14-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - సుఖ-దుఃఖాల ఆట గురించి మీకు మాత్రమే తెలుసు, అర్ధకల్పము సుఖము మరియు అర్ధకల్పము దుఃఖము, తండ్రి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వడానికి వస్తారు’’

ప్రశ్న:-
కొంతమంది పిల్లలు ఏ విషయములో తమ మనసును తాము సంతోషపరచుకుని, తమకన్నీ తెలుసు అని అనుకుంటారు?

జవాబు:-
కొందరు ఏమనుకుంటారంటే - మేము సంపూర్ణమైపోయాము, మేము పూర్తిగా తయారైపోయాము. అలా భావిస్తూ తమ మనసును తాము సంతోషపరచుకుంటారు. ఇలా భావించడము కూడా - మాకు అన్నీ తెలుసు అని అనుకోవడము వంటిదే. బాబా అంటారు - మధురమైన పిల్లలూ, ఇప్పుడు ఇంకా ఎంతో పురుషార్థము చేయాలి. మీరు పావనముగా అయిపోతే మరి ప్రపంచము కూడా పావనమైనది కావాలి. రాజధాని ఇంకా స్థాపన అవ్వనున్నది, ఒక్కరే వెళ్ళలేరు.

పాట:-
నీవే తల్లివి, తండ్రివి నీవే...

ఓంశాంతి
ఇక్కడ పిల్లలకు తమ పరిచయము లభిస్తుంది. తండ్రి కూడా - మనమందరమూ ఆత్మలమే అని అంటారు. అందరూ మనుష్యులే. పెద్దవారైనా, చిన్నవారైనా, ప్రెసిడెంటు అయినా లేక రాజు రాణి అయినా, అందరూ మనుష్యులే. ఇప్పుడు తండ్రి అంటారు, అందరూ ఆత్మలే, నేను ఆత్మలందరికీ తండ్రిని, అందుకే నన్ను పరమపిత పరమ ఆత్మ అని అంటారు అనగా సుప్రీమ్. పిల్లలకు తెలుసు - ఆత్మలైన మనకు వారు తండ్రి, మనమందరమూ సోదరులము, ఆ తర్వాత బ్రహ్మా ద్వారా సోదరీ-సోదరుల సంబంధములో ఉన్నత కులము లేక కనిష్ఠ కులము ఉంటుంది. ఆత్మలందరూ అయితే ఆత్మలే. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. మనుష్యులైతే ఇవేమీ అర్థం చేసుకోరు. మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రి గురించైతే ఎవ్వరికీ తెలియదు. ఓ భగవంతుడా, ఓ మాతా పితా అని మనుష్యులు గానము చేస్తూ ఉంటారు ఎందుకంటే ఉన్నతోన్నతమైనవారు ఒక్కరే ఉండాలి కదా. వారు అందరికీ తండ్రి, అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు. సుఖము మరియు దుఃఖము యొక్క ఆటను గురించి కూడా మీకే తెలుసు. ఇప్పుడిప్పుడే సుఖము ఉంటుంది, ఇప్పుడిప్పుడే దుఃఖము ఉంటుంది అని మనుష్యులు భావిస్తారే కానీ అర్ధకల్పము సుఖము ఉంటుంది, అర్ధకల్పము దుఃఖము ఉంటుంది అని భావించరు. సతోప్రధానము, సతో, రజో, తమో ఉన్నాయి కదా. శాంతిధామములో ఆత్మలమైన మనము ఉంటాము, కావున అక్కడ అంతా సత్యమైన బంగారమే. అక్కడ ఎవరిలోనూ మలినాలు ఉండవు. అందరిలో తమ-తమ పాత్రలు నిండి ఉంటాయి కానీ ఆత్మలన్నీ అక్కడ పవిత్రముగానే ఉంటాయి. అపవిత్ర ఆత్మలు అక్కడ ఉండవు. ఈ సమయములో మళ్ళీ ఒక్క పవిత్ర ఆత్మ కూడా ఇక్కడ ఉండదు. బ్రాహ్మణ కులభూషణులైన మీరు కూడా పవిత్రముగా అవుతూ ఉన్నారు. మీరు ఇప్పుడు స్వయాన్ని దేవతలుగా భావించలేరు. దేవతలు సంపూర్ణ నిర్వికారులు. మిమ్మల్ని సంపూర్ణ నిర్వికారులు అని అనరు. దేవతలను తప్ప ఇంకెవరినైనా సరే, సంపూర్ణ నిర్వికారులు అని అనలేరు. ఈ విషయాలను కూడా మీరే వింటారు - జ్ఞానసాగరుని నోటి ద్వారా. జ్ఞానసాగరుడు ఒక సారి మాత్రమే వస్తారని కూడా మీకు తెలుసు. మనుష్యులైతే పునర్జన్మలను తీసుకుని మళ్ళీ వస్తారు. కొందరు జ్ఞానము తీసుకుని వెళ్తే, ఆ సంస్కారాలను తీసుకుని వెళ్తే, వారు మళ్ళీ తిరిగి వస్తారు, వచ్చి వింటారు. ఒకవేళ 6-8 సంవత్సరాలు పిల్లలుగా అయితే, కొందరికి బాగా అర్థమైపోతుంది కూడా. ఆత్మ అయితే అదే కదా. ఈ జ్ఞానము విని వారికి బాగా అనిపిస్తుంది. నాకు మళ్ళీ తండ్రి నుండి ఆ జ్ఞానము లభిస్తోంది అని ఆత్మకు అనిపిస్తుంది. లోలోపల సంతోషము ఉంటుంది, ఇతరులకు కూడా నేర్పించడము మొదలుపెడతారు. తెలివైనవారిగా అయిపోతారు. యుద్ధాలు చేసేవారు కూడా ఆ సంస్కారాలను తీసుకుని వెళ్తారు కావున బాల్యము నుండే ఆ పనిలో సంతోషముగా నిమగ్నమైపోతారు. ఇప్పుడు మీరైతే పురుషార్థము చేసి కొత్త ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. మీరు అందరికీ ఇలా అర్థం చేయించవచ్చు - మీరు కొత్త ప్రపంచానికైనా యజమానులుగా అవ్వవచ్చు లేక శాంతిధామానికైనా యజమానులుగా అవ్వవచ్చు, శాంతిధామము మీ ఇల్లు - అక్కడి నుండి మీరు పాత్రను అభినయించడానికి ఇక్కడికి వచ్చారు. ఇది కూడా ఎవరికీ తెలియదు ఎందుకంటే ఆత్మ గురించే తెలియదు. మీకు కూడా - మేము నిరాకారీ ప్రపంచము నుండి ఇక్కడికి వచ్చాము అని, మేము బిందువు అని ఇంతకుముందు తెలియదు. భృకుటి మధ్యలో నక్షత్రము వంటి ఆత్మ ఉంటుంది అని సన్యాసులు కూడా అంటారు, అయినా వారి బుద్ధిలో పెద్ద రూపమే వస్తుంది. సాలిగ్రామము అని అనడము వల్ల పెద్ద రూపము అని అనుకుంటారు. ఆత్మ సాలిగ్రామము. యజ్ఞము రచించినప్పుడు కూడా అందులో పెద్ద-పెద్ద సాలిగ్రామాలను తయారుచేస్తారు. పూజ చేసే సమయములో సాలిగ్రామము యొక్క పెద్ద రూపమే బుద్ధిలో ఉంటుంది. తండ్రి అంటారు, ఇదంతా అజ్ఞానము. జ్ఞానాన్ని అయితే నేనే వినిపిస్తాను. మొత్తము ప్రపంచమంతటిలో ఇంకెవ్వరూ జ్ఞానాన్ని వినిపించలేరు. ఆత్మ కూడా బిందువేనని, అలాగే పరమాత్మ కూడా బిందువేనని ఎవ్వరూ అర్థం చేయించరు. వారు పరమాత్మను ఒక అఖండ జ్యోతిస్వరూపము అని అంటారు, పరమాత్మను బ్రహ్మము అని అంటారు. బ్రహ్మ తత్వాన్ని భగవంతునిగా భావిస్తారు, మళ్ళీ తమను తాము కూడా భగవంతునిగా పిలుచుకుంటారు. మనము పాత్రను అభినయించేందుకు చిన్న ఆత్మ రూపాన్ని ధరిస్తాము, తర్వాత ఆ పెద్ద జ్యోతిలో లీనమైపోతాము అని అంటారు. లీనమైపోయిన తర్వాత ఇంకేమిటి? పాత్ర కూడా లీనమైపోతుంది! ఇలా అనుకోవడం ఎంత పొరపాటు.

ఇప్పుడు తండ్రి వచ్చి క్షణములో జీవన్ముక్తిని ఇస్తారు, మళ్ళీ అర్ధకల్పము తర్వాత మెట్లు దిగుతూ జీవనబంధనములోకి వస్తారు, మళ్ళీ తండ్రి వచ్చి జీవన్ముక్తులుగా చేస్తారు, అందుకే వారిని సర్వుల సద్గతిదాత అని అంటారు. కావున పతిత-పావనుడైన తండ్రి ఎవరైతే ఉన్నారో, వారినే స్మృతి చేయాలి, వారి స్మృతి ద్వారానే మీరు పావనముగా అవుతారు. లేదంటే పావనముగా అవ్వలేరు. ఉన్నతోన్నతమైనవారు తండ్రి ఒక్కరే. కొంతమంది పిల్లలు ఏమనుకుంటారంటే - మేము సంపూర్ణమైపోయాము, మేము పూర్తిగా తయారైపోయాము. ఇలా భావిస్తూ తమ మనసును తాము సంతోషపరచుకుంటారు. ఇలా భావించడము కూడా - మాకు అన్నీ తెలుసు అని అనుకోవడము వంటిదే. బాబా అంటారు - మధురమైన పిల్లలూ, ఇప్పుడు ఇంకా ఎంతో పురుషార్థము చేయాలి. పావనముగా అయిపోతే మరి ప్రపంచము కూడా పావనమైనది కావాలి. అక్కడికి ఒక్కరే వెళ్ళలేరు. మేము త్వరగా కర్మాతీతమైపోవాలి అని ఎవరు ఎంత ప్రయత్నము చేసినా సరే, అది జరగదు. రాజధాని స్థాపన అవ్వనున్నది. విద్యార్థులు ఎవరైనా చదువులో బాగా తెలివైనవారిగా అయిపోయినా కానీ, పరీక్ష మాత్రము సమయానికే జరుగుతుంది కదా. పరీక్ష ఏమీ త్వరగా జరగదు. సమయము వచ్చినప్పుడే మీ చదువు యొక్క రిజల్టు బయటపడుతుంది. ఎంత మంచి పురుషార్థము చేసినా సరే - మేము పూర్తిగా తయారైపోయాము అని అనలేరు. అలా అవ్వదు. 16 కళల సంపూర్ణముగా ఇప్పుడు ఏ ఆత్మా తయారవ్వలేదు. చాలా పురుషార్థము చేయాలి. నేను సంపూర్ణమైపోయాను అని మీ మనసును మీరు సంతోషపరచుకోవడము కాదు. అలా కాదు. అంతిమములోనే సంపూర్ణము అవ్వవలసి ఉంటుంది. నాకు అన్నీ తెలుసు అని భావించకూడదు. ఇక్కడ మొత్తము రాజధాని అంతా స్థాపన అవ్వనున్నది. అయితే, ఇంకా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది అనైతే భావిస్తారు. మిసైల్స్ కూడా వెలువడ్డాయి. వీటిని తయారుచేయడానికి కూడా మొదటిలో సమయము పడుతుంది, కానీ అభ్యాసము అయిపోయిన తర్వాత వెంటవెంటనే తయారుచేస్తారు. ఇవన్నీ కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. వినాశనము కొరకు బాంబులను తయారుచేస్తూ ఉంటారు. గీతలో కూడా ముసలము అన్న పదము ఉంది. దీనినే శాస్త్రాలలో కడుపులో నుండి ముసలము వెలువడిందని, దాని వలన వినాశనము జరిగిందని వ్రాశారు. ఇవన్నీ అసత్యమైన విషయాలు కదా. వీటినే మిసైల్స్ అంటారని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ వినాశనానికి ముందే మనము తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. పిల్లలకు తెలుసు - మనము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారము, అప్పుడు సత్యమైన బంగారముగా ఉండేవారము. భారత్ ను సత్యఖండము అని అంటారు. ఇప్పుడు అసత్య ఖండముగా అయిపోయింది. బంగారము కూడా సత్యమైనది మరియు అసత్యమైనది ఉంటుంది కదా. తండ్రి మహిమ ఏమిటి అనేది ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, సత్యము, చైతన్యము. ఇంతకుముందు కేవలము గాయనము మాత్రమే చేస్తుండేవారు. తండ్రి సర్వ గుణాలను మనలో నింపుతున్నారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి అంటారు, మొట్టమొదట స్మృతియాత్ర చేయండి, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి. నా పేరే పతిత-పావనుడు. ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు, కానీ వారు వచ్చి ఏం చేస్తారు, ఇది ఎవరికీ తెలియదు. ఒక్క సీతే ఉండరు కదా. మీరందరూ సీతలే.

పిల్లలైన మీకు తండ్రి అనంతములోకి తీసుకువెళ్ళేందుకు అనంతమైన విషయాలను వినిపిస్తారు. స్త్రీ-పురుషులందరూ సీతలేనని మీరు అనంతమైన బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. అందరూ రావణుడి ఖైదులో ఉన్నారు. తండ్రి (రాముడు) వచ్చి అందరినీ రావణుడి ఖైదు నుండి విముక్తులను చేస్తారు. రావణుడు ఒక మనిషి కాదు. ప్రతి ఒక్కరిలోనూ పంచ వికారాలు ఉన్నాయి అని అర్థం చేయించడం జరుగుతుంది, అందుకే రావణ రాజ్యము అని అనడం జరుగుతుంది. ఈ ప్రపంచము పేరు వికారీ ప్రపంచము, అది నిర్వికారీ ప్రపంచము, రెండింటికీ వేరు-వేరు పేర్లు ఉన్నాయి. ఇది వేశ్యాలయము మరియు అది శివాలయము. నిర్వికారీ ప్రపంచానికి ఈ లక్ష్మీ-నారాయణులు యజమానులుగా ఉండేవారు. వీరి ముందుకు వికారీ మనుష్యులు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. వికారీ రాజులు ఆ నిర్వికారీ రాజుల ఎదురుగా తల వంచి నమస్కరిస్తారు. ఇది కూడా మీకు తెలుసు. మనుష్యులకు కల్పము ఆయువు గురించే తెలియదు కావున రావణ రాజ్యము ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయాన్ని వారు ఎలా అర్థం చేసుకుంటారు. రెండూ సగము-సగము ఉండాలి కదా. రామ రాజ్యము, రావణ రాజ్యము ఎప్పటినుండి ప్రారంభమవుతాయి, అంతా తారుమారు చేసేశారు.

ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ 5000 సంవత్సరాల చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీకు తెలిసింది - మనము 84 జన్మల పాత్రను అభినయిస్తాము, ఆ తర్వాత మనం ఇంటికి వెళ్తాము. సత్య, త్రేతాయుగాలలో కూడా పునర్జన్మలు తీసుకుంటారు. అది రామ రాజ్యము, ఆ తర్వాత రావణ రాజ్యములోకి రావలసి ఉంటుంది. ఇది గెలుపు-ఓటముల ఆట. మీరు గెలిస్తే స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఓడిపోతే నరకానికి యజమానులుగా అవుతారు. స్వర్గము వేరు. ఎవరైనా చనిపోతే స్వర్గానికి వెళ్ళారు అని అంటారు. ఇప్పుడు మీరు అలా అనరు ఎందుకంటే స్వర్గము ఎప్పుడు ఉంటుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. వాళ్ళు జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని లేక నిర్వాణము చెందారని అంటారు. జ్యోతి జ్యోతిలో అలా కలిసిపోదు అని మీరు అంటారు. సర్వుల సద్గతిదాత ఒక్కరే అని అంటూ ఉంటారు. స్వర్గము అని సత్యయుగాన్ని అంటారు. ఇప్పుడు ఉన్నది నరకము. ఇది భారత్ విషయమే. అంతేకానీ పైన స్వర్గమేమీ లేదు. దిల్వాడా మందిరములో పైన స్వర్గాన్ని చూపించారు, కావున తప్పకుండా స్వర్గము పైనే ఉంటుందని మనుష్యులు భావిస్తారు. అరే, పైకప్పు పైన మనుష్యులు ఎలా ఉంటారు? అలా భావించేవారు బుద్ధిహీనులే కదా. ఇప్పుడు మీరు స్పష్టముగా అర్థం చేయిస్తారు. ఇక్కడే స్వర్గవాసులు ఉండేవారని, ఇక్కడే మళ్ళీ నరకవాసులుగా అవుతారని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ స్వర్గవాసులుగా అవ్వాలి. ఈ జ్ఞానము నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యేందుకే ఉంది. కథ కూడా సత్యనారాయణుడిగా తయారయ్యే కథనే వినిపిస్తారు. సీతా-రాముల కథ అని అనరు, ఇది నరుడి నుండి నారాయణుడిగా అయ్యే కథ. ఉన్నతోన్నతమైన పదవి లక్ష్మీ-నారాయణులది. సీతా-రాములకు ఎంతైనా రెండు కళలు తగ్గిపోతాయి. పురుషార్థము ఉన్నత పదవి పొందడానికే చేయడము జరుగుతుంది, కానీ ఒకవేళ అంత చేయకపోతే, వెళ్ళి చంద్రవంశీయులుగా అవుతారు. భారతవాసులు పతితముగా అయినప్పుడు తమ ధర్మాన్ని మర్చిపోతారు. క్రిస్టియన్లు కూడా సతో నుండి తమోప్రధానముగా అయ్యారు కానీ ఎంతైనా వారు క్రిస్టియన్ సాంప్రదాయులుగానే ఉన్నారు కదా. ఆది సనాతన దేవీ-దేవతా సాంప్రదాయము వారైతే తమను తాము హిందువులుగా పిలుచుకుంటారు. వాస్తవానికి మేము దేవీ-దేవతా ధర్మానికి చెందినవారము అని కూడా వారు భావించరు. విచిత్రము కదా. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు? అని మీరు ప్రశ్నిస్తే వారు తికమకపడతారు. దేవతలను పూజిస్తున్నారంటే తప్పకుండా దేవతా ధర్మానికి చెందినవారనే కదా. కానీ వారు అది అర్థం చేసుకోరు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మీ బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. మొదట మనము సూర్యవంశీయులుగా ఉండేవారమని మీకు తెలుసు, ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. మనము పునర్జన్మలు తీసుకుంటూ వస్తాము. మీలో కూడా కొద్దిమందికే యథార్థ రీతిలో తెలుసు. స్కూల్లో కూడా కొందరు విద్యార్థుల బుద్ధిలో బాగా కూర్చుంటుంది, కొందరి బుద్ధిలో తక్కువగా కూర్చుంటుంది. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే పాస్ అవ్వరో, వారిని క్షత్రియులు అని అంటారు. వారు చంద్రవంశములోకి వెళ్ళిపోతారు. రెండు కళలు తగ్గిపోయాయి కదా. అటువంటివారు సంపూర్ణముగా అవ్వలేరు. మీ బుద్ధిలో ఇప్పుడు అనంతమైన చరిత్ర-భౌగోళికము ఉన్నాయి. ఆ స్కూల్లోనైతే హద్దులోని చరిత్ర-భౌగోళికము చదువుకుంటారు. వారికి మూలవతనము మరియు సూక్ష్మవతనము గురించి తెలియదు. సాధు-సన్యాసులు మొదలైనవారెవరి బుద్ధిలోనూ ఇది లేదు. మూలవతనములో ఆత్మలు ఉంటాయని మీ బుద్ధిలో ఉంది. ఇది స్థూలవతనము. మీ బుద్ధిలో మొత్తము జ్ఞానమంతా ఉంది. ఇక్కడ స్వదర్శన చక్రధారి సైన్యము కూర్చుని ఉంది. ఈ సైన్యము, తండ్రిని మరియు చక్రాన్ని స్మృతి చేస్తారు. మీ బుద్ధిలో జ్ఞానము ఉంది. అంతేకానీ మారణాయుధాలు మొదలైనవేవీ లేవు. జ్ఞానము ద్వారా స్వదర్శనము జరిగింది. తండ్రి రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. ఇప్పుడు తండ్రి ఇస్తున్న ఆజ్ఞ ఏమిటంటే - రచయితను స్మృతి చేయండి, తద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ఎవరు ఎంతగా స్వదర్శన చక్రధారులుగా అవుతారో, ఇతరులను తయారుచేస్తారో, ఎవరైతే ఎక్కువ సేవ చేస్తారో, వారికి ఉన్నత పదవి లభిస్తుంది. ఇది సామాన్యమైన విషయమే. గీతలో శ్రీకృష్ణుడి పేరు వేయడము వలనే తండ్రిని మర్చిపోయారు. శ్రీకృష్ణుడిని అందరికీ తండ్రి అని అనలేరు. వారసత్వము తండ్రి నుండే లభిస్తుంది. పతిత-పావనుడు అని తండ్రిని అంటారు, వారు ఎప్పుడైతే వస్తారో, అప్పుడే మనము తిరిగి శాంతిధామానికి వెళ్ళగలుగుతాము. మనుష్యులు ముక్తి కొరకు ఎంత కష్టపడుతూ ఉంటారు. మీరు ఎంత సహజముగా అర్థం చేయిస్తారు. పతిత-పావనుడైతే పరమాత్మయే కదా, మరి మీరు గంగానదిలో స్నానాలు చేయడానికి ఎందుకు వెళ్తారు అని అడగండి! కొందరు గంగానదీ తీరము వద్దకు వెళ్ళి కూర్చుంటారు, అక్కడే చనిపోవాలి అని అనుకుంటారు. పూర్వము బెంగాల్ లో, ఎవరైనా చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు గంగానది వద్దకు తీసుకువెళ్ళి హరీ, హరీ అని అనమనేవారు. అలా చేస్తే ఆ ఆత్మ ముక్తి పొందుతుంది అని భావిస్తారు. ఇప్పుడు ఆత్మ అయితే బయటకు వెళ్ళిపోయింది. ఆత్మ అయితే పవిత్రముగా అవ్వలేదు. ఆత్మను పవిత్రముగా తయారుచేసేది ఆ తండ్రి మాత్రమే, వారినే పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తగా తయారుచేస్తారు, అంతేకానీ కొత్తగా ప్రపంచాన్ని రచించరు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రిలో ఏ గుణాలైతే ఉన్నాయో వాటిని స్వయములో నింపుకోవాలి. పరీక్షకు ముందే పురుషార్థము చేసి స్వయాన్ని సంపూర్ణ పావనముగా తయారుచేసుకోవాలి, ఇందులో నాకు అన్నీ తెలుసు అని భావించకూడదు.

2. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి మరియు అలా తయారుచేయాలి. తండ్రిని మరియు చక్రాన్ని స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన విషయాలను విని, మీ బుద్ధిని అనంతములోకి ఉంచుకోవాలి. హద్దులలోకి రాకూడదు.

వరదానము:-
స్వస్థితి ద్వారా పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే సంగమయుగీ విజయీ రత్న భవ

పరిస్థితులపై విజయము ప్రాప్తి చేసుకునేందుకు సాధనము - స్వస్థితి. ఈ దేహము కూడా పరాయిది, స్వయానిది కాదు. స్వస్థితి మరియు స్వధర్మము సదా సుఖపు అనుభవాన్ని చేయిస్తాయి. మరియు ప్రకృతి ధర్మము అనగా పర ధర్మము లేక దేహపు స్మృతి ఏదో ఒక రకమైన దుఃఖపు అనుభవాన్ని చేయిస్తుంది. కావున ఎవరైతే సదా స్వస్థితిలో ఉంటారో వారు సదా సుఖపు అనుభవాన్ని చేస్తారు, వారి వద్దకు దుఃఖపు అల రాలేదు. వారు సంగమయుగ విజయీ రత్నాలుగా అవుతారు.

స్లోగన్:-
పరివర్తనా శక్తి ద్వారా వ్యర్థ సంకల్పాల ప్రవాహము యొక్క వేగాన్ని సమాప్తము చెయ్యండి.

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

ఎక్కడ చూసినా నీవే నీవు అని లోకులు అంటారు మరియు మనము అంటాము, మేము ఏది చేసినా, ఎక్కడికి వెళ్ళినా బాబా నాతోనే ఉన్నారు అనగా నీవే నీవు. ఎలా అయితే కర్తవ్యము తోడుగా ఉందో అలా ప్రతి కర్తవ్యాన్ని చేయించేవారు కూడా సదా తోడుగా ఉన్నారు. చేసేవారు మరియు చేయించేవారు ఇరువురూ కంబైండుగా ఉన్నారు.