13-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇక్కడ మీదంతా గుప్తము, అందుకే మీరు ఎటువంటి ఆర్భాటము చేయకూడదు, మీ కొత్త రాజధాని యొక్క నషాలో ఉండాలి’’

ప్రశ్న:-
శ్రేష్ఠ ధర్మము మరియు దైవీ కర్మల స్థాపన కోసం పిల్లలైన మీరు ఏ కృషి చేస్తారు?

జవాబు:-
మీరు ఇప్పుడు 5 వికారాలను విడిచిపెట్టే కృషి చేస్తారు, ఎందుకంటే ఈ వికారాలే అందరినీ భ్రష్టులుగా చేసాయి. ఈ సమయములో అందరూ దైవీ ధర్మ భ్రష్టులుగా మరియు కర్మ భ్రష్టులుగా ఉన్నారని మీకు తెలుసు. తండ్రియే శ్రీమతాన్ని ఇచ్చి శ్రేష్ఠ ధర్మాన్ని మరియు శ్రేష్ఠ దైవీ కర్మలను స్థాపన చేస్తారు. మీరు శ్రీమతముపై నడుస్తూ తండ్రి స్మృతితో వికారాలపై విజయము పొందుతారు. చదువు ద్వారా మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు.

పాట:-
మిమ్మల్ని పొంది...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మిక పిల్లలే బాబా అని అంటారు. వీరు అనంతమైన తండ్రి అని, అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారని అనగా వీరు అందరికీ తండ్రి అని పిల్లలకు తెలుసు. వారిని అనంతమైన పిల్లలందరూ, ఆత్మలందరూ తలచుకుంటూ ఉంటారు. ఏదో ఒక రకముగా తలచుకుంటూ ఉంటారు కానీ ఆ పరమపిత పరమాత్మ నుండి మనకు విశ్వ రాజ్యాధికారము లభిస్తుంది అని వారికి తెలియదు. మీకు తెలుసు - తండ్రి మనకు సత్యయుగీ విశ్వ రాజ్యాధికారాన్ని ఏదైతే ఇస్తారో, అది స్థిరమైనది, అఖండమైనది, అచంచలమైనది, మన ఆ రాజ్యాధికారము 21 జన్మల కొరకు నిలిచి ఉంటుంది. మొత్తం విశ్వముపై మన రాజ్యము ఉంటుంది, దానిని ఎవ్వరూ లాక్కోలేరు, దోచుకోలేరు. మన రాజ్యము అచంచలమైనది ఎందుకంటే అక్కడ ఒకే ధర్మము ఉంటుంది, ద్వైతము ఉండదు. అది అద్వైత రాజ్యము. పిల్లలు పాటను విన్నప్పుడల్లా తమ రాజధాని యొక్క నషా కలగాలి. ఇటువంటి పాటలు ఇంటిలో ఉండాలి. మీదంతా గుప్తము. ఇతర గొప్ప-గొప్ప వ్యక్తులది చాలా ఆర్భాటము ఉంటుంది. మీకు ఎటువంటి ఆర్భాటము లేదు. బాబా ఎవరిలోనైతే ప్రవేశించారో, వారు కూడా ఎంత సాధారణముగా ఉన్నారు అనేది మీరు చూస్తున్నారు. ఇక్కడ మనుష్యులు ప్రతి ఒక్కరూ అధర్మయుక్తమైన, ఛీ-ఛీ పనులే చేస్తారని, అందుకే వారిని వివేకహీనులని అంటారని పిల్లలకు తెలుసు. బుద్ధికి పూర్తిగా తాళము పడిపోయింది. మీరు ఎంత వివేకవంతులుగా ఉండేవారు. విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మాయ ఎంతటి వివేకహీనులుగా చేసిందంటే, ఇక వారు దేనికీ పనికిరానివారిగా అయిపోయారు. తండ్రి వద్దకు వెళ్ళేందుకు యజ్ఞతపాదులు మొదలైనవి చాలా చేస్తూ ఉంటారు కానీ ఏమీ లభించదు. అలా భ్రమిస్తూనే ఉంటారు. రోజురోజుకూ అకళ్యాణమే జరుగుతూ ఉంటుంది. మనుష్యులు ఎంతెంతగా తమోప్రధానమైపోతూ ఉంటారో, అంతంతగా వారి అకళ్యాణము జరగవలసిందే. ఋషులు-మునులకు గాయనము ఉంది, వారు పవిత్రముగా ఉండేవారు. వారు భగవంతుని విషయములో - మాకు తెలియదు, మాకు తెలియదు అని అనేవారు. ఇప్పుడు వారు తమోప్రధానముగా అయిపోయారు కావున - శివోహమ్, తతత్వమ్, సర్వవ్యాపి, నీలోనూ-నాలోనూ అందరిలోనూ ఉన్నారు అని అంటున్నారు. వారు కేవలం పరమాత్మ అని అంటారు. పరమపిత అని ఎప్పుడూ అనరు. పరమపితను సర్వవ్యాపి అని అనడము తప్పు అవుతుంది, అందుకే మళ్ళీ ఈశ్వరా లేక పరమాత్మ అని అంటారు. పిత అనే పదము బుద్ధిలోకి రాదు. ఒకవేళ ఎవరైనా అన్నా కూడా, నామమాత్రముగానే అంటారు. ఒకవేళ పరమపితగా భావిస్తే, వారి బుద్ధి ఒక్కసారిగా ప్రకాశిస్తుంది. తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు, వారు హెవెన్లీ గాడ్ ఫాదర్. అటువంటప్పుడు మనము నరకములో ఎందుకు పడి ఉన్నాము, ఇప్పుడు మనము ముక్తి-జీవన్ముక్తిని ఎలా పొందగలము, ఇది ఎవ్వరి బుద్ధిలోకి రాదు. ఆత్మ పతితముగా అయిపోయింది. ఆత్మ మొదట సతోప్రధానముగా, వివేకవంతముగా ఉంటుంది, ఆ తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తుంది, వివేకహీనముగా అయిపోతుంది. ఇప్పుడు మీకు వివేకము లభించింది. బాబా మనకు ఈ స్మృతిని ఇప్పించారు. భారత్ కొత్త ప్రపంచముగా ఉన్నప్పుడు మన రాజ్యము ఉండేది. అక్కడ ఒకే మతము, ఒకే భాష, ఒకే ధర్మము, ఒకే మహారాజు, మహారాణుల రాజ్యముండేది, ఆ తర్వాత ద్వాపరములో వామ మార్గము ప్రారంభమవుతుంది, అప్పుడిక ప్రతి ఒక్కరి కర్మలపై ఆధారపడుతుంది. కర్మల అనుసారముగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను మీకు ఎటువంటి కర్మలను నేర్పిస్తున్నానంటే, వాటి ద్వారా మీరు 21 జన్మలు రాజ్యాధికారాన్ని పొందుతారు. అక్కడ కూడా హద్దు తండ్రి ఉంటారు, కానీ - ఈ రాజ్య వారసత్వము అనంతమైన తండ్రి ఇచ్చినటువంటిది అన్న జ్ఞానము అక్కడ ఉండదు. మళ్ళీ ద్వాపరము నుండి రావణ రాజ్యము ప్రారంభమవుతుంది, సంబంధాలు వికారీ అయిపోతాయి. ఇక కర్మలనుసారముగా జన్మలు లభిస్తాయి. భారత్ లో పూజ్య రాజులు కూడా ఉండేవారు, పూజారీ రాజులు కూడా ఉండేవారు. సత్య, త్రేతాయుగాలలో అందరూ పూజ్యులుగా ఉంటారు. అక్కడ పూజ లేక భక్తి ఏదీ ఉండదు, మళ్ళీ ద్వాపరములో ఎప్పుడైతే భక్తి మార్గము ప్రారంభమవుతుందో, అప్పుడు యథా రాజా-రాణి, తథా ప్రజా పూజారులుగా, భక్తులుగా అయిపోతారు. అందరికంటే గొప్ప రాజులైన సూర్యవంశీయులు పూజ్యులుగా ఉండేవారు, తర్వాత వారే పూజారులుగా అవుతారు.

ఇప్పుడు మీరు నిర్వికారులుగా అవుతారు, దీని ప్రారబ్ధము 21 జన్మల వరకు ఉంటుంది. తర్వాత భక్తి మార్గము ప్రారంభమవుతుంది. దేవతల మందిరాలను నిర్మించి పూజిస్తూ ఉంటారు. ఇది కేవలం భారత్ లోనే జరుగుతుంది. తండ్రి 84 జన్మల కథను ఏదైతే వినిపిస్తారో, అది కూడా భారతవాసుల కోసమే. ఇతర ధర్మాల వారు రావడమే తర్వాత వస్తారు. ఇక వృద్ధి చెందుతూ, చెందుతూ అనేకమంది అయిపోతారు. వెరైటీ ధర్మాలవారి ముఖకవళికలు ప్రతి విషయములోనూ వేరు-వేరుగా ఉంటాయి. ఆచారాలు-పద్ధతులు కూడా వేర్వేరుగా ఉంటాయి. భక్తి మార్గము కోసం సామాగ్రి కూడా కావాలి. ఎలాగైతే బీజము చిన్నదిగా ఉంటుంది కానీ వృక్షము ఎంత పెద్దదిగా ఉంటుంది. వృక్షము యొక్క ఆకులు మొదలైనవాటిని లెక్క పెట్టలేము. అదే విధముగా, భక్తి కూడా విస్తారమైపోతుంది. అనేకానేక శాస్త్రాలను తయారుచేస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు, ఈ భక్తి మార్గపు సామాగ్రి అంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేయండి. భక్తి ప్రభావము కూడా చాలా ఉంది కదా. భక్తి ఎంత సుందరముగా ఉంటుంది, నృత్యాలు, వినోదము, పాటలు మొదలైనవి ఉంటాయి, ఎంత ఖర్చు చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, మీ ఆది సనాతన ధర్మాన్ని స్మృతి చేయండి. అనేక రకాల భక్తిని జన్మజన్మలుగా మీరు చేస్తూ వచ్చారు. సన్యాసులు కూడా ఆత్మలు నివసించే స్థానాన్ని, ఆ తత్వాన్ని పరమాత్మగా భావిస్తారు, ఆ బ్రహ్మమును లేక తత్వమునే స్మృతి చేస్తారు. వాస్తవానికి సన్యాసులు సతోప్రధానముగా ఉన్నప్పుడు, వారు అడవులకు వెళ్ళి శాంతిగా ఉండేవారు. వారు బ్రహ్మములోకి వెళ్ళి లీనమవుతారని కాదు. బ్రహ్మతత్వము యొక్క స్మృతిలో ఉన్నట్లయితే, శరీరాన్ని వదిలినట్లయితే, ఆ బ్రహ్మములో లీనమైపోతామని వారు భావిస్తారు. తండ్రి అంటారు - ఎవ్వరూ లీనమవ్వలేరు. ఆత్మ అయితే అవినాశీ కదా, అది ఎలా లీనమవ్వగలదు. భక్తి మార్గములో ఎంతగా కష్టపడుతూ ఉంటారు, ఇంకప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపములో వస్తారని అంటారు. ఇప్పుడు రైట్ ఎవరు. నివృత్తి మార్గమువారు అంటారు - మేము బ్రహ్మముతో యోగాన్ని జోడించి బ్రహ్మములో లీనమైపోతాము అని. గృహస్థ ధర్మమువారు అంటారు - భగవంతుడు ఏదో ఒక రూపములో పతితులను పావనముగా తయారుచేయడానికి వస్తారు అని. అంతేకానీ పై నుండి ప్రేరణ ద్వారానే నేర్పిస్తారని కాదు. టీచరు ఇంటిలో కూర్చుని ప్రేరణ ఇస్తారా ఏమిటి! ప్రేరణ అన్న పదమే లేదు. ప్రేరణ ద్వారా ఏ పని జరగదు. శంకరుని ప్రేరణ ద్వారా వినాశనము జరుగుతుందని అంటారు కానీ వినాశనమనేది డ్రామాలో నిశ్చితమై ఉంది. వారు ఈ మిసైల్స్ మొదలైనవి తయారుచేయవలసిందే. అది కేవలం మహిమగా చెప్పుకుంటూ ఉంటారు. ఎవ్వరికీ వారి పెద్దల మహిమ గురించి తెలియదు. ధర్మ స్థాపకులను కూడా గురువులని అంటారు, కానీ వారు కేవలం ధర్మ స్థాపన చేస్తారు. ఎవరైతే సద్గతిని ఇస్తారో, వారిని గురువని అంటారు. ఆ ధర్మ స్థాపకులు ధర్మ స్థాపన చేయడానికి వస్తారు, వారి వెనుక వారి వంశావళి వస్తూ ఉంటుంది. వారు ఎవ్వరికీ సద్గతిని ఇవ్వరు. అటువంటప్పుడు వారిని గురువులని ఎలా అంటారు. గురువు అయితే ఒక్కరే, వారినే సర్వుల సద్గతిదాత అని అంటారు. భగవంతుడైన తండ్రే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు, ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు. ఎప్పుడూ ఎవ్వరూ వారిని స్మృతి చేయడము మానలేరు. పతి పట్ల ఎంత ప్రేమ ఉన్నా సరే మళ్ళీ - ఓ భగవంతుడా, ఓ ఈశ్వరా అని తప్పకుండా అంటారు, ఎందుకంటే వారే సర్వుల సద్గతిదాత. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఇదంతా రచన, నేను రచయిత అయిన తండ్రిని. అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రియే. సోదరుడు సోదరుడికి వారసత్వాన్ని ఇవ్వలేరు. వారసత్వము ఎప్పుడూ తండ్రి నుండే లభిస్తుంది. అనంతమైన పిల్లలైన మీ అందరికీ అనంతమైన వారసత్వాన్ని ఇస్తాను, అందుకే నన్ను - ఓ పరమపిత, క్షమించండి, దయ చూపించండి అంటూ తలచుకుంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. భక్తి మార్గములో అనేక రకాలుగా మహిమ చేస్తారు. వారు కూడా డ్రామానుసారముగా తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. తండ్రి అంటారు - నేనేమీ వారు పిలవడము వలన రాను. డ్రామా ఆ విధముగా తయారై ఉంది. డ్రామాలో నేను వచ్చే పాత్ర నిశ్చితమై ఉంది. అనేక ధర్మాల వినాశనము, ఏక ధర్మ స్థాపన లేదా కలియుగ వినాశనము, సత్యయుగ స్థాపన చేయవలసి ఉంటుంది. నా సమయానికి నా అంతట నేనే వస్తాను. ఈ భక్తి మార్గము యొక్క పాత్ర కూడా డ్రామాలో ఉంది. ఇప్పుడు భక్తి మార్గపు పాత్ర పూర్తయ్యింది కావున నేను వచ్చాను. పిల్లలు కూడా అంటారు - ఇప్పుడు మేము తెలుసుకున్నాము, 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకున్నాము, బాబా, కల్పక్రితము కూడా మీరు బ్రహ్మా తనువులోకే వచ్చారు. ఈ జ్ఞానము మీకు ఇప్పుడు లభిస్తుంది, ఇక మళ్ళీ ఎప్పుడూ లభించదు. ఇది జ్ఞానము, అది భక్తి. జ్ఞానము యొక్క ప్రారబ్ధము ఎక్కే కళ. క్షణములో జీవన్ముక్తి అని అంటారు. జనకుడు క్షణములో జీవన్ముక్తిని పొందారని అంటారు. కేవలం ఒక్క జనకుడే జీవన్ముక్తిని పొందారా? జీవన్ముక్తి అంటే ఈ రావణ రాజ్యము నుండి జీవితాన్ని ముక్తి చేస్తారు.

పిల్లలందరికీ ఎంత దుర్గతి పట్టింది అనేది తండ్రికి తెలుసు. మళ్ళీ వారి సద్గతి జరగాలి. దుర్గతి నుండి మళ్ళీ ఉన్నతమైన గతిని, ముక్తి-జీవన్ముక్తిని పొందుతారు. మొదట ముక్తిలోకి వెళ్ళి, ఆ తర్వాత జీవన్ముక్తిలోకి వస్తారు. శాంతిధామము నుండి మళ్ళీ సుఖధామములోకి వస్తారు. ఈ చక్రము యొక్క రహస్యమంతటినీ తండ్రి అర్థం చేయించారు. మీ తర్వాత వేరే ధర్మాలు కూడా వస్తూ ఉంటాయి, మనుష్య సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది. తండ్రి అంటారు, ఈ సమయములో ఈ మనుష్య సృష్టి యొక్క వృక్షము తమోప్రధానమై, శిథిలావస్థను చేరుకుంది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క పునాది పూర్తిగా శిథిలమైపోయింది. మిగిలిన ధర్మాలన్నీ నిలిచి ఉన్నాయి. భారత్ లో ఒక్కరు కూడా స్వయాన్ని ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా భావించరు. వారు దేవతా ధర్మమువారే కానీ ఈ సమయములో - మేము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారము అని భావించరు, ఎందుకంటే దేవతలైతే పవిత్రముగా ఉండేవారు. మేమైతే పవిత్రముగా లేము, అపవిత్రముగా, పతితముగా ఉన్న మేము స్వయాన్ని దేవతలమని ఎలా చెప్పుకుంటాము అని వారు భావిస్తారు. హిందూ అని పిల్చుకోవడము కూడా డ్రామా ప్లాన్ అనుసారముగా ఒక ఆచారములా అయిపోతుంది. జనాభా లెక్కలలో కూడా హిందూ ధర్మమని వ్రాసేస్తారు. గుజరాత్ వారు అయినా కూడా హిందూ గుజరాతి అని అంటారు. హిందూ ధర్మము ఎక్కడ నుండి వచ్చింది అని వారిని అడిగి చూడండి. ఎవ్వరికీ తెలియదు. కేవలం మా ధర్మాన్ని శ్రీకృష్ణుడు స్థాపించారని అంటారు. ఎప్పుడు? ద్వాపరములో అంటారు. ద్వాపరము నుండే ఈ మనుష్యులు తమ ధర్మాన్ని మరచి హిందువులని చెప్పుకోవడము మొదలుపెట్టారు, అందుకే వారిని దైవీ ధర్మ భ్రష్టులని అంటారు. అక్కడ అందరూ మంచి కర్మలు చేస్తారు. ఇక్కడ అందరూ ఛీ-ఛీ కర్మలు చేస్తారు, అందుకే ధర్మ భ్రష్టులు మరియు కర్మ భ్రష్టులు అని అంటారు. ఇప్పుడు మళ్ళీ శ్రేష్ఠ ధర్మము మరియు శ్రేష్ఠ దైవీ కర్మల స్థాపన జరుగుతోంది, అందుకే ఇప్పుడిక ఈ పంచ వికారాలను వదులుతూ వెళ్ళండి అని చెప్తున్నారు. ఈ వికారాలు అర్ధకల్పము నుండి ఉన్నాయి. ఇప్పుడు ఒక్క జన్మలో వీటిని వదిలేయడము - ఇందులోనే శ్రమ అనిపిస్తుంది. శ్రమించకుండా విశ్వ రాజ్యాధికారము లభించదు. తండ్రిని స్మృతి చేస్తేనే మీకు మీరు రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు అంటే రాజ్యానికి అధికారులుగా అవుతారు. ఎంత బాగా స్మృతిలో ఉంటే, శ్రీమతముపై నడుస్తే, అంతగా మీరు రాజులకే రాజులుగా అవుతారు. చదివించే టీచరైతే చదివించడానికి వచ్చారు. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పాఠశాల. నరుని నుండి నారాయణునిగా తయారుచేసే కథను వినిపిస్తారు. ఈ కథ ఎంత ప్రసిద్ధమైనది. దీనిని అమర కథ, సత్యనారాయణుడి కథ, మూడవ నేత్రము కథ అని కూడా అంటారు. మూడింటి అర్థాన్ని కూడా తండ్రి తెలియజేస్తారు. భక్తి మార్గములోనైతే ఎన్నో కథలు ఉన్నాయి. పాట ఎంత బాగుందో చూడండి. బాబా మనల్ని మొత్తము విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు, ఆ యజమానత్వాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా ఈ స్మృతిని ఉంచుకోవాలి - మేము ఏక మతము, ఏక రాజ్యము, ఏక ధర్మ స్థాపనకు నిమిత్తులము, అందుకే ఏక మతము వారిగా అయి ఉండాలి.

2. స్వయానికి రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు వికారాలను వదిలేందుకు కృషి చేయాలి. చదువు పట్ల పూర్తిగా ధ్యాస ఉంచాలి.

వరదానము:-
కర్మాతీత స్థితిలో స్థితులై నలువైపులా ఉన్న సేవలను హ్యాండిల్ చేసే సిద్ధి స్వరూప భవ

మున్ముందు నలువైపులా ఉన్న సేవల విస్తారాన్ని హ్యాండిల్ చేసేందుకు భిన్న-భిన్న సాధనాలను ఉపయోగించవలసి ఉంటుంది, ఎందుకంటే ఆ సమయములో పత్ర వ్యవహారాలు లేక టెలిగ్రాములు, టెలిఫోనులు మొదలైనవి పని చేయవు. అటువంటి సమయములో వైర్ లెస్ సెట్ కావాలి, దాని కొరకు ఇప్పుడిప్పుడే కర్మయోగీ, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిలో స్థితులై ఉండే అభ్యాసము చేయండి. అప్పుడు నలువైపులా సంకల్ప సిద్ధి ద్వారా సేవలో సహయోగిగా అవ్వగలుగుతారు.

స్లోగన్:-
పరమాత్మ ప్రేమ యొక్క పాలనకు స్వరూపము మీ సహజయోగీ జీవితము.

అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి

ప్రతి ఒక్కరూ రెండు విషయాల పట్ల విశేషమైన శ్రద్ధ పెట్టాలి - ఒకటి, సదా సంస్కారాలను కలుపుకుని వెళ్ళే యూనిటీ (ఐకమత్యము), రెండవది, ఒకరి పట్ల ఒకరు విశ్వాసాన్ని ఉంచి సదా సంతుష్టముగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టము చేయాలి. ఎప్పుడైతే ఈ రెండు విషయాల పట్ల సదా అటెన్షన్ ఉంటుందో, అప్పుడు తండ్రి ఎవరో, ఎలా ఉన్నారో, అలా కనిపిస్తారు మరియు ప్రత్యక్షత జరుగుతుంది.