14-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - పెద్ద-పెద్ద స్థానాలలో పెద్ద-పెద్ద దుకాణాలను (సెంటర్లను) తెరవండి, సేవను పెంచేందుకు ప్లాన్లు తయారుచేయండి, మీటింగ్లు చేయండి, ఆలోచించండి’’

ప్రశ్న:-
స్థూలమైన అద్భుతాలను గురించైతే అందరికీ తెలుసు కానీ పిల్లలైన మీకు మాత్రమే తెలిసిన అన్నింటికన్నా గొప్ప అద్భుతము ఏమిటి?

జవాబు:-
అన్నిటికన్నా గొప్ప అద్భుతమేమిటంటే - సర్వులకు సద్గతిదాత అయిన తండ్రి స్వయముగా వచ్చి చదివిస్తున్నారు. ఈ అద్భుతమైన విషయాన్ని తెలియజేసేందుకు మీరు మీ-మీ దుకాణాలను బాగా అలంకరించవలసి ఉంటుంది, ఎందుకంటే మనుష్యులు ఆకర్షణ చూసే లోపలికి వస్తారు. అన్నింటికన్నా మంచి దుకాణము మరియు పెద్ద దుకాణము రాజధానిలో ఉండాలి, దానిని చూసి అందరూ వచ్చి అర్థం చేసుకునేలా ఉండాలి.

పాట:-
నీ దారిలోనే మరణించాలి...

ఓంశాంతి
శివ భగవానువాచ. రుద్ర భగవానువాచ అని కూడా అనవచ్చు, ఎందుకంటే శివమాల అని గాయనము చేయబడదు కదా, భక్తి మార్గములో మనుష్యులందరూ తిప్పే మాలకు రుద్రమాల అన్న పేరు పెట్టడం జరిగింది. ఏ పేరు తీసుకున్నా విషయము ఒకటే కానీ శివబాబా సరైన విధానములో చదివిస్తారు. వాస్తవానికి శివమాల అన్న పేరు ఉండాలి కానీ రుద్రమాల అన్న పేరు కొనసాగుతూ వస్తోంది. కావున ఆ విషయాన్ని కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. శివుడు మరియు రుద్రుడిలో తేడా ఏమీ లేదు. మేము బాగా పురుషార్థము చేసి బాబా మాలలో సమీపముగా రావాలి అని పిల్లల బుద్ధిలో ఉంది. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పడం జరుగుతుంది. ఎలాగైతే పిల్లలు పరుగుపందెములో పరుగెత్తుకుంటూ వెళ్ళి వారి లక్ష్యాన్ని ముట్టుకుని మళ్ళీ తిరిగి పరుగెత్తుకుంటూ వచ్చి టీచరు వద్ద నిలబడతారో, అలా పిల్లలైన మీకు కూడా తెలుసు, మీరు 84 జన్మల చక్రములో తిరిగారు, ఇప్పుడు ఇక మొట్టమొదట వెళ్ళి మాలలో కూర్చబడాలి. అది మానవ విద్యార్థుల రేస్, ఇది ఆత్మిక రేసు. ఆ రేస్ ను మీరు చేయలేరు కానీ ఇది ఆత్మల విషయము. ఆత్మ వృద్ధాప్యము స్థితిలోకి, యువత స్థితిలోకి, చిన్నగా లేక పెద్దగా అవ్వదు, ఆత్మ ఒకే విధముగా ఉంటుంది. ఆత్మయే తన తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది, ఇందులో కష్టముతో కూడిన విషయమేదీ లేదు. చదువులో వెనుకబడే అవకాశముంది కానీ ఇందులో కష్టమేముంది, ఏమీ లేదు. ఆత్మలందరూ పరస్పరం సోదరులు. ఆ రేస్ లో యువత వేగముగా పరుగెత్తుతారు. ఇక్కడ అటువంటి విషయమేమీ లేదు. రుద్రమాలలో కూర్చబడాలి అనేదే పిల్లలైన మీ రేస్. ఆత్మలమైన మనది కూడా వృక్షము ఉందని బుద్ధిలో ఉంది. అది శివబాబా మరియు మనుష్యమాత్రులందరి మాల. కేవలం 108 లేక 16108 ఆత్మల మాలే ఉంటుంది అని కాదు, అలా కాదు, మనుష్యమాత్రులంతా ఎవరైతే ఉన్నారో వారందరి మాల ఉంది. నంబరువారుగా ప్రతి ఒక్కరూ తమ-తమ ధర్మాలలోకి వెళ్ళి విరాజమానమవుతారని పిల్లలకు తెలుసు, వారు మళ్ళీ కల్ప-కల్పమూ అదే స్థానములోకి వస్తూ ఉంటారు. ఇది కూడా ఒక అద్భుతము కదా. ప్రపంచానికి ఈ విషయాల గురించి తెలియదు. మీలో కూడా ఎవరైతే విశాలబుద్ధిని కలిగి ఉన్నారో వారు ఈ విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. మనము అందరికీ దారిని ఎలా తెలియజేయాలి అని పిల్లల బుద్ధిలో ఈ విషయమే ఉండాలి. ఇది విష్ణు మాల. ప్రారంభము నుండి ఈ వంశవృక్షము మొదలవుతుంది, శాఖోపశాఖలు ఉన్నాయి కదా. అక్కడ కూడా చిన్న-చిన్న ఆత్మలు ఉంటాయి, ఇక్కడ మనుష్యులు ఉంటారు. ఆ తర్వాత ఆత్మలన్నీ ఏక్యురేట్ గా అక్కడే నిలబడి ఉంటాయి. ఇవి అద్భుతమైన విషయాలు. మనుష్యులు ఈ స్థూలమైన అద్భుతాలన్నింటినీ చూస్తూ ఉంటారు, కానీ వాస్తవానికి అవి అసలు ఏమీ కాదు. సర్వుల సద్గతిదాత అయిన పరమపిత పరమాత్మ స్వయముగా వచ్చి చదివిస్తున్నారు అన్నది ఎంత గొప్ప అద్భుతము! మీరు ఈ పాయింట్లన్నింటినీ ధారణ చేస్తూ ఉండాలి కూడా. ముఖ్యమైన విషయము గీతా భగవానుడికి సంబంధించినది. దీనిపై విజయము పొందారంటే ఇక సరిపోతుంది. గీత సర్వశాస్త్రాలకు శిరోమణి వంటిది, దీనిని భగవంతుడే స్వయముగా వినిపించారు. మొట్టమొదటగా దీనిని నిరూపించేందుకు ప్రయత్నించాలి. ఈ రోజుల్లోనైతే చాలా ఆర్భాటము కావాలి, ఏ దుకాణములో అయితే చాలా ఆకర్షణ ఉంటుందో అక్కడికి మనుష్యులు లోపలికి బాగా వెళ్తుంటారు, అక్కడ మంచి సరుకు ఉంటుందని భావిస్తారు. ఇంత పెద్ద పెద్ద సెంటర్లు తెరవాలంటే లక్షా, రెండు లక్షలు ఎడ్వాన్స్ ఇవ్వవలసి ఉంటుందని, అప్పుడే నచ్చిన ఇల్లు దొరుకుతుందని పిల్లలు భయపడతారు. చాలా రాయల్ గా ఉన్న ఒకే ఒక్క పెద్ద దుకాణము ఉండాలి. పెద్ద దుకాణాలు పెద్ద-పెద్ద పట్టణాలలోనే తెరవబడతాయి. మీ యొక్క అన్నింటికన్నా పెద్ద దుకాణమును రాజధానిలో తెరవాలి. సేవను ఎలా పెంచాలి అని పిల్లలు విచార సాగర మంథనము చేయాలి. పెద్ద దుకాణము తెరిచినట్లయితే పెద్ద-పెద్ద వ్యక్తులు వస్తారు. పెద్ద వ్యక్తుల మాటలు వెంటనే వ్యాపిస్తాయి. మొట్టమొదటైతే దీని కోసం ప్రయత్నించాలి. సేవ కోసం పెద్ద-పెద్ద సెంటర్లను ఎటువంటి స్థానాలలో తయారుచేయాలంటే, అక్కడికి పెద్ద-పెద్ద వ్యక్తులు వచ్చి చూసి ఆశ్చర్యపోయేలా ఉండాలి. అంతేకాక అక్కడ అర్థం చేయించేవారు కూడా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ఒకవేళ ఒకే ఒక్క సాధారణమైన బ్రహ్మాకుమారి అర్థం చేయించినా కానీ, ఇక బ్రహ్మాకుమారీలందరూ ఇంతేనేమో అని భావిస్తారు. అందుకే అటువంటి దుకాణాలలో సేల్స్ మెన్ కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయినవారు కావాలి. ఇది కూడా ఒక వ్యాపారము కదా. తండ్రి అంటారు, పిల్లలు ధైర్యము చేస్తే బాప్ దాదా సహాయము చేస్తారు. ఆ వినాశీ ధనమైతే ఎందుకూ పనికిరాదు. మనమైతే మన అవినాశీ సంపాదనను చేసుకోవాలి, దీని వలన అనేకుల కళ్యాణము జరుగుతుంది. ఈ బ్రహ్మా కూడా అలాగే చేసారు కదా. దాని వలన ఎవరైనా ఆకలితో మరణిస్తారా. మీరు కూడా తింటున్నారు, అలాగే ఇతను కూడా తింటున్నాడు. ఇక్కడ ఏవైతే ఆహార-పానీయాలు లభిస్తాయో, అవి ఇంకెక్కడా లభించవు. ఇదంతా పిల్లలదే కదా. పిల్లలు తమ రాజ్యాన్ని స్థాపన చేసుకోవాలి, ఇందులో చాలా విశాలబుద్ధి కావాలి. రాజధానిలో పేరు ప్రసిద్ధమైతే అందరూ అర్థం చేసుకుంటారు. వీరు నిజంగా సత్యమే చెప్తున్నారు అని అంటారు. విశ్వానికి యజమానిగా భగవంతుడే తయారుచేస్తారు. మనుష్యులు మనుష్యులను విశ్వానికి యజమానులుగా తయారుచేయలేరు కదా. బాబా సేవ వృద్ధి కోసం సలహాలు ఇస్తూ ఉంటారు. సేవ వృద్ధి ఎప్పుడు జరుగుతుందంటే, పిల్లలకు విశాల హృదయము ఉన్నప్పుడు. మీరు ఏ కార్యము చేసినా దానిని విశాల హృదయముతో చేయండి. ఏ శుభ కార్యమునైనా తమకు తాముగానే చేయడమనేది చాలా మంచిది. ఏమంటూ ఉంటారంటే - తమంతట తామే చేసేవారు దేవతలు, ఇతరులు చెప్తే చేసేవారు మనుష్యులు, చెప్పినా కూడా చేయకపోతే... బాబా అయితే దాత. మీరు ఇది చేయండి, ఈ కార్యములో ఇంత పెట్టండి అని బాబా ఎవరికీ చెప్పరు. బాబా అర్థం చేయించారు, పెద్ద-పెద్ద రాజుల చేతులు ఎప్పుడూ మూసుకుని ఉండవు. రాజులు ఎల్లప్పుడూ దాతలుగానే ఉంటారు. మీరు వెళ్ళి ఏమేమి చేయాలి అని బాబా సలహాను ఇస్తున్నారు. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. మాయపై విజయము పొందాలి. ఇది చాలా ఉన్నతమైన పదవి. అంతిమములో రిజల్టు వెలువడుతుంది. అప్పుడు ఎవరైతే మంచి మార్కులతో పాస్ అవుతారో వారికి సంతోషము కూడా ఉంటుంది. అంతిమములో సాక్షాత్కారాలైతే అందరికీ అవుతాయి కదా, కానీ ఆ సమయములో ఏమి చేయగలుగుతారు. భాగ్యములో ఏముంటే అదే లభిస్తుంది. పురుషార్థపు విషయము వేరు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, విశాలబుద్ధి కలవారిగా అవ్వండి. ఇప్పుడు మీరు ధర్మాత్ములుగా అవుతారు. ప్రపంచములో ధర్మాత్ములైతే ఎంతోమంది ఉండి వెళ్ళారు కదా. వారి పేరు ఎంతగానో ప్రసిద్ధమవుతుంది. ఫలానా వ్యక్తి చాలా ధర్మాత్ముడు అని అంటారు. కొందరైతే ధనాన్ని పోగు చేసుకుంటూ, చేసుకుంటూ ఉన్నట్టుండి మరణిస్తారు. అప్పుడిక వారి ఆస్తికి ట్రస్టు ఏర్పడుతుంది. కొందరు తమ పిల్లలు సరిగ్గా లేకపోయినా కూడా ట్రస్టును ఏర్పరుస్తారు. ఈ సమయములోనైతే ఇది పాపాత్ముల ప్రపంచము. పెద్ద-పెద్ద గురువులు మొదలైనవారికి దానం చేస్తూ ఉంటారు. ఉదాహరణకు కాశ్మీర్ మహారాజు తన ఆస్తి ఆర్యసమాజము వారికి లభించాలని, వారి ధర్మము వృద్ధిని పొందాలని వీలునామా వ్రాసారు. మరి ఇప్పుడు మీరేమి చేయాలి, ఏ ధర్మాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి? ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే ఉంది. ఈ విషయము కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు దీనిని మీరు మళ్ళీ పునః స్థాపన చేస్తున్నారు. బ్రహ్మా ద్వారా స్థాపన. ఇప్పుడు పిల్లలు ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. మీరు స్మృతి బలము ద్వారానే మొత్తము సృష్టిని పవిత్రముగా తయారుచేస్తారు, ఎందుకంటే మీ కొరకైతే పవిత్ర సృష్టి కావాలి. ఈ ప్రపంచానికి మంటలు అంటుకున్నట్లయితే పవిత్రముగా అవుతుంది. అశుద్ధమైన వస్తువును అగ్నిలో వేసి శుద్ధి చేస్తారు. ఇందులో అపవిత్రమైన వస్తువులన్నీ పడి మళ్ళీ మంచిగా తయారై బయటికి వస్తాయి. ఇది చాలా అశుద్ధమైన, తమోప్రధానమైన ప్రపంచమని మీకు తెలుసు. ఇది మళ్ళీ సతోప్రధానముగా అవ్వనున్నది. ఇది జ్ఞాన యజ్ఞము కదా. మీరు బ్రాహ్మణులు. శాస్త్రాలలో అనేక విషయాలను వ్రాసారని కూడా మీకు తెలుసు. యజ్ఞములో దక్ష ప్రజాపిత పేరును చూపించారు. మరి రుద్ర జ్ఞాన యజ్ఞము ఏమయ్యింది. దీని గురించి కూడా ఏమేమో కథలను కూర్చుని వ్రాస్తూ వచ్చారు. యజ్ఞము యొక్క వర్ణన ఒక పద్ధతి ప్రకారముగా లేదు. తండ్రియే వచ్చి అన్నీ అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతమనుసారముగా జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఇది జ్ఞాన యజ్ఞము, అలాగే దీనిని విద్యాలయము అని కూడా అనవచ్చు. జ్ఞానము మరియు యజ్ఞము, ఈ రెండు పదాలు వేరు-వేరు. యజ్ఞములో ఆహుతి వేయవలసి ఉంటుంది. జ్ఞానసాగరుడైన తండ్రియే వచ్చి యజ్ఞాన్ని రచిస్తారు. ఇది చాలా పెద్ద యజ్ఞము, ఇందులో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది.

పిల్లలు సేవా ప్లాన్లు తయారుచేయాలి. పల్లెలు మొదలైన స్థానాలకు కూడా వెళ్ళి సేవ చేయండి. పేదవారికి ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి అని మీతో చాలామంది అంటూ ఉంటారు, ఇలా కేవలం సలహాలు ఇస్తూ ఉంటారు కానీ వారు స్వయం ఏ పని చేయరు. సేవ చేయరు కానీ ఇలా చేయండి అంటూ కేవలం సలహా ఇస్తూ ఉంటారు. చాలా బాగుంది, కానీ మాకు ఖాళీ లేదు అని అంటారు. జ్ఞానము చాలా బాగుంది, అందరికీ ఈ జ్ఞానము లభించాలి అని అంటారు. వారు తమను తాము పెద్దవారిగా, మిమ్మల్ని చిన్నవారిగా భావిస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ చదువుతోపాటు ఈ చదువు కూడా లభిస్తుంది. చదువు ద్వారా సభ్యతగా మాట్లాడే తెలివి వస్తుంది. మ్యానర్స్ బాగవుతాయి. చదువుకోనివారు అమాయకుల వలె ఉంటారు, వారికి ఎలా మాట్లాడాలి అనే తెలివి ఉండదు. పెద్ద వ్యక్తులను ఎప్పుడూ ‘‘మీరు’’ అని సంబోధిస్తూ మాట్లాడవలసి ఉంటుంది. ఇక్కడైతే కొందరు ఎలా ఉన్నారంటే, వారు పతిని కూడా ‘నువ్వు, నువ్వు’ అని సంబోధిస్తూ ఉంటారు. ‘మీరు’ అన్న పదము రాయల్ గా ఉంటుంది. పెద్ద వ్యక్తిని ‘మీరు’ అని సంబోధించడం జరుగుతుంది. బాబా మొట్టమొదట సలహా ఇస్తున్నారు, ఒకప్పుడు పరిస్తాన్ గా ఉన్న ఢిల్లీని మళ్ళీ పరిస్తాన్ గా తయారుచేయాలి. కావున ఢిల్లీలో అందరికీ సందేశము ఇవ్వాలి, చాలా బాగా ప్రచారము చేయాలి. టాపిక్ లు కూడా ఇస్తూ ఉంటారు, టాపిక్ ల లిస్టు తయారుచేయండి, ఇక వాటి గురించి వ్రాస్తూ వెళ్ళండి. విశ్వములో శాంతి ఏ విధంగా ఏర్పడగలదో వచ్చి అర్థం చేసుకోండి, 21 జన్మల కొరకు నిరోగులుగా ఎలా అవ్వవచ్చో వచ్చి అర్థం చేసుకోండి - ఇటువంటి సంతోషాన్ని కలిగించే విషయాలు వ్రాసి ఉండాలి. మీరు వచ్చి 21 జన్మల కొరకు నిరోగులుగా, సత్యయుగీ డబుల్ కిరీటధారులుగా అవ్వండి. ‘సత్యయుగీ’ అన్న పదమును అన్నిటిలోనూ వ్రాయండి. సుందరమైన పదాలు ఉన్నట్లయితే మనుష్యులు చూసి సంతోషిస్తారు. ఇంట్లో కూడా ఇలాంటి బోర్డులు, చిత్రాలు మొదలైనవి పెట్టి ఉండాలి. మీ వ్యాపార, వ్యవహారాలను కూడా చూసుకుంటూ ఉండండి, కానీ వాటితోపాటు సేవ కూడా చేస్తూ ఉండండి. వ్యాపారములో రోజంతా ఉండవలసిన అవసరం లేదు కదా. కేవలం పై నుండి వాటిని చూసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన పని అంతా అసిస్టెంట్ మేనేజర్ చేస్తారు. కొంతమంది వ్యాపారస్థులు విశాల హృదయము కలిగి ఉంటే వారు తమ అసిస్టెంట్లకు మంచి జీతాన్ని ఇచ్చి అయినా వారిని గద్దెపై కూర్చోబెడతారు. ఇది అనంతమైన సేవ, మిగిలినవన్నీ హద్దులోని సేవలు. ఈ అనంతమైన సేవలో ఎంత విశాలబుద్ధి కలిగి ఉండాలి. మనము విశ్వముపై విజయాన్ని పొందుతాము. మృత్యువుపై కూడా మనము విజయాన్ని పొంది అమరులుగా అవుతాము. ఇలా, ఇలా వ్రాసి ఉన్నట్లయితే వాటిని చదివి వస్తారు మరియు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. మీరు అమరలోకానికి యజమానులుగా ఎలా అవ్వవచ్చో వచ్చి అర్థం చేసుకోండి, ఇలా అనేక టాపిక్లను తయారుచేయవచ్చు. మీరు ఎవరినైనా విశ్వానికి యజమానులుగా తయారుచేయవచ్చు. అక్కడ దుఃఖపు నామ-రూపాలే ఉండవు. పిల్లలకు ఎంత సంతోషము ఉండాలి. బాబా మనల్ని మళ్ళీ ఎలా తయారుచేయడానికి వచ్చారు! ఈ పాత సృష్టి మళ్ళీ కొత్తగా మారనున్నదని, మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని పిల్లలకు తెలుసు. యుద్ధము జరుగుతూ ఉంటుంది అన్నది చూస్తారు. పెద్ద యుద్ధము ప్రారంభమైతే ఇక ఈ ఆటే సమాప్తమైపోతుంది. మీకైతే బాగా తెలుసు. తండ్రి చాలా ప్రేమతో చెప్తున్నారు - మధురమైన పిల్లలూ, విశ్వ రాజ్యాధికారము మీ కొరకే. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. భారత్ లో మీరు అపారమైన సుఖాన్ని చూసారు. అక్కడ రావణ రాజ్యమే లేదు. కావున అంతటి సంతోషము ఉండాలి. పిల్లలు పరస్పరం కలిసి చర్చించుకుని సలహాలు తీయాలి. వార్తాపత్రికల్లో వేయాలి. ఢిల్లీలో కూడా విమానాల నుండి కరపత్రాలను వెదజల్లండి. ఆహ్వానమును ఇస్తారు. దీనికి ఖర్చు కూడా అంత ఎక్కువేమీ అవ్వదు. ఎవరైనా పెద్ద ఆఫీసర్లు అర్థం చేసుకుంటే ఉచితముగా కూడా చేయవచ్చు. బాబా సలహా ఇస్తున్నారు, ఉదాహరణకు కలకత్తాలోని చౌరంగీ స్థానములో చాలా రాయల్ గా ఉండే ఒకే ఒక పెద్ద దుకాణము ఉండాలి, అప్పుడు అక్కడికి కస్టమర్లు ఎంతోమంది వస్తారు. మద్రాస్, బొంబాయి వంటి పెద్ద-పెద్ద పట్టణాలలో పెద్ద దుకాణాలు ఉండాలి. బాబా బిజినెస్ మ్యాన్ కూడా కదా. వారు మీ నుండి విలువలేని వ్యర్థమైనవాటిని తీసుకుని వాటిని రిటర్నులో ఏమి ఇస్తున్నారు! అందుకే వారిని దయార్ద్ర హృదయుడు అని అంటారు. వారు గవ్వ నుండి వజ్రముగా తయారుచేస్తారు, మనిషి నుండి దేవతగా తయారుచేస్తారు. గొప్పదనమంతా ఒక్క తండ్రిదే. తండ్రి లేకపోతే మీకు ఏం మహిమ ఉంటుంది.

భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు నషా ఉండాలి. నరుడి నుండి నారాయణుడిగా అవ్వాలి అనే లక్ష్యము, ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. మొట్టమొదట ఎవరైతే అవ్యభిచారీ భక్తిని ప్రారంభించారో, వారే వచ్చి ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థము చేస్తారు. బాబా ఎంత మంచి-మంచి పాయింట్లను అర్థం చేయిస్తారు, కానీ పిల్లలు మర్చిపోతూ ఉంటారు, అందుకే బాబా అంటున్నారు, పాయింట్లు వ్రాసుకోండి. టాపిక్స్ పై వ్రాస్తూ ఉండండి. డాక్టర్లు కూడా పుస్తకాలు చదువుతూ ఉంటారు. మీరేమో మాస్టర్ ఆత్మిక సర్జన్లు. ఆత్మకు ఇంజక్షన్ ఎలా ఇవ్వాలి అనేది మీకు నేర్పించడం జరుగుతుంది. ఇది జ్ఞాన ఇంజక్షన్. ఇందులో సూది మొదలైనవేవీ లేవు. బాబా అవినాశీ సర్జన్, వారు వచ్చి ఆత్మలను చదివిస్తారు. ఆత్మలే అపవిత్రముగా అయ్యాయి. ఇది చాలా సహజము. తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు, వారిని మనము స్మృతి చేయలేకపోతున్నామే! మాయ అపోజిషన్ చాలా ఎక్కువగా ఉంది, అందుకే బాబా అంటారు - చార్టు వ్రాయండి మరియు సేవ గురించి ఆలోచించండి, తద్వారా చాలా సంతోషము కలుగుతుంది. మురళిని ఎంత బాగా వినిపించినా కానీ యోగము లేదు. తండ్రితో సత్యముగా అవ్వడం కూడా చాలా కష్టము. ఒకవేళ మేము చాలా చురుకైనవారము అని భావిస్తున్నట్లయితే బాబాను స్మృతి చేసి చార్టు పంపండి, అప్పుడు బాబా - ఎంతవరకు సత్యము చెప్తున్నారు లేక అసత్యము చెప్తున్నారా అన్నది అర్థం చేసుకుంటారు. అచ్ఛా, మీరు అవినాశీ జ్ఞాన రత్నాల యొక్క సేల్స్ మ్యాన్ గా అవ్వాలి అని పిల్లలకు అర్థం చేయించారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. లక్ష్యాన్ని, ఉద్దేశ్యాన్ని ఎదురుగా ఉంచుకుని నషాలో ఉండాలి. మాస్టర్ ఆత్మిక సర్జన్లుగా అయి అందరికీ జ్ఞాన ఇంజక్షన్ ను ఇవ్వాలి. సేవతోపాటుగా స్మృతి చార్టును కూడా పెట్టాలి, అప్పుడు సంతోషము కలుగుతుంది.

2. మాటలు మాట్లాడే మ్యానర్స్ ను మంచిగా ఉంచుకోవాలి, ‘మీరు’ అని సంబోధిస్తూ మాట్లాడాలి. ప్రతి కార్యాన్ని విశాల హృదయులుగా అయి చేయాలి.

వరదానము:-
సర్వ కర్మేంద్రియాల ఆకర్షణకు అతీతముగా కమల సమానముగా ఉండే దివ్య బుద్ధి మరియు దివ్య నేత్రము యొక్క వరదానీ భవ

బాప్ దాదా ద్వారా ప్రతి బ్రాహ్మణ బిడ్డకు జన్మంచగానే దివ్య సమర్థ బుద్ధి మరియు దివ్య నేత్రము యొక్క వరదానము లభించింది. ఏ పిల్లలైతే తమ ఈ జన్మదిన కానుకను సదా యథార్థ రీతిలో ఉపయోగిస్తారో, వారు కమల పుష్ప సమానముగా శ్రేష్ఠ స్థితి అనే ఆసనముపై స్థితులై ఉంటారు. ఏ రకమైన ఆకర్షణ అయినా - దైహిక సంబంధాలైనా, దైహిక పదార్థాలైనా లేక ఏ కర్మేంద్రియమైనా వారిని ఆకర్షించలేదు. వారు సర్వ ఆకర్షణలకు అతీతముగా సదా హర్షితముగా ఉంటారు. వారు స్వయాన్ని కలియుగీ, పతిత, వికారీ ఆకర్షణల నుండి దూరముగా వచ్చేసినట్లుగా అనుభవం చేస్తారు.

స్లోగన్:-
ఎప్పుడైతే దేని పట్ల ఆసక్తి ఉండదో, అప్పుడు శక్తి స్వరూపము ప్రత్యక్షమవుతుంది.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి

మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా ఇతర ఆత్మల యొక్క వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాల యొక్క తీవ్ర ప్రవాహము నుండి, మీ శక్తితో తక్కువ సమయములో పక్కకు తప్పుకుని చూపించండి. వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాలలోకి పరివర్తన చేయండి. ఒకే స్థానములో ఉంటూ అనేక ఆత్మలపై మీ శ్రేష్ఠ సంకల్పాలు మరియు దివ్య దృష్టి యొక్క ప్రభావము పడాలి.