13-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి శ్రీమతానికి గౌరవము ఇవ్వడమంటే ఎప్పుడూ కూడా మురళిని మిస్ చేయకపోవడము, ప్రతి ఆజ్ఞను పాలన చేయడము’’

ప్రశ్న:-
పిల్లలైన మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా - మీరు సంతుష్టముగా, సంతోషముగా ఉన్నారా అని అడిగితే మీరు నషాతో ఏమని జవాబు ఇవ్వాలి?

జవాబు:-
మీరు ఈ విధముగా చెప్పండి - పరబ్రహ్మములో నివసించే వారి గురించి చింత ఉండేది, వారు లభించేసారు, ఇంకేమి కావాలి, పొందాల్సినది పొందేశాము... ఈశ్వరీయ పిల్లలైన మీకు ఏ విషయము గురించి చింత లేదు. మిమ్మల్ని తండ్రి తమవారిగా చేసుకున్నారు, మీపై కిరీటము పెట్టారు, మరిక ఏ విషయము గురించి చింతించాలి.

ఓంశాంతి
తండ్రి అర్థం చేయిస్తున్నారు, బాబా - తండ్రి కూడా, టీచర్ కూడా, సుప్రీమ్ గురువు కూడా అని పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది, పిల్లలు ఈ స్మృతిలోనే తప్పకుండా ఉంటారు. ఈ స్మృతిని ఎప్పుడూ ఎవ్వరూ నేర్పించలేరు కూడా. తండ్రియే కల్ప-కల్పము వచ్చి నేర్పిస్తారు. వారే జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు కూడా. వారు తండ్రి కూడా, టీచర్ కూడా, గురువు కూడా. ఎప్పుడైతే జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించిందో, అప్పుడు ఇది అర్థం చేసుకోవడము జరుగుతుంది. పిల్లలు అర్థం చేసుకునే ఉండవచ్చు కానీ తండ్రినే మర్చిపోతే ఇక టీచర్ మరియు గురువు ఎలా గుర్తుకువస్తారు. మాయ చాలా శక్తివంతమైనది, మూడు రూపాలలోనూ వారి మహిమ ఉన్నా కూడా ముగ్గురినీ మరపింపజేస్తుంది, అది అంతటి సర్వశక్తివంతమైనది. బాబా, మేము మర్చిపోతున్నామని పిల్లలు కూడా వ్రాస్తారు. మాయ అంతటి శక్తివంతమైనది. డ్రామానుసారముగా ఇది చాలా సహజము. ఈ విధముగా ఎప్పుడూ, ఎవ్వరూ ఉండరని పిల్లలకు అర్థం చేసుకుంటారు. వారే తండ్రి, టీచర్, సద్గురువు - ఇది పూర్తిగా సత్యము, ఇందులో వ్యర్థ ప్రలాపాలు మొదలైన విషయాలేవీ లేవు. దీనిని లోలోపల అర్థం చేసుకోవాలి కదా! కానీ మాయ మరపింపజేస్తుంది. మేము ఓడిపోతున్నాము అని అంటారు, మరి అలా అయితే అడుగడుగులోనూ పదమాలు ఎలా ఉంటాయి! దేవతలకే పద్మము గుర్తును చూపిస్తారు. ఇది అందరికీ చూపించలేరు. ఇది ఈశ్వరుని చదువు, మనుష్యులది కాదు. ఈ చదువు ఎప్పుడూ మనుష్యులది అవ్వలేదు. దేవతలను మహిమ చేయడము జరుగుతుంది కానీ ఎంతైనా ఉన్నతోన్నతమైనవారు ఒక్క తండ్రియే. ఇకపోతే వారి గొప్పతనము ఏముంది, నేడు గాడిద చాకిరి, రేపు రాజరికము. ఇప్పుడు మీరు ఈ విధముగా (లక్ష్మీ-నారాయణులుగా) అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఈ పురుషార్థములో చాలామంది ఫెయిల్ అవుతారని మీకు తెలుసు. ఎంతమందైతే కల్పక్రితము పాస్ అయ్యారో, అంతమందే చదువుకుంటారు. వాస్తవానికి జ్ఞానము చాలా సహజమైనది కానీ మాయ మరపింపజేస్తుంది. మీ చార్టు వ్రాయండి అని తండ్రి అంటారు కానీ వ్రాయలేకపోతారు. ఎంతవరకని కూర్చుని వ్రాస్తారు. ఒకవేళ ఎవరైనా వ్రాసినా కూడా - రెండు గంటలు స్మృతిలో ఉన్నామా అని చెక్ చేసుకుంటారు. అప్పుడు కూడా అది ఎవరికి అర్థమవుతుందంటే, ఎవరైతే తండ్రి శ్రీమతాన్ని అమలులోకి తీసుకొస్తారో, వారికి. పాపం వీరికి సిగ్గు కలుగుతుందేమో అని తండ్రి అయితే అర్థం చేసుకుంటారు. వాస్తవానికి శ్రీమతాన్ని అమలులోకి తీసుకురావాలి. కానీ కష్టము మీద రెండు శాతం మంది చార్టు వ్రాస్తారు. పిల్లలకు శ్రీమతము పట్ల అంతటి గౌరవము లేదు. మురళి లభిస్తున్నా కూడా చదవడము లేదు. బాబా చెప్తున్నది నిజమే, మేము మురళీయే చదవకపోతే ఇక ఇతరులకు ఏం అర్థం చేయిస్తాము అని వారి మనసుకు తప్పకుండా అనిపిస్తుంది.

(స్మృతియాత్ర) ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. తప్పకుండా మేము ఆత్మలము, మమ్మల్ని పరమపిత పరమాత్మ చదివిస్తున్నారు అని పిల్లలు ఇదైతే అర్థం చేసుకుంటారు. వారు ఇంకా ఏమంటారు? నన్ను స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇందులో తండ్రి కూడా వచ్చేసారు, చదువు మరియు చదివించేవారు కూడా వచ్చేసారు, సద్గతిదాత కూడా వచ్చేసారు. కొన్ని పదాలలోనే మొత్తము జ్ఞానమంతా వచ్చేస్తుంది. ఇక్కడకు మీరు దీనిని రివైజ్ చేసుకునేందుకని వస్తారు. తండ్రి కూడా ఇదే అర్థం చేయిస్తారు ఎందుకంటే మేము మర్చిపోతున్నామని మీరు స్వయమే అంటారు, అందుకే రివైజ్ చేసుకునేందుకు ఇక్కడికి వస్తారు. కొంతమంది ఇక్కడ ఉంటున్నా కూడా వారికి రివిజన్ జరగదు. వారి భాగ్యములో లేదు. పురుషార్థమునైతే తండ్రి చేయిస్తారు. పురుషార్థము చేయించేవారు ఒక్క తండ్రియే. ఇక్కడ ఎవ్వరికీ విశేష పాలన కూడా జరగదు. అలాగే విడిగా స్పెషల్ గా చదివించేది కూడా ఏమీ లేదు. ఆ చదువులో స్పెషల్ గా చదువుకునేందుకని టీచర్ ను పిలుస్తారు. వీరైతే భాగ్యాన్ని తయారుచేయడానికి అందరినీ చదివిస్తారు. ఒక్కొక్కరినీ విడిగా ఎంతవరకని చదివిస్తారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఆ చదువులో ఎవరైనా పెద్ద వ్యక్తుల పిల్లలుంటే వారిని స్పెషల్ గా చదివిస్తారు. ఫలానావారు డల్ గా ఉన్నారని అక్కడ టీచరుకు తెలుస్తుంది, అందుకే వారిని స్కాలర్షిప్ కు యోగ్యునిగా తయారుచేస్తారు. ఈ తండ్రి అలా చెయ్యరు. వీరైతే అందరినీ ఏకరసముగా చదివిస్తారు. అది టీచర్ ఎక్స్ ట్రా పురుషార్థము చేయించినట్లు అయ్యింది. ఇక్కడ వీరు ఎవ్వరికీ వేరుగా ఎక్స్ ట్రా పురుషార్థము చేయించరు. ఎక్స్ ట్రా పురుషార్థమంటేనే మాస్టార్ కొంత కృప చూపిస్తున్నట్లు. అయితే వారు డబ్బు తీసుకుంటారు, ప్రత్యేకముగా సమయము కేటాయించి చదివిస్తారు, దానితో వారు బాగా చదువుకుని తెలివైనవారిగా అవుతారు. ఇక్కడైతే ఎక్కువగా చదివే విషయమేమీ లేదు. ఇక్కడ వీరి విషయమే కొత్తది. ఒకే మహామంత్రాన్ని ఇస్తారు - ‘‘మన్మనాభవ’’. స్మృతి ద్వారా ఏమి జరుగుతుంది అనేదైతే మీరు అర్థం చేసుకుంటారు. తండ్రియే పతిత-పావనుడు. వారిని స్మృతి చేయడము ద్వారానే పావనముగా అవుతారని మీకు తెలుసు.

ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము ఉంది, ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పావనముగా అవుతారు. తక్కువగా స్మృతి చేస్తే తక్కువగా పావనముగా అవుతారు. ఇది పిల్లలైన మీ పురుషార్థముపై ఆధారపడి ఉంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయడము ద్వారా మనము ఈ (లక్ష్మీ-నారాయణులుగా) తయారవ్వాలి. వారి మహిమ గురించైతే ప్రతి ఒక్కరికీ తెలుసు. మీరు పుణ్యాత్ములు, మేము పాపాత్ములము అని అంటారు కూడా. అనేక మందిరాలు తయారై ఉన్నాయి. అక్కడికి అందరూ ఏం చేయడానికి వెళ్తారు? దర్శనముతో లాభమైతే ఏమీ లేదు. ఇతరులు వెళ్ళడము చూసి వెళ్ళిపోతారు. కేవలం దర్శనము చేసుకోవడానికి వెళ్తారు. ఫలానావారు యాత్రకు వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలి అని అనుకుంటారు. దాని వలన ఏమి జరుగుతుంది? ఏమీ జరగదు. పిల్లలైన మీరు కూడా యాత్రలు చేసారు. ఎలాగైతే వేరే పండుగలు జరుపుకుంటారో, అలాగే యాత్రను కూడా ఒక పండుగగా భావిస్తారు. ఇప్పుడు మీరు స్మృతియాత్రను కూడా ఒక పండుగగా భావిస్తారు. మీరు స్మృతియాత్రలో ఉంటారు. ఒకటే పదము ఉంది - మన్మనాభవ. మీ ఈ యాత్ర అనాది అయినది. ఈ యాత్రలను మేము అనాదిగా చేస్తూ వచ్చామని వారు కూడా అంటారు కానీ మీరు ఇప్పుడు జ్ఞాన సహితముగా చెప్తారు - మేము కల్ప-కల్పము ఈ యాత్రను చేస్తాము అని. తండ్రియే వచ్చి ఈ యాత్రను నేర్పిస్తారు. వారు నాలుగు ధామాల యాత్రను జన్మ-జన్మలుగా చేస్తూ వచ్చారు. ఇక్కడ అనంతమైన తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అయిపోతారు. యాత్ర ద్వారా మీరు పావనముగా అవుతారని ఈ విధముగా ఎప్పుడూ ఇంకెవ్వరూ చెప్పరు. మనుష్యులు యాత్రలకు వెళ్ళినప్పుడు వారు ఆ సమయములో పావనముగా ఉంటారు. ఈ రోజుల్లోనైతే అక్కడ కూడా అశుద్ధత ఉంటుంది, పావనముగా ఉండటము లేదు. ఈ ఆత్మిక యాత్ర గురించైతే ఎవ్వరికీ తెలియదు. మీకు ఇప్పుడు తండ్రి తెలియజేసారు - ఈ స్మృతియాత్ర సత్యమైనది అని. ఆ యాత్రల్లో తిరుగుదామని వెళ్తారు కానీ మళ్ళీ ఎలా ఉన్నవారు అలాగే అయిపోతారు. అలా తిరుగుతూనే ఉంటారు. ఎలాగైతే వాస్కోడిగామా సృష్టిని చుట్టి వచ్చారో, అలా వారు కూడా తిరిగి వస్తుంటారు కదా. నలువైపులా ప్రదక్షిణ చేసాము, అయినా కూడా ప్రతి క్షణము దూరముగానే ఉన్నాము అని పాట కూడా ఉంది కదా. భక్తి మార్గములోనైతే ఎవ్వరూ వారితో కలిపించలేరు. భగవంతుడు ఎవ్వరికీ లభించలేదు. భగవంతుడి నుండి దూరముగానే ఉన్నారు. చుట్టూ తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి పంచ వికారాలలో చిక్కుకుంటారు. ఆ యాత్రలన్నీ అసత్యమైనవి. ఇది పురుషోత్తమ సంగమయుగమని, ఇప్పుడు తండ్రి వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి వచ్చి ఉన్నారని ఒకానొక రోజు అందరికీ తెలిసిపోతుంది. భగవంతుడు ఆఖరికి లభిస్తారు, కానీ ఎలా? ఇది ఎవ్వరికీ తెలియదు. మేము శ్రీమతము ఆధారముగా ఈ భారత్ ను మళ్ళీ స్వర్గముగా తయారుచేస్తున్నామని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. మీరు భారత్ పేరే తీసుకుంటారు. ఆ సమయములో వేరే ధర్మాలేవీ ఉండవు. మొత్తము విశ్వమంతా పవిత్రముగా అయిపోతుంది. ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. తండ్రి వచ్చి మీకు మొత్తము వృక్షము యొక్క జ్ఞానాన్ని వినిపిస్తారు. మీరే దేవతలుగా ఉండేవారు, మళ్ళీ మీరే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యారని మీకు స్మృతినిప్పిస్తారు. ఇప్పుడు మీరే బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ హంసో అర్థాన్ని తండ్రి ఎంత సహజముగా అర్థం చేయిస్తారు. ఓం అనగా నేను ఆత్మను, ఆ తర్వాత ఆత్మలమైన మనము ఈ విధముగా చక్రములో తిరుగుతాము. వారు ఆత్మనైన నేనే పరమాత్మ, పరమాత్మయే ఆత్మనైన నేను అని అనేస్తారు. హంసో యొక్క అర్థము యథార్థముగా తెలిసినవారు ఒక్కరు కూడా లేరు. తండ్రి అంటారు, ఈ మంత్రము ఏదైతే ఉందో, దీనిని నిత్యము గుర్తుంచుకోవాలి. చక్రము బుద్ధిలో లేకపోతే మరి చక్రవర్తీ రాజుగా ఎలా అవుతారు? ఇప్పుడు ఆత్మలమైన మనము బ్రాహ్మణులము, మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము. ఈ విషయాన్ని మీరు ఎవరినైనా వెళ్ళి అడగండి, ఎవ్వరూ చెప్పరు. వారు 84 జన్మల యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. భారత్ యొక్క ఉన్నతి మరియు పతనము అని అంటూ ఉంటారు. ఇది సరైనదే. సతోప్రధానము, సతో, రజో, తమో, సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్యవంశీ... ఇప్పుడు పిల్లలైన మీకు అంతా తెలిసిపోయింది. బీజరూపుడైన తండ్రినే జ్ఞానసాగరుడని అంటారు. వారు ఈ చక్రములోకి రారు. జీవాత్మలమైన మనమే పరమాత్మగా అయిపోతామని కాదు. అలా కాదు. తండ్రి తమ సమానముగా నాలెడ్జ్ ఫుల్ గా తయారుచేస్తారు, అంతేకానీ తమ సమానముగా భగవంతుడిగా తయారుచేయరు. ఈ విషయాలను చాలా బాగా అర్థం చేసుకోవాలి, అప్పుడే బుద్ధిలో చక్రము తిరగగలదు, దానికి స్వదర్శన చక్రము అన్న పేరు పెట్టారు. మనము ఈ 84 జన్మల చక్రములోకి ఎలా వస్తాము అనేది మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. సమయము కూడా వస్తుంది, వర్ణాలు కూడా వచ్చేస్తాయి, వంశావళి కూడా వచ్చేస్తుంది.

ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి. జ్ఞానము ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. జ్ఞానము ఉన్నట్లయితే ఇతరులకు కూడా ఇస్తారు. ఇక్కడ మీ చేత ప్రశ్నాపత్రాలు మొదలైనవేవీ నింపించడము జరగదు. ఆ స్కూళ్ళలోనైతే పరీక్షలు జరిగినప్పుడు ప్రశ్నాపత్రాలు విదేశాల నుండి వస్తాయి. ఎవరైతే విదేశాలలో చదువుకుంటూ ఉంటారో, వారి ఫలితాలనైతే అక్కడే రిలీజ్ చేస్తూ ఉంటారు. వారిలో కూడా ఎవరైనా గొప్ప ఎడ్యుకేషన్ అథారిటీ ఉంటారు, వారు పేపర్లను చెక్ చేస్తూ ఉంటారు. మీ పేపర్లను ఎవరు చెక్ చేస్తారు? మీరే స్వయమే చేసుకుంటారు. స్వయాన్ని ఎలా కావాలనుకుంటే అలా తయారుచేసుకోండి. పురుషార్థము ద్వారా ఏ పదవి కావాలనుకుంటే, ఆ పదవిని తండ్రి నుండి తీసుకోండి. ప్రదర్శనీ మొదలైనచోట్ల - మీరు ఏమవుతారు అని పిల్లలు అడుగుతుంటారు కదా. దేవతగా అవుతారా, బ్యారిస్టర్ గా అవుతారా... ఏమవుతారు? అని అడుగుతారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, సేవ చేస్తారో అంతగా ఫలము లభిస్తుంది. ఎవరైతే మంచి రీతిలో తండ్రిని స్మృతి చేస్తారో, వారు మేము సేవ కూడా చెయ్యాలని భావిస్తారు. ప్రజలను తయారుచేసుకోవాలి కదా! రాజధాని స్థాపన అవుతోంది కావున అందులో అందరూ కావాలి. అక్కడ మంత్రులు ఉండరు. ఎవరికైతే తెలివి తక్కువగా ఉంటుందో, వారికి మంత్రుల అవసరముంటుంది. మీకు అక్కడ సలహాల అవసరము ఉండదు. బాబా వద్దకు సలహాలు తీసుకునేందుకు వస్తారు - ధనము ఏమి చెయ్యాలి? వ్యాపారము ఎలా చెయ్యాలి? అని స్థూల విషయాల గురించి సలహాలు అడుగుతారు. బాబా అంటారు, ఈ ప్రాపంచిక విషయాలను తండ్రి వద్దకు తీసుకురాకండి. అయితే, వారు నిరుత్సాహపడకూడదని ఏదో ఒకటి ఊరట కలిగించేందుకు చెప్తారు. ఇది నా వ్యాపారమేమీ కాదు. మీకు మార్గము తెలియజేయడమనేది నా ఈశ్వరీయ వ్యాపారము. మీరు విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారు? మీకు శ్రీమతము లభించింది. మిగిలినవన్నీ ఆసురీ మతాలు. సత్యయుగములోనిది శ్రీమతమని అంటారు. కలియుగములో ఉన్నది ఆసురీ మతము. అది ఉన్నదే సుఖధామము. మీరు సంతుష్టముగా, సంతోషముగా ఉన్నారా? ఆరోగ్యము బాగుందా? అని అక్కడ ఈ విధముగా కూడా అడగరు. ఈ మాటలు అక్కడ ఉండవు. ఇవి ఇక్కడ అడగడము జరుగుతుంది. ఏ కష్టమూ లేదు కదా? సంతుష్టముగా, సంతోషముగా ఉన్నారా? అని ఇక్కడ అడగడము జరుగుతుంది. ఇందులో కూడా చాలా విషయాలు వస్తాయి. అక్కడ అలా అడిగేందుకు దుఃఖమే లేదు. ఇది ఉన్నదే దుఃఖమయ ప్రపంచము. వాస్తవానికి మిమ్మల్ని ఎవ్వరూ ఇలా అడగలేరు. మాయ పడవేసేదే అయినా కానీ తండ్రి లభించారు కదా. అందుకే మీరేమంటారంటే - మీరు క్షేమ సమాచారాలు అడుగుతున్నారా, మేము ఈశ్వరుని పిల్లలము, మమ్మల్ని క్షేమ సమాచారాలేమి అడుగుతారు. పరబ్రహ్మములో నివసించే తండ్రి గురించి చింత ఉండేది, వారు లభించేసారు, ఇక దేని గురించి చింత ఉంది! మనము ఎవరి పిల్లలము అన్నది సదా గుర్తుంచుకోవాలి! ఎప్పుడైతే మనము పావనముగా అయిపోతామో, అప్పుడిక యుద్ధము ప్రారంభమైపోతుంది అన్న జ్ఞానము కూడా బుద్ధిలో ఉంది. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని - మీరు సంతుష్టముగా, సంతోషముగా ఉన్నారా అని అడిగితే మీరు చెప్పండి - మేమైతే సదా సంతుష్టముగా, సంతోషముగా ఉంటాము. అనారోగ్యముగా ఉన్నా కూడా తండ్రి స్మృతిలో ఉంటారు. మీరు స్వర్గములో కంటే ఎక్కువ ఇక్కడ సంతుష్టముగా, సంతోషముగా ఉంటారు. స్వర్గము యొక్క రాజ్యాధికారాన్ని ఇచ్చే తండ్రి లభించినప్పుడు, వారు మమ్మల్ని ఇంత యోగ్యులుగా తయారుచేస్తున్నప్పుడు, ఇక మనకు ఏం చింత ఉంది! ఈశ్వరుని పిల్లలకు ఏం చింత! అక్కడ దేవతలకు కూడా చింత ఉండదు, దేవతల పైన ఈశ్వరుడు ఉన్నారు, మరి ఈశ్వరుని పిల్లలకు ఏ చింత ఉండగలదు. బాబా మనల్ని చదివిస్తున్నారు. బాబా మన టీచర్, సద్గురువు. బాబా మనపై కిరీటము పెడుతున్నారు, మనము కిరీటధారులుగా అవుతున్నాము. మనకు విశ్వకిరీటము ఎలా లభిస్తుంది అన్నది మీకు తెలుసు. తండ్రి కిరీటము పెట్టుకోరు. సత్యయుగములో తండ్రి తమ కిరీటాన్ని తమ పిల్లలపై పెడతారని ఇది కూడా మీకు తెలుసు, వారినే ఇంగ్లీషులో క్రౌన్ ప్రిన్స్ (యువరాజు లేక కిరీటానికి వారసుడు) అని అంటారు. ఈ ప్రపంచములో ఎప్పటివరకైతే తండ్రి కిరీటము కొడుకుకు లభించదో, అప్పటివరకు తండ్రి ఎప్పుడు మరణిస్తారా, ఎప్పుడా ఆ కిరీటము నా తలపైకి వస్తుందా అని పిల్లలకు ఉత్సుకత ఉంటుంది. యువరాజు నుండి మహారాజుగా అవ్వాలనే ఆశ ఉంటుంది. అక్కడైతే ఇటువంటి విషయమేదీ ఉండదు. సమయము వచ్చినప్పుడు నియమానుసారముగా తండ్రి పిల్లలకు కిరీటమిచ్చి వారు పక్కకు తప్పుకుంటారు. అక్కడ వానప్రస్థము గురించిన చర్చ ఉండదు. పిల్లలకు మహళ్ళు మొదలైనవి నిర్మించి ఇస్తారు, ఆశలన్నీ పూర్తయిపోతాయి. సత్యయుగములో సుఖమే సుఖముంటుందని మీరు అర్థం చేసుకోగలరు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడే అన్ని సుఖాలనూ ప్రాక్టికల్ గా పొందుతారు. స్వర్గములో ఏముంటుంది, అలాగే ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ ఎక్కడికి వెళ్తారు అన్నది మీకే తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని ప్రాక్టికల్ గా తండ్రి చదివిస్తున్నారు. మనము నిజముగానే స్వర్గములోకి వెళ్తామని మీకు తెలుసు. మేము స్వర్గములోకి వెళ్తామని వారంటారు కానీ స్వర్గమని దేనినంటారో కూడా వారికి తెలియదు. జన్మ-జన్మాంతరాలుగా ఈ అజ్ఞానము యొక్క విషయాలను వింటూ వచ్చారు, ఇప్పుడు తండ్రి మీకు సత్యమైన విషయాలను వినిపిస్తున్నారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా సంతుష్టముగా, సంతోషముగా ఉండేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి. చదువు ద్వారా స్వయముపై రాజ్య కిరీటాన్ని పెట్టుకోవాలి.

2. శ్రీమతము ఆధారముగా భారత్ ను స్వర్గముగా తయారుచేసే సేవ చెయ్యాలి. శ్రీమతానికి సదా గౌరవము ఇవ్వాలి.

వరదానము:-
శ్రేష్ఠ భాగ్యము యొక్క స్మృతి ద్వారా తమ సమర్థ స్వరూపములో ఉండే సూర్యవంశీ పదవికి అధికారీ భవ

ఎవరైతే తమ శ్రేష్ఠ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటారో వారు సమర్థ స్వరూపములో ఉంటారు. వారికి సదా తమ అనాది వాస్తవిక స్వరూపము స్మృతిలో ఉంటుంది. వారు ఎప్పుడూ కృత్రిమమైన ముఖాన్ని ధారణ చేయరు. అనేక సార్లు మాయ నకిలీ గుణాలు మరియు కర్తవ్యాల స్వరూపముగా తయారుచేస్తుంది. కొందరిని క్రోధీగా, కొందరిని లోభీగా, కొందరిని దుఃఖితులుగా, కొందరిని అశాంతి కలవారిగా చేసేస్తుంది - కానీ వాస్తవిక స్వరూపము ఈ విషయాలన్నింటి నుండీ అతీతమైనది. ఏ పిల్లలైతే తమ వాస్తవిక స్వరూపములో స్థితులై ఉంటారో వారు సూర్యవంశీ పదవికి అధికారులుగా అయిపోతారు.

స్లోగన్:-
సర్వులపై దయ చూపించేవారిగా అయినట్లయితే అహంకారము మరియు అనుమానము సమాప్తమైపోతాయి.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చెయ్యండి

మీ రచన అయిన కమలపుష్పము నీటిలో ఉంటూ కూడా నీటి యొక్క బంధనము నుండి ముక్తిగా ఉంటుంది, మరి రచనలో ఈ విశేషత ఉన్నప్పుడు మాస్టర్ రచయితలో ఉండలేదా? ఎప్పుడెప్పుడైతే బంధనములో చిక్కుకుపోతారో, అప్పుడు - కమల పుష్పము అతీతముగా, ప్రియముగా అవ్వగలిగినప్పుడు మరి మాస్టర్ సర్వశక్తివంతులు అవ్వలేరా అని కమలపుష్పము యొక్క ఈ ఉదాహరణను ఎదురుగా పెట్టుకోండి, అప్పుడు సదా కోసం అలా అయిపోతారు.