13-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మొత్తము ప్రపంచములో నుండి వికారాల అగ్నిని ఆర్పి వేసి, అందరినీ శీతలముగా తయారుచేయడానికి తండ్రి వచ్చారు, జ్ఞాన వర్షము శీతలముగా చేస్తుంది’’

ప్రశ్న:-
ఏ అగ్ని మొత్తము ప్రపంచాన్ని కాల్చివేస్తూ ఉంది?

జవాబు:-
కామ వికారము యొక్క అగ్ని మొత్తము ప్రపంచాన్ని కాల్చివేస్తూ ఉంది. అందరూ కామాగ్నిలో కాలిపోయి నల్లగా అయిపోయారు. తండ్రి జ్ఞాన వర్షముతో వారిని శీతలముగా చేస్తారు. ఎలాగైతే వర్షము కురవడముతో ధరణి శీతలముగా అవుతుందో, అలా ఈ జ్ఞాన వర్షముతో మీరు 21 జన్మలకు శీతలముగా అయిపోతారు. ఏ రకమైన అగ్ని ఉండదు. తత్వాలు కూడా సతోప్రధానముగా అయిపోతాయి, ఇక ఎవరూ అగ్నిలో కాలిపోరు.

ఓంశాంతి
ఆత్మిక పిల్లలు ఎవరి స్మృతిలో కూర్చున్నారు? తప్పకుండా తమ ఆత్మిక తండ్రి స్మృతిలో కూర్చున్నారు. ఆత్మిక తండ్రి వచ్చి మమ్మల్ని రిఫ్రెష్ చేసి శీతలముగా తయారుచేస్తారని, ఆత్మ తన పరమపిత పరమాత్ముని స్మృతిలో కూర్చుంది ఎందుకంటే కామ చితిపై కూర్చుని భారత్ పూర్తిగా కాలిపోయింది. అగ్నిని చల్లార్చండి అని పాడుతారు కూడా. ఏ అగ్ని? కామ చితి యొక్క అగ్ని. చాలా ఎక్కువ వేడి ఉంటే మనుష్యులు చనిపోతారు. ఈ కామ చితి యొక్క అగ్నిలో భారత్ పూర్తిగా కాలిపోయింది, అందుకే, మీరు వచ్చి శీతలముగా చేయండి అని తండ్రిని స్మృతి చేస్తారు. వర్షము కురిస్తే శీతలముగా అవుతుంది, ధరణి శీతలమైపోతుంది. ఇది జ్ఞాన వర్షము. తండ్రి ఒక్క సారే వచ్చి ఎంతో శీతలముగా చేస్తారు. వారు ఎంతగా ఇస్తారంటే, ఇక సత్యయుగములో ఏ వస్తువు కోసం ఉత్సుకత ఉండదు. అర్ధకల్పము బట్టి బాగా ఎదురుచూస్తూ వచ్చారు - బాబా, మీరు వచ్చి శీతలముగా చేయండి, పతిత-పావనుడైన తండ్రి, మీరు వచ్చి మమ్మల్ని శీతలముగా చేయండి అని అనేవారు. ఈ జ్ఞాన వర్షముతో భారత్ మరియు మొత్తము ప్రపంచమంతా శీతలముగా అయిపోతుంది. మీరు స్వర్గానికి యజమానులుగా అయిపోతారు. మనుష్యులు మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారని అంటారు. ఇలా అంటూ వారు కేవలం నోటిని తీపి చేసుకుంటారు. స్వర్గ స్థాపన ఇప్పుడు జరుగుతోందని మీకు తెలుసు. బాబా వచ్చి ఉన్నారు, ఈ జ్ఞాన వర్షాన్ని కురిపిస్తున్నారు. శీతలత యొక్క ప్రభావము 21 జన్మలు ఉంటుంది. అక్కడ వర్షము కోసమైనా లేదా మరే వస్తువు కోసమైనా కోరిక ఉండదు. సదా వసంతమే ఉంటుంది. అక్కడ ఏ రకమైన దుఃఖము ఉండదు. సూర్యుడు కూడా సతోప్రధానముగా అయిపోతాడు, ఎప్పుడూ మండే వేడిని చూపించడు. మీరు మొత్తము విశ్వానికి యజమానులుగా అయిపోతారు. ఇప్పుడైతే బానిసలుగా ఉన్నారు కదా. నేను బానిసను, నేను మీ బానిసను... అని పాడుతారు, తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - మీ సేవ చేయడానికి నేను మీకు సేవకునిగా అయి వచ్చాను, పిల్లలైన మీకు సేవ చేస్తాను. పరాయి పతిత దేశములోకి, పతిత శరీరములోకి నేను వస్తాను. ఈ పతిత ప్రపంచములో పావనమైనవారు ఒక్కరు కూడా ఉండరు. సత్యయుగాన్ని పావనమని, కలియుగాన్ని పతితమని అంటారు ఎందుకంటే అందరూ వికారులుగా ఉన్నారు. భారతవాసులే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో, వారే ఈ జ్ఞానాన్ని వింటారు లేదా ఎవరైతే సత్య, త్రేతాయుగాలలోకి వచ్చేవారు ఉంటారో, వారే వచ్చి, నంబరువారు పురుషార్థానుసారముగా బ్రాహ్మణులుగా అవుతారు. తండ్రి అర్థం చేయించారు, ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణములో ఉన్నారు, తర్వాత మీరే దేవతా వర్ణములోకి వస్తారు. బ్రాహ్మణ వర్ణాన్ని అనగా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేయడానికి తండ్రి వస్తారు. బ్రహ్మా, బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. (బ్రహ్మా లేకుండా) కేవలం పరమపిత పరమాత్మ వచ్చి, శూద్రులను బ్రాహ్మణులుగా చేస్తారని అనరు. ఇక్కడ మీ పిల్లిమొగ్గలాట నడుస్తుంది. ఇది చాలా సహజము. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది మీకు తెలుసు. విరాట రూపములో పిలక స్థానములో ఉండే బ్రాహ్మణులను మరియు శివబాబాను చూపించడము మర్చిపోయారు. దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు... అని అంటారు, మళ్ళీ శూద్రుల నుండి దేవతలుగా అవుతారు. ఇప్పుడు బ్రాహ్మణులు ఏమయ్యారు? బ్రాహ్మణ దేవతాయ నమః అని బ్రాహ్మణులు పాడుతారు కూడా. మరి ఆ సమయములో ప్రజాపిత బ్రహ్మా వంశావళి ఏమైనట్లు? ప్రజాపిత బ్రహ్మా పేరు ఎంత ప్రసిద్ధమైనది. చిత్రాలలో కూడా ఎన్ని పొరపాట్లు చేసేసారు. ప్రజాపిత బ్రహ్మా సంతానానికి సంబంధించిన విషయాలేవీ లేవు. స్కూలులో టీచరు చదివిస్తారు. అది సంపాదనకు ఆధారము. లక్ష్యము-ఉద్దేశ్యమైతే తప్పకుండా ఉండాలి. ఆ చదువుతోనే పదవి లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. పతిత ప్రపంచములోకి భగవంతుడు వచ్చి పతితులను చదివిస్తారు. తండ్రి అంటారు - నేను పిల్లలైన మిమ్మల్ని చదివించి పావనముగా చేస్తాను. ఈ చదువుతో ఎంత భారీ సంపాదన ఉంటుందో చూడండి. అర్ధకల్పము కోసం మీరు భాగ్యాన్ని తయారుచేసుకుంటారు. భారత్ లో 21 తరాలు అని గాయనము చేయబడింది, ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి 21 తరాల కోసం అనంతమైన వారసత్వాన్ని పొందుతారు. లౌకిక తండ్రి ఇచ్చేది అల్పకాలిక క్షణ భంగుర వారసత్వము. ఈ తండ్రి నుండి మీరు ఎలాంటి వారసత్వాన్ని పొందుతారంటే, ఇక తరతరాలకు మీకు దుఃఖము ఉండదు. భారత్ లోనే అనంతమైన సుఖముండేది. ఈ జ్ఞానము ఇంకెవరి బుద్ధిలోనూ లేదు. ఈ జ్ఞానాన్ని ఇచ్చే తండ్రికే తెలుసు మరియు ఎవరికైతే ఇస్తారో వారికి తెలుసు, ఇంకెవరికీ దీని గురించి తెలియదు. గ్రంథ్ లో కూడా ఏక్ ఓంకార్... నిరాకార్, నిరహంకార్ అని వారి మహిమ గాయనము చేయబడింది. దీని అర్థం కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారు కేవలం నిరహంకారి అని పాడుతారు. ఇంత గొప్ప అథారిటీ అయి ఉండి కూడా, వారికెలాంటి అహంకారము లేదు. ఇక్కడ కొద్దిగా పొజిషన్ లో ఉన్నా సరే, వారికి ఎంత నషా ఉంటుంది. నేను ఫలానా... అని వారికి అల్పకాలిక పదవి యొక్క నషా ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ ఆత్మిక చదువు యొక్క నషా ఉంది. ఆత్మాభిమానులుగా అవ్వాలి, అప్పుడే తండ్రిని స్మృతి చేయగలరు అని ఆత్మలైన మీకిప్పుడు తెలుసు. తండ్రితో యోగము తెగిపోవడము వలన మాయ బుల్లెట్ తగులుతుంది, అప్పుడు వాడిపోతారు. స్మృతి చేస్తూ ఉన్నట్లయితే సంతోషపు పాదరసం ఎక్కి ఉంటుంది. ఎవరైనా పెద్ద పరీక్షలో పాస్ అయితే సంతోషము కలుగుతుంది, ఇక ఇంతకన్నా పెద్ద చదువేదీ లేదు అనుకుంటారు. మన ఈ చదువుకన్నా ఉన్నతమైన చదువేదీ లేదని మీకు కూడా తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణులు గతంలో తప్పకుండా ఈ చదువును చదువుకున్నారు, రాజయోగాన్ని నేర్చుకున్నారు, అందుకే మహారాజా-మహారాణిగా అయ్యారు. రాజయోగము ప్రసిద్ధమైనది. పరమపిత పరమాత్మ వచ్చి స్వర్గము కోసం రాజయోగాన్ని నేర్పిస్తారు. గతంలో అటువంటి కర్మలు చేసారు కావుననే అలా తయారయ్యారని చెప్పుకుంటారు కూడా.

ఈ జన్మలో మనము ఎటువంటి కర్మలను నేర్చుకుంటామంటే, ఇక భవిష్యత్తులో 21 జన్మలు రాజ్యము చేస్తామని మరియు స్వర్గములో విరాజమానమై ఉంటామని మీకు తెలుసు. యథా రాజా రాణి, తథా ప్రజా కూడా ఉంటారు కదా. ఇది రాజధాని కదా. రాజధాని స్థాపన చేయడానికి తండ్రి వచ్చారు. తర్వాత మీరు వెళ్ళి 21 జన్మలు పాలన చేస్తారు. 63 జన్మలైతే దుఃఖము అనుభవించారు. అదంతా సమాప్తమైపోతుంది. భారత్ ను స్వర్గమని అంటారు, ఇప్పుడు నరకముగా ఉంది. సృష్టి ఎంతగా మారిపోయింది. ఆ రాజ్యము ఎక్కడికి వెళ్ళిపోయింది? రావణ రాజ్యము ప్రారంభమవ్వడముతో, మీరు మళ్ళీ పతితముగా అయిపోతారు. తండ్రి అంటారు, మీకు మీ 84 జన్మల చక్రము గురించి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు పదే-పదే అర్థం చేయించడము జరుగుతుంది. మీరు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసారు. ఇప్పుడిది మీ అంతిమ జన్మ. ఇప్పుడు మళ్ళీ మీ వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు ముక్తిధామములో కూర్చుండిపోకూడదు. మీది ఆల్రౌండ్ పాత్ర. సత్యయుగము నుండి మొదలుకుని ద్వాపర, కలియుగాల వరకు కూడా, ముక్తిధామములోనే ఉండేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడకు రావడము కన్నా ముక్తిధామమే మంచిదని అనరు. అలా ఉంటే దోమల వలె ఉన్నట్లు. వస్తారు మరియు వెళ్ళిపోతారు. మనుష్యుల మహిమ గాయనము చేయబడుతుంది. ఈ మందిరాలు ఎవరివి? ఎవరైతే ప్రారంభము నుండి పాత్రను అభినయిస్తూ వచ్చారో, వారి స్మృతిచిహ్నాలే తయారవుతూ వచ్చాయి. ఎవరైతే చివరిలో వస్తారో, వారి స్మృతిచిహ్నాలు ఉన్నాయా? ఏమీ లేవు. మీవి ఎంత గొప్ప స్మృతిచిహ్నాలు ఉన్నాయి. అందరికన్నా ఎక్కువగా మీరు పాత్రను అభినయిస్తారు. మీరు మీ ప్రారబ్ధ సమయాన్ని పూర్తి చేసుకుని భక్తి మార్గములోకి వచ్చినప్పుడు, మీ స్మృతిచిహ్నాలు మరియు శివబాబా మందిరాలు మళ్ళీ తయారవ్వడము ప్రారంభమవుతాయి, ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి, వారి ధర్మ స్థాపన జరుగుతుంది. మీకు మీ చరిత్ర-భౌగోళికాల గురించి కూడా తెలుసు మరియు అన్ని ధర్మాల వారి గురించి కూడా తెలుసు. ఇవి 84 జన్మల మెట్లు. ముందు మనము స్వర్గములోకి వస్తాము, ఆ తర్వాత ఏ విధముగా దిగిపోతాము అనేది మీ బుద్ధిలో ఉంది. ప్రతి జన్మలోనూ రకరకాల నామ-రూపాలు కల మిత్ర-సంబంధీకులు మొదలైనవారు లభించారు. డ్రామాలో మీ ఈ పాత్ర అంతా ముందే నిశ్చితమై ఉంది. ఇది అనంతమైన డ్రామా, ఇది యథావిధిగా రిపీట్ అవుతుంది. మనమే దేవీ-దేవతలుగా ఉండేవారమని, 84 జన్మలు తీసుకుని శూద్రులుగా అయ్యామని మీకు తెలుసు. మళ్ళీ మనమే దేవీ-దేవతలుగా అవుతాము. మనుష్యులు, ఆత్మనే పరమాత్మ అని అంటారు. వాస్తవానికి హమ్ సో అంటే అర్థం దేవతలు కాల చక్రములో తిరగడం. వారు ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని అంటారు. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా. మీకు ఇప్పుడు ఈ విషయాలన్నింటి గురించి తెలుసు. మీరు ఇప్పుడు పాండవులుగా అయ్యారు. కౌరవులు-పాండవులు పరస్పరం సోదరులుగా ఉండేవారు కదా. ఇప్పుడు తండ్రి లభించారు కనుక మీరు కౌరవుల నుండి పాండవులుగా అయ్యారు. తండ్రి మిమ్మల్ని దుఃఖము నుండి విముక్తులుగా చేసి, గైడ్ గా అయి తీసుకువెళ్తారు. ఇంటి గురించైతే ఎవరికీ తెలియదు. ఆత్మ బ్రహ్మతత్వములో లీనమైపోతుందని వారంటారు. అటువంటప్పుడు అది ఇల్లు అవ్వదు కదా. ఇల్లు అంటే అందులో నివసించడము జరుగుతుంది. దానిని నిరాకారీ ప్రపంచమని అంటారు. నిరాకారీ ఆత్మలమైన మనము నిరాకారీ ప్రపంచములో, బిందువుల వలె నివసిస్తామని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. అక్కడ కూడా నిరాకారీ వృక్షము ఉంది. ఈ డ్రామా తయారై ఉంది. బీజము మరియు వృక్షము గురించి తెలుసుకోవాలి. దీని పేరే వెరైటీ ధర్మాల వృక్షము, ఇది మనుష్య సృష్టి. దీని బీజరూపుడు తండ్రి, ఇందులో ఎన్ని వెరైటీలు ఉన్నాయి. ప్రతి ధర్మమువారి ముఖ కవళికలు వేర్వేరుగా ఉంటాయి, ఇక్కడ కూడా ఒకరి ముఖ కవళికలు మరొకరితో కలవవు. డ్రామా ఇలా తయారై ఉంది. కల్పవృక్షము యొక్క ఆయువు 5 వేల సంవత్సరాలని తండ్రియే అర్థం చేయిస్తారు. మనుష్యులు పాత్రధారులు, పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తారు. ఇది రంగస్థలం, ప్రకాశాన్ని ఇచ్చేందుకు సూర్య-చంద్రులు మొదలైనవి ఉన్నాయి. ఇవి దేవతలేమీ కాదు, ఇవి దీపాలు. కానీ అవి సేవ చేస్తాయి కావున దేవతలని అంటారు. వాస్తవానికి దేవతలు ఏమీ సేవ చేయరు, సేవనైతే పిల్లలైన మీరు చేస్తారు. తండ్రి విధేయత గల సేవకుడు. పిల్లలు దుఃఖితులైనప్పుడు తండ్రికి దయ కలుగుతుంది. తండ్రి అర్థం చేయించేందుకు వచ్చారు. పిల్లలైన మీకు మళ్ళీ దేవీ-దేవతా పదవిని ప్రాప్తి చేయించేందుకు నేను వస్తాను. ప్రతి వస్తువుకు ఎక్కే కళ, దిగే కళ ఉంటాయి. పాత ప్రపంచాన్ని తమోప్రధానమని, కొత్త ప్రపంచాన్ని సతోప్రధానమని అంటారు. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా అవుతుంది. ఈ శరీరము కూడా తమోప్రధానముగా, పతితముగా ఉందని ఆత్మ అంటుంది. సత్యయుగములో ఆత్మ మరియు శరీరము సతోప్రధానముగా ఉండేవి. అక్కడ అవి ఇబ్బంది పెట్టవు. ఆత్మకు ఇప్పుడు జ్ఞానము లభించింది. మనము 84 జన్మలు తీసుకుంటామని స్మృతి కలిగింది. ఈ రహస్యాన్ని అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. దుఃఖములో తండ్రినే పిలుస్తూ ఉంటారు. దయ చూపించండి, ఓ దుఃఖహర్త-సుఖకర్త... అని పిలుస్తారు. భారత్ యే అన్నింటికన్నా సుఖమయముగా ఉండేది కదా. భారత్ వంటి పవిత్ర ఖండము ఇంకేదీ ఉండదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీ జోలిని అవినాశీ జ్ఞాన రత్నాలతో నింపుతారు. ఎప్పుడైనా ఇటువంటి తండ్రిని చూసారా? పిల్లలూ, నేను మీ కోసం వైకుంఠాన్ని కానుకగా తీసుకువచ్చానని అంటారు. మీరు స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు పతితముగా, నరకవాసులుగా అయిపోయారు. ఎవరైతే వికారాల్లోకి వెళ్ళరో, వారిని పావనులని అంటారు. సత్యయుగములో సంపూర్ణ నిర్వికారులు ఉంటారు. ఈ సమయములో సంపూర్ణ వికారులుగా ఉన్నారు. తండ్రి అంటారు - మీరు కూడా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, ఇప్పుడు సంపూర్ణ వికారులుగా అయ్యారు, తండ్రిని స్మృతి చేసి మళ్ళీ సంపూర్ణ నిర్వికారీ దేవతా పదవిని పొందాలి. మన్మనాభవ అనే పదము ఎంత బాగుందో చూడండి. తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే, మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు. నేను సర్వశక్తివంతుడిని కదా. నన్ను స్మృతి చేయండి. స్మృతినే యోగాగ్ని అని అంటారు, దీనితో మీ పాపాలు దగ్ధమవుతాయి. మీరు పవిత్రముగా అయిపోతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మిక చదువు యొక్క నషాలో ఉండాలి. తండ్రి సమానముగా నిరహంకారులుగా అవ్వాలి. పొజిషన్ మొదలైనవాటి అహంకారము ఉండనివ్వకూడదు.

2. తమ జోలిని జ్ఞాన రత్నాలతో నింపుకోవాలి. సంపూర్ణ నిర్వికారులుగా అయ్యి దేవతా పదవిని పొందాలి. ఎప్పుడూ కూడా వాడిపోకూడదు.

వరదానము:-
స్థూలముగా మరియు సూక్ష్మముగా, ఈ రెండు రకాలుగానూ స్వయాన్ని బిజీగా పెట్టుకునే మాయాజీత్, విజయీ భవ

స్వయాన్ని సేవాధారులుగా భావిస్తూ మీ అభిరుచి మరియు ఉల్లాసముతో సేవలో బిజీగా ఉన్నట్లయితే మాయకు అవకాశము లభించదు. ఎప్పుడైతే సంకల్పాలతో, బుద్ధితో మరియు స్థూల కర్మల నుండి ఫ్రీ గా ఉంటారో, అప్పుడు మాయ అవకాశము తీసుకుంటుంది. కానీ స్థూలముగా మరియు సూక్ష్మముగా, రెండు రకాలుగానూ సంతోషముగా సేవలో బిజీగా ఉన్నట్లయితే సంతోషము కారణముగా మాయ ఎదిరించేందుకు సాహసము చెయ్యలేదు, అందుకే స్వయమే టీచరుగా అయ్యి బుద్ధిని బిజీగా ఉంచుకునేందుకు డైలీ ప్రోగ్రామ్ ను తయారుచేసుకోండి, అప్పుడు మాయాజీతులుగా, విజయులుగా అయిపోతారు.

స్లోగన్:-
నిశ్చయము మరియు నషాతో ‘బాబా నాతోపాటు ఉన్నారు’ అని అనండి, అప్పుడు మాయ సమీపముగా రాలేదు.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

బాప్ దాదా పిల్లలందరి నడవడిక మరియు ముఖములో, మాటలు మరియు కర్మలలో సరళతను మరియు మధురతను చూడాలనుకుంటున్నారు. ఒకవేళ ఆవేశము లేక అలసట కారణముగా ఏ కొంచెమైనా మాటలు మధురముగా లేకపోతే, ముఖము మధురముగా లేకపోతే, సీరియస్ గా ఉంటే వారిని గుణ సంపన్నులు అని అనరు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ నా గుణము ఏదైతే ఉందో, ఆ గుణము ఇమర్జ్ అవ్వాలి. బాప్ దాదా ఎలా ఉంటారో, అవే గుణాలు, అదే కర్తవ్యము, అవే మాటలు, అవే సంకల్పాలు అనుభవమవ్వాలి, వీరు వారి లాగానే అనిపిస్తున్నారు అని అందరి నోటి నుండి వెలువడాలి.