13-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు దుఃఖాన్ని సహనము చేయడములో చాలా
సమయాన్ని వ్యర్థము చేసారు, ఇప్పుడు ప్రపంచము మారుతోంది, మీరు తండ్రిని స్మృతి చేయండి,
సతోప్రధానముగా అవ్వండి, అప్పుడు సమయము సఫలమవుతుంది’’
ప్రశ్న:-
21
జన్మల కొరకు లాటరీని ప్రాప్తి చేసుకునేందుకు పురుషార్థము ఏమిటి?
జవాబు:-
21 జన్మల కొరకు
లాటరీని తీసుకోవాలంటే మోహజీతులుగా అవ్వండి. ఒక్క తండ్రిపై పూర్తిగా బలిహారమవ్వండి.
ఇప్పుడు ఈ పాత ప్రపంచము పరివర్తనవుతుంది, మనము కొత్త ప్రపంచములోకి వెళ్తున్నాము
అన్నది సదా స్మృతిలో ఉండాలి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకూడదు. సుదాముని వలె
పిడికెడు బియ్యాన్ని సఫలము చేసుకుని సత్యయుగీ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి.
ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక పిల్లలు అనగా
ఆత్మలు మరియు ఆత్మిక తండ్రి అనగా ఆత్మల తండ్రి అని పిల్లలు అర్థం చేసుకుంటారు.
దీనిని ఆత్మ మరియు పరమాత్మల మిలనము అని అంటారు. ఈ మిలనము ఒక్కసారి మాత్రమే
జరుగుతుంది. ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు తెలుసు. ఇది విచిత్రమైన విషయము.
విచిత్రుడైన తండ్రి విచిత్ర ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికి ఆత్మ
విచిత్రమైనది, ఇక్కడకు వచ్చి చిత్రధారిగా అవుతుంది. చిత్రము ద్వారా పాత్రను
అభినయిస్తుంది. ఆత్మ అయితే అందరిలోనూ ఉంది కదా. జంతువులలో కూడా ఆత్మ ఉంది. 84 లక్షల
జీవరాశులు అని అంటారు, అందులోనైతే అన్ని జంతువులు వచ్చేస్తాయి కదా. ఎన్నో జంతువులు
మొదలైనవి ఉన్నాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ విషయాలలో సమయాన్ని వ్యర్థము
చేయవద్దు. ఈ జ్ఞానము లేకపోతే మనుష్యుల సమయము వ్యర్థమవుతూ ఉంటుంది. ఈ సమయములో తండ్రి
కూర్చుని పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు, ఆ తర్వాత అర్ధకల్పము మీరు
ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ మీకు ఎటువంటి కష్టమూ ఉండదు. దుఃఖాన్ని సహనము
చేయడములోనే మీ సమయము వ్యర్థమవుతుంది. ఇక్కడైతే దుఃఖమే దుఃఖముంది, అందుకే దుఃఖములో
మా సమయము వ్యర్థమవుతుంది, దీని నుండి మమ్మల్ని బయటకు తీయండి అని అందరూ తండ్రిని
తలచుకుంటారు. సుఖములో ఎప్పుడూ సమయము వ్యర్థమవుతుంది అని అనరు. ఈ సమయములో మనుష్యులకు
ఎటువంటి విలువ లేదని కూడా మీరు అర్థం చేసుకుంటారు. మనుష్యులను చూడండి, అకస్మాత్తుగా
మరణిస్తారు. ఒక్క తుఫానులోనే ఎంతమంది మరణిస్తారు. రావణ రాజ్యములో మనుష్యులకు ఎటువంటి
విలువ లేదు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎంత విలువైనవారిగా తయారుచేస్తున్నారు. పైసా
అంత విలువ కూడా లేనివారి నుండి విలువైనవారిగా తయారుచేస్తారు. వజ్రతుల్యమైన జన్మ
అమూల్యమైనదని అంటూ ఉంటారు కూడా. ఈ సమయములో మనుష్యులు గవ్వల వెనుక పడుతున్నారు. మహా
అయితే, లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా, పదమపతులుగా అవుతారు, వారి బుద్ధి అంతా
అందులోనే ఉంటుంది. వీటన్నిటినీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయండి అని వారికి
చెప్పినా కానీ వారు స్వీకరించరు. కల్పక్రితం కూడా ఎవరి బుద్ధిలోనైతే కూర్చుందో, వారి
బుద్ధిలోనే కూర్చుంటుంది. లేదంటే ఎంతగా అర్థం చేయించినా కూడా, ఎప్పటికీ బుద్ధిలో
కూర్చోదు. ఈ ప్రపంచము మారుతోందని మీకు కూడా నంబరువారుగా తెలుసు. ప్రపంచము మారుతోందని
మీరు బయట వ్రాసినా కూడా, మీరు ఎవరికైనా అర్థం చేయించనంత వరకు ఎవరూ అర్థం చేసుకోలేరు.
అచ్ఛా, ఒకవేళ ఎవరైనా అర్థం చేసుకున్నా సరే, వారికి - తండ్రిని స్మృతి చేయండి,
సతోప్రధానముగా అవ్వండి అని మళ్ళీ అర్థం చేయించవలసే ఉంటుంది. జ్ఞానమైతే చాలా సహజమైనది.
వీరు సూర్య వంశీయులు, చంద్ర వంశీయులు... ఇప్పుడు ఈ ప్రపంచము మారుతోంది, మార్చేవారు
ఒక్క తండ్రి మాత్రమే. ఇది కూడా మీకు యథార్థ రీతిగా తెలుసు, అది కూడా నంబరువారు
పురుషార్థానుసారముగా తెలుసు. మాయ పురుషార్థము చెయ్యనివ్వదు, అప్పుడిక
డ్రామానుసారముగా అంతటి పురుషార్థము జరగదని భావిస్తారు. శ్రీమతము ద్వారా మేము మా కోసం
ఈ ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. శ్రీమతము ఒక్క
శివబాబాది మాత్రమే. శివబాబా, శివబాబా అని అనడమైతే చాలా సహజము, ఇంకెవ్వరికీ శివబాబా
గురించి గాని, వారసత్వము గురించి గాని తెలియదు. బాబా అంటేనే వారసత్వము. సత్యమైన
శివబాబా కావాలి కదా. ఈ రోజుల్లోనైతే మేయర్ ను కూడా ఫాదర్ అని అంటారు, గాంధీని కూడా
ఫాదర్ అని అంటారు. కొందరినేమో జగద్గురువు అని అంటారు. ఇప్పుడు జగత్తు అనగా మొత్తము
సృష్టికి గురువు. మనుష్యులెవరైనా అలా ఎలా అవ్వగలరు! పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత
ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి అయితే నిరాకారుడు, మరి వారు విముక్తులుగా ఎలా చేస్తారు?
ప్రపంచము పరివర్తనవుతుంది కావున వారు తప్పకుండా పాత్రలోకి వస్తారు, అప్పుడే
తెలుస్తుంది. ప్రళయము జరుగుతుందని, ఆ తర్వాత తండ్రి కొత్త సృష్టిని రచిస్తారని కాదు.
చాలా పెద్ద ప్రళయము జరుగుతుందని, ఆ తర్వాత రావి ఆకుపై కృష్ణుడు వస్తారని శాస్త్రాలలో
చూపించారు. కానీ అలా జరగదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు
రిపీట్ అవుతాయని అంటూ ఉంటారు కావున ప్రళయము జరగదు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము
మారుతోందని మీ మనసులో ఉంది. ఈ విషయాలన్నింటినీ తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. ఈ
లక్ష్మీ-నారాయణులు కొత్త ప్రపంచానికి యజమానులు. పాత ప్రపంచానికి యజమాని రావణుడు అని
మీరు చిత్రాలలో కూడా చూపిస్తారు. రామ రాజ్యము మరియు రావణ రాజ్యమని అంటూ ఉంటారు కదా.
బాబా పాత ఆసురీ ప్రపంచాన్ని సమాప్తము చేసి కొత్త దైవీ ప్రపంచాన్ని స్థాపన
చేయిస్తున్నారని ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. తండ్రి అంటారు - నేను ఎవరిని, ఎలా
ఉన్నాను అనేది ఎవరో అరుదుగా అర్థం చేసుకుంటారు. ఇది కూడా మీకు నంబరువారు
పురుషార్థానుసారముగా తెలుసు. ఎవరైతే మంచి పురుషార్థీలు ఉంటారో, వారికి చాలా మంచి నషా
ఉంటుంది. స్మృతి చేసే పురుషార్థీలకు నిజమైన నషా ఎక్కుతుంది. స్మృతియాత్రలో ఎంతైతే
నషా ఎక్కుతుందో, 84 జన్మల చక్రము యొక్క జ్ఞానాన్ని అర్థం చేయించడములో అంత నషా ఎక్కదు.
ముఖ్యమైన విషయము పావనముగా అవ్వడమే. మీరు వచ్చి పావనముగా చేయండి అని పిలుస్తారు కూడా.
మీరు వచ్చి విశ్వ రాజ్యాధికారాన్ని ఇవ్వండి అని ఇలా పిలవరు. భక్తి మార్గములో కథలు
కూడా ఎన్ని వింటారు. సత్యాతి-సత్యమైన సత్యనారాయణుని కథ అయితే ఇదే. ఆ కథలనైతే
జన్మ-జన్మాంతరాలుగా వింటూ-వింటూ కిందకే పడిపోతూ వచ్చారు. భారత్ లోనే ఈ కథలను వినే
ఆచారము ఉంది, ఇతర ఏ ఖండములోనూ కథలు మొదలైనవి ఉండవు. భారత్ నే ధార్మికమైనదిగా
భావిస్తారు. అనేక మందిరాలు భారత్ లోనే ఉన్నాయి. క్రిస్టియన్లకైతే ఒకే చర్చ్ ఉంటుంది.
ఇక్కడైతే రకరకాల మందిరాలు ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి ఒక్క శివబాబా మందిరమే ఉండాలి.
పేరు కూడా ఒక్కరిదే ఉండాలి. ఇక్కడైతే అనేక పేర్లు ఉన్నాయి. విదేశీయులు కూడా ఇక్కడి
మందిరాలను చూసేందుకు వస్తారు. పాపం వారికి ప్రాచీన భారత్ ఎలా ఉండేది అన్నది తెలియదు.
5 వేల సంవత్సరాల కన్నా పాత వస్తువైతే ఏదీ ఉండదు. లక్షల సంవత్సరాల నాటి పురాతన
వస్తువులు లభించాయని వారు భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ మందిరాలలో
చిత్రాలు మొదలైనవేవైతే తయారయ్యాయో, అవి తయారై 2500 సంవత్సరాలే అయ్యింది. మొట్టమొదట
శివుని పూజే జరుగుతుంది. అది అవ్యభిచారి పూజ. అలాగే అవ్యభిచారి జ్ఞానమని కూడా అంటారు.
మొదట అవ్యభిచారి పూజ, ఆ తర్వాత వ్యభిచారి పూజ జరుగుతుంది. ఇప్పుడైతే నీటిని, మట్టిని
కూడా పూజిస్తూ ఉంటారు చూడండి. ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గములో
మీరు ఎంత ధనాన్ని పోగొట్టుకున్నారు. లెక్కలేనన్ని శాస్త్రాలు, అనేక చిత్రాలు ఉన్నాయి.
గీతలు లెక్కలేనన్ని ఉంటాయి. వీటన్నిటిపై ఖర్చు చేస్తూ-చేస్తూ మీరు ఎలా అయిపోయారో
చూడండి. నిన్న మిమ్మల్ని ద్వికిరీటధారులుగా చేసాను, మీరు మళ్ళీ ఎంత నిరుపేదగా
అయిపోయారు. ఇది నిన్నటి విషయమే కదా. తప్పకుండా మనము 84 జన్మల చక్రములో తిరిగామని
మీరు కూడా భావిస్తారు. ఇప్పుడు మనం మళ్ళీ అలా తయారవుతున్నాము. బాబా నుండి
వారసత్వాన్ని తీసుకుంటున్నాము. బాబా పదే-పదే పురుషార్థము చేయిస్తూ ఉంటారు. గీతలో
కూడా మన్మనాభవ అనే పదముంది. కొన్ని-కొన్ని పదాలు సరైనవి ఉన్నాయి. ప్రాయః
లోపమైపోయింది అని అంటారు కదా, అనగా దేవీ-దేవతా ధర్మము ఇప్పుడు లేదు, ఇకపోతే దానికి
సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. మీ స్మృతిచిహ్నాలు ఎంత బాగా తయారుచేయబడి ఉన్నాయో
చూడండి. ఇప్పుడు మనము మళ్ళీ స్థాపన చేస్తున్నామని మీరు భావిస్తారు. ఆ తర్వాత భక్తి
మార్గములో మన స్మృతిచిహ్నాలే ఏక్యురేట్ గా తయారవుతాయి. భూకంపాలు మొదలైనవి జరుగుతాయి,
అందులో అన్నీ సమాప్తమైపోతాయి. మళ్ళీ అక్కడ మీరు అన్నీ కొత్తగా తయారుచేస్తారు. అక్కడ
ఆ నైపుణ్యము ఉంటుంది కదా. వజ్రాలను కోయడం కూడా ఒక కళ. ఇక్కడ కూడా వజ్రాలను కోసి ఆ
తర్వాత తయారుచేస్తారు. వజ్రాలను కోసేవారు కూడా గొప్ప నిపుణులుగా ఉంటారు. వారు మళ్ళీ
అక్కడకు వెళ్తారు. ఈ నైపుణ్యమంతా అక్కడకు వెళ్తుంది. అక్కడ ఎంత సుఖముంటుంది అనేది
మీకు తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది కదా. దాని పేరే స్వర్గము. అది 100
శాతము సంపన్నముగా ఉంటుంది. ఇప్పుడు దివాలా తీసినట్లు ఉంది. భారత్ లో ఆభరణాల ఫ్యాషన్
చాలా ఉంటుంది, అది పరంపరగా కొనసాగుతూ వస్తుంది. పిల్లలైన మీకు ఎంత సంతోషము ఉండాలి.
ఈ ప్రపంచము మారుతోందని, ఇప్పుడు స్వర్గము తయారవుతుందని మీకు తెలుసు, దీని కోసం మనము
పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. అందుకే బాబా అంటారు
- చార్ట్ తప్పకుండా వ్రాయండి. ఆత్మనైన నేను ఎలాంటి ఆసురీ కర్మలు చేయలేదు కదా?
స్వయాన్ని ఆత్మ అని పక్కాగా భావించండి. ఈ శరీరము ద్వారా వికర్మలేవీ చేయలేదు కదా?
ఒకవేళ చేసి ఉంటే రిజిస్టర్ పాడైపోతుంది. ఇది 21 జన్మల లాటరీ. ఇది కూడా రేస్. గుర్రపు
పందాలు ఉంటాయి కదా. దీనిని రాజస్వ అశ్వమేధ... అని అంటారు. స్వరాజ్యము కోసం అశ్వాలు
అనగా ఆత్మలైన మీరు పరుగు తీయాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. దానిని స్వీట్
సైలెన్స్ హోమ్ అని అంటారు. ఈ పదాలను మీరు ఇప్పుడే వింటారు. ఇప్పుడు తండ్రి అంటారు -
పిల్లలూ, బాగా కృషి చేయండి. రాజ్యము లభిస్తుంది, ఇది తక్కువ విషయమేమీ కాదు. నేను
ఆత్మను, నేను ఇన్ని జన్మలు తీసుకున్నాను. ఇప్పుడు తండ్రి అంటారు - మీ 84 జన్మలు
పూర్తయ్యాయి, ఇప్పుడు మళ్ళీ మొదటి నంబరు నుండి ప్రారంభించాలి. కొత్త మహళ్ళలో
తప్పకుండా పిల్లలే కూర్చుంటారు. పాతవాటిలోనైతే కూర్చోరు. స్వయం పాతవాటిలో కూర్చుని,
కొత్తవాటిలో కిరాయివారిని కూర్చోబెట్టడం జరగదు. మీరు ఎంతగా కృషి చేస్తారో, అంతగా
కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. కొత్త ఇల్లు తయారైనప్పుడు పాతదానిని వదిలి
కొత్తదానిలో కూర్చోవాలని మనసుకు అనిపిస్తుంది. మొదటి ఇల్లు పాతదైనప్పుడు తండ్రి
పిల్లల కోసం కొత్త ఇల్లును నిర్మిస్తారు. అక్కడైతే కిరాయికి ఇచ్చే విషయమేమీ ఉండదు.
ఏ విధముగానైతే వారు చంద్రుడిపై ప్లాట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తారో, అలా మీరు
స్వర్గములో ప్లాట్ తీసుకుంటున్నారు. ఎంతెంతగా జ్ఞాన-యోగాలలో ఉంటారో అంతగా పవిత్రముగా
అవుతారు. ఇది రాజయోగము, ఎంత గొప్ప రాజ్యము లభిస్తుంది. ఇకపోతే, చంద్రుడు
మొదలైనవాటిపై ప్లాట్ వెతుకుతూ ఉండటమంటే అదంతా వ్యర్థము. సుఖాన్ని ఇచ్చే ఈ వస్తువులే
మళ్ళీ వినాశనము చేసేందుకు దుఃఖాన్ని ఇచ్చేవిగా అవుతాయి. మున్ముందు సైన్యము
మొదలైనవన్నీ తగ్గిపోతాయి. బాంబులతోనే త్వరత్వరగా పని జరిగిపోతూ ఉంటుంది. ఈ డ్రామా
తయారుచేయబడి ఉంది, సమయానికి అకస్మాత్తుగా వినాశనము జరుగుతుంది, అప్పుడు సిపాయిలు
మొదలైనవారు కూడా మరణిస్తారు. మీరు ఇప్పుడు ఫరిశ్తాలుగా అవుతున్నారు. మన కోసమే
వినాశనము జరుగుతుందని మీకు తెలుసు. పాత ప్రపంచము సమాప్తమైపోతుంది, డ్రామాలో ఈ పాత్ర
ఉంది. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో, అలా అనుభవించాలి కదా. సన్యాసులు మంచివారు
కావచ్చు కానీ జన్మ అయితే ఎంతైనా గృహస్థుల వద్దనే తీసుకుంటారు కదా. శ్రేష్ఠ జన్మ
అయితే మీకు కొత్త ప్రపంచములో లభించనున్నది, అయినా కూడా వెళ్ళి సంస్కారాల అనుసారముగా
అలా అవుతారు. మీరు ఇప్పుడు కొత్త ప్రపంచము కోసం సంస్కారాలను తీసుకువెళ్తారు. జన్మ
కూడా తప్పకుండా భారత్ లోనే తీసుకుంటారు. చాలా మంచి ధార్మిక మనస్కులు ఎవరైతే ఉంటారో,
వారి వద్ద జన్మ తీసుకుంటారు ఎందుకంటే మీరు కర్మలే అటువంటివి చేస్తారు. ఎటువంటి
సంస్కారాలో, దాని అనుసారముగా జన్మ ఉంటుంది. మీరు చాలా ఉన్నతమైన కులములోకి వెళ్ళి
జన్మ తీసుకుంటారు. మీ వంటి కర్మలు చేసేవారైతే ఎవ్వరూ ఉండరు. ఎటువంటి చదువో, ఎటువంటి
సేవో, అటువంటి జన్మ లభిస్తుంది. చాలామంది మరణించేది ఉంది. రిసీవ్ చేసుకునేవారు కూడా
ముందు వెళ్ళాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు ఈ ప్రపంచము మారనున్నది.
తండ్రి అయితే సాక్షాత్కారము చేయించారు. బాబా తన ఉదాహరణను కూడా తెలియజేస్తారు. 21
జన్మల కోసం రాజ్యము లభిస్తుందని చూసారు, దాని ముందు ఈ 10-20 లక్షలు ఏ పాటివి అని
అనుకున్నారు. బాబాకు రాజ్యాధికారము లభించింది, పార్ట్నర్ కు గాడిద చాకిరి లభించింది.
ఏం కావాలో అది తీసుకోమని పార్ట్నర్ కు చెప్పేసారు. ఎటువంటి కష్టము కలగలేదు. పిల్లలకు
కూడా అర్థం చేయించడం జరుగుతుంది - బాబా నుండి మీరు ఏం తీసుకుంటారు? స్వర్గ
రాజ్యాధికారము. ఎంత వీలైతే అంత సెంటర్లను తెరుస్తూ వెళ్ళండి. అనేకుల కళ్యాణము చేయండి.
మీకు 21 జన్మల సంపాదన జరుగుతుంది. ఇక్కడైతే లక్షాధికారులు, కోటీశ్వరులు చాలామంది
ఉన్నారు. వాస్తవానికి వారంతా బికారులు. మీ వద్దకు చాలామంది వస్తారు. ప్రదర్శనీకి
ఎంతమంది వస్తారు. ప్రజలు తయారవ్వడం లేదని అనుకోకండి. ప్రజలు చాలామంది తయారవుతారు.
బాగుంది-బాగుంది అనైతే చాలామంది అంటారు కానీ మాకు తీరిక లేదని అంటారు. కొద్దిగా
విన్నా ప్రజల్లోకి వచ్చేస్తారు. అవినాశీ జ్ఞానము వినాశనము అవ్వదు. బాబా పరిచయాన్ని
ఇవ్వడమనేది చిన్న విషయమేమీ కాదు. కొంతమందికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒకవేళ
ఉన్నత పదవిని పొందాలనుకుంటే పురుషార్థము చేయడం మొదలుపెడతారు. బాబా ఎవరి నుండి ధనము
మొదలైనవి తీసుకోరు. పిల్లల యొక్క ఒక్కొక్క బిందువుతో సరోవరము తయారవుతుంది. కొంతమంది
ఒక్క రూపాయిని కూడా పంపిస్తారు. బాబా, ఒక్క ఇటుకను పెట్టండి అని అంటారు. సుధాముడు
ఇచ్చిన పిడికెడు బియ్యానికి గాయనముంది కదా. బాబా అంటారు, ఈ వజ్ర-వైఢూర్యాలు మీవే.
అందరి జన్మ వజ్రతుల్యముగా అవుతుంది. మీరు భవిష్యత్తు కోసం తయారుచేసుకుంటున్నారు.
ఇక్కడ ఈ కళ్ళతో చూసేదంతా పాత ప్రపంచమని మీకు తెలుసు. ఈ ప్రపంచము మారుతోంది. ఇప్పుడు
మీరు అమరపురికి యజమానులుగా అవుతున్నారు. మోహజీతులుగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది.
బాబా, మీరు వస్తే మేము బలిహారమైపోతాము అని మీరు అంటూ వచ్చారు, ఈ వ్యాపారము అయితే
బాగుంది కదా. వ్యాపారస్థుడు, రత్నాకరుడు, ఇంద్రజాలికుడు అనే పేర్లు ఎందుకు వచ్చాయో
మనుష్యులకు తెలియదు. వారు రత్నాకరుడు కదా, అవినాశీ జ్ఞాన రత్నలు ఒక్కొక్కటి
అమూల్యమైన మహావాక్యాలు. దీనిపై రూప్-బసంత్ ల కథ ఉంది కదా. మీరు రూప్ కూడా, బసంత్
కూడా (యోగ స్వరూపులు, జ్ఞాన స్వరూపులు). అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇప్పుడు ఈ శరీరము ద్వారా ఎటువంటి వికర్మలు చేయకూడదు. రిజిస్టర్ పాడయ్యే
విధముగా ఎటువంటి ఆసురీ కర్మలు జరగకూడదు.
2. ఒక్క తండ్రి స్మృతి యొక్క నషాలో ఉండాలి. పావనముగా అయ్యే ముఖ్యమైన
పురుషార్థాన్ని తప్పకుండా చేయాలి. గవ్వల వెనుక మీ అమూల్యమైన సమయాన్ని పాడు
చేసుకోకుండా శ్రీమతము ద్వారా జీవితాన్ని శ్రేష్ఠముగా తయారుచేసుకోవాలి.
వరదానము:-
స్వయాన్ని విశ్వ సేవ కొరకు అర్పితము చేసుకుని మాయను దాసీగా
చేసుకునే సహజ సంపన్న భవ
ఇప్పుడు మీ సమయాన్ని, సర్వ ప్రాప్తులను, జ్ఞానాన్ని,
గుణాలను మరియు శక్తులను విశ్వ సేవ కొరకు సమర్పితము చెయ్యండి. ఏ సంకల్పము కలిగినా,
చెక్ చేసుకోండి - అది విశ్వ సేవ కోసమే ఉందా. ఈ విధముగా సేవ కోసం అర్పణమవ్వడము ద్వారా
స్వయం సహజముగా సంపన్నమవుతారు. సేవా లగనము ఉన్న చోట చిన్న-పెద్ద పేపర్లు లేక పరీక్షలు
స్వతహాగానే సమర్పణ అయిపోతాయి. అప్పుడిక మాయకు భయపడరు. సదా విజయులుగా అయ్యే సంతోషములో
నాట్యము చేస్తూ ఉంటారు, అటువంటివారు మాయను తమ దాసీగా అనుభవము చేస్తారు. స్వయం సేవలో
సరెండర్ అయినట్లయితే మాయ స్వతహాగా సరెండర్ అయిపోతుంది.
స్లోగన్:-
అంతర్ముఖత ద్వారా నోటిని మూసి వేసినట్లయితే క్రోధము సమాప్తమైపోతుంది.
అవ్యక్త సూచనలు -
అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి
ఏ విధముగా ఒక్క
క్షణములో స్విచ్ ను ఆన్ చెయ్యటము మరియు ఆఫ్ చెయ్యటము జరుగుతుందో, అదే విధముగా ఒక్క
క్షణములో శరీరము యొక్క ఆధారాన్ని తీసుకోవాలి మరియు ఒక్క క్షణములో శరీరము నుండి
అతీతమై అశరీరి స్థితిలో స్థితులైపోవాలి. ఇప్పుడిప్పుడే శరీరములోకి రావాలి,
ఇప్పుడిప్పుడే అశరీరిగా అయిపోవాలి. అవసరమైనప్పుడు శరీరమనే వస్త్రాన్ని ధరించాలి,
అవసరము లేనప్పుడు శరీరము నుండి వేరైపోవాలి. ఇది ప్రాక్టీస్ చెయ్యాలి, దీనినే
కర్మాతీత అవస్థ అని అంటారు.
| | | |