14-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


(విశేషముగా శివజయంతి నిమిత్తము) ‘‘మధురమైన పిల్లలూ - మీరు సర్వోత్తమమైన సౌభాగ్యశాలి బ్రాహ్మణ కుల భూషణులు, మీకు స్వయంగా భగవంతుడు అభినందనలను తెలియజేస్తున్నారు’’

ప్రశ్న:-
తండ్రి పిల్లలకు సంగమములోనే సృష్టి సమాచారాన్ని వినిపిస్తారు, సత్యయుగములో వినిపించరు, ఎందుకు?

జవాబు:-
ఎందుకంటే సత్యయుగమంటేనే ఆది సమయము, ఆ సమయములో మొత్తం సృష్టి యొక్క సమాచారాన్ని అనగా సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఎలా వినిపిస్తారు, ఎప్పటివరకైతే చక్రము రిపీట్ అవ్వదో, అప్పటివరకు సమాచారాన్ని అసలు ఎలా వినిపించగలరు. సంగమములోనే పిల్లలైన మీరు తండ్రి ద్వారా పూర్తి సమాచారాన్ని వింటారు. మీకే జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభిస్తుంది.

ఓంశాంతి
ఈ రోజు త్రిమూర్తి శివజయంతి మరియు బ్రాహ్మణ జయంతి మరియు సంగమయుగ జయంతి యొక్క శుభప్రదమైన రోజు. బాబా ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారము యొక్క శుభాకాంక్షలను కూడా తెలపలేనివారు చాలామంది ఉన్నారు. శివబాబా ఎవరు, వారి నుండి ఏమి లభించనున్నది అనేది తెలియనివారు చాలామంది ఉన్నారు, వారు తండ్రి ఇచ్చే శుభాకాంక్షలను ఏమి అర్థం చేసుకోగలరు. కొత్త పిల్లలు అస్సలు అర్థం చేసుకోలేరు. ఇది జ్ఞాన డాన్స్. శ్రీకృష్ణుడు డాన్స్ చేసేవారని అంటారు కదా. ఇక్కడ పిల్లలు రాధా-కృష్ణులుగా అయ్యి డాన్స్ చేస్తారు. వాస్తవానికి డాన్స్ యొక్క విషయమేమీ కాదు. శ్రీకృష్ణుడు అక్కడ సత్యయుగములో బాల్యములో రాకుమారులు, రాకుమార్తెలతో పాటు డాన్స్ చేస్తారు. వీరు బాప్ దాదా అని పిల్లలకు తెలుసు. దాదాను గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఈ దాదా అయితే దైహిక తండ్రి. ఇక్కడిది అద్భుతమైన విషయము! ఆ దాదా ఆత్మికమైనవారు (శివబాబా) మరియు వీరు దైహికమైనవారు (బ్రహ్మా), వీరిరువురినీ బాప్ దాదా అని అంటారు. తండ్రి నుండి దాదా ద్వారా వారసత్వము లభిస్తుంది. వారసత్వము తాతగారిది (గ్రాండ్ ఫాదర్ ది). ఆత్మలందరూ సోదరులు కనుక వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది. తండ్రి అంటారు - ఆత్మలైన మీకు మీ-మీ శరీరాలు, మీ-మీ కర్మేంద్రియాలు ఉన్నాయి. నన్ను నిరాకారుడని అంటారు - తప్పకుండా నాకు శరీరము కావాలి. అప్పుడే పిల్లలకు రాజయోగాన్ని నేర్పించగలను అనగా మనుష్యుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనముగా అయ్యే మార్గాన్ని తెలపగలను మరియు మురికి పట్టిన వస్త్రాలను శుభ్రపరచగలను... తప్పకుండా వారు పెద్ద చాకలి అయి ఉంటారు. పూర్తి విశ్వములోని ఆత్మలను మరియు శరీరాలను శుభ్రపరుస్తారు. జ్ఞానము మరియు యోగముతో ఆత్మలైన మిమ్మల్ని శుభ్రము చేయడము జరుగుతుంది.

ఈ రోజు పిల్లలైన మీరు వచ్చారు, మేము శివబాబాకు అభినందనలు తెలిపేందుకు వచ్చామని మీకు తెలుసు. తండ్రి అంటున్నారు - మీరు ఎవరికైతే గ్రీటింగ్స్ ఇస్తున్నారో, ఆ తండ్రి కూడా పిల్లలైన మీకు గ్రీటింగ్స్ ఇస్తున్నారు, ఎందుకంటే మీరు ఎంతో సర్వోత్తమమైన, సౌభాగ్యశాలీ బ్రాహ్మణ కుల భూషణులు. మీరు ఎంత ఉత్తమమైనవారో, దేవతలు అంత కాదు. బ్రాహ్మణులు దేవతలకన్నా ఉన్నతమైనవారు. ఉన్నతోన్నతమైనవారు తండ్రి. వారు బ్రహ్మా తనువులోకి వస్తారు. వారి పిల్లలైన మీరు ఎంతో ఉన్నతోన్నతమైన బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులది పిలక స్థానము, ఆ కింద దేవతలు. అందరికన్నా పైన ఉన్నది బాబా. బాబా స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడము కోసం పిల్లలైన మిమ్మల్ని బ్రాహ్మణ, బ్రాహ్మణీలుగా చేసారు. ఈ లక్ష్మీ-నారాయణుల మందిరాలను చూడండి, ఎన్ని నిర్మించారో. వారికి తల వంచి నమస్కరిస్తారు. వీరు కూడా మనుష్యులేనని భారతవాసులకు తెలియాలి. లక్ష్మీ-నారాయణులు ఇరువురూ వేర్వేరు. ఇక్కడైతే ఒకే మనిషికి రెండు పేర్లు పెట్టారు. ఒకరి పేరు లక్ష్మీ-నారాయణ అనగా స్వయాన్ని విష్ణు చతుర్భుజునిగా చెప్పుకున్నట్లు. లక్ష్మీ-నారాయణ లేదా రాధా-కృష్ణ అన్న పేర్లు పెడితే చతుర్భుజులైనట్లే కదా. సూక్ష్మవతనములో ఉండే ఆ విష్ణువైతే మన లక్ష్యము-ఉద్దేశ్యము. మీరు ఈ విష్ణుపురికి యజమానులుగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు విష్ణుపురికి యజమానులు. విష్ణువుకు 4 భుజాలు ఉంటాయి, రెండు - లక్ష్మివి, రెండు - నారాయణుడివి. మేము విష్ణుపురికి యజమానులుగా అవుతున్నామని మీరు అంటారు. అచ్ఛా, తండ్రి మహిమను తెలిపే పాటను వినిపించండి. (కిత్నా మీఠా, కిత్నా ప్యారా శివ భోళా భగవాన్... ఎంత మధురమైనవారు, ఎంత ప్రియమైనవారు, శివ భోళా భగవానుడు...)

మొత్తము ప్రపంచములో ప్రారంభము నుండి మొదలుకొని ఇప్పటివరకు ఒక్కరికి తప్ప ఇంకెవ్వరికీ ఇంతటి మహిమ లేదు. నంబరువారుగా అయితే ఉండనే ఉన్నారు. అందరికన్నా ఎక్కువగా సర్వోత్తమ మహిమ ఉన్నతోన్నతమైన పరమపిత పరమాత్మది, మీరందరూ వారి పిల్లలు. మేము ఈశ్వరీయ సంతానము అని అంటారు. ఈశ్వరుడైతే స్వర్గ రచయిత, మరి మీరు నరకములో ఎందుకు ఉన్నారు. ఈశ్వరుడు ఇక్కడ జన్మ తీసుకుంటారు. మేము క్రైస్టుకు చెందినవారమని క్రిస్టియన్లు అంటారు. మేము పరమపిత పరమాత్మ అయిన శివుని యొక్క డైరెక్ట్ పిల్లలము అన్న విషయాన్నే భారతవాసులు మర్చిపోయారు. పిల్లలను తమవారిగా చేసుకుని, రాజ్యభాగ్యాన్ని ఇవ్వడానికి తండ్రి ఇక్కడకు వస్తారు. ఈ రోజు బాబా మంచి రీతిలో అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే కొత్తవారు కూడా చాలామంది ఉన్నారు. వారికి అర్థం చేసుకోవడము కష్టము. కానీ వారు స్వర్గవాసులుగా అయితే అవుతారు. స్వర్గములో సూర్యవంశీ రాజా-రాణులు కూడా ఉన్నారు, దాస-దాసీలు కూడా ఉన్నారు. ప్రజలు కూడా ఉంటారు. వారిలో కొందరు పేదవారిగా, కొందరు షావుకార్లుగా ఉంటారు. వారికి కూడా దాస-దాసీలు ఉంటారు. మొత్తము రాజధాని అంతా ఇక్కడ స్థాపన అవుతోంది. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. అందరి ఆత్మలు తమోప్రధానముగా ఉన్నాయి, జ్ఞానము యొక్క మూడవ నేత్రము ఎవ్వరికీ లేదు. (పాట) ఇప్పుడు తండ్రి మహిమను పాటలో విన్నారు. వారు అందరికీ తండ్రి. భగవంతుడిని తండ్రి అని అంటారు, వారు అనంతమైన సుఖాన్ని ఇచ్చే తండ్రి. ఇదే భారత్ లో అనంతమైన సుఖము ఉండేది, లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది. ఈ లక్ష్మీ-నారాయణులు బాల్యములో రాధా-కృష్ణులు, స్వయంవరము తర్వాత లక్ష్మీ-నారాయణులు అన్న పేరు వస్తుంది. ఈ భారత్ లో 5 వేల సంవత్సరాల క్రితం దేవతల రాజ్యముండేది. లక్ష్మీ-నారాయణుల రాజ్యము తప్ప ఇంకెవ్వరి రాజ్యము ఉండేది కాదు, ఇంకే ఖండమూ ఉండేది కాదు. లక్ష్మీ-నారాయణులు ముందు జన్మలో ఎటువంటి కర్మలు చేసారు అనేది ఇప్పుడు భారతవాసులకు కూడా తప్పకుండా తెలియాలి. బిర్లా ఎటువంటి కర్మలు చేయడము వలన ఇంతటి ధనవంతునిగా అయ్యారని అంటారు కదా, తప్పకుండా మునుపటి జన్మలో దాన-పుణ్యాలు చేసి ఉంటారని అంటారు. కొందరి వద్ద చాలా ధనము ఉంటుంది, కొందరికి తినడానికి కూడా లభించదు ఎందుకంటే కర్మలు అటువంటివి చేసారు. కర్మలనైతే నమ్ముతారు. కర్మ-అకర్మ-వికర్మల గతిని గీతా భగవానుడు వినిపించారు, వారి మహిమను విన్నారు. శివ భగవానుడు ఒక్కరే, మనుష్యులను భగవంతుడని అనరు. ఇప్పుడు తండ్రి ఎక్కడికి వచ్చారు! మహాభారత యుద్ధము ఎదురుగా నిలబడి ఉందని అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన బాబా అర్థం చేయిస్తున్నారు, దుఃఖములో వారిని అందరూ తలచుకుంటారు. దుఃఖములో అందరూ స్మరిస్తారు... శివబాబాను దుఃఖములో అందరూ తలచుకుంటారు. సుఖములో ఎవ్వరూ తలచుకోరు. స్వర్గములోనైతే దుఃఖముండేది కాదు. అక్కడ తండ్రి నుండి పొందిన వారసత్వము ఉండేది. 5 వేల సంవత్సరాల క్రితం శివబాబా వచ్చినప్పుడు భారత్ ను స్వర్గముగా తయారుచేసారు. ఇప్పుడు ఇది నరకము. తండ్రి స్వర్గాన్ని తయారుచేయడానికి వచ్చారు. ప్రపంచానికైతే అసలు తెలియను కూడా తెలియదు. మేమంతా అంధులము, అంధులకు చేతికర్ర అయిన ఓ ప్రభు, రండి, వచ్చి నేత్రాలను ప్రసాదించండి అని అంటారు. పిల్లలైన మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. ఎక్కడైతే ఆత్మలమైన మనము నివసిస్తామో, అది శాంతిధామము. తండ్రి కూడా అక్కడే ఉంటారు. ఆత్మలైన మీరు మరియు నేను అక్కడ ఉంటాము. ఆత్మలైన మీ అందరికీ తండ్రినైన నేను అక్కడ నివసిస్తానని వీరి (బ్రహ్మా) ఆత్మకు చెప్తాను. మీరు పునర్జన్మల పాత్రను అభినయిస్తారు, నేను అభినయించను. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు, నేను అవ్వను. మీరు 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ఓ పిల్లలూ, మీకు మీ జన్మల గురించి తెలియదు అని మీకు అర్థం చేయించాను. 84 లక్షల జన్మలని అంటారు - ఇవి అసత్యమైన విషయాలు. నేను జ్ఞానసాగరుడను, పతిత-పావనుడను, ఎప్పుడైతే అందరూ పతితముగా ఉంటారో, అప్పుడు నేను వస్తాను. అప్పుడే వచ్చి సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించి త్రికాలదర్శులుగా చేస్తాను. మొట్టమొదట మనుష్యులను ఎలా రచించారు, భగవంతుడు సృష్టిని ఎలా రచించారు అని చాలామంది అడుగుతారు. ప్రళయము జరిగిందని, ఆ తర్వాత సాగరములో రావి ఆకుపై చిన్న బాలుడైన శ్రీకృష్ణుడు వచ్చారని ఒక శాస్త్రములో కూడా చూపిస్తారు. తండ్రి అంటారు, అటువంటి విషయమేమీ లేదు, ఇది అనంతమైన డ్రామా. సత్య-త్రేతాయుగాలు పగలు, ద్వాపర-కలియుగాలు రాత్రి.

పిల్లలు తండ్రికి అభినందనలు తెలియజేస్తారు. తండ్రి అంటారు - తతత్వమ్. మీరు కూడా 100 శాతము దుర్భాగ్యశాలి నుండి 100 శాతము సౌభాగ్యశాలిగా అవుతారు. భారతవాసులైన మీరు అలానే ఉండేవారు కానీ మీకు ఈ విషయము తెలియదు. తండ్రి వచ్చి తెలియజేస్తారు. మీకు మీ జన్మల గురించి తెలియదు. మీరు 84 జన్మలను తీసుకున్నారని నేను వచ్చి తెలియజేస్తాను. తండ్రి మీకు సంగమములో మొత్తం సృష్టి యొక్క సమాచారాన్ని వినిపిస్తారు, సత్యయుగములో వినిపించరు. ఏ సమయములోనైతే సృష్టి ఆదిమధ్యాంతాలు అసలు ఇంకా గడవలేదో, ఆ సమయములో వాటి సమాచారాన్ని అసలు ఎలా అర్థం చేయించాలి. నేను అంతిమములో, కల్పము యొక్క సంగమయుగములో వస్తాను. శాస్త్రాలలో యుగే-యుగే (ప్రతి యుగములోనూ వస్తారు) అని వ్రాశారు. శ్రీకృష్ణ భగవానువాచ అని గీతలో వ్రాశారు. అన్ని ధర్మాల వారు శ్రీకృష్ణుడిని భగవంతునిగా అంగీకరించరు. భగవంతుడైతే నిరాకారుడు కదా. వారు ఆత్మలందరికీ తండ్రి. తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. ఆత్మలైన మీరంతా పరస్పరము సోదరులు. పరమాత్మను సర్వవ్యాపి అని అనడముతో ఫాదర్ హుడ్ (అందరూ తండ్రులే) అన్నట్లు అయిపోతుంది. తండ్రికి ఎప్పుడైనా వారసత్వము లభిస్తుందా? వారసత్వము పిల్లలకు లభిస్తుంది. ఆత్మలైన మీరందరూ పిల్లలు. తండ్రి వారసత్వము మీకు తప్పకుండా కావాలి. హద్దు వారసత్వముతో మీరు రాజీ అవ్వరు, అందుకే మీ కృపతో అపారమైన సుఖము లభించిందని పిలుస్తారు. ఇప్పుడు మళ్ళీ రావణుడి ద్వారా దుఃఖము లభించడముతో పిలవడము మొదలుపెట్టారు. ఆత్మలందరూ పిలుస్తారు ఎందుకంటే వారికి దుఃఖముంది, అందుకే - బాబా, మీరు వచ్చి సుఖాన్ని ఇవ్వండి అని తలచుకుంటారు. ఇప్పుడు ఈ జ్ఞానము ద్వారా స్వర్గానికి యజమానులుగా అవుతారు. మీ సద్గతి జరుగుతుంది, అందుకే సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రే అని అంటూ ఉంటారు. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు, తర్వాత సర్వుల సద్గతి జరుగుతుంది. లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు మీరు స్వర్గములో ఉండేవారు, మిగిలినవారంతా ముక్తిధామములో ఉండేవారు. ఇప్పుడు మనము తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటాము. తండ్రి అంటారు - కల్పము యొక్క సంగమములో నేను మిమ్మల్ని చదివిస్తాను, మనుష్యుల నుండి దేవతలుగా చేస్తాను.

ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తము రహస్యమంతా అర్థం చేయిస్తాను. శివరాత్రి ఎప్పుడు జరిగింది అనేది తెలిసి ఉండాలి. ఏమి జరిగింది, శివబాబా ఎప్పుడు వచ్చారు? ఏమీ తెలియదు. అంటే రాతిబుద్ధి కలవారిగా ఉన్నట్లే కదా. ఇప్పుడు మీరు పారసబుద్ధి కలవారిగా అవుతారు. భారత్ పారసపురిగా, బంగారు యుగముగా ఉండేది. లక్ష్మీ-నారాయణులను కూడా భగవాన్, భగవతి అని అంటారు. వారికి వారసత్వాన్ని భగవంతుడు ఇచ్చారు, మళ్ళీ ఇస్తున్నారు. మిమ్మల్ని మళ్ళీ భగవాన్, భగవతిగా తయారుచేస్తున్నారు. ఇప్పుడిది మీ అనేక జన్మల అంతిమ జన్మ. తండ్రి అంటారు, వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞమని అంటారు. అవన్నీ భౌతికమైన యజ్ఞాలు, ఇది జ్ఞానము యొక్క విషయము. ఇక్కడ తండ్రి వచ్చి మనుష్యులను దేవతలుగా చేస్తారు. శివబాబా వచ్చినందుకు మీరు అభినందనలు తెలియజేస్తారు. అప్పుడు బాబా అంటారు - నేను ఒంటరిగా రాను, నాకు కూడా శరీరము కావాలి, బ్రహ్మా తనువులోకి రావలసి ఉంటుంది. మొట్టమొదట సూక్ష్మవతనాన్ని రచించవలసి ఉంటుంది, అందుకే వీరిలో ప్రవేశించాను. వీరు పతితముగా ఉండేవారు, 84 జన్మలు తీసుకుని పతితముగా అయ్యారు. అందరూ పిలిచేవారు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను మళ్ళీ పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను. తండ్రియే భారత్ కు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. స్వర్గ రచయిత తండ్రి, వారు తప్పకుండా స్వర్గమునే కానుకగా ఇస్తారు. ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా అవుతున్నారు. భవిష్యత్తులో 21 జన్మల కోసం మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పాఠశాల ఇది. మీరు స్వర్గానికి యజమానులుగా అవుతున్నారు, 21 తరాలు మీరు సుఖాన్ని పొందుతారు. అక్కడ అకాల మృత్యువులు ఉండవు. అక్కడ శరీర ఆయుష్షు పూర్తయినప్పుడు సాక్షాత్కారము జరుగుతుంది, ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. సర్పము యొక్క ఉదాహరణ కూడా ఉంది కదా!

పిల్లలైన మీరు తండ్రికి అభినందనలను తెలియజేస్తారు. తండ్రి మళ్ళీ మీకు అభినందనలను తెలియజేస్తారు. మీరు ఇప్పుడు దుర్భాగ్యశాలి నుండి సౌభాగ్యశాలిగా అవుతున్నారు. పతిత మనుష్యుల నుండి పావనమైన దేవతలుగా అవుతారు. చక్రము అయితే తిరుగుతుంది. ఈ విషయాన్ని పిల్లలైన మీరు అర్థం చేయించాలి. తర్వాత ఇది కనుమరుగైపోతుంది. సత్యయుగములో జ్ఞానము యొక్క అవసరముండదు. ఇప్పుడు మీరు దుర్గతిలో ఉన్నారు, అందుకే ఈ జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. తండ్రియే వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. సర్వుల సద్గురువు ఒక్కరే. ఇకపోతే, భక్తి మార్గము యొక్క కర్మకాండల ద్వారా ఎవరి సద్గతి జరగదు. అందరూ మెట్లు కిందకు దిగవలసిందే. భారత్ సతోప్రధానముగా ఉండేది, తర్వాత 84 జన్మలు తీసుకోవలసి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మీరు పైకి ఎక్కాలి. తమ ఇల్లు అయిన ముక్తిధామానికి వెళ్ళాలి. ఇప్పుడు నాటకము పూర్తవుతుంది. ఈ పాత ప్రపంచము సమాప్తమైపోతుంది. భారత్ ను అవినాశీ ఖండము అని అంటారు. తండ్రి జన్మ స్థలము ఎప్పటికీ వినాశనమవ్వదు. మీరు శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ వస్తారు, వచ్చి రాజ్యము చేస్తారు. పావనమైనవారు మరియు పతితమైనవారు భారత్ లోనే ఉంటారు. 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ పతితముగా అయ్యారు, యోగుల నుండి భోగులుగా అయ్యారు. ఇది రౌరవ నరకము, ఇది మహాన్ దుఃఖము యొక్క సమయము. ఇప్పుడైతే చాలా దుఃఖము రానున్నది. ఇది అనవసరమైన రక్తసిక్తమైన ఆట. కూర్చొని ఉండగానే బాంబులు పడతాయి. మీరు ఏమి పాపం చేసారు? ఊరికే అందరి వినాశనము జరుగుతుంది. వినాశనము యొక్క సాక్షాత్కారమైతే పిల్లలకు జరిగింది. ఇప్పుడు మీరు సృష్టి చక్రము యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నారు. మీ వద్ద జ్ఞాన ఖడ్గముంది. మీరు బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులు. ప్రజాపిత కూడా తండ్రియే, కల్పక్రితము కూడా వీరు ముఖవంశావళికి జన్మనిచ్చారు. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పము వస్తాను, వీరిలో ప్రవేశించి మిమ్మల్ని ముఖవంశావళిగా చేస్తాను, బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపనను చేయిస్తాను. స్వర్గములోకైతే భవిష్యత్తులోనే వెళ్తారు. ఛీ-ఛీ ప్రపంచమైతే సమాప్తమవ్వాలి. అనంతమైన తండ్రి కొత్త ప్రపంచాన్ని రచించేందుకే వస్తారు. తండ్రి అంటారు - నేను పిల్లలైన మీ కోసం అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చాను, మీకు ఏ కష్టము ఇవ్వను. మీరందరూ ద్రౌపదులు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేవతల కన్నా ఉన్నతమైనది సర్వోత్తమమైన బ్రాహ్మణులైన మనము - ఈ ఆత్మిక నషాలో ఉండాలి. జ్ఞానము మరియు యోగముతో ఆత్మను స్వచ్ఛముగా తయారుచేసుకోవాలి.

2. అందరికీ శివబాబా అవతరణ యొక్క అభినందనలను తెలియజేయాలి. తండ్రి పరిచయాన్ని ఇచ్చి పతితుల నుండి పావనులుగా తయారుచేయాలి. శత్రువైన రావణుడి నుండి విముక్తులుగా చేయాలి.

వరదానము:-
విస్తారములో ఉన్న రంగు-రంగుల విషయాల నుండి పక్కకు తప్పుకుని కష్టమును సహజము చేసే సహజయోగీ భవ

ఎప్పుడైతే తండ్రిని చూసేందుకు బదులుగా విషయాలను చూడడము మొదలుపెడతారో, అప్పుడు ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి మరియు సహజమైన విషయము కూడా కష్టముగా అనుభవమవ్వడం మొదలవుతుంది ఎందుకంటే విషయాలు వృక్షము వంటివి మరియు తండ్రి బీజము వంటివారు. ఎవరైతే విస్తరించి ఉన్న వృక్షాన్ని చేతిలోకి తీసుకుంటారో వారు తండ్రిని పక్కన పెట్టేస్తారు, అప్పుడు విస్తారము ఒక వలలా అయిపోతుంది, అందులో వారు చిక్కుకుపోతూ ఉంటారు. విషయాల విస్తారములో రంగు-రంగుల విషయాలు ఉంటాయి, అవి తమవైపుకు ఆకర్షిస్తాయి, అందుకే బీజరూపుడైన తండ్రి స్మృతి ద్వారా బిందువు పెట్టి వాటి నుండి పక్కకు తప్పుకున్నట్లయితే సహజయోగిగా అయిపోతారు.

స్లోగన్:-
నేను మరియు నాది అనే మాలిన్యాన్ని సమాప్తము చేయడమే స్వచ్ఛమైన బంగారముగా అవ్వడము.

అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి

ఇప్పుడు అందరూ కలిసి ఏకమతము వారిగా అయి సేవలో ఏ కార్యమునైనా వైభవోపేతముగా ముందుకు తీసుకువెళ్ళండి. బ్రాహ్మణ ఆత్మల ప్రతి ఒక్కరి సహయోగముతో, శుభ కామనలు, శుభ భావనలతో సేవలను బాగా ఘనముగా చెయ్యండి. ఒకవేళ ఎవరైనా నోటి ద్వారా చెప్పలేకపోయినా, వారు మనసా వాయుమండలము ద్వారా, సుఖముతో కూడిన వృత్తి ద్వారా, సుఖమయ స్థితి ద్వారా సుఖమయ ప్రపంచాన్ని తయారుచెయ్యాలి. ఎక్కడికీ వెళ్ళలేకపోయినా కానీ, ఆరోగ్యము సరిగ్గా లేకపోయినా కానీ, ఇంటిలో కూర్చునే ఈ సేవను చెయ్యండి కానీ సేవలో సహయోగిగా తప్పకుండా అవ్వండి, అప్పుడు సర్వుల సహయోగముతో సుఖమయ ప్రపంచము తయారవుతుంది.