12-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన తెలివైన పిల్లలూ - సదా గుర్తుంచుకోండి - నేను
ఒక అవినాశీ ఆత్మను, నేను ఇప్పుడు తండ్రితోపాటు మొదటి అంతస్థులోకి వెళ్ళాలి’’
ప్రశ్న:-
ఏ శ్రమను
పిల్లలైన మీలోని ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాలి?
జవాబు:-
బాబా మీకు
ఏదైతే ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నారో, దానిని మీ హృదయములో పెట్టుకుంటూ ఉండండి. లోలోపలే
దానిని మననము చేస్తూ జీర్ణము చేసుకోండి, తద్వారా శక్తి లభిస్తుంది. ఈ శ్రమను ప్రతి
ఒక్కరూ తప్పకుండా చేయాలి. ఎవరైతే ఇటువంటి గుప్తమైన శ్రమను చేస్తారో, వారు సదా
హర్షితముగా ఉంటారు. మమ్మల్ని చదివించేవారు ఎవరు, మేము ఎవరి ఎదురుగా కూర్చున్నాము
అన్న నషా వారికి ఉంటుంది.
ఓంశాంతి
ఇలా ఎవరు అన్నారు? ఓం శాంతి, ఓం శాంతి అని రెండు సార్లు చెప్తారు. ఒకసారి శివబాబా
చెప్పారు, ఇంకొకసారి బ్రహ్మాబాబా చెప్పారు. ఈ బాప్ దాదా కలిసి ఉన్నారు. కావున ఓం
శాంతి, ఓం శాంతి అని ఇరువురూ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ముందు ఎవరు చెప్పారు?
తర్వాత ఎవరు చెప్పారు? ముందుగా శివబాబా, ఓం శాంతి, నేను శాంతి సాగరుడను అని చెప్పారు.
తర్వాత ఎవరు చెప్పారు? దాదాజీ ఆత్మ చెప్పారు. పిల్లలకు స్మృతిని ఇప్పిస్తున్నారు -
ఓం శాంతి, నేనైతే సదా దేహీ-అభిమానిగా ఉంటాను, ఎప్పుడూ దేహాభిమానములోకి రాను. ఒక్క
తండ్రి మాత్రమే సదా దేహీ-అభిమానిగా ఉంటారు. బ్రహ్మా-విష్ణు-శంకరులు ఇలా చెప్పరు.
బ్రహ్మా-విష్ణు-శంకరులకు కూడా సూక్ష్మ రూపము ఉంటుందని మీకు తెలుసు. ఓం శాంతి అని
చెప్పేవారు ఒక్క శివబాబాయే, వారికి ఏ శరీరము లేదు. తండ్రి మీకు మంచి రీతిలో అర్థం
చేయిస్తారు మరియు తండ్రి అంటారు - నేను ఒక్కసారి మాత్రమే వస్తాను, నేను సదా
దేహీ-అభిమానిగా ఉంటాను. నేను పునర్జన్మలలోకి రాను, అందుకే నా మహిమయే అతీతమైనది.
నన్ను నిరాకార పరమపిత పరమాత్మ అని అంటారు. భక్తి మార్గములో కూడా శివుడిని, నిరాకార
పరమపిత పరమాత్మ అని అంటారు. నిరాకారునికి పూజ జరుగుతుంది. వారెప్పుడూ దేహములోకి రారు
అనగా దేహాభిమానిగా అవ్వరు. అచ్ఛా, అక్కడి నుండి కిందకు సూక్ష్మవతనానికి రండి, అక్కడ
బ్రహ్మా-విష్ణు-శంకరులు ఉంటారు. శివుని నామ-రూపాలైతే కంటికి కనిపించవు. వారి
చిత్రాలు తయారవుతాయి కానీ వారు నిరాకారుడు, వారెప్పుడూ సాకారునిగా అవ్వనే అవ్వరు.
పూజ కూడా నిరాకారుడికే జరుగుతుంది. పిల్లల బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంటుంది. భక్తి
అయితే చేసారు. చిత్రాలను పిల్లలు చూసారు. సత్య, త్రేతాయుగాలలో చిత్రాలకు భక్తి జరగదు,
అలాగే విచిత్రుడికి కూడా భక్తి జరగదు అని పిల్లలకు తెలుసు. పరమపిత పరమాత్మ
విచిత్రుడని బుద్ధిలోకి వస్తుంది. వారికి సూక్ష్మ చిత్రము లేదు, స్థూల చిత్రము లేదు.
దుఃఖహర్త-సుఖకర్త, పతిత-పావనా అని వారి మహిమను పాడుతారు. మీరు ఇంకెవరి చిత్రాన్నీ
పతిత-పావనా అని అనరు. ఈ విషయము బుద్ధిలో ఉన్నటువంటి మనుష్యులెవరూ లేరు.
బ్రహ్మా-విష్ణు-శంకరులు సూక్ష్మవతనవాసులు. మొదటి అంతస్థు, ఆ తర్వాత రెండవ అంతస్థు
ఉంటుంది. ఉన్నతోన్నతమైనది మూలవతనము, ఆ అంతస్థులో ఉండేవారు పరమపిత పరమాత్మ. సెకండు
నంబరు అంతస్థులో సూక్ష్మ శరీరధారులు ఉంటారు. మూడవ అంతస్థులో స్థూల శరీరధారులు ఉంటారు.
ఇందులో తికమకపడకూడదు. ఈ విషయాలు పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు. పైన
ఆత్మల సృష్టి ఉంది, దానిని నిరాకారీ ప్రపంచమని అంటారు, అది ఆత్మలమైన మనందరి ప్రపంచము,
నిరాకారీ ప్రపంచము. తర్వాత ఆత్మలమైన మనము సాకారీ ప్రపంచములోకి వస్తాము. అక్కడ ఆత్మలు
ఉంటాయి, ఇక్కడ జీవాత్మలు ఉంటారు. ఈ విషయము బుద్ధిలో ఉండాలి. తప్పకుండా మనము నిరాకారీ
బాబాకు పిల్లలము. మనము కూడా ముందు నిరాకార తండ్రి వద్ద ఉండేవారము. నిరాకారీ
ప్రపంచములోనే ఆత్మలు ఉంటాయి. ఆత్మలు పాత్రను అభినయించేందుకు ఇప్పటికీ సాకారములోకి
వస్తూ ఉంటాయి. అది నిరాకార తండ్రి నివసించే వతనము. నేను ఒక ఆత్మను, ఈ నషా ఉండాలి.
అవినాశీ వస్తువు యొక్క నషా ఉండాలి, వినాశీ వస్తువుల నషా ఉండకూడదు. దేహము యొక్క నషా
కలవారిని దేహాభిమానులని అంటారు. దేహాభిమానులు మంచివారా లేక ఆత్మాభిమానులు మంచివారా?
వివేకవంతులు ఎవరు? ఆత్మాభిమానులు. ఆత్మయే అవినాశీ, దేహమైతే వినాశీ. నేను 84 దేహాలు
తీసుకుంటానని ఆత్మ అంటుంది. ఆత్మలమైన మనము పరంధామములో తండ్రితో పాటు ఉండేవారము.
అక్కడ నుండి ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాము. ఓ బాబా, అని ఆత్మ అంటుంది.
సాకారీ సృష్టిలో సాకార బాబా ఉంటారు. నిరాకారీ సృష్టిలో నిరాకార బాబా ఉంటారు. ఇది
పూర్తిగా సహజమైన విషయము. ఇప్పుడు బ్రహ్మాను ప్రజాపిత బ్రహ్మా అని అంటారు. వారైతే
ఇక్కడే ఉన్నారు కదా. అక్కడ ఆత్మలమైన మనమందరము ఒక్క తండ్రి పిల్లలము, సోదరులము.
తండ్రి అయిన శివునితో పాటు ఉండేవారము. పరమాత్ముని పేరు శివ. ఆత్మ పేరు సాలిగ్రామము.
ఆత్మకు కూడా రచయిత ఉండాలి కదా. మనసులో సదా ఈ విషయాలను మాట్లాడుకుంటూ ఉండండి. ఏ
జ్ఞానమైతే లభించిందో, దానిని తమ హృదయములో పెట్టుకోవడానికి కృషి చేయాలి. ఆత్మయే
ఆలోచిస్తుంది. మొట్టమొదటైతే - ఆత్మనైన నేను తండ్రితో పాటు ఉండేవాడిని అని నిశ్చయము
చేసుకోండి. మనము వారి పిల్లలము కనుక తప్పకుండా వారసత్వము లభించాలి. ఈ ఆత్మల వృక్షము
ఏదైతే ఉందో, దానికి తప్పకుండా బీజం ముందు ఉంటుందని కూడా మీకు తెలుసు. వంశ వృక్షాన్ని
తయారుచేస్తారు కదా. తండ్రి పెద్దవారు, తర్వాత వారి నుండి 2-4 మంది పిల్లలు వస్తారు,
ఆ పిల్లల నుండి మళ్ళీ ఇంకా వస్తారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వృద్ధి చెందుతూ-చెందుతూ
వృక్షము పెద్దదవుతుంది. ఫలానా వారి నుండి ఫలానా వారు వచ్చారు... అని ఆ వంశము యొక్క
మోడల్ ఉంటుంది.
మూలవతనములో ఆత్మలన్నీ ఉంటాయని పిల్లలైన మీకు తెలుసు. ఆ చిత్రము కూడా ఉంది.
ఉన్నతోన్నతమైనవారు తండ్రి. బాబా ఈ శరీరములోకి వచ్చి ఉన్నారని పిల్లలైన మీ బుద్ధిలో
ఉంది. ఆత్మిక తండ్రి వీరిలోకి వచ్చి ఆత్మలను చదివిస్తారు. సూక్ష్మవతనములోనైతే
చదివించరు. సత్యయుగములోనైతే ఈ జ్ఞానము ఎవరికీ ఉండదు. తండ్రియే ఈ సంగమయుగములో వచ్చి
ఈ జ్ఞానాన్ని ఇస్తారు. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షము యొక్క జ్ఞానము ఎవరికీ లేదు.
కల్పము ఆయువును చాలా ఎక్కువగా వ్రాసేసారు. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు
- పిల్లలూ, ఇప్పుడిక మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అది ఆత్మల ఇల్లు. అక్కడ తండ్రి
మరియు పిల్లలు ఉంటారు, అందరూ పరస్పరం సోదరులు. ఇక్కడ శరీరాన్ని ధారణ చేసినప్పుడు,
సోదరుడు మరియు సోదరి అని అంటారు. ఆత్మలమైన మనమందరము పరస్పరం సోదరులము. సోదరులకు
తప్పకుండా తండ్రి కూడా ఉంటారు కదా. వారు పరమపిత పరమాత్మ. ఆత్మలందరూ శరీరములో ఉంటూ
వారిని స్మృతి చేస్తారు. సత్య, త్రేతాయుగాలలో ఎవరూ స్మృతి చేయరు. పతిత ప్రపంచములో
అందరూ వారిని స్మృతి చేస్తారు ఎందుకంటే అందరూ రావణుడి జైలులో ఉన్నారు. ఓ రామా, అని
సీత పిలుస్తూ ఉండేది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, రాముడంటే త్రేతాయుగపు రాముడేమీ
గుర్తు రారు. పరమపిత పరమాత్మను రామునిగా భావిస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆత్మ
పిలుస్తుంది. ఇక అర్ధకల్పము మళ్ళీ మనము ఎవరినీ పిలవమని ఇప్పుడు మీకు తెలుసు ఎందుకంటే
సుఖధామములో ఉంటాము. ఈ సమయములో తండ్రియే అర్థం చేయిస్తారు, ఇతరులెవరికీ తెలియనే
తెలియదు. ఆత్మయే పరమాత్మ అని, ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని వారంటారు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - ఆత్మ అయితే అవినాశీ. ఒక్క ఆత్మ కూడా వినాశనము చెందదు. తండ్రి
ఎలాగైతే అవినాశీగా ఉన్నారో, అదే విధముగా ఆత్మ కూడా అవినాశీగా ఉంటుంది. ఇక్కడ ఆత్మ
పతితముగా, తమోప్రధానముగా అవుతుంది. అప్పుడు తండ్రి సతోప్రధానముగా, పవిత్రముగా
తయారుచేస్తారు. మొత్తం ప్రపంచమంతా తమోప్రధానముగా అవ్వాల్సిందే, మళ్ళీ సతోప్రధానముగా
అవ్వాలి. పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేయడానికి తండ్రికి రావాల్సి ఉంటుంది.
వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. తండ్రి కూడా అవినాశీ, ఆత్మలమైన మనము కూడా అవినాశీ, ఈ
డ్రామా కూడా అవినాశీ. ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది
పిల్లలైన మీకు తెలుసు. ఈ నాలుగు యుగాలలోనూ మన పాత్ర నడుస్తుంది. సూర్యవంశీయులుగా
ఉన్న మనము తర్వాత చంద్రవంశీయులుగా అవుతాము. చంద్రవంశీయులు అనగా సెకండ్ గ్రేడ్ లోకి
వస్తారు. 14 కళలు ఉన్నవారిని సూర్యవంశీయులని అనలేము. వాస్తవానికి వారిని
దేవీ-దేవతలని కూడా అనలేరు. దేవీ-దేవతలు అని సంపూర్ణ నిర్వికారులను, 16 కళల
సంపూర్ణులను అంటారు. రాముడిని 14 కళల సంపన్నుడు అని అంటారు. మీకు మాత్రమే 84 జన్మల
లెక్క అర్థం చేయించడము జరుగుతుంది. కొత్త వస్తువు మళ్ళీ పాతదిగా అయినప్పుడు ఆ మజా
ఉండదు. ముందు సంపూర్ణముగా పవిత్రముగా ఉంటారు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత
కొద్దిగా పాతవారని అంటారు. భవనము యొక్క ఉదాహరణను కూడా ఇవ్వడము జరుగుతుంది. ప్రతి
వస్తువు అలా అవుతుంది. ఈ ప్రపంచము కూడా ఒక పెద్ద రంగస్థలము. ఈ ఆకాశ తత్వము చాలా
పెద్దది, దీనికి అంతమంటూ ఏమీ లేదు. దీని అంతం ఎక్కడ ఉంది అనేది చెప్పలేరు. ఆకాశములో
అలా వెళ్తూ ఉన్నా సరే, దానికి అంతం ఉండదు. బ్రహ్మమహాతత్వానికి కూడా అంతమేమీ ఉండదు.
సైన్సు వారు ఎక్కడ అంతమవుతుందో చూడాలని ఎంతగా ప్రయత్నిస్తారు కానీ అక్కడకు వెళ్ళలేరు,
అంతాన్ని పొందలేరు. బ్రహ్మతత్వము చాలా పెద్దది, అనంతమైనది. ఆత్మలమైన మనము చాలా
కొద్ది స్థలంలో ఉంటాము. ఇక్కడ బిల్డింగులు మొదలైనవాటిని ఎంత పెద్ద-పెద్దవిగా
నిర్మిస్తారు. భూమిపై ఉన్న స్థలం చాలా ఎక్కువ. పొలాలు మొదలైనవి కూడా కావాలి కదా.
అక్కడైతే కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి. ఆత్మ శరీరము లేకుండా ఎలా తింటుంది? అక్కడ
ఆత్మలు అభోక్తగా ఉంటాయి, అక్కడ తినేటువంటి లేక అనుభవించేటువంటి వస్తువులేమీ ఉండవు.
ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుందని, పిల్లలైన మీకు మళ్ళీ కల్పము
తర్వాత ఇవ్వడము జరుగుతుందని తండ్రి అర్థం చేయిస్తారు. కనుక ఈ నషా ఉండాలి. మనము దేవతా
ధర్మానికి చెందినవారము. మీరంటారు - బాబా, నేటికి 5 వేల సంవత్సరాల క్రితం మేము
శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యేందుకు మీ వద్దకు వచ్చాము, ఇప్పుడు మళ్ళీ మేము మీ
వద్దకు వచ్చాము. వారు నిరాకారుడైన కారణముగా, మేము దాదా వద్దకు వచ్చామని మీరంటారు.
తండ్రి వీరిలో ప్రవేశించారు. తండ్రి అంటారు - ఎలాగైతే మీరు కర్మేంద్రియాలను తీసుకుని
పాత్రను అభినయిస్తారో, అలాగే నేను కూడా కర్మేంద్రియాలను ఆధారముగా తీసుకుంటాను.
లేకపోతే నేను పాత్రను ఎలా అభినయించగలను? శివ జయంతిని కూడా జరుపుకుంటారు. శివుడైతే
నిరాకారుడు. మరి వారికి జయంతి ఎలా ఉంటుంది? మనుష్యులైతే ఒక శరీరాన్ని వదిలి మరొకటి
తీసుకుంటారు. తండ్రి అంటారు - నేను వచ్చి పిల్లలైన మీకు రాజయోగాన్ని ఎలా నేర్పించాలి.
మనుష్యుల నుండి దేవతలుగా చేయడానికి తండ్రియే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. నన్ను
మాత్రమే పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు అని అంటారు. నాకు వృక్షము యొక్క ఆదిమధ్యాంతాల
గురించి తెలుసు.
బాబా వీరిలో ప్రవేశించి మాకు జ్ఞానమంతా అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు.
బ్రహ్మా, విష్ణు, శంకరుల పాత్రలను కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి పతిత-పావనుడని మీరు
అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్కరి మహిమ వేర్వేరుగా ఉంటుంది, కర్తవ్యము వేర్వేరుగా
ఉంటుంది. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ మొదలైనవారిగా అవుతారు. ఇది నా శరీరము, నేను
ప్రైమ్ మినిస్టర్ ను అని ఆత్మ అంటుంది. ఆత్మ శరీరముతో పాటు లేకపోతే మాట్లాడలేదు.
శివబాబా కూడా నిరాకారుడే. వారికి కూడా మాట్లాడేందుకు కర్మేంద్రియాలను ఆధారముగా
తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే, నోటి నుండి గంగ వెలువడినట్లుగా చూపిస్తారు. కానీ
శివుడైతే ఒక బిందువు. వారికి నోరు ఎక్కడ నుండి వచ్చింది? కావున వీరిలోకి (బ్రహ్మాలోకి)
వచ్చి కూర్చుంటారు, వీరి నుండి జ్ఞాన గంగను ప్రవహింపజేస్తారు. అందరూ తండ్రినే స్మృతి
చేస్తారు - ఓ పతిత-పావనా రండి, మమ్మల్ని ఈ దుఃఖము నుండి విడిపించండి అని అంటారు.
వారే అత్యంత గొప్ప సర్జన్. వారిలోనే పతితులను పావనముగా చేసే జ్ఞానము ఉంది. ఈ ఒక్క
సర్జన్ మాత్రమే సర్వ పతితులను పావనముగా చేసేవారు. సత్యయుగములో అందరూ నిరోగులుగా
ఉంటారు. ఈ లక్ష్మీ-నారాయణులు సత్యయుగ యజమానులు. అలా నిరోగులుగా అయ్యేటువంటి కర్మలను
వారికి ఎవరు నేర్పించారు. తండ్రియే వచ్చి శ్రేష్ఠ కర్మలను నేర్పిస్తారు. ఇక్కడైతే
చేస్తున్న కర్మల గురించి పశ్చాత్తాపపడుతూ ఉంటారు. సత్యయుగములో తమ కర్మలు అలా
ఉన్నాయని అనుకోరు. అక్కడ ఎటువంటి దుఃఖము, రోగము ఉండదు. ఇక్కడైతే ఒకరికొకరు దుఃఖాన్నే
ఇచ్చుకుంటూ ఉంటారు. కర్మల భోగము అని అనడానికి సత్య, త్రేతాయుగాలలో దుఃఖమనే మాటే
ఉండదు. కర్మ, అకర్మ, వికర్మల అర్థాన్ని ఎవరూ అర్థమే చేసుకోలేరు. ప్రతి వస్తువు ముందు
సతోప్రధానముగా, ఆ తర్వాత సతో, రజో, తమోగా అవుతుందని మీకు తెలుసు. సత్యయుగములో 5
తత్వాలు కూడా సతోప్రధానముగా ఉంటాయి. మన శరీరము కూడా సతోప్రధాన ప్రకృతితో తయారైనదిగా
ఉంటుంది, తర్వాత ఆత్మలో 2 కళలు తగ్గడముతో శరీరము కూడా అలాగే తయారవుతుంది. సృష్టిలో
కూడా 2 కళలు తగ్గిపోతాయి. ఈ విషయాలన్నీ తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు,
ఇతరులెవరూ అర్థం చేయించలేరు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇప్పటినుండే తండ్రి శ్రీమతాన్ని అనుసరిస్తూ ఎటువంటి శ్రేష్ఠ కర్మలను చేయాలంటే,
ఇక తర్వాత ఎప్పుడూ ఆ కర్మలకు పశ్చాత్తాపపడవలసిన అవసరము రాకూడదు అనగా కర్మలకు శిక్షలు
అనుభవించాల్సిన అవసరము రాకూడదు.
2. ఏ వినాశీ వస్తువుల యొక్క నషాను పెట్టుకోకూడదు. ఈ దేహము కూడా వినాశీ అయినది,
దీని పట్ల కూడా నషా పెట్టుకోకూడదు. తెలివైనవారిగా అవ్వాలి.
వరదానము:-
ఈ పాత ప్రపంచాన్ని విదేశముగా భావిస్తూ దీని నుండి ఉపరామముగా
ఉండే స్వదేశీ భవ
ఏ విధముగా కొందరు విదేశీ వస్తువులను ఏ మాత్రము స్పర్శించను
కూడా స్పర్శించరో, తమ దేశపు వస్తువులనే ఉపయోగించాలి అని భావిస్తారో, అలా మీకు కూడా
ఈ పాత ప్రపంచమే విదేశము వంటిది, దీని నుండి ఉపరామముగా ఉండండి అనగా పాత ప్రపంచపు
వస్తువులేవైతే ఉన్నాయో, స్వభావ, సంస్కారాలేవైతే ఉన్నాయో, వాటి వైపుకు కొద్దిగా కూడా
ఆకర్షితమవ్వకూడదు. స్వదేశీయులుగా అవ్వండి అనగా ఆత్మిక రూపములో మీ ఉన్నతమైన దేశమైన
పరంధామ నివాసులుగా మరియు ఈ ఈశ్వరీయ పరివారపు లెక్కలో చూస్తే మధుబన్ దేశపు నివాసులుగా
భావిస్తూ ఆ నషాలో ఉండండి.
స్లోగన్:-
గొడవలలో
చిక్కుకునేందుకు బదులుగా సదా మిలన మేళాలో ఉండండి.
అవ్యక్త ప్రేరణలు -
సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి
హోలీహంసల విశేషత
ఏమిటంటే - సరళ చిత్తము, సరళ వాణి, సరళ వృత్తి, సరళ దృష్టి. బాప్ దాదాకు స్వచ్ఛమైన
మనసు కలవారు అందరికంటే ప్రియము, అందరికంటే సమీపము. స్వచ్ఛమైన మనసు కలవారు సదా బాప్
దాదా హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు, వారి శ్రేష్ఠ సంకల్పాలన్నీ పూర్తి అయిన
కారణముగా వృత్తిలో, దృష్టిలో, మాటలలో, సంబంధ-సంపర్కాలలో సరళముగా మరియు స్పష్టముగా,
ఒకే సమానముగా కనిపిస్తారు.