14-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మన బాబా తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అన్నది నిరంతరం గుర్తుండాలి, ఈ స్మృతియే మన్మనాభవ’’

ప్రశ్న:-
మాయ యొక్క ధూళి ఎప్పుడైతే కళ్ళల్లో పడుతుందో, అప్పుడు అన్నింటికన్నా ముందు ఏ పొరపాటు జరుగుతుంది?

జవాబు:-
మాయ చేయించే మొదటి పొరపాటు ఏమిటంటే - వారు చదువునే వదిలేస్తారు. భగవంతుడు చదివిస్తున్నారు అన్నది మర్చిపోతారు. తండ్రి పిల్లలే తండ్రి చదువును వదిలేస్తారు, ఇది కూడా విచిత్రము. లేదంటే జ్ఞానం ఎటువంటిదంటే లోలోపలే సంతోషంలో నాట్యం చేస్తూ ఉండాలి, కానీ మాయ యొక్క ప్రభావం తక్కువేమీ కాదు. అది చదువునే విడిచిపెట్టేలా చేస్తుంది. చదువును వదిలేసారు అంటే ఆబ్సెంట్ అయినట్లు.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఎవరైతే తక్కువగా అర్థం చేసుకుని ఉంటారో, వారికే అర్థం చేయించవలసి ఉంటుంది. కొందరు చాలా వివేకవంతులుగా అవుతారు. ఈ బాబా అయితే చాలా అద్భుతమైనవారని పిల్లలకు తెలుసు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నా కానీ - వీరు మన అనంతమైన తండ్రి కూడా, అనంతమైన శిక్షకుడు కూడా, అనంతమైన శిక్షణను ఇస్తారు, సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు అని లోలోపల భావిస్తారు. విద్యార్థుల బుద్ధిలోనైతే ఈ విషయాలు ఉండాలి కదా. అప్పుడు మిమ్మల్ని తమతో పాటు తప్పకుండా తీసుకువెళ్తారు. ఇది పురాతనమైన ఛీ-ఛీ ప్రపంచమని, ఇక్కడి నుండి పిల్లలను తీసుకువెళ్ళాలని తండ్రికి తెలుసు. ఎక్కడికి? ఇంటికి. ఎలాగైతే కన్యకు వివాహం జరిగినప్పుడు అత్తవారింటివారు వచ్చి కన్యను తమ ఇంటికి తీసుకువెళ్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. బాబా అర్థం చేయిస్తారు, పిల్లలకు - వీరు మా అనంతమైన తండ్రి కూడా, అనంతమైన శిక్షణను కూడా ఇస్తారు అన్నది తప్పకుండా అర్థమై ఉంటుంది. బాబా ఎంత గొప్పవారో, శిక్షణను కూడా అంతే గొప్పగా అనంతమైనదే ఇస్తారు. రచన యొక్క ఆదిమధ్యాంతాల రహస్యము కూడా పిల్లల బుద్ధిలో ఉంది. తండ్రి ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి మనల్ని తిరిగి తీసుకువెళ్తారని తెలుసు. ఈ విషయాన్ని లోపల గుర్తుంచుకున్నా, అదీ మన్మనాభవయే. నడుస్తూ-తిరుగుతూ, లేస్తూ-కూర్చుంటూ బుద్ధిలో ఇదే గుర్తుండాలి. అద్భుతమైనదానినే గుర్తు చేయడం జరుగుతుంది కదా. మంచి రీతిలో చదువుకోవడం ద్వారా, స్మృతి చేయడం ద్వారా మనం విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఇదైతే తప్పకుండా బుద్ధిలో నడవాలి. మొదట తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. టీచర్ తర్వాత లభిస్తారు. వీరు మా అనంతమైన ఆత్మిక తండ్రి అని పిల్లలకు తెలుసు. సహజంగా స్మృతిని కలిగించేందుకు బాబా యుక్తులను తెలియజేస్తారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. ఆ స్మృతి ద్వారానే అర్ధకల్పం యొక్క వికర్మలు వినాశనమవుతాయి. పావనముగా అవ్వడానికి మీరు జన్మ-జన్మాంతరాలూ భక్తి, జప-తపాదులు ఎన్నో చేశారు. మందిరాలకు వెళ్తారు, భక్తి చేస్తారు, మేము తరతరాలుగా చేస్తూ వచ్చామని భావిస్తారు. శాస్త్రాలను ఎప్పటి నుండి వింటున్నారు అని అడిగితే, తరతరాలుగా అని అంటారు. మనుష్యులకు ఏమీ తెలియదు. సత్యయుగములోనైతే శాస్త్రాలు ఉండనే ఉండవు. పిల్లలైన మీరైతే ఆశ్చర్యపోవాలి. తండ్రి తప్ప ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. వీరు తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా. వీరైతే మనకు తండ్రి. వీరికి తల్లి-తండ్రి ఎవరూ లేరు. శివబాబా ఎవరి సంతానము అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఈ విషయాలు బుద్ధిలో ఘడియ-ఘడియ గుర్తుండాలి - ఇదే మన్మనాభవ. టీచర్ చదివిస్తారు కానీ వారు స్వయం ఎవ్వరి నుండీ చదువుకోలేదు. వీరిని ఎవరూ చదివించలేదు. వారు నాలెడ్జ్ ఫుల్, మనుష్య సృష్టికి బీజరూపుడు, జ్ఞానసాగరుడు. వారు చైతన్యముగా ఉన్న కారణంగా అన్నీ వినిపిస్తారు. వారంటారు - పిల్లలూ, నేను ఎవరిలోకైతే ప్రవేశించానో, వీరి ద్వారా నేను మీకు ఆది నుండి మొదలుకొని ఈ సమయం వరకూ అన్ని రహస్యాలను అర్థం చేయిస్తాను. అంతిమము గురించైతే మళ్ళీ తర్వాత చెప్తాను. ఇప్పుడు అంతిమం వస్తుందని ఆ సమయంలో మీరు కూడా అర్థం చేసుకుంటారు. కర్మాతీత అవస్థను కూడా నంబరువారుగా చేరుకుంటారు. మీరు ఆ గుర్తులను కూడా చూస్తారు. పాత ప్రపంచము యొక్క వినాశనమైతే జరగాల్సిందే. దీనిని అనేక సార్లు చూసారు మరియు చూస్తూ ఉంటారు. కల్పపూర్వము ఏ విధంగానైతే చదువుకున్నారో, అలాగే చదువుకుంటారు. రాజ్యాన్ని తీసుకున్నారు మళ్ళీ పోగొట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నారు. తండ్రి మళ్ళీ చదివిస్తున్నారు. ఇది ఎంత సహజము. పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు - మేము నిజంగానే విశ్వానికి యజమానులుగా ఉండేవారము, మళ్ళీ బాబా వచ్చి మాకు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ విధంగా లోలోపల చింతన నడుస్తూ ఉండాలని బాబా సలహాను ఇస్తారు.

బాబా మనకు తండ్రి కూడా, టీచర్ కూడా. టీచర్ ను ఎప్పుడైనా మర్చిపోతారా! టీచర్ ద్వారానైతే చదువును చదువుకుంటూ ఉంటారు. కొందరి పిల్లల చేత మాయ ఎన్నో పొరపాట్లు చేయిస్తుంది. ఒక్కసారిగా కళ్ళల్లో ధూళి వేసేస్తుంది. వారు చదువునే వదిలేస్తారు. భగవంతుడు చదివిస్తున్నారు, ఇటువంటి చదువునే వదిలేస్తారా! చదువే ముఖ్యమైనది. అది కూడా ఎవరు వదిలేస్తారు? తండ్రి యొక్క పిల్లలు. మరి పిల్లలకు లోలోపల ఎంత సంతోషము ఉండాలి. తండ్రి ప్రతి విషయానికీ సంబంధించిన జ్ఞానాన్ని కల్పకల్పమూ ఇస్తారు. తండ్రి అంటారు - తక్కువలో తక్కువ ఈ విధంగానైనా నన్ను స్మృతి చేయండి. కల్పకల్పము మీరే అర్థం చేసుకుంటారు మరియు ధారణ చేస్తారు. వీరికి తండ్రి అంటూ ఎవరూ లేరు, వీరే అనంతమైన తండ్రి. వీరు అద్భుతమైన తండ్రి కదా. నాకు ఎవరైనా తండ్రి ఉన్నారా, చెప్పండి? శివబాబా ఎవరి సంతానము? ఈ చదువు కూడా అద్భుతమైనది, దీనిని ఈ సమయంలో తప్ప ఇంకెప్పుడూ చదువుకోలేరు మరియు కేవలం బ్రాహ్మణులైన మీరే చదువుకుంటారు. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ మనం పావనముగా అవుతామని కూడా మీకు తెలుసు. లేకపోతే మళ్ళీ శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. గర్భ జైలులో ఎన్నో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. అక్కడ మళ్ళీ న్యాయస్థానం కూర్చుంటుంది. అన్నీ సాక్షాత్కారమవుతాయి. సాక్షాత్కారం చేయించకుండా ఎవ్వరికీ శిక్షలు ఇవ్వరు. ఈ శిక్ష నాకు ఎందుకు లభించిందని తికమకపడతారు! ఇతడు ఈ పాపం చేసాడు, ఈ పొరపాటు చేసాడు అని తండ్రికి తెలుసు. అన్నీ సాక్షాత్కారాలు చేయిస్తారు. ఆ సమయంలో - ఎన్నో జన్మల శిక్షలు లభిస్తున్నట్లుగా అనుభవమవుతుంది. అన్నీ జన్మల పరువు పోయినట్లవుతుంది. అందుకే తండ్రి అంటారు - మధురాతి-మధురమైన పిల్లలు మంచి రీతిలో పురుషార్థం చేయాలి, 16 కళల సంపూర్ణులుగా అవ్వడానికి స్మృతితో కూడిన శ్రమను చేయాలి. చెక్ చేసుకోండి - నేను ఎవ్వరికీ దుఃఖాన్ని అయితే ఇవ్వడం లేదు కదా? సుఖదాత అయిన తండ్రికి మనం పిల్లలమే కదా? చాలా మంచి పుష్పాలుగా తయారవ్వాలి. ఈ చదువే మీతోపాటు వస్తుంది. చదువు ద్వారానే మనుష్యులు బారిష్టర్ మొదలైనవారిగా అవుతారు. తండ్రి యొక్క ఈ జ్ఞానం అతీతమైనది మరియు సత్యమైనది. మరియు ఇది పాండవ గవర్నమెంట్, ఇది గుప్తమైనది. మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈ చదువు అద్భుతమైనది. ఆత్మయే వింటుంది. తండ్రి పదే-పదే అర్థం చేయిస్తారు - చదువును ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. మాయ విడిచిపెట్టేలా చేస్తుంది. తండ్రి అంటారు - ఈ విధంగా చేయకండి, చదువును విడిచిపెట్టకండి. తండ్రి వద్దకు రిపోర్ట్ వస్తుంది కదా. రిజిష్టర్ ద్వారా వీరు ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు అన్నది అంతా తెలుస్తుంది. చదువును వదిలేసినట్లయితే తండ్రిని కూడా మర్చిపోతారు. వాస్తవానికి ఇది మర్చిపోయే విషయమైతే కాదు. వీరైతే అద్భుతమైన తండ్రి. ఇది ఒక ఆట వంటిది అని అర్థం చేయిస్తారు కూడా. ఆట యొక్క విషయాన్ని ఎవరికైనా వినిపిస్తే, అది వెంటనే గుర్తుండిపోతుంది కదా. దానిని ఎప్పుడూ మర్చిపోరు. వీరు వీరి యొక్క అనుభవాన్ని కూడా వినిపిస్తారు. బాల్యంలోనే వైరాగ్యంతో కూడిన ఆలోచనలు ఉండేవి. ప్రపంచములో ఎంతో దుఃఖము ఉంది. ఇప్పుడు నా వద్ద కేవలం 10 వేలు జమ అయినా చాలు, దానికి 50 రూపాయల వడ్డీ లభిస్తుంది, ఈ మాత్రం సరిపోతుంది. ఇక స్వతంత్రంగా ఉంటాను. ఇల్లూ-వాకిళ్ళను సంభాళించడం కష్టము. అచ్ఛా, ఆ తర్వాత సౌభాగ్య సుందరి... అని ఒక సినిమా చూసారు, ఇక అంతే వైరాగ్యానికి సంబంధించిన విషయాలన్నీ ఎగిరిపోయాయి. పెళ్ళి చేసుకుందాము, ఇది చేద్దాము అని ఆలోచించారు. మాయ ఒక్కటే దెబ్బ వేసింది, గుణాలు, శక్తులను పోగొట్టేసింది. కావున ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, ఈ ప్రపంచమే నరకము, అందులోనూ ఈ నాటకాలు (సినిమాలు) ఏవైతే ఉన్నాయో, ఇవి కూడా నరకము. ఇవి చూడడం వలనే అందరి వృత్తులు పాడైపోతాయి. వార్తాపత్రికలు చదువుతారు, అందులో మంచి-మంచి స్త్రీల చిత్రాలను చూసినప్పుడు వృత్తి అటువైపుకు వెళ్ళిపోతుంది. ఈమె చాలా సుందరంగా ఉన్నారు అని బుద్ధిలోకి వస్తుంది కదా. నిజానికి ఈ ఆలోచన కూడా రాకూడదు. బాబా అంటారు - నిజానికి ఈ ప్రపంచమే అంతమవ్వనున్నది అందుకే మీరు మిగిలినవాటన్నింటినీ మరచి నన్నొక్కడినే స్మృతి చేయండి, ఇటువంటి చిత్రాలు మొదలైనవి ఎందుకు చూస్తారు? ఈ విషయాలన్నీ వృత్తిని కిందకు తీసుకువచ్చేస్తాయి. ఇవి ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ స్మశానయోగ్యంగా అవ్వనున్నాయి. ఈ కళ్ళతో ఏదైతే చూస్తారో, వాటిని స్మృతి చేయకండి, వాటి నుండి మమకారాన్ని తొలగించండి. ఈ శరీరాలన్నీ అయితే పాతవి మరియు అశుద్ధమైనవి. అయితే ఆత్మ శుద్ధముగా అవుతుంది కానీ శరీరమైతే అశుద్ధమైనదే కదా. ఇటువైపు ధ్యాస ఎందుకు ఇవ్వాలి. ఒక్క తండ్రినే చూడాలి.

తండ్రి అంటారు - మధురాతి-మధురమైన పిల్లలూ, గమ్యం చాలా ఉన్నతమైనది. విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు ఇతరులెవ్వరూ ప్రయత్నించలేరు కూడా, ఇది ఎవరి బుద్ధిలోకి కూడా రాలేదు. మాయ యొక్క ప్రభావం తక్కువేమీ కాదు. సైన్స్ వారి బుద్ధి ఎంతగా పనిచేస్తుంది. మీది సైలెన్స్. మేము ముక్తిని పొందాలని అందరూ కోరుకుంటారు కూడా. మీకు జీవన్ముక్తి యొక్క లక్ష్యము ఉంది. ఇది కూడా తండ్రి అర్థం చేయించారు. గురువులు మొదలైనవారు ఎవ్వరూ ఇటువంటి నాలెడ్జ్ ను ఇవ్వలేరు. మీరు గృహస్థములో ఉంటూ పవిత్రముగా అవ్వాలి, రాజ్యాన్ని తీసుకోవాలి. భక్తిలో ఎంతో సమయాన్ని వృధా చేసారు. మేము ఎన్ని పొరపాట్లు చేసాము అని ఇప్పుడు అర్థం చేసుకుంటారు. పొరపాట్లు చేస్తూ-చేస్తూ వివేకహీనులుగా, పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. ఇదైతే చాలా అద్భుతమైన జ్ఞానము, దీని ద్వారా మేము ఎలా ఉన్నవారము ఎలా అవుతాము, రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతాము అని మీకు లోలోపల అనిపిస్తుంది. మా బాబా అనంతమైన తండ్రి అని సంతోషపు పాదరసము కూడా ఎక్కుతుంది. వారికి తండ్రి ఎవ్వరూ లేరు. వారు టీచర్, వారికి టీచర్ ఎవ్వరూ లేరు. మరి ఎక్కడి నుండి నేర్చుకున్నారు అని అడుగుతారు! ఆశ్చర్యపోతారు కదా! వీరు ఎవరో గురువు నుండి నేర్చుకున్నారు అని చాలా మంది భావిస్తారు. గురువుకైతే ఎంతోమంది శిష్యులు ఉంటారు కదా. కేవలం ఒక్క శిష్యుడే ఉన్నారా? గురువులకు శిష్యులైతే ఎంతోమంది ఉంటారు కదా. ఆగాఖాన్ కు చూడండి, ఎంతమంది శిష్యులున్నారు. గురువుల పట్ల లోలోపల ఎంతో గౌరవం ఉంటుంది - వారిని వజ్రాలతో తూకం వేస్తారు. మీరు ఇటువంటి సద్గురువును దేనితో తూస్తారు. వీరు అనంతమైన సద్గురువు. వీరి బరువు ఎంత! ఒక్క వజ్రాన్ని కూడా వేయలేరు.

ఇటువంటి విషయాల గురించి పిల్లలైన మీరు ఆలోచించాలి. ఇదైతే సూక్ష్మమైన విషయము. ఓ ఈశ్వరా అనైతే అందరూ అంటూ ఉంటారు. కానీ వారు తండ్రి, టీచర్, గురువు కూడా అని ఏమైనా భావిస్తారా. వీరు సాధారణ రీతిలో కూర్చొని ఉంటారు. వారు గద్దెపై - అందరి ముఖాలను చూడగలిగే విధంగా కూర్చుంటారు. పిల్లలపై ప్రేమ అయితే ఉంటుంది కదా. ఈ సహాయకులైన పిల్లలు లేకుండా స్థాపనను ఏమైనా చేస్తారా. ఎక్కువగా సహాయం చేసే పిల్లలను తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు. బాగా సంపాదించే పిల్లలు మంచిగా ఉన్నట్లయితే తప్పకుండా ఉన్నతోన్నతమైన పదవిని తీసుకుంటారు. వారి పట్ల ప్రేమ కూడా కలుగుతుంది. పిల్లలను చూసి-చూసి హర్షిస్తారు. ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. కల్పకల్పమూ పిల్లలను చూసి నేను సంతోషిస్తాను. కల్పకల్పమూ పిల్లలే సహాయకులుగా అవుతారు. చాలా ప్రియమనిపిస్తారు. కల్పకల్పాంతరాల ప్రేమ జోడించబడుతుంది. ఎక్కడ కూర్చుని ఉన్నా, బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి. వీరు అనంతమైన తండ్రి, వీరికి తండ్రి ఎవ్వరూ లేరు, అలాగే వీరికి టీచర్ కూడా లేరు. వీరే సర్వస్వము, వీరినే అందరూ స్మృతి చేస్తారు. సత్యయుగములో ఎవ్వరూ స్మృతి చేయరు, 21 జన్మల వరకు నావ తీరాన్ని చేరుకుంది, కావున మీకు ఎంత సంతోషము ఉండాలి. రోజంతా బాబా సేవ చేయాలి. ఇటువంటి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి నుండి ఈ వారసత్వం లభిస్తుంది. తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు మరియు అందరినీ తమతో పాటు తీసుకుని వెళ్తారు కూడా. మొత్తం చక్రమంతా బుద్ధిలో ఉంది. ఇటువంటి చక్రాన్ని ఎవ్వరూ తయారుచేయలేరు. దీని అర్థము ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు - బాబా మన అనంతమైన తండ్రి కూడా, అనంతమైన రాజ్యాన్ని కూడా ఇస్తారు, అలాగే తమతో పాటు తీసుకువెళ్తారు కూడా. ఈ విధంగా మీరు అర్థం చేయించినట్లయితే, ఇక ఎవ్వరూ సర్వవ్యాపి అని అనలేరు. వారు తండ్రి, టీచర్, మరి అటువంటప్పుడు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు.

అనంతమైన తండ్రే నాలెడ్జ్ ఫుల్. మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల గురించి వారికి తెలుసు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు - చదువును మర్చిపోకండి. ఇది చాలా పెద్ద చదువు. బాబా పరమ పిత, పరమ శిక్షకుడు, పరమ గురువు కూడా. ఈ గురువులందరినీ కూడా వారు తీసుకువెళ్తారు. ఇటువంటి అద్భుతమైన విషయాలను వినిపించాలి. ఇది అనంతమైన ఆట అని చెప్పండి. ప్రతి పాత్రధారికి తమ పాత్ర లభించి ఉంది. అనంతమైన తండ్రి నుండి మనమే అనంతమైన రాజ్యాధికారాన్ని తీసుకుంటాము. మనమే యజమానులుగా ఉండేవారము. ఒకప్పుడు వైకుంఠం ఉండేది, అది మళ్ళీ తప్పకుండా వస్తుంది. శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచానికి యజమానిగా ఉండేవారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచము, మళ్ళీ తప్పకుండా కొత్త ప్రపంచానికి యజమానిగా అవుతాడు. చిత్రములో కూడా స్పష్టంగా ఉంది. మీకు తెలుసు - ఇప్పుడు మన కాళ్ళు నరకం వైపు, ముఖము స్వర్గం వైపు ఉన్నాయి, ఇదే గుర్తుంటుంది. ఈ విధంగా స్మృతి చేస్తూ-చేస్తూ అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది. ఇవి ఎంత మంచి-మంచి విషయాలు, వీటిని స్మరించాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ కళ్ళ ద్వారా ఏదైతే కనిపిస్తుందో, దాని పట్ల మమకారాన్ని తొలగించివేయాలి, ఒక్క తండ్రినే చూడాలి. వృత్తిని శుద్ధముగా చేసుకునేందుకు ఈ ఛీ-ఛీ శరీరాల వైపుకు కొద్దిగా కూడా ధ్యాస వెళ్ళకూడదు.

2. తండ్రి ఏ అతీతమైన మరియు సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తారో, దానిని మంచి రీతిలో చదువుకోవాలి మరియు చదివించాలి. చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు.

వరదానము:-

శాంతి శక్తి యొక్క ప్రయోగము ద్వారా ప్రతి కార్యములో సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే ప్రయోగీ ఆత్మా భవ

ఇప్పుడు సమయ పరివర్తన అనుసారంగా శాంతి శక్తి యొక్క సాధనాన్ని ప్రయోగించి ప్రయోగీ ఆత్మగా అవ్వండి. ఏ విధంగా వాణి ద్వారా ఆత్మలలో స్నేహంతో కూడిన సహయోగ భావనను ఏ విధంగా ఉత్పన్నం చేస్తారో, అదే విధంగా శుభ భావన, స్నేహ భావన అనే స్థితిలో స్థితులై వారిలో శ్రేష్ఠ భావనలను ఉత్పన్నం చెయ్యండి. ఏ విధంగా దీపము, దీపాన్ని వెలిగిస్తుందో, అదే విధంగా మీ శక్తిశాలీ శుభభావన ఇతరులలో సర్వ శ్రేష్ఠ భావనను ఉత్పన్నం చేయిస్తుంది. ఈ శక్తి ద్వారా స్థూల కార్యాలలో కూడా చాలా సహజంగా సఫలతను ప్రాప్తి చేసుకోగలరు, కేవలం ప్రయోగం చేసి చూడండి.

స్లోగన్:-

సర్వులకు ప్రియంగా అవ్వాలంటే వికసించిన ఆత్మిక గులాబిగా అవ్వండి, వాడిపోకండి.