14-12-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ వద్ద మన్మనాభవ మరియు మధ్యాజీభవ అనే తీక్షణమైన బాణాలు ఉన్నాయి, ఈ బాణాలతోనే మీరు మాయపై విజయాన్ని పొందగలరు’’

ప్రశ్న:-
పిల్లలకు తండ్రి సహాయము ఏ ఆధారముపై లభిస్తుంది? పిల్లలు తండ్రికి ఏ విధముగా కృతజ్ఞతలు తెలుపుతారు?

జవాబు:-
పిల్లలు ఎంతగా తండ్రిని ప్రేమగా స్మృతి చేస్తారో, అంతగా తండ్రి సహాయము లభిస్తుంది. ప్రేమగా మాట్లాడండి. మీ కనెక్షన్ ను సరిగ్గా ఉంచుకోండి, శ్రీమతముపై నడుస్తూ ఉండండి, అప్పుడు తండ్రి సహాయం చేస్తూ ఉంటారు. పిల్లలు తండ్రికి ఈ విధముగా కృతజ్ఞతలు తెలుపుతారు - బాబా, మీరు పరంధామము నుండి వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారుచేస్తారు, మీ నుండి మాకు ఎంత సుఖము లభిస్తుంది. ఆ ప్రేమలో అశ్రువులు కూడా వస్తాయి.

ఓంశాంతి
పిల్లలకు అందరికన్నా ప్రియమైనవారు తల్లి మరియు తండ్రి. మరియు తల్లి-తండ్రులకు పిల్లలు చాలా ప్రియమైనవారు. ఈ తండ్రిని త్వమేవ మాతాశ్చ పితా అని అంటారు. లౌకిక తల్లి-తండ్రులను ఇలా ఎవరూ అనలేరు. ఈ మహిమ తప్పకుండా ఉంది, కానీ ఇది ఎవరిది అన్నది ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలిసినట్లయితే అక్కడకు వెళ్ళిపోతారు మరియు అనేకులను తీసుకువెళ్తారు. కానీ డ్రామా వ్రాతయే ఇలా ఉంది. ఎప్పుడైతే డ్రామా పూర్తి అవుతుందో అప్పుడే వస్తారు. ఇంతకుముందు మూవీ నాటకాలు జరిగేవి, నాటకం పూర్తి అయినప్పుడు నటులందరూ స్టేజ్ పై నిలబడేవారు. అలాగే ఇది కూడా అనంతమైన పెద్ద నాటకము. ఇదంతా కూడా పిల్లల బుద్ధిలోకి రావాలి - సత్యయుగము, త్రేతా, ద్వాపరయుగము, కలియుగము. ఇదంతా సృష్టి చక్రము. మూలవతనము, సూక్ష్మవతనములో చక్రము తిరుగుతుందని కాదు. సృష్టి చక్రము ఇక్కడే తిరుగుతుంది.

ఏక్ ఓంకార్ సత్ నామ్... అని గానం చేయబడుతుంది కూడా. ఈ మహిమ ఎవరిది? గ్రంథ్ లో కూడా సిక్కులు మహిమ చేస్తారు. గురునానక్ వాచ... వాస్తవానికి ఏక్ ఓంకార్ అన్నది ఆ ఒక్క నిరాకారుడైన పరమాత్ముని మహిమయే, కానీ వారు పరమాత్ముని మహిమను మరచి గురునానక్ ను మహిమ చేయడం మొదలుపెడతారు. సద్గురువు కూడా నానక్ యే అని భావిస్తారు. వాస్తవానికి సృష్టి అంతటిలో మహిమంటూ ఏదైతే ఉందో, అది ఆ ఒక్కరిదే, ఇంకెవ్వరికీ మహిమ లేదు. ఇప్పుడు చూడండి, బ్రహ్మాలో ఒకవేళ బాబా ప్రవేశము జరగకపోతే వారు గవ్వతుల్యమైనవారు. ఇప్పుడు మీరు గవ్వతుల్యమైనవారి నుండి వజ్రతుల్యమైనవారిగా అవుతారు, పరమపిత పరమాత్ముని ద్వారా. ఇప్పుడు ఇది పతిత ప్రపంచము, బ్రహ్మా యొక్క రాత్రి. పతిత ప్రపంచములోకి ఎప్పుడైతే తండ్రి వస్తారో, అప్పుడు ఎవరైతే వారిని గుర్తిస్తారో, వాళ్ళు వారిపై బలిహారమవుతారు. ఈ నాటి ప్రపంచములోనైతే పిల్లలు కూడా ఇబ్బంది పెట్టేవారిగా అయిపోతారు. దేవతలు ఎంత మంచిగా ఉండేవారు, ఇప్పుడు వారు పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ తమోప్రధానులుగా అయిపోయారు. సన్యాసులు కూడా మొదట చాలా మంచిగా ఉండేవారు, పవిత్రముగా ఉండేవారు. వారు భారత్ కు సహాయము అందించేవారు. భారత్ లో ఒకవేళ పవిత్రత లేకపోతే కామ చితిపై తగలబడిపోయేవారు. సత్యయుగములో కామ ఖడ్గము ఉండదు. ఈ కలియుగములో అందరూ కామ చితి యొక్క ముళ్ళపై కూర్చుని ఉన్నారు. సత్యయుగములోనైతే అలా అనరు. అక్కడ ఈ విషము ఉండదు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలి అని అంటారు కదా. వికారులనే పతితులు అని అంటారు. ఈ రోజుల్లో మనుష్యులు చూడండి, 10-12 మంది పిల్లలకు జన్మనిస్తూ ఉంటారు. అసలు ఎటువంటి నిబద్ధతా లేకుండా పోయింది. సత్యయుగములో కొడుకు పుట్టేటప్పుడు ముందు నుండే సాక్షాత్కారమవుతుంది. అలాగే శరీరము వదిలే ముందు కూడా సాక్షాత్కారమవుతుంది, నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి చిన్న పిల్లవాడిగా అవుతాను అని. అక్కడ ఒకే కొడుకు ఉంటారు, ఎక్కువ ఉండరు. అంతా నియమానుసారముగా నడుస్తుంది. వృద్ధి అయితే తప్పకుండా జరుగుతుంది కానీ అక్కడ వికారాలు ఉండవు. మరి అక్కడ జన్మ ఎలా జరుగుతుంది అని చాలామంది అడుగుతారు. అక్కడ యోగబలముతో అన్ని పనులూ జరుగుతాయి అని చెప్పాలి. యోగబలముతోనే మనం సృష్టి యొక్క రాజ్యాన్ని తీసుకుంటాము. బాహుబలముతో సృష్టి రాజ్యము లభించదు.

బాబా అర్థం చేయించారు, ఒకవేళ క్రిస్టియన్లు పరస్పరం కలుసుకుంటే వారు మొత్తం సృష్టి రాజ్యమంతటినీ తీసుకోగలరు కానీ వారు పరస్పరం కలుసుకోరు, నియమము అలా లేదు, అందుకే రెండు పిల్లులు పరస్పరం కొట్లాడుకుంటే వెన్న పిల్లలైన మీకు లభిస్తుంది. శ్రీకృష్ణుని నోటిలో వెన్నను చూపించారు. అది ఈ సృష్టి రూపీ వెన్న.

అనంతమైన తండ్రి అంటారు, ఈ యోగబలము యొక్క యుద్ధమే శాస్త్రాలలో గానం చేయబడింది, అంతేకానీ అది బాహుబలము యొక్క యుద్ధము కాదు. వారేమో శాస్త్రాలలో హింసాయుత యుద్ధాన్ని చూపించారు. వాటితో మనకు ఎటువంటి సంబంధమూ లేదు. పాండవులు మరియు కౌరవుల యుద్ధమేదీ లేదు. ఈ అనేక ధర్మాలు 5000 సంవత్సరాల క్రితం కూడా ఉండేవి, పరస్పరం కొట్లాడుకుని వినాశనమయ్యాయి. పాండవులు దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసారు, ఇది యోగబలము. దీని ద్వారా సృష్టి రాజ్యము లభిస్తుంది. మాయాజీతులుగా, జగత్ జీతులుగా అవుతారు. సత్యయుగములో మాయా రావణుడు ఉండడు. అక్కడ రావణుడి దిష్టిబొమ్మను తయారుచేసి కాల్చరు కదా. ఎటువంటి దిష్టిబొమ్మలను (చిత్రాలను) తయారుచేస్తారో చూడండి. వాస్తవానికి అటువంటి దైత్యులు లేక అసురులు ఎవరూ ఉండరు. పంచ వికారాలు స్త్రీవి, పంచ వికారాలు పురుషునివి, వాటిని కలిపి 10 తలల రావణుడిని తయారుచేస్తారు అన్నది కూడా అర్థం చేసుకోరు. విష్ణువుకు కూడా నాలుగు భుజాలను చూపిస్తారు. మనుష్యులైతే ఈ సామాన్యమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. పెద్ద రావణుడిని తయారుచేసి కాలుస్తారు. అతి ప్రియమైన పిల్లలకు ఇప్పుడు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రికి పిల్లలు ఎప్పుడూ నంబరువారుగానే ప్రియముగా ఉంటారు. కొందరు అతి ప్రియమైనవారూ ఉన్నారు, కొందరు తక్కువ ప్రియమైనవారూ ఉన్నారు. ఎంత ఎక్కువ కాలము దూరముగా ఉన్న పిల్లలో, అంత ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో, దయాహృదయులుగా ఉంటారో, వారు ప్రియమనిపిస్తారు. భక్తి మార్గములో దయ చూపించమని కోరుకుంటారు కదా! ఖుదా, దయ చూపించండి, మర్సీ ఆన్ మీ అని అంటారు. కానీ డ్రామా గురించి ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే చాలా తమోప్రధానముగా అయిపోతారో, అప్పుడే బాబా వచ్చే ప్రోగ్రామ్ ఉంటుంది. ఈశ్వరుడు ఏది కావాలనుకుంటే అది చేయగలరు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రాగలరు అని కాదు. ఒకవేళ అటువంటి శక్తి ఉన్నట్లయితే మరి ఇన్ని నిందలు ఎందుకు లభించాయి? వనవాసము ఎందుకు లభించింది? ఈ విషయాలు చాలా గుప్తమైనవి. శ్రీకృష్ణునికైతే నిందలు లభించవు. భగవంతుడు ఇది చేయలేరా అని అంటారు! కానీ వినాశనమైతే జరగవలసిందే, ఇక అందులో రక్షించే విషయమేదీ లేదు. అందరినీ తిరిగి తీసుకువెళ్ళాలి. స్థాపనను, వినాశనాన్ని చేయిస్తారు కావున తప్పకుండా వారు భగవంతుడే కదా. పరమపిత పరమాత్మ స్థాపన చేస్తారు, దేనిని? ముఖ్యమైన విషయముగా మీరు అడగండి - గీతా భగవంతుడు ఎవరు? మొత్తం ప్రపంచమంతా ఇందులో తికమకపడి ఉంది. వారైతే మనిషి పేరును వేసేశారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపననైతే భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. మరి శ్రీకృష్ణుడు గీతా భగవంతుడు అని మీరు ఎలా అనగలరు. వినాశనము మరియు స్థాపన చేయించడము ఎవరి పని? గీతా భగవానుడిని మరచి గీతనే ఖండితము చేసేశారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఇంకొకటి ఏమిటంటే, జగన్నాథపురిలో దేవతలవి చాలా అశుద్ధమైన చిత్రాలు తయారుచేసారు. ఇటువంటి అశుద్ధమైన చిత్రాలు ఉంచడాన్ని ప్రభుత్వము అనుమతించదు. కావున ఈ విషయాలపై అర్థం చేయించాలి. ఈ మందిరాల విషయములో ఎవరి బుద్ధిలోకి ఈ విషయాలు రావు. ఈ విషయాలను తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు.

పిల్లలు ఎన్ని ప్రతిజ్ఞా పత్రాలను వ్రాస్తారో చూడండి. రక్తముతో కూడా వ్రాస్తారు. శ్రీకృష్ణునికి రక్తము వస్తే ద్రౌపది ఆమె చీరను చింపి కట్టు కట్టినట్టుగా ఒక కథ కూడా ఉంది కదా. ఇది ప్రేమ కదా. మీకు శివబాబాపై ప్రేమ ఉంది. వీరికి (బ్రహ్మాకు) రక్తము రావచ్చు, వీరికి దుఃఖము కలగవచ్చు, కానీ శివబాబాకు ఎప్పుడూ దుఃఖము కలగదు ఎందుకంటే వారికి తమ శరీరమే లేదు. శ్రీకృష్ణునికి ఒకవేళ ఏదైనా దెబ్బ తగిలితే దుఃఖము కలుగుతుంది కదా. మరి వారిని పరమాత్మ అని ఎలా అనగలరు. బాబా అంటారు, నేనైతే సుఖ-దుఃఖాలకు అతీతుడను. కానీ నేను వచ్చి పిల్లలను సదా సుఖవంతులుగా తయారుచేస్తాను. సదా శివ అన్న గాయనము ఉంది. సుఖాన్ని ఇచ్చే ఆ సదాశివుడు అంటున్నారు - నా మధురాతి మధురమైన చాలాకాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలెవరైతే సుపుత్రులుగా ఉన్నారో, జ్ఞానాన్ని ధారణ చేసి పవిత్రముగా ఉంటారో, సత్యమైన యోగులుగా మరియు జ్ఞానులుగా ఉంటారో, వారు నాకు ప్రియముగా అనిపిస్తారు. లౌకిక తండ్రి వద్ద కూడా కొందరు మంచి పిల్లలు, కొందరు చెడ్డ పిల్లలు ఉంటారు. కొందరు కులాన్ని కళంకితం చేసేవారు కూడా వెలువడుతారు. చాలా అశుద్ధముగా అయిపోతారు. ఇక్కడ కూడా అటువంటివారు ఉన్నారు. ఆశ్చర్యము కలిగించేలా పిల్లలుగా అవుతారు, వింటారు, వినిపిస్తారు, మళ్ళీ వదిలి వెళ్ళిపోతారు... అందుకే నిశ్చయ పత్రము వ్రాయించబడుతుంది. అప్పుడు వారు వ్రాసినదానిని వారి ముందు ఉంచడం జరుగుతుంది. రక్తముతో కూడా వ్రాసి ఇస్తారు. రక్తముతో వ్రాసి ప్రతిజ్ఞ చేస్తారు. ఈ రోజుల్లో ప్రమాణము కూడా చేయిస్తారు, కానీ అది అసత్యమైన ప్రమాణము. ఈశ్వరుని సాక్షిగా ప్రమాణము చేయడము అనగా అతడూ ఈశ్వరుడే, నేనూ ఈశ్వరుడినే అని భావిస్తూ ప్రమాణము చేయడము. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా బాబా హాజరై అన్నీ చూస్తున్నట్లు భావిస్తారు. బాబా ఈ కనుల రూపీ కిటికీల ద్వారా చూస్తారు. ఇది పరాయి శరీరము. దీనిని అప్పుగా తీసుకున్నారు. బాబా కిరాయిదారుడు. ఇంటిని ఉపయోగించడం జరుగుతుంది కదా, అలా బాబా అంటారు, నేను ఈ తనువును ఉపయోగించుకుంటాను. బాబా ఈ కిటికీల ద్వారా చూస్తారు. వారు ఇప్పుడు హాజరై అన్నీ చూస్తున్నారు. ఆత్మ తప్పకుండా ఇంద్రియాల ద్వారా పనులు చేస్తుంది కదా. నేను వచ్చాను కావున తప్పకుండా వినిపిస్తాను కదా. ఈ ఇంద్రియాలను ఉపయోగిస్తున్నాను కావున తప్పకుండా అద్దె కూడా ఇవ్వవలసి ఉంటుంది.

పిల్లలైన మీరు ఈ సమయములో నరకాన్ని స్వర్గముగా తయారుచేస్తారు. మీరు ప్రకాశాన్ని ఇస్తారు, జాగృతము చేస్తారు. మిగిలినవారంతా కుంభకర్ణుని నిద్రలో నిదురిస్తున్నారు. మాతలైన మీరు మేల్కొలుపుతారు, స్వర్గాధిపతులుగా తయారుచేస్తారు. ఇందులో మెజారిటీ మాతలది ఉంది, అందుకే వందేమాతరం అని అనడం జరుగుతుంది. భీష్మ పితామహులు మొదలైనవారికి కూడా మీరే బాణాలు వేశారు. మన్మనాభవ-మధ్యాజీభవ బాణాలు ఎంత సహజమైనవి. ఇవే బాణాల ద్వారా మీరు మాయపై కూడా విజయాన్ని పొందుతారు. మీరు ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి, ఒక్కరి శ్రీమతముపైనే నడవాలి. తండ్రి మీకు ఎటువంటి శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తారంటే, ఇక 21 జన్మలు ఎప్పుడూ కర్మలకు పశ్చాత్తాపపడవలసిన అవసరమే ఉండదు. మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు. అనేక సార్లు మీరు స్వర్గాధిపతులుగా అయ్యారు. రాజ్యము తీసుకున్నారు మరియు మళ్ళీ పోగొట్టుకున్నారు. బ్రాహ్మణ కులభూషణులైన మీరే హీరో, హీరోయిన్ పాత్రను అభినయిస్తారు. డ్రామాలో అందరికన్నా ఉన్నతమైన పాత్ర పిల్లలైన మీదే. కావున ఇలా ఉన్నతముగా తయారుచేసే తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి. బాబా, మీరు అద్భుతము చేస్తారు. మేమే నారాయణునిగా ఉండేవారము అని మాకు తెలియనే తెలియదు, అది మా మనసులోనూ లేదు, మా చిత్తములోనూ లేదు అని అంటారు. బాబా అంటారు, మీరే నారాయణునిగా లేక లక్ష్మిగా, దేవీ-దేవతలుగా ఉండేవారు, మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ అసురులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థము చేసి వారసత్వాన్ని పొందండి. ఎవరు ఎంత పురుషార్థము చేస్తే అంతగా సాక్షాత్కారమవుతూ ఉంటుంది.

రాజయోగాన్ని ఒక్క తండ్రే నేర్పించారు. సత్యాతి-సత్యమైన సహజ రాజయోగాన్ని అయితే మీరు ఇప్పుడు నేర్పించగలరు. మీ కర్తవ్యము తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వడము. అందరూ అనాథలుగా అయిపోయారు. ఈ విషయాలను కూడా కల్పక్రితము వారు, కోట్లాదిమందిలో ఏ ఒక్కరో మాత్రమే అర్థం చేసుకోగలరు. బాబా అర్థం చేయించారు, మొత్తము ప్రపంచమంతటిలో మహా మూర్ఖులను చూడాలనుకుంటే ఇక్కడే చూడండి. ఏ తండ్రి నుండైతే 21 జన్మల వారసత్వము లభిస్తుందో, వారిని కూడా వదిలి వెళ్ళిపోతారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇప్పుడు మీరు స్వయం ఈశ్వరుని పిల్లలు. తర్వాత దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు పిల్లలుగా అవుతారు. ఇప్పుడు ఆసురీ సంతానము నుండి ఈశ్వరీయ సంతానముగా అయ్యారు. తండ్రి పరంధామము నుండి వచ్చి పతితుల నుండి పావనులుగా తయారుచేస్తారు కావున వారికి ఎంతగా కృతజ్ఞతలు తెలపాలి. భక్తి మార్గములో కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు. దుఃఖములో అలా కృతజ్ఞతలు చెప్పరు. ఇప్పుడు మీకు ఎంత సుఖము లభిస్తుంది. కావున చాలా ప్రేమ ఉండాలి. మనము తండ్రితో ప్రేమగా మాట్లాడితే వారెందుకు వినరు. కనెక్షన్ ఉంది కదా. రాత్రివేళ లేచి బాబాతో మాట్లాడాలి. బాబా తమ అనుభవాన్ని చెప్తూ ఉంటారు. నేను ఎంతో స్మృతి చేస్తాను, బాబా స్మృతిలో అశ్రువులు కూడా వచ్చేస్తాయి. నేను ఎలా ఉండేవాడిని, బాబా ఎలా తయారుచేసారు - తతత్వమ్, మీరు కూడా అలా అవుతారు. యోగములో ఉండేవారికి బాబా సహాయము కూడా చేస్తారు. కళ్ళు వాటంతటవే తెరుచుకుంటాయి, మంచము కదులుతుంది, బాబా ఎంతోమందిని లేపుతారు. అనంతమైన తండ్రి ఎంతటి దయను చూపుతారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? బాబా, భవిష్యత్తులో శ్రీనారాయణుడిని వరించేందుకు శిక్షణ తీసుకోవడానికి వచ్చాము లేక లక్ష్మిని వరించేందుకు ఈ పరీక్షను పాస్ అవుతున్నాము అని అంటారు. ఇది ఎంత అద్భుతమైన స్కూల్. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. ఇది అతి పెద్ద యూనివర్శిటీ. కానీ గాడ్లీ యూనివర్శిటీ అన్న పేరును పెట్టనివ్వరు. ఏదో ఒక రోజు తప్పకుండా అంగీకరిస్తారు, వస్తూ ఉంటారు. నిజంగా ఇది ఎంత పెద్ద యూనివర్శిటీ అని అంటారు. బాబా అయితే తమ నయనాలపై కూర్చోబెట్టుకుని మిమ్మల్ని చదివిస్తారు. మిమ్మల్ని స్వర్గములోకి చేరుస్తాను అని అంటారు. కావున ఇటువంటి తండ్రితో ఎంతగా మాట్లాడాలి. అప్పుడు బాబా ఎంతో సహాయము చేస్తారు. ఎవరి గొంతులైతే మూసుకుపోయాయో వారి తాళాన్ని తెరుస్తారు. రాత్రివేళ స్మృతి చేయడము ద్వారా ఎంతో ఆనందము కలుగుతుంది. బాబా తమ అనుభవాన్ని తెలియజేస్తారు, వారు అమృతవేళ ఎటువంటి మాటలు మాట్లాడుతారు అనేది తెలియజేస్తారు.

తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, జాగ్రత్తగా ఉండండి. కులాన్ని కళంకితం చేయకండి. పంచ వికారాలను దానము ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోకూడదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రికి ప్రియమైనవారిగా అయ్యేందుకు దయార్ద్ర హృదయులుగా అయ్యి సేవలో తత్పరులై ఉండాలి. సుపుత్రులుగా, ఆజ్ఞాకారులుగా అయ్యి సత్యమైన యోగులుగా మరియు జ్ఞానులుగా అవ్వాలి.

2. అమృతవేళ లేచి తండ్రితో చాలా మధురాతి-మధురమైన మాటలు మాట్లాడాలి, తండ్రికి కృతజ్ఞతలు తెలపాలి. తండ్రి సహాయాన్ని అనుభవం చేసుకునేందుకు అత్యంత ప్రియమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి.

వరదానము:-

సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఉంటూ మనసు ద్వారా సంతోషపు పాటలను పాడే అవినాశీ భాగ్యశాలీ భవ

భాగ్యశాలీ పిల్లలైన మీరు అవినాశీ విధి ద్వారా అవినాశీ సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు. మీ మనసు నుండి సదా వాహ్-వాహ్ అన్న సంతోషపు పాటలు మ్రోగుతూ ఉంటాయి. వాహ్ బాబా! వాహ్ భాగ్యము! వాహ్ మధురమైన పరివారము! వాహ్ శ్రేష్ఠ సంగమయుగపు మనోహరమైన సమయము! ప్రతి కర్మ వాహ్-వాహ్ అయినది, అందుకే మీరు అవినాశీ భాగ్యశాలురు. మీ మనసులో ఎప్పుడూ వై, ఐ (ఎందుకు, నేను) అన్నవి రాలేవు. ‘ఎందుకు’ అన్నదానికి బదులుగా వాహ్-వాహ్ మరియు ‘నేను’ అన్నదానికి బదులుగా బాబా-బాబా అన్న పదాలే వస్తాయి.

స్లోగన్:-

ఏ సంకల్పాన్ని అయితే చేస్తారో, దానికి అవినాశీ గవర్నమెంటు యొక్క స్టాంపు వేసినట్లయితే మీరు దృఢముగా ఉంటారు.