13-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మొదట ప్రతి ఒక్కరికీ - నీవు ఒక ఆత్మవు, నీవు తండ్రిని స్మృతి చేయాలి, స్మృతి ద్వారానే పాపాలు తొలుగుతాయి అన్న ఈ మంత్రాన్ని ఎంతో లోతుగా పక్కా చేయించండి’’

ప్రశ్న:-
సత్యమైన సేవ ఏమిటి, ఆ సేవను ఇప్పుడు మీరు చేస్తున్నారు?

జవాబు:-
భారత్ ఏదైతే పతితముగా అయిపోయిందో, దానిని పావనముగా తయారుచేయాలి - ఇదే సత్యమైన సేవ. మీరు భారత్ కు ఏ సేవను చేస్తారు అని మనుష్యులు అడుగుతారు. మీరు వారికి చెప్పండి - మేము శ్రీమతంపై భారత్ కు ఎటువంటి ఆత్మిక సేవను చేస్తామంటే, దానితో భారత్ ద్వికిరీటధారిగా అవుతుంది. భారత్ లో శాంతి-సంపదలు ఏవైతే ఉండేవో, వాటిని మేము స్థాపన చేస్తున్నాము.

ఓంశాంతి
మొట్టమొదటి పాఠము ఏమిటంటే - పిల్లలూ, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి అనగా మన్మనాభవ, ఇది సంస్కృత పదము. పిల్లలు ఎప్పుడైతే సేవ చేస్తారో, అప్పుడు మొట్టమొదట వారికి అల్ఫ్ గురించి చదివించాలి. ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు వారిని శివబాబా చిత్రం ఎదురుగా తీసుకువెళ్ళాలి, ఇంకే చిత్రము ఎదురుగా తీసుకువెళ్ళకూడదు. మొట్టమొదట తండ్రి చిత్రం వద్దకు తీసుకువెళ్ళి - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారని వారికి చెప్పాలి. నేను మీకు సుప్రీమ్ తండ్రిని కూడా, సుప్రీమ్ టీచర్ ను కూడా మరియు సుప్రీమ్ గురువును కూడా. అందరికీ ఈ పాఠాన్ని నేర్పించాలి. ప్రారంభించడమే అక్కడి నుండి ప్రారంభించాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి ఎందుకంటే మీరెవరైతే పతితులుగా అయిపోయారో, మీరే మళ్ళీ పావనులుగా, సతోప్రధానంగా అవ్వాలి. ఈ పాఠంలో అన్ని విషయాలూ వచ్చేస్తాయి. కానీ అందరూ ఏమీ ఈ విధంగా చేయరు. బాబా అంటారు, మొట్టమొదట శివబాబా చిత్రం వద్దకే తీసుకువెళ్ళాలి. వీరు అనంతమైన తండ్రి. తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే నావ తీరానికి చేరుకుంటుంది. స్మృతి చేస్తూ-చేస్తూ పవిత్ర ప్రపంచంలోకి చేరుకోవాల్ససిందే. ఈ పాఠాన్ని తక్కువలో తక్కువ ప్రతి 3 నిముషాలకూ, ఘడియ-ఘడియ పక్కా చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేసారా? బాబా, తండ్రి కూడా, అలాగే రచనకు రచయిత కూడా. వారికి రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు ఎందుకంటే వారు మనుష్య సృష్టికి బీజరూపుడు. మొట్టమొదటైతే ఈ విషయాన్ని నిశ్చయం చేయించాలి. తండ్రిని స్మృతి చేస్తున్నారా? ఈ జ్ఞానాన్ని తండ్రే ఇస్తారు. మేము కూడా తండ్రి నుండి జ్ఞానాన్ని తీసుకున్నాము, అదే మీకు ఇస్తాము. మొట్టమొదట ఈ మంత్రాన్ని పక్కా చేయించాలి - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే నాథునికి చెందినవారిగా అవుతారు. ఈ విషయం గురించే అర్థం చేయించాలి. ఎప్పటివరకైతే ఈ విషయాన్ని అర్థం చేసుకోరో, అప్పటివరకు వారి అడుగును ముందుకు వెయ్యనివ్వకూడదు. ఇటువంటి తండ్రి పరిచయానికి సంబంధించిన 2-4 చిత్రాలు ఉండాలి. కావున ఈ విషయంపై మంచి రీతిలో అర్థం చేయించడం ద్వారా - మేము తండ్రిని స్మృతి చేయాలి, వారే సర్వ శక్తివంతుడు, వారిని స్మృతి చేయడంతో పాపాలు తొలుగుతాయి అని వారి బుద్ధిలోకి వస్తుంది. తండ్రి మహిమైతే స్పష్టంగా ఉంది. మొట్టమొదట ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండి. దేహపు సర్వ సంబంధాలను మర్చిపోండి. నేను సిక్కును, నేను ఫలానాను... వీటిని వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. మొట్టమొదటైతే బుద్ధిలో ఈ ముఖ్యమైన విషయాన్ని కూర్చోబెట్టండి. ఆ తండ్రియే పవిత్రత, సుఖశాంతుల వారసత్వాన్ని ఇచ్చేవారు. తండ్రియే నడవడికను సరిదిద్దుతారు. ఈ విధంగా మొదటి పాఠము ఏదైతే చాలా ముఖ్యమైనదో, అది పక్కా చేయించడం లేదని బాబాకు అనిపించింది. దీనిని ఎంత లోతుగా అర్థం చేయిస్తారో, అంత బాగా అది బుద్ధిలో గుర్తుంటుంది. తండ్రి పరిచయం ఇవ్వడానికి 5 నిమిషాలు పట్టినా కానీ పక్కకు వెళ్ళకూడదు. ఎంతో అభిరుచితో తండ్రి మహిమను వింటారు. తండ్రి యొక్క ఈ చిత్రము ముఖ్యమైనది. క్యూ (వరుసలో) అంతా ఈ చిత్రము ఎదురుగానే ఉండాలి. తండ్రి సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఆ తర్వాత ఈ చక్రం ఎలా తిరుగుతుంది అని రచనకు సంబంధించిన జ్ఞానాన్ని చెప్పాలి. ఏ విధంగానైతే మసాలాను నూరి-నూరి పూర్తిగా పొడిలా చేయడం జరుగుతుంది కదా. అలాగే మీది ఈశ్వరీయ మిషన్, అందుకే మంచి రీతిలో ఒక్కొక్క విషయాన్ని బాగా బుద్ధిలో కూర్చోబెట్టాలి ఎందుకంటే తండ్రి గురించి తెలియని కారణంగా అందరూ అనాథలుగా అయిపోయారు. బాబా సుప్రీమ్ తండ్రి, సుప్రీమ్ టీచర్, సుప్రీమ్ గురువు అని వారి పరిచయాన్ని ఇవ్వాలి. ఈ 3 సంబంధాలను చెప్పడంతో ఇక సర్వవ్యాపి అన్న విషయం బుద్ధి నుండి తొలగిపోతుంది. ఈ విషయాన్ని మొట్టమొదట బుద్ధిలో కూర్చోబెట్టండి. తండ్రిని స్మృతి చేయాలి అప్పుడే మీరు పతితము నుండి పావనముగా అవ్వగలుగుతారు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. సతోప్రధానముగా అవ్వాలి. మీరు వారికి తండ్రి స్మృతిని కలిగిస్తారు, ఇందులో పిల్లలైన మీ కళ్యాణము కూడా ఉంది. మీరు కూడా మన్మనాభవగా ఉంటారు.

మీరు సందేశకులు కావున తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. బాబా మనకు తండ్రి కూడా, టీచర్ మరియు గురువు కూడా అన్న విషయాన్ని తెలిసిన మనుష్యులు ఒక్కరు కూడా లేరు. తండ్రి పరిచయాన్ని వినడంతో వారు ఎంతో సంతోషిస్తారు. భగవానువాచ - నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి. ఇది కూడా మీకే తెలుసు. గీతతోపాటు మళ్ళీ మహాభారత యుద్ధాన్ని కూడా చూపించారు. ఇప్పుడు ఇంకే ఇతర యుద్ధాల విషయమే లేదు. తండ్రిని స్మృతి చేయడంలోనే మీకు యుద్ధం జరుగుతుంది. చదువు అయితే వేరు, ఇకపోతే యుద్ధమైతే స్మృతిలోనే ఉంటుంది ఎందుకంటే అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవుతారు. మీరు తండ్రిని స్మృతి చేసేవారు. మొట్టమొదట వారు తండ్రి, టీచర్ మరియు గురువు అన్నది పక్కా చేయించండి. ఇప్పుడు మేము వారిది వినాలా లేక మీది వినాలా? తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు మీరు శ్రేష్ఠంగా అయ్యేందుకు పూర్తి-పూర్తిగా శ్రీమతంపై నడవాలి. మేము ఈ సేవనే చేస్తున్నాము. ఈశ్వరీయ మతముపై నడిచినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి శ్రీమతము ఏమిటంటే - నన్నొక్కరినే స్మృతి చేయండి. సృష్టి చక్రం గురించి వారు ఏదైతే అర్థం చేయిస్తారో, అది కూడా వారి మతమే. మీరు కూడా పవిత్రముగా అయ్యి తండ్రిని స్మృతి చేసినట్లయితే, నాతో పాటు తీసుకువెళ్తాను అని తండ్రి అంటారు. బాబా అనంతమైన ఆత్మిక మార్గదర్శకుడు కూడా. ఓ పతిత-పావనా, మమ్మల్ని పావనంగా చేసి ఈ పతిత ప్రపంచం నుండి తీసుకువెళ్ళండి అని వారిని పిలుస్తారు. వారు దైహిక మార్గదర్శకులు, వీరు ఆత్మిక మార్గదర్శకుడు. శివబాబా మనల్ని చదివిస్తారు. తండ్రి పిల్లలైన మీకు కూడా చెప్తారు - నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇందులో స్వయాన్ని అలసిపోయేలా చేసుకునే అవసరం కూడా లేదు. బాబా గమనిస్తారు - అప్పుడప్పుడూ పిల్లలు ఉదయముదయమే వచ్చి కూర్చున్నప్పుడు వారు అలసిపోతూ ఉండవచ్చు. ఇదైతే సహజమైన మార్గము. హఠంతో కూర్చోకూడదు, చుట్టూ తిరగండి, అటూ-ఇటూ తిరగండి, ఎంతో అభిరుచితో తండ్రిని స్మృతి చేయండి. లోలోపల బాబా-బాబా అని ఎంతో ఉత్సాహం కలగాలి. ఎవరైతే ప్రతి క్షణం తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో, వారికే ఉత్సాహం కలుగుతుంది. ఇతర విషయాలేవైతే బుద్ధిలో గుర్తున్నాయో, వాటిని తొలగించాలి. తండ్రిపై అత్యంత ప్రేమ ఉండాలి, ఆ అతీంద్రియ సుఖము అనుభవమవుతూ ఉండాలి. మీరు ఎప్పుడైతే తండ్రి స్మృతిలో నిమగ్నమవుతారో, అప్పుడే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. అప్పుడిక మీ సంతోషానికి అవధులు ఉండవు. ఈ విషయాలన్నింటి గురించి వర్ణన ఇక్కడే జరుగుతుంది, అందుకే - అతీంద్రియ సుఖము గురించి గోప-గోపికలను, ఎవరినైతే భగవంతుడైన తండ్రి చదివిస్తారో, వారినే అడగండి అన్న గాయనము కూడా ఉంది.

భగవానువాచ - నన్ను స్మృతి చేయండి. తండ్రి యొక్క మహిమనే తెలియజేయాలి. సద్గతి యొక్క వారసత్వము ఒక్క తండ్రి నుండే లభిస్తుంది. అందరికీ సద్గతి తప్పకుండా లభిస్తుంది. మొదట అందరూ శాంతిధామానికి వెళ్తారు. తండ్రి మనకు సద్గతిని ఇస్తున్నారు అన్నది బుద్ధిలో ఉండాలి. శాంతిధామము, సుఖధామము అని దేనిని అంటారో అర్థం చేయించడం జరిగింది. శాంతిధామంలో ఆత్మలన్నీ ఉంటాయి. అది స్వీట్ హోమ్, సైలెన్స్ హోమ్, టవర్ ఆఫ్ సైలెన్స్. దానిని ఈ కళ్ళతో ఎవ్వరూ చూడలేరు. ఇక్కడ ఈ కళ్ళతో ఏ వస్తువులనైతే చూస్తారో, వాటి వైపుకే ఆ సైన్స్ వారి యొక్క బుద్ధి వెళ్తుంది. ఆత్మలనైతే ఈ కళ్ళ ద్వారా ఎవ్వరూ చూడలేరు, అర్థం చేసుకోగలుగుతారు. ఆత్మనే చూడలేనప్పడు, తండ్రిని ఎలా చూడగలరు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. ఈ కళ్ళతో చూడడం జరగదు. భగవానువాచ - నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమవుతాయి. ఇలా ఎవరు అన్నారు అన్నదానిని పూర్తిగా అర్థం చేసుకోని కారణంగా శ్రీకృష్ణుని గురించి అనేస్తారు. శ్రీకృష్ణుడినైతే ఎంతగానో స్మృతి చేస్తారు. రోజు-రోజుకూ వ్యభిచారిగా అవుతూ ఉంటారు. భక్తిలో కూడా మొదట ఒక్క శివుడి భక్తినే చేస్తారు. అది అవ్యభిచారీ భక్తి, ఆ తర్వాత లక్ష్మీ-నారాయణుల భక్తి... ఉన్నతోన్నతమైనవారైతే భగవంతుడే. ఈ విధంగా వారే విష్ణువుగా అయ్యేందుకు వారసత్వాన్ని ఇస్తారు. మీరు శివ వంశీయులుగా అయి మళ్ళీ విష్ణుపురికి యజమానులుగా అవుతారు. మొదటి పాఠాన్ని ఎప్పుడైతే బాగా చదువుకుంటారో, అప్పుడే మాల తయారవుతుంది. తండ్రిని స్మృతి చేయడం అంత సులువైన విషయమేమీ కాదు. మనస్సు, బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించి ఒక్కరిపైనే జోడించాలి. ఈ కళ్ళ ద్వారా ఏవైతే చూస్తారో, వాటిపై నుండి బుద్ధి యోగాన్ని తొలగించండి.

తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇందులో తికమకపడకండి. తండ్రి ఈ రథములో కూర్చొని ఉన్నారు, వారు నిరాకారుడు అని వారి మహిమనే చేస్తారు. మీరు మన్మనాభవగా అయి ఉండండి అని వీరి ద్వారా మీకు ఘడియ-ఘడియ స్మృతిని ఇప్పిస్తారు. అనగా మీరు అందరికీ ఉపకారం చేసినట్లవుతుంది. మీరు భోజనం తయారుచేసేవారికి కూడా - శివబాబాను స్మృతి చేస్తూ భోజనాన్ని తయారుచేసినట్లయితే తినేవారి బుద్ధి శుద్ధమవుతుంది అని చెప్తారు. ఒకరికొకరు స్మృతిని ఇప్పించుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో స్మృతి చేస్తూ ఉంటారు. కొందరు అర్ధగంట కూర్చుంటారు, కొందరు 10 నిమిషాలు కూర్చుంటారు. అచ్ఛా, కనీసం 5 నిమిషాలైనా ప్రేమగా తండ్రిని స్మృతి చేసినట్లయితే రాజధానిలోకి వచ్చేస్తారు. రాజు-రాణీ సదా అందరినీ ప్రేమిస్తారు. మీరు కూడా ప్రేమ సాగరులుగా అవుతారు, అందుకే అందరిపై ప్రేమ ఉంటుంది. అంతా ప్రేమయే ప్రేమ ఉంటుంది. తండ్రి ప్రేమసాగరుడు, కావున పిల్లలకు కూడా తప్పకుండా అటువంటి ప్రేమ ఉంటుంది. అప్పుడు అక్కడ కూడా ఇటువంటి ప్రేమ ఉంటుంది. రాజు-రాణికి కూడా ఎంతో ప్రేమ ఉంటుంది. పిల్లలకు కూడా ఎంతో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కూడా అనంతమైనది. ఇక్కడైతే ప్రేమ అన్న మాటే లేదు, దెబ్బలే ఉన్నాయి. అక్కడ ఈ కామ వికారపు హింస కూడా ఉండదు, అందుకే భారత్ యొక్క మహిమ అపారమైనదిగా గాయనం చేయబడింది. భారత్ వంటి పవిత్రమైన దేశం ఇంకేదీ లేదు. ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానము. తండ్రి ఇక్కడకు (భారత్ లోకి) వచ్చి అందరి సేవను చేస్తారు, అందరినీ చదివిస్తారు. ముఖ్యమైనది చదువు. మీరు భారత్ కు ఏ సేవను చేస్తున్నారు అని మిమ్మల్ని కొందరు అడుగుతారు. అప్పుడు ఇలా చెప్పండి - మీరు భారత్ పావనముగా అవ్వాలని కోరుకుంటున్నారు, కానీ ఇప్పుడు పతితముగా ఉంది కదా కావున మేము శ్రీమతముపై భారత్ ను పావనముగా చేస్తున్నాము. తండ్రిని స్మృతి చేసినట్లయితే పతితము నుండి పావనముగా అవుతారు అని అందరికీ చెప్తాము. మేము ఈ ఆత్మిక సేవను చేస్తున్నాము. భారత్ ఏదైతే శిరోకిరీటముగా ఉండేదో, సుఖశాంతులైతే ఉండేవో, వాటిని మళ్ళీ శ్రీమతముపై కల్పపూర్వము వలె డ్రామా ప్లాన్ అనుసారంగా తయారుచేస్తున్నాము అని చెప్పండి. ఈ పదాలను పూర్తిగా గుర్తుంచుకోండి. విశ్వంలో శాంతి ఏర్పడాలని మనుష్యులు కోరుకుంటారు. అది మేము చేస్తున్నాము. భగవానువాచ, తండ్రి పిల్లలైన మాకు అర్థం చేయిస్తూ ఉంటారు - తండ్రినైన నన్ను స్మృతి చేయండి. మీరు బాబాను అంతగా స్మృతి చేయడం లేదని కూడా బాబాకు తెలుసు, ఇందులోనే శ్రమ ఉంది. స్మృతి ద్వారానే మీ కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. మీరు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి, దీని అర్థము కూడా ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. శాస్త్రాలలోనైతే ఎన్ని విషయాలను వ్రాసేసారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీరు ఏవైతే చదువుకున్నారో వాటన్నింటినీ మర్చిపోవాలి, స్వయాన్ని ఆత్మగా భావించాలి. అదే మీతో పాటు వస్తుంది, ఇంకేదీ రాదు. ఇది తండ్రి యొక్క చదువు, ఇది మీతో పాటు వస్తుంది. దాని కోసమే ప్రయత్నిస్తున్నారు.

చిన్న-చిన్న పిల్లలను కూడా తక్కువగా అనుకోకండి. ఎంత చిన్నగా ఉంటే, అంతగా పేరును ప్రఖ్యాతం చేయగలుగుతారు. చిన్న-చిన్న కుమార్తెలు కూర్చొని పెద్ద-పెద్ద వృద్ధులకు అర్థం చేయించినట్లయితే అద్భుతం చేసి చూపిస్తారు. వారిని కూడా తమ సమానంగా తయారుచేయాలి. ఎవరైనా ప్రశ్న అడిగితే, వారు జవాబు చెప్పగలిగే విధంగా వారిని తయారుచేయండి. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే సెంటర్లు ఉంటాయో లేక మ్యూజియంలు ఉంటాయో, అక్కడకు వారిని పంపించండి. అటువంటి గ్రూప్ ను తయారుచేయండి. దానికి సమయం ఇదే. ఈ విధంగా సేవ చేయండి. పెద్ద వృద్ధులకు కూడా చిన్న కుమార్తెలు కూర్చొని అర్థం చేయిస్తే, అదీ అద్భుతమే. మీరు ఎవరి పిల్లలు అని ఎవరైనా అడిగితే, చెప్పండి - మేము శివబాబా పిల్లలము. వారు నిరాకారుడు. బ్రహ్మా తనువులోకి వచ్చి మమ్మల్ని చదివిస్తారు. ఈ చదువు ద్వారానే మనము ఈ విధంగా లక్ష్మీ-నారాయణులుగా అవ్వాలి. సత్యయుగ ఆదిలో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది కదా. వారిని ఈ విధంగా ఎవరు తయారుచేసారు? తప్పకుండా వారు అటువంటి కర్మలను చేసి ఉంటారు కదా. తండ్రి కూర్చొని కర్మ, అకర్మ, వికర్మల గతులను వినిపిస్తారు. శివబాబా మనల్ని చదివిస్తున్నారు. వారే తండ్రి, టీచర్, గురువు. కావున ముఖ్యంగా ఈ ఒక్క విషయం గురించే నిలబడి వారికి అర్థం చేయించాలి. మొట్టమొదట అల్ఫ్, అల్ఫ్ ను అర్థం చేసుకుంటే, ఇక ఇన్ని ప్రశ్నలు మొదలైనవేవీ అడగరు. అల్ఫ్ ను అర్థం చేసుకోకుండా మీరు మిగిలిన చిత్రాల గురించి అర్థం చేయించినట్లయితే బుర్ర పాడు చేస్తారు. మొదటి విషయం అల్ఫ్ కు సంబంధించినది. మనం శ్రీమతముపై నడుస్తాము. ఈ విధంగా అనేవారు కూడా వెలువడతారు - మేము అల్ఫ్ ను అర్థం చేసుకున్నాము, ఇక ఈ చిత్రాలు మొదలైనవి చూడవలసిన అవసరమేముంది? అల్లాను తెలుసుకోవడంతో మేము సర్వస్వమునూ అర్థం చేసుకున్నాము. భిక్ష లభించగానే ఇక వెళ్ళిపోతారు, మీరు ఫస్ట్ క్లాస్ భిక్షను ఇస్తారు. తండ్రి పరిచయాన్ని ఇచ్చినట్లయితే, తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసేందుకు లోలోపల బాబా-బాబా అన్న ఉత్సాహం ఉప్పొంగుతూ ఉండాలి. హఠముతో కాదు, అభిరుచితో తండ్రిని నడుస్తూ-తిరుగుతూ స్మృతి చేయండి. బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించి ఒక్కరితో జోడించండి.

2. ఏ విధంగా తండ్రి ప్రేమ సాగరుడో, అదే విధంగా తండ్రి సమానంగా ప్రేమ సాగరులుగా అవ్వాలి. అందరికీ ఉపకారము చేయాలి. తండ్రి స్మృతిలో ఉండాలి మరియు అందరికీ తండ్రి స్మృతిని కలిగించాలి.

వరదానము:-

శాంతి శక్తి యొక్క సాధనాల ద్వారా విశ్వాన్ని శాంతిగా చేసే ఆత్మిక శస్త్రధారీ భవ

శాంతి శక్తి యొక్క సాధనము శుభ సంకల్పాలు, శుభ భావన మరియు నయనాల భాష. ఏ విధంగా నోటి యొక్క భాష ద్వారా తండ్రి మరియు రచనల పరిచయాన్ని ఇస్తారో, అదే విధంగా శాంతి శక్తి ఆధారముతో, నయనాల భాష ద్వారా నయనాలతో తండ్రి యొక్క అనుభవాన్ని చేయించగలరు. స్థూలమైన సేవా సాధనాల కన్నా ఎక్కువగా సైలెన్సు శక్తి అత్యంత శ్రేష్ఠమైనది. ఆత్మిక సైన్యం యొక్క విశేషమైన శస్త్రము ఇదే - ఈ శస్త్రము ద్వారా అశాంతమయమైన విశ్వాన్ని శాంతిగా చేయగలరు.

స్లోగన్:-

నిర్విఘ్నంగా ఉండటము మరియు నిర్విఘ్నంగా చెయ్యటము - ఇదే సత్యమైన సేవకు ఋజువు.