14-09-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి శ్రీమతముపై నడుస్తూ మీ అలంకరణను చేసుకోండి, పరచింతనతో మీ అలంకరణను పాడు చేసుకోకండి, సమయాన్ని వృధా చేసుకోకండి’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు తండ్రి కంటే కూడా చురుకైన ఇంద్రజాలికులు - ఎలా?

జవాబు:-
ఇక్కడ కూర్చుంటూ-కూర్చుంటూనే మీరు ఈ లక్ష్మీ-నారాయణుల వలె మీ అలంకరణను చేసుకుంటున్నారు. ఇక్కడ కూర్చునే మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకుంటున్నారు, ఇది కూడా ఇంద్రజాలమే. కేవలం అల్లాను స్మృతి చేయడంతో మీ అలంకరణ జరిగిపోతుంది. ఇక్కడ కాళ్ళు, చేతులు ఆడించవలసిన విషయము కూడా లేదు, ఇది కేవలం ఆలోచనకు సంబంధించిన విషయము. యోగముతో మీరు శుభ్రముగా, స్వచ్ఛముగా మరియు శోభాయమానముగా అవుతారు, మీ ఆత్మ మరియు శరీరము కాంచనముగా అవుతాయి, ఇది కూడా అద్భుతం కదా.

ఓంశాంతి
ఆత్మిక ఇంద్రజాలికుడు కూర్చొని ఆత్మిక పిల్లలకు, ఎవరైతే తండ్రి కంటే కూడా చురుకైన ఇంద్రజాలికులుగా ఉన్నారో వారికి అర్థం చేయిస్తున్నారు - మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? ఇక్కడ కూర్చొని ఉన్నా ఎటువంటి కదలికా లేదు. తండ్రి లేక ప్రియుడు ప్రేయసులకు యుక్తిని తెలియజేస్తున్నారు. ప్రియుడు అడుగుతున్నారు - ఇక్కడ కూర్చొని మీరు ఏమి చేస్తున్నారు? స్వయాన్ని మీరు ఈ విధంగా లక్ష్మీ-నారాయణుల వలె అలంకరించుకుంటున్నారు. ఇది ఎవరికైనా అర్థమవుతుందా? మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. అందులో నంబరువారు పురుషార్థానుసారముగానే ఉన్నారు కదా. తండ్రి అంటారు, ఈ విధంగా అలంకరింపబడి ఉన్నవారిగా అవ్వాలి. భవిష్య అమరపురి కొరకు మీ లక్ష్యము మరియు ఉద్దేశ్యమే ఇది. ఇక్కడ కూర్చుని మీరు ఏమి చేస్తున్నారు? ప్యారడైజ్ యొక్క అలంకరణ కొరకు పురుషార్థము చేస్తున్నారు. దీనిని ఏమంటారు? ఇక్కడ కూర్చొని స్వయాన్ని పరివర్తన చేసుకుంటున్నారు. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ తండ్రి ఒక్క మన్మనాభవ అనే తాళంచెవిని ఇచ్చారు. వారొక్కరు వినిపించిన విషయాలు తప్ప ఇంకే వ్యర్థమైన విషయాలను వింటూ, వినిపిస్తూ టైమ్ వేస్ట్ చేయకండి. మీరు స్వయాన్ని అలంకరించుకోవడంలోనే నిమగ్నమై ఉండండి. ఇతరులు చేస్తున్నారా, చేయడం లేదా - ఇందులో మీదేమి పోతుంది? మీరు మీ పురుషార్థములో ఉండండి. ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఎవరైనా కొత్తవారు వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మీలో కొందరు స్వయాన్ని అలంకరించుకుంటున్నారు, కొందరైతే ఇంకా పాడు చేసుకుంటున్నారు. పరచింతన మొదలైన విషయాలలో టైమ్ వేస్ట్ చేస్తూ ఉంటారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీరు కేవలం స్వయాన్ని చూసుకోండి, నేను ఏమి చేస్తున్నాను? చాలా చిన్న యుక్తిని తెలియజేశారు, కేవలం మన్మనాభవ అన్న ఒక్క పదమే ఉంది. మీరు ఇక్కడ కూర్చున్నారు కానీ మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్నది ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం విశ్వము యొక్క అలంకరణను చేస్తున్నాము. మీరు ఎంత పదమాపదమ భాగ్యశాలులు. ఇక్కడ కూర్చుంటూ-కూర్చుంటూనే మీరు ఎంతటి కార్యాన్ని చేస్తారు. ఇక్కడ కాళ్ళు, చేతులు ఆడించవలసిన విషయము కూడా లేదు. ఇది కేవలం ఆలోచనకు సంబంధించిన విషయము. మీరు అంటారు - మేము ఇక్కడ కూర్చుని ఉన్నతోన్నతమైన విశ్వము కొరకు అలంకరణను చేసుకుంటున్నాము. మన్మనాభవ మంత్రము ఎంత ఉన్నతమైనది. ఈ యోగము ద్వారానే మీ పాపాలు భస్మమవుతూ ఉంటాయి మరియు మీరు శుభ్రముగా అవుతూ, అవుతూ ఎంత శోభాయమానముగా అవుతారు. ఇప్పుడు ఆత్మ పతితముగా ఉంది కావున శరీరము యొక్క పరిస్థితి కూడా ఎలా అయిపోయిందో చూడండి. ఇప్పుడు మీ ఆత్మ మరియు శరీరము, రెండూ కాంచనముగా అవుతాయి. ఇది అద్భుతం కదా. కావున మీ అలంకరణను అలా చేసుకోవాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. తండ్రి అందరికీ అల్ఫ్ మరియు బే (అల్లా మరియు రాజ్యాధికారము) అన్న ఒకే దారిని తెలియజేస్తారు. ఇది కేవలం అల్లాకు సంబంధించిన విషయము. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ అలంకరణ అంతా మారిపోతుంది.

మీరు తండ్రి కంటే కూడా గొప్ప ఇంద్రజాలికులు. ఇలా, ఇలా చేయడం ద్వారా మీ అలంకరణ జరుగుతుంది అని తండ్రి మీకు యుక్తిని తెలియజేస్తున్నారు. స్వయాన్ని అలంకరించుకోకపోతే మీరు అనవసరంగా స్వయాన్ని నష్టపరచుకుంటారు. మనం భక్తి మార్గములో ఏమేమి చేసేవారము అన్నదైతే అర్థం చేసుకుంటారు. మొత్తం అలంకరణనంతా పాడు చేసుకొని ఎలా అయిపోయారు! ఇప్పుడు ఒకే పదముతో, తండ్రి స్మృతితో మీ అలంకరణ జరుగుతుంది. పిల్లలకు ఎంత బాగా అర్థం చేయించి ఫ్రెష్ చేస్తున్నారు. ఇక్కడ కూర్చొని మీరు ఏమి చేస్తున్నారు? స్మృతియాత్రలో కూర్చున్నారు. ఒకవేళ ఎవరి ఆలోచనలైనా అటూ, ఇటూ వేరే వైపు ఉంటే అలంకరణ జరగదు. మీరు అలంకరింపబడి ఉన్నారు కావున ఇతరులకు కూడా దారిని తెలియజేయాలి. తండ్రి ఈ విధంగా అలంకరించేందుకే వస్తారు. శివబాబా, అద్భుతమంతా మీదే, మీరు మమ్మల్ని ఎంతగా అలంకరిస్తారు! లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ మనము మన అలంకరణను చేసుకోవాలి. కొందరైతే తమ అలంకరణను చేసుకుని ఇతరులది కూడా చేస్తారు. కొందరైతే తమ అలంకరణను కూడా చేసుకోరు మరియు ఇతరుల అలంకరణను కూడా పాడు చేస్తూ ఉంటారు. వ్యర్థమైన విషయాలను వినిపిస్తూ ఇతరుల అవస్థను కూడా కిందకు దిగజార్చుతారు. స్వయమూ అలంకరణ చేసుకోరు, ఇతరులను కూడా అలంకరణ చేసుకోనివ్వరు. కావున బాగా ఆలోచించండి - తండ్రి ఎటువంటి యుక్తులను తెలియజేస్తున్నారు. భక్తి మార్గపు శాస్త్రాలను చదవడం ద్వారా ఈ యుక్తులు రావు. శాస్త్రాలు భక్తి మార్గానికి చెందినవి. మీరు శాస్త్రాలను ఎందుకు నమ్మరు అని మిమ్మల్ని అడుగుతారు. మీరు చెప్పండి - మేమైతే అన్నింటినీ నమ్ముతాము, మేము అర్ధకల్పం భక్తి చేసాము, శాస్త్రాలను చదివాము, మేమెందుకు నమ్మము, రాత్రి మరియు పగలు ఉన్నప్పుడు మరి తప్పకుండా రెండింటినీ నమ్ముతాము కదా, ఇది అనంతమైన పగలు మరియు రాత్రి.

తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, మీరు స్వయాన్ని అలంకరించుకోండి, టైమ్ వేస్ట్ చేయకండి. టైమ్ చాలా తక్కువ ఉంది. మీకు చాలా విశాలమైన బుద్ధి ఉండాలి. పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి. టైమ్ వేస్ట్ చేయకూడదు ఎందుకంటే మీ టైమ్ చాలా విలువైనది. గవ్వల నుండి వజ్ర సమానముగా మీరు అవుతారు. ఇన్ని విషయాలను ఊరికే వింటున్నారా, ఇదేమైనా కథా? తండ్రి ఒకే పదాన్ని వినిపిస్తారు. గొప్ప, గొప్ప వ్యక్తులు ఎక్కువగా మాట్లాడకూడదు. తండ్రి అయితే క్షణములో జీవన్ముక్తికి మార్గాన్ని తెలియజేస్తారు. వీరు చాలా ఉన్నతమైన అలంకరణ కలవారు, అందుకే వీరి చిత్రాలే ఉన్నాయి, వీరిని ఎంతగానో పూజిస్తూ ఉంటారు. వ్యక్తి ఎంత గొప్పగా ఉంటే అంత గొప్ప మందిరాన్ని నిర్మిస్తారు, గొప్ప అలంకరణను చేస్తారు. ఇంతకుముందైతే దేవతల చిత్రాలకు వజ్రాల హారాన్ని ధరింపజేసేవారు. బాబాకైతే అనుభవం ఉంది కదా. బాబా స్వయం లక్ష్మీ-నారాయణుల కోసం వజ్రాల హారాన్ని తయారుచేయించారు. వాస్తవానికి అక్కడ వారు ధరించే వస్త్రాలను ఇక్కడ ఎవరూ తయారుచేయలేరు. ఇప్పుడు మీరు నంబరువారు పురుషార్థానుసారముగా తయారుచేస్తున్నారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, సమయం స్వయానిదీ వృధా చేసుకోకండి, అలాగే ఇతరులది కూడా వృధా చేయకండి. తండ్రి ఎంతో సహజమైన యుక్తిని తెలియజేస్తారు - నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయి. స్మృతి లేకుండా అంతటి అలంకరణ జరగదు. మీరు ఈ విధంగా తయారవ్వనున్నారు కదా. దైవీ స్వభావాన్ని ధారణ చేయాలి. ఇందులో ఏమీ చెప్పవలసిన అవసరం కూడా లేదు, కానీ రాతిబుద్ధి కలవారిగా ఉన్న కారణముగా అంతా అర్థం చేయించవలసి వస్తుంది. ఇది ఒక్క క్షణము యొక్క విషయమే. తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, మీరు మీ తండ్రిని మర్చిపోవడం వల్ల మీ అలంకరణను ఎంతగా పాడు చేసుకున్నారు. తండ్రి అయితే అంటారు, నడుస్తూ, తిరుగుతూ అలంకరణను చేసుకుంటూ ఉండండి. కానీ మాయ కూడా తక్కువేమీ కాదు. కొందరు ఇలా వ్రాస్తుంటారు - బాబా, మీ మాయ ఎంతగానో విసిగిస్తుంది. అరే, అదేమైనా నా మాయా, ఇది ఒక ఆట కదా! నేనైతే మిమ్మల్ని మాయ నుండి విముక్తులుగా చేయడానికి వచ్చాను. మరి అది నా మాయ ఎలా అవుతుంది? ఈ సమయములో పూర్తిగా మాయా రాజ్యమే ఉంది. ఏ విధముగా ఈ రాత్రి మరియు పగలులో మార్పు రాదో, అలాగే ఇది అనంతమైన రాత్రి మరియు పగలు. ఇందులో ఒక్క క్షణము యొక్క మార్పు కూడా రాదు. ఇప్పుడు పిల్లలైన మీరు నంబరువారు పురుషార్థానుసారముగా ఇటువంటి అలంకరణను చేసుకుంటున్నారు. తండ్రి అంటారు - చక్రవర్తీ రాజులుగా అవ్వాలంటే చక్రాన్ని తిప్పుతూ ఉండండి. గృహస్థ వ్యవహారములో ఉండండి కానీ ఇక్కడ అంతా బుద్ధితో పనిచేయవలసి ఉంటుంది. ఆత్మలోనే మనస్సు, బుద్ధి ఉన్నాయి. ఇక్కడ మీకు బయటి వ్యాపార, వ్యవహారాలేవీ లేవు. ఇక్కడకు మీరు స్వయాన్ని అలంకరించుకునేందుకు, రిఫ్రెష్ చేసుకునేందుకే వస్తారు. తండ్రి అయితే అందరినీ ఒకేలా చదివిస్తారు. ఇక్కడకు బాబా వద్దకు కొత్త-కొత్త పాయింట్లను సమ్ముఖముగా వినేందుకు వస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి ఏదైతే విన్నారో అది బయటకు పోతుంది. ఇక్కడి నుండి బయటకు వెళ్ళడంతో జోలె కత్తిరించబడుతుంది. ఏదైతే విన్నారో దానిపై మనన-చింతన చేయరు. మీ కొరకైతే ఇక్కడ ఏకాంత స్థానాలు ఎన్నో ఉన్నాయి. బయటైతే నల్లులు తిరుగుతూ ఉంటాయి. ఒకరినొకరు హతమార్చుకుంటూ, రక్తం తాగుతూ ఉంటారు.

తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీ ఈ సమయం చాలా విలువైనది, దీనిని మీరు వేస్ట్ చేయకండి. స్వయాన్ని అలంకరించుకునేందుకు ఎన్నో యుక్తులు లభించాయి. నేను అందరినీ ఉద్ధరించేందుకు వస్తాను. నేను మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు వచ్చాను. కావున ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, టైమ్ వేస్ట్ చేయకండి. కార్య-వ్యవహారాలు చేసుకుంటూ కూడా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఒక్క ప్రియుడైన పరమపిత పరమాత్మకు ఇంతమంది ఆత్మలందరూ ప్రేయసులుగా ఉన్నారు. ఆ దైహికమైన కథలు మొదలైనవాటన్నింటినీ మీరు ఎంతో వింటారు. ఇప్పుడు తండ్రి అంటారు, వాటన్నింటినీ మర్చిపోండి. భక్తి మార్గములో మీరు నన్ను స్మృతి చేసారు మరియు మేము మీ వారిగానే అవుతాము అని ప్రతిజ్ఞ కూడా చేసారు. లెక్కలేనంతమంది ప్రేయసులకు ప్రియుడు ఒక్కరే. భక్తి మార్గములో - బ్రహ్మములో లీనమవుతాము అని అంటారు, ఇవన్నీ వ్యర్థమైన విషయాలు. మనుష్యులు ఒక్కరు కూడా మోక్షాన్ని పొందలేరు. ఇది అనాది డ్రామా, ఎంతోమంది పాత్రధారులు ఉన్నారు, ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. తండ్రి అంటారు, కేవలం ఒక్క అల్లాను స్మృతి చేసినట్లయితే మీ ఈ అలంకరణ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ విధంగా తయారవుతున్నారు. అనేక సార్లు మేము ఈ అలంకరణను చేసుకున్నాము అని స్మృతిలోకి వస్తుంది. బాబా, కల్ప-కల్పము మీరు వస్తారు, మేము మీ నుండే వింటాము. ఇవి ఎంత గుహ్యాతి గుహ్యమైన పాయింట్లు. బాబా ఎంతో మంచి యుక్తిని తెలియజేశారు. ఇటువంటి బాబాపై నేను బలిహారమవ్వాలి. ప్రేయసీ-ప్రియులు కూడా అందరూ ఒకేలా ఉండరు. వీరైతే ఆత్మలందరికీ ఏకైక ప్రియుడు. ఇక్కడ దైహికమైన విషయమేదీ లేదు. కానీ మీకు సంగమయుగములోనే తండ్రి నుండి ఈ యుక్తి లభిస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, తినండి, తాగండి, తిరగండి, విహరించండి, ఉద్యోగం చేయండి... కానీ మీ అలంకరణను చేసుకుంటూ ఉండండి. ఆత్మలందరూ ఒక్క ప్రియుడికి ప్రేయసులు. కేవలం వారినే స్మృతి చేస్తూ ఉండండి. కొందరు పిల్లలు - మేమైతే 24 గంటలూ స్మృతి చేస్తూ ఉంటాము అని అంటారు కానీ సదా అయితే ఎవ్వరూ స్మృతి చేయలేరు. ఎక్కువలో ఎక్కువ రెండు గంటలు, రెండున్నర గంటలు స్మృతి చేస్తారు. ఒకవేళ ఎక్కువ వ్రాసినా బాబా నమ్మరు. ఇతరులకు స్మృతిని కలిగించకపోతే మరి మీరు స్వయం స్మృతి చేస్తున్నారని ఎలా భావించాలి? ఇదేమైనా కష్టమైన విషయమా? ఇందులో ఏమైనా ఖర్చు ఉందా? ఏమీ లేదు. కేవలం బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. పతితులెవ్వరూ శాంతిధామములోకి, సుఖధామములోకి వెళ్ళలేరు. తండ్రి పిల్లలకు చెప్తారు - స్వయాన్ని ఆత్మగా, పరస్పరం సోదరులుగా భావించండి. 84 జన్మల పాత్ర ఇప్పుడు పూర్తవుతుంది. ఈ పాత వస్త్రాన్ని ఇక వదిలివేయాలి. డ్రామా ఎలా తయారుచేయబడి ఉందో చూడండి. మీకు నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. ప్రపంచములోనైతే ఎవరూ ఏమీ అర్థం చేసుకోరు. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి - మేము తండ్రి మతముపై నడుస్తున్నామా? అలా నడిచినట్లయితే అలంకరణ కూడా బాగా జరుగుతుంది. ఒకరికొకరు తప్పుడు మాటలను వినిపించుకుంటూ లేక వింటూ తమ అలంకరణను కూడా పాడు చేసుకుంటారు, అలాగే ఇతరులది కూడా పాడు చేస్తారు. పిల్లలైతే ఇదే ధునిలో (ధ్యాసలో) నిమగ్నమై ఉండాలి - మేము ఇలా అలంకారధారులుగా ఎలా అవ్వాలి? మిగిలినదేదైతే ఉందో అది బాగానే ఉంది. కేవలం కడుపుకు ప్రశాంతంగా రొట్టే లభిస్తే చాలు. వాస్తవానికి కడుపు ఎక్కువేమీ తినదు. మీరు సన్యాసులే, కానీ రాజయోగులు. చాలా ఉన్నతముగానూ కాదు, చాలా తక్కువగానూ కాదు. తినండి పర్వాలేదు, కానీ అది ఎక్కువగా అలవాటైపోకూడదు. పరస్పరం ఇదే గుర్తు చేయించుకుంటూ ఉండండి - శివబాబా గుర్తున్నారా? వారసత్వము గుర్తుందా? విశ్వరాజ్యాధికారము యొక్క అలంకరణ గుర్తుందా? ఇక్కడ కూర్చుంటూ, కూర్చుంటూ మీకు ఎటువంటి సంపాదన ఉందో ఆలోచించండి! ఈ సంపాదన ద్వారా అపారమైన సుఖము లభించనున్నది, కేవలం స్మృతియాత్ర ద్వారా లభిస్తుంది, ఇంకే కష్టమూ లేదు. భక్తి మార్గములో మనుష్యులు ఎన్ని ఎదురుదెబ్బలను తింటారు. ఇప్పుడు తండ్రి అలంకరించేందుకు వచ్చారు. కావున మీ గురించి మీరు బాగా చూసుకోండి. మర్చిపోకండి. మాయ మరపింపజేస్తుంది, దాని వలన టైమ్ ఎంతో వేస్ట్ చేస్తారు. మీ ఈ సమయము చాలా విలువైనది. చదువు యొక్క పురుషార్థముతో మనుష్యులు ఎలా ఉన్నవారు ఎలా అవుతారు. బాబా మీకు ఇంకే కష్టాన్ని ఇవ్వరు. కేవలం నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. పుస్తకాలు మొదలైనవేవీ తీయవలసిన అవసరం లేదు. బాబా ఏమైనా పుస్తకాలు తీస్తారా? తండ్రి అంటారు, నేను వచ్చి ఈ ప్రజాపిత బ్రహ్మా ద్వారా దత్తత తీసుకుంటాను. ఇతను ప్రజాపిత కదా. మరి ఇంతమంది కుఖవంశావళీ ప్రజ ఎలా ఉంటారు? పిల్లలు దత్తత తీసుకోబడతారు. వారసత్వము తండ్రి నుండి లభించనున్నది. తండ్రి బ్రహ్మా ద్వారా దత్తత తీసుకుంటారు, కావున వారిని మాత-పిత అని అంటారు. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి రావడమనేది చాలా ఏక్యురేట్ గా జరుగుతుంది. ఏక్యురేట్ సమయములో వస్తారు, ఏక్యురేట్ సమయములో వెళ్తారు. ప్రపంచ పరివర్తన అయితే జరిగేదే ఉంది. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు ఎంతటి తెలివితేటలను ఇస్తారు. తండ్రి మతముపై నడవాలి. విద్యార్థులు ఏదైతే చదువుకుంటారో అదే బుద్ధిలో నడవాలి. మీరు కూడా ఈ సంస్కారాలను తీసుకువెళ్తారు. ఏ విధంగా తండ్రిలో సంస్కారాలు ఉన్నాయో, అలాగే మీ ఆత్మలో కూడా ఈ సంస్కారాలను నింపుతారు. మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడకు వస్తారో అప్పుడు అదే పాత్ర రిపీట్ అవుతుంది. నంబరువారు పురుషార్థానుసారముగా వస్తారు. మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి - స్వయాన్ని అలంకరించుకునేందుకు ఎంతటి పురుషార్థము చేసాము? టైమ్ ఎక్కడా వేస్ట్ అయితే చేయలేదు కదా? తండ్రి సావధాన పరుస్తున్నారు - వ్యర్థమైన విషయాలలో ఎక్కడా సమయాన్ని వృధా చేయకండి. తండ్రి శ్రీమతాన్ని గుర్తుంచుకోండి. మనుష్య మతముపై నడవకండి. మనము పాత ప్రపంచములో ఉన్నాము అని ఇంతకుముందు మీకు తెలియదు. మీరు ఎలా ఉండేవారు అనేది తండ్రి తెలియజేశారు. ఈ పాత ప్రపంచములో ఎంతటి అపారమైన దుఃఖము ఉంది. ఈ పాత్ర కూడా డ్రామానుసారంగా లభించి ఉంది. డ్రామానుసారంగా అనేకానేక విఘ్నాలు కూడా వస్తాయి. తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, ఇది జ్ఞానము మరియు భక్తి యొక్క ఆట. ఇది అద్భుతమైన డ్రామా. ఇంతటి చిన్న ఆత్మలో మొత్తం పాత్ర అంతా అవినాశీగా నిండి ఉంది, దానిని అభినయిస్తూనే ఉంటుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇతర విషయాలన్నింటినీ వదిలి ఈ ధుని (ధ్యాస) లోనే ఉండాలి - మేము లక్ష్మీ-నారాయణుల వలె అలంకారధారులుగా ఎలా అవ్వాలి?

2. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి:-

1. మేము శ్రీమతముపై నడుస్తూ మన్మనాభవ యొక్క తాళంచెవితో మా అలంకరణను సరిగ్గా చేసుకుంటున్నామా?

2. తప్పుడు విషయాలను వింటూ లేక వినిపిస్తూ అలంకరణను పాడు చేసుకోవడం లేదు కదా?

3. పరస్పరం ప్రేమగా ఉంటున్నామా? తమ విలువైన సమయాన్ని ఎక్కడా వృధా చేసుకోవడం లేదు కదా?

4. దైవీ స్వభావాన్ని ధారణ చేసామా?

వరదానము:-

వ్యర్థ సంకల్పాల కారణాన్ని తెలుసుకుని వాటిని సమాప్తము చేసే సమాధాన స్వరూప భవ

వ్యర్థ సంకల్పాలు ఉత్పన్నమవ్వడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి - 1. అభిమానము మరియు 2. అవమానము. నన్నెందుకు తక్కువ చేస్తారు, నాకు కూడా ఈ పదవి ఉండాలి, నన్ను కూడా ముందు ఉంచాలి... కావున ఇందులో తమ అవమానముగా అన్నా భావిస్తారు లేదా అభిమానములోకి అన్నా వస్తారు, పేరులో, గౌరవములో, ప్రతిష్ఠలో, ముందుకు రావటంలో, సేవలో... అభిమానాన్ని లేక అవమానాన్ని అనుభవం చెయ్యటము, ఇదే వ్యర్థ సంకల్పాలకు కారణము, ఈ కారణాన్ని తెలుసుకుని నివారణను చెయ్యటమే సమాధాన స్వరూపులుగా అవ్వటము.

స్లోగన్:-

సైలెన్సు శక్తి ద్వారా స్వీట్ హోమ్ యాత్రను చెయ్యటము చాలా సహజము.