14-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ ముఖము సదా సంతోషముగా ఉండాలి, ‘మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు’ - ఈ సంతోషము ముఖములో ప్రకాశిస్తూ ఉండాలి’’

ప్రశ్న:-
ఇప్పుడు పిల్లలైన మీ యొక్క ముఖ్యమైన పురుషార్థము ఏమిటి?

జవాబు:-
మీరు శిక్షల నుండి విముక్తులయ్యే పురుషార్థమునే చేస్తూ ఉంటారు. దీని కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్ర, దీని ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. మీరు ప్రేమగా స్మృతి చేసినట్లయితే ఎంతో సంపాదన జమ అవుతూ ఉంటుంది. ఉదయముదయమే లేచి స్మృతిలో కూర్చున్నట్లయితే పాత ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు, జ్ఞాన విషయాలు బుద్ధిలోకి వస్తూ ఉంటాయి. పిల్లలైన మీరు నోటి ద్వారా పనికిరాని విషయాలేవీ మాట్లాడకూడదు.

పాట:-
మిమ్మల్ని పొంది మేము...

ఓంశాంతి
పాటను వినే సమయములో కొందరికి దాని అర్థము అర్థమవుతుంది మరియు ఆ సంతోషము కూడా కలుగుతుంది. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు, భగవంతుడు మనకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. కానీ అంతటి సంతోషము ఇక్కడ ఏ ఒక్కరికో ఉంటుంది. ఆ స్మృతి స్థిరముగా నిలవదు. నేను తండ్రికి చెందినవాడిగా అయ్యాను, తండ్రి నన్ను చదివిస్తున్నారు. ఈ నషా ఎక్కనివారు ఎంతోమంది ఉన్నారు. ఆ సత్సంగాలు మొదలైనవాటిలో కథలు వింటారు, వారికి కూడా సంతోషము కలుగుతుంది. ఇక్కడైతే తండ్రి ఎంత చక్కని విషయాలను వినిపిస్తారు. తండ్రి చదివిస్తున్నారు మరియు తర్వాత విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారు, కావున విద్యార్థికి ఎంత సంతోషము ఉండాలి. ఆ భౌతికమైన చదువులు చదివేవారికి ఎంత సంతోషమైతే ఉంటుందో, ఇక్కడివారికి అంత సంతోషము ఉండదు. బుద్ధిలో కూర్చోనే కూర్చోదు. తండ్రి అర్థం చేయించారు - ఇలాంటి పాటలను 4-5 సార్లు వినండి. తండ్రిని మర్చిపోవడముతో ఇక పాత ప్రపంచము మరియు పాత సంబంధాలు కూడా గుర్తుకొచ్చేస్తాయి. అలాంటి సమయములో ఈ పాటలు వినడము ద్వారా కూడా తండ్రి స్మృతి వచ్చేస్తుంది. తండ్రి అని అనడముతో వారసత్వము కూడా గుర్తుకువస్తుంది. చదువు ద్వారా వారసత్వము లభిస్తుంది. మొత్తము విశ్వమంతటికీ యజమానులుగా అయ్యేందుకు మీరు శివబాబా ద్వారా చదువుకుంటారు. మరి ఇంకేమి కావాలి. ఇటువంటి విద్యార్థికి లోలోపల ఎంత సంతోషము ఉండాలి! రాత్రింబవళ్ళు నిద్ర కూడా దూరమైపోవాలి. విశేషముగా నిద్రను విడిచిపెట్టి కూడా ఇటువంటి తండ్రిని మరియు టీచరును స్మృతి చేస్తూ ఉండాలి. ఆ నషాలోనే లీనమైపోయినవారిలా ఉండాలి. ఓహో, మాకు తండ్రి ద్వారా విశ్వ రాజ్యాధికారము లభిస్తుంది! కానీ మాయ స్మృతి చేయనివ్వదు. మిత్ర-సంబంధీకులు మొదలైనవారి స్మృతి కలుగుతూ ఉంటుంది. వారి చింతనయే నడుస్తూ ఉంటుంది. పాత కుళ్ళిపోయిన చెత్త ఎంతో మందికి గుర్తుకొస్తూ ఉంటుంది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు అని తండ్రి ఏదైతే చెప్తున్నారో, ఆ నషా వారికి ఎక్కదు. స్కూల్లో చదివేవారి ముఖము సంతోషముగా ఉంటుంది. ఇక్కడ భగవంతుడు చదివిస్తున్నారు, ఆ సంతోషము ఏ ఒక్కరికో ఉంటుంది. వాస్తవానికి సంతోషము యొక్క పాదరసము బాగా ఎక్కి ఉండాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు, ఇది మర్చిపోతారు. ఇది గుర్తున్నా సంతోషము ఉంటుంది. కానీ గతము యొక్క కర్మభోగము కూడా ఎలా ఉందంటే ఇక అసలు తండ్రిని స్మృతే చేయరు. వారి ముఖము మళ్ళీ ఆ చెత్త వైపుకే వెళ్తుంది. బాబా ఈ మాట అందరి విషయములోనూ అనటం లేదు. నంబరువారుగా ఉన్నారు. ఎవరైతే తండ్రి స్మృతిలో ఉంటారో, వారు మహాన్ సౌభాగ్యశాలులు. భగవంతుడు, బాబా మనల్ని చదివిస్తున్నారు! ఏ విధంగా ఆ చదువులో, ఫలానా టీచర్ మమ్మల్ని బ్యారిస్టరుగా తయారుచేస్తున్నారు అని ఉంటుంది కదా, అలా ఇక్కడ మనల్ని భగవంతుడు చదివిస్తున్నారు - భగవాన్, భగవతీలుగా తయారుచేయడానికి, కావున ఎంత నషా ఉండాలి. వినే సమయములో కొందరికి నషా ఎక్కుతుంది. మిగిలినవారైతే ఏమీ అర్థము చేసుకోరు. అక్కడ కేవలము గురువును ఆశ్రయిస్తారు, వారు మమ్మల్ని తోడుగా తీసుకువెళ్తారు, భగవంతునితో కలిపిస్తారు అని భావిస్తారు. కానీ ఇక్కడ వీరు స్వయమే భగవంతుడు. మిమ్మల్ని తనతో మిలనము చేయించి తనతోపాటు తీసుకువెళ్తారు. గురువు భగవంతుని వద్దకు తీసుకువెళ్ళాలని లేక శాంతిధామానికి తీసుకువెళ్ళాలనే మనుష్యులు గురువును ఆశ్రయిస్తారు. ఈ తండ్రి సమ్ముఖముగా ఎంతగా అర్థము చేయిస్తారు. మీరు విద్యార్థులు. చదివించే టీచరునైతే స్మృతి చేయండి. ఏ మాత్రమూ స్మృతి చేయరు, ఇక అడగకండి. మంచి-మంచి పిల్లలు కూడా స్మృతి చేయరు. శివబాబా మనల్ని చదివిస్తున్నారు, వారు జ్ఞానసాగరుడు, మనకు వారసత్వాన్ని ఇస్తారు, ఇది గుర్తున్నా సంతోషము యొక్క పాదరసము ఎక్కి ఉంటుంది. తండ్రి సమ్ముఖముగా చెప్తున్నారు, అయినా ఆ నషా ఎక్కదు. బుద్ధి వేరే వైపులకు వెళ్ళిపోతుంది. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి. వినాశనమయ్యే వస్తువులను స్మృతి చేయవలసిన అవసరము ఏముంది. ఇక్కడ ఎవరైనా మరణిస్తే వారిని 2-4 సంవత్సరాల వరకూ తలుచుకుంటూ ఉంటారు, వారి గాయనము చేస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు సమ్ముఖముగా చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. ఎవరు ఎంత ప్రేమగా స్మృతి చేస్తారో అంతగా వారి పాపాలు కట్ అవుతూ ఉంటాయి, ఎంతో సంపాదన జరుగుతుంది. ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయండి. భక్తి కూడా మనుష్యులు ఉదయమే లేచి చేస్తారు. మీరైతే జ్ఞానము కలవారు. మీరు పాత ప్రపంచపు చెత్తలో చిక్కుకోకూడదు. కానీ కొంతమంది పిల్లలు ఎలా చిక్కుకుపోతారంటే ఇక అడగకండి. ఆ చెత్త నుండి బయటకు రానే రారు. రోజంతా చెత్తే మాట్లాడుతూ ఉంటారు. జ్ఞాన విషయాలు బుద్ధిలోకి రానే రావు. కొందరు పిల్లలు ఎలా ఉన్నారంటే, వారు రోజంతా సేవలో పరుగెడుతూ ఉంటారు. తండ్రి సేవను ఎవరైతే చేస్తారో, వారే తండ్రికి గుర్తుకొస్తారు కూడా. ఈ సమయములో మనోహర్ (మనోహర్ దాది) సేవలో అందరికన్నా ఎక్కువగా తత్పరులై ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. ఈ రోజు కర్నాల్ అనే చోటుకు వెళ్ళారు, రేపు మరో చోటుకు వెళ్తారు, ఇలా సేవలో పరుగెడుతూ ఉంటారు. ఎవరైతే పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారో, వారు సేవ ఏమి చేస్తారు! తండ్రికి ఎవరు ప్రియమనిపిస్తారు? ఎవరైతే మంచి సేవ చేస్తారో, ఎవరికైతే రాత్రింబవళ్ళు సేవ యొక్క చింతే ఉంటుందో, తండ్రి హృదయముపైకి కూడా వారే ఎక్కుతారు. ఘడియ-ఘడియ ఇటువంటి పాటలను మీరు వింటూ ఉన్నా సరే స్మృతి ఉంటుంది, ఎంతోకొంత నషా ఎక్కుతుంది. బాబా అన్నారు, ఎప్పుడైనా ఎవరికైనా ఉదాసీనత కలిగితే, ఈ పాటలు వేసుకున్నట్లయితే మళ్ళీ సంతోషము వచ్చేస్తుంది. ఓహో! మేము విశ్వానికి యజమానిగా అవుతాము! బాబా కేవలము - నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. ఇది ఎంత సహజమైన చదువు. అందరి వద్దా ఉండాలని చెప్పి బాబా 10-12 మంచి-మంచి పాటలను ఏరి ఉంచారు. అయినా కానీ మర్చిపోతారు. కొందరైతే నడుస్తూ-నడుస్తూ చదువునే వదిలేస్తారు. మాయ దాడి చేస్తుంది. తండ్రి తమోప్రధాన బుద్ధిని సతోప్రధానముగా తయారుచేయడానికి ఎంత సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీకు తప్పు-ఒప్పులను ఆలోచించే బుద్ధి లభించింది. ఓ పతిత-పావనా రండి అని పిలవడము కూడా తండ్రినే పిలుస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున ఇక పావనముగా తయారవ్వాలి కదా. మీ తలపై జన్మ-జన్మాంతరాల భారము ఉంది, దాని కొరకు ఎంతగా స్మృతి చేస్తారో మరియు పవిత్రముగా అవుతారో, అంతగా సంతోషము కూడా ఉంటుంది. సేవ అయితే చేస్తూనే ఉంటారు కానీ దానితోపాటుగా నేను తండ్రిని ఎంత సమయము స్మృతి చేస్తున్నాను అన్న లెక్కను కూడా చూసుకోవాలి. స్మృతి చార్టును ఎవరూ పెట్టలేకపోతారు. పాయింట్లు అయితే వ్రాస్తారు కానీ స్మృతిని మర్చిపోతారు. తండ్రి అంటారు, మీరు స్మృతిలో ఉంటూ భాషణ చేసినట్లయితే ఎంతో బలము లభిస్తుంది. తండ్రి అంటారు, నిజానికి నేనే వెళ్ళి ఎంతో మందికి సహాయము చేస్తాను. ఎవరిలోనైనా ప్రవేశించి నేనే వెళ్ళి సేవ చేస్తాను. సేవ అయితే చేయాలి కదా. ఎవరి భాగ్యమైనా తెరుచుకునేది ఉందంటే, వారికి అర్థము చేయించేవారిలో అంత తెలివి లేకపోతే నేను ప్రవేశించి సేవ చేసేస్తాను, అప్పుడు కొందరు ఎలా వ్రాస్తారంటే - బాబాయే ఈ సేవ చేసారు, నాలోనైతే అంతటి శక్తి లేదు, బాబాయే మురళిని వినిపించారు. కొందరికేమో తమ అహంకారము వచ్చేస్తుంది - నేను అంత బాగా అర్థము చేయించాను అని అనుకుంటారు. తండ్రి అంటారు, నేను కళ్యాణము చేయడానికి వారిలో ప్రవేశిస్తాను, అప్పుడు వారు బ్రాహ్మణి కంటే కూడా తీవ్రముగా ముందుకు వెళ్ళిపోతారు. ఎవరైనా తెలివితక్కువవారిని పంపిస్తే - వీరి కన్నా మేమే బాగా అర్థము చేయించగలము, వీరిలో గుణాలు కూడా లేవు, వీరి కన్నా మా అవస్థయే బాగుంది అని ఎదుటివారు అనుకుంటారు. కొందరు హెడ్ గా ఉంటారు, వారికి చాలా నషా ఎక్కిపోతుంది. వారు చాలా ఆడంబరముగా ఉంటారు. పెద్ద వ్యక్తులతో కూడా నువ్వు, నువ్వు అని సంబోధిస్తూ మాట్లాడుతారు. ఆమెను దేవీ-దేవీ అని పిలుస్తుంటే, అందులోనే సంతోషపడిపోతారు. ఇలాంటివారు కూడా ఎందరో ఉన్నారు. టీచరు కంటే విద్యార్థులు తెలివైనవారిగా అవుతారు. పరీక్షను పాస్ అయ్యిందైతే ఒక్క బాబాయే. వారు జ్ఞానసాగరుడు. వారి ద్వారా మీరు చదువుకుని, మళ్ళీ చదివిస్తారు. కొందరైతే బాగా ధారణ చేస్తారు. కొందరు మర్చిపోతారు. అన్నింటికన్నా ముఖ్యమైన పెద్ద విషయము స్మృతి యాత్ర. మన వికర్మలు ఎలా వినాశనమవుతాయి? కొందరు పిల్లలు ఎటువంటి నడవడిక నడుచుకుంటారంటే, ఇక అది ఈ బాబాకు మరియు ఆ బాబాకే తెలుసు.

ఇప్పుడు పిల్లలైన మీరు శిక్షల నుండి విముక్తులయ్యే ముఖ్యమైన పురుషార్థమునే చేయాలి. దీని కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్ర, దీని ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. కొందరు ధనము ద్వారా సహాయము చేస్తారు, దాని ద్వారా మేము షావుకారులుగా అవుతాము అని భావిస్తారు, కానీ పురుషార్థమైతే శిక్షల నుండి రక్షించుకునేందుకు చేయవలసిందే. లేకపోతే బాబా ఎదురుగా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. జడ్జి కుమారుడు తప్పుడు పని చేస్తే ఆ జడ్జికి కూడా సిగ్గు అనిపిస్తుంది కదా. బాబా కూడా అంటారు, నేను ఎవరికైతే పాలన చేస్తున్నానో, వారిని శిక్షిస్తానా! ఆ సమయములో తల దించుకుని అయ్యో-అయ్యో అని అంటూ ఉంటారు - బాబా ఇంత అర్థము చేయించారు, చదివించారు, అయినా నేను శ్రద్ధ పెట్టలేదే. తండ్రితోపాటు ధర్మరాజు కూడా ఉన్నారు కదా. వారికి అందరి జన్మపత్రి గురించి తెలుసు. ఇప్పుడైతే మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు. పది సంవత్సరాలు పవిత్రతతో నడుచుకున్న తర్వాత అకస్మాత్తుగా మాయ ఎలాంటి దెబ్బ వేసిందంటే ఇక చేసుకున్నా సంపాదనంతా పోగొట్టుకున్నారు, పతితముగా అయిపోయారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు జరుగుతూ ఉంటాయి. చాలామంది పడిపోతారు. మాయ తుఫానులలో రోజంతా అలజడి చెందుతూ ఉంటారు, ఇక తండ్రినే మర్చిపోతారు. తండ్రి ద్వారా మనకు అనంతమైన రాజ్యాధికారము లభిస్తుంది అన్న సంతోషము ఉండదు. కామము తర్వాత మోహము కూడా ఉంది. ఇందులో నష్టోమోహులుగా అవ్వవలసి ఉంటుంది. పతితులపై ఏం మనసు పెట్టుకోవాలి. అయితే, వారికి కూడా మేము తండ్రి పరిచయాన్ని ఇచ్చి పైకి లేపాలి అన్న ఆలోచన ఉండాలి. వారిని ఏ విధంగా శివాలయానికి యోగ్యులుగా తయారుచేయాలి అని లోలోపల ఈ యుక్తిని రచించండి. ఇక్కడ మోహము విషయము కాదు. ఎంత ప్రియమైన సంబంధీకులైనా సరే, వారికి కూడా అర్థము చేయిస్తూ ఉండండి. ఎవరి పట్ల కూడా గాఢమైన ప్రేమ బంధము ఏర్పడకూడదు. లేదంటే బాగుపడలేరు. దయార్ద్ర హృదయలుగా అవ్వాలి. మీపై మీరు కూడా దయ చూపించుకోవాలి మరియు ఇతరులపై కూడా దయ చూపించాలి. తండ్రికి కూడా దయ కలుగుతుంది. నేను ఎంత మందిని నా సమానముగా తయారుచేస్తున్నాను అన్నది చూసుకోవాలి. తండ్రికి ఋజువును చూపించాలి. నేను ఎంతమందికి పరిచయాన్ని ఇచ్చాను. పరిచయము పొందినవారు కూడా వ్రాస్తారు - బాబా, నాకు వీరి ద్వారా పరిచయము చాలా బాగా లభించింది. బాబా వద్దకు ఈ విధముగా ఋజువులు వస్తే అప్పుడు బాబా - అవును, వీరు సేవ చేస్తున్నారు అని భావిస్తారు. బాబా, ఈ బ్రాహ్మణి చాలా చురుకైనవారు, ఈమె చాలా మంచి సేవ చేస్తున్నారు, మమ్మల్ని బాగా చదివిస్తున్నారు అని బాబాకు వ్రాయాలి. యోగములో పిల్లలు ఫెయిల్ అయిపోతారు. వారికి స్మృతి చేసే తెలివి లేదు. బాబా అర్థము చేయిస్తున్నారు - భోజనము చేసేటప్పుడు కూడా శివబాబాను స్మృతి చేస్తూ తినండి. ఎక్కడికైనా తిరగడానికి, విహరించడానికి వెళ్ళినప్పుడు కూడా శివబాబాను స్మృతి చేయండి. పరచింతన విషయాలను మాట్లాడుకోకండి. ఏదైనా విషయము గురించి ఆలోచనలు వచ్చినా కానీ మళ్ళీ తండ్రిని స్మృతి చేయండి అనగా కార్య-వ్యవహారాలకు సంబంధించినవి కూడా ఆలోచిస్తారు, మళ్ళీ బాబా స్మృతిలో నిమగ్నమైపోతారు. తండ్రి అంటారు, కర్మలైతే చేయండి, నిద్రపోండి కూడా, వాటితో పాటు స్మృతి కూడా చేయండి. తక్కువలో తక్కువ ఎనిమిది గంటల వరకు చేరుకోవాలి - ఇది చివరి సమయము కల్లా సాధ్యమవుతుంది. మెల్లమెల్లగా మీ చార్టును పెంచుతూ వెళ్ళండి. కొందరు - నేను రెండు గంటలు స్మృతిలో ఉన్నాను అని వ్రాస్తారు, మళ్ళీ నడుస్తూ-నడుస్తూ చార్టు ఢీలా అయిపోతుంది. ఇక అది కూడా మాయ పోగొట్టేస్తుంది. మాయ చాలా శక్తివంతమైనది. ఎవరైతే ఈ సేవలో రోజంతా బిజీగా ఉంటారో, వారే స్మృతి కూడా చేయగలుగుతారు. ఘడియ-ఘడియ తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉంటారు. బాబా స్మృతికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. నేను స్మృతిలో ఉండలేకపోతున్నాను అని స్వయం కూడా ఫీల్ అవుతారు. స్మృతిలోనే మాయ విఘ్నాలు వేస్తుంది. చదువైతే చాలా సహజము. తండ్రి ద్వారా మనము చదువుకుంటాము కూడా. ఎంత ధనము తీసుకుంటారో, అంత షావుకారులుగా అవుతారు. తండ్రి అయితే అందరినీ చదివిస్తారు కదా. వాణి అందరి వద్దకు వెళ్తుంది, కేవలము మీ ఒక్కరే కాదు, అందరూ చదువుతున్నారు. వాణి రాకపోతే గోల పెడతారు. కొందరు ఎలా ఉన్నారంటే, వారు అసలు వాణిని విననే వినరు. అలాగే నడుస్తూ ఉంటారు. మురళి వినాలి అనే అభిరుచి ఉండాలి. ఈ పాటలు ఎంత ఫస్ట్ క్లాస్ అయినవి - బాబా, మేము మా వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము. బాబా, నేను ఎవరైనా, ఏ విధంగా ఉన్నా, ఒంటి కన్నే కలిగి ఉన్నా, ఎలా ఉన్నా నీ దానినే అని అంటారు కూడా. అది సరే కానీ ఛీ-ఛీగా ఉన్నవారి నుండైతే మంచివారిగా అవ్వాలి కదా. మొత్తము ఆధారమంతా యోగము మరియు చదువుపైనే ఉంది.

తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత ఈ ఆలోచన ప్రతి బిడ్డకు రావాలి - నేను తండ్రికి చెందినవానిగా అయ్యాను కావున స్వర్గములోకి తప్పకుండా వెళ్తాను కానీ నేను స్వర్గములోకి వెళ్ళి ఏమవ్వాలి అన్నది కూడా ఆలోచించాలి. మంచి రీతిలో చదువుకోండి. దైవీ గుణాలను ధారణ చేయండి. కోతిలా ఉన్నవారు కోతిలానే ఉంటే ఇక ఏం పదవిని పొందుతారు? అక్కడ కూడా ప్రజలు, నౌకర్లు మొదలైనవారంతా కావాలి కదా. చదువుకున్నవారి ముందు చదువుకోనివారు దాసిలా ఉంటారు. ఎంత పురుషార్థము చేస్తారో అంత మంచి సుఖము పొందుతారు. మంచి ధనవంతులుగా అయినట్లయితే గౌరవము బాగా ఉంటుంది. చదువుకున్నవారికి గౌరవము బాగుంటుంది. తండ్రి అయితే సలహా ఇస్తూ ఉంటారు. తండ్రి స్మృతిలో శాంతిగా ఉండండి. కానీ బాబాకు తెలుసు - సమ్ముఖముగా ఉండేవారి కంటే దూరముగా ఉండేవారే ఎక్కువ స్మృతిలో ఉంటారు మరియు మంచి పదవిని పొందుతారు. భక్తి మార్గములో కూడా ఇలా జరుగుతుంది. కొందరు భక్తులు మంచి ఫస్ట్ క్లాస్ గా ఉంటారు, వారు తమ గురువుల కన్నా ఎక్కువగా స్మృతిలో ఉంటారు. ఎవరైతే చాలా మంచి భక్తిని చేస్తూ ఉంటారో, వారే ఇక్కడికి వస్తారు. అందరూ భక్తులే కదా. సన్యాసులు మొదలైనవారు రారు, భక్తులందరూ భక్తి చేస్తూ-చేస్తూ ఇక్కడికి వచ్చేస్తారు. తండ్రి ఎంత స్పష్టముగా అర్థము చేయిస్తున్నారు. మీరు జ్ఞానాన్ని అర్థము చేసుకుంటున్నారు అంటే మీరు బాగా భక్తి చేసారు అని నిరూపణ అవుతుంది. ఎక్కువ భక్తి చేసేవారు ఎక్కువ చదువుతారు. తక్కువ భక్తి చేసేవారు తక్కువ చదువుతారు. ముఖ్యమైన శ్రమయే స్మృతికి సంబంధించినది. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి మరియు చాలా మధురముగా కూడా తయారవ్వాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే, సర్వీసబుల్, విశ్వాసపాత్రులైన, ఆజ్ఞాకారులైన పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరు ఎంత ప్రియమైన సంబంధీకులైనా కానీ వారి పట్ల మోహపు బంధము ఏర్పడకూడదు. నష్టోమోహులుగా అవ్వాలి. యుక్తిగా అర్థము చేయించాలి. మీ పట్ల మరియు ఇతరుల పట్ల దయ చూపించాలి.

2. తండ్రిని మరియు టీచరును ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు, విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు అన్న నషా ఉండాలి! నడుస్తూ-తిరుగుతూ స్మృతిలో ఉండాలి, పరచింతన విషయాలను మాట్లాడకూడదు.

వరదానము:-
అవినాశీ ఆత్మిక రంగు యొక్క సత్యమైన హోలీ ద్వారా తండ్రి సమాన స్థితి యొక్క అనుభవీ భవ

మీరు పరమాత్ముని రంగులో రంగరించబడిన హోలీ (పవిత్ర) ఆత్మలు. సంగమయుగము హోలీ (పవిత్ర) జీవితము యొక్క యుగము. అవినాశీ ఆత్మిక రంగు అంటుకున్నట్లయితే సదా కాలము కొరకు తండ్రి సమానముగా అవుతారు. కనుక మీ హోలీ ఏమిటంటే - సాంగత్యపు రంగు ద్వారా తండ్రి సమానముగా అవ్వటము. ఆ రంగు ఎంత పక్కాగా ఉండాలంటే ఇక ఇతరులను కూడా సమానముగా తయారుచెయ్యాలి. ప్రతి ఆత్మపైన అవినాశీ జ్ఞానము యొక్క రంగును, స్మృతి యొక్క రంగును, అనేక శక్తుల రంగును, గుణాల రంగును, శ్రేష్ఠ వృత్తి, దృష్టి, శుభ భావన, శుభ కామనల ఆత్మిక రంగును వెయ్యండి.

స్లోగన్:-
దృష్టిని అలౌకికముగా, మనసును శీతలముగా, బుద్ధిని దయార్ద్ర హృదయము కలదిగా మరియు నోటిని మధురముగా తయారుచేసుకోండి.

అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

సత్యత యొక్క శక్తి స్వరూపులుగా అయ్యి, నషాతో మాట్లాడండి, నషాతో చూడండి. మనము ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క అనుచరులము, ఈ స్మృతితో అయథార్థాన్ని యథార్థములోకి తీసుకురావాలి. సత్యమును ప్రసిద్ధము చెయ్యాలి అంతేకానీ దానిని దాచిపెట్టకూడదు కానీ అది సభ్యతతో చెయ్యాలి. ‘మేము శివుని శక్తులము’ అన్న నషా ఉండాలి. శక్తులు ధైర్యము ఉంచితే సర్వశక్తివంతుడు సహాయము చేస్తారు.