ఓంశాంతి
ఇప్పుడు పిల్లలకు - మేము బాబా ఎదురుగా కూర్చున్నాము అనైతే తెలుసు. అలాగే బాబాకు కూడా
పిల్లలు నా ఎదురుగా కూర్చున్నారు అన్నది తెలుసు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు -
తండ్రి మాకు శిక్షణను ఇస్తున్నారు, దానిని మళ్ళీ ఇతరులకు ఇవ్వాలి. మొట్టమొదట అయితే
తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి ఎందుకంటే అందరూ తండ్రిని మరియు తండ్రి శిక్షణను
మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి ఏదైతే చదివిస్తారో, ఈ చదువు మళ్ళీ 5000 సంవత్సరాల
తర్వాత లభిస్తుంది. ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ లేదు. ముఖ్యమైనది తండ్రి పరిచయము, ఆ
తర్వాత వీటన్నింటినీ అర్థం చేయించాలి. మనమందరమూ సోదరులము. మొత్తం ప్రపంచములోని
ఆత్మలంతా ఎవరైతే ఉన్నారో, వారందరూ పరస్పరం సోదరులు. అందరూ తమకు లభించిన పాత్రను ఈ
శరీరము ద్వారా అభినయిస్తారు. ఇప్పుడైతే తండ్రి కొత్త ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకు
వచ్చారు, దానిని స్వర్గము అని అంటారు. కానీ ఇప్పుడు సోదరులమైన మనమందరమూ పతితులము,
పావనులు ఒక్కరు కూడా లేరు. పతితులందరినీ పావనంగా తయారుచేసేవారు ఒక్క తండ్రే. ఇది
ఉన్నదే పతిత వికారీ రావణ ప్రపంచము. రావణుడు అంటే అర్థమే - స్త్రీలోని ఐదు వికారాలు,
పురుషునిలోని ఐదు వికారాలు. తండ్రి చాలా సహజ రీతిలో అర్థం చేయిస్తారు. మీరు కూడా ఇలా
అర్థం చేయించవచ్చు. మొట్టమొదట ఇది అర్థం చేయించండి - ఆత్మలైన మనకు వారు తండ్రి,
మనమంతా సోదరులము. ఇది కరక్టేనా అని అడగండి. మరి మనమంతా సోదరులమని, మనందరికీ తండ్రి
కూడా ఒక్కరే అని వ్రాయమని చెప్పండి. ఆత్మలైన మనందరికీ వారు పరమ ఆత్మ. వారిని తండ్రి
అని అంటారు. ఈ విషయాన్ని పక్కాగా బుద్ధిలో కూర్చోబెట్టినట్లయితే సర్వవ్యాపి మొదలైన
చెత్త ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుంది. మొట్టమొదట అల్లా గురించి చదివించాలి.
మొట్టమొదట ఈ విషయాన్ని బాగా వ్రాయండి అని మీరు వారికి చెప్పండి - ఇంతకుముందు
సర్వవ్యాపి అని అనేవాడిని, ఇప్పుడు సర్వవ్యాపి కారు అని అర్థం చేసుకున్నాను అని.
మనమందరమూ సోదరులము. ఆత్మలందరూ గాడ్ ఫాదర్, పరమపిత పరమాత్మ, అల్లాహ్ అని అంటారు.
మొట్టమొదట ఈ నిశ్చయాన్ని కూర్చోబెట్టాలి - మనం ఒక ఆత్మ, అంతేకానీ పరమాత్మ కాము,
అలాగే మనలో పరమాత్మ వ్యాపించి లేరు, అందరిలోనూ ఆత్మ వ్యాపించి ఉంది, ఆత్మ శరీరము
ఆధారముతో పాత్రను అభినయిస్తుంది. ఈ విషయాన్ని పక్కా చేయించండి. అచ్ఛా, ఆ తర్వాత ఆ
తండ్రి సృష్టి చక్రము యొక్క ఆదిమధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రే టీచరు
రూపములో కూర్చుని అర్థం చేయిస్తారు. ఇది లక్షల సంవత్సరాల విషయము కాదు. ఈ చక్రము
అనాదిగా తయారై, తయారుచేయబడినది. ఇది ఏ విధంగా సమానముగా ఉంది అన్నది తెలుసుకోవలసి
ఉంటుంది. సత్య, త్రేతా యుగాలు గతించాయి, ఇది నోట్ చేసుకోండి, వాటిని స్వర్గము మరియు
సెమీ స్వర్గము అని అంటారు. అక్కడ దేవీ-దేవతల రాజ్యము నడుస్తుంది. సత్యయుగములో 16
కళలు, త్రేతాలో 14 కళలు ఉంటాయి. సత్యయుగ ప్రభావము చాలా భారీగా ఉంటుంది. దాని పేరే
స్వర్గము, హెవెన్. కొత్త ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు. దాని మహిమనే చేయాలి. కొత్త
ప్రపంచములో ఉన్నది ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే. నిశ్చయం కలిగించేందుకు మీ
వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. ఈ కల్పము యొక్క
ఆయువే 5000 సంవత్సరాలు. ఇప్పుడు సూర్యవంశీయులు, చంద్రవంశీయుల విషయమైతే బుద్ధిలో
కూర్చుంది. విష్ణుపురియే మారి సీతారామపురిగా అవుతుంది. వారి వంశావళి కూడా నడుస్తుంది
కదా. రెండు యుగాలు గతించిన తర్వాత ద్వాపరయుగము వస్తుంది. అది రావణ రాజ్యము. దేవతలు
వామ మార్గములోకి వెళ్ళిపోయేటప్పటికి వికారాల సిస్టమ్ తయారవుతుంది. సత్య,
త్రేతాయుగాలలో అందరూ నిర్వికారులుగా ఉంటారు. ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే
ఉంటుంది. చిత్రాలను కూడా చూపించాలి, అలాగే నోటి ద్వారా కూడా అర్థం చేయించాలి. తండ్రి
మనకు టీచరుగా అయి ఈ విధంగా చదివిస్తారు. తండ్రి తమ పరిచయాన్ని తాను స్వయమే వచ్చి
ఇస్తారు. నేను పతితులను పావనంగా తయారుచేయడానికి వస్తాను కావున నాకు శరీరము తప్పకుండా
కావాలి అని స్వయం అంటారు. లేదంటే నేను ఎలా మాట్లాడగలను. నేను చైతన్యమైనవాడిని,
సత్యమైనవాడిని మరియు అమరుడను. సతో, రజో, తమోలలోకి ఆత్మ వస్తుంది. ఆత్మయే పతితముగా,
ఆత్మయే పావనముగా అవుతుంది. ఆత్మలోనే అన్ని సంస్కారాలూ ఉన్నాయి. గత కర్మలను లేక
వికర్మల సంస్కారాలను ఆత్మయే తీసుకువస్తుంది. సత్యయుగములో వికర్మలు జరగవు. కర్మలు
చేస్తారు, పాత్రను అభినయిస్తారు, కానీ ఆ కర్మలు అకర్మలుగా అవుతాయి. గీతలో కూడా ఆ
పదాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా అర్థం చేసుకుంటున్నారు. పాత ప్రపంచాన్ని
మార్చి కొత్త ప్రపంచాన్ని తయారుచేయడానికి బాబా వచ్చారని మీకు తెలుసు, అక్కడ కర్మలు
అకర్మలుగా అవుతాయి. దానినే సత్యయుగము అని అంటారు మరియు ఇక్కడ ఈ కర్మలు వికర్మలుగానే
అవుతాయి, దీనిని కలియుగము అని అంటారు. మీరు ఇప్పుడు సంగమములో ఉన్నారు. బాబా రెండు
వైపుల విషయాలనూ వినిపిస్తారు. తండ్రి, టీచరు ఏమి అర్థం చేయించారు అని ఒక్కొక్క
విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అచ్ఛా, ఆ తర్వాతది గురువు కర్తవ్యము. వారిని
పిలవడమే మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారుచేయండి అని పిలిచారు. ఆత్మ
పావనముగా తయారైతే ఇక శరీరము కూడా పావనముగా తయారవుతుంది. బంగారము ఎలా ఉంటుందో, నగ
కూడా అలాగే తయారవుతుంది. 24 క్యారట్ల బంగారము తీసుకుని అందులో ఎటువంటి మాలిన్యము
కలపకపోతే దానితో నగ కూడా అలా సతోప్రధానముగా తయారవుతుంది. లోహము కలిపినట్లయితే మళ్ళీ
తమోప్రధానముగా తయారవుతుంది ఎందుకంటే మాలిన్యము కలుస్తుంది కదా. మొదట భారత్ 24
క్యారట్ల పక్కా బంగారు పిచ్చుకలా ఉండేది అనగా సతోప్రధానమైన కొత్త ప్రపంచము ఉండేది,
ఇప్పుడు మళ్ళీ తమోప్రధానముగా ఉంది. మొదట శుద్ధమైన బంగారము ఉండేది. కొత్త ప్రపంచము
పవిత్రముగా, పాత ప్రపంచము అపవిత్రముగా ఉంటుంది. మాలిన్యము కలుస్తూ ఉంటుంది. ఈ
విషయాన్ని తండ్రే అర్థం చేయిస్తారు. ఇంకే మనుష్యమాత్రులకు, గురువులకు ఇది తెలియదు.
మీరు వచ్చి పావనముగా తయారుచేయండి అని పిలుస్తారు. సద్గురువు పనేమిటంటే
వానప్రస్థావస్థలో మనుష్యులను గృహస్థము నుండి పక్కకు తీసుకురావడము. ఈ జ్ఞానమంతటినీ
డ్రామా ప్లాన్ అనుసారముగా తండ్రే వచ్చి ఇస్తారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు.
వారే మొత్తం వృక్షమంతటి జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. శివబాబా పేరు సదా శివ అనే
ఉంటుంది. మిగిలిన ఆత్మలందరూ పాత్రను అభినయించేందుకు వస్తారు కావున భిన్న-భిన్న
నామాలను ధరిస్తారు. తండ్రిని పిలుస్తారు కానీ వారు మిమ్మల్ని పావన ప్రపంచములోకి
తీసుకువెళ్ళేందుకు భాగ్యశాలి రథములోకి ఏ విధంగా వస్తారు అనేది తెలియదు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - ఎవరైతే అనేక జన్మల అంతిమములో ఉన్నారో, పూర్తి 84 జన్మలను
తీసుకుంటారో, నేను అతని తనువులోకి వస్తాను. రాజులకే రాజులుగా తయారుచేయడానికి ఈ
భాగ్యశాలి రథములోకి ప్రవేశించవలసి ఉంటుంది. మొదటి నంబరులో ఉన్నది శ్రీకృష్ణుడు. అతను
కొత్త ప్రపంచానికి అధిపతి. మళ్ళీ అతనే కిందకు దిగుతారు. సూర్యవంశీయులుగా,
చంద్రవంశీయులుగా, ఆ తర్వాత వైశ్య, శూద్ర వంశీయులుగా, ఆ తర్వాత బ్రహ్మా వంశీయులుగా
అవుతారు. బంగారము నుండి వెండి... మళ్ళీ మీరు ఇనుము నుండి బంగారముగా అవుతున్నారు.
తండ్రి అంటారు, మీ తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను ఎవరిలోకి అయితే
ప్రవేశించానో ఇతని ఆత్మలోనైతే కొద్దిగా కూడా ఈ జ్ఞానము లేదు. నేను ఇతనిలోకి
ప్రవేశిస్తాను, అందుకే ఇతడిని భాగ్యశాలి రథము అని అంటారు. నేను ఇతని అనేక జన్మల
అంతిమములో వస్తాను అని వారు స్వయము అంటారు. గీతలోని పదాలు ఏక్యురేట్ గా ఉన్నాయి.
గీతనే సర్వశాస్త్రమయి శిరోమణి అని అంటారు.
ఈ సంగమయుగములోనే తండ్రి వచ్చి బ్రాహ్మణ కులాన్ని మరియు దేవీ-దేవతా కులాన్ని
స్థాపన చేస్తారు. మిగిలిన వారందరి గురించైతే అందరికీ తెలుసు, ఇతని గురించి ఎవ్వరికీ
తెలియదు. అనేక జన్మల అంతిమములో అనగా సంగమయుగములోనే తండ్రి వస్తారు. తండ్రి అంటారు,
నేను బీజరూపుడను. శ్రీకృష్ణుడు సత్యయుగ నివాసి. అతడిని వేరే ఏ చోట చూడలేరు.
పునర్జన్మలలో అయితే నామ, రూప, దేశ, కాలాలన్నీ మారిపోతాయి. మొదట చిన్నపిల్లవాడు
సుందరముగా ఉంటాడు, మళ్ళీ పెద్దవుతాడు, ఆ తర్వాత ఆ శరీరాన్ని వదిలి ఇంకొక చిన్న
శరీరాన్ని తీసుకుంటాడు. ఇది తయారై, తయారుచేయబడిన నాటకము. ఇది డ్రామాలో ఫిక్స్ అయి
ఉంది. ఇంకొక శరీరములో ఉన్నప్పుడు అతడిని శ్రీకృష్ణుడు అని అనరు. ఇంకొక శరీరము
తీసుకున్నప్పుడు పేరు మొదలైనవి వేరే ఉంటాయి. సమయము, ముఖకవళికలు, తిథి, తారీఖు
మొదలైనవన్నీ మారిపోతాయి. ప్రపంచ చరిత్ర, భౌగోళికములు ఖచ్చితముగా అదే విధంగా రిపీట్
అవుతాయి అని అంటారు. కావున ఈ డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది. సతో, రజో, తమోలలోకి
రావలసిందే. సృష్టి పేరు, యుగము పేరు అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇది సంగమయుగము.
నేను సంగమములోనే వస్తాను. ఇది మనం లోలోపల పక్కా చేసుకోవాలి. తండ్రి మనకు తండ్రి,
టీచర్ మరియు గురువు, వారు సతోప్రధానులుగా అయ్యేందుకు చాలా మంచి యుక్తిని
తెలియజేస్తారు. దేహ సహితముగా దేహపు సర్వ ధర్మాలనూ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి
అని గీతలో కూడా ఉంది. తిరిగి మన ఇంటికి తప్పకుండా వెళ్ళాలి. భగవంతుని వద్దకు
వెళ్ళేందుకు భక్తి మార్గములో ఎంతగా కష్టపడతారు. అది ముక్తిధామము. కర్మలు నుండి
ముక్తులై మనం నిరాకారీ లోకములోకి వెళ్ళి కూర్చుంటాము. పాత్రధారి ఇంటికి వెళ్ళాడంటే
పాత్ర నుండి ముక్తుడైనట్లే. మేము ముక్తిని పొందాలి అని అందరూ కోరుకుంటారు కానీ
ముక్తి అయితే ఎవ్వరికీ లభించదు. ఈ డ్రామా అనాది, అవినాశీ అయినది. ఒకవేళ ఎవరైనా ఈ
పాత్రను అభినయించడం నాకు ఇష్టం లేదు అన్నా, ఇందులో ఎవరూ ఏమీ చేయలేరు. ఈ అనాది డ్రామా
రచింపబడి ఉంది. ఒక్కరు కూడా ముక్తిని పొందలేరు. అవన్నీ అనేక రకాల మనుష్య మతాలు. ఇది
శ్రేష్ఠముగా తయారుచేయడానికి శ్రీమతము. మనుష్యులను శ్రేష్ఠమైనవారు అని అనరు. దేవతలను
శ్రేష్ఠమైనవారు అని అంటారు. వారి ఎదురుగా అందరూ నమస్కరిస్తారంటే వారు
శ్రేష్ఠమైనవారైనట్లే కదా. కానీ ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. 84 జన్మలనైతే
తీసుకోవలసిందే అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణుడు దేవత, వైకుంఠానికి
యువరాజు, అతను ఇక్కడికి ఎలా వస్తారు. అలాగే అతను గీతను కూడా వినిపించలేదు. కేవలం
అతను దేవత మాత్రమే, అందుకే అందరూ అతడిని పూజిస్తున్నారు. దేవతలు పావనముగా ఉంటారు
కానీ పూజించేవారు స్వయం పతితులుగా ఉన్నారు. నిర్గుణుడినైన నాలో ఏ గుణమూ లేదు... మీరు
నన్ను ఇలా తయారుచేయండి అని అంటారు. శివుని ఎదురుగా వెళ్ళి ముక్తిని ఇవ్వండి అని
అంటారు. వారెప్పుడూ జీవన్ముక్తిలోకి, జీవనబంధనములోకి రానే రారు, అందుకే ముక్తిని
ఇవ్వండి అని వారిని పిలుస్తారు. జీవన్ముక్తిని కూడా వారే ఇస్తారు.
బాబా మరియు మమ్మాకు మనమందరమూ పిల్లలమని, వారి ద్వారా మనకు అపారమైన ధనము
లభిస్తుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనుష్యులైతే ఈ వివేకము లేని కారణముగా
అడుక్కుంటూ ఉంటారు. వివేకహీనులు తప్పకుండా దుఃఖితులుగానే ఉంటారు కదా. అపారమైన
దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ పిల్లలు బుద్ధిలో ఉంచుకోవాలి.
ఒక్క అనంతమైన తండ్రి గురించి తెలియని కారణముగా ఎంతగా పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు.
అనాథలుగా అయిపోయారు. వారు హద్దులోని అనాథలు, వీరు అనంతమైన అనాథలు. తండ్రి కొత్త
ప్రపంచాన్ని స్థాపిస్థారు. ఇప్పుడు ఇది పతిత ఆత్మల పతిత ప్రపంచము. పావన ప్రపంచము అని
సత్యయుగాన్ని అంటారు, పాత ప్రపంచము అని కలియుగాన్ని అంటారు. బుద్ధిలో ఈ విషయాలన్నీ
ఉన్నాయి కదా. పాత ప్రపంచపు వినాశనం జరుగుతుంది, ఇక కొత్త ప్రపంచములోకి ట్రాన్స్ఫర్
అయిపోతారు. ఇప్పుడు మనం తాత్కాలికముగా సంగమయుగములో నిలబడ్డాము. పాత ప్రపంచము నుండి
కొత్తగా తయారవుతుంది. కొత్త ప్రపంచము గురించి కూడా తెలుసు. మీ బుద్ధి ఇప్పుడు కొత్త
ప్రపంచములోకి వెళ్ళాలి. లేస్తూ, కూర్చుంటూ ఇదే బుద్ధిలో ఉండాలి - మేము ఈ చదువును
చదువుకుంటున్నాము అని. తండ్రి మనల్ని చదివిస్తారు. విద్యార్థులకు ఇది గుర్తుండాలి,
కానీ అది నంబరువారు పురుషార్థానుసారముగానే గుర్తుంటుంది. తండ్రి కూడా నంబరువారు
పురుషార్థానుసారముగానే ప్రియస్మృతులను ఇస్తారు. మంచిగా చదువుకునేవారిని టీచర్
తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు కదా. ఎంత తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు తండ్రి అయితే
అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు ధారణ చేయాలి. ఒక్క తండ్రి వైపుకు తప్ప ఇంకెటువైపుకూ
బుద్ధి వెళ్ళకూడదు. తండ్రిని స్మృతి చేయకపోతే పాపాలు ఎలా అంతమవుతాయి. మాయ ఘడియ,
ఘడియ మీ బుద్ధియోగాన్ని తెంచేస్తూ ఉంటుంది. మాయ చాలా మోసగిస్తుంది. బాబా ఉదాహరణ
ఇస్తారు, భక్తి మార్గములో నేను లక్ష్మిని ఎంతగానో పూజించేవాడిని, లక్ష్మీ కాళ్ళు
వత్తుతున్నట్లుగా చిత్రములో చూసినప్పుడు చిత్రములో వారిని దాని నుండి విముక్తి
చేసేసాను, వారి స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి అటూ, ఇటూ వెళ్తే - బుద్ధి వేరే
వైపుకు ఎందుకు వెళ్తుంది అని నన్ను నేను చెంపదెబ్బ వేసుకునేవాడిని. చివరికి
వినాశనాన్ని కూడా చూసాను, స్థాపనను కూడా చూసాను, సాక్షాత్కారపు ఆశ పూర్తయింది,
ఇప్పుడు ఇక ఈ కొత్త ప్రపంచము వస్తుంది, నేను ఇలా అవుతాను అని అర్థం చేసుకున్నాను.
ఇకపోతే ఈ పాత ప్రపంచమైతే వినాశనమైపోతుంది. పక్కా నిశ్చయము ఏర్పడింది. మన రాజధాని
యొక్క సాక్షాత్కారము కూడా జరిగింది, స్వర్గ రాజ్యము లభిస్తుంటే ఇక ఈ రావణ రాజ్యాన్ని
ఏం చేస్తాము, ఇది ఈశ్వరీయ బుద్ధి. ఈశ్వరుడు ప్రవేశించి ఈ బుద్ధిని నడిపారు. జ్ఞాన
కలశమైతే మాతలకు లభిస్తుంది, కావున మీరే కార్యవ్యవహారాలు సంభాళించండి, అందరికీ
నేర్పించండి అని మాతలకే అంతా ఇచ్చేసాము. నేర్పిస్తూ, నేర్పిస్తూ ఇక్కడి వరకూ
వచ్చేసారు. ఒకరికొకరు వినిపిస్తూ, వినిపిస్తూ ఇప్పుడు ఎంతమంది తయారయ్యారో చూడండి.
ఆత్మ పవిత్రముగా అవుతూ ఉంటుంది, అప్పుడు ఆత్మకు శరీరము కూడా పవిత్రమైనది కావాలి.
అర్థం చేసుకుంటారు కూడా, అయినా కానీ మాయ మరపింపజేస్తుంది.
మీరు 7 రోజులు చదవండి అని చెప్తే రేపు వస్తాము అని అంటారు. ఆ మరునాడు మాయ అంతం
చేసేస్తుంది, ఇక రానే రారు. భగవంతుడు చదివిస్తున్నప్పుడు మరి వచ్చి భగవంతుని ద్వారా
చదువుకోరా! తప్పకుండా వస్తాము అని అంటారు కూడా, కానీ మాయ ఎగరగొట్టేస్తుంది.
రెగ్యులర్ అవ్వనివ్వదు. ఎవరైతే కల్పపూర్వము పురుషార్థము చేసారో వారు తప్పకుండా
చేస్తారు, వేరే దుకాణమేదీ లేదు. మీరు ఎంతో పురుషార్థము చేస్తారు. పెద్ద-పెద్ద
మ్యూజియంలను తయారుచేస్తారు. ఎవరైతే కల్పపూర్వము అర్థం చేసుకున్నారో వారే అర్థం
చేసుకుంటారు. వినాశనము జరుగనున్నది. స్థాపన కూడా జరుగుతూ ఉంటుంది. ఆత్మ చదువుకుని
ఫస్ట్ క్లాస్ అయిన శరీరాన్ని తీసుకుంటుంది. లక్ష్యము, ఉద్దేశ్యము ఇదే కదా. మరి ఇది
ఎందుకు గుర్తు చేయకూడదు. ఇప్పుడు మనం మన పురుషార్థానుసారముగా కొత్త ప్రపంచములోకి
వెళ్తాము. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.