ఓంశాంతి
తండ్రి మొట్టమొదట పిల్లలతో ఏమంటారంటే - మేము తండ్రి ఎదురుగా, టీచర్ ఎదురుగా మరియు
సద్గురువు ఎదురుగా కూర్చున్నాము అన్నదైతే మర్చిపోవడం లేదు కదా. అందరూ ఈ స్మృతిలోనే
కూర్చున్నారు అనైతే బాబా అనుకోవడం లేదు, అయినా కానీ అర్థం చేయించడం బాబా బాధ్యత. ఇది
అర్థ సహితముగా స్మృతి చేయడము. మన బాబా అనంతమైన తండ్రి కూడా, టీచర్ కూడా మరియు
తప్పకుండా వారు మన సద్గురువు కూడా, వారు పిల్లలను తనతోపాటు తీసుకువెళ్తారు. తండ్రి
పిల్లల అలంకరణను చేయడానికే వచ్చారు. పవిత్రతతో అలంకరిస్తూ ఉంటారు. ధనము కూడా
అపారముగా ఇస్తారు. ఆ ధనము అనేది కొత్త ప్రపంచము కొరకే ఇస్తారు, అక్కడకు మీరు
వెళ్ళాలి. ఇది పిల్లలు గుర్తుంచుకోవాలి. పిల్లలు నిర్లక్ష్యము చేసి మర్చిపోతారు,
కావున పూర్తి సంతోషము ఏదైతే ఉండాలో అది తగ్గిపోతుంది. ఇటువంటి తండ్రి అయితే ఎప్పుడూ
లభించరు. మనం తప్పకుండా బాబాకు పిల్లలమని, వారు మనల్ని చదివిస్తారు కావున వారు
తప్పకుండా టీచరు కూడా అని మీకు తెలుసు. మన ఈ చదువు కొత్త ప్రపంచమైన అమరపురి కొరకే.
ఇప్పుడు మనం సంగమయుగములో కూర్చున్నాము. ఈ స్మృతి అయితే పిల్లలకు తప్పకుండా ఉండాలి.
ఇది పక్కాగా గుర్తు చేసుకోవాలి. ఈ సమయములో కంసపురిలో, ఆసురీ ప్రపంచములో ఉన్నామని
కూడా మీకు తెలుసు. ఒకవేళ ఎవరికైనా సాక్షాత్కారము జరిగినా, ఆ సాక్షాత్కారముతో ఎవ్వరూ
కృష్ణపురిలోకి, వారి రాజ్యములోకి వెళ్ళలేరు. ఎప్పుడైతే తండ్రి, టీచర్, గురువు
ముగ్గురినీ స్మృతి చేస్తూ ఉంటారో అప్పుడే వెళ్లగలుగుతారు. ఇలా ఆత్మలతో మాట్లాడడం
జరుగుతుంది. ఆత్మయే అంటుంది - అవును బాబా. బాబా, మీరు నిజం చెప్తున్నారు, మీరు
తండ్రి కూడా మరియు చదివించే టీచర్ కూడా. సుప్రీమ్ ఆత్మ చదివిస్తారు. లౌకిక చదువును
కూడా ఆత్మయే శరీరము ద్వారా చదివిస్తుంది కానీ అక్కడ ఆత్మ కూడా పతితముగా ఉంటుంది,
అలాగే శరీరము కూడా పతితముగా ఉంటుంది. ప్రపంచములోని మనుష్యులకు వారు నరకవాసులు అన్నది
తెలియదు.
ఇప్పుడు మనం మన వతనములోకి వెళ్ళనున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది
మీ వతనము కాదు. ఇది రావణుడి పరాయి వతనము. మీ వతనములోనైతే అపారమైన సుఖము ఉంది. ఇక్కడి
వారు - మేము పరాయి రాజ్యములో ఉన్నాము అని భావించరు. ఇంతకుముందు ముసల్మానుల రాజ్యములో
ఉండేవారు, ఆ తర్వాత క్రిస్టియన్ల రాజ్యములో ఉన్నారు. ఇప్పుడు మనం మన రాజ్యములోకి
వెళ్తామని మీకు తెలుసు. ఇంతకుముందు రావణ రాజ్యాన్నే మనం మన రాజ్యముగా భావించాము. మనం
మొదట రామ రాజ్యములో ఉండేవారము అన్నది మర్చిపోయాము. మళ్ళీ 84 జన్మల చక్రములోకి
రావడముతో రావణ రాజ్యములోకి, దుఃఖములోకి వచ్చి పడ్డాము. పరాయి రాజ్యములో అయితే దుఃఖమే
ఉంటుంది. ఈ జ్ఞానమంతా మన లోపలకి రావాలి. తండ్రి అయితే తప్పకుండా గుర్తుకువస్తారు.
కానీ ముగ్గురినీ స్మృతి చేయాలి. ఈ జ్ఞానాన్ని కూడా మనుష్యులే తీసుకోగలరు. జంతువులైతే
చదవవు. అక్కడ ఏమీ బ్యారిస్టరీ మొదలైన చదువులు ఉండవని కూడా పిల్లలైన మీకు తెలుసు.
తండ్రి ఇక్కడే మిమ్మల్ని సుసంపన్నులుగా చేస్తున్నారు, అందరూ రాజులుగా అయితే అవ్వరు.
వ్యాపారము కూడా నడుస్తూ ఉండవచ్చు కానీ అక్కడ మీకు అపారమైన ధనము ఉంటుంది. నష్టము
మొదలైనవి కలిగే నియమమే అక్కడ లేదు. దోపిడీలు మొదలైనవేవీ అక్కడ ఉండవు. దాని పేరే
స్వర్గము. ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది - మనము స్వర్గములో ఉండేవారము,
మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ కిందకు దిగుతాము. కథను కూడా తండ్రి వారికే
తెలియజేస్తారు. 84 జన్మలు తీసుకుని ఉండకపోతే మాయ ఓడించేస్తుంది. ఇది కూడా తండ్రి
అర్థం చేయిస్తూ ఉంటారు. మాయ తుఫాను ఎంత పెద్దది. మాయ అనేకులను ఓడించేందుకు
ప్రయత్నిస్తుంది. మున్ముందు మీరు ఎంతో చూస్తారు, వింటారు. తండ్రి వద్ద అందరి
చిత్రాలూ ఉంటే మీకు విచిత్రాలు చూపిస్తారు - ఫలానావారు ఇన్ని రోజులు వచ్చారు,
తండ్రికి చెందినవారిగా అయ్యారు, మళ్ళీ మాయ తినేసింది, చనిపోయారు, వెళ్ళి మాయతో
కలిసిపోయారు. ఇక్కడ ఈ సమయములో ఎవరైనా శరీరము వదిలితే మళ్ళీ ఇదే ప్రపంచములోకి వచ్చి
జన్మ తీసుకుంటారు. మీరు శరీరాన్ని వదిలితే బాబాతోపాటు అనంతమైన ఇంటిలోకి వెళ్తారు.
అక్కడ బాబా, మమ్మా, పిల్లలూ అందరూ ఉన్నారు కదా. పరివారము ఇలాగే ఉంటుంది. మూలవతనములో
తండ్రి మరియు సోదరులు ఉంటారు, ఇంకే సంబంధమూ ఉండదు. ఇక్కడ తండ్రి మరియు సోదరీ,
సోదరులు ఉంటారు, తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు. చిన్నాన్నలు, మామయ్యలు మొదలైన ఎన్నో
సంబంధాలు ఏర్పడతాయి. ఈ సంగమములో మీరు ప్రజాపిత బ్రహ్మాకు చెందినవారిగా అవుతారు
కావున మీరు సోదరీ, సోదరులు. శివబాబాను స్మృతి చేస్తారు కావున సోదరులవుతారు. ఈ
విషయాలన్నింటినీ బాగా గుర్తుంచుకోవాలి. చాలామంది పిల్లలు మర్చిపోతారు. తండ్రి అయితే
అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి కర్తవ్యము పిల్లలను తలపై ఎక్కించుకోవడము, అందుకే
నమస్తే, నమస్తే అంటూ ఉంటారు. అర్థాన్ని కూడా వివరిస్తారు. భక్తి చేసే సాధు-సన్యాసులు
మొదలైనవారెవ్వరూ మీకు జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియజేయరు, వారు ముక్తి కొరకే
పురుషార్థం చేస్తూ ఉంటారు. వారంతా నివృత్తి మార్గము వారు. వారు రాజయోగాన్ని ఎలా
నేర్పించగలరు. రాజయోగము ప్రవృత్తి మార్గానికి చెందినది. ప్రజాపిత బ్రహ్మాకు నాలుగు
భుజాలను చూపిస్తారు అంటే అది ప్రవృత్తి మార్గమైనట్లు కదా. ఇక్కడ తండ్రి వీరిని
దత్తత తీసుకున్నారు కావున వీరికి బ్రహ్మా మరియు సరస్వతి అన్న పేర్లు పెట్టారు.
డ్రామాలో ఎలా రచింపబడి ఉందో చూడండి. వానప్రస్థావస్థలోనే మనుష్యులు 60 సంవత్సరాల
తర్వాత గురువును ఆశ్రయిస్తారు. వీరిలోకి కూడా 60 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి
ప్రవేశించారు, కావున వారు తండ్రి, టీచరు, గురువుగా అయినట్లు. ఇప్పుడైతే నియమాలే
పాడైపోయాయి. చిన్నపిల్లల చేత కూడా గురువును స్వీకరింపజేస్తారు. ఇక్కడ వీరు
నిరాకారుడు. మీ ఆత్మకు వీరు తండ్రి కూడా అవుతారు, టీచర్ మరియు గురువుగా కూడా అవుతారు.
నిరాకారీ ప్రపంచాన్ని ఆత్మల ప్రపంచము అని అంటారు. అసలు ఆ ప్రపంచమే లేదు అని అయితే
అనరు కదా. దానిని శాంతిధామము అని అంటారు, అక్కడ ఆత్మలు ఉంటారు. ఒకవేళ పరమాత్మకు నామ,
రూప, దేశ, కాలాలు ఏవీ లేవు అని అన్నట్లయితే మరి పిల్లలు ఎక్కడి నుండి వస్తారు?
పిల్లలైన మీరు ఇప్పుడు ప్రపంచ చరిత్ర మరియు భౌగోళికములు ఎలా రిపీట్ అవుతాయి అనేది
అర్థం చేసుకున్నారు. చరిత్ర అనేది చైతన్యముగా ఉన్నవారిది ఉంటుంది, భౌగోళికమనేది
జడమైన వస్తువుకు సంబంధించినది. మీరు ఎంతవరకు రాజ్యం చేస్తారు అనేది మీ ఆత్మకు తెలుసు.
చరిత్ర అనేది గానం చేయబడుతుంది, దానిని కథ అని కూడా అంటారు. భౌగోళికము దేశానికి
సంబంధించినది. చైతన్యముగా ఉన్నవారు రాజ్యం చేసారు, జడమైన వస్తువులైతే రాజ్యం చేయవు.
ఫలానావారి రాజ్యం ఎంతకాలం నుండి ఉంది, క్రిస్టియన్లు భారత్ పై ఎప్పటినుండి
ఎప్పటివరకు రాజ్యం చేసారు అన్నది చెప్తారు. ఈ ప్రపంచము యొక్క చరిత్ర మరియు
భౌగోళికములను గురించి ఎవ్వరికీ తెలియదు. సత్యయుగము గడిచి లక్షల సంవత్సరాలు అయ్యింది
అని అంటారు. అందులో ఎవరు రాజ్యం చేసి వెళ్ళారు, ఎంత సమయం రాజ్యం చేసారు - ఇది
ఎవ్వరికీ తెలియదు. దీనిని చరిత్ర అని అంటారు. ఆత్మ చైతన్యమైనది, శరీరము జడమైనది. ఈ
మొత్తం ఆట అంతా జడము మరియు చైతన్యముల ఆట. మానవ జీవితమే ఉత్తమమైనదిగా గానం
చేయబడుతుంది. జనాభా లెక్క కూడా మనుష్యులదే లెక్కింపబడుతుంది. జంతువుల లెక్కనైతే
ఎవ్వరూ లెక్కించలేరు కూడా. మొత్తం ఆట అంతా మీపైనే ఉంది. చరిత్ర మరియు భౌగోళికములను
కూడా మీరే వింటారు. తండ్రి ఇతనిలోకి వచ్చి మీకు అన్ని విషయాలను అర్థం చేయిస్తారు,
దీనిని అనంతమైన చరిత్ర, భౌగోళికము అని అంటారు. ఈ జ్ఞానము లేని కారణముగా మీరు ఎంత
బుద్ధిహీనులుగా అయిపోయారు. మనుష్యులై ఉండి కూడా ప్రపంచ చరిత్ర, భౌగోళికముల గురించి
తెలియకపోతే ఇక ఆ మనుష్యులు ఎందుకు పనికొస్తారు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు ప్రపంచ
చరిత్ర, భౌగోళికములను వింటున్నారు. ఈ చదువు ఎంత మంచిది, దీనిని ఎవరు చదివిస్తారు?
తండ్రి. తండ్రే ఉన్నతోన్నతమైన పదవిని ఇప్పించేవారు. ఈ లక్ష్మీ-నారాయణులది మరియు
వీరితోపాటు ఎవరైతే స్వర్గములో ఉంటారో వారిది ఉన్నతోన్నతమైన పదవి కదా. అక్కడ
బ్యారిస్టరీ మొదలైన వృత్తులనైతే చేపట్టరు. అక్కడైతే కేవలం నేర్చుకోవడం ఉంటుంది. కళ
నేర్చుకోకపోతే ఇళ్ళు మొదలైనవి ఎలా తయారవుతాయి. ఒకరికొకరు కళను నేర్పించుకుంటూ ఉంటారు
లేకపోతే ఇన్ని ఇళ్ళు మొదలైనవాటిని ఎవరు నిర్మిస్తారు. అవి వాటంతటవే అయితే తయారవ్వవు
కదా. ఈ రహస్యాలన్నీ ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కూడా నంబరువారు
పురుషార్థానుసారముగా ఉంటాయి. ఈ చక్రము తిరుగుతూ ఉంటుందని, ఇంతకాలం మనం రాజ్యం
చేసేవారమని, మళ్ళీ రావణ రాజ్యములోకి వస్తామని మీకు తెలుసు. ప్రపంచానికి తాము రావణ
రాజ్యములో ఉన్నారు అన్న విషయాల గురించి తెలియదు. బాబా, మమ్మల్ని రావణ రాజ్యము నుండి
విముక్తులను చేయండి అని అంటారు. భారతవాసులు క్రిస్టియన్ రాజ్యము నుండి స్వయాన్ని
విముక్తులుగా చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఓ గాడ్ ఫాదర్ - మమ్మల్ని విముక్తులుగా
చేయండి అని అంటారు. స్మృతి కలుగుతుంది కదా. ఇలా ఎందుకు అంటారు అనేది ఎవరికీ తెలియదు.
మొత్తం సృష్టిపైన అంతా రావణ రాజ్యము ఉన్నదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. రామ
రాజ్యము కావాలి అని అందరూ అంటారు, మరి విముక్తులుగా ఎవరు చేస్తారు? గాడ్ ఫాదర్
విముక్తులుగా చేసి గైడ్ గా అయి తీసుకువెళ్తారని భావిస్తారు. భారతవాసులకు అంతటి
తెలివి లేదు, వారైతే పూర్తిగా తమోప్రధానముగా ఉన్నారు. ఇతరులు ఇంతటి దుఃఖమునూ పొందరు,
అలాగే ఇంతటి సుఖమునూ పొందరు. భారతవాసులే అందరికన్నా సుఖవంతులుగా అవుతారు, అలాగే
దుఃఖితులుగా కూడా అయ్యారు. లెక్క ఉంది కదా. ఇప్పుడు ఎంతటి దుఃఖము ఉంది! ధార్మిక
మనస్కులు ఎవరైతే ఉంటారో వారు - ఓ గాడ్ ఫాదర్, ముక్తిప్రదాత అని తలచుకుంటారు. బాబా,
మీరు వచ్చి మా దుఃఖాలను హరించండి మరియు సుఖధామములోకి తీసుకువెళ్ళండి అని మీ హృదయములో
కూడా ఉంది. వారైతే శాంతిధామానికి తీసుకువెళ్ళమంటారు, మీరేమో శాంతిధామానికి మరియు
సుఖధామానికి తీసుకువెళ్ళమంటారు. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున చాలా సంతోషముండాలి.
భక్తి మార్గములో కర్ణరసం ఎంతగా ఉంది. అందులో యథార్థమైన విషయమేదీ లేదు. పూర్తిగా
పిండిలో ఉప్పు ఉన్నంత ఉంది. చండికా దేవి మేళా కూడా జరుగుతుంది. ఇప్పుడు చండికలకు
మేళా ఎందుకు జరుగుతుంది? చండి అని ఎవరిని అంటారు? బాబా చెప్పారు, చండాలుని జన్మను
కూడా ఇక్కడివారే తీసుకుంటారు. ఇక్కడ ఉండి, తిని, తాగి, ఎంతోకొంత ఇచ్చి మళ్ళీ - మేము
ఏదైతే ఇచ్చామో దానిని మాకు తిరిగి ఇచ్చేయండి, మేము దీనిని నమ్మము అని అంటారు. సంశయం
ఏర్పడితే వారు వెళ్ళి ఏమవుతారు. ఇటువంటి చండికలకు కూడా మేళా జరుగుతుంది. ఎంతైనా
సత్యయుగానికి చెందినవారిగా అయితే అవుతారు కదా. కొంత సమయం సహాయకులుగా అయినా
స్వర్గములోకి వచ్చేస్తారు. ఆ భక్తులకైతే అది తెలియదు, జ్ఞానమైతే ఎవరి వద్దా లేదు. ఆ
చిత్రాలతో కూడిన గీత ఉంది, దానితో ఎంత ధనాన్ని సంపాదిస్తారు. ఈ రోజుల్లో చిత్రాల
వైపుకు అందరూ ఆకర్షితులవుతారు. దానిని కళగా భావిస్తారు. దేవతల చిత్రాలు ఎలా ఉంటాయి
అనేది మనుష్యులకేమి తెలుసు. నిజానికి మీరు ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉండేవారు, తర్వాత ఎలా
తయారయ్యారు. అక్కడ అంధులు, చెవిటివారు మొదలైనవారెవ్వరూ ఉండరు. దేవతలకు సహజసిద్ధమైన
శోభ ఉంటుంది. అక్కడ ప్రకృతిసిద్ధమైన సౌందర్యము ఉంటుంది. తండ్రి కూడా అన్నీ అర్థం
చేయించి ఏం చెప్తారంటే - పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి. తండ్రి తండ్రి కూడా
అవుతారు, టీచర్, సద్గురువు కూడా అవుతారు. మూడు రూపాలలోనూ స్మృతి చేసినట్లయితే మూడు
వారసత్వాలూ లభిస్తాయి. చివరిలోనివారు మూడు రూపాలలోనూ స్మృతి చేయలేరు, ఇక ముక్తిలోకి
వెళ్ళిపోతారు.
బాబా అర్థం చేయించారు - సూక్ష్మవతనము మొదలైనవాటిలో మీరు ఏవైతే చూస్తారో, అవన్నీ
సాక్షాత్కారాల విషయాలే. ఇకపోతే చరిత్ర, భౌగోళికాలైతే అన్నీ ఇక్కడివే. దీని ఆయువు
గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు, మీరు
మళ్ళీ ఎవరికైనా అర్థం చేయించవచ్చు. మొట్టమొదట అయితే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆ
అనంతమైన తండ్రి సుప్రీమ్. లౌకిక తండ్రిని పరమాత్మ లేక సుప్రీమ్ ఆత్మ అని ఎప్పుడూ
అనరు. సుప్రీమ్ అయితే ఒక్కరే, వారినే భగవంతుడు అని అంటారు. వారు నాలెడ్జ్ ఫుల్
కావున మీకు జ్ఞానాన్ని నేర్పిస్తారు. ఈ ఈశ్వరీయ జ్ఞానము సంపాదనకు ఆధారము. జ్ఞానము
కూడా ఉత్తమముగా, మధ్యమముగా, కనిష్టముగా ఉంటుంది కదా. తండ్రి ఉన్నతోన్నతమైనవారు
కావున చదువు కూడా ఉన్నతోన్నతమైనది, పదవి కూడా ఉన్నతమైనది. చరిత్ర మరియు
భౌగోళికములనైతే వెంటనే తెలుసుకుంటారు. ఇకపోతే స్మృతియాత్రలోనే యుద్ధం జరుగుతుంది.
ఇందులో మీరు ఓడిపోతే ఇక జ్ఞానములో కూడా మీరు ఓడిపోతారు. ఓడిపోయి పారిపోతే జ్ఞానము
నుండి కూడా పారిపోతారు. దాని వల్ల ఇక ఎలా ఉన్నవారు మళ్ళీ అలానే అయిపోతారు, ఇంకా దాని
కన్నా దిగజారిపోతారు. తండ్రి ఎదురుగా నడవడిక ద్వారా దేహాభిమానము ఉంది అని వెంటనే
తెలిసిపోతుంది. బ్రాహ్మణుల మాల కూడా ఉంది కానీ కొందరికి తాము ఏ విధంగా నంబరువారుగా
కూర్చోవాలి అన్నది కూడా తెలియదు. దేహాభిమానము ఉంది కదా. నిశ్చయం కలవారికి తప్పకుండా
అపారమైన సంతోషము ఉంటుంది. నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి యువరాజుగా అవుతాను అని
ఎవరికి నిశ్చయము ఉంది? (అందరూ చేతులు ఎత్తారు) పిల్లలకు అంతటి సంతోషము ఉంటుంది. మీకు
నిశ్చయమున్నట్లయితే మరి మీ అందరిలోనూ పూర్తి దైవీ గుణాలు ఉండాలి. నిశ్చయబుద్ధి అనగా
విజయమాలలో కూర్చబడేవారు అనగా యువరాజులుగా అయ్యేవారు. ఒక రోజు తప్పకుండా వస్తుంది, ఆ
రోజు విదేశీయులు అన్నింటికన్నా ఎక్కువగా ఆబూలోకి వస్తూ మిగిలిన అన్ని తీర్థయాత్రలు
మొదలైనవాటిని వదిలేస్తారు. వారు భారత్ యొక్క రాజయోగాన్ని నేర్చుకోవాలని కోరుకుంటారు.
ప్యారడైజ్ ను స్థాపించింది ఎవరు? పురుషార్థం చేయడం జరుగుతుంది, ఒకవేళ కల్పక్రితము
ఇది జరిగి ఉన్నట్లయితే తప్పకుండా మ్యూజియం తయారవుతుంది. ఇటువంటి ప్రదర్శనీని మేము
సదాకాలికముగా పెట్టాలనుకుంటున్నాము అని అర్థం చేయించాలి. 4-5 సంవత్సరాల కొరకు లీజ్
కైనా ఇల్లు తీసుకుని దీనిని పెట్టవచ్చు. మనం సుఖధామాన్ని తయారుచేయడానికి భారత్
యొక్క సేవే చేస్తాము. ఇందులో అనేకుల కళ్యాణము జరుగుతుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.