12-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో, ఎవరైతే నంబరువన్ పూజ్యునిగా ఉండేవారో, మళ్ళీ పూజారిగా అయ్యారో, తండ్రి వారి రథములోకే వస్తారు, ఈ రహస్యాన్ని అందరికీ స్పష్టంగా వినిపించండి’’

ప్రశ్న:-
తండ్రి తమ వారసులైన పిల్లలకు ఏ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు?

జవాబు:-
తండ్రి సుఖము, శాంతి, ప్రేమ యొక్క సాగరుడు. ఈ మొత్తం ఖజానా అంతటినీ వారు మీకు వీలునామాగా ఇస్తారు. మీకు ఎలాంటి వీలునామాను ఇస్తారంటే దానితో 21 జన్మల వరకు మీరు తింటూ ఉన్నా కానీ అది తరగదు. మిమ్మల్ని గవ్వల నుండి వజ్రము వలె తయారుచేస్తారు. మీరు తండ్రి యొక్క మొత్తం ఖజానా అంతటినీ యోగబలము ద్వారా తీసుకుంటారు. యోగము లేకుండా ఖజానా లభించదు.

ఓంశాంతి
శివ భగవానువాచ. ఇప్పుడు నిరాకారుడైన శివ భగవానుడిని అందరూ అంగీకరిస్తారు. నిరాకారుడైన శివుడు ఒక్కరే, వారినే అందరూ పూజిస్తారు. మిగిలిన దేహధారులు ఎవరైతే ఉన్నారో, వారికి సాకార రూపము ఉంది. మొట్టమొదట ఆత్మ నిరాకారిగా ఉండేది, ఆ తర్వాత సాకారిగా అయ్యింది. సాకారిగా అవుతుంది, శరీరములోకి ప్రవేశిస్తుంది, అప్పుడే తన పాత్ర నడుస్తుంది. మూలవతనములోనైతే ఎటువంటి పాత్ర లేదు. ఏ విధంగానైతే పాత్రధారులు ఇంట్లో ఉన్నప్పుడు నాటకములో పాత్ర ఉండదు. స్టేజి పైకి వచ్చినప్పుడే పాత్రను అభినయిస్తారు. ఆత్మలు కూడా ఇక్కడకు వచ్చి శరీరాల ద్వారా పాత్రను అభినయిస్తాయి. పాత్ర పైనే మొత్తమంతా ఆధారపడి ఉంది. ఆత్మలోనైతే ఎటువంటి తేడా లేదు. ఏ విధంగా పిల్లలైన మీ ఆత్మ ఉంటుందో, అలాగే వీరి ఆత్మ కూడా ఉంది. తండ్రి అయిన పరమాత్మ ఏమి చేస్తారు, వారి కర్తవ్యం ఏమిటి అన్నది తెలుసుకోవాలి. ఎవరైనా ప్రెసిడెంట్ గా అవుతారు, రాజుగా అవుతారు, ఇది ఆత్మ యొక్క కర్తవ్యం కదా. వీరు పవిత్రమైన దేవతలు, అందుకే వీరిని పూజించడం జరుగుతుంది. ఈ చదువును చదువుకొని లక్ష్మీ-నారాయణులు విశ్వానికి యజమానులుగా అయ్యారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అలా వారిని ఎవరు తయారుచేసారు? పరమాత్మ. ఆత్మలైన మీరు కూడా చదివిస్తారు. గొప్పతనం ఏమిటంటే తండ్రి వచ్చి పిల్లలైన మీకు చదివిస్తారు మరియు రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. ఇది ఎంత సహజము. దీనిని రాజయోగము అని అంటారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం సతోప్రధానంగా అవుతాము. తండ్రి అయితే సతోప్రధానమైనవారు. వారిని ఎంతగా మహిమ చేస్తారు. భక్తి మార్గంలో ఎన్ని ఫలాలు, పాలు మొదలైనవాటిని అర్పిస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. దేవతలను పూజిస్తారు, శివునిపై పాలు, పుష్పాలు మొదలైనవాటిని అర్పిస్తారు, కానీ ఏమీ తెలియదు. దేవతలు రాజ్యం చేసారు. అచ్ఛా, అటువంటప్పుడు శివునికి ఎందుకు అర్పిస్తారు? వారు ఏ కర్తవ్యము చేసారని ఇంతగా పూజిస్తున్నారు? దేవతల గురించి అయితే వారు స్వర్గానికి యజమానులు అన్న విషయం తెలుసు. వారిని ఆ విధంగా ఎవరు తయారుచేసారు అన్నది కూడా తెలియదు. శివుని పూజ కూడా చేస్తారు, కానీ వారే భగవంతుడు అన్నది తెలియదు. భగవంతుడే వీరిని ఈ విధంగా తయారుచేసారు. ఎంతటి భక్తి చేస్తారు, కానీ ఏమీ తెలియదు. మీరు కూడా శివునికి పూజ చేసి ఉంటారు, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. వారి కర్తవ్యము ఏమిటి, ఎటువంటి సుఖాన్ని ఇస్తారు అన్నది ఏమీ తెలియదు. ఈ దేవతలు ఏమైనా సుఖాన్ని ఇస్తారా? రాజు-రాణీ, ప్రజలకు సుఖాన్ని ఇస్తారు కానీ వారిని ఆ విధంగా శివబాబాయే తయారుచేసారు కదా. బలిహారమంతా వారిదే. దేవతలు కేవలం రాజ్యం చేస్తారు, ప్రజలు కూడా తయారవుతారు. ఇకపోతే వీరు ఎవరి కళ్యాణము చేయరు, ఒకవేళ చేసినా కానీ అల్పకాలికంగానే చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి కూర్చొని చదివిస్తున్నారు. వారిని కళ్యాణకారి అని అంటారు. తండ్రి తమ పరిచయాన్ని ఇస్తారు, మీరు నా లింగాన్ని పూజించేవారు, వారిని పరమ ఆత్మ అని అనేవారు. వారి పేరు పరమ ఆత్మ నుండి పరమాత్మగా అయిపోయింది. కానీ వారు ఏమి చేస్తారు అన్నది తెలియదు. కేవలం నామమాత్రంగా - వారు సర్వవ్యాపి, నామ-రూపాలకు అతీతమైనవారు అని అంటారు. అలా అంటూ మళ్ళీ వారిపై పాలు మొదలైనవి అర్పించడం శోభించదు. ఆకారం ఉంది కాబట్టే వారిపై అర్పిస్తున్నారు కదా. వారిని నిరాకారుడు అనైతే అనలేరు. మీతో మనుష్యులు ఎంతగానో వాదిస్తారు, బాబా ఎదురుగా వచ్చి కూడా వాదిస్తారు. అనవసరంగా బుర్ర పాడుచేస్తారు. దాని వలన లాభమేమీ లేదు. ఇది అర్థం చేయించడము పిల్లలైన మీ పని. పిల్లలైన మీకు తెలుసు - బాబా మనల్ని ఎంత ఉన్నతంగా తయారుచేశారు. ఇది చదువు. తండ్రి టీచర్ గా అయి చదివిస్తారు. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. దేవీ-దేవతలు సత్యయుగములో ఉంటారు, కలియుగములో ఉండరు. పవిత్రంగా ఉండడానికి అసలు ఇక్కడ రామ రాజ్యమే లేదు. దేవీ-దేవతలు ఉండేవారు, మళ్ళీ వారు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. ఇకపోతే చిత్రాలలో ఏ విధంగానైతే చూపించారో, వారు అలా ఉండరు. జగన్నాథుని మందిరములో నల్లని చిత్రాలు ఉండడాన్ని మీరు చూస్తారు. మాయను జయించేవారే జగజ్జీతులుగా అవుతారని తండ్రి అంటారు. వారేమో జగన్నాథుడు అన్న పేరును పెట్టేసారు. పైన అన్నీ అశుద్ధమైన చిత్రాలను చూపించారు, దేవతలు వామ మార్గంలోకి వెళ్ళడంతో నల్లగా అయిపోయారు. వారికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. మనం పూజ్యులుగా ఎప్పుడు ఉండేవారిమి అన్నది మనుష్యులకైతే ఏమీ తెలియదు. 84 జన్మల లెక్క ఎవరి బుద్ధిలోనూ లేదు. మొదట పూజ్యంగా, సతోప్రధానంగా ఉండేవారు, ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ తమోప్రధాన పూజారులుగా అయిపోతారు. రఘునాథుని మందిరంలో నల్లని చిత్రాన్ని చూపిస్తారు, అర్థమైతే ఏమీ తెలుసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. జ్ఞాన చితిపై కూర్చొని తెల్లగా అవుతారు, కామ చితిపై కూర్చొని మళ్ళీ నల్లగా అయిపోతారు. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళి వికారులుగా అయ్యారు, కావున వారికి దేవతలు అన్న పేరును పెట్టలేరు. వామ మార్గంలోకి వెళ్ళడంతో నల్లగా అయిపోయారు అన్నదానికి గుర్తుగా దీనిని చూపించారు. మీకు తెలుసు - శివబాబా అయితే నల్లగా అవ్వనే అవ్వరు. వారైతే వజ్రము, వారు మిమ్మల్ని కూడా వజ్రతుల్యంగా తయారుచేస్తారు. వారు ఎప్పుడూ నల్లగా అవ్వరు, మరి వారిని నల్లగా ఎందుకు చేసేసారు! తయారుచేసినవారు నల్లగా ఉండి ఉంటారు, అందుకే వారు కూర్చొని విగ్రహాన్ని కూడా నల్లగా తయారుచేసి ఉంటారు. శివబాబా అంటారు - నేను ఏ దోషము చేసానని నన్ను నల్లగా తయారుచేసారు. నేను అందరినీ తెల్లగా తయారుచేసేందుకే వస్తాను, నేను సదా తెల్లగానే ఉంటాను. మనుష్యుల బుద్ధి ఎలా అయిపోయిందంటే అసలేమీ అర్థం చేసుకోరు. శివబాబా అయితే అందరినీ వజ్రతుల్యంగా తయారుచేసేవారు. నేనైతే సదా తెల్లని బాటసారిని. నేను ఏమి చేసానని నన్ను నల్లగా తయారుచేసారు. ఇప్పుడు మీరు కూడా ఉన్నత పదవిని పొందేందుకు తెల్లగా అవ్వాలి. ఉన్నత పదవిని ఎలా పొందాలి? అదైతే తండ్రియే అర్థం చేయించారు - ఫాలో ఫాదర్. వీరు (బాబా) సర్వస్వాన్ని తండ్రికి అప్పజెప్పేసారు. బాబాను చూడండి, వారు ఏ విధంగా అంతా ఇచ్చేసారు. వారు సాధారణంగా ఉండేవారు, ఎంతో పేదవారిగానూ లేరు, అలాగే ఎంతో షావుకారుగానూ లేరు. బాబా ఇప్పుడు కూడా అంటారు - మీ ఆహార-పానీయాలు మధ్యస్థంగా, సాధారణంగా ఉండాలి. చాలా ఉన్నతంగానూ ఉండకూడదు, చాలా తక్కువగానూ ఉండకూడదు. తండ్రియే అన్ని శిక్షణలను ఇస్తారు. వీరు కూడా చూడడానికి సాధారణంగానే ఉంటారు. భగవంతుడు ఎక్కడ ఉన్నారో చూపించండి అని మిమ్మల్ని అడుగుతారు. అరే, ఆత్మ బిందువు, దానిని ఏమైనా చూడగలరా! ఆత్మ యొక్క సాక్షాత్కారం ఈ కళ్ళ ద్వారా జరుగదు అనైతే తెలుసు. భగవంతుడు చదివిస్తారు అని మీరు అంటారు, అంటే తప్పకుండా ఎవరో శరీరధారి ఉండి ఉంటారు. నిరాకారుడు ఎలా చదివిస్తారు. మనుష్యులకైతే ఏమీ తెలియదు. మీరు ఒక ఆత్మ, శరీరము ద్వారా పాత్రను అభినయిస్తారు. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. ఆత్మయే శరీరము ద్వారా మాట్లాడుతుంది, కావున ఇది ఆత్మ వాచ. కానీ ఆత్మ వాచ అన్నది శోభించదు. ఆత్మ అయితే వాణి నుండి అతీతంగా, వానప్రస్థంలో ఉంటుంది, శరీరము ద్వారానే మాట్లాడుతుంది. వాణి నుండి అతీతంగా కేవలం ఆత్మయే ఉంటుంది. వాణిలోకి రావాలంటే శరీరము తప్పకుండా కావాలి. తండ్రి కూడా జ్ఞానసాగరుడు అంటే వారు తప్పకుండా ఎవరో ఒకరి శరీరాన్ని ఆధారంగా తీసుకొని ఉంటారు కదా. వారిని రథము అని అంటారు. లేకపోతే వారు ఎలా వినిపిస్తారు? తండ్రి పతితము నుండి పావనంగా తయారుచేయడానికే శిక్షణను ఇస్తారు. ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ లేదు, ఇదైతే జ్ఞానానికి సంబంధించిన విషయము. వారు ఎలా వస్తారు? ఎవరి శరీరములోకి వస్తారు? వారు రావడమైతే తప్పకుండా మనిషి శరీరములోకే వస్తారు. ఏ మనిషిలోకి వస్తారు? ఇది మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. నేను ఏ విధంగా మరియు ఏ రథములోకి వస్తాను అని రచయిత స్వయంగా కూర్చొని తమ పరిచయాన్ని ఇస్తారు. తండ్రి రథము ఏమిటి అనేది పిల్లలకు తెలుసు. చాలామంది మనుష్యులు తికమకలో ఉన్నారు. ఏవేవో రథాలుగా చేసేస్తారు. జంతువులు మొదలైనవాటిలోకైతే వారు రాలేరు. తండ్రి అంటారు - నేను ఏ మనిషిలోకి వస్తాను అన్నది అర్థం చేసుకోలేరు. రావడం కూడా భారత్ లోకే రావలసి ఉంటుంది. భారతవాసులలో కూడా ఎవరి తనువులోకి రావాలి? ప్రెసిడెంట్ లేక సాధువులు, మహాత్ముల రథములోకి వస్తారా? అలాగని పవిత్రమైన రథములోకి రావాలి అనేమి లేదు. ఇది ఉన్నదే రావణ రాజ్యము. దూరదేశ నివాసి అన్న గాయనము కూడా ఉంది.

పిల్లలకు తెలుసు - భారత్ అవినాశీ ఖండము. ఇది ఎప్పటికీ వినాశనమవ్వదు. అవినాశీ తండ్రి, అవినాశీ భారత్ ఖండములోకే వస్తారు. ఏ తనువులోకి వస్తారు అన్నది వారు స్వయమే తెలియజేస్తారు. దీని గురించి ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. వారు ఏ సాధువు, మహాత్మలోకి కూడా రారు అన్నది మీకు తెలుసు. వారు హఠయోగులు, నివృత్తి మార్గానికి చెందినవారు. ఇక మిగిలింది భారతవాసీ భక్తులు. ఇప్పుడు భక్తులలో కూడా ఏ భక్తునిలోకి వస్తారు? పాత భక్తుడు ఎవరైతే చాలా భక్తి చేసి ఉంటారో వారు కావాలి. భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు భగవంతుడు రావలసి ఉంటుంది. భారత్ లో భక్తులైతే లెక్కలేనంతమంది ఉన్నారు. వీరు చాలా గొప్ప భక్తుడు, వీరిలోకి రావాలి అని అంటారు. అలాగైతే ఎంతోమంది భక్తులుగా అవుతారు. రేపు కూడా ఎవరికైనా వైరాగ్యము కలిగితే, వారూ భక్తులుగా అయిపోతారు. వారైతే ఈ జన్మకు భక్తులుగా అయినట్లు కదా. వారిలోకి భగవంతుడు రారు. ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో, నేను వారిలోకి వస్తాను. ద్వాపరము నుండి భక్తి ప్రారంభమయ్యింది. ఈ లెక్కలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇవి ఎంత గుప్తమైన విషయాలు. ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభిస్తారో, నేను వారిలోకి వస్తాను. ఎవరైతే నంబరువన్ పూజ్యునిగా ఉండేవారో, వారే మళ్ళీ నంబరువన్ పూజారిగా కూడా అవుతారు. ఈ రథమే మొదటి నంబరులోకి వెళ్తారని వారు స్వయంగా చెప్తారు. మళ్ళీ 84 జన్మలను కూడా వీరే తీసుకుంటారు. నేను వీరి యొక్క అనేక జన్మల అంతిమంలోని అంతిమ సమయంలో ప్రవేశిస్తాను. వీరే మళ్ళీ నంబరువన్ రాజుగా అవ్వాలి. వీరే ఎంతో భక్తిని చేసేవారు, భక్తి యొక్క ఫలం కూడా వీరికి లభించాలి. తండ్రి పిల్లలకు చూపిస్తారు - చూడండి, వీరు నాపై ఏ విధంగా బలిహారమయ్యారు. వారు సర్వస్వాన్ని ఇచ్చేసారు. ఇంత లెక్కలేనంతమంది పిల్లలకు నేర్పించడానికి ధనం కూడా కావాలి. ఈశ్వరుని యజ్ఞము రచించబడి ఉంది. ఖుదా (భగవంతుడు) వీరిలో కూర్చుని రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు, దీనిని చదువు అని కూడా అంటారు. రుద్రుడైన శివబాబా జ్ఞానసాగరుడు, వారు జ్ఞానాన్ని ఇచ్చేందుకు యజ్ఞాన్ని రచించారు. ఈ పదాలు పూర్తిగా సరైనవి. ఇది రాజస్వము, ఇది స్వరాజ్యాన్ని పొందడానికి చేసిన యజ్ఞము. దీనిని యజ్ఞము అని ఎందుకు అంటారు? యజ్ఞములోనైతే వారు ఆహుతి మొదలైనవి ఎన్నో వేస్తారు. మీరైతే చదువుకుంటారు, ఆహుతి ఏమి వేస్తారు? మేము చదువుకొని తెలివైనవారిగా అవుతామని మీకు తెలుసు. ఆ తర్వాత ఈ ప్రపంచమంతా ఇందులో స్వాహా అయిపోతుంది. యజ్ఞములో చివరి సమయంలో ఏ సామాగ్రి అయితే ఉంటుందో, దానినంతటినీ అందులో వేసేస్తారు.

మనల్ని తండ్రి చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి చాలా సాధారణమైనవారు. వారి గురించి మనుష్యులకు ఏమి తెలుసు. ఆ పెద్ద-పెద్ద వ్యక్తులకైతే చాలా గొప్ప మహిమ ఉంటుంది. తండ్రి అయితే చాలా సాధారణంగా, సింపుల్ గా కూర్చొని ఉన్నారు. ఈ విషయం మనుష్యులకు ఎలా తెలుస్తుంది. ఈ దాదా అయితే రత్నాల వ్యాపారిగా ఉండేవారు. వీరిలో ఉన్న శక్తి కనిపించదు. కానీ ఏదో శక్తి ఉందని అయితే అంటారు. అంతే. వీరిలో సర్వశక్తివంతుడైన తండ్రి ఉన్నారు అన్నది అర్థం చేసుకోరు. వీరిలో శక్తి ఉంది, ఆ శక్తి కూడా ఎక్కడి నుండి వచ్చింది? తండ్రే ప్రవేశించారు కదా. వారి ఖజానా ఏదైతే ఉందో, దానిని ఊరికే ఏమైనా ఇచ్చేస్తారా. మీరు యోగబలంతో తీసుకుంటారు. వారు సర్వశక్తివంతుడు. వారి శక్తి ఎక్కడికీ వెళ్ళిపోదు. పరమాత్మను సర్వశక్తివంతుడు అని ఎందుకు మహిమ చేస్తారు, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి అన్ని విషయాలనూ అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు - నేను ఎవరిలోకైతే ప్రవేశిస్తానో, వారిలో పూర్తిగా తుప్పు పట్టి ఉంది - పాత దేశములోకి, పాత శరీరములోకి, వారి యొక్క అనేక జన్మల అంతిమంలో నేను వస్తాను, తుప్పు ఏదైతే పట్టి ఉందో, దానిని ఎవ్వరూ తొలగించలేరు. తుప్పును తొలగించేవారు ఒక్క సద్గురువే, వారు ఎవర్ ప్యూర్ (సదా పవిత్రమైనవారు). ఇది మీరు అర్థం చేసుకుంటారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో కూర్చోబెట్టడానికి కూడా సమయం కావాలి. పిల్లలైన మీకు తండ్రి అన్నింటినీ వీలునామాగా ఇచ్చేస్తారు. తండ్రి జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు, తన సర్వస్వాన్ని పిల్లలకు వీలునామాగా ఇచ్చేస్తారు. వారు రావడం కూడా పాత ప్రపంచములోకే వస్తారు. ఎవరైతే వజ్రతుల్యముగా ఉండేవారో, తర్వాత గవ్వతుల్యముగా అయ్యారో, వారిలోకే ప్రవేశిస్తారు. వారు ఈ సమయంలో కోటీశ్వరులుగా ఉన్నా కానీ అలా అల్పకాలికముగానే ఉంటారు. అందరిదీ సమాప్తమైపోతుంది. విలువైనవారిగా మీరే అవుతారు. ఇప్పుడు మీరు కూడా విద్యార్థులే. వీరు కూడా విద్యార్థియే, వీరు కూడా అనేక జన్మల అంతిమంలో ఉన్నారు, వారికి తుప్పు పట్టి ఉంది. ఎవరైతే చాలా బాగా చదువుతారో, వారికే తుప్పు పట్టి ఉంది. వారే అందరికన్నా పతితంగా అవుతారు, వారే మళ్ళీ పావనంగా అవ్వాలి. ఈ డ్రామా తయారై ఉంది. తండ్రి అయితే సత్యమైన విషయాలను తెలియజేస్తారు. తండ్రి సత్యము. వారెప్పుడూ తప్పుగా చెప్పరు. ఈ విషయాలన్నింటినీ మనుష్యులెవరూ అర్థం చేసుకోలేరు. పిల్లలైన మీరు లేకుండా మనుష్యులకు ఇవి ఎలా తెలుస్తాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఉన్నత పదవిని పొందేందుకు పూర్తిగా ఫాలో ఫాదర్ చేయాలి. సర్వస్వాన్ని తండ్రికి అప్పగించి ట్రస్టీలుగా అయి సంభాళించాలి, పూర్తిగా బలిహారమవ్వాలి. ఆహార-పానీయాలు, ఉండడం-ధరించడము మధ్యస్థంగా, సాధారణంగా ఉంచుకోవాలి. చాలా ఉన్నతముగా లేక చాలా కనిష్టముగా ఉండకూడదు.

2. తండ్రి ఏవైతే సుఖ-శాంతులను, జ్ఞాన ఖజానాను వీలునామా చేసారో, దానిని ఇతరులకు కూడా ఇవ్వాలి, కళ్యాణకారులుగా అవ్వాలి.

వరదానము:-

పవిత్రత యొక్క లోతును తెలుసుకొని సుఖ-శాంతుల సంపన్నంగా అయ్యే మహాన్ ఆత్మా భవ

పవిత్రతా శక్తి యొక్క మహానతను తెలుసుకుని, పవిత్రముగా అనగా పూజ్య దేవాత్మలుగా ఇప్పటి నుండే అవ్వండి. అంతేకానీ అంతిమములో అయిపోతారని కాదు. చాలా సమయం నుండి జమ చేసుకున్న శక్తి అంతిమములో పని చేస్తుంది. పవిత్రముగా అవ్వటమనేది సాధారణమైన విషయమేమీ కాదు. బ్రహ్మచారిగా ఉంటారు, పవిత్రంగా అవుతారు... కానీ పవిత్రత అనేది జనని, సంకల్పము ద్వారా కానీ, వృత్తి ద్వారా కానీ, వాయుమండలము ద్వారా, వాణి ద్వారా, సంపర్కము ద్వారా సుఖ-శాంతుల జననిగా అవ్వటము - ఇటువంటివారినే మహాన్ ఆత్మలు అని అంటారు.

స్లోగన్:-

ఉన్నతమైన స్థితిలో స్థితులై సర్వాత్మలకు దయతో కూడిన దృష్టిని ఇవ్వండి, వైబ్రేషన్లను వ్యాపింపజేయండి.