14-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 24.10.2010


‘‘సమయము యొక్క వేగము అనుసారముగా ఇప్పుడు విశేషముగా స్వభావ-సంస్కారాలను పరివర్తన చెయ్యడములో తీవ్రతను తీసుకురండి, మనసా ద్వారా ఆత్మలకు భిన్న-భిన్న కిరణాలను ఇవ్వండి’’

ఈ రోజు నలువైపులా ఉన్న పరమాత్ముని హృదయ సింహాసనాధికారులను, భృకుటి సింహాసనాధికారులను మరియు విశ్వపు రాజ్య సింహాసనాధికారి పిల్లలను చూసి హర్షిస్తున్నాము. ఈ పరమాత్ముని హృదయ సింహాసనము కేవలం బ్రాహ్మణులైన మీ కోసం మాత్రమే ఉంది. భృకుటి సింహాసనమైతే అందరి వద్ద ఉంది. కానీ పరమాత్ముని హృదయ సింహాసనము కేవలం బ్రాహ్మణ ఆత్మల భాగ్యములో మాత్రమే ఉంది. ఈ పరమాత్ముని హృదయ సింహాసనము విశ్వ రాజ్య సింహాసనాన్ని ఇప్పిస్తుంది. కావున మూడు సింహాసనాలకు అధికారీ ఆత్మలు బ్రాహ్మణులైన మీరు మాత్రమే. ఈ పరమాత్ముని హృదయ సింహాసనము ఎంత శ్రేష్ఠమైనది. మరే ఇతర యుగములోనూ పరమాత్ముని హృదయ సింహాసనము ప్రాప్తించదు. పరమాత్ముని హృదయ సింహాసనము గాయనము కూడా చేయబడుతుంది. పరమాత్ముని హృదయ సింహాసనానికి అధికారులైన వారు భక్తి మార్గములో కూడా మాలలోని మణుల రూపములో గాయనము చేయబడతారు మరియు పూజ్యనీయులుగా ఉంటారు. కోట్లలో కొద్దిమంది రూపములో గాయనము చేయబడతారు. ఎంతో భావనతో ఒక్కొక్క మణిని ఎంత ఉన్నతమైన దృష్టితో చూస్తూ ఉంటారు. మరి మీ అందరికీ నషా ఉంది కదా! మేము తప్ప మరెవ్వరూ ఈ సింహాసనాన్ని అనుభవం చేయలేరు అని ఉందా నషా? కానీ బ్రాహ్మణులైన మీ అందరికీ అయితే ఇది జన్మ సిద్ధ అధికారము. మీ కోసం ఈ సింహాసనము మెడలోని హారము వంటిది. మరి మేము భగవంతుని హృదయ సింహాసనానికి అధికారులము అని అంతటి నషా ఉంటుందా! ఈ నషా మరియు సంతోషము అందరికీ సదా స్మృతిలో ఉంటుందా? నేను ఎవరిని! ఈ నిశ్చయము మరియు నషా ఉంటుందా?

బాప్ దాదా అయితే మూడు సింహాసనాలకూ అధికారులైన ఇటువంటి పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. వాహ్ నా శ్రేష్ఠ అధికారీ పిల్లలు, వాహ్! పిల్లలంటారు - వాహ్ బాబా వాహ్! మరియు బాబా అంటారు - వాహ్ పిల్లలు వాహ్! స్వయంగా బాబా కూడా ఇటువంటి పిల్లల మహిమను గానము చేస్తారు. మరి నేను ఎవరిని అన్న నషా ఉందా? ఎంతగా నిశ్చయము ఉంటుందో, అంతగానే నషా ఉంటుంది. మరియు నిశ్చయముతో కూడిన నషా మీ ముఖము మరియు నడవడిక ద్వారా కనిపిస్తుంది. ఎవరికైతే నిశ్చయము ఉంటుందో, వారికి నషా తప్పకుండా ఉంటుంది. బాప్ దాదా కూడా ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరి యొక్క ముఖము మరియు నడవడిక ద్వారా ఆత్మలకు అనుభవం చేయించాలని కోరుకుంటున్నారు. వాణి ద్వారా అయితే అనుభవం చేయడం మొదలుపెట్టారు, ఇప్పుడు అనుభవం చేసే కార్యము మొదలయ్యింది. పూర్వము వినేవారు, ఆలోచించేవారు, ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలైన మీ స్థితి యొక్క ప్రభావాన్ని అనుభవం చేయడం మొదలుపెట్టారు. కావున మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి - నేను రోజంతటిలో ఎంత సమయము పరమాత్ముని హృదయ సింహాసనముపై ఉంటున్నాను? ఎందుకంటే ఈ హృదయ సింహాసనము విశ్వ రాజ్యాన్ని ప్రాప్తి చేయించడానికి ఆధారము. కనుక ఈ హృదయ సింహాసనము ఆధారముగా ఎంత సమయము మీరు హృదయ సింహాసనానికి అధికారులుగా ఉంటారో, అంత ఎక్కువ సమయము భవిష్యత్తులో రాజ్యవంశములో అధికారులుగా అవుతారు. కావున చెక్ చేసుకోండి - ఎప్పటినుండైతే నేను బ్రాహ్మణాత్మగా అయ్యానో, అప్పటినుండి ఎంత సమయము హృదయ సింహాసనాధికారిగా ఉన్నాను? సింహాసనముపై అయితే నంబరువారుగా కూర్చుంటారు కానీ దాని ఆధారముగా సదా రాజ్య కుటుంబములో, వంశములో అధికారులుగా అవుతారు. చెక్ చేసుకున్నారా ఎప్పుడైనా? హృదయ సింహాసనము నుండైతే కిందకు దిగిపోవడము లేదు కదా? మీ లెక్కను మీరే చూసుకోండి ఎందుకంటే దీని ఆధారముగానే మీరు సదా రాజ్యవంశములోకి వస్తారు. చెక్ చేసుకోండి - సింహాసనాన్ని వదిలిపెట్టి ఎప్పుడూ మట్టిలోనైతే అడుగు పెట్టడం లేదు కదా! 63 జన్మల సంస్కారాల అనుసారముగా దేహభానమనే మట్టిలో పాదము పెట్టారా. ఒకటి దేహభానము మరియు రెండవది దేహ-అభిమానము. దేహ-అభిమానమనే మట్టి లోతైనది కానీ దేహ భానము కూడా మట్టియే. మనిషి చనిపోయినప్పుడు, కాల్చివేసేటప్పుడు కూడా మట్టి మట్టిలో కలిసిపోయింది అని అంటారు. కావున చెక్ చేసుకోండి -మట్టిలో అడుగైతే పెట్టడము లేదు కదా! దేహ భానములోకి రావడము అనగా మట్టిలో అడుగు పెట్టడమే.

బాప్ దాదా శ్రేష్ఠ ఆత్మలైన మీకు మూడు సింహాసనాలను ఇచ్చారు ఎందుకంటే మీరు బాబాకు ప్రియమైన పిల్లలు కదా, మీరు చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు కూడా, ప్రియమైన పిల్లలు కూడా. ప్రియమైన పిల్లలెవరైతే ఉంటారో, వారిని ఊయలలో కానీ, ఒడిలో కానీ పెట్టుకుంటారు, మట్టిలో పాదము పెట్టనివ్వరు. కావున మూడు సింహాసనాలకు అధికారులైన పిల్లలెవరైతే ఉన్నారో, వారికి కూడా బాప్ దాదా ఎన్ని భిన్న-భిన్నమైన ఊయలలను ఇచ్చారు. ఒక్కోసారి శాంతి అనే ఊయలలో ఊగండి, ఒక్కోసారి సుఖము అనే ఊయలలో ఊగండి, ఒక్కోసారి ప్రేమ అనే ఊయలలో ఊగండి. సింహాసనము మరియు ఊయల, వీటిలోనే పాదము పెట్టండి. కొంతమంది పిల్లలు అడుగుతారు - మేము భవిష్యత్తులో ఎక్కడ వస్తాము? ఏమవుతాము? దానికి బాబా అంటారు, ఎంత సమయము నుండైతే వచ్చారో అంత సమయము నుండి చెక్ చేసుకోండి - నా పాదము ఊయలలో లేక సింహాసనముపైనే ఉందా? ఎంతగా ఉన్నారో అంతగానే భవిష్యత్తులో రాయల్ వంశములో ఉంటారు. రాయల్ ప్రజల్లోకి కూడా రారు, రాయల్ వంశములోకే వస్తారు. కావున ఈ లెక్కను ప్రతి ఒక్కరూ ఎవరి కోసం వారు చూసుకోండి. ఇతరులను చూడకండి, మీ లెక్కను చూసుకోండి. ప్రతి ఒక్కరూ ఏమి కోరుకుంటారు? రాయల్ వంశములో, రాజ్య వంశములో ఉండాలనే కదా. కనుక ఇప్పుడు కూడా ఎంత సమయము లభిస్తే అంత సమయము, ఎందుకంటే ఇప్పుడు సమాప్తి అయితే అకస్మాత్తుగా జరగనున్నది. కనుక సమాప్తి అయ్యేలోపు, ఇప్పుడు కూడా చెక్ చేసుకోండి - ఎంత ఎక్కువ సమయము బాబా ఒడిలో, సింహాసనముపై, ఊయలలో ఉంటారో, అంత సమయము రాయల్ కుటుంబములో రాయల్ వంశములో భాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు.

బాప్ దాదా అయితే ప్రతి బిడ్డకు పూర్తి సమయమంతా, 21 జన్మలూ, రాయల్ వంశములో, సూర్యవంశమైనా గాని చంద్రవంశమైనా గాని, రెండు యుగాలలోనూ రాయల్ ఫ్యామిలీలో ఉండే అధికారాన్ని ఇస్తున్నారు. కానీ అధికారాన్ని తీసుకోవడమనేది పిల్లలు ప్రతి ఒక్కరిపైనా ఆధారపడి ఉంది. బ్రహ్మాబాబాపై మీకు ప్రేమ ఉంది, అలాగే బ్రహ్మాబాబాకు కూడా పిల్లలైన మీపై ప్రేమ ఉంది. బ్రహ్మాబాబా పిల్లలైన మిమ్మల్ని తమతోపాటు రాయల్ వంశములో చూడాలని కోరుకుంటున్నారు. మీరేమి అనుకుంటున్నారు - బ్రహ్మాబాబాకు దగ్గరగా రాయల్ వంశములో ఉండేవారా లేక కొద్ది సమయము మాత్రమే ఉండేవారా? దూరంగా వెళ్ళాలని అనుకోవడము లేదు కదా! సంగమయుగమే దీనికి ఆధారము అని వినిపించడము జరిగింది. బాప్ దాదాకు పిల్లలపై ఎంత ప్రేమ ఉందంటే మీరంతా - కలిసి ఉంటాము, కలిసి నడుస్తాము... అని అంటారు. ఇప్పుడు బ్రహ్మాబాబా మరియు బ్రాహ్మణులు కలిసి ఉన్నారు, అవ్యక్త రూపములో ఉన్నప్పటికీ తోడుగా ఉన్నారు.

ఇప్పుడు బాప్ దాదా ఏమి చూసారంటే మాయ కూడా ఇప్పటివరకూ పిల్లల్ని వదిలిపెట్టడం లేదు, మాయకు కూడా మీపై ప్రేమ ఉంది. ఈ రోజుల్లో విశేషముగా రెండు రూపాలలో మాయ ఛాన్స్ తీసుకుంటుంది. రెండు రూపాలలో వస్తుంది - ఒకటి వ్యర్థ సంకల్పాలు మరియు రెండవది అక్కడక్కడ, అప్పుడప్పుడు ఈ అల కూడా ఉంది - నేను ఏదైతే చేసానో మరియు ఆలోచించానో, నేనే రైట్, నేను తక్కువేమీ కాదు. నేనే రైట్ అన్న అల వ్యాపించి ఉంది. కానీ ఎవరైతే కనెక్షన్ లోకి వస్తారో లేక నిమిత్తమైనవారు ఉన్నారో, వారు కూడా మీ ఆలోచనలను ఆమోదిస్తున్నారా? ఇతరుల నుండి కూడా వెరిఫికేషన్ ను (నిర్ధారణను) పొందవలసి ఉంటుంది. ఈ వ్యర్థ సంకల్పాలు సమయాన్ని వృధా చేస్తాయి. అందుకే బాప్ దాదా ప్రతిరోజు యొక్క మురళిని రివైజ్ చేయమని, సేవ చేయమని రోజూ హోమ్ వర్కును ఇస్తారు. ఒకవేళ మననము చేసినా లేక మననము చేస్తూ మగ్నమైపోయినా కానీ రోజు ఇచ్చే ఈ హోమ్ వర్కు మనసును బిజీగా ఉంచే సాధనము. అందుకే బాప్ దాదా వినడము, మననము చేయడము మరియు మగ్నమవ్వడము అనేవాటిని ప్రతిరోజూ హోమ్ వర్కుగా ఇస్తారు. ఎలా అయితే పిల్లలకు ఎంత ఎక్కువ హోమ్ వర్కును ఇస్తారంటే, వారి బుద్ధి దానిని పూర్తి చేయడములోనే బిజీగా ఉంటుంది, అలాగే ప్రతి రోజు యొక్క మురళి, అందులో నాలుగు సబ్జెక్టుల హోమ్ వర్కు ఉంది. మనసాకు సంబంధించిన హోమ్ వర్కు కూడా ఉంటుంది, వాణికి సంబంధించిన హోమ్ వర్కు కూడా ఉంటుంది, కర్మల పట్ల పెట్టాల్సిన అటెన్షన్ కూడా ఉంటుంది మరియు దివ్యత గురించిన సూచనలు కూడా ఉంటాయి. కనుక హోమ్ వర్కులో బిజీగా ఉన్నట్లయితే వ్యర్థ సంకల్పాలు వచ్చే అవకాశము ఉండదు. ఈ విధిని అలవరచుకున్నట్లయితే వ్యర్థ సంకల్పాలు స్వతహాగానే మీ నుండి వీడ్కోలు తీసుకుని వెళ్తాయి ఎందుకంటే బాప్ దాదా ఏమి చూసారంటే, స్మృతియాత్రపై అందరికీ నంబరువారుగా అటెన్షన్ ఉంది. వాచా సేవపై కూడా అటెన్షన్ ఉంది. కానీ ఇప్పుడు మీ సంస్కారాలను లేక ఇతరుల సంస్కారాలను పరివర్తన చేసుకోవడము, ఆ స్వభావ-సంస్కారాలనే మీరు రాయల్ రూపములో నేచర్ అని అంటారు. అది నా నేచర్, అంతేకానీ నా భావము అది కాదు, అది నా నేచర్ అంటారు. ఈ ధారణ సబ్జెక్టు ఇప్పటికీ కూడా రాయల్ రూపములో వస్తూనే ఉంటుంది. కావున బాప్ దాదా ఈ రోజుల్లో ఇదే సూచనను ఇస్తున్నారు - ఏ ధారణలలోనైతే లోటు ఉంటుందో వాటి పట్ల ఇప్పడు విశేషమైన అటెన్షన్ ను పెట్టండి.

బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించి ఉన్నారు, ఇప్పుడు ధారణలో ఈ ముఖ్యమైన ధారణ పట్ల అటెన్షన్ పెట్టండి, ఏదైనా విషయము జరిగితే చెక్ చేసుకోండి - సెకండులో ఫుల్ స్టాప్ పెట్టగలరా! లేక ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నారు కానీ క్వశ్చన్ మార్క్ వస్తుందా? ఫుల్ స్టాప్ కాదు, సగం ఫుల్ స్టాప్ పెడుతున్నారు, అది ఇంకేదో గుర్తుగా అయిపోతుంది. మున్ముందు ఎటువంటి పరిస్థితులు వస్తాయంటే మీరు సెకండులో ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉంటుంది. ఆ సమయములో క్వశ్చన్ మార్క్ ను, ఆశ్చర్యార్థకాన్ని సరి చేస్తూ కూర్చుంటానంటే, అంత సమయము లభించదు. సెకండులో ఫుల్ స్టాప్ పెట్టే అవసరము ఉంటుంది. దాని కోసం ఎంతో కాలం నుండి అభ్యాసము కావాలి, అప్పుడే సమయానికి విజయులుగా అవ్వగలరు. అలజడి సమయములో స్వభావ-సంస్కారాల పేపరు వచ్చినప్పుడు దాని కోసం ఇప్పటినుండే ఆ సమయము కోసం అభ్యాసము చేయండి. ఈ బహుకాలపు అభ్యాసము మున్ముందు మీకు ఎంతో సహయోగిగా అవుతుంది.

బాప్ దాదా అమృతవేళలో చుట్టూ తిరిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని చెక్ చేస్తారు. నాలుగు సబ్జెక్టులలోనూ పురుషార్థము తీవ్రముగా ఉందా లేక సాధారణముగా ఉందా? మరి ఏమి చూసారు? సమయము యొక్క వేగము అనుసారముగా ఇప్పుడు పురుషార్థములో సదా తీవ్ర పురుషార్థము యొక్క అవసరముంది. సమయము తీవ్రగతితో సమాప్తికి దగ్గరగా వెళ్తుంది అని బాప్ దాదా సూచనను ఇస్తున్నారు. ఆ లెక్క ప్రకారముగా ఇప్పుడు విశేషముగా స్వభావ-సంస్కారాల పరివర్తనలో తీవ్ర వేగము కావాలి.

ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరినీ సమానముగా చూడాలని కోరుకుంటున్నారు. బాబా సమానముగా అవ్వాల్సిందే అని మీకు కూడా లక్ష్యము ఉంది. దాని కోసం అన్నిటికంటే సహజమైన సాధనము ఏమిటంటే - బ్రహ్మాబాబాను ఫాలో చేయండి. టాలీ చేసుకోండి. ఏ కర్మ చేసినా కానీ దానిని ముందు సరి పోల్చుకోండి, సమానము చేసుకోండి - బ్రహ్మాబాబా ఈ విధమైన కర్మలు, మాటలు లేక సంకల్పాలు చేసేవారా? ముందు ఆలోచించండి, ఆ తర్వాత చేయండి అని అంటూ ఉంటారు కదా. మాట్లాడే ముందు ఆచి తూచి, ఆ తర్వాత మాట్లాడండి. కావున బాప్ దాదా ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో విన్నారా? మీరు కూడా కోరుకుంటున్నారు. ఆత్మిక సంభాషణ జరిగేటప్పుడు బాప్ దాదా ఎంతో మధురాతి మధురమైన మాటలను వింటుంటారు. ఉల్లాసముతో కూడిన మాటలు కూడా ఎన్నో చెప్తారు, ఇది చేసి చూపిస్తాము, ఇది చెయ్యాల్సిందే, ఇది జరగాల్సిందే అని అంటారు! సంకల్పాలు ఎంతో ఉల్లాసముతో నిండి ఉంటాయి, కానీ అవి కర్మల వరకు వచ్చేసరికి కొన్ని మారిపోతాయి, కొన్ని మాత్రమే జరుగుతాయి. ఇకపోతే బాప్ దాదాకు సేవ కోసం మీరు భిన్న-భిన్న ప్లాన్లు ఏవైతే తయారుచేస్తున్నారో, అవన్నీ నచ్చుతాయి. ప్రోగ్రాములు కూడా అనేక చోట్ల చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు వాచా ద్వారా మరియు భిన్న-భిన్న విధుల ద్వారా సేవ చేస్తున్నారు, సఫలత కూడా వస్తుంది, బాప్ దాదా సంతోషిస్తున్నారు కూడా. ఇప్పుడు కేవలం మనసా ద్వారా అనేకమంది ఆత్మలకు సుఖము యొక్క కిరణాలను, శాంతి యొక్క కిరణాలను, సంతోషము యొక్క కిరణాలను, ప్రేమ యొక్క కిరణాలను ప్రసరింపజేయండి. ఈ సేవను కూడా కలిపి చేయండి. స్వయం యొక్క సంస్కార పరివర్తన కోసం లేక ఇతరుల సంస్కారాలకు సహయోగమివ్వడం, ఇందులోనే కొందరి సమయము ఎక్కువగా ఖర్చవుతూ ఉంటుంది. కావున మనసా సేవ ద్వారా భిన్న-భిన్న కిరణాలను ఆత్మలకు ఇవ్వండి, దీని పట్ల అటెన్షన్ పెట్టండి. మున్ముందు దీని అవసరము ఎంతో ఉంటుంది, దీని పట్ల కూడా శ్రద్ధ పెడుతూ ఉండండి. ఏ పిల్లలైతే - ఈ సేవను నేను చేస్తూ ఉన్నాను అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అచ్ఛా! చేస్తున్నారా, మీకు అభినందనలు. మరియు ఎవరైతే చేయడము లేదో వారు చేయాలి ఎందుకంటే మున్ముందు రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయంటే వినేవారు మరియు వినిపించేవారు, ఇద్దరూ కలవడం కష్టమైపోతుంది. అందుకే రెండు సేవలను, ఎంత వీలైతే అంత ఇప్పటినుండే అలవాటు చేసుకోండి. మనసు బిజీగా కూడా ఉంటే మన్మనాభవలో ఉండటం సహజమవుతుంది. మనసు బిజీగా ఉండటం ద్వారా స్వభావ-సంస్కారాలను సహజముగా పరివర్తన చేసుకోవడములో సహాయము లభిస్తుంది.

ఈ రోజు విశేషముగా డబుల్ విదేశీయుల మిలనము రోజు, బాప్ దాదాకు సంతోషముగా ఉంది - వాహ్ డబుల్ విదేశీయులు వాహ్! బాప్ దాదాకు సంతోషముగా ఉంది, విశ్వములోని నలుమూలలలో బాబా యొక్క కల్పక్రితపు పిల్లలు దాగి ఉన్నారు, డబుల్ విదేశీయులు విశ్వ సేవలో నిమిత్తమై ఉన్నారు. బాప్ దాదా ఏం విన్నారంటే - ప్రతి ఒక్కరూ తమ-తమ ఏరియాలలో, గ్రామాలలో, పట్టణాలలో ఏవైతే మిగిలిపోయిన స్థానాలు ఉన్నాయో, వాటి వరకు చేరుకునేందుకు ప్లాన్లు తయారుచేస్తూ ఉన్నారు. ఇందుకు అభినందనలు, అభినందనలు. లేకపోతే సమాప్తి అయ్యే సమయములో పరిస్థితులు మారిపోతాయి. మీ అందరికీ భారత్ లో గాని, విదేశాలలో గాని, చాలా చాలా చాలా ఫిర్యాదులు లభిస్తాయి - మా తండ్రి వచ్చారు కానీ మీరు మాకు చెప్పను కూడా చెప్పలేదు అని. సందేశమైతే ఇస్తారు, కానీ ఎన్నో ఫిర్యాదులు వస్తాయి. అందుకే ఇప్పుడు చేస్తున్నారు, ఏ మూల కూడా మిగిలిపోకూడదు, దాని కోసం ప్రయత్నించండి. ఇకపోతే బాప్ దాదా డబుల్ విదేశీయులను గాని, ఈ దేశమువారిని గాని, ఏయే పిల్లలైతే నలువైపులా తమ పురుషార్థాన్ని చేస్తున్నారో, వారిని చూసి సంతోషిస్తున్నారు, చాలా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకని? ఎందుకని సంతోషిస్తున్నారు? ఇప్పుడు దేశములో గాని, విదేశాలలో గాని ఈ ప్లాన్ ను తయారుచేస్తున్నారు, బాప్ దాదాకు నచ్చింది, ఏదో ఒక సాధనముతో సందేశము చేరుకోవాలి. ఈ సైన్సు వాస్తవానికి మీ కొరకు సమయానికి ఎంతో ఉపయోగపడుతుంది. సాధనాలు రోజురోజుకూ కొత్తకొత్తవి వస్తూ ఉంటాయి. వాటిని నిర్విఘ్నులై కార్యములో ఉపయోగిస్తూ వెళ్ళండి. సేవలు పెంచడానికి మీరు ఎక్కడ మీటింగులు పెట్టినా కానీ బాప్ దాదా వాటిని వింటారు మరియు సంతోషిస్తారు, సాధనాలను సేవలో వినియోగించడానికి పిల్లలు బుద్ధిని ఇప్పుడు ఆల్రౌండ్ గా ఉపయోగిస్తున్నారు. అందుకే మీరు ఏ ప్లాన్ ను అయితే తయారుచేస్తున్నారో దానిని బాప్ దాదా వింటూ ఉంటారు, చుట్టూ తిరిగి వస్తూ ఉంటారు! మీరు ఎక్కడ మీటింగు చేసినా కానీ, ఢిల్లీలో చేసినా, దేశములో చేసినా, ఏ పట్టణములో చేసినా, విదేశాలలో చేసినా, ఎక్కడ చేసినా కానీ బాప్ దాదా అన్నీ వింటూ ఉంటారు. బాప్ దాదా వద్ద కూడా సాధనాలు ఉన్నాయి. దాని కోసం బాప్ దాదా విదేశాల నుండి, ఒక్కొక్క దేశము నుండి ఎవరెవరైతే వచ్చారో, ప్రతి ఒక్కరికీ ఏమి ఇస్తున్నారు? చాలా చాలా ప్రేమను ఇస్తున్నారు. కేవలం ఇప్పుడు కొద్దిగా తీవ్రతను తీసుకురండి. కొత్త-కొత్త విషయాలతో ప్లాన్ ను ప్రాక్టికల్ లోకి తీసుకువస్తూ ఉండండి. చూడండి, మీ ఈ యజ్ఞము ఆరంభమయ్యే కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆవిష్కరణలన్నీ తయారవ్వడము ప్రారంభమయ్యాయి. సైన్సు కూడా మీ సేవలో సహయోగిగా ఉంది. దీని నుండి బాగా లాభము తీసుకోండి. ఇవన్నీ మీ కోసమే తయారయ్యాయి. రోజురోజుకు చూడండి, ఎన్ని కొత్త-కొత్త వస్తువులు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. ఈ డ్రామా మీకు సహయోగాన్ని ఇస్తుంది. సాధనాలు మీకు సహయోగాన్ని ఇస్తున్నాయి. అచ్ఛా!

అందరూ సదా సంతోషముగా ఉన్నారు కదా! సదా సంతోషముగా ఉన్నారా? ఎవరైతే సదా సంతోషముగా ఉంటున్నారో వారు చేతులెత్తండి, సదా సంతోషముగా. ఏదైనా విషయము వచ్చినా కానీ సంతోషము ఉంటుందా? పరిస్థితులు వస్తాయి కదా, అయినా కానీ సంతోషముగా ఉంటున్నారా? ఉంటున్నారా? చేతులు బాగా పైకి ఎత్తండి. వెల్కమ్ చేస్తారు కదా! గాబరా పడటము లేదు కదా, స్వాగతము చేస్తారు కదా. పరిస్థితులు అనుభవీగా చేస్తాయి. ఈ విఘ్నాలు అనుభవం యొక్క అథారిటీని పెంచుతాయి. మాయ వచ్చేసింది, మాయ వచ్చేసింది అని అనకండి. ఇది పరీక్ష. మాయ-మాయ అంటూ మాయను ముందుకు పంపిస్తున్నారు. అది పేపరు. మాయ గురించైతే మీరు తెలుసుకున్నారు. ఎన్ని సంవత్సరాల నుండి తెలుసుకున్నారు. మాయ అంటే ఏమిటి? అందుకే మాయను చూసి గాబరా పడవద్దు. పేపరుగా భావించి సంతోషముగా పేపరును వ్రాయండి మరియు అనుభవము అనే క్లాసులో ముందుకు వెళ్తూ ఉండండి. ఇది క్లాసులో ముందుకు వెళ్ళడమే. తికమకపడకూడదు. ఏం చెయ్యను, ఎలా చెయ్యను, ఏమిటి, ఎందుకు - ఇలా ఆలోచించడము బ్రాహ్మణుల పని కాదు. మీరు త్రికాలదర్శులు. ఏమిటి, ఎందుకు, ఎలా - ఇవి ఇక తలెత్తకూడదు. పేపరు వస్తే అనుభవమనే క్లాసులో ముందుకు వెళ్ళండి. సంతోషముగా ఉన్నారు. ఇప్పుడైతే అనుభవీలుగా అయ్యారు మరియు అవుతూ ఉంటారు. అచ్ఛా!

ఉత్తరాలు, ఫోన్లు, ప్రియస్మృతులు లేక సందేశాలు ఏవైతే బాప్ దాదా కోసం వచ్చాయో, ఆ పిల్లలందరినీ బాప్ దాదా తమ నయనాలలో ఇముడ్చుకుంటూ ప్రియస్మృతులను, సేవా సమాచారాన్ని మరియు మనసు యొక్క పురుషార్థానికి చెందిన సమాచారాన్ని ఇచ్చారు. వాటన్నింటినీ బాప్ దాదా మనసా ద్వారా ఇమర్జ్ చేసుకుని సుఖము యొక్క, శాంతి యొక్క, సంతోషము యొక్క కిరణాలను ఇస్తున్నారు. ఎవరైనా ఇక్కడకు పంపించకపోయినా సరే, మనసులోనైనా సంకల్పము చేసి ఉంటే, ఆ సంకల్పము కూడా బాప్ దాదా వద్దకు చేరుకుంది.

నలువైపులా ఉన్న ధైర్యము చేసి తండ్రి సహాయాన్ని అందుకునే పిల్లలకు, మధురాతి మధురమైన పిల్లలకు బాప్ దాదా ప్రియస్మృతులను ఇస్తున్నారు. ఈ సంవత్సరము స్వయం కోసమైనా లేక సేవాకేంద్రము కోసమైనా లేక విశ్వాత్మల కోసమైనా ఏదో ఒక ప్లానును ఎలా తయారుచేయండి అంటే, దాని ద్వారా సేవ యొక్క బలము మరియు ఫలము సర్వాత్మలకు ప్రాప్తించాలి. నలువైపులా ఉన్న పిల్లలు బాప్ దాదా యొక్క విశేషమైన హృదయపూర్వకమైన ప్రియస్మృతులను స్వీకరించండి. ఓం శాంతి.

వరదానము:-
సాధారణత ద్వారా మహానతను ప్రసిద్ధము చేసే సింపుల్ మరియు శ్యాంపుల్ భవ

ఏ విధముగా ఏదైనా సింపుల్ వస్తువు స్వచ్ఛముగా ఉన్నట్లయితే అది దాని వైపుకు తప్పకుండా ఆకర్షిస్తుందో, అలాగే మనసా సంకల్పాలలో, సంబంధాలలో, వ్యవహారములో మరియు జీవన విధానములో ఎవరైతే సింపుల్ గా మరియు స్వచ్ఛముగా ఉంటారో, వారు శ్యాంపుల్ గా అయి అందరినీ తమవైపుకు స్వతహాగానే ఆకర్షిస్తారు. సింపుల్ అనగా సాధారణము. సాధారణత ద్వారానే మహానత ప్రసిద్ధమవుతుంది. ఎవరైతే సాధారణముగా అనగా సింపుల్ గా ఉండరో, వారు సమస్యారూపముగా అయిపోతారు.

స్లోగన్:-
హృదయపూర్వకముగా ‘నా బాబా’ అని అన్నట్లయితే మాయ కలిగించిన మూర్ఛ వల్ల మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుంటాయి.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

ఇప్పుడిప్పుడే శబ్దములోకి రావటము, ఇప్పుడిప్పుడే శబ్దము నుండి అతీతముగా వెళ్ళటము, ఎంతగా ఈ అభ్యాసము సరళము మరియు సహజము అయిపోతుందో, అంతగా సంపూర్ణత సమీపముగా కనిపిస్తుంది. సంపూర్ణ స్టేజ్ కు గుర్తు - వారి పురుషార్థము సరళముగా ఉంటుంది. స్మృతియాత్ర, సేవ - రెండూ సహజ పురుషార్థములోకి వస్తాయి. ఎప్పుడైతే రెండూ సరళముగా మరియు సహజముగా అనుభవమవుతాయో, అప్పుడు సంపూర్ణత యొక్క అవస్థ ప్రాప్తించబోతుంది అని భావించండి.