12-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ ఈ బ్రాహ్మణ కులము ఎంతో అసాధారణమైనది, బ్రాహ్మణులైన మీరే నాలెడ్జ్ ఫుల్, మీకు జ్ఞానము, విజ్ఞానము మరియు అజ్ఞానము గురించి తెలుసు’’

ప్రశ్న:-
ఏ సహజమైన పురుషార్థము ద్వారా పిల్లలైన మీ మనస్సు అన్ని వైపుల నుండి తొలగిపోతూ ఉంటుంది?

జవాబు:-
కేవలము ఆత్మిక వ్యాపారములో నిమగ్నమైపోండి, ఎంతెంతగా ఆత్మిక సేవ చేస్తూ ఉంటారో, అంతగా ఇతర విషయాలన్నింటి నుండి స్వతహాగా మనసు తొలగిపోతూ ఉంటుంది. రాజ్యము తీసుకునే పురుషార్థములో నిమగ్నమైపోతారు. కానీ ఆత్మిక సేవతో పాటుగా మీరు ఏ రచననైతే రచించారో, దానిని కూడా సంభాళించాలి.

పాట:-
ఎవరైతే ప్రియమైనవారితో ఉన్నారో...

ఓంశాంతి
ప్రియమైనవారు అని తండ్రిని అంటారు. ఇప్పుడు తండ్రి ఎదురుగా పిల్లలు కూర్చున్నారు. మేము ఏమీ సాధు-సన్యాసులు మొదలైనవారి ఎదురుగా కూర్చోలేదు అని పిల్లలకు తెలుసు. ఆ తండ్రి జ్ఞాన సాగరుడు, జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది. జ్ఞానము, విజ్ఞానము మరియు అజ్ఞానము అని అంటూ ఉంటారు. విజ్ఞానము అనగా దేహీ-అభిమానులుగా అవ్వడము, స్మృతి యాత్రలో ఉండడము మరియు జ్ఞానము అనగా సృష్టి చక్రాన్ని తెలుసుకోవడము. జ్ఞానము, విజ్ఞానము మరియు అజ్ఞానము, వీటి అర్థము మనుష్యులకు ఏ మాత్రమూ తెలియదు. ఇప్పుడు మీరు సంగమయుగ బ్రాహ్మణులు. మీ ఈ బ్రాహ్మణ కులము అసాధారణమైనది, దీని గురించి ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణులు సంగమములో ఉంటారు అనే ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. ప్రజాపిత బ్రహ్మా ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళారు అని కూడా తెలుసు, వారిని ఆదిదేవ్ అని అంటారు. ఆదిదేవి జగదాంబ, ఆమె ఎవరు! ఇది కూడా ప్రపంచానికి తెలియదు. తప్పకుండా ఆమె బ్రహ్మా యొక్క ముఖవంశావళియై ఉంటారు. ఆమె బ్రహ్మాకు పత్ని కాదు. ఆమెను దత్తత తీసుకుంటారు కదా. పిల్లలైన మిమ్మల్ని కూడా దత్తత తీసుకుంటారు. బ్రాహ్మణులను దేవతలు అని అనరు. ఇక్కడ బ్రహ్మా యొక్క మందిరము ఉంది, కానీ వారు కూడా ఒక మనిషే కదా. బ్రహ్మాతోపాటు సరస్వతి కూడా ఉన్నారు. అలాగే దేవీల మందిరాలు కూడా ఉన్నాయి. వారంతా ఇక్కడి మనుష్యులే కదా. మందిరము ఆ ఒక్కరిది తయారుచేసారు. ప్రజాపితకైతే ఎంతోమంది ప్రజలు ఉంటారు కదా. వారంతా ఇప్పుడు తయారవుతున్నారు. ప్రజాపిత బ్రహ్మా యొక్క కులము వృద్ధిని పొందుతూ ఉంది. వాస్తవానికి మీరు దత్తత తీసుకోబడిన పిల్లలు. ఇప్పుడు అనంతమైన తండ్రి మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. బ్రహ్మా కూడా అనంతమైన తండ్రికి సంతానమే కదా, ఇతనికి కూడా వారసత్వము వారి నుండే లభిస్తుంది. మనవలు, మనవరాళ్ళు అయిన మీకు కూడా వారసత్వము వారి నుండే లభిస్తుంది. జ్ఞానమైతే ఎవ్వరి వద్దా లేదు ఎందుకంటే జ్ఞానసాగరుడు ఒక్కరే, ఆ తండ్రి ఎప్పటివరకైతే రారో అప్పటివరకు ఎవ్వరి సద్గతి జరగదు. ఇప్పుడు మీరు సద్గతిని పొందేందుకు భక్తి నుండి జ్ఞానములోకి వచ్చారు. సత్యయుగాన్ని సద్గతి అని అంటారు. కలియుగాన్ని దుర్గతి అని అంటారు ఎందుకంటే ఇది రావణ రాజ్యము. సద్గతిని రామ రాజ్యము అని కూడా అంటారు. వారిని సూర్యవంశీయులు అని కూడా అంటారు. సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు అన్నవి యథార్థమైన పేర్లు. మనమే సూర్యవంశీ కులానికి చెందినవారిగా ఉండేవారమని, మళ్ళీ 84 జన్మలు తీసుకున్నామని పిల్లలకు తెలుసు. ఈ జ్ఞానము ఏ శాస్త్రాలలోనూ ఉండదు ఎందుకంటే శాస్త్రాలు ఉన్నదే భక్తి మార్గము కొరకు. అవన్నీ వినాశనమైపోతాయి. ఇక్కడి నుండి ఏ సంస్కారాలనైతే తీసుకువెళ్తారో, వీటి ఆధారముగా అక్కడ వాటినన్నింటినీ తయారుచేయడం మొదలుపెడతారు. మీలో కూడా రాజ్య సంస్కారాలు నిండుతాయి, మీరు రాజ్యము చేస్తారు. ఆ వైజ్ఞానికులేమో ఆ రాజ్యములోకి వచ్చి వారు నేర్చుకున్న కళలను అక్కడ ఉపయోగిస్తారు. వారు వెళ్ళడము తప్పకుండా సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాలలోకే వెళ్తారు, కానీ వారిలో ఉన్నది కేవలము సైన్స్ యొక్క జ్ఞానము మాత్రమే, వారు దానికి సంబంధించిన సంస్కారాలను తీసుకువెళ్తారు, అవి కూడా సంస్కారాలే. వారు కూడా పురుషార్థము చేస్తారు, వారి వద్ద ఆ విద్య ఉంది. మీ వద్ద వేరే విద్యా ఏదీ లేదు. మీరు తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకుంటారు. వ్యాపారాలు మొదలైనవాటిలో ఆ సంస్కారాలు ఉంటాయి కదా. అక్కడ ఎంత ఘర్షణ ఉంటుంది. కానీ ఎప్పటివరకైతే వానప్రస్థావస్థకు చేరుకోరో, అప్పటివరకు ఇళ్ళు-వాకిళ్ళను కూడా సంభాళించవలసి ఉంటుంది. లేకపోతే పిల్లలను ఎవరు సంభాళిస్తారు. వారంతా ఇక్కడికి వచ్చి కూర్చోరు కదా. ఎప్పుడైతే ఈ వ్యాపారములో పూర్తిగా నిమగ్నమవుతారో, అప్పుడు ఆ బంధనాల నుండి విముక్తులవుతారు అని అంటారు. దీనితోపాటు రచనను కూడా తప్పకుండా సంభాళించవలసి ఉంటుంది. అయితే, ఎవరైతే మంచి రీతిలో ఆత్మిక సేవలో నిమగ్నమవుతారో, వారికి వాటి నుండి మనసు తొలగిపోతుంది. ఈ ఆత్మిక సేవలో ఎంత సమయము ఇస్తే అంత మంచిది అని భావిస్తారు. తండ్రి పతితము నుండి పావనముగా అయ్యే మార్గాన్ని తెలియజేసేందుకే వచ్చారు, కావున పిల్లలు కూడా ఇదే సేవను చేయాలి. ప్రతి ఒక్కరి లెక్కాచారము చూడడము జరుగుతుంది. అనంతమైన తండ్రి అయితే కేవలము పతితము నుండి పావనముగా అయ్యేందుకు మతాన్ని ఇస్తారు, వారు పావనముగా అయ్యేందుకే మార్గము తెలియజేస్తారు. ఇకపోతే అందరినీ చూసుకోవడము, ఆ సలహాలు ఇవ్వడము, ఇదంతా ఇతని పని. శివబాబా అంటారు, నన్ను వ్యాపారము మొదలైనవాటికి సంబంధించిన విషయాలేవి అడగకూడదు. మీరు వచ్చి పతితము నుండి పావనముగా తయారుచేయండి అని మీరు నన్ను పిలిచారు, కావున నేను ఇతని ద్వారా మిమ్మల్ని పావనముగా తయారుచేస్తున్నాను. ఇతను కూడా తండ్రియే, ఇతని డైరెక్షన్లపై నడవాల్సి ఉంటుంది. ఆ తండ్రిది ఆత్మిక మతము, ఇతనిది దైహిక మతము. ఇతనిపై కూడా ఎంత బాధ్యత ఉంటుంది. ఇతను కూడా చెప్తూ ఉంటారు - నన్కొక్కరినే స్మృతి చేయండి అని బాబా ఆజ్ఞాపించారు, బాబా సలహాపై నడవండి. అయితే, పిల్లలు ఇంకేమైనా అడగాలనుకుంటే, ఉదాహరణకు ఉద్యోగములో ఎలా నడుచుకోవాలి, ఇలాంటి విషయాలను ఈ సాకార బాబా బాగా అర్థం చేయించగలుగుతారు, ఇతను అనుభవజ్ఞులు. నేను ఇలా-ఇలా చేస్తుంటాను అని ఇతను చెప్తూ ఉంటారు. ఇతడిని చూసి నేర్చుకోవాలి, ఇతను నేర్పిస్తూ ఉంటారు ఎందుకంటే ఇతను అందరికంటే ముందు ఉన్నారు. అన్ని తుఫానులు ముందు ఇతని వద్దకే వస్తాయి, అందుకే అందరికంటే శక్తివంతమైనవారు ఇతనే, అందుకే కదా ఉన్నత పదవిని కూడా పొందుతారు. మాయ శక్తివంతముగా అయి యుద్ధము చేస్తుంది. ఇతను వెంటనే సర్వస్వాన్ని వదిలేసారు, ఇతని పాత్ర ఆ విధంగా ఉంది. బాబా ఇతని ద్వారా ఇలా చేయించారు. చేసేవారు, చేయించేవారు వారు కదా. సంతోషముగా సర్వస్వాన్ని వదిలేసారు. ఇప్పుడు నేను విశ్వానికి యజమానిగా అవుతున్నాను అని సాక్షాత్కారము కలిగింది. పైసకు కూడా కొరగాని వీటిని నేనేమి చేసుకుంటాను అని భావించారు. వినాశన సాక్షాత్కారాన్ని కూడా చేయించారు. ఇక ఈ పాత ప్రపంచ వినాశనము జరగబోతోంది, నాకు మళ్ళీ రాజ్యము లభించబోతుంది అని అర్థం చేసుకున్నారు, ఇక వెంటనే సర్వస్వాన్ని వదిలేసారు. ఇప్పుడు ఇక తండ్రి మతముపై నడుచుకోవాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. డ్రామానుసారముగా భట్టీ తయారయ్యేది ఉంది. వీరంతా, ఇంతమంది ఎందుకు పరిగెత్తారు అనేది మనుష్యులు అర్థం చేసుకోరు. ఇతనేమి సాధు-సన్యాసి అయితే కాదు. ఇతను సాధారణముగా ఉంటారు. ఇతను ఎవరినీ ఎత్తుకుపోలేదు కూడా. మనుష్యమాత్రులకు మహిమ ఏమీ లేదు. మహిమ అంటూ ఉంది అంటే ఒక్క తండ్రికి మాత్రమే ఉంది, అంతే. తండ్రియే వచ్చి అందరికీ సుఖాన్ని ఇస్తారు. మీతో మాట్లాడుతారు. మీరు ఇక్కడికి ఎవరి వద్దకు వచ్చారు? మీ బుద్ధి పైకి కూడా వెళ్తుంది, అలాగే ఇక్కడ కూడా ఉంటుంది ఎందుకంటే శివబాబా ఉండేది అక్కడ అని మీకు తెలుసు. ఇప్పుడు వీరిలోకి వచ్చారు. తండ్రి నుండి మనకు స్వర్గ వారసత్వము లభించనున్నది. కలియుగము తర్వాత తప్పకుండా స్వర్గము వస్తుంది. కృష్ణుడు కూడా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుని వెళ్ళి రాజ్యము చేస్తారు, ఇందులో చరిత్ర యొక్క విషయమేమీ లేదు. రాజుకు యువరాజు జన్మిస్తాడు, స్కూల్లో చదువుకుని, పెద్దయ్యి, తర్వాత సింహాసనము అధిష్టిస్తాడు. ఇందులో మహిమ లేక చరిత్ర యొక్క విషయమేమీ లేదు. ఉన్నతోన్నతమైనవారు ఒక్క తండ్రే. మహిమ కూడా వారికే ఉంటుంది! ఇతను కూడా వారి పరిచయాన్నే ఇస్తారు. ఒకవేళ శివబాబా - నేను చెప్తున్నాను అని అంటే, మనుష్యులు ఇతనే అంటున్నారు అని భావిస్తారు. ఈ విషయాలను పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. భగవంతుడిని ఎప్పుడూ మనిషి అని అనలేము. వారు ఒక్కరే, నిరాకారుడు, పరంధామములో ఉంటారు. మీ బుద్ధి పైకి కూడా వెళ్తుంది, మళ్ళీ కిందకు కూడా వస్తుంది.

బాబా దూరదేశము నుండి పరాయి దేశములోకి వచ్చి మనల్ని చదివించి మళ్ళీ వెళ్ళిపోతారు. వారు స్వయం అంటారు - నేను క్షణములో వస్తాను, దానికి సమయము పట్టదు. ఆత్మ కూడా క్షణములో ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరములోకి వెళ్తుంది. ఆత్మను ఎవ్వరూ చూడలేరు. ఆత్మ చాలా వేగవంతమైనది. క్షణములో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు కూడా. రావణ రాజ్యాన్ని జీవన బంధన రాజ్యము అని అంటారు. బిడ్డ జన్మించగానే తండ్రి వారసత్వము లభిస్తుంది. మీరు కూడా తండ్రిని గుర్తించారు మరియు స్వర్గానికి యజమానులుగా అయ్యారు, మళ్ళీ అందులో పురుషార్థానుసారముగా నంబరువారు పదవులు ఉంటాయి. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు - ఇద్దరు తండ్రులు ఉన్నారు, ఒకరు లౌకిక తండ్రి మరియు ఇంకొకరు పారలౌకిక తండ్రి. దుఃఖములో అందరూ స్మరణ చేస్తారు, సుఖములో ఎవ్వరూ స్మరణ చేయరు... అని గానం కూడా చేస్తూ ఉంటారు. భారతవాసులైన మనకు సుఖము ఉన్నప్పుడు భగవంతుడిని స్మరణ చేసేవారము కాదు అని మీకు తెలుసు. తర్వాత మనము 84 జన్మలు తీసుకున్నాము. ఆత్మలో మాలిన్యము చేరితే దాని హోదా తగ్గిపోతుంది. 16 కళల సంపూర్ణముగా ఉంటారు, తర్వాత రెండు కళలు తగ్గిపోతాయి. తక్కువగా పాస్ అయిన కారణముగా రాముడికి బాణము చూపించారు. అంతేకానీ అతను ధనస్సునేమీ విరచలేదు. ఇది కేవలము ఒక గుర్తుగా చూపించారు. ఇవన్నీ భక్తి మార్గానికి చెందిన విషయాలు. భక్తిలో మనుష్యులు ఎంతగా భ్రమిస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది, కావున భ్రమించడము ఇక ఆగిపోతుంది.

‘‘ఓ శివబాబా’’ అని అనడమంటే అది ఆర్తనాదము చేయడము వంటిది. మీరు ‘‘ఓ శివబాబా’’ అని ఆ విధముగా పిలవకూడదు, బాబాను స్మృతి చేయాలి. మీరు అలా ఆర్తనాదాలు చేసినట్లు పిలిచారంటే భక్తి అంశము వచ్చినట్లు. ‘ఓ భగవంతుడా’ అని అనడము కూడా భక్తిలోని అలవాటే. బాబా ఏమీ ‘ఓ భగవంతుడా’ అని అంటూ స్మృతి చేయండి అని చెప్పలేదు. అంతర్ముఖులై నన్ను స్మృతి చేయండి. స్మరణ కూడా చేయకూడదు. స్మరణ అనేది కూడా భక్తి మార్గపు పదమే. మీకు తండ్రి పరిచయము లభించింది, ఇప్పుడు తండ్రి శ్రీమతముపై నడవండి. లౌకిక పిల్లలు ఏ విధంగా తమ దేహధారి తండ్రిని స్మృతి చేస్తారో, అలా మీరు ఈ తండ్రిని స్మృతి చేయండి. స్వయము కూడా దేహాభిమానములో ఉన్నారు కావున స్మృతి చేయడము కూడా దేహధారుడైన తండ్రిని స్మృతి చేస్తారు. పారలౌకిక తండ్రి అయితే ఎల్లప్పుడూ దేహీ-అభిమానిగానే ఉంటారు. బాబా ఇతనిలోకి ప్రవేశించినా సరే దేహాభిమానిగా అవ్వరు. వారు అంటారు, నేను ఈ శరీరాన్ని లోన్ గా తీసుకున్నాను, మీకు జ్ఞానాన్ని ఇచ్చేందుకు నేను ఇది లోన్ గా తీసుకుంటాను. నేను జ్ఞానసాగరుడినే, కానీ జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి. గర్భములోకి మీరు ప్రవేశిస్తారు, నేను గర్భములోకి ప్రవేశించను. నేను ఇచ్చే గతి, మతము అతీతమైనవి. తండ్రి ఇతనిలోకి వస్తారు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మా ద్వారా స్థాపన అని అంటారు కూడా, కానీ బ్రహ్మా ద్వారా ఎలా స్థాపన చేస్తారు? ఏం ప్రేరణను ఇస్తారు! తండ్రి అంటారు, నేను సాధారణ తనువులోకి వస్తాను, అతనికి బ్రహ్మా అనే పేరును పెడతాను ఎందుకంటే అతను సన్యసించారు కదా.

ఇప్పుడు బ్రాహ్మణుల మాల తయారవ్వదు అని పిల్లలైన మీకు తెలుసు, ఎందుకంటే తెగిపోతూ ఉంటారు. ఎప్పుడైతే బ్రాహ్మణులు ఫైనల్ అవుతారో అప్పుడు రుద్రమాల తయారవుతుంది, ఆ తర్వాత విష్ణుమాలలోకి వెళ్తారు. మాలలోకి వచ్చేందుకు స్మృతియాత్ర కావాలి. మనమే ప్రారంభములో సతోప్రధానముగా ఉండేవారమని, తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ‘హమ్ సో’ అనే పదానికి కూడా అర్థము ఉంది కదా. ‘ఓం’ అర్థము వేరు, ‘ఓం’ అనగా ఆత్మ. తర్వాత ఆ ఆత్మయే - నేనే దేవత, క్షత్రియ... అవుతానని చెప్తుంది. కానీ వాళ్ళు ఆత్మ అయిన మనమే పరమాత్మ అని అనేస్తారు. ‘ఓం’ మరియు ‘హమ్ సో’ అనే పదాలకు మీ అర్థము పూర్తిగా వేరు. మనము ఆత్మ, ఆత్మ మళ్ళీ వర్ణాలలోకి వస్తుంది, ఆత్మ అయిన మనమే మొదట దేవతలుగా, ఆ తర్వాత క్షత్రియులుగా అవుతాము. అంతేకానీ ఆత్మయే పరమాత్మ అని కాదు. జ్ఞానము పూర్తిగా లేని కారణముగా అర్థాన్ని తారుమారు చేసేసారు. అహం బ్రహ్మస్మి అని అంటారు, ఇది కూడా తప్పే. తండ్రి అంటారు, నేను రచనకు యజమానిగా అవ్వను. ఈ రచనకు యజమానులు మీరే. విశ్వానికి కూడా యజమానులుగా మీరే అవుతారు. బ్రహ్మము కేవలము ఒక తత్వము మాత్రమే. ఆత్మ అయిన మీరు ఈ రచనకు యజమానులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి సర్వ వేద-శాస్త్రాల యథార్థ అర్థాన్ని కూర్చుని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇక చదువుతూ ఉండాలి. తండ్రి మీకు కొత్త-కొత్త విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. భక్తి ఏమి చెప్తుంది, జ్ఞానము ఏమి చెప్తుంది. భక్తి మార్గములో మందిరాలను తయారుచేసారు, జప-తపాదులు చేసారు, ధనాన్ని వృధా చేసారు. మీ మందిరాలను ఎంతోమంది దోచుకున్నారు. ఇది కూడా డ్రామాలో ఒక పాత్ర. మళ్ళీ తప్పకుండా వారి నుండే తిరిగి లభించనున్నది. ఇప్పుడు చూడండి, వారు ఎంత ఇస్తున్నారు, రోజురోజుకు అది పెంచుతూ ఉంటారు. భారతీయులు కూడా తీసుకుంటూ ఉంటారు. వారు ఎంతైతే తీసుకుని వెళ్ళారో ఆ లెక్కంతా తిరిగి ఇచ్చేస్తారు. మీ వద్ద నుండి ఏదైతే తిన్నారో, దానిని జీర్ణించుకోలేరు. భారత్ అయితే అవినాశీ ఖండము కదా. ఇది బాబా జన్మస్థలము. ఇక్కడికే బాబా వస్తారు. బాబా యొక్క ఖండము నుండే తీసుకునివెళ్తే మళ్ళీ తిరిగి ఇచ్చేయవలసి ఉంటుంది. సమయానికి వారి నుండి ఎలా లభిస్తుందో చూడండి. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. వినాశనము ఏ సమయములో వస్తుంది అనేది వారికి తెలియదు. ప్రభుత్వము కూడా ఈ విషయాలను అంగీకరించదు. డ్రామాలో ఇది నిశ్చితమై ఉంది. అప్పులు తీసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు వారు తీసుకున్నది రిటర్న్ అవుతుంది. మన రాజధాని నుండి చాలా ధనము తీసుకువెళ్ళారని మీకు తెలుసు, అదే మళ్ళీ ఇస్తున్నారు. మీకు ఏ విషయము యొక్క చింతా లేదు. కేవలం బాబాను స్మృతి చేయాలి అనే చింత మాత్రమే ఉంటుంది. స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి. జ్ఞానము అయితే చాలా సహజము. ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థము చేస్తే అంత. శ్రీమతమైతే లభిస్తూ ఉంటుంది. అవినాశీ సర్జన్ నుండి ప్రతి విషయములోనూ సలహా తీసుకోవలసి ఉంటుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎంత సమయము లభిస్తే అంత సమయము ఈ ఆత్మిక సేవ చేయాలి. ఆత్మిక సేవ చేసే సంస్కారాన్ని అలవరచుకోవాలి. పతితులను పావనులుగా తయారుచేసే సేవ చేయాలి.

2. అంతర్ముఖులుగా అయి తండ్రిని స్మృతి చేయాలి. నోటి నుండి ‘ఓ భగవంతుడా’ అన్న పదాన్ని రానివ్వకూడదు. ఏ విధంగా తండ్రికి అహంకారము లేదో, అలా నిరహంకారులుగా అవ్వాలి.

వరదానము:-
మనసా సంకల్పాలు మరియు వృత్తి ద్వారా శ్రేష్ఠ వైబ్రేషన్ల సుగంధాన్ని వ్యాపింపజేసే శివశక్తి కంబైండ్ భవ

ఏ విధంగా ఈ రోజుల్లో స్థూల సుగంధపు సాధనాల ద్వారా గులాబి, చందనము లేక భిన్న-భిన్న రకాల సుగంధాన్ని వ్యాపింపజేస్తారో, అలా మీరు కూడా శివశక్తి కంబైండ్ స్వరూపముగా అయి మనసా సంకల్పాలు మరియు వృత్తి ద్వారా సుఖ-శాంతులు, ప్రేమ, ఆనందము యొక్క సుగంధాన్ని వ్యాపింపజేయండి. రోజూ అమృతవేళ భిన్న-భిన్న శ్రేష్ఠ వైబ్రేషన్ల ఫౌంటెన్ లా ఆత్మలపై పన్నీరు చల్లండి. కేవలం సంకల్పాల ఆటోమేటిక్ స్విచ్ ను ఆన్ చేసినట్లయితే విశ్వములో అశుద్ధ వృత్తుల దుర్గంధము ఏదైతే ఉందో అది సమాప్తమైపోతుంది.

స్లోగన్:-
సుఖదాత ద్వారా సుఖము యొక్క భాండాగారము ప్రాప్తించడమే వారి ప్రేమకు గుర్తు.

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

శక్తులకు ఎంత శక్తి ఉందో అంతగానే పాండవులకు కూడా గొప్ప శక్తి ఉంది, అందుకే చతుర్భుజుని రూపాన్ని చూపించారు. శక్తులు మరియు పాండవులు, ఈ ఇరువురి యొక్క కంబైండ్ రూపము ద్వారానే విశ్వ సేవా కార్యములో సఫలత ప్రాప్తిస్తుంది, అందుకే సదా ఒకరికొకరు సహయోగులుగా అయ్యి ఉండండి. బాధ్యతా కిరీటము ఎల్లప్పుడూ ధరించి ఉండాలి.