కల కళలు కావు. ఎగిరే కళ వేగముగా కూడా ఉంటుంది మరియు ఫస్ట్ లోకి తీసుకువచ్చేదిగా కూడా ఉంటుంది. అచ్ఛా -

మాతలు ఏం చేస్తారు? మాతలు తమ తోటివారిని మేలుకొలపండి. తక్కువలో తక్కువ మాతలెవ్వరూ ఫిర్యాదు చేసే విధంగా మిగిలిపోకూడదు. మాతల సంఖ్య ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది. బాప్ దాదాకు సంతోషమనిపిస్తుంది మరియు ఈ సారి గ్రూపులో అందరూ మంచి సంఖ్యలో వచ్చారు. కుమారులు కూడా మంచి సంఖ్యలో వచ్చారు. చూడండి, కుమారులు తమ తోటివారిని మేలుకొలపండి. మంచిది. స్వప్నమాత్రముగా కూడా పవిత్రతలో పరిపక్వముగా ఉన్నాము అని కుమారులు ఈ అద్భుతాన్ని చూపించాలి. బాప్ దాదా విశ్వానికి ఛాలెంజ్ చేసి చెప్పగలగాలి - వీరు బ్రహ్మాకుమారులు, యూథ్ కుమారులు, డబుల్ కుమారులు కదా. బ్రహ్మాకుమారులు కూడా మరియు శరీరము ద్వారా కూడా కుమారులు. కావున పవిత్రతకు నిర్వచనము ప్రాక్టికల్ గా ఉండాలి. మరి పవిత్రత విషయములో మిమ్మల్ని చెక్ చేయమని ఆర్డర్ ఇవ్వాలా? ఇవ్వాలా ఆర్డర్? ఇందులో చేతులు ఎత్తటం లేదు. చెక్ చెయ్యటానికి మెషిన్లు ఉంటాయి. స్వప్నమాత్రముగా కూడా అపవిత్రతకు రావటానికి ధైర్యము ఉండకూడదు. కుమారీలు కూడా ఇలా అవ్వాలి, కుమారి అనగా పూజ్య పవిత్ర కుమారి. కుమారులు మరియు కుమారీలు బాప్ దాదాకు ఈ ప్రతిజ్ఞ చెయ్యాలి - మేమందరమూ ఎంత పవిత్రముగా ఉన్నామంటే స్వప్నములో కూడా అపవిత్రతా సంకల్పము రాలేదు. అప్పుడు కుమారులు మరియు కుమారీల యొక్క పవిత్రతా ఉత్సవాన్ని జరుపుతాము. ఇప్పుడు కొద్ది-కొద్దిగా అపవిత్రత ఉంది, బాప్ దాదాకు తెలుసు. అపవిత్రతా విషయములో అవిద్యులుగా ఉండాలి ఎందుకంటే కొత్త జన్మ తీసుకున్నారు కదా. అపవిత్రత అనేది మీ గత జన్మలోని విషయము. ఇది మరజీవా జన్మ, జన్మయే బ్రహ్మా ముఖము ద్వారా లభించిన పవిత్ర జన్మ. కనుక పవిత్ర జన్మ యొక్క మర్యాద చాలా అవసరము. కుమారులు, కుమారీలు ఈ జెండాను ఎగరవేయాలి. పవిత్రముగా ఉన్నాము, పవిత్రతా సంస్కారాలను విశ్వములో వ్యాపింపజేస్తాము - ఈ నినాదము చెయ్యాలి. విన్నారా కుమారీలు. కుమారీలు ఎంతమంది ఉన్నారో చూడండి. ఇప్పుడు చూస్తాము, ఈ ధ్వనిని కుమారీలు వ్యాపింపజేస్తారా లేక కుమారులు వ్యాపింపజేస్తారా. బ్రహ్మాబాబాను ఫాలో చేయండి. అపవిత్రత యొక్క నామ-రూపాలు కూడా ఉండకూడదు, బ్రాహ్మణ జీవితము అంటే ఇదే. మాతలలో కూడా మోహము ఉంటే అది అపవిత్రత. మాతలు కూడా బ్రాహ్మణులు కదా. కనుక మాతలలోనైనా, కుమారీలలోనైనా, కుమారులలోనైనా, అధర్ కుమారులు-కుమారీలలోనైనా అపవిత్రత ఉండకూడదు. బ్రాహ్మణులు అంటేనే పవిత్ర ఆత్మలు. ఒకవేళ అపవిత్రతా కార్యము ఏదైనా జరిగితే అది మహాపాపము. ఈ పాపానికి శిక్ష చాలా కఠినముగా ఉంటుంది. ఇది నడుస్తూనే ఉంటుందిలే అని అనుకోకండి. కొద్దో-గొప్పో అయితే నడిచిపోతుందిలే అని అనుకోకండి. ఇది మొదటి సబ్జెక్ట్. నవీనతయే పవిత్రతకు సంబంధించినది. బ్రహ్మాబాబా కూడా నిందలు పడ్డారంటే, అది పవిత్రత కారణముగానే. జరిగిపోయింది అని అనుకుని తప్పించుకోలేరు. ఇందులో నిర్లక్ష్యులుగా అవ్వకండి. బ్రాహ్మణులనెవరినైనా కూడా, సరెండర్ అయినవారైనా, సేవాధారులైనా, ప్రవృత్తివారైనా కానీ, ఈ విషయములో ధర్మరాజు కూడా వదలరు, బ్రహ్మాబాబా కూడా ధర్మరాజుకు తోడు పలుకుతారు. అందుకే కుమారులు, కుమారీలు ఎక్కడ ఉన్నా సరే, మధుబన్ లో ఉన్నా, సెంటర్లలో ఉన్నా, దీని దెబ్బ, సంకల్పమాత్రపు దెబ్బ కూడా చాలా పెద్ద దెబ్బ అవుతుంది. పవిత్ర మన్ రఖో, పవిత్ర తన్ రఖో... (మనసును పవిత్రముగా ఉంచుకోండి, తనువును పవిత్రముగా ఉంచుకోండి... ) అన్న పాటను పాడుతారు కదా. మీ ఈ పాట ఉంది కదా. మరి మనసు పవిత్రముగా ఉంటే జీవితము పవిత్రముగా ఉంటుంది, ఈ విషయంలో తేలికగా ఉండకండి, కొంచమే కదా చేసాము, ఏముందిలే అని అనుకోకండి! అది కొంచెం కాదు, చాలా ఎక్కువ. బాప్ దాదా అఫిషియల్ సూచనను ఇస్తున్నారు. ఈ విషయములో రక్షింపబడలేరు. ఈ లెక్కచారాన్ని బాగా లెక్కించి తీస్తారు, అది ఎవరైనా సరే, అందుకే సావధానులుగా ఉండండి, అటెన్షన్. అందరూ శ్రద్ధగా విన్నారా. రెండు చెవులూ తెరుచుకుని వినండి. వృత్తిలో కూడా అపవిత్రత టచింగ్ ఉండకూడదు. దృష్టిలో కూడా ఆ టచింగ్ ఉండకూడదు. సంకల్పములోనే లేకపోతే ఇక వృత్తి, దృష్టిలో ఎలా ఉంటుంది! ఎందుకంటే సమయము సంపన్నతకు సమీపముగా వస్తూ ఉంది, పూర్తిగా పవిత్రముగా అవ్వాలి. మరి అందులో అపవిత్రత అనేది తెల్లగా ఉన్న కాగితముపై నల్ల మచ్చలాంటిది. అచ్ఛా - అందరూ ఎక్కడెక్కడి నుండి వచ్చినా, అన్నివైపుల నుండి వచ్చిన పిల్లలందరికీ అభినందనలు.

అచ్ఛా - మనసును ఆజ్ఞ అనుసారముగా నడిపించండి. క్షణములో ఎక్కడ కావాలంటే అక్కడ మనసు జోడించబడాలి, నిలిచిపోవాలి. ఈ ఎక్సర్సైజ్ చెయ్యండి. (డ్రిల్) అచ్ఛా - చాలా చోట్ల నుండి పిల్లలు వింటున్నారు. స్మృతి కూడా చేస్తున్నారు, వింటున్నారు కూడా. ఇది విని సంతోషిస్తున్నారు కూడా. సైన్స్ సాధనాలు వాస్తవానికి పిల్లలైన మీ కొరకు సుఖదాయకమైనవి.

నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సదా సంపన్నులైన పిల్లలకు, సదా భాగ్యశాలి మరియు సంతోషకరమైన ముఖము మరియు నడవడిక ద్వారా సంతోషమనే అంచలిని ఇచ్చే విశ్వకళ్యాణకారీ పిల్లలకు, సదా మనసుకు యజమానిగా అయ్యి ఏకాగ్రతా శక్తి ద్వారా మనసును కంట్రోల్ చేసి మనసును జయించి జగత్తును జయించే పిల్లలకు, సదా బ్రాహ్మణ జీవితము యొక్క విశేషత అయిన పవిత్రతా పర్సనాలిటీలో ఉండే పవిత్ర బ్రాహ్మణాత్మలకు, సదా డబల్ లైట్ గా అయ్యి ఫరిశ్తా జీవితములో బ్రహ్మాబాబాను ఫాలో చేసేవారికి, ఇలా బ్రహ్మాబాబా సమానమైన పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే. నలువైపులా వింటూ ఉన్న, స్మృతి చేస్తూ ఉన్న పిల్లలందరికీ చాలా, చాలా మనస్ఫూర్వకమైన ఆశీర్వాదాలతో కూడిన ప్రియస్మృతులు, అందరికీ నమస్తే.

వరదానము:-
సాకార బాబాను ఫాలో చేసి నంబర్ వన్ తీసుకునే సంపూర్ణ ఫరిశ్తా భవ

నంబర్ వన్ లోకి వచ్చేందుకు సహజ సాధనము - నంబర్ వన్ గా ఉన్న బ్రహ్మాబాబా ఎవరైతే ఉన్నారో, ఆ ఒక్కరినే చూడండి. అనేకులను చూసేందుకు బదులుగా ఒక్కరినే చూడండి మరియు ఒక్కరినే ఫాలో చేయండి. నేనే ఫరిశ్తాను అన్న మంత్రాన్ని పక్కా చేసుకున్నట్లయితే ఈ అంతరము తొలగిపోతుంది, అప్పుడు సైన్స్ యంత్రము తన పనిని ప్రారంభిస్తుంది మరియు సంపూర్ణ ఫరిశ్తాలు అయిన మీరు దేవతలుగా అయి కొత్త ప్రపంచములో అవతరిస్తారు. కావున సంపూర్ణ ఫరిశ్తాగా అవ్వడము అనగా సాకార బాబాను ఫాలో చేయడము.

స్లోగన్:-
గౌరవాన్ని త్యాగము చేయడములో సర్వులకు గౌరవనీయులుగా అయ్యే భాగ్యము ఇమిడి ఉంది.

మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ ను ఇచ్చే సేవ చెయ్యండి

ఏ విధముగా బాప్ దాదాకు దయ కలుగుతుందో, అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్ దయాహృదయులుగా అయ్యి మనసా మీ వృత్తి ద్వారా, వాయుమండలము ద్వారా ఆత్మలకు బాబా ద్వారా లభించిన శక్తులను ఇవ్వండి. కొద్ది సమయములోనే మొత్తము విశ్వ సేవను పూర్తి చెయ్యాలంటే, తత్వాల సహితముగా అందరినీ పావనముగా చెయ్యాలంటే, తీవ్రగతితో సేవ చెయ్యండి.